చలం చెప్పని కథ - జయధీర్ తిరుమలరావు

    
నిన్నోసారి చూడాలనుంది. ఆరోగ్యం బాగోలేదు, వెంటనే బయలుదేరమని చలం నుండి టెలిగ్రాం రాగానే క్లబ్బుకు బయల్దేరినవాడల్లా బ్రీఫ్‌కేసులో బట్టలు పడేసుకుని  ట్రెయిన్ టైమింగ్స్ చూసి ఏడు గంటలకే రైలు ఉండటం వలన పరుగులతో వెళ్ళి టాక్సీలో కూర్చున్నాడు చైతన్య.

    రైలు అరగంట లేటు.

    ప్లాట్‌ఫాం బిజీగా ఉంది.

    చైతన్యకు మనసులో మనసు లేదు, ఆలోచనలు తప్ప. ఆ ఆలోచనలకు నిర్దిష్ట స్వరూపం లేదు. పుట్టిన ఆలోచనలు ఇట్టే చస్తున్నాయి. కొన్నేమో రూపం ఏర్పరచుకొనక ముందే నశిస్తున్నాయి. నశించిన ఆలోచనల బొందిలో మరో క్రొత్తవి -

    చలానికి ఏమయింది? ఏమయినా జబ్బుతో బాధపడుతున్నాడా? అయితే ఇదివరకే ఉత్తరం రాయక కంఠం మీదికొచ్చేవరకు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు?

    జీవితమంటే నిర్లిప్తత ఏర్పరచుకొని ఎప్పుడు నిష్క్రమిద్దామా అని సమయం కోసం వేచి చూస్తూ చావును స్మరిస్తూ కాలాన్ని గడిపేవాడు. చావు గురించి అతను చెప్పే 'ఫిలాసఫీ' విచిత్రంగా ఉంటుంది. అన్నీ చవిచూశాను. సుఖాలను, దుఃఖాలను. ఇక జీవితంలో చేసేదేమీ లేదు. సాధించేదాన్ని సాధించలేకపోయాను జీవితంలో. అలాంటి జీవితం ఇంక ఎందుకు? ఎన్ని అనుభూతులు, బాధలు పొందాల్సి ఉందో అన్నీ అనుభవించాను. ప్రవాహం కదలికా లేని కుంటలా జీవితాన్ని దుర్వాసన వేసేదాక నిలుపలేను!

    చలం ముసలివాడు కాదు. నలభై యేండ్లుంటాయి. పదిహేనేళ్ళ క్రితం  ఇలాంటి రైల్వే స్టేషన్‌లోనే చైతన్యకు పరిచయమయ్యాడు. ఈ పదిహేనేళ్ళలో అత్యంత సన్నిహితులయ్యారు.

    చలం వాదనలు విచిత్రంగా ఉంటాయి అందరికి. కాని చైతన్యకు వాటిలో ఒక 'రీజన్' కనిపిస్తుంది. కాబట్టి అతని సిద్ధాంతాన్ని నమ్ముతాడు ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ. జీవితంలో అన్నీ చూసాను - ఈ జీవితంతో తనకిక పనయిపోయింది. వెళ్ళిపోతానంటే చైతన్య ఒప్పుకోడు. జీవితం జీవించడానికే. చేతులారా చంపుకోవడానికి కాదు అని ఎంత చెప్పినా ఒప్పుకోడు చలం.

    "నాశనం కాని బండ జీవించి ఉన్నట్టేనా? ఎలాంటి అనుభూతీ, మార్పూ, ఆశ లేని జీవితం కూడా అంతే. ఎండా వానలకి అతీతంగా ఉండే బండలాంటి జీవితం జీవించకున్నా ఫరవాలేదు. ఇక ఆత్మహత్య నేరం అంటావు. నాకై నేను అది నేరంగా భావించనపుడు ఒకరికోసం దాన్ని ఒప్పుకోని స్వభావం నాదని నీకు తెలుసు. అందుకే ఆ క్షణాలకోసం వేచి చూడటం నా ఈ జీవితానికి లక్ష్యం" ఇది చలం వాదన.

    చైతన్య మనసులో మొలిచే ఆలోచనలకి - దాని వెనకనున్న వ్యక్తులు, సంఘటనలు గుర్తు వస్తున్నాయి. ఏదో నీరసభావం ఆవరించి బ్రీఫ్‌కేస్ బరువుగా తోచింది. తక్షణమే తన కాళ్ళపై తాను నిలబడలేనట్లనిపించి కూర్చోవాలనుకున్నాడు. హిగ్గిమ్ బాదామ్  స్టాల్ వద్దనున్న రైల్వే పారెల్ పెట్టెలపై కూర్చున్నాడు.

    జనం బిజీగా కదులుతున్నారు. 

    హిగ్గిమ్ బాదామ్ స్టాల్ వద్ద పుస్తకాలు కొంటున్న ఓ అమ్మాయిని చూడగా చలం పరిచయం గుర్తొచ్చింది. 

    "అదో ఆ పుస్తకాలు కొంటున్నదే ఆ అమ్మాయి కళ్ళు సరిగ్గా చూడండి. ఎక్కడ చూసుంటారో చెప్పగలరా?"

    "ఎక్కడో చుసినట్లు గుర్తు. కానీ ఎవరికి ఉన్నాయో తెలియదు" ఆ కళ్ళనే చూస్తూ అన్నాడు చైతన్య.

    చలం నవ్వుతో "చెబితే అవునంటారు. హిందీ నటి మధుబాల కళ్ళలా లేవూ? ఆ కళ్ళనెంతో లైక్ చేస్తాను. ఇప్పుడు మధుబాల సినిమాలే రావడం లేదు. ఆ కళ్ళను చూడక చాలా రోజులయింది. ఎంత అందమైన కళ్ళు!"

    ఆ అమ్మాయి మేగజైన్సు కొనుక్కుని వీళ్ళున్న సెకెండ్ క్లాస్ కంపార్టుమెంట్‌లోకి ఎక్కింది.

    చలానికి, చైతన్యకు ఎదురుగానున్న సీటులో కూర్చుంది. 

    ఆమె వద్దనున్న మేగజైన్సు అడిగి తీసుకున్నాడు చలం ఆమె కళ్ళనే చూస్తూ.

    ఆమె కళ్ళలో ఏదో ఆకర్షణ ఉంది. ఆమె కూడ ఎంతో అందంగా ఉంది. అందానికి తోడు సంస్కారం కూడా ప్రతిబింబిస్తోంది.

    రైలు రెండు స్టేషన్లు దాటింది.
    
    చలం, చైతన్య పిచ్చాపాటిలోకి దిగారు. చలం ఆమెను కూడ మధ్య మధ్యలో మాట్లాడిస్తున్నాడు.

    "చూడండి ఆ కొండల మధ్యనున్న పచ్చని బయళ్ళు. అక్కడ కాలం గడపగలిగితే ఎంత బాగుంటుంది? అందమయైన పరిసరాలలో ప్రాణం పోయినా ఫరవాలేదు!"

    "మీరు ఈస్తటిక్‌లా ఉన్నారు" నవ్వుతూ అంది.

    "సౌందర్యాన్ని ప్రేమించే వారిని ఎలా పిలుస్తారో అదే నేను. అన్నట్లు మీకో మాట చెబితే కోపగించుకోరు కదా!... మీ కళ్ళు మీరెప్పుడయినా చూసుకున్నారా?"

    "ఎదుటివారి కళ్ళలో తప్ప అద్దంలో చూసుకోలేదు. అద్దంలో నా వికృత స్వరూపమే తప్ప మరోటి కనిపించదు."

    "మీరు నిర్భయంగా మాట్లాడతారు!" చైతన్య ఆమె వైపు  ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు. 

    "నటించడం చేతకాని దాన్ని. ఇంతకూ మన పరిచయాలు కాలేదు."

    "ఇతని పేరు చైతన్య - ఇప్పుడే నాకు పరిచయమయ్యాడు. నా మానసిక స్థితిలాగానే నా పేరు చలం..."

    "విచిత్రం! నా పేరు చంద్రరేఖ!"   

* * *  

    కొద్ది నిముషాలలో రైలు వస్తుందని అనౌన్సు చేసారు. చైతన్య బలవంతంగా లేచి ప్లాట్‌ఫాం వైపు నడిచాడు. దూరంగా రైలువేసిన కేక వినిపించింది. 

    సాధారణంగా రైలు ప్రయాణం ఉత్సాహం ఉంటుంది చైతన్యకి. కాని ఈసారి మాత్రం అతనిలో ఏదో నిర్వేదం ఆవరించింది. సిక్స్త్‌సెన్స్ ఏదో ఉపశమనాన్ని పలుకుతోంది. కాని అదేమిటో ఊహించడానికి భయపడుతున్నాడు. చలానికి ఏమయ్యుంటుంది?

    ఆపదల్ని ఖరీదు చేయడంలో చలం అందెవేసినవాడు. మిత్రుల కోసం ఏమయినా చేయగలడు. నిస్వార్థంగా ఉండటం, జీవితాన్ని ప్రేమమయం చేసుకోవడమే ఈ అంధకార జీవితంలో కాంతి కిరణాలు. ఈ కాంతి కిరణాలు ఆ గాఢతను జీవితంలో క్షణికంగానైనా హృదయాన్ని తాకి అణువంత విద్యుత్తును కలిగించితే చాలు - అలాంటి అనుభూతులు తప్ప మరేవీ అతని గుండెకి తాకేవి కావు.

    జీవితాన్ని అసంతృప్తి, నటనలో గడిపి పొందిన పెదాలపైని చిరునవ్వులు జీవితంలో తృప్తభావననివ్వక ఇంకా అశాంతిపాలు చేస్తుంది.

    కోర్కెలు ఒక వ్యక్తి మనసులో జనించి అవి తీరకపోగా - అతనిలో  అలజడి జీవితం ప్రారంభమవుతుంది. ఎంత నొక్కిపెట్టినా అవి మనః పొరలలో చిక్కుకుని - ఎండల్లో ఎండి మాడిన గడ్డి వర్షంలో తలెత్తినట్లు - కొన్ని పరిస్థితులలో మళ్ళీ మొలకెత్తక మానవు. ఆశల్ని చంపుకోవడం మంచిదే. ఆశల్ని మనసులో పుట్టకుండా చేయడమే ఇంకా మంచిది.  

    నిజానికి వ్యక్తిలో కోరికలు సహజంగా నెరవేరేవే ఎక్కువగా జనిస్తుంటాయి. కాని వాటిలో ఎక్కువభాగం ఈ సంఘం, ఆచారాలు, కట్టుబాట్లు - వీటికే బలి అవుతుంటాయి. అతి సులభంగా నేరేరే ఆశలు ఏ విలువాలేని సంఘం కాలరాస్తే అతడిలో అరాజకత్వం తలెత్తుతుంది. అతణ్ణి లోకం శత్రువుగా భావిస్తుంది. జీవితంలో ఓడిపోయినవాడు ఒంటరిగా సంఘాన్ని ఎదిరించలేనివాడు ఓటమిని అంగీకరించి రాజీ కుదుర్చుకుంటాడు. అతడిని మాత్రం నీతిమంతుడంటుంది సంఘం. ఇలాంటి నీతిమంతుల సంఘంలో చలాని కన్నీ చూక్కెదురే. అలాటి ఈ సంఘంలో జీవించడం చేతకానివాడు చలం.

    చిన్నతనంలో తల్లిదండ్రులూ, కాస్త పెరిగాక స్కూలులో టీచర్లు, యవ్వనంలో సంఘం - ఎవరూ అతని 'స్వభావాన్ని' అర్థం చేసుకోలేదు. తన అంతరాంతరాలలో నిబిడీకృతమయిన స్వభావాన్ని చంపుకోలేదు. లోకం తనకు వ్యతిరేకత చూపుతున్నకొద్దీ ఇంకా తన స్వభావాన్ని ఎక్కువ చేసుకున్నాడు.

    తల్లిప్రేమ మధ్యలోనే కోల్పోయి ఇంట్లో అతని చేష్టలకు ఈసడింపునే పొంది సంఘానికి వ్యతిరేకుడయ్యాడు. ఆ వ్యతిరేకత పిల్లల పెంపకం నుండీ పెళ్ళిళ్ళ వరకు సాగింది. అతని వాదనను 'వ్యతిరేకత' అని చాలామంది అనుకున్నప్పటికి అది వ్యతిరేకత కాదు. తరతరాలుగా నాటుకున్న పాతకాలపు ఆచారాల్ని కాలరాయటమే!

    ప్రేమే అన్ని సిద్ధాంతాలకు మూలం. ప్రేమించటం కన్నా ముఖ్యం ఏదీ లేదు. జీవితానికి ఏదో ఓ రూపంలో ఉంటుంది ప్రేం.

    జీవితానికి ముందు అంధకారమే. వర్తమానం అంధకారమే. భవిష్యత్తు ఇంకా అంధకారమే. అలాంటి జీవితంలో కాంతిరేఖల్లా అక్కడక్కడ సౌందర్యం ప్రసాదిస్తున్న కాంతికిరణాలు ప్రేమ చల్లదనాన్ని నింపుకుని చలం జీవితంలో వెలుగు నింపాయి. అదే అతని సర్వస్వం జ్ఞాపకంగా దాచుకోగలిగిన నిధులు.

    జీవిత విధానంలో చాలనుకున్న అభిప్రాయాల్ని కాదని అతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది ఉషాదేవి. ఆమె వచ్చింతరువాతే చలం జీవితంలో కట్టుబాటుకి కొంత లొంగాల్సి వచ్చింది. కాని కాలక్రమంగా అతని స్వభావానుగుణంగా దాన్ని అతిక్రమించి పోయాడు. మళ్ళీ స్నేహాలు మొదలయ్యాయి. 

    తనకన్న ఇతరులెవరయినా చలానికి దగ్గరైతే ఓర్చుకోలేని గుణం ఈ సంఘం అనాదిగా ఈ స్త్రీలకిచ్చింది. ఉషాదేవి ఎంతో సహించినమీదట ఇంకా సహిస్తూ ఉండలేకపోయింది. తనకేం లోటు? అన్న ప్రశ్న ఆమెను వేధించసాగింది.

    వర్షంలో తలారబోసుకున్న చెట్లు కొమ్మల్లోంచి చుక్కలు రాల్పుతుండగా వాటిని అందుకుంటూ ఆనందించే చలాన్ని తిట్టలేక వర్షాన్నీ, ఆకుల్నీ తిట్టడం నేర్చుకుంది. 

    చలం ఇతరులనుండి పొందిదేమిటి? వాళ్ళిచేదేమిటి? ఆమె అర్థం చేసుకునే శక్తి ఉన్నప్పటికి మానిసిక భమ్రత హృదయం ఆ  శక్తిని హరింపచేసింది. ఈ విషయం చలం గమనించి కూడా ఏమీ చేయలేకపోయాడు. 

    ఎంతోమంది స్నేహితులు, స్నేహితురాళ్ళు అతని సిద్ధాంతాన్ని నమ్మారు. జీవితం యెడల అతనికున్న అభిప్రాయాన్ని చాలామంది ఒప్పుకున్నారు.

    జీవితపు విలువలను డబ్బు, ఆచారాల ఉచ్చుల్లో వేసి బేలగా చూస్తూ ఏడ్వడంకన్న వాటిని ఎదిరించడమే మేలు! 
 
    చలం గురించి ఆలోచించేవాడల్లా హైదరాబాదులో రైలు ఆగగగానే దిగాడు.
 
* * *
   
     చలం ఇంటిముందున్న మెట్లపై ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు. అక్కడంతా నిశ్శబ్దం ఘనీభవించినట్లు ఉంది.
    
    చైతన్య గబగబా లోనికి నడిచాడు. ఆ శబ్దానికి అక్కడున్నవాళ్ళు తలలు వెనక్కు త్రిప్పి చూసారు.
    
    మంచంలో నిశ్చలగ్రస్తుడైనట్లున్నాడు చలం. ఈ లోకాన్ని వదిలి వెళ్ళి పోతున్నానన్న గర్వం ఉందాముఖంలో.
    
    "అనుకున్నంత పని చేసావా చలం!" అస్పష్టంగా గొణిగాడు చైతన్య.
    
    ట్రంకుపెట్టెలపై సలీమా ఏడ్చి ఏడ్చి కూర్చుంది. గది తలుపు వద్ద సుజాత ఆమె భర్తా నిలబడి ఉన్నారు.
    
    రెండో గదిలో ఉషాదేవి తన ఐదేళ్ళ కొడుకు తలపై చేత్తోరాస్తూ ఉదాసీన గాంభీర్యాలతో నిలుచుంది.
    
    ఆమె మెల్లగా వచ్చి "ఆఖరి క్షణాల వరకు మీకోసం ఎదురుచూసారు. ఇదో ఈ ఉత్తరం ఇచ్చారు" అంటూ ఒక ఉత్తరం అందించింది.
    
    అప్పుడే చంద్రరేఖ ఆదరాబాదరాగా వస్తూ కనిపించింది.

    హల్లో మిత్రులు మౌనంగా దుఃఖిస్తున్నారు.

    చైతన్య ఇక దుఃఖం ఆపుకోలేక పోయాడు. చలం ఇక తమకు లేడన్న భావం క్షణక్షణం అధికమై హృదయాన్ని ఖండించేస్తోంది. కాని ఎంత చెప్పిన వినకుండా భార్యాపిల్లల్ని వొదిలి, పోవాలని పోయినందుకుగాను కాస్త కోపంగా ఉంది. అయినప్పటికీ చైతన్య ఓర్చుకోలేక పోయాడు. కళ్ళలోంచి నీళ్ళు ధారాపాతంగా కురవసాగాయి. చలం వద్దకుపోయి చేతుల్తో తాకి అతని గుండెకేసి తల బాదుకున్నాడు.

    "ఏం మునిగిపోయిందని ఇంత తొందరపడ్డావ్? మాకుకాక ఇంకెవరికి నీ అవసరం ఉందని వెళ్ళిపోయావ్? చూడు... ఇంతమంది నీకోసం..." వెక్కి వెక్కి ఏడుస్తూ మాట్లాడలేకపోయాడు చైతన్య.

    చైతన్య నెవరూ ఆపలేరు. ఆపాలన్న ధ్యాస ఎవరికీ లేదు.

    కాని సలీమా వచ్చి "చైతన్యగారూ! మీరే ఇలా ఐతే ఎలా చెప్పండి. జరగబోయేది ఆలోచించండి!" అతడి భుజంమీద చేయి వేసి అతినెమ్మదిగా అంది.

    చలాన్ని - బ్రతికున్నపుడు వెలివేసిన బంధువులు కొందరు వచ్చారు.

    "పాడె కట్టి, చిన్నాడితో కుండ మోయించి జరిపే చావు ఊరేగింపు నాకు వద్దు. టాక్సీ వెనుకసీట్లో పడుకోబెట్టి శ్మశానానికి తీసుకెళ్ళి నవ్వుతూ కాల్చేయండి - అదే నాకు ఆనందం." ఇది చలం కోర్కె. 

    "చూడు ఉషాదేవీ! బొట్టు, పూలు, గాజులు నన్ను కట్టుకున్నపుడు నేనివ్వలేదు. నేను పోయింతర్వాత కూడ తీసెయొద్దు. మంగళ సూత్రం అంటావా అదొక ఆభరణం మాత్రమే. నా గుర్తుగా అలాగే ఉండనీ..." 

    చలం మాటలు గుర్తొచ్చి ఉషాదేవి దిగులుగా నిశ్వసించింది. ఎంతయినా ఆమె ఈ సంఘంలోని స్త్రీయే. ఎంత కల్పిత ధైర్యంతో గుండె నిబ్బరంగా ఉన్నప్పటికీ అది స్థిరంగా నిలువడంలేదు. ఉషాదేవి హృదయం బాధతో మూలిగింది. చలం ఆమె అంగీకారంతోనే తన భవితవ్యాన్ని నిర్మించుకున్నాడు. అప్పుడు తానేమీ అడ్డు చెప్పలేకపోయింది. ప్రతిక్షణం స్వాతంత్ర్యం కోరే చలానికి తాని అడ్డంకియై జీవించడం ఒప్పుకోదు. అలా జరగటం కన్న తానూ నిష్క్రమించడం మంచిదే. కాని ఎందుకో ఆ ఆలోచనే చేయలేక పోయింది. లోకం మీద కాంక్ష తీరకనా? జీవితం మీద మమకారమా? ఆశలు ఆనందం ఉడిగిపోయిన ఈ జీవితం తనకేం ఒరగపెడుతుందని.

    తనకు తెలియకుండా కారిన కన్నీళ్ళు బాబు తలపై పడగానే అతను తల్లి చేతుల్ని పట్టుకుని ఆమె కళ్ళలోకి చూసాడు తల పైకెత్తి.

    ఉషాదేవి చాలారోజుల తదుపరి వచ్చిన బంధువులను చూస్తున్నది.

    బాబు - తల్లి చూస్తున్న వైపు దృష్టి సారించాడు. వాళ్ళెవరో అతనికి తెలియదు. వాళ్ళంతా ప్రశ్నార్థకంగా గోచరించారు.

    ఉషాదేవి బాబుని ఇంకా తనకి దగ్గరా లాక్కుంది.

    దహనానికి సన్నాహాలు అయ్యాయి.

* * *
 
 
    చితి మంటలు మండి ఉధృతం తగ్గింది. మంటలు చల్లారి నిప్పులు వెలుగుతున్నాయి.
    సంధ్య ఎరుపు తగ్గుతోంది.
 
    చితికి కాస్త దూరంగా చైత్యన్య ఉత్తరం చదువుతూ కూర్చున్నాడు. అక్షరాలన్నీ గెలికినట్లుగా, బలహినంగా పడిపోయినట్లున్నాయి.
    చైతన్యా!
 
    ఎందరో స్నేహితులున్నారు.   అందరికన్న  ఆప్తుడివి నీవు. నన్ను కొంతవరకైనా అర్థం చేసుకున్నది నువ్వొక్కడివే! ఇంతకాలం జైవించి జీవితాన్ని అర్థం చేసుకోకుండానే పోతున్నాను.
 
    జీవించడం ప్రేమించడానికే అని నమ్మి ఎంతోమంది ప్రేమను పొంది, ఎందరినో ప్రేమించి జీవితాన్ని ఆనందించాను. ఆనందించడానికి అడ్డున్న ప్రతిదాన్ని కాలదన్నాను. ప్రేమించే భార్య, కొడుకు - నన్ను అభిమానించే స్నేహితులు, ఆప్తులు ఇంతమంది ఉన్నా ఇంకా నాకేదో కావాలని - అదే నన్ను ఫెమినిస్టును చేసింది. నా ఆందోళిత హృదయం దాని స్పందనలు, ఆశలు నీకు అర్థమయ్యే ఉంటాయి. 

    కాని చైతన్యా! ఈ హృదయమంత విచిత్రమైంది మరేదీ లేదు. ఏది ఎందుకు కావాలంటుందో తెలియదు. మానవ స్వభావాన్ని అతిక్రమించి, కాలమాన పరిస్థితులను అధిగమించిన కోర్కెలను సైతం కోరుతుంది. కొన్ని తీరవు. ఆ కొన్నింటిలో ఏదో ఒక దాన్ని కావాలని పట్టుదలగా ఉంటుంది. అది లభించకుంటే అతని జీవితానికే ప్రమాదం వాటిల్లే ప్రభావం చూపుతుంది. నా జీవితంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఎంతో మంది స్నేహితురాళ్ళు, భార్య ఉన్నప్పటికీ వాళ్ళ ప్రేమను పొందుతున్నప్పటికి పురుషుడి జీవితంలో ఒకే ఒక స్త్రీని హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు. ఆమే అతని జీవిత లక్ష్యం. నా జీవితంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. ప్రసూనైతే నీకు తెలుసు కదూ...

    ఎంతో రాయాలని కూర్చున్నానా ఇదో కరెంటు ఇప్పుడే పోయింది. అర్థరాత్రయింది. లేవలేను. లేచి క్రొవ్వొత్తి తెచ్చి ముట్టిస్తే చప్పుడుకు ఉషాదేవి లేవచ్చు. ఆమె ఇప్పుడే పడుకుంది. అందుకే రేపు ఉత్తరం ముగిస్తాను.

    చివరి లైన్లు తెల్లకమ్మపై చిందర వందరగా ఉన్నాయి. ఆఖరి పేజీ చీకటిలో రాయడం మూలాన అక్షరాలు కొన్ని చిన్నగా, పెద్దగా ఉన్నాయి.

    చైతన్య భారంగా నిశ్వసించాడు. ప్రసూన గుర్తొచ్చింది. చెప్పాలనుకున్న విషయాన్ని చలం పూర్తిగా చెప్పలేదు. అసలేమైంది? ఆలోచిస్తుండగా చంద్రరేఖ వచ్చి "వెళ్దాం పదండి. చీకటి పడింది" అంది.

    చితివైపు చూస్తూ చలం చెప్పని విషయాన్ని గూర్చి ఆలోచిస్తూ చైతన్య నిర్లిప్తంగా లేచాడు.

* * *

    రైలు వేగానికి దూరంగా కొండలు చిన్నగా కదులుతున్నాయి. చైతన్య కిటికీ ప్రక్కన కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు.అతని కళ్ళలో నీళ్ళు ఎండి పోయాయి. గుండె రోదించి రోదించి చల్లబడింది. చలాన్ని గూర్చిన  ఆలోచనలు గుండె అట్టడుగున పడిపోయాయి.

    మరో గంట తదుపరి రైలు వరంగల్లులో ఆగింది.

       కాఫీ త్రాగుదామని కిటికీలోంచి బయటకు చూసాడు. దూరంగా స్టేషన్లోకి వస్తూ ప్రసూన కనిపించింది. చైతన్య లేచి వేగంగా ఆమెను సమీపించాడు - ఆమెనుండి ఏమో తెలుసుకోవాలన్న ఆతృతతో.
    
    చైతన్యను చూసి "నమస్తే..." అంది.
 
    ప్రతినమస్కారం చేసి "బాగున్నారా" అన్నాడు.
 
    "ఆ! మా వారిని ట్రెయిన్లో పంపడానికి వచ్చాను. అదో వారు మిత్రులతో మాట్లాడుతున్నారు."

    "మీకు తెలుసా చలం..."

    "ఏమైంది? మొన్ననేగా ఉత్తరం రాసాడు - చాలాకాలం తదుపరి. ఆరోగ్యం బాగోలేదని, ఒకసారి వచ్చి కలువమని. చిన్నతనం నుండి స్నేహంగా ఉన్నంత మాత్రాన చలం నన్నెందుకు అర్థం చేసుకోలేదో? ఐనా నే నెలా వెళ్ళగలను చెప్పండి? ఇంకా చలానికి గుర్తున్నానన్న మాట! కలిసి చదువుకునే రోజుల్లో ప్రేమించానంటూ, తనను అర్థం చేసుకోమని కొన్ని ఉత్తరాలు రాసాడు. నవ్వుకుని చింపేశాను. అంతకంటే ఏం చేయను? నాకీ ప్రేమల మీద నమ్మకం లేదు. ఆ మాటే చలానికి చెప్పాలనుకున్నాను. కాని చెప్పలేదు. అతని ఉత్తరాలు చదువుతుంటే గమ్మత్తనిపించేది... అన్నట్లు మా వారికి బ్రిగేడియర్‌గా ప్రమోషన్ వచ్చింది. వారు బార్డర్స్‌కి వెళ్ళిపోతున్నారంటే నా కెలాగో ఉంది..."


    ప్రసూన వైపు అవాక్కయిపోయి చూస్తున్న చైతన్యను మాటలు ఆపి, "చలం బాగున్నాడా? మీరు అక్కడ నుండే వస్తున్నారా ఏంటి?" ఎందుకో అనుమానంగా అడిగింది.
 
    "నీ ప్రేమను పొందలేక జీవితాంతం అశాంతితో గడిపి తుదకు నీ జ్ఞాపకంతోనే కన్ను మూశాడు. ఆఖరు సారిగా చూడాలనుకున్న ఆ భాగ్యానికి కూడా నోచుకోలేదు. చలం చచ్చిపోయాడు. స్నేహితులం మేమంతా వాడి శవాన్ని కాల్చాం - నువ్వు ఇంకా వాడి ఆత్మని కాలుస్తున్నావ్!" అని అరవాలనుకున్నాడు.
 
    ఇంతలో "డియర్..." అంటూ ప్రసూన భర్త వచ్చాడు.
 
    "చైతన్యగారూ! వీరు నా ..." భర్తను పరిచయం చేయబోయింది.
 
    రైలు కేకేసింది.
 
    చైతన్య ఆ మాటలు వినకుండానే "వెళ్లొస్తా" నంటూ గబగబా నడిచాడు.
 
    రైలు కదిలింది.
 
    కదులుతున్న రైల్లోకి దూరాడు.
 
    ప్రసన్న చూపు చైతన్యనందుకో లేదు.
 
    అతనిలో విచిత్రమైన విరసానుభూతి నిండింది. తన సామాను తెచ్చుకోవాలన్న తాపత్రయమేదీ లేదు. ఎవరిదో సామానుపై కూలబడ్డాడు.
 
    ఉషాదేవి, చంద్రరేఖ, చలం, ప్రసూన - ఆల్బం ఫోటో పేజీల్లా ఆలోచనల నుండి తొలగిపోతున్నారు.
 
        "ఎంతోమంది స్నేహితురాళ్ళు, భార్య ఉన్నప్పటికి వాళ్ళ ప్రేమని పొందుతున్నప్పటికి - పురుషుడి జీవితంలో ఒకే ఒక స్త్రీని అమితంగా, హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు. ఆమే అతని జీవిత లక్ష్యం!" అన్న చలం మాటలు గుర్తొచ్చాయి.
 
    "అవును. చలం! నువ్వు చెప్పింది నిజం! కాని ఆ స్త్రీ నీకు ప్రసూన కావటం, నాకు ఉషాదేవి కావడం దురదృష్టం. ప్రేమ మహోన్నతమైంది. చచ్చిపోయి నువ్వూ ప్రేమిస్తున్నావు. బ్రతికి నేనూ ప్రేమిస్తున్నాను. ప్రేమించడం నేరమైతే నీకంటే నేనే ముందు చచ్చిపోయేవాణ్ణి. ప్రేమించడం తపస్సులాంటిది. కాని కొందరికి ఫలం లేని తపస్సు. చనిపోయినా నీవు ప్రసూన ప్రేమ పొందలేవు. బ్రతికున్నా నేను ఉమాదేవి ప్రేమను పొందలేను.
 
    పురుషుడి జీవితంలో ఒక స్త్రీను అమితంగా ప్రేమిస్తాడు. నిజమే! కాని ఆమె 'స్వప్నం' కారాదు! కాకూడదు!" గొణుక్కున్నాడు చైతన్య.
 
(యువ మాస పత్రికలో ప్రచురితం)
Comments