చల్లారిన పాలు - ఆచంట హైమవతి

    సూరిశాస్త్రిగారు నిశ్చయించిన ప్రకారం కొన్ని తతంగాలు ముగించి టూకీగా పెళ్ళి అయిందనిపించారు భవానికి. మనస్సులో ఒక విధమైన భయం ఏదో తప్పుచేస్తున్న భావం ఆమెను కృంగదీస్తున్నాయి. స్త్రీ-పురుష సమానత గురించి కాలేజీలో గొంతు చించుకుని వాదించి గెలిచి బహుమతులు పొందిన భవాని ఇప్పుడీవిధంగా దిగులుపడే సమయం ఆసన్నమౌతుందని ఏనాడూ అనుకోలేదు.

    భవాని హరీష్‌ని ప్రేమించి పెళ్ళిచేసుకున్నప్పుడు అందర్నీ ఎదిరించి చాలా ధైర్యంగా ముందడుగేసింది. మిత్రులందరూ అభినందన పరంపరలతో ఆమెను ఆకాశాని కెత్తేశారు. ఏదో సాధించేసినట్లు ఆనందంతో ఉక్కిరిబిక్కిరై పోయారా దంపతులు.
    ఇద్దరూ తమ చదువులకు తగిన ఉద్యోగాలలో చేరారు. ఆనందోత్సాహాలతో రోజులు గడిచిపోసాగాయి. మూడేళ్ళపాటు పిల్లలు వద్దనీ, ఈలోగా తగినంత వెనకేసి, అప్పుడు 'అమ్మా నాన్నల' మౌదామని నిర్ణయించుకున్నారు... మూడేళ్ళూ మూణ్ణిద్దర్ల మాదిరిగా పరిగెత్తింది కాలం.

    ఇద్దరూ ఉద్యోగాలలో పై పై స్థాయిలకి ఎదిగారు. పొదుపుగా సంసారం నడుపుకుంటూ తగినంత నిలవచేసుకున్నారు కూడా!
    వ్యతిరేకత సూచిస్తున్నా కూడా అతని తల్లిదండ్రుల్నీ, ఆమె తల్లిదండ్రుల్నీ కలిసి, కొంత సమయం గడిపి వస్తూనే ఉన్నారు. వాళ్ళు సూటి మాటలని బాధించినా పట్టించుకునేవారు కాదు.
    ఇక జాగ్రత్త పడటం మానేసి,  సంతానాపేక్షతో నిరీక్షించ సాగారు. తమ పిల్లల వల్లనైనా పెద్దవాళ్లతో సయోధ్య ఏర్పడుతుందని కూడా వారు ఆశించారు. అన్యోన్యాను రాగాల నిధిలా వారి జీవితం అలరారుతోంది. మధ్య మధ్య హరీష్‌కి ముంబై, ఢిల్లీలకు 'కేంప్'లు తప్పని సరౌతున్నాయి.

    కేంప్ ముగించుకుని ఆవేళ ఇంటికి రాబోతున్న హరీష్‌ని స్వాగతించేందుకు ఆత్రపడుతోంది భవాని. భర్తతో కలిసి ఈసారి కేంప్‌కి వెడదామనుకున్న భవాని తప్పని సరైన మీటింగ్ ఉండటంతో ఆగిపోయింది.
    భర్త రాకకై నిరీక్షిస్తున్న భవానికి గుండెలు పగిలే రైలు ప్రమాద వార్త అందింది.     "మామాట వినలేదు...మాబాగా అయిందిలే" అని ఇరువైపుల వారూ అనలేదు. అనుకోలేదు. హరీష్ తల్లిదండ్రులు తాము దుఃఖపడుతూనే భవానిని అక్కున చేర్చుకున్నారు. భవాని తల్లిదండ్రులు కూడా కూతురి దుఃఖాన్ని పంచుకుని, ఊరడించి, బాసటగా నిలిచారు. ఇరువైపులవారు మైత్రీభావంతో మెలగి భవానికి కొంత మనోధైర్యం కలిగించారు.

    చాలా భారంగా రోజులు నెడుతోంది భవాని. పెద్దవాళ్ళు పనికి వెళ్ళమనీ, కొంతైనా హృదయవేదన మరువగలవనీ చెప్పారు. భవానీ ఎవరినీ ఎదిరించి మాట్లాడ లేదుగాని మూడు నెలలు శలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది.
    హరీష్ జీవితాన్ని అలవాటు చేసుకొనేందుకన్నట్లు మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. నిత్యం కన్నీరు మున్నీరు కావటం లేదుగానీ ఒకవిధమైన నిర్వేదం ఆవహించిందామెను. మూణ్ణెల్లూ పూర్తయేసరికి కొంచెం మామూలు ప్రపంచంలో పడసాగిందామె.     "మూడునెలలు... మూణ్ణెల్లనుంచీ...?" అకస్మాత్తుగా వచ్చిన ఒక స్మృతి ఆమెను ఉలిక్కిపడేలా చేసింది. ఒక విధమైన ఆనందం ఆమెను కమ్మేసింది. ఆరోజే వెళ్ళి లేడీ డాక్టరుని కలిసింది భవాని. కొన్ని వైద్య పరీక్షల అనంతరం ఆమె ఊహ నిజం కాదని డాక్టరు తేల్చి చెప్పింది. మెడిటేషన్, కొన్ని వ్యాయామాలు చెయ్యమని సూచించింది.     అంతరాంతరాలలో బయల్దేరిన ఆలంబననిచ్చే ఒక సంతృప్తికరమైన భావం అంత హఠాత్తుగానూ అంతరించిపోయింది. మళ్ళీ సంపూర్ణమైన వెలితి ఆమెను క్రుంగతీయసాగింది. ఆమెకు తెలియకుండానే తన చుట్టూ వున్నవారే కాకుండా వేరే రకమైన బంధం, తోడు తనకి అవసరమేమో అనిపించింది. ఆ భావం కలగటంతో తను అంత స్వార్థపరురాలా? హరీష్‌పై తన ప్రేమ ఇంత చవకైనదా? తాను ఇంత చపలా? తనని తానే తిట్టుకుంటూ కుమిలిపోయిందామె.

    "ఊహూ...! తనింత బేలగా ఉండరాదు. స్థిరంగా ఉండాల"ని గట్టి ప్రయత్నం చేస్తూ ఉద్యోగంతో బాటు దీనజన సేవా కార్యక్రమాల్లో మునిగిపోయింది.
    ఎడతెరిపిలేని కార్యక్రమాలతో రోజులు మళ్ళీ గబగబా గడవసాగాయి. సంవత్సరం పూర్తయి హరీష్ పుణ్య కార్యాలు కూడా జరిగిపోయాయి. హరీష్ పేరు మీద ఇద్దరు పేద విద్యార్థులకి 'డిగ్రీ' వరకు 'స్కాలర్‌షిప్' ప్రకటించి, దానికి అవసరమైన ధనం ఒక సంస్థకి అప్పజెప్పింది భవాని.     ఈమధ్య హరీష్ మిత్రుడు వామనమూర్తి పరిచయం అయ్యాడు భవానికి. అతను కొన్నేళ్ళు నార్తులో ఉండి, అతి ప్రయత్నం మీద సౌత్‌కి రాగలిగాడు. అతను ధనం మీద కాంక్ష కొంత తగ్గించుకుని స్వంత ప్రాంతం దక్షిణాదికి వచ్చేశాడు.
    అతని అభిప్రాయం చాలా నచ్చింది భవానికి. అతనితో మాట్లాడుతున్నంతసేపు ఆమె మనసుకి ఊరటగా ఉండటం గ్రహించింది. అతనికి దగ్గర కాకూడదనే ఆమె ఆలోచన రోజురోజుకీ బలహీన పడటం కూడా ఆమె గమనిస్తోంది. కానీ...కానీ...? ఎలా...? ఈ ఆకర్షణ నుంచి బయట పడటం?  

    ఎన్ని పనుల్లో మునిగిపోయినా తరచూ ఏదో ఒంటరితనం వేధిస్తుందాయే. చాలా విషయాల్లో తనకు సహాయ సహకారాలందిస్తున్న వామన మూర్తి రాకపోకలు ఆమెను స్పందింపజేస్తున్నాయి.
    అందరి ఎదురుగానే అతనితో భవాని చర్యలు సామాన్యంగానే కనిపించిన ... భవాని వయసులో ఉండటం, వామనమూర్తి హరీష్‌కి మిత్రుడు...అతడి వయసువాడే కావడం... ఇవన్నీ తేలికగా తీసుకోవలసిన వాటిగా కనిపించటంలేదు.     వామనమూర్తి సత్శీలుడే! భవాని నిప్పులాంటి మనిషే! కానీ...లోకం ఊరుకోదుగదా! 'పోదూ పాడులోకం'అనుకోవటం సులభమేగాని... దాని నిష్ఠూరాన్నీ, నిందల్నీ భరించటం అంత సులభం కాదు.     భవాని అత్తమామలు ఓరోజు ఏదో సందర్భం తెచ్చి వామనమూర్తి గురించి భవాని అభిప్రాయం అడిగారు. చాలా అనునయంగానూ, మరెంతో మృదువుగానూ ఉన్నాయి వారి కంఠాలు.
    ఎటూ చెప్పలేక...వచ్చిన అవకాశం వదులుకోలేక చాలా గుంజాటన పడింది భవాని. "హరీష్! నువ్వెళ్ళిపోయి నన్నెలాంటి స్థితిలో పడేశావ్?" ఆక్రోశించింది భవాని మనస్సు. గుండెల్లోంచి దుఃఖం తోసుకొచ్చింది. అక్కడే కూలబడి ఎక్కెక్కి ఏడుస్తూ ఉండిపోయింది భవాని.

    భవాని అత్తగారు, కోడలి వెన్ను సవరిస్తూ తను కూడా దుఃఖించింది. కొంత సేపటికి తేరుకుని, "భవానీ! ద్వితీయ వివాహం తప్పని మేము అనుకోవటం లేదమ్మా! అతడంటే నీ కిష్టం అయితే మీ మామయ్యగారు అతనితో మాట్లాడతారు. నువ్వింకా చిన్నదానివి...తోడు కోరుకోదగిన వయస్సే నీది. దీని గురించి ఎవరికీ భయపడనవసరం లేదు. మనస్సు కుదుట పరచుకుని నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయానికిరా! నీకు ఒక తోడు అవసరం. నువ్వు నిశ్చింతగా ఉంటే హరీష్ ఆత్మకూడా శాంతిస్తుంది. మాక్కూడా మావల్ల నీకు అన్యాయం జరగలేదనే సంతృప్తి ఉంటుంది. ఇది మీ మామయ్య అభిప్రాయం కూడాను" స్పష్టంగా చెప్పింది భవాని అత్తగారు.
    "చూడు తల్లీ! పోయినవాళ్లకోసం బతికున్న మన జీవితాలు దుఃఖమయం చేసుకుంటే - ఆ పాపం కొంత ఆ పోయినవాళ్ళ మార్గానికి ఆటంకం కావచ్చు. ఇదీ నా అభిప్రాయం" అన్నాడాయన శాంతంగా.

* * * * *
    
    అందరికీ అంగీకారం అయింది. "నా కిదేగా మొదటి పెళ్లి? అన్ని ముచ్చట్లూ జరిగి తీరాలి" అని వామనమూర్తి అనలేదు. పూర్వంలాగా కాకుండా ఈసారి పెద్దల మాట తల దాల్చదలచుకొంది భవాని. హరీష్ తండ్రికి ఏనాటి నుంచో గురువు స్థానంలో ఉన్న సూరిశాస్త్రి గారు నిశ్చయించిన ప్రకారం కొన్ని తతంగాల అనంతరం టూకీగా పెళ్లి జరిగింది భవానికి.
    భవాని శాంత గంభీరంగా ఉంది. అత్తగారు, తల్లి భవానిని సామాన్యంగా అలంకరించి, పాలగ్లాసు చేతికిచ్చి గదివైపు నడిపించబోయారు. భవానిలో ఏదో చెప్పలేని ఉదాసీనం.     "మీరు వెళ్లండమ్మా! కొంచెం సేపట్లో నేనే వెడతాలే!" అంది భవాని.     ఆమె మాట కాదనటానికి కారణం కనబడలేదా ఇద్దరికీ. మెల్లిగా ఆమె భుజం తట్టి, ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోయారు.     వాళ్లిద్దరూ వెళ్లిపోయాక ఆమెలో ఆందోళన మొదలైంది. తాను మళ్లీ పెళ్లి చేసుకోవటం సమంజసమేనా? ఇలా చేసుకున్నందుకు మున్ముందు పశ్చాత్తాప పడాల్సి వస్తుందా? లేదు... పెద్దవాళ్లు కూడా ఆలోచించి చేశారీ పెళ్లిని. తాను తొందర పడిందేమీ లేదిందులో... స్థిరంగా అనుకొందామె.     "ఓహ్...! ముందరే అన్నీ నీకలవాటేగదా! నాకంటే మొదటిసారి గానీ, హరీష్ ఎలా వాటేసుకొనేవాడు...? ఇలాగేనా? లేక ఏరి కోరి మరీ చేసుకున్నావటగదా అతన్ని? మోజు తీరక ముందే పాపం! ప్చ్...ఏమిటలా చుర చుర చుర చూస్తున్నావ్? ఇంతోటి నీ అంత పతివ్రత చూపులకీ నేను భస్మమై పోతాననుకున్నావ్? హ్హా...హ్హా...హ్హా హరీష్ లాగే నవ్వుతున్నానా?"     "ఛీ...హరీష్‌కీ మీకూ పోలికా? హరీష్ ఎంత సున్నితుడు? ఎంత హుందాగా ఉండేవాడు?"     "ష్ష్...ఎక్కువగా మాట్లాడకు. జీవితం వ్యర్థమైపోయి, వలపుల కోరికల్లో కొట్టుకుపోకుండా పెద్దమనసుతో నిన్ను పెళ్ళాడాను. నీ పొగరు, డాబు నాదగ్గర చూపించకు. నాకనుకూలంగా... అంటే కుక్కిన పేనులా పడి ఉంటే సంసారం సక్రమంగా సాగుతుంది. గుర్తుంచుకో! హరీష్ తల్లిదండ్రులూ, నీ తల్లిదండ్రులూ మనశ్శాంతిగా బతకాలంటే నువ్వు అణిగి మణిగి ఉండి తీరాలి...లేదా..."

    తన సంగీతంతో టైము తెలియజేసింది గోడ గడియారం. "అరే... అప్పుడే నేనిక్కడ కూర్చుని అర్ధగంటైందా? నేనింకా ఇక్కడే ఊహల్లో చిక్కుకుని ఉండిపోయానా? అయితే - ఇంకా నిష్ఠూరపు సంభాషణ మొదలు కాలేదన్న మాట. ఊహల్లోనే ఇంత ఘాటుగా ఉంది...ఇంక...?
    పక్కన కిటికీలో తను పెట్టిన గ్లాసెడు పాలు చల్లారిపోయాయి... తన జీవితంలాగే! ఇప్పుడేమిటి చెయ్యటం? లోపలికి వెళ్ళటానికి మనస్కరించటం లేదు. ఇక్కడే అలాగే కూర్చోటానిక్కూడా ఇష్టం కలగటం లేదు. లోపల అతను ఏం చేస్తున్నాడు?     తన కోసం నిరీక్షిస్తున్నాడా? తనకోసం ఆతృతగా వేచిచూచేటంత ఇష్టం తన మీదుందా అతనికి?...ఏమో...ఉండే ఉండచ్చు! హరీష్‌ని ప్రేమించినంతగా ఇతణ్ణి తను ప్రేమించగలదా? ఏమో...!
    తను ఇలా ఆలోచనల్లో కొట్టుకుపోతుంటే అతడు హాయిగా నిద్రపోతున్నట్లున్నాడు.
    వామనమూర్తి చాలా మర్యాదస్తుడనీ, మనసున్న మనిషనీ తనకు తెలుసు. మరి!? ఎందుకీ జాప్యం?!...పడాల్సిన వివాహబంధం పడనే పడింది. రోటిలో తలపెట్టడం జరిగే పోయింది. ఇంక రోకటి పోటుకి వెరవటం ఎందుకు?
    వామనమూర్తికి తల్లిదండ్రుల్లేరు. అరుదుగా రాకపోకలు జరిపే ఒక అక్కగారుంది. ఆమె పెళ్ళికి వచ్చి పెళ్లయిన వెంటనే వెళ్ళిపోయింది. "నాలుగు రోజులుండే వీలు లేదు నాకు. అత్త మామ ఒంటరిగా ఉండలేరు. వెంటనే వెళ్ళాలి" నచ్చచెప్తున్నట్లాందామె. ఆమె భర్త బావమరిదిని అభినందించి, తామిద్దర్నీ ఆహ్వానించి వెళ్ళాడు. ఆమెకు తగినంత ముట్టచెప్పాడు వామనమూర్తి. తన చేత బట్టలు కూడా పెట్టించాడు... తన తమ్ముణ్ణి అప్పచెప్తున్నట్లు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిందామె.     తనవాళ్ళందరూ కూడా వామనమూర్తికి తనను బాగా చూసుకొమ్మనీ, బాధపడ్తున్న మనిషి కనుక ఓర్పుగా చూసుకోవాలని బాగా చెప్పే వుంటారు. వాళ్ళ మాటల్లో ఆ విషయం చూచాయగా తెలిపింది

    లేచి నుంచుంది భవాని. ఎంత ప్రయత్నించినా గదివైపుకి అడుగులు పడటంలేదు. సరే...ఎంతాలస్యంగానైనా లోపలికి వెళ్లక తప్పదుగా.
    "ఇంతాలస్యం ఏమిటి? కూపం లాంటి ఈ గదిలో...పాత ఫ్యాన్ మోతలో నీకోసం ఎదురుచూడాలా? పాతభర్తతో గడిపిన మొదటి రోజు స్మృతులతో ఉక్కిరి బిక్కిరౌతూ ఉండి వుంటావు కదూ! అవును, నిజమే గదా! వాడు...ఆ హరీష్ అందగాడు...నేను...?"     "మీరందగాడు కాదని నేననలేదే? మీరిలా ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్సుతో నన్ను అనుమానిస్తున్నారు. అస్తమానం మిమ్మల్ని మీరు హీనపరచుకుంటున్నారంతే. హరీష్ కంటే మీరొక చాయ తక్కువైనంత మాత్రాన అందంగా లేరని అర్థమా?"     "అంటే...నేను హరీషంతటి వాణ్ణికాదని తేల్చేశావన్నమాట. నా అందం మీద నీకెంత చులకన?" కళ్ళెర్ర చెశాడు వామనమూర్తి.
    "హరీష్ సంగతెందుకు మధ్యలో...నేను మిమ్మల్నెంత గౌరవించినా మీరు నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. అవకాశాన్ని ఆసరాగా తీసుకుని భార్యల్ని ఇలా వేధించే  స్థితిని పూర్వం కంటే తగ్గిందని కొందరితో నేను వాదిస్తుండేదాన్ని. కానీ ఏమాత్రం ఆ వేధింపులు తగ్గలేదని, ఇంకా విజృంభిస్తాయని అర్థమౌతోంది. ముందు ఇష్టపడి - ఏదో ఆశించి చేసుకోవటం...తర్వాత పరిపరివిధాల ద్వేషించి వేధించటం" వెక్కివెక్కి ఏడవసాగింది భవాని.

    మళ్ళీగోడ గడియారం సంగీత మాధుర్యాన్నందిస్తూ సమయపు ఉనికిని తెలిసింది... "అయ్యో నేనింకా ఇక్కడే ఉన్నానా? ఇదంతా...ఉఠ్ఠి ఆలోచననేనా." ముందు ఆశ్చర్యం తర్వాత నిరాశ ఆమెను కృంగదీశాయి. 

    జీవితాన్ని సవాలుగా తీసుకునే తన స్వభావం ఇలా మారిపోతోందేమిటి? తను ఇంత పిరికిదా? లోకరీతిలో ఎవేవో ఊహల్ని పేర్చుకుంటూ ముందే మనస్సు కలత పెట్టుకుని వేగిపోవటం ఎందుకు? 

    తను, హరీష్ గడిపిన కమ్మని జీవితం గురించి ఇతడు ఈర్ష్యపడి ఏదైనా గొడవ చేస్తే - తను ఓర్పుగా సర్దుకుపోయి "మీరూ నాకు హరీష్ కన్నా ముఖ్యులే ఇప్పుడు" అనే సంగతి ప్రవర్తన ద్వారా తెలిపితే సరి. అంతే కానీ ఇలా బెదిరిపోయి అతడికి దూరం కావటంలో అర్థం లేదు. ధైర్యం అవలంబించక తప్పదు.  

    రుమాలుతో కళ్లు తుడుచుకుంటుండగా గది ద్వారం మీద పడిందామె దృష్టి. వామనమూర్తి తననే చూస్తుండటం గమనించింది భవాని... ఎంతసేపయింది అతనక్కడికి వచ్చి? కొంచెం కంగారు పడి సర్దుకుంది. తలొంచుకుని నెమ్మదిగా వెళ్లి అతనికి సమీపంగా నిలబడింది. 

    గదిలోకి రమ్మని చెయ్యి చూపి ఆహ్వానిస్తూ భవాని చేతిలోని పాలగ్లాసు అందుకున్నాడతను. 'చల్లారిపోయాయి...'భవాని స్వరంలో బరువు ధ్వనించింది.
    "ఇది వేసవి గదా! చల్లని పాలు త్రాగితే చాలా బాగుంటుంది." కొన్ని అతను త్రాగి గ్లాసు భవానికిస్తూ "త్రాగి చూస్తే నామాట అబద్ధం కాదని తెలుస్తుంది." అతను 'నువ్వు' అనీ,'మీరు'అనీ అనకుండా మాట్లాడటం భవానిని ఆకర్షించింది.

    తలుపు వేసి బోల్ట్ పెట్టాడతను. "పూర్వకాలపు పెద్దమంచం. ఇరుకు కాదు గనక చక్కగా సరిపోతుంది. మనిద్దరం దేనికీ తొందర పడేంత చిన్న పిల్లలం కాము. మనస్సు సేద తీరి ఒక స్థితికి వచ్చాకే దాంపత్యంలోకి అడుగేద్దాం. పెద్దవాళ్లనీ, వాళ్ల ప్రేమల్ని శ్రద్ధగా కాపాడుకుందాం. మనో  వాక్కాయ కర్మలా మనం ఒకరికొకరం తోడై నిలుద్దాం. కష్టసుఖాలనూ, వేదన - సంతోషాలను సమంగా పంచుకుందాం. ఓ.కే.? గుడ్‌నైట్" చిరునవ్వుతో తన మాటలు పూర్తి చేసి అటు తిరిగి పడుకున్నాడు వామనమూర్తి.

    కృతజ్ఞతానందాలు కుదిపెయ్యగా కళ్ల నిళ్లొచ్చాయి భవానికి. ఇందాకా దిగులుతో దుఃఖం వస్తే...ఇప్పుడు ఆనందంతో కన్నీళ్లొచ్చాయి ."నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి" అనే పాట గుర్తొచ్చింది భవానికి.
    ఇతని పేరు వామనమూర్తే అయినా మనోమూర్తి 'వామనం'కాదు. ఇతడు మానసికంగా 'త్రివిక్రముడే' సంతృప్తిగా అనుకుంది భవాని.
(మల్లెతీగ సెప్టెంబరు 2009 సంచికలో ప్రచురితం)
Comments