బ్రతకనేర్వనివాడు - దాసరి అమరేంద్ర

    
మా మాధవుడికి వేపకాయంత వెర్రుంది. అది నిమ్మకాయంతేమోనని కొన్నిమార్లూ, 'అబ్బే! అదేం కాదు... ఆవగింజంతే' అని మరిన్నిసార్లు అనిపించినా - సగటున దాని పరిమాణం వేపకాయ.

    ఇద్దరం ఒకే ఊరివాళ్లం. ఒకే సంవత్సరంలో పుట్టాం. దూరపు చుట్టాలం. దగ్గరి స్నేహితులం. కలసి తిరిగాం. కలసి పెరిగాం. కలసి బళ్లోకెళ్లాం. ఒకే పంట కాలువలో ఈతలు నేర్చుకున్నాం. చేపలు పట్టాం. ఒకే పాకబడిలో అయిద్దాకా చదివాం. అప్పుడే పక్క ఊళ్లో వెలసిన హైస్కూల్లో కలిసి చేరాం. ఎస్సెల్సీ దాకా కలిసి గడిపాం. ఏదో అంటారే 'ఒకే కంచం, ఒకే మంచం' అని - ఆ బాపతు స్నేహం మాది. 

    చిన్నప్పటి నుంచి వాడి అలవాట్లూ, అభిరుచులూ, అమాయకత్వం, బ్రతకలేనితనం చూసి నేనెంతో ఇదవుతూ ఉండేవాడిని, భయపడుతూ ఉండేవాడిని. బెంగపడుతూ ఉండేవాడిని. ఈ దరిద్రప్ప్రపంచంలో వీడు ఎలా నెగ్గుకు వస్తాడా అని మథన పడుతూ ఉండేవాడిని.

    మావి మధ్యతరగతి పల్లెకుటుంబాలు. వ్యవసాయం మా ముఖ్యవృత్తి. కానీ సాగుకు సరిపడా భూములు లేని సగటు బ్రతుకులు మావి. ధనానికి కాకపోయినా కులాని గొప్పవాళ్లమవడంవల్లా, మా తాతలు తాగిన నేతుల మూతుల వాసనల వల్లా - బీదవాళ్ల కోవకు చెందవలసి వచ్చినా - పళ్లబిగువున మధ్యతరగతిగా నెట్టుకొచ్చే సంప్రదాయం మాది. ముత్తాతలనాటి పుష్కల భూసంపద మా తండ్రుల తరానికొచ్చేసరికి చిన్నచిన్న ముక్కలై - కాళ్లకు కప్పుకుంటే తలకూ, తలకు కప్పుకుంటే కాళ్లకూ సరిపడని గొంగళిలా మారగా - అనుదినపు ఆర్థికపు ఇబ్బందులలో తలమునకలయ్యే తండ్రుల కొడుకులం మేవుఁ! 

    చిన్నప్పటి నుండి మా మాధవుడొక కొరకరాని కొయ్య. 'మన కులమేమిటీ, వాళ్ల కులమేమిటీ' అనే పెద్దల మాటలను పెడచెవినబెట్టి మాలపల్లి పిల్లలతో బహిరంగంగా సావాసం చేసేవాడు. పదేళ్ల వయసులో పొలంపని రోజుల్లో నేను బుద్ధిగా స్కూలుకెగనామం పెట్టి మా నాన్నకు సాయపడుతుంటే - వాడు సమేమిరా స్కూలు మానననేవాడు. పోనీ మట్టి పిసకడమంటే చిరాకా అంటే అదేంగాదు. స్కూలుకెళ్లే ముందూ, వచ్చిన తర్వాతా పేడకళ్లెత్తడం దగ్గర్నించీ పిడకలు చేయడం దాకా - అన్ని పనులూ ఎంతో చక్కగా చేసేవాడు. అయినా వాడిదదో ధోరణి. ఎవరిమాటా వినేరకంగాదు. ఎవరిమాటో అయితే పర్లేదుగానీ అమ్మానాన్నల మాట వినకపోతే ఎలా? అక్కడికీ వాళ్ల నాన్న అడపాదడపా గొడ్డును బాదినట్లు బాదేవాడు. అయినా అంకెకు రాకపోవడంతో విసుగొచ్చి వాడిని అచ్చుబోసి బడిమీదకు వదిలేసి చేతులు దులుపుకొన్నాడు. ఎవరిమాటా వినని పిల్లాడు బాగుపడేదెలా? ఆఁ చెప్పడం మర్చిపోయాను. మా వాడికి మా  వీధిడి శంకరం మాష్టారంటే మాత్రం ఎంతో గురి!

    నా జీవితగమ్యం హైస్కూలు రోజుల్లోనే ఎంతో స్పష్టంగా నిర్ణయించుకున్నా. మాకున్న భూమి మాకెలానూ చాలదు. వ్యవసాయం మీద ఆధారపడటమంటే కుక్కతోక పట్టుకుని గోదారీదడమే. అంచేత బుద్ధిగా ఎస్సెల్సీ, ముగించి ఎలాగోలా కష్టపడి డిగ్రీ అయిందనిపించి, పట్నం చెక్కేసి ఏ తాలూకాఫీసులోనో సర్కారుగుమాస్తాగా నాలుగు రాళ్లు గడించి, ముందు తరాలకు అందించి వాళ్లు నాలాగా ఇబ్బందులు పడకుండా బతికేలా చేయడం నా జీవితలక్ష్యం.

    మా మాధవుడి లక్ష్యం నా కర్థమయ్యేది కాదు. పసితనంలోనే పండుగడ్డపు మాటలు మాట్లాడేవాడు! చదువుకుంటాడట. శంకరం మాష్టారంతటి వాడవుతాడట. పదిమందికీ పనికొచ్చేలా బతుకుతాడట. భూమాతను వదులుకోడట. ఉన్న ఊరితో తన మమతాబంధాలు తెంచుకోడట. డబ్బు సంపాదన తన ధ్యేయంగాదట. పేరూ, కీర్తీ అన్నా తనకు మోజు లేదట - వాడి ధోరణిలో ఎన్ని వైరుధ్యాలో! వాడి ధ్యేయాలు ఎంత లోపభూయిస్టమో! పొలాల గట్ల మీదా, పంటకాలువల ఒడ్డునా రోజూ స్కూలుకు నడిచి వెళ్తూ గంటల తరబడి ఇవే మాట్లాడుకునేవాళ్లం. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజులవి. పేపర్నిండా ఇలాంటి ఆదర్శాలే కనిపించేవి. అవి చదివే కాబోలు మావాడికా ధోరణి. ఆ పనికిరాని ఆదర్శవాదంలోంచి బతుకులోతులను తరచే భూమార్గం వైపు వాడి ఆలోచనలను మళ్లించాలని వాడి శ్రేయోభిలాషిగా అనునిత్యం ప్రయత్నించేవాడిని. ఈ నలభైఅయిదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరయింది!

    హైస్కూలు ముగించాం. నే బొటాబొటీగా గట్టెక్కాను. వాడు స్కూలు ఫస్టొచ్చాడు - జిల్లాకేననుకుంటాను. కలెక్టరు గారు బహుమతి పంపినట్టు గుర్తు. ఇద్దరం ఇంట్లో అందరినీ కష్టపెట్టి ఎలాగోలా డబ్బులు కూడగట్టి వెళ్లి బెజవాడ ఎస్సారార్‌లో చేరాం. నాది ఆర్ట్స్ గ్రూపు. వాడిది సైన్సు. నలభై ఏళ్లనాడు కాలేజీల్లో ఇప్పుడున్నంత పోటీలేదు కాబట్టి నా అత్తెసరుమార్కులు నాకు అడ్డం కాలేదు!

    ఏదో పల్లెటూరి వాళ్లం - అణిగిమణిగి ఉండొద్దూ! మా వాడికా స్పృహే లేదు! క్లాసులీడరుగా ఉండమన్నారు. ఉండేశాడు. సెకండియర్లో యూనియన్ సెక్రటరీ అన్నారు. అయ్యాడు. రాజకీయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎలక్షన్లు, నాటకాలు, డిబేట్లు, రాత్రిపూట వయోజనవిద్య - మావాడు దున్నేశాడు. వాడు కాలు మోపని రంగమే లేదు. ఉండమన్నారు కదాని ఉట్టెక్కేయడమే? ఇంకా నయం - నాలుగేళ్లు ముందు పుడితే 'తెలంగాణా'లోనూ, పాతికేళ్ల ముందు పుడితే 'వందేమాతరం'లోనూ తప్పక చేరేవాడే! 

* * *

    మా పల్లెటూరి ఆనవాయితీ ప్రకారం మా ఇద్దరికి సెకండియర్లో పెళ్లయింది. డిగ్రీ అందేలోగానే నాకో కొడుకూ వాడికో కూతురూ పుట్టేశారు. ఎవరదృష్టం వారిది మరి. అసలు వాడు పెళ్లొద్దో అని ఎంత గోల పెట్టేశాడో! అన్నీ విపరీతమే కదా! ఏదో సామెజ్జెప్పినట్టు పిలిచి పిల్ల నిస్తామంటే ఇలాంటి వెధవాయే వద్దు పొమ్మన్నాడట. దాదాపు మెడలు వంచి చేశారు వాడికి. ఇంకా చదువుతాడట. మరో పదేళ్లదాకా పెళ్లి చేసుకోడట. మతిలేని మాటలు! డిగ్రీని మించిన చదువేముందీ? అసలు మా ఊళ్లో డిగ్రీ మాత్రం చదివిన వాళ్లెంతమందీ? ఇదేగదూ ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెళతానంటమంటే? అయినా కోడెవయసు ముచ్చటను నడివయస్సుకు నెడతాననడం వెర్రి గాదూ?

    అంతకన్నా అందరి మతిపోగొట్టే మరో ఘనకార్యం చేశాడు మావాడు. డిగ్రీలో ఫస్టు క్లాసు తెచ్చుకున్న తర్వాత బుద్ధిగా ఏ పోస్టల్ శాఖలోనో, బాంకులోనో రాజాలాంటి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడి, పెళ్లాం పిల్లలను సుఖపెట్టవచ్చు కదా - ఊహూఁ అలా చేస్తే మావాడి గొప్పదనమేముంది? ఇంజనీరింగు చేస్తానని ఊరేగాడు! 'అది మనలాంటి సన్నకారు మనుషులకు కాదు - ఏ జమిందార్లో చదవాల్సిన చదువు' అని చెవిలో ఇల్లుగట్టుకుని పోరాను. ఆఖరికి మా శంకరం మాష్టారు కూడా ఉద్యోగంలో చేరి పెళ్లాం పిల్లల బాగోగులు చూసుకోమనే సలహా ఇచ్చారు. అయినా అందరి మాటలను పెడచెవిన పెట్టాడు. ఊరికే అన్నారా - 'పోగాలము దాపురించిన వారు కనరు వినరు మూర్కొనరు' అని!

* * *

    ఈ చపలచిత్తానికి నిదర్శనంగా మేమంతా అనుకున్నట్టే అనుకోకుండా ఓ శుభోదయాన మావాడు అదృశ్యమయ్యాడు. బెజవాడలో జీటి ఎక్కుతుంటే చూశామన్నారు కొంతమంది. హరిద్వార్ దగ్గర సన్యాసుల గుంపులో కనిపించాడన్నారు ఉత్తర భారత యాత్రలు చేసి తిరిగొచ్చిన మా ఊరి శ్రేష్టిగారు. నైజాం దేశపు హైదరాబాదులో రిక్షా లాగుతున్నాడన్నారు కొందరు. మైసూరు రాజా వారి దివాణంలో ఏదో ఉన్నత పదవి వెలగబెడుతున్నాడన్నారు మరికొందరు. మొత్తానికి మావాడి గురించి కథలూ, గాథలూ చిలువలు పలవలై వ్యాపించాయి. మూడు నాలుగు నెలలు పత్తాలేడు. ఉన్నాడో ఊడాడో తెలియలేదు. మా జానకమ్మ కడుపు చెరువు చేసుకుని గుండెలవిసేలా ఏడుపు! చంటి పిల్ల ఆలనా పాలనా చూసే దిక్కులేదు! అసలు వాడు మనిషేనా? ఏదో స్కూలు పిల్లలు ఇంటి మీద అలిగి దేశం పట్టుకుపోయారంటే అర్థముంది - పెళ్లాం పిల్లలున్న వీడికిదేం వెధవబుద్ధీ? అసలా మనిషికి జాలీ, దయా, కరుణా, ధర్మం - ఉన్నాయా అని?

    ఎంత అర్థంతరంగా అదృశ్యమయ్యాడో అంతే హఠాత్తుగా ఓ దసరానాడు ఊడిపడ్డాడు. 'ఏవిట్రా సంగతి?' అంటే చిద్విలాసంగా చిరునవ్వు - కాదు - వెర్రినవ్వు! చెబితే ఇంట్లోనూ, ఊళ్లోనూ ఎలానూ ఒప్పుకోవడం లేదు గాబట్టి చెప్పకుండానే ఉడాయించాడట. రాజస్థాన్‌లో - ఏదో పళానీనో పిళానీనో - బిర్లాగారి ఇంజనీరింగ్ కాలేజీ ఉందట. అక్కడ మూడేళ్ల డిగ్రీ కోర్సులో చేరాడట. స్కాలర్షిప్పు కూడా వచ్చిందట. కానీ ఖర్చుండదట. కానీ పెళ్లాం పిల్లల మాటేవిటీ? వాళ్ల పోషణా బాగోగులెవరు చూస్తారు? అడిగితే మాట్లాడడు. రెట్టిస్తే 'నువ్వున్నావు గదరా సుబ్బులూ' అనేశాడు! అది అతి అమాయకత్వమా - గడుసుదనమా? నవ్వాలో, ఏడవాలో తెలియలేదు. దసరా శెలవలయిపోగానే ఒక్కడే టింగురంగామంటూ పిళానీ చెక్కేశాడు. 

    నావరకూ నేను అదృష్టవంతుడ్ననే చెప్పుకోవాలి. అత్తెసరు మార్కుల బియ్యేనే అయినా ఉత్తరదక్షిణాల పత్రితో రాజధాని ప్రభువుల పూజచేయగా, ఆ పుణ్యఫలాన సివిల్ సప్లయిస్‌లో ఉద్యోగం దొరికేసింది. 'తంతే బూరల గంపలో' అంటారే - అలా అన్నమాట. బూరెల గంప బదులు బియ్యం పంచదార బస్తాలు! చేపకు ఈతలాగా నాలుగు రోజుల్లో 'వ్యాపారపు' మెలకువలు ఆకళించుకున్నా. ఇహ పట్టిందల్లా బంగారమే! నా అదృష్టం శృతి మించుతుందేమోనని గాబోలు - భగవంతుడు రెండోసారి ఆడపిల్లనిచ్చాడు. అయినా దేవుడ్ని నిందించనవసరం లేదు.

    ఒక రకంగా చెప్పాలంటే నా సంపాదనకు ఓ లక్ష్యం అంటూ ఏర్పడిందీ ఆడపిల్ల వల్ల. బంగారమూ, కట్నపు డబ్బులూ, నివాస స్థలమూ, ఇళ్లూ - అలా ఓ క్రమం ఏర్పడింది. 'పై సంపాదనను పన్నుల వాళ్ల కాకిగోల నుండి కాపాడుకోవడం ఎలా' అన్న చింత వినా జీవితం మూడు పూవులు ఆరు కాయలుగా మారిపోయింది. రెండేళ్లలో ప్రపంచం మీద అథారిటీ వచ్చేసింది. భాగ్యనగరంలోని హెడ్డాఫీసులో పాతుకుపోయి, ఇల్లూ వాహనం లాంటి హంగులు ఏర్పాటు చేసుకుని, పూర్తిగా సంపూర్తిగా జీవితంలో స్థిరపడిపోయాను. నిజం చెప్పాలంటే నాకిహ మా పల్లెటూరుకెళ్లాల్సిన అవసరమే లేదు. అయినా పూర్వ పరిచయాలూ - ఏదో మమత - ఆర్నెల్లకొకసారి మా ఊరివైపు లాగుతూ ఉండేవి.

    వెళ్లినప్పుడల్లా మా జానకి బాగోగులు విచారించడం ఓ తప్పనిసరి పనయింది. చెప్పొద్దూ - మాధవుడంటే నాకు అమితమైన ప్రేమ. జానకంటే జాలి. తల్లిదండ్రులూ, అత్తమామలూ పోషించలేరు కాబట్టి ఊళ్లోనే ఉన్న కాస్తంత డబ్బున్న ఓ దూరపు చుట్టపు ముసలమ్మ పంచన తన ఇద్దరు పిల్లలతో చేరి కాలం వెళ్లదీస్తోంది మా జానకి. రెండోపిల్ల కూడా ఆడపిల్లే! దురదృష్టం! పిల్లలు చూడటానికి శుభ్రంగా, ముద్దుగా ఉన్నా మెళ్లోగాని, చెవులకుగానీ, చేతులకుగానీ వీసమెత్తు బంగారం లేదు. లక్ష్మీదేవుల్లా కళకళలాడాల్సిన ఆడపిల్లలు బోసిపోయి ఉన్నారు. మా అమ్మాయితో పోల్చి చూస్తే గుండె తరుక్కుపోయింది. ఫస్టుక్లాసు బిఎస్సీ తండ్రికి పుట్టిన కూతుళ్లిలా పరాయి పంచన అనాథల్లా బోసిమెడలతో బతకాల్సిన దురవస్థ ఎందుకూ? ఇంత చిన్నవిషయం మా వెర్రాడి బుర్రకెక్కదేం? వాడికన్నా తెలివితేటల్లోనూ, చదువుసంధ్యల్లోనూ, శక్తిసామర్థ్యాలలోనూ ఎన్నోరెట్లు తక్కువవాడినైన నేను ఇంత చులాగ్గా జీవితంలో స్థిరపడిపోగా వాడు రాజస్థాన్ ఎడారుల్లోనూ, పెళ్లాంపిల్లలు పరాయికొంపల్లోనూ కాలం గడపవలసిన అవసరం ఏమిటి? ప్రారబ్దం! ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? 

    పిల్లలు ఆరోగ్యంగా, కళగానే ఉన్నారు. వాడక్కడేదో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడట. స్కాలర్షిప్పు డబ్బుల్లో కొంత వెనకేస్తున్నాడట. నెలనెలా ఇంతని జానక్కి పంపుతున్నాడట. తిండితిప్పలకు లోటు లేకుండా గడిపేయగలుగుతున్నారట. కొద్దో గొప్పో సంపాయిస్తున్నాను గాబట్టీ, 'నువ్వున్నావు గదరా సుబ్బులూ!' అని వాడు సెంటిమెంటోటి పెట్టాడుగాబట్టీ వెళ్లిన ప్రతిసారీ ఎంతోకొంత సాయం చేద్దామని ప్రయత్నించేవాడిని. జానకి మాత్రం తక్కువ తిన్నదా? 'వద్దన్నయ్యా! అవసరం లేదు. అవసరమయినపుడు అడిగి తీసుకునే సొతంత్రముంది గదా' అని ప్రతిసారీ తిరగ్గొట్టేసేది. ఎంతో కష్టం మీద పిల్లలకు గౌనులూ, బొమ్మలూ మాత్రం పుచ్చుకునేది. అంతకన్నా సాయపడలేకపోతున్నందుకు నొచ్చుకోవడం వినా చేయగలిగిందేమీ లేకపోయింది.

    యథాప్రకారం మరోసారి మావాడు బాంబు పేల్చాడు. వాడి ఫైనలియర్లో జరిగిందది. వాయుసేనలో చేరిపోయాడు! కాలేజీకే సెలక్షను టీం వచ్చిందట. పదిమందిని ఇంటర్వ్యూ చేసి ఇద్దర్ని ఎన్నుకొన్నారట. అందులో వీడొకడు. ఫైనలియరంతా ఉద్యోగంలోనే ఉన్నట్లు పరిగణించి జీతం కూడా ఇస్తారట. బావుంది. ఆర్థికపు ఒడిదుడుకులకు స్వస్తి అన్నమాట. కానీ ఇంత చదువూ చదువుకుని, ఇంజనీరింగ్ డిగ్రీ అందుకోబోతూ ఆ దిక్కూదివాణం లేని పటాలంలో చేరడమెందుకూ? ఏదో గతిలేని వాళ్లు చేరారంటే అర్థముంది... వీడికేం లోటు? బ్రిలియంటు స్టూడెంటు గదా - వీడు ఊఁ అంటే ఏ టాటా బిర్లాలో ఎగరేసుకుపోరూ? ఊహూఁ! అలా అయితే మావాడి గొప్పదనమేముందీ? వాడి ఆశయాలకు సైన్యమే సరైనదట. టాటా బిర్లాలను సేవించి డబ్బులు సంపాదించడం కన్నా, తనను తీర్చిదిద్దిన దేశమాత సేవలో నిమగ్నమవడమే తనకిష్టమైన పనట. ఎవరు చెప్పగలరీ మొండివాడికి? రేపే యుద్ధంలోనో కాలో కన్నో పోతే దేశమాత కాదుగదా కట్టుకున్న పెళ్లాంపిల్లలు కూడా వీడి మొహం చూడరు. వయసొచ్చీ ఏం లాభం? లోకజ్ఞానం లేకపోతే ఎలా?

    అనుకున్నట్లే అరవై రెండులో యుద్ధం వచ్చిపడింది. అనుకోని ఆ అవాంతరం వల్ల దేశం అట్టుడికిపోయింది. 'హిందీ-చీనీ భాయి భాయి' అన్న పీతకళ్ల వెధవలు వెన్నుపోటు పొడవడం వల్ల కలిగిన ఆవేదనా, తనకళ్లముందే తన నమ్మకాలు ఛిన్నాభిన్నమవుతున్నా తప్పనిసరిగా పూనుకుని దేశప్రజలనుద్దేశించి నెహ్రూగారు చేసే ప్రసంగాల వల్ల కలిగే ఉద్వేగమూ, మా అభిమాన హీరో ఎన్టీరామారావు నడుంకట్టి 'నేషనల్ డిఫెన్సు ఫండు' కోసం ఆంధ్ర దేశంలో జరిపిన జైత్రయాత్ర వల్ల కలిగిన ఉత్తేజమూ - ఇవన్నీ ఒక పెట్టు; అటుపక్క మా మాధవుడు విమానదళంలో ఏ చిక్కుల్లో ఇరుక్కుపోయాడోనన్న బెంగ మరోపెట్టు. మా పల్లెటూళ్లో ఉన్న జానకి ఎలా ఫీలయిందో తెలియదు గానీ, హైదరాబాదులో నాకు మాత్రం కొన్నికొన్ని రాత్రుళ్లు దిగులువల్ల నిద్ర పట్టేది గాదు. చైనావాళ్లు మా వాడిని బంధించినట్టూ, దేశ రక్షణ పథకాల వివరాలు చెప్పమని చిత్రహింసలు పెడుతున్నట్టూ కలలొచ్చవి. సినిమాల మహత్యమా?!

    ఏదేమైనా గానీ మావాడు యుద్ధంలో ఏదో ఘనకార్యం చేశాడు. ఏదో చక్రం - పరమవీర చక్రమా? - ఇచ్చారు గవర్నమెంటువాళ్లు. అంత చిన్న వయసులో ఆ పతకం గెలుచుకున్న మొట్టమొదటివాడట మా మాధవుడు! పేపర్లో వచ్చింది. రేడియోలో చెప్పారు. నా మనసు గంతులేసింది. మా ఊరు ఊరంతా ఉప్పొంగిపోయింది. ఆంధ్రదేశమంతా జేజేలు పలికారు. హైదరాబాదులో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక సభ పెట్టి సన్మానించారు.

    నాలుగేళ్ల తర్వాత అదే మొదటిసారి వాడిని చూడటం. లావెక్కాడు. హుందాగా ఉన్నాడు. నార్తిండియా నీళ్లు పడ్డట్టున్నాయి - దబ్బపండులా ఉన్నాడు. అంబాలాలో పోస్టింగట. అంతా సౌకర్యంగా ఉందట. ఏదో దేశం కోసం తనకు చేతనయింది తాను చేశానన్న సంతృప్తే తప్ప ఘనకార్యం చశానన్న భావం కలగడం లేదట! ఇలా సన్మానాలూ, సంబరాల మధ్య కూర్చోవాలంటే సిగ్గేస్తోందట! మరొకళ్లిలా అంటే 'పోవోయ్! వెధవ బడాయి కబుర్లూ నువ్వూనూ' అని దులపరించేవాడినే గానీ మరి మాధవుడి ధోరణే అది గదా! పిచ్చిమాలోకం - కీర్తికాంత వచ్చి పడితే సాదరంగా చేరదీయడం చేతగానివాడు! అనుకోని అవకాశాలను అందిపుచ్చుకొని పాపులారిటీని సొమ్ము చేసుకోవడం తెలియనివాడు.

    అన్నట్లు సొమ్మంటే గుర్తొచ్చింది. అప్పటికి వాడికి మరో ఆడపిల్ల. ముగ్గురన్నమాట. అంత మంచివాడు - మరి పాపం వాడికిదేం దురదృష్టమో తెలియదు! ఆడపిల్ల మీద ఆడపిల్ల... వరుసగా ముగ్గురు! 'ఏవిరా! ఏవన్న వెనకేస్తున్నావా?' అనడిగా. మెహర్‌బాబా మూడో తమ్ముడిలా ఓ వేదాంతపు చిరునవ్వు నవ్వి 'నువ్వింకా మారలేదురా సుబ్బారావూ!' అన్నాడు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడమంటారు - ఇదే గాబోలు. ఒళ్లు మండింది. మారాల్సింది వాడా నేనా? అయినా తమాయించుకొని చిలక్కి చెప్పినట్లు చెప్పాను. - "ఒరే మాధవా! ముగ్గురాడపిల్లల తండ్రివి. ఒక్క ఆడపిల్లకే నేను బెంబేలు పడిపోతున్నాను. ఇప్పట్నుంచే కట్నం వెనకేస్తున్నా. నువ్వు జాగ్రత్త పడకపోతే పిల్లలు ఉసూరుమని పోతారు. నగలూ నట్రా చేయించు. వచ్చిందంతా మీ మిలరీ వాళ్లలాగా విలాసాలకూ వినోదాలకూ తగలేయకుండా ఎంతో కొంత వెనకెయ్యి. ఓ ఇల్లు కట్టుకో. షేర్లు కొను. ఇళ్ల స్థలాల వ్యాపారం చెయ్యి. డబ్బులు సంపాదించాలంటే సవాలక్ష ఉపాయాలున్నాయి. ఏదో ఒకటి పట్టుకుని ఎంతో కొంత వెనకెయ్యకపోతే జీవితంలో ఓడిపోతావు. ఆ తర్వాత ఊరికే పశ్చాత్తాప పడి లాభంలేదు"

    నా తపన వాడికర్థమయినట్టుంది. కళ్లలోతడి, గొంతులో ఆర్తి, మాటల్లో మనసు- అయినా ధోరణిలో మార్పులేదు. సంపాదించి వెనకేయడం వాడి స్వభావానికి విరుద్ధమట. కట్నాలూ, పెళ్లిళ్లూ గురించి ఆలోచించడట. పిల్లల్ని చదివించి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడమే తన ధ్యేయమట. షేర్లూ, స్థలాలూ లాంటి జూదాల జోలికి పోడట. కాపిటలిస్టు వ్యవస్థకు దర్పణాలయిన షేర్లంటే వెగటట! 

    నా బొంద! నా పిండాకూడు! ఎంత పాత చింతకాయపచ్చడి ఆలోచనలు?! లోకం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంటే వీడింకా గబ్బిలంలా ఆ పాత భావాలకు బానిస అయిపోవడమేమిటి? ప్రారబ్దం! నా అంతటివాడు వీడు. ఏం చెప్పగలనూ? ఎలా చెప్పగలనూ? అదే మా పిల్లాడయితే లాగి లెంపకాయ లాగించేవాడిని. వీడి బూజు పట్టిన భావాలకి జానకీ, ముగ్గురాడపిల్లలూ బలయిపోరుగదా! ఆందోళనతో మనసు వికలమయింది. అయినా చేసేదేముందీ?!

* * *

    దాదాపు పదేళ్లు మా మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పోయాయి.

    వాడు ఉద్యోగరీత్యా అస్సాం, ఒరిస్సా, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌కోట్, చండీఘడ్ లాంటి ప్రదేశాలు తిరిగాడు. ఉన్న ముగ్గురికి తోడు మరో ఆడపిల్లట - సీత, ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తుల్లా! టకటకా ప్రమోషన్సు కొట్టేసి రికార్డు టైములో వింగ్ కమాండరయిపోయాడట. వాడు కనీసం ఏడాదికైనా ఓసారి కుటుంబ సమేతంగా వచ్చి మా కుగ్రామంలో, ఆ పూరింట్లో పదీ పదిహేను రోజులు గడిపి వెళ్తూ ఉండేవాడు. నాకేమో హైదరాబాదు పనులతో తీరికే ఉండదు! నా వ్యాపకాలు పుంఖానుపుంఖాలుగా పెరిగాయి. ఆస్తి పెరిగింది. అవస్థలు పెరిగాయి. మనశ్శాంతి తరిగింది. ఉద్యోగం నామ్‌కే వాస్తే అయింది. పెట్రోలు బంకు, గ్యాసు ఏజెన్సీ, రియల్ ఎస్టేటు, బినామీ కాంట్రాక్టులు, ఇంకా చెప్పరాని వ్యాపారాలు - ఓ చిన్నసైజు బంగారు పిచికనే అయిపోయాను. మంత్రుల పరిచయాలూ, అధికారుల స్నేహాలూ, వందిమాగధుల ఇచ్చకాలూ - క్షణం తీరికలేని జీవితమయిపోయింది.

    హఠాత్తుగా ఓ శుభోదయాన ఊడిపడ్డాడు. వాడికి బెంగుళూర్లో పోస్టింగట. ఒక్క రాత్రి ప్రయాణమే గదా అని చూసిపోవడానికి వచ్చాడట. ఆ రోజు పనులన్నీ పక్కనబెట్టి వాడితో కలిసి తిరిగాను. కారు తీద్దామంటే ఒప్పుకోడు. స్కూటరు చాలన్నాడు. నాకేమో ఎవరన్నా చూస్తారన్న సిగ్గు! ఎక్కడెక్కడికో తీసుకెళ్లాడు. ఎప్పటెప్పటి స్నేహితులనో పలకరించి వచ్చాం. అంతా మా చిన్ననాటి క్లాస్‌మేట్లే అయినా వాళ్లసలీ భాగ్యనగరంలో ఉన్నారన్న సంగతే నాకు తెలియదు. మరి ఎక్కడెక్కడో ఉండి వచ్చిన వీడికి ఎలా తెలిసిందో? అడిగితే 'మనసుంటే మార్గముండదా?' అన్న వేదాంతపు భాషణ!

    కానీ ఒక్కమాట. వాడు రాజకీయాల్లో ఒక్క వెలుగు వెలుగుతోన్న మా మంత్రి రాంకోటేశ్వరరావును కలిసినా, ప్రతిభ ఉండీ అవకాశం కలిసిరాక రైల్వేలో క్లాసు ఫోరుగా మగ్గుతున్న నారాయణను కలిసినా - అస్సలు తేడా లేకుండా ప్రవర్తించాడు. ఇద్దరినీ ఒకే రకపు ఆప్యాయతతో, ఆత్మీయతతో దగ్గరకు తీసుకున్నాడు. చెప్పొద్దూ - అలా వాడితో రోజంతా తిరిగితే మరోసారి చిన్నతనంలోకి వెళ్లిపోయిన భావన కలిగింది. మనసు తేలికయి హృదయం ఏదో చెప్పలేని ఆనందంతో నిండిపోయింది.

    వెళ్తూ వెళ్తూ చెప్పాడు - పెద్దమ్మాయి ఎమ్మెస్సీ అవగొట్టి ఎక్కడో జూనియర్ లెక్చరర్‌గా చేస్తోందట. రెండో పాప ఇంటరట. మూడూ నాలుగూ పదీ, ఎనిమిదట. పెద్దమ్మాయికేదో సంబంధముందని తెలిసి ఆ వివరాలు కనుక్కుందామని వచ్చాడట. వచ్చే ఆదివారంనాడు కుర్రాడు పెళ్లి చూపులకి ఇంటికి రాబోతున్నాడట. నాకూ వ్యాపార రీత్యా బెంగుళూరులో పని ఉండటంతో ఆ సమయానికి నేనూ వస్తానన్నా! నా అంచనాలను పూర్వపక్షం చేస్తూ వీడు పూనుకుని అలా సంబంధాల కోసం తిరగడం ఎంతో సంతోషం కలిగించింది. ఎంతైనా ఆడపిల్లల తండ్రి గదా!!

* * *

    "చూడండీ, ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కట్నం ప్రసక్తి లేని పెళ్లనేది నా భావాలకు సంబంధించిన విషయం. దానికి నా కులంతో సంబంధం లేదు. మీరు కట్నాన్ని కులానికి ముడిపెట్టి 'కుర్రాడు చవగ్గా దొరుకుతున్నాడు... ఇబ్బందులు ఉంటే మాత్రమేమీ చవక బేరమే గదా' లాంటి లాజిక్కుల దృష్ట్యా దీనికి మొగ్గితే మాత్రం నేనెంతో నిరాశ పొందుతాను. మీరూ నాలానే పెళ్లిలో కట్నం ప్రసక్తి ఉండరాదని పూర్తిగా నమ్మి ఈ విషయంలో నిర్ణయం తీసుకోగలిగితే సంతోషిస్తాను"

    నాకు ముళ్లమీద కూర్చున్నట్టుంది. కుర్రాడు చురుకు. నలుపైనా కళ గల మొహమే. పొట్టైనా స్ఫురద్రూపే. కానీ హరిజనుడట - సగం. వాళ్ల నాన్న మా వాళ్లే అయినా అమ్మ మాలపిల్లట. తల్లి రెక్కలమాటున పెరిగాడు. కాకినాడలో ఇంజనీరింగు చేసి ప్రస్తుతం ఢిల్లీలో ఎదో సర్కారు వారి కంపెనీలో ఆఫీసరు. అసలతగాడు పెళ్లి చూపులకు ఒంటరిగా వచ్చేయడం, కుండ బద్దలు కొట్టి మాట్లాడేయటం - నాకెందుకో నచ్చలేదు. పెళ్లంటే ఎంత ఆలోచించాలీ! పెద్దమ్మాయికిలా కులం తక్కువయితే మిగిలిన ముగ్గురాడపిల్లల సంగతేమిటి? అసలింత చిన్న విషయం పట్టించుకోకుండా మాధవుడు విషయాన్ని పెళ్లిచూపులదాకా ఎందుకు రానిచ్చినట్లూ! అయినా ఆ కుర్రాడిది అనవసరపు కంఠశోష. 'చవక బేరం' అనేంత తెలివిగా ఆలోచిస్తే మా మధవుడీపాటికెంతో బాగుపడి ఉండేవాడు గాదూ?

    జానకి మొహంలో మిశ్రమ భావాలు. 'చూస్తే అబ్బాయిలో వంకపెట్టడానికేం లేదు. కానీ చూస్తూ, చూస్తూ తక్కువ కులమా?' అని గాబోలు తన మథన. నా అభిప్రాయమడిగాడు మాధవుడు. "మరో మాట ఆలోచించకుండా మర్యాదగా సాగనంపు. మనిషి మంచయినంత మాత్రాన చాలదు. పెళ్లంటే ఆషామాషీ కాదు. సాంప్రదాయం, సంస్కృతీ, కుటుంబపు బాగోగులు - ఎన్నో చూడాలి. సంబంధం వదులుకో!" నిజాయితీగా సలహా ఇచ్చాను.

    వాడు మరి మామూలు మానవుడు కాదు గదా - మాధవుడు. మాటల సందర్భంలో ఆ కుర్రాడు తనతోపాటు ఓ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ బొంబాయిలో ఎమ్టెక్ చేశాడనీ, అతగాడు కూడా బెంగుళూరు పోస్టింగులోనే ప్రస్తుతమున్నాడనీ అన్నాడు. ఆ ఆధారం అందిపుచ్చుకుని మావాడు ఆ స్క్వాడ్రన్ లీడర్ ఇంటికి వెళ్లి గంటన్నర తర్వాత తిరిగొచ్చాడు.

    "కుర్రాడు నిప్పు, చాకు. గంటన్నర మాటల్లో మా స్క్వాడ్రన్ లీడరు కుర్రాడిలో వంద సుగుణాలు ఏకరువు పెట్టాడు గానీ ఒక్క లోపమైనా ఎత్తి చూపలేకపోయాడు. నేను ప్రత్యేకించి అడిగినా లోపమెన్నడం సాధ్యంగావడంలేదన్నాడు. ఇహ నాకు సందేహం లేదు. అమ్మాయి ఊఁ అంటే చాలు - ఈ సంబంధం ఖాయం" తాంబూలాలిచ్చేశాను తన్నుకుచావండి ధోరణిలో ప్రకటించేశాడు. 

    పిచ్చిపిల్ల దానికేం తెలుసు? నాన్న మాటకు తలూపింది. మిగిలిన ముగ్గుర్నీ జానకినీ చూసి నా గుండె తరుక్కుపోయింది. చేయగలిగిందేముందీ? 

* * *

    వాడు బెంగుళూరులోనూ నేను హైదరాబాదులోనూ ఉండటం, నాకు బెంగుళూరులో వ్యాపారపు లావాదేవీలూ వాడికి హైదరాబాదులో బంధుత్వపు సంబంధాలూ ఉండడంతో మా మధ్య రాకపోకలు పెరిగాయి. దాదాపు రెండు నెలలకోసారి వాళ్లింటికి వెళ్లడం, పిల్లల్తో ఓ సాయంత్రం గడపడం ఆనవాయితీ అయిపోయింది. పెద్దమ్మాయి ఢిల్లీలో స్థిరపడిపోయింది. మొదట్లో కులం తక్కువ సంబంధం గురించి బంధువర్గాల్లో గుసగుసలు సాగినా, అవి బెంగుళూరూ ఢిల్లీలలో ఉన్నవాళ్ళనేమీ ఇబ్బంది పెట్టలేకపోయాయి. 

    రెండో అమ్మాయి పర్సనల్ మేనేజ్‌మెంటులో మాస్టర్స్ డిగ్రీ చేసి బెంగుళూరు హెచ్చెమ్టీలో పర్సనలాఫీసరుగా చేరిపోయింది. పెళ్ళీడు దాటిపోతోంది. జానకమ్మకు సహజంగానే బెంగ. మాధవుడికి అంతే సహజంగా నిర్వికారం. డాబూ, దర్పం, కారూ, కుక్కా, మీసాలూ, పైపూ అంటే సంపాదించాడు కానీ లోకజ్ఞానం, డబ్బూ నిండుసున్నా! ఏదో పెద్దమ్మాయికి లక్కు తన్నుకొచ్చిందన్నంత మాత్రాన అన్నిసార్లూ అలా జరిగిపోతుందా? పూనుకోకపోతే ఎలా? గట్టిగా అడిగితే "నువ్వే ఏదన్నా సంబంధం చూడరా! పిల్లాడు మంచాడయితే చాలు. నా అంతట నేనే 'ఇదిగో ఇలా మా అమ్మాయుంది. చేసుకునే నాథుడు కావాలి' అని కూరగాయలమ్మినట్లు సంత ఎలా పెట్టను?' అంటాడు. చెప్పానుగదా, ఊరందరిదీ ఒక దారయితే ఉలిపికట్టెది పెడదారి! ఏం? లోకంలో అందరు తండ్రులూ కూతుళ్లకోసం సంబంధాలు వెతకడం లేదా? వీడేమన్నా తలగొట్టి మొలేశాడా? అసలు వీడ్నర్థం చేసుకోడానికి ఓ జీవితకాలం చాలదు! వెదక్కుండానే సంబంధాలు దొరికిపోవడానికిదేమన్నా సత్యకాలమా? అసలేమిటో వాడికా ధీమా?

    మా అమ్మాయిని డిగ్రీ అవగానే మణిపాల్లో ఇంజనీరింగు చేసి ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న, స్తోమతున్న ఓ కుర్రాడికి - పాతిక లక్షలూ, వంద తులాలూ, మూడు గదుల ఫ్లాటుతో అందించేశాను. నా బాధ్యత తీరిపోయింది. పెళ్లికి మాధవుడు సకుటుంబంగా వచ్చాడు. వాడి కుటుంబమూ మా కుటుంబమూ కలుసుకోవడమిదే మొదటిసారి. స్నేహ సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసాయి. పొంగి పొరలాయి. కానీ ఆడవాళ్లు ఒక్కొక్కళ్లూ కనీసం లక్ష రూపాయల నగలతో లక్ష్మీదేవి తోబుట్టువుల్లా వెలిగిపోతున్న పెళ్లిపందిట్లో మా జానకమ్మ ముగ్గురు కూతుళ్లూ బోసి మెడలతో వెలవెలబోవడం చూసి నాకే ప్రాణం చివుక్కుమంది. మావాడికి మాత్రం చీమైనా కుట్టలేదు. కానీ ఒక్కమాట - వాళ్లు బోసిగా ఉన్నా విలక్షణంగా ఉన్న మాట నిజం. ఎవరో అననే అన్నారు వీళ్లను చూసి - "అంతా లక్ష్మీదేవులే అయితే ఎలా? సరస్వతులకు కూడా ఇక్కడ చోటుండొద్దూ?"

    నా తాపత్రయం కొద్దీ ఆ సరస్వతులను చూసి ముచ్చటపడుతున్న ఒకరిద్దరు పెళ్లికొడుకుల తండ్రులను కదిపాను. కులాంతర సాహసం గురించీ, కట్నమిచ్చుకోలేనితనం గురించీ విని ఉన్నారేమో - విషయం దాటేశారు.

* * *

    నాలుగు నెలల తర్వాత మరోసారి బెంగుళూరు వెళ్లాను.

    అంతా ఉన్నారు. అయినా ఇల్లంతా స్తబ్ధంగా ఉంది. ఏదో విషయంలో తర్జనభర్జనలు పడుతున్నారనిపించింది. అందరి మొహాల్లో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

    మావాడు మాత్రం నిర్వికారంగా ఓ పదిహేడేళ్ల కుర్రాడి చేతికి కట్టుకడుతున్నాడు. నూనె పడి భయంకరంగా కాలింది. ఆ కుర్రాడు వీళ్లతోబాటే ఉంటున్నాడట. మాధవుడి దగ్గర పదిహేనేళ్ల క్రితం పనిచేసి ప్రస్తుతం గల్ఫ్‌కెళ్లిన ఓ తెలుగు ఎయిర్‌ఫోర్స్ సిపాయి కొడుకట. 'మేం దేశంకాని దేశంలో ఉండి అబ్బాయిని హాస్టల్లో ఉంచి చదివించడం వల్ల వాడి ఆలనా పాలనా చూసేవాళ్లు లేక కుర్రాడు పెడదార్లు పడుతున్నాడు. మీరే ఓ దారి చూపించాలి' అని అడగగా మావాడు కుర్రాడిని హాస్టల్లోంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పాలిటెక్నిక్‌లో చేర్పించాడట. తనకు మాలిన ధర్మం గాదూ? పోనీ మరోసాటి ఆఫీసరు కొడుకంటే అనుకోవచ్చు. ఓ సిపాయి కొడుకుని ఎందుకిలా నెత్తిన పెట్టుకోవాలీ? మిగిలివున్న ముగ్గురు కుంపట్ల బరువు చాలదూ? మావాడి పనులు ఇలానే ఉంటాయిమరి!

    ఆ సంగతి వదిలి అసలు విషయానికొచ్చాను. వివరాలడిగాను.

    అతని పేరు గోపాలమీననట. రెండో అమ్మాయి కొలీగట. మళయాళీ కుర్రాడు. ఇష్టపడ్డాడట. తిన్నగా ఇంటికొచ్చి అడిగివెళ్లాడట! (ఎంత ధైర్యం?)

    బండి కులాంతరం దగ్గరే ఆగలేదన్నమాట. భాషాంతరం, రాష్ట్రాంతరం మార్గాలు పట్టిపోతోందన్నమాట. ఇంకా నయం మతాంతరం, దేశాంతరం అవలేదు. అక్కడికదే సంతోషం.

    కుర్రాడిదేమంత ఉన్న కుటుంబం కాదు. అతనికి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. రిటైరైన తల్లిదండ్రులూ, పెళ్లి కావలసిన చెల్లెలూ, చదువుకుంటున్న తమ్ముడూ - ఉండాల్సిన బాదరబందీ అంతా ఉంది. ఆ గందరగోళపు మళయాళీ మాయాజాలంలో మా అమ్మాయి ఇమడగలదా? అనుమానమే!

    ఈ ఆలోచనలూ, అనుమానాలు, బాధలూ - నాకే! మళ్లీ మావాడు మెహర్‌బాబా అవతారమెత్తి చిరునవ్వుతో పెళ్లి జరిపించేశాడు. 'అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు తెలుసుకుని ఇష్టపడితే భాష, రాష్ట్రం, కులం, స్తోమతు లాంటి అడ్డంకులను లెక్కచేయడం అనవసరం' అన్న థీరీతో అందరి మెదళ్లూ వచ్చి పెళ్లి జరిపించాడు. పెళ్లిలో చిరునవ్వులే గానీ సిరినవ్వులు లేనే లేవు. మరీ మళయాళీ ఆర్ట్ ఫిలింలోలాగా, కమ్యూనిష్టు వ్యవహారం లాగా, తూ తూ మంత్రం లాగా పెళ్లి పేలవంగా జరిగిపోయింది. కానీ ఎందుకో మనసుకు తోచింది - అమ్మాయి జీవితంలో సుఖపడగలదని!

* * * 

    ఆ మళయాళప్పెళ్లి మా ఊళ్లో గగ్గోలు పుట్టించలేదు గానీ రచ్చబండ చర్చనీయాంశమయింది. ఆశ్చర్యమేమిటంటే - అంత చిన్న ఊళ్లో కూడా మావాడి చర్యను సమర్థించే పక్షం తయారయింది. కాస్తంత అనుభవజ్ఞులూ, విజ్ఞులూ వాడి దుస్సాహసానికి విచారం వ్యక్తపరచినా, కుర్రకారూ, సన్నకారూ మాత్రం మారుతున్న ప్రపంచంతోపాటు మనమూ మారాలనీ, అందుకు దారి చూపిస్తున్న మాధవరావును అందరూ ఆదర్శంగా తీసుకోవాలనీ వాదించడం మొదలుపెట్టారు. పిల్లకాకులకేం తెలుసు ఉండేలు దెబ్బ? అయినా కబుర్లు చెప్పడానికేం? ఎన్నైనా చెప్పొచ్చు. రేపీ మళయాళ గందరగోళం వల్ల రెండో అమ్మాయి జీవితంలోగానీ, మాధవుని జీవితంలోగానీ తుఫానులు చెలరేగితే అనుభవించేదెవరూ? బాధపడేదెవరూ? 

    మూడో అమ్మాయీ, నాలుగో పాపా చాకుల్లాంటి వాళ్లు. బ్రిలియంట్ స్టూడెంట్లు. చదువులు, ఆటలు, డిబేట్లు, క్విజ్‌లు - అన్నింటా వాళ్లే ఫస్టు. ఇద్దరికీ అవలీలగా బెంగుళూరులో మెడిసిన్ సీటొచ్చేసింది. అదే సమయంలో మావాడికి మళ్లీ జోధ్‌పూర్ బదిలీ అయింది - ప్రమోషనుతో! పిల్లల్నిద్దర్నీ హాస్టల్లో పెట్టేసి శుభ్రంగా జానకితో కలిసి వెళ్లిపోయి కొత్తకాపురం పెట్టేయమని సలహా ఇచ్చాను. విన్లేదు. నెల రోజులు తీవ్రంగా ఆలోచించి వలంటరీ రిటైర్మెంటు పుచ్చేసుకున్నాడు. "బంగారంలాంటి ఉద్యోగమెందుకు వదులుకుంటావురా? నీకు ఎంతో భవిష్యత్తుంది. నువ్వే వాయుసేనాధ్యక్షుడివో అయితే చూసి సంబరపడదామని మాలాంటి వాళ్లం అనుకుంటుంటే నీకిదేం ఆలోచనా?" అని ఎంతో నచ్చచెప్పాను. వినలేదు. వాడి భవిష్యత్తు కన్నా పిల్లల భవిష్యత్తు ముఖ్యమట! వాళ్లను దగ్గరుండి తీర్చిదిద్ది డాక్టరమ్మలను చేయడంలో ఉన్న సంతృప్తి తాను ఎయిర్‌ఛీఫ్ అవడంలో ఉండదట! ఇదీ ధోరణి! ప్రాణం ఉసూరుమంది. 

    వలంటరీ రిటైర్మెంటు పుణ్యమా అని వాడికో నాలుగు లక్షలు చేతికొచ్చాయి. శుభ్రంగా ఏ వ్యాపారంలోనయినా పెట్టి ఆ వచ్చే రాబడితోనూ, గవర్నమెంటు వారిచ్చే ఫించనుతోనూ హాయిగా కాలుమీదకాలు వేసుకుని కడుపులో చల్ల కదలకుండా గడపమని హితవు చెప్పాను. మావాడికి సుఖపడే యోగంలేదు. ఆ డబ్బుతో బెంగుళూరు శివార్లలో ఎందుకూ పనికిరాని బీడు భూమిని ఎవరో పొలమని తెలివిగా అంటగడితే కొనేశాడు. కూరగాయలు పండిస్తాడట. కొబ్బరితోట పెడతాడట. పుట్టగొడుగులు పుట్టిస్తాడట. పాలూ, పాడీ, గడ్డీ, గాదం - ఇదీ వాడి ధోరణి. మేవుఁ పల్లెటూరొదిలి పాతికేళ్లు - ఇంకా కాయకష్టం చేయగలడా? అసలు ఇంత బ్రతుకూ బతికి మళ్లీ ఆ పేడ పిసకడమేంఖర్మ? 'ఆకాశంబున నుండి' అని భర్తృహరి వాపోయిందిదిగో ఇలాంటి వివేక భ్రష్టులను చూసేగాదూ!

    నా రొటీన్ ట్రిప్పులో మరోసారి బెంగుళూరు వెళ్లాను. కష్టపడి వెదికి వెదికి గంటన్నర ప్రయాణం తర్వాత సిటీ సెంటరుకు పాతిక్కిలోమీటర్లు దూరంలో ఉన్న మాధవుడి పొలం చేరా. మా వాడి అవతారం చూస్తే నవ్వొచ్చింది. దిగులనిపించింది. నీరుకావి పంచె మోకాళ్లపైకి ఎగగట్టాడు. చొక్కాలేదు. చేతితో పార, ఒళ్లంతా బురద, నిఖార్సైన పల్లెటూరి బైతులా ఉన్నాడు. ఇంజనీరనిగాని, వాయుసేన మాజీ ఆఫీసరనిగాని తెలియనివాళ్లు ఊహించనైనా ఊహించలేరు. వాడి పక్కన వాడిలాంటి  సజ్జే ఓ అరడజను మంది. ఇద్దరు కూలీవాళ్లట. మరో ఇద్దరు మా ఊరివాళ్లేనట. ఊళ్లో ఉండి గాలికి తిరుగుతూ పనీపాటలకూ, చదువూ సంధ్యలకూ లొంగకపోతే వాళ్ల బీద తల్లిదండ్రులు వాళ్లను వంచి మంచివాళ్లను చేయమని వీడికప్పజెప్పారట! వీళ్లంతా గాక ఓ మధ్య వయసు దంపతులు. తాగీ తిరిగీ, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి, ఇహ ఊళ్లో నిలబడలేని స్థితిలో ఉన్న అతగాణ్ని మా మాధవుడు పట్టి బెంగుళూరు లాక్కొచ్చాడట. వాళ్లకి మళ్లీ ఇద్దరు పిల్లలు. అంతా కలగాపులగంగా, కోలాహలంగా, గందరగోళంగా ఉంది. పై పై మట్టి పనులు చేస్తూ ఆఖరి ఇద్దరు డాక్టరు పిల్లలు. వీళ్లందరికీ టీ లందిస్తూ మా జానకమ్మ - ఏదో చిన్నపిల్లల బొమ్మలాటగా అనిపించింది. 'వేపగింజ వెలగపండయిందా?' అనిపించకపోలేదు!

    ఆ రోజు ఆదివారం. మావాడికి పనిరోజయినా లోకానికి సెలవే గదా! సిటీలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్ కాలేజీలో ఆఫీసర్లుగా ట్రైనింగవుతున్న నలుగురు ఇంజనీర్ల బృందం బిలబిలా వచ్చిపడింది. ఇద్దరు తెలుగు కుర్రాళ్లు. ఒక ఒరియా పిల్లాడు. మరో బెంగాలీ ముస్లిం. వాళ్లంతా మావాడి సహోద్యోగుల సంతానమట. చూస్తూంటే వాళ్లందరికీ వీడే లోకల్ గార్డియన్ అనిపించాడు. ప్రతి ఆదివారం వాళ్లిక్కడే గడుపుతారట. బావుంది సంత! ఎదిగిన ఆడపిల్లలున్న ఇంటికి కోడెవయసు కుర్రకారు వారం వారం వచ్చిపోవడం ఏమంత సమంజసం? మావాడికి కనీస జ్ఞానం లేకపోతే ఎలా? కానీ ఒక్కమాట ఒప్పుకొని తీరాలి - అంత గందరగోళంలోనూ... అంత కోలాహలంలోనూ... ఏదో వింత ఆకర్షణ ఉంది, సంతృప్తి ఉంది. రోజంతా అక్కడి వాతావరణమూ, మావాడి తెలివిలేనితనమూ, పిల్లలూ, జానకీ ఆ అడవిలో పడుతున్న కష్టాలూ - చిరాకూ విసుగూ కలిగించినా, సాయంత్రం సిటీ సెంటర్లోని హోటలుకు వస్తే ఈ సిటీ సెంటరే ఓ జనారణ్యంలా అనిపించింది. మావాడి పొలం జ్ఞాపకాలు మనసును ఏదో తెలియని ఆనందంతో నింపాయి.

* * *

    ఎప్పుడూ గత పాతికేళ్లుగా జరగని పని జరిగింది.

    మా జానకమ్మ బెంగుళూరు నుంచి ఫోను చేసింది. 

    ఇష్టాలయినా కష్టాలయినా మాధవుడి అభీష్టం ప్రకారం ఎంతో సహనంతో పాతికేళ్లుగా నడుచుకుపోయినా జానకమ్మ భర్త ప్రవర్తనకు నొచ్చి, దారీ తెన్నూ తెలియక, నా సహాయాన్ని ఆశిస్తూ ఫోన్ చేసింది.

    హుటాహుటిన బెంగుళూరుకు చేరా. చేరేసరికి ఉదయం పది దాటింది. 

    ఇంట్లో వాళ్లిద్దరే ఉన్నారు. పిల్లలు కాలేజీకి వెళ్లారు. పనులవాళ్ళు పనుల్లో మునిగి ఉన్నారు. తన అలవాటుకు భిన్నంగా మాధవుడు ఇంట్లో ఉన్నాడు. వాతావరణం టెన్షన్‌తో నిండినా, టేపురికార్డరులోని అన్నమాచార్య కీర్తనల లాలిత్యం నా దృష్టిని దాటిపోలేదు.

    తిన్నగా పాయింటుకొచ్చేశా.

    "చూడబ్బాయ్! వర్ణాంతరం, భాషాంతరం, రాష్ట్రాంతరం - అంటే సహించాం. తప్పలేదు. కానీ మరీ మతాంతరం ఎలా సహించమంటావ్? నీకేం? నీకివన్నీ పట్టవు. యోగీశ్వరుడివి. కానీ నాకూ జానకికీ ఇష్టం లేదు. అసలా సాయిబుల కుర్రాడు వారం వారం వచ్చిపోతున్నాడంటేనే మనసు కీడును శంకించింది. తరతరాల మన అలవాట్లూ, సంప్రదాయం కాదనుకొని చూస్తూ చూస్తూ పిల్లను తురకాడికి కట్టబెట్టడానికి మనసెలా ఒప్పుతోందీ?"

    "మనం కట్టబెట్టేదేవిఁట్రా? అదేం మాటా? అమ్మాయి పెద్దదయింది. డాక్టరీ ముగించి హౌస్ సర్జన్సీ అంటే మనకే కాస్తంత మంచీ చెడూ నేర్పగల వయసన్నమాట. అబ్బాయీ అమ్మాయీ ఇష్టపడ్డారు. ఒకరంటే ఒకరికి గౌరవముంది. అభిమానముంది. అవి చాలు వాళ్ల జీవితాలను తీర్చిదిద్దటానికి. అబ్బాయి మంచాడు. చిన్నప్పటినుంచీ తెలిసినవాడు. అమ్మాయి పోనీ ఎవరినో గుడ్డిగా ముక్కూ మొహం తెలియని వాడిని ప్రేమించానని వస్తే కంగారు పడటంలో అర్థముంది గానీ, ఇలా మనకు బాగా తెలిసిన బుద్ధిమంతుడ్నే ఇష్టపడితే స్నేహితుల్లా సంతోషించి ఆశీర్వదించాల్సింది పోయి మీరిలా కొంపలు మునిగినట్లు ఆందోళన పడటమెందుకో నాకర్థం కవటం లేదు" నిమ్మకు నీరెత్తినట్లు ఆదర్శ సిద్ధాంతాలు వల్లించాడు.

    నేనూ , జానకీ ఎంతగానో బోధించాం. బ్రతిమాలాం. భయపెట్టాం. బెదిరించాం. 

    కానీ మొండివాడు రాజుకన్నా బలవంతుడు కదా!

    నాకు విరక్తి పుట్టింది. పెళ్లి గుళ్లో అయిందో ఖాజీగారే చేశారో, మాధవుడి కూతురు మెహరున్నీసా అయిందో అల్లుడే మస్తాన్రావయ్యాడో; ఇద్దరూ కలిసి ఇండియాలో ఉన్నారో, పాకిస్తాన్ పోయారో - ఏ గంగలో దూకారో - ఏమీ పట్టించుకోలేదు. మనసు విరిగింది. రాకపోకలు తగ్గించాను. 

    అయినా మమతలు వసివాడవు. చిన్ననాటి స్నేహం చిరకాలం కొనసాగితీరుతుంది కాబోలు - జ్ఞాపకాలు వదలవు! రెండేళ్లు దూరంగా ఉన్న మీదట కాళ్లు అప్రయత్నంగా మాధవుడి పొలం వైపు లాక్కుపోయాయి. 

    ఈసారి వాతావరణంలో కించిత్తు మార్పు కనిపించింది. మాధవరావూ జానకమ్మా ఊరొదిలి వెళ్లే సన్నాహాల్లో ఉన్నారనిపించింది. నిజమే! వాళ్లు బెంగళూరు వదిలేస్తున్నారు! 

    పెద్దమ్మాయి ఢిల్లీలో స్థిరపడింది. అతగాడితోపాటు తనూ అక్కడే ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్లో తగిన ఉద్యోగం సంపాదించిందట!

    రెండో అమ్మాయి మళయాళం మొగుడితో బెంగుళూరులో పాతుకుపోయే ప్రయత్నాల్లో ఉంది. ఇద్దరూ కలిసి ఫ్యాక్టరీ నుంచి లోన్లు తీసుకుని ఫ్లాట్ కొనుక్కున్నారట. ఇక మూడో అమ్మాయి డాక్టరు - మెడిసినయిన తరువాత తనూ వాయుసేనలో చేరేసి ప్రస్తుతం వాళ్లాయనతో పాటు జోధ్‌పూర్లో టింగురంగా అంటూ ఉద్యోగం చేసుకుంటోందట. ఆ పిల్లగానీ, ఆ పిల్లాడు గానీ మతం గానీ, పేరుగానీ మార్చుకోనేలేదట! ఎవరి మతం వాళ్లదే అయితే మరి పెళ్లి ప్రాముఖ్యమేమిటో?

    పొలం పనులు జోరుగా సాగుతున్నాయి. నాలుగు గేదెలు, కొబ్బరి చెట్లు కాపుకొచాయి. మావాడితో పాటు పుట్టగొడుగుల పెంపకం మొదలెట్టిన అనేకమంది నష్టాలవల్ల దుకాణాలు కట్టేసినా మావాడి పరిశ్రమ లాభనష్టాలు లేకుండా నేలబారుగా సాగిపోతుఓంది. "పెట్టుబడి మీద వడ్డీ నష్టం గదరా" అంటే "అయితేనేం? అది ఓ పిల్లలున్న కుటుంబానికీ, దారి మళ్లిన ఇద్దరు కుర్రాళ్లకీ జీవనాధారమయింది. నాకదే చాలు!" అన్నాడు.

    కానీ నాలుగేళ్ల నిరుద్యోగం వల్ల ఖర్చులు ఆదాయాన్ని మించిపోయి అప్పుల్లో పడ్డాడు. పొలంలో సగం తెగనమ్మి అప్పులు తీర్చి మిగిలిన డబ్బులతో మా ఊళ్లో చేపల చెరువులు నడపాలని నిశ్చయించుకున్నాడట. మిగిలిన సగం పొలం పనిచేస్తున్న వాళ్లకి వదిలేసి వెళ్తాడట!

    మరి ఆఖరమ్మాయో!?

    అదీ సెటిలయింది. తను మెడిసినయిపోయి హౌస్ సర్జెన్సీ చేస్తోంది. మా ఊళ్లోనే సంబంధం దొరికిందట. కుర్రాడికి తల్లీదండ్రీ లేరు. తాడూ బొంగరం లేవు. గ్రాడ్యుయేటు. ఉద్యోగం లేదు. 'అవకాశం లేక అణిగి ఉన్నాడు గానీ, బయటకు తీసి మెరుగుపెడితే ఆణిముత్యమే' అంటాడు మాధవుడు. ఆ సంగతెలా ఉన్నా కుర్రాడిదీ మా కులమే గాబట్టి జీవితంలో నెగ్గుకురాగలడని నా నమ్మకం. మాలాంటి పెద్దవాళ్లం మా కులపు కుర్రాడికి ఆ మాత్రం సాయం చేయలేమా! కానీ డాక్టరు చదివిన పిల్లకు బియ్యే సంబంధమా? అయినా అంతకు మించిన సంబంధం మాధవుడెలా తేగలడూ?

    అవునూ...  ఏకబిగిన ఈ సోదంతా ఎందుకు చెప్పుకొచ్చినట్లూ?!

    మీలాంటి తెలిసినవాళ్లు మా మాధవుడి జీవితం చూసి ఓ గుణపాఠం నేర్చుకోవాలన్న తపనతో...

    ఏమాత్రం అవకాశమున్నా మనుషులు నిచ్చెనలెక్కేసి అమెరికా చెక్కేసే ఈ రోజుల్లో మావాడు బంగారం లాంటి అవకాశాలను వదులుకుని మట్టి పిసికి, చేపలు పట్టడానికి కుగ్రామం పోతున్నాడు. మామూలు మనుషులు సైతం తెలివిగా లకారాలు వెనకేస్తున్న ఈ రోజుల్లో మావాడు జీవితమంతా వెచ్చించినా ఒక్క రూపాయి నిలవచెయ్యలేకపోయాడు. శుభ్రంగా చదువుకుని పైకొచ్చిన కూతుళ్లకు ఘనంగా ఉన్న ఇంటి కులపు కుర్రాళ్లని కట్టబెట్టాల్సింది పోయి ఇంకో కులంవాడినీ, ఇంకో రాష్ట్రం వాడినీ, ఇంకో మతం వాడినీ, మరో నిరుద్యోగినీ కట్టబెట్టాడు. కనీసం కట్టుకున్న దానినైనా చివరి రోజుల్లో సుఖపెట్టాల్సింది పోయి మళ్లీ మతిపోయే పల్లెటూళ్లలోకి లాక్కుపోతున్నాడు.

    బతకడానికి తెలివి ఉండనక్కర్లేదు. వేపకాయంత వెర్రి బుర్రలో లేకుండా ఉంటే అదేచాలు! 

    కానీ ఓ నిజం చెప్పనా?! మావాడిని చూస్తుంటే 'ఆకాశంబున నుండి...' అన్న భర్తృహరితో పాటు 'ఇంతింతై వటుడింతయై...' అన్న పోతన కూడా ఎంచేతో గుర్తొస్తున్నాడు. 

    ఎందుకో ఎంత ఆలోచించినా అర్థం కాదు!             
Comments