చంద్రుడు గీసిన బొమ్మలు - భగవంతం

    చల్లగాలి చర్మాన్ని దీవిస్తోంది. వైశాఖ మాసపు పున్నమి వెన్నెల్లో డాబా మీది అద్దె గది ముందు చాప మీద ఒంటరిగా పడుకుని చాలాసేపటి నుండి ఆకాశంలో చంద్రుని ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాను. 

    చలనం తనకు తానుగా ఎంత గొప్ప సౌందర్య విషయమో అన్నట్లు కదులుతున్నాడు మెల్లిగా చంద్రుడు.

    కరెంటు పోయి చాలాసేపు కావడం వల్ల కాబోలు, వెన్నెల మరింత చల్లగా కళ్లకు తాకుతున్నట్టు అనిపిస్తోంది. 

    కింద ఇంటి ఓనరు వాళ్లు వేసవి సెలవులని పక్కింటి వాళ్లతో కలిసి తిరుపతికి వెళ్లడం వల్ల, చుట్టుపక్కల ఏ ఇంట్లోంచీ టీవీ శబ్దాలు రాకపోవడం వల్ల గాలికి ఎడం పక్క ఖాళీ ఫ్లాట్ లోని కానుగ చెట్టు ఆకులు కదులుతున్న శబ్దం చెవికింపుగా వినిపిస్తోంది. ఏ పరిమళం గాల్లో కలిసి కాసేపు ప్రయాణించి మట్టితో కలిసి తిరిగి పైకి లేచిందో కానీ నాసికా రంధ్రాల ముందు అరక్షణం నాట్యం చేసి వెళ్లిపోయింది. కనువిందూ... చెవికింపూ... ముక్కుపుటాలకి సొంపూ మనసులోని క్షణాలని హాయిలోకి మడతబెడుతున్నాయి. 

    ఆకాశం కింద ఎంతసేపలా పడుకున్నానో తెలియదు... వెన్నెలంటే నాకు బాగా ఇష్టం “భూగోళమంతటికీ ఒకే ఒక్క వీధి లైటులా వెలిగిపోయే చంద్రుని కిందకు చేరుకునే ప్రతి రాత్రీ - ఒక బాటసారే” లాంటి కల్పనలు కల్పించి నన్ను మురిపిస్తుంటుందది. 

    దూరంగా చర్చిలో తొమ్మిది అయినట్లు గంటల చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చాను. 

    నా చుట్టూ ఉన్న శూన్యాన్ని చైతన్యవంతం చేస్తున్నట్టు వెన్నెల. 

    నెల రోజుల దాహంతో రాత్రి నోరు తెరిచి ఆబగా చందమామ కుండ నుండి జారుతోన్న వెన్నెలని కడుపు నిండా తాగుతున్నట్లుగా ఉంది. 

    ‘అడవి గాచిన వెన్నెల’ అంటారు కానీ ఎవరికి తెలుసు - అడవి కూడా ఎంత చీకటి దాహంతో ఆకుల దోసిళ్లతో పండు వెన్నెలని జుర్రుకుంటుందో... 

    నాలోని కవి నిద్ర లేస్తున్నాడు. 

    ఉన్నట్టుండి నా మనసు సున్నితత్వంలోకి జారిపోసాగింది.

    ‘ఈ రాత్రి అందరూ అన్ని పనులూ మానుకొని గదుల్లోంచి బయటకొచ్చి చంద్రుని కింద పక్కలు వేసుకొని ఆయన యాత్రని చూస్తూ గడిపితే ఎంత బాగుంటుందీ’ అనిపించింది. 

    అన్నం తిననని మొరాయించే పిల్లలకు ‘చందమామరావే... జాబిల్లి రావే’ అని పాడుతూ ఎంతమంది తల్లులు టీవీని కాకుండా చంద్రున్ని చూపిస్తూ ఉండి ఉంటారీ రాత్రి? 

    చందమామలోని నలుపు మచ్చని చూపిస్తూ అది రాట్నం వడుకుతోన్న పేదరాశి పెద్దమ్మ అని ఎంతమంది నాయనమ్మలు, అమ్మమ్మలూ, తాతయ్యలూ తమ మనవలకూ మనవరాండ్రకూ వినిపిస్తూ ఉండి ఉంటారు? 

    నెల నెలా వెన్నెల కురిపించే పున్నమి చంద్రున్ని చూసి ఈ భూమ్మీద ఇప్పటివరకూ ఎంతమంది ఎలాంటి భావనలకూ, కల్పనలకూ, ప్రేరణలకూ లోనయి ఉంటారో? 

    సోక్రటీస్ పౌర్ణమి చంద్రున్ని చూసి ఎలాంటి భావనకు లోనయి ఉంటాడు?

    ప్లేటో... గాంధీ... గాడ్సే... నెల్సన్ మండేలా... అకిరా కురసోవా... హిట్లర్... ఏసుక్రీస్తు... బుద్ధుడు ఈ చంద్రున్ని చూసి ఎలాంటి భావనకు లోనయి ఉంటాడు?

    బుద్ధుడు అనుకోగానే అనిపించింది...

    అరె... చంద్రుడు ఎంత ప్రాచీన కాలం నాటి వాడు...

    గౌతమబుద్ధుడు కూడా పున్నమి చంద్రున్ని చూసి ఉంటాడు కదా.

    క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటి బుద్ధుడు చూసిన చంద్రున్ని క్రీస్తు శకపు 21వ శతాబ్ది వాడినైన నేను కూడా ఉన్నపళంగా హాయిగా పక్క మీద పడుకొని చూడగలుగుతున్నాను.

    ఈ ఊహ నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. వెంటనే తలలో పువ్వేదో విచ్చుకున్నట్లయింది. 

    విచ్చుకున్న ఆ పువ్వు పేరు కవిత అని తర్వాత తెలిసింది. 

    ‘బుద్ధుడు
    చూసిన చంద్రున్ని 
    నేనూ చూస్తున్నాను.....’ ఇదీ ఆ కవిత.

    ఇది ఒక హైకూలా అనిపించింది. చిన్న కవిత జన్మించినందుకు సంతోషం వేసింది. అది అప్రయత్నంగా సంభవించినందుకు ఆనందం కూడా కలిగింది. 
జపనీస్ కవితాప్రక్రియ అయిన హైకూల్ని గతంలో కొన్ని రాసుకొని ఉన్నాను నేను. 

    అయితే -

    నాకు అత్యంత ఇష్టమైన తెలుగు కవుల్లో ఒకరైన గాలి నాసరరెడ్డి గారి సాంగత్యం వల్ల - హైకూ జనించాల్సిన స్థితి, హైకూ నిర్మాణం, హైకూ గొప్పదనం గురించి - (కేవలం ఆలోచన నుండి కాక అనుభవం నుండి హైకూ సంభవిస్తే బాగుంటుందని) - తెలుసుకున్నాక -

    ఆ ప్రక్రియ పట్ల మరింత గౌరవం పెరిగి ‘అలాంటి స్థితి కలిగినపుడు మాత్రమే హైకూ రాసుకోవాలి’ అని సీరియస్‌గానే  నిర్ణయించుకొని ఉన్నాను నేను. 

    ఆ తర్వాత నేను రాసుకున్న హైకూలు అయిదేళ్ళలో మూడో నాలుగో ఉండి ఉంటాయి అంతే. వాటిలోకి కొత్తగా ఇదిగో ఇప్పుడొకటి వచ్చి చేరింది. 

    నేనంత ఎమోషనల్ మనిషిని కాను. కానీ ఎందుకో ఈ ఆనందాన్ని మాత్రం వెంటనే నాసరరెడ్డి గారితో పంచుకోవాలనిపించింది. 

    సెల్ తీసుకొని ఆయనకి డయల్ చేశాను. వింజమూరు వెన్నెల ఆకాశం కింద ఆయనింట్లో ల్యాండ్ ఫోన్ రింగయింది.

    నా గొంతు వినగానే ‘ఊ.. బాగున్నారా? చాలా రోజుల తర్వాత.. ఆ.. చెప్పండి’ నవ్వుతూ పలకరించారాయన. 

    కుశలప్రశ్నలవీ అయిపోయాక అసలు విషయం చెప్పడం ప్రారంభించాను.

    ‘ఈ వెన్నెల రాత్రి ఒక హైకూ సంభవించింది సార్... మీతో పంచుకోవాలనిపించి...’ అనగానే -

    ‘ఓహ్ బావుంది... చెప్పండి హైకూ’ అన్నారాయన సంతోషంగా.

    నేను చెప్పాను.

    ‘బుద్ధుడు 
    చూసిన చంద్రున్ని
    నేనూ చూస్తున్నాను’

    అట్నుంచి ఏమీ వినిపించలేదు. ‘సార్’ అన్నాను.

    కాసేపటికి, ‘ఆశ్చర్యంగా ఉంది. నమ్మకలేకపోతున్నాను నేను. రెన్నెళ్లక్రితం నేనూ అచ్చం ఇలాంటిదే హైకూ ఒకటి రాసి పెట్టుకున్నాను. ఇంకా మిత్రులెవరికీ కూడా వినిపించ లేదు. ఇప్పుడు అచ్చం అట్లాంటి హైకూనే మీరూ వినిపించారు. ఈ సంఘటన నాకు భలే గమ్మత్తుగా అనిపిస్తోంది’ అన్నారాయన ఇంకా విస్మయంలోంచి తేరుకోకుండానే... నవ్వుతూ.

    నాకు భలే వండర్‌ఫుల్‌గా అనిపించిందీ సంఘటన. గాలి నాసరరెడ్డి గారి లాంటి కవికి వచ్చిన భావనే నాకూ కలిగినందుకు చిన్నపిల్లాడికి కలిగే గర్వం లాంటిదేదో కలిగింది. 

    ‘మీరు రాసుకున్న హైకూ ఏంటి సార్’ ఆత్రంగా అడిగాను.

    ఆయన చెప్పారు. ‘లీబో, బషోలు తెలుసుగా... ఒకరు ప్రాచీన చైనీస్ కవి... మరొకరు 17వ శతాబ్దానికి చెందిన జపాన్ కవి. రెన్నెళ్ల క్రితం చంద్రున్ని చూస్తున్నపుడు వాళ్లిద్దరూ గుర్తొచ్చారు. వెంటనే హైకూ పుట్టింది. ఇదీ ఆ హైకూ ...

    “లీబో, బషోలు
    చూసిన చందమామే
    నా కళ్ల ముందు”
    ........ ‘గమ్మత్తుగా ఉంది కదూ.. ఇద్దరికీ దాదాపు ఒకేలాంటి భావన కలగడం.. నాకు లీబో, బషోలు అయితే మీకు బుద్ధుడు’ నవ్వుతున్నారాయన. 
ఆయన నవ్వులో నేనూ పాలుపంచుకున్నాను. 

    ‘బావుంది.. ఇదొక అరుదైన అనుభవం.’ అన్నారాయన. 

    అలా కాసేపు ఆయనతో సంభాషించి ఫోన్లో సెలవు తీసుకున్నాక - లేచి గదిలోకి వెళ్లాను.

    ఇంకా కరెంట్ రాలేదు. టైం పది దాటి పోయుంటుంది.

    వాతావరణమంతా చల్లబడడంతో, కాలనీ అంతా దాదాపు నిద్రలోకి జారిపోయి నిశ్శబ్దంగా ఉంది..

    దూరంగా కుక్క మొరుగుతున్న శబ్దం మాత్రం ఉండీ ఉండీ వినిపిస్తోంది. ఈ పున్నమిరాత్రి దాన్నెవరు డిస్టర్బ్ చేసారో? 

    తెల్లకాగితాలున్న రైటింగ్ ప్యాడ్, పెన్నూ టార్చిలైటూ తీసుకొని, జీవం లేని లైట్ స్విచ్లు ఆఫ్ చేసి, తలుపు దగ్గరగా వేసి వచ్చి చాప మీద కూర్చొని రైటింగ్ ప్యాడ్ మీది తెల్ల కాగితపు పై భాగాన గాలి నాసరరెడ్డి గారికి చెప్పిన హైకూ రాసుకొని - ప్యాడ్ పక్కన పెట్టి మేను వాల్చాను.

    కొత్తగా కొన్న దిండు మెత్తదనంలో తలలోని నరాలు మళ్లీ సుఖంగా సర్దుకుపోయాయి.

    చంద్రుని వైపు చూసాను. సముద్రంలో నావలా కదులుతున్నాడాయన.

    భలే సంఘటన... ‘గాలి నాసరరెడ్డి గారికీ నాకూ అనిపించినట్లుగానే చంద్రుని వైపు చూసిన ఇంకెవరికైనా మా ఇద్దరికీ కలిగిన భావన లాంటిదే కలిగి ఉంటుందా...?’ అనిపించింది ఒక్క క్షణం.

    అంటే... ‘ఫలానావారు చూసిన చంద్రున్ని ఇప్పుడు నేనూ చూస్తున్నాను’ అని ఈ భూమ్మీద ఇంకెవరైనా భావించి ఉంటారా?

    ‘ఇలాంటి ఆలోచన్లు వస్తున్నాయేమిటీ రాత్రి?’ అనిపించింది. 

    ‘ఇలాంటి గమ్మత్తయిన ఆలోచన్లన్నీ చంద్రుని మహిమేనా’ అని కూడా అనిపించింది. 

    ఎప్పుడైతే ‘చంద్రుని మహిమ’ అన్న భావన స్ఫురించిందో, నా బాల్యపు వేసవి రాత్రుల జ్ఞాపకమొకటి మెదిలింది. 

    అప్పుడు నాకు తొమ్మిదేళ్లో పదేళ్లో ఉంటాయి. ఊళ్లోని మా బస్తీ మధ్యలోనే నేను నాలుగో తరగతి వరకూ చదివిన స్కూల్ ఉండేది. స్కూల్ వెనుక మా పూరి గుడిసె ఇల్లుండేది. స్కూల్‌కి  కాంపౌండ్ వాల్ లేదు. చుట్టూ విశాలమైన స్థలం ఉండేది. సాయంత్రం కాగానే మా ఈడు పిల్లలందరం స్కూల్ మైదానంలోకి చేరి గిల్లీగోనా, కబడ్డీ, ఒంగుడుదునుకుడు, దాగుడుమూతలు లాంటి ఆటలన్నీ ఆడుకునేవాళ్లం. 

    పౌర్ణమి రోజుల్లో... ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే పౌర్ణమి రోజుల్లో మాత్రం చీకటి పడగానే ఒక గమ్మత్తయిన ఆట ఆడేవాళ్లం. 

    పూర్ణచంద్రుడి ఆగమనం చూస్తూనే నా దోస్త్ పరశురాం గాడు ‘రేయ్.. మా నాయనమ్మ చెప్పిందిరా.. ఇవాళ పున్నమట...’ అంటూ అందరినీ స్కూల్ వెనుకభాగాన ఉన్న పెద్ద రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్లేవాడు. 

    ఇక అప్పుడు మొదలయ్యేది మా ఆట. 

    అదేంటంటే - నోటు పుస్తకాల్లోంచి చింపుకొచ్చినవో - స్కూలు కిటికీల పక్కన దొరికినవో తెల్లవీ, రూళ్ల కాగితాల మీద ఒక్కొక్కడూ ఒక్కొక్క ప్రశ్న రాసి ఆ కాగితాల్ని అగ్గిపెట్టె సైజుకి మడత పెట్టి రావి చెట్టు కింద రాలిన రావి ఆకుల కింద ఒక్కొక్కడూ విడివిడిగా - దూరం దూరంగా ఆ పేపర్లని దాచి పెట్టి దాని మీద చిన్న చిన్న రాళ్లని బరువుగా పెట్టడం. అలా చేసి వెళ్లిపోయాక - అందరూ  నిద్రపోతున్న సమయంలో - ఏ అర్థరాత్రో దాటాక - చంద్రుడి లోంచి - పిల్లలు ఎన్ని కాగితాల మీద ప్రశ్నలు రాసి పెట్టారో అన్ని చంద్ర కిరణాలు రావి చెట్టు ఆకుల సందుల్లోంచి నేల మీదకి వచ్చి - ఆ కాగితాల్లోని మా ప్రశ్నలకు జవాబులు రాసి వెళ్తాయట. ఈ విషయం ఎవరో చెబితే నమ్మకపోయేవాళ్లం. కానీ మా అమ్మలందరికీ పురుళ్లు పోసిన పరశురాం గాడి నాయనమ్మ మంత్రసాని రామక్క చెప్పడం వల్ల నమ్మేవాళ్లం. ఆమె దాన్నొక అద్భుతమైన జానపద కథలా - చివర్లో నమ్మదగిన వాస్తవంలా చెప్పేది. ఆమె ముఖంలోని సీరియస్‌నెస్ వల్లో, ఆమె గొంతులోని గాంభీర్యత వల్లో, నిజంగానే అలా జరుగుతుందని నమ్మి మేమంతా ఆ ఆట ఆడేవాళ్లం. అయితే మర్నాడు సూర్యోదయమయ్యాకే ఆ పేపర్లు విప్పి చూడాలనీ, బంగారు వర్ణపు అక్షరాలతో చంద్రకిరణాలు రాసిన అక్షరాలు అదృష్టవంతులకి మాత్రమే కనిపిస్తాయనీ మెలికపెట్టేది ఆమె. 

    ఇక తెల్లారి సూర్యోదయమవుతూనే అందరం రావి చెట్టు కిందికి చేరి పోయి మా అదృష్టాలని పరీక్షించుకునేవాళ్లం. 

    ఒక్కడికి కూడా కాగితాల మీద జవాబులు కనిపించేవి కావు. అందరం పరశురాంగాడిని తిట్టేవాళ్లం. మరో పౌర్ణమి రోజు మళ్లీ మామూలే. 

    గతాన్ని మర్చిపోయి కాగితాలు పట్టుకుని తయారయిపోయేవాళ్ళం. మర్నాడు ఉదయం షరా మామూలే. ఈ ఆటకు కొంచెం హుషారు అద్దడానికి మాలో కొందరు ఇతరులకి చూపించకుండా ‘మా కాగితాల మీద చంద్ర కిరణం జవాబిచ్చిందోచ్’ అని మిగతా వాళ్లను ఉడికిస్తూ గొప్పలకు పోయేవాళ్లు. ‘ఏమని జవాబొచ్చిందిరా’ అంటే వాళ్లకు అనుకూలమైన సమాధానాలు చెప్పేవాళ్లు. ‘మరి చూపించరా’ అంటే కాగితాన్ని మడతపెట్టి మాకు దొరక్కుండా పరిగెత్తేవాళ్లు. మిగతావాళ్లు వాళ్లని వెంటాడి వేటాడే వాళ్లు. మా బ్యాచ్‌లో పదీ పదకొండేళ్ల పిల్లల కన్నా ఆరూ ఏడేళ్ల పిల్లలు ఈ ఆటను బాగా ఎంజాయ్ చేసే వాళ్లు. ‘ఇదంతా ఉట్టిదే’ అనిపించినా వాళ్లకోసమైనా ఈ ఆట ఆడాలనిపించేది. 

    మాలో జాన్‌ డేవిడ్ అనే రాక్షసుడైతే ఒక రోజు తెల్లవారుఝూమునే లేచి వెళ్లి ఆకుల కింది ప్రశ్నలన్నింటికీ పెన్సిల్తో జవాబులు రాసి తర్వాత దొరికిపోయాడు కూడా. 

    ఆ కాగితాల మీద మా అందరి ప్రశ్నలూ ఇలా ఉండేవి. 

    ‘నేను సెవెన్త్ పాసవుతానా?’ లాంటి ప్రశ్నలు పరశురాం గాడు రాస్తే -

    ‘మా నాన్న నన్ను కొట్టడం ఏ సంవత్సరం నుండి ఆపేస్తాడు’ లాంటి ప్రశ్నలు మున్నా గాడు రాసేవాడు.

    ‘నేను పెద్దయ్యాకా ఏమవుతాను?’ లాంటి ప్రశ్నలు క్లవర్ కిట్టి గాడు రాస్తే -

    ‘సినిమా హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలంటే నేనేం చేయాలి?’ లాంటి ప్రశ్నలు ఆకారపు వెంకటేశ్వర్లు గాడు రాసేవాడు. 

    ‘ఇంట్లోంచి వెళ్లిపోయిన మా నాన్న ఇప్పుడెక్కడ ఉన్నాడు?’ లాంటి బాధాకరమైన ప్రశ్నలు రమణ గాడు వేస్తే -

    ‘ఈ స్కూల్లో దయ్యాలున్నాయంటారు. అసలున్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి? అలాగే నిధి ఎక్కడ దొరుకుతుంది?’ లాంటి గమ్మత్తయిన ప్రశ్నలు భరత్‌లాల్ కోరీ గాడు వేసేవాడు. 

    అదో సరదా ఆట... సరదా వయసు... సరదా జ్ఞాపకం. ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది...?

    ఆ... చంద్రుని మహిమ అనుకుంటే గుర్తొచ్చింది.

    నిజంగా చంద్రునికి మహిమలుంటాయా? లేకపోతే పౌర్ణమి రోజే జన్మించిన బుద్ధుడికి జ్ఞానోదయమైనదీ, బుద్ధుడు నిర్యాణం చెందిందీ కూడా పౌర్ణమి రోజే అవడం కేవలం యాదృచ్ఛికమేనా? దేనితోనూ సంబంధం లేదా? ఆకాశంలోని పౌర్ణమి చంద్రునికీ నేల మీది సముద్రపు ఉవ్వెత్తు అలకీ మధ్యనున్న సంబంధం కేవలం సైంటిఫిక్‌దేనా?

    చంద్రుని వైపు చూసాను.

    ఎందుకో ఈ క్షణం చంద్రున్ని చూస్తున్నది ఇప్పటి నేను కాకుండా చిన్నప్పటి నేనుగా అనిపించింది.

    నా హృదయం మరింత సున్నితంగా మారిపోతోంది. 

    రావిచెట్టు కింద ఆ ఆట ఆడుకున్న బాలుడి శరీరం సైజుకి నా శరీరం కుంచించుకుపోయినట్లు అనిపించింది.

    నా చుట్టూ అప్పటి బాల్య స్నేహితులూ, ఆ స్కూలు వెనుక భాగాన ఉన్న రావి చెట్టూ, చీకటి పడ్డ ఆ పౌర్ణమి రాత్రి కాళ్ల కింద ఎండు రావి ఆకుల చప్పుడూ ప్రత్యక్షమైన భావనని పొందాను.

    నేనెంత గాఢంగా ఆ భావనకి గురయ్యానూ అంటే -

    అప్పటి దృశ్యంలో ఉన్నవాడి లాగే తెల్ల కాగితం మీద ఏదైనా ప్రశ్న రాసి చందమామను జవాబు అడగాలనిపించేంతగా. 

    నా కణజాలాల్లో తర్కం లెవెల్స్ పూర్తిగా పడిపోయి ఆ స్థానాల్లో బాల్యపు అమాయకత్వం నిండిపోయింది. 

    నా చేతులు అప్రయత్నంగా తెల్ల కాగితాలు క్లిప్ చేసిన రైటింగ్ ప్యాడ్ మీదికి వెళ్లాయి. 

    దాన్ని చేతిలోకి తీసుకొని లేచి కూర్చొని పెన్ మూత తీసి -

    హైకూ రాసుకున్న వాక్యాల కింద వెన్నెల కాంతిలోనే ఇలా రాయబోతూ -

    ఆ పని విరమించుకొని - పెన్ పక్కన పెట్టి - రెండు చేతులూ రైటింగ్ ప్యాడ్ మీది కాగితాల మీద పెట్టి -

    కళ్లు మూసుకొని మనసులో ప్రశ్న వేస్తున్నట్లుగా ఇలా అనుకున్నాను.

    ‘చంద్రమా! ఇవాళ రాత్రి నీ వైపు చూస్తున్నపుడు “బుద్ధుడు/ చూసిన చంద్రున్ని/ నేనూ చూస్తున్నాను” లాంటి భావనకి లోనయ్యాను కదా! ఇలా మొత్తం మానవజాతి చరిత్రలో ఇప్పటి దాకా నీ వైపు చూసి - “ఫలానా వారు చూసిన చంద్రున్ని నేనూ చూస్తున్నాను” అని భావించుకున్న మనుష్యులు గాలి నాసరరెడ్డి గారూ నేనే కాకుండా ఇంకా ఎవరైనా ఉండి ఉంటారా? ఉంటే - వాళ్ల పేర్లూ - ఆ సందర్భపు వివరాలూ నేను నిద్రపోయాక ఈ తెల్లకాగితాల మీద జవాబుగా రాయగలవా?’

    నేనెంత తన్మయత్వంతో ఆ వాక్యాల్ని మనసులో అనుకున్నానంటే -

    అనుకున్నాక కళ్లు తెరిచి నా బాల్య మిత్రుల కోసమని అటూ ఇటూ చూసాను.

    నా చేష్టకూ, ఆలోచన్లకీ నవ్వొచ్చింది. కొన్ని క్షణాల క్రితం నా మనసు పసిది... అప్పుడేం చేయాలో అదే చేసింది...

    ఈ బుద్ధెరిగిన మనసు ఇదేం చేయాలో అదే చేస్తోంది. 

    ఈ మనసు సగం పువ్వు.. సగం జంతువు.. అనుకున్నాను. 

    సెల్లో టైం చూసాను. ఒంటిగంట దాటింది. 

    ‘బాగా రాత్రయిపోయింది... పొద్దున్నే లేవాలి’ అనుకొని రైటింగ్ ప్యాడ్ దిండు పక్కన పెట్టి దాని మీద సెల్ పెట్టి... బాటిల్లోంచి నీళ్లు తాగి చంద్రుని వైపు చూస్తూ ఎప్పటికి నిద్రలోకి జారిపోయానో తెలియదు. 

* * *

    ఎండ చుర్రుమని తగలగానే మెలకువొచ్చింది. కళ్లు నులుముకుంటూ లేచి చేతిలోకి సెల్ తీసుకొని టైం చూసాను. ఏడున్నర. చచ్చాను.

    డివిజనల్ మార్కెటింగ్ మేనేజర్తో బ్రాంచిలో ఏజంట్ల మీటింగ్ ఉందని ఉదయం ఎనిమిదింటికల్లా ఆఫీసుకి రమ్మని చెప్పాడు మా బ్రాంచి మేనేజరు. 

    ఇంకా అరగంట మాత్రమే ఉంది. అలారం పెట్టుకొని ఆరింటికే నిద్రలేవాల్సింది. రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల టైం తెలియలేదు.

    ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకొని, వంట చేసుకొని తిని వెళ్లేంత టైం లేదు. 

    ముందు ముఖం కడుక్కొని స్నానం చేసి బయటపడితే చాలు అనుకొని ఉన్నపళంగా లేచి - పక్కబట్టలు మడతబెట్టి - పక్కనే ఉన్న కుర్చీలో బొంతా దిండూ పెట్టి చాపను మడతబెట్టబోతూ చూసాను.

    చాప పైభాగం పక్కన రాత్రి నేను హైకూ రాసుకొని దాని కింద చంద్రున్ని జవాబు ఆశిస్తూ ప్రశ్న వేసిన రైటింగ్ ప్యాడ్ కనిపించింది. 

    నవ్వుతూ వంగి ప్యాడ్ చేతిలోకి తీసుకొని చూసాను. 

    హైకూ తప్ప ఇంకేం కనిపించలేదు.

    పేపర్ పైకెత్తి మిగతా పేజీలు చూసాను. అన్నీ తెల్లగా ఉన్నాయి. 

    రాత్రి నా చేష్ట గుర్తుకొచ్చి మళ్లీ నవ్వుకుంటూ రైటింగ్ ప్యాడ్ని కుర్చీలో పక్క బట్టల మీద పెట్టి చాప మడతబెట్టబోతూ -

    ‘ఇప్పటికే పది నిమిషాల దాకా ఖర్చయిపోయాయి. ఇవన్నీ మడతబెట్టి ఆఫీసుకి ఆలస్యంగా వెళితే బాస్ కంటి చూపుతో కాకుండా కార్టూన్లు వేసి చంపుతాడు’ అనుకొని -

    ‘ఎలాగూ మళ్లీ రాత్రి పరిచేదేగా చాప. ఉండనీ’ అనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకొని సెల్, వాటర్ బాటిల్ మాత్రం తీసుకొని గది ముందుకు దూకాను.
ఇరవై నిమిషాల్లో అన్నీ ముగించుకొని ఆఫీసు వైపు పరుగెత్తాను. 

* * *

    ఉదయం మొదలైన మీటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి ఏడయింది. మధ్యాహ్నం లంచ్ కూడా ఆఫీసులోనే ఏర్పాటు చేయడంతో రూంకి కూడా రాలేదు. 

    గదికి చేరుకొని - రూం ఊడ్చి - స్నానం చేసి - వంట చేసుకొని భోం చేస్తున్నపుడు మళ్లీ కరెంట్ పోయింది. 

    ‘ఈ కరెంట్ తీతకు వేళాపాళా లేదు’ అనుకొని టార్చి వెలిగించి భోజనం ముగించాను.

    బాగా అలసిపోయినట్లనిపించింది. 

    పక్కవాలుద్దామని వాటర్ బాటిల్, సెల్ తీసుకొని గదికి గొళ్లెం పెట్టి ఆరు బయటికొచ్చాను.

    నిన్న పౌర్ణమి కావడంతో నిన్నంత కాకపోయినా వెన్నెల ఈ రోజు కూడా కాంతివంతంగానే ఉంది.

    ఉదయం అలాగే వదిలేసిన చాపను దులిపి - పరిచి - 

    పక్క బట్టలు తీసుకుందామని కుర్చీలో చేయి పెట్టబోతూ అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ కొట్టినవాడిలా ఆగిపోయాను.

    పొద్దున పక్కబట్టల మీద పెట్టిన రైటింగ్ ప్యాడ్ మీద - నేను రాసుకున్న హైకూ కింద భాగాన... 

    ఉదయం ఖాళీగా కనిపించిన చోట... 

    నీలి రంగులో ఏవో వా... క్యా... లు... క... ని... పిం... చా... యి

    రేడియం నీలి రంగులో మెరుస్తున్నాయా అక్షరాలు.

    ఎవరు రాసి ఉంటారవి...! ఇంటి ఓనర్ పిల్లలూ, పక్కింటి వాళ్లూ కూడా ఊళ్లో లేరు. గేటుకి తాళం కూడా వేసి వెళ్తాను. ఎవరూ వచ్చే అవకాశం లేదు... మరి ఎవరు రాసి ఉంటారబ్బా అనుకుంటూ రైటింగ్ ప్యాడ్ని చేతిలోకి తీసుకొని ముఖానికి దగ్గరగా పెట్టుకొని వెన్నెల కాంతిలోనే ఆ వాక్యాలు చదవడానికి ప్రయత్నించాను.

    వెన్నులో చలి పెట్టినట్లయింది నాకు.

    బిత్తరపోయి అటూ ఇటూ చూసాను. ఎవరూ కనిపించలేదు.

    హైకూ కింది భాగాన -

    నేను రాత్రి కళ్లు మూసుకొని చంద్రున్ని అడిగిన ప్రశ్నకు జవాబుల్లా కనిపించాయి నీలి రంగు వాక్యాలు.

    ‘ఓర్నాయనో... ఏంట్రా బాబూ ఇది’ అని అరిచాను భయంతో కూడుకున్న విస్మయంతో.

    నా చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఒళ్లంతా చెమటలు పట్టడం ప్రారంభించాయి. గుండె వేగం పెరిగింది.

    మళ్లీ అటూ ఇటూ చూసాను. కనుచూపు మేరా ఎవరూ కనిపించలేదు. దూరంగానైనా డాబాల మీద ఎవరైనా మనుషుల కదలికలు కనిపిస్తే నేను వాస్తవ ప్రపంచంలో ఉన్నానని ఋజువు చేసుకోవచ్చు అనుకున్నాను.

    ఎవరూ కనిపించలేదు. అయినా సరే ఇది భ్రమ కాదు వాస్తవమే అన్న విషయం నా అస్తిత్వానికి తెలుస్తూ ఉంది.

    మనుష్యులెవరూ వచ్చి రాసే అవకాశం లేదు. ఎందుకంటే... నేను ప్రశ్నని మనసులోనే వేసుకున్నాను. ఈ విషయం నాకూ చంద్రుడికీ తప్ప ఎవరికీ తెలియదు...

    అంటే... అం... టే... ఈ జవాబులు చంద్రుడు... అంటే... బాల్యపు రావి చెట్టు కింద ఆటలోలా చంద్రకిరణాలు వచ్చి రాసి ఉంటాయా...? మరి ఉదయం నిద్ర లేచి పక్క బట్టలు సర్దబోతూ నేను రైటింగ్ ప్యాడ్ వైపు చూసినపుడు హైకూ కింద అంతా తెల్లగా ఎందుకు కనిపించిందో...?

    అంటే... వెన్నెల కాంతిలో మాత్రమే చంద్రుడు ఇచ్చిన సమాధానాలు కన్పిస్తాయా...? ఏంట్రా నాయనా ఇది!

    గబగబా మిగతా పేజీలు కూడా తిరగేసి చూసాను. 

    మూడు నాలుగు పేజీల వరకూ రాసి ఉన్నాయా నీలి రంగు వాక్యాలు...

    ఇది చంద్రుని మహిమే...

    నిజంగా... అమాయకమైన పసి మనస్సుతో తలుచుకుంటే ఇలా జరుగుతుందా?

    ‘ఏందయ్యా.. చంద్రయ్యా’ అంటూ చంద్రుని వైపు చూసాను. నాకు ఎమోషన్ ఆగడం లేదు...

    చంద్రుడు నా భావోద్వేగాల్తో పని లేకుండా సాదా సీదాగా ఆకాశంలో కొనసాగుతున్నాడు. 

    నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆకాశంలోని చంద్రుడు భూమ్మీది ఈ మనిషి ప్రశ్నకు జవాబిచ్చాడు... చల్లని తండ్రి... దీవించాడు...

    నా భావోద్వేగాల్ని దాచుకోవడం కష్టంగా ఉంది.

    చాప మీద అట్లాగే కూలబడిపోయి - రైటింగ్ ప్యాడ్ మీది హైకూ కింద నీలి రంగు వాక్యాలను చదవడం ప్రారంభించాను.

    ‘మిత్రమా! (చంద్రుడు స్నేహితుడిలా ఇలా సంభోదిస్తాడని అనుకోలేదు) 

    ‘ఈ రాత్రి  నా వైపు చూసి - 

    ‘బుద్ధుడు చూసిన చంద్రున్ని నేనూ చూస్తున్నాను' - అని భావించుకున్న నువ్వు

     “ఫలానా వారు చూసిన చంద్రున్ని నేనూ చూస్తున్నాను” అని ఆదిమ కాలం నుండీ ఇప్పటి వరకూ నా వైపు చూసి భావించుకున్న వ్యక్తుల వివరాలు అడిగావు కదా

    ‘ఇవిగో ఆ వివరాలు.’

    దాంతో మొదటి పేజీ పూర్తయింది. ఆత్రంగా రెండో పేజీ తిప్పాను. 

    అక్కడ ఇలా మొదలైంది - 

    ఖండం :    ఆఫ్రికా
    దేశం :    ఇథియోపియా
    కాలం :    క్రీ.శ. 2వ శతాబ్దం
    వ్యక్తి :    చెరికా (స్త్రీ)
    వయసు :    72 సంవత్సరాలు
(‘అంటే ఈ భావన కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఎక్కడో ఆఫ్రికాఖండంలోని ఒక వృద్ధురాలు కూడా పొందిందన్నమాట... వండర్‌ఫుల్’ అనుకున్నాను. తిరిగి నా కళ్లు ఆ నీలపు వాక్యాల వరుస నుండి పరుగెత్తాయి.)

    ఈ రోజు రాత్రి చెరికా అను డెబ్భయి రెండు ఏళ్ల వృద్ధురాలు ఆరు బయట వెన్నెల్లో తన గుడిసె ముందు నులకమంచంలో దిగులుగా పడుకొని - ఎందుకో తను పుట్టగానే ప్రసవంలోనే చనిపోయిన తన తల్లి ‘మెలకూ’ను చాలాసేపు గుర్తు చేసుకుంది. 

    తన తల్లి ముఖం ఎలా ఉంటుందో తనకి తెలియదు. వాళ్లమ్మకు తన తల్లి ఒక్కతే కూతురు. కనీసం అమ్మకు అక్కా చెల్లెళ్లు ఉన్నా కూడా వాళ్లల్లో తన తల్లి పోలికలు చూసుకునేది. అమ్మమ్మ పోలికలు అమ్మకు రాలేదంటారు. ఆమె ముఖాన్ని ఎవరైనా బొమ్మగా వేసినా బాగుండేది. కానీ తమలాంటి పేద వాళ్ల ముఖాల్ని ఎవరు చిత్రిస్తారు? 

    ‘ఆమె కళ్లు అలా ఉండేవి... నవ్వు ఇలా ఉండేది’ అని తన తండ్రి చెప్పేవాడు కానీ ఆ పోలికలతో ఆమె ముఖం తన ముందు ప్రత్యక్షమయ్యేది కాదు. 

    ‘అమ్మ ముఖాన్ని కూడా చూడలేకపోయిన బతుకు తనది’ అని చాలా సేపు బాధ పడుతూ ఉండిపోయిందా వృద్ధురాలు. 

    అలా బాధపడుతూ ఆ నులక మంచం లోనే పడుకొని చాలాసేపు నా వైపు చూసిన ఆమెకు తళుక్కున ఏదో ఆలోచన మెరిసింది. 

    ముడుతలు పడ్డ ఆమె ముఖం మీదికి చిరునవ్వు వచ్చి చేరింది. 

    ‘నా తల్లి ముఖాన్ని నేను చూడలేకపోతేనేం. అదుగో ఆకాశంలో చంద్రుడు - 
    
    నా తల్లి మెలకూ కూడా చంద్రున్ని చూసి ఉంటుంది. 

    ఆమె చూసిన చంద్రున్నే ఇప్పుడు నేనూ చూస్తున్నాను. అమ్మ చూసిన చంద్రున్ని అలాగే చూస్తూ ఉంటే ఆమెను చూస్తున్నట్లుగానే ఉంది...

    అమ్మ చూసిన చంద్రుడు... మా అమ్మని చూసిన చంద్రుడు... అదుగో ఇప్పుడు నా వైపే చూస్తున్నాడు...’

    కళ్ల లోంచి నీళ్లు ధారలుగా వర్షిస్తుండగా ఆ వృద్ధురాలు అతి కష్టం మీద నులక మంచం మీది నుంచి లేచి కూర్చుంది. 

    ఇక ఈ రాత్రి ఆ వృద్ధురాలు నిద్రపోలేదు. జలజలా కారుతున్న కన్నీళ్లలో తిరిగి సూర్యోదయమయ్యే దాకా నా వైపే చూస్తూ ఉండిపోయింది వణుకుతున్న పెదవుల మధ్య ఏవో మాటల్ని శూన్యంలోకి వదులుతూ...

    - అని ఉంది ఆ రెండో పేజీలో. ఎప్పుడు వచ్చి చేరాయో తెలియదు నా కళ్లలోంచి నీటి బొట్లు రాలి కాగితం మీద పడ్డాయి. 

    చంద్రున్ని చూసి ఇంత గొప్ప భావనలకూ... ఉద్వేగాలకూ లోనయిన వాళ్లు ఉన్నారా అనిపించింది. 

    అందులోనూ కొన్ని వందల ఏళ్ల క్రితమే ఇలాంటి అనుభూతిని పొందిన మనుష్యులున్నారా అని తలచుకుంటే భలే ముచ్చటేసింది. 

    మానవ కాల్పనికశక్తిని తల్చుకొని మురిసిపోయాను. 

    ‘హేట్సాఫ్ తల్లీ...’ అనుకున్నాను... ఆఫ్రికా ఖండం  ఉన్న పశ్చిమం వైపు చూస్తూ...

    అయినా ఏది ఆఫ్రికా... ఏది అమెరికా... ఏది ఆసియా... 

    ఈ రాత్రి చంద్రుని కింద జీవులందరిదీ ఒకే దేహం... ఒకే ఆత్మ అనిపించింది.

    మళ్లీ వృద్ధురాలు చెరికా గుర్తుకొచ్చింది.

    ఈ లెఖ్ఖన ఒక్క అమ్మ... అమ్మమ్మ... నాయనమ్మ... ముత్తాతలేమిటి... మనిషి చూడలేకపోయిన తన పూర్వీకులందరూ - చూసిన చంద్రుని వైపు చూసి -

    ఆ చందమామ ఫొటో ఆల్బంలో వాళ్లందరినీ నీళ్లలో ప్రతిబింబాల్ని చూసినట్లు చూడొచ్చు...

    భూమ్మీద నివసిస్తూ తన వైపు చూసిన సకల మానవాళి చూపులకూ చంద్రుడు ప్రత్యక్ష సాక్షి అన్నమాట.

    ఆ మాటకొస్తే చంద్రుడే కాకుండా పంచభూతాలూ, సూర్యుడు కూడా ప్రత్యక్ష సాక్షే...

    కానీ చంద్రుడితో ఐడెంటిఫై అయినట్లుగా...

    చంద్రుని లోకి చూసినంతగా మనిషి మరిదేంతోనూ తాదాత్మ్యం చెందలేడనుకుంటా...?

    ఏంటో సృష్టిలో ఆయన ప్రత్యేకత?

    నాకు ఆ రైటింగ్ ప్యాడ్ కాగితాల మీద ఉన్న మిగతా వివరాలు చూడాలనిపించలేదు...

    ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఈ రాత్రంతా ఆకాశం కింద ఇలాగే నింపాదిగా పడుకొని -

    అదుగో ఫలానా వారు చూసిన చంద్రుడు -
    ఇదుగో ఫలానా వారు చూసిన చంద్రుడు - అనుకుంటూ తెల్లారే దాకా గడపాలనిపించింది. ఎందుకో - భూగోళం మీది మొట్టమొదటి మానవుడు మొదటిసారి చంద్రుణ్ణి చూసినపుడు ఎలాంటి అనుభూతికి లోనయ్యాడో కూడా ఊహించుకోవాలనిపించింది. 

    రైటింగ్ ప్యాడ్ పక్కన పెట్టి... చాప మీద నడుం వాల్చి... చంద్రుని వైపు చూసాను.

    గమనించలేదు గానీ నా కళ్లలో ఇంకా నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి.

    ఆ తడి వల్ల నేను సముద్రపు నీళ్లలో పడుకొని ఆకాశంలోని చందమామ వైపు చూస్తున్నట్లుగా అనిపించింది. చెరికా ఆ సముద్రంలో ఈ రాత్రి ఉవ్వెత్తున లేచిన ఉద్వేగ కెరటంలా అనిపించింది. కళ్లు తుడుచుకొని - నాలుగయిదు సార్లు కనురెప్పలు టపటపలాడించి - స్పష్టంగా చంద్రుని వైపు చూసాను. 
తన మీద కాలు మోపే వాళ్ల కోసం కాకుండా కళ్లు మోపే వాళ్ల కోసం వెదుకుతూ ఆకాశ వీధిన తిరుగుతోన్న లోకసంచారిలా అనిపించాడాయన. 
(అమ్మ ఐలమ్మకు)

(ఆదివారం ఆంధ్రజ్యోతి 20అక్టోబర్ 2013 సంచికలో ప్రచురితం) 
Comments