చీకటి - హెచ్చార్కె

 రాత్రి కల. ఒక కల కాదు. కొన్ని కలలు కలిసి పోయినట్లు. బైండింగు సమయంలో పుస్తకం పేజీలు తారుమారయినట్లు. మనం చదువుతున్న పుస్తకంలో వున్నట్టుండి ఇంకేదో పుస్తకం పేజీలు దూరినట్లు. ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా అడ్డు పడుతూ అదే కల. ఏమిటిది? ఎందుకిలా?. కలల్ని అర్థం చేసుకుంటే మనకు మనం అర్థమవుతామని అంటారు. బిడియపడకుండా కలల్ని పంచుకుంటే ఒకరికొకరం బాగా అర్థమవుతామని అంటారు. నా కలలో ఏం జరిగిందో చెబుతాను. ఆ తరువాత, మీరు ఎలాగంటే అలాగే.

ఏదో ఫంక్షన్ .

ఫంక్షన్ కు వచ్చిన వాళ్లు దాదాపు అందరూ వెళ్లిపోయారు. తలుపుల వద్ద ఒకరిద్దరు చెప్పులు, బూట్లు వెదుక్కుంటున్నారు. రమేష్ హాళ్లో లేడు. పొగ పిలుపు వినడానికి బయటికి జారుకున్నట్లున్నాడు. అంతా మసక మసగ్గా‍ వుంది. కనిపిస్తున్నట్లూ వినిపిస్తున్నట్లే వుంది. కనిపించడం లేదని వినిపించడం లేదని  ఒక స్పృహ. ఒదిలేసిన ఇంటిలో వేలాడే సాలెగూళ్ల మాదిరి. నీళ్ల లోపలికి వెళ్లి కళ్లు తెరిచినట్లు వెలుగు వంటి చీకటి. ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు వుండే నొప్పితో కూడిన ఒక రకం మత్తు. ఉద్రిక్త నిస్సత్తువ.   

నేను హాల్లోంచి లోపలికి నడిచాను. సావిత్రి, మహేశ్వరి వంటింట్లో పాత్రలు పెట్టే కౌంటర్ మీద కూర్చుని ఏమో మాట్లాడుకుంటున్నారు. నా రా‍కను గమనించినట్లు ఒక సారి చూసి, మళ్లీ మాటల్లో పడిపోయారు. నన్ను పట్టించుకోలేదు. మహేశ్వరి వొళ్లో వాళ్ల పాప తన మంగళసూత్రంతో ఆడుకుంటోంది. దానికి మంగళసూత్రంతో ఆడుకోడం చాల ఇష్టం. దగ్గరికి తీసుకుంటే మొట్టమొదట మంగళ సూత్రం  కోసమే వెదుక్కుంటుంది. నా మెడలో మంగళ సూత్రం కనిపించక దిక్కులు చూస్తుంది. మాది మైకు పెళ్లి.

సావిత్రి వాళ్ల పిల్లి వచ్చి నా పాదాలు నాకుతుంటే గిలిగింతలు అనిపించింది. దాన్ని అదిలించి చీర సర్దుకున్నాను. నాకు అక్కడ నిలబడాలని గాని, వంటింటి కౌంటర్ మీద చోటు చేసుకుని కూర్చోవాలని గాని అనిపించలేదు. కిచెన్ కు బెడ్రూము కు మధ్య ప్యాసేజ్ లో నడుస్తుంటే అదేంటో బాల్కనీకి బదులు లిఫ్టు ఎదురొచ్చింది. ఎలా వస్తేనేమి కావలసింది వచ్చింది కదా. నేను లిఫ్టులో కిందికి దిగిపోయాను. లిఫ్టు దిగి కుడి వైపు తిరిగి నడిచాను. పార్కింగ్ స్పేస్ ఏదో మూలన చీకట్లో అప్పుడే పుట్టినట్టు రమేష్ ఎదురొచ్చాడు. .

తోడి కోడళ్ల మధ్య నేనెలాగో అన్నదమ్ముల మధ్య తనూ అంతే. వాళ్లతో కలవలేడు. కలవకుండా వుండనూ లేడు. వాళ్లు వ్యాపారాలు, షేర్లు, పెండ్లి సంబంధాలు, తీర్థ యాత్రలు మాట్లాడుకుంటూ వుంటారు. వాటి మీద తనకు ఆసక్తి వుండదు. ఆసక్తి తెచ్చుకుని ఏమైనా మాట్లడబోతాడు. ఇవన్నీ నీకెందుకులే అన్నట్లు చూస్తారు వాళ్లు. ఇప్పుడు రమేష్ ఉద్యోగం వదిలేసి ఖాళీగా వుండడంతో మేము ఏమయినా సాయం అడుగుతామనే అనుమానం ఒకటి. మాటలు నడవవు. అందుకేనేమో తను సిగరెట్ల వెనుక దాక్కుంటాడు.

భలే జంట మేము. కథలు కవిత్వాలు అంటూ తిరుగుతుంటాం. దేవుడు, దయ్యాలు ఏమీ లేవంటాం. వ్యాపార వ్యవహారాలు మరీ నేలబారు సంగతులని నిరసిస్తుంటాం. మళ్లీ నేల మీద పాదాలు మోపే స్థలం కోసం గింజుకుంటూ వుంటాం.

అయితే వెళ్దామా. ఆ మాట మా ఇద్దర్లో ఎవరం అన్నామో గుర్తు లేదు. ఆటోలో వెళ్దామా, సెవెన్ సీటర్లోనా అని అలోచించాం. చీకటి. నడుస్తుంటే ఏది ఎదురొస్తే అది అనుకుని, నడుచుకుంటూ వెళ్లాం. ఎంత సేపు నడిచామో ఏమో, ఊరు దాటిపోయింది. పంట పొలాలు. పొలాల్లో లేత పైరు. వేరుశనగ, పొద్దుతిరగుడు పూలు దిగాలుగా వూగుతున్నాయి. నల్లగా మాడిపోయిన ముఖాలతో పువ్వులు. పల్చగా జబ్బు చర్మం మీద మచ్చల్లా వేరుశనగ. ఇంకొక్క వాన కురిస్తేనా... అని గొణుక్కుంటున్నాడొక రైతు.

అయ్యో, వూరంతా దాటి పొలాల్లోకి వచ్చాశామే అని వెనక్కి తిరిగి నడిచాం. చీకటి.

ఎందుకో తలెత్తి చూస్తే మేము మా అపార్ట్ మెంట్స్  దగ్గరున్నాం. పోనీ పాప దగ్గరికి వెళ్లిపోదాంఅన్నాన్నేను. పాప అంటే మా అమ్మాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీరు. ఒక్కతే కూతురు. చదువుకుంటానని ఢిల్లీ వెళ్లి అక్కడే వుండిపోయింది. తనను చూడ్డానికి వెళ్లాలని శాన్నాళ్లుగా అనుకుంటున్నాం. పిల్ల కళ్లల్లో పెట్టినట్లుంది. ఆర్థిక మాంద్యం రోజులు. ఉన్న చిన్న ఉద్యోగం ఎప్పడు ఊడుతుందో అని భయం. ఎలా ఉంటున్నదో ఏమో. హైదరాబాదు వచ్చెయ్యమంటే రాదు. గట్టిగా చెబుదామంటే, ఇక్కడ మాత్రం ఏముంది భద్రత?

నేను వెళ్లి ట్రెయిన్ టికెట్లు తీసుకుంటా, నువ్వు సర్దుకుని వచ్చెయ్ అని రమేష్ వెళ్లిపోయాడు. కా‍సేపటికి సూట్ కేసులో బట్టలు సర్దుకుని బయల్దేరాను. గేటు దగ్గర మా మదారు సాబు జట్కా కనిపించింది. తను అక్కడ వుండడమేమిటి అనుకున్నాను. చిన్నప్పుడు తన జట్కాలోనే పదిహేను కిలోమీటర్ల దూరం వేరే వూళ్లో హైస్కూలుకు వెళ్లేదాన్ని. ఇన్నాళ్ల తరువాత ఇప్పడు, హైదరాబాదులో మదారు సాబు? రామ్మా రమా! టైమైపోతాది అన్నాడు అచ్చంగా అప్పట్లాగే. ఏదో విషాదకర సంతోషం. జట్కాలో చాల ఇష్టంగా ఒదిగి కూర్చున్నాను.

కాస్త దూరం పోయే సరికి శాక్యముని, జనవాది, బాష్పాంజలి... అవి వాళ్ల కలం పేర్లు... ఎదురొచ్చారు. ఆటో కోసం చూస్తూ నడుస్తున్నట్లున్నారు. వాళ్లు రమేష్‍ కవిత్వం ప్రెండ్స్. ఏమిటి రమ గారూ వూరెళ్తున్నారా, రెడ్డి సాబ్‍ రావడం లేదా అన్నాడు శాక్యముని. రెడ్డి సాబ్‍ అంటే మా రమేష్రమేష్ రెడ్డి. వాళ్లు నా జవాబు కోసం ఎదురు చూడలేదు. నేరుగా వచ్చేసి జట్కాలో ఎక్కేశారు. పోనీ అన్నాడు బాష్పాంజలి నైసుగా మా మదారు సాబు వైపు తల సాచి.

శాక్యముని తన షర్టు జేబులోంచి ఒక కాగితం తీసి తనలో తాను చదువుకుంటూ, తనకు తాను తలూపుతూ కూర్చున్నాడు. జనవాది తన ప్యాంటు మీద దేశ పటాల్లాంటి రెండు టీ మరకలను దగ్గరగా కలిపితే ఎలాంటి బొమ్మ వస్తుందో చూడ్డానికి శ్రద్ధగా ప్రయత్నిస్తున్నాడు. అవి విడిగానే వుండనీ అన్నాడు బాష్పాంజలి. జనవాది ప్రశ్నార్థకంగా తలెత్తాడు. విడి విడిగా వుంటమే మేలు. సెలబ్రేట్‍ ది ఫ్రాగ్మెంటేషన్’ జవాబిచ్చి తల అటు వైపు తిప్పుకున్నాడు బాష్పాంజలి. 

కాస్త దూరం పోయే సరికి వాళ్లకు చాయ్ తాగాలనిపించింది. జట్కా ఆపించారు.

అరె, సూట్ కేసులో పుస్తకాలు పెట్టుకోలేదే జట్కా ఆగాక గుర్తొచ్చింది నాకు. పుస్తకాలు తీసి టేబుల్‍ మీద పెట్టి మరిచిపోయాను. ఢిల్లీలో ఎవరూ తెలీదు, పుస్తకాలు కూడా లేకుంటే బోరు... నేను గొణుక్కుంటూ జట్కా దిగిపోతుంటే, ఎందుకు దిగుతున్నానో తెలుసు అన్నట్లు చూశాడు మదారు సాబు, చిన్నప్పుడు జట్కా ఎక్కి నోట్‍బుక్ మరిచిపోయానని దిగిపోతుంటే ఎలా చూసేవాడో అలాగే.  

నేను పుస్తకాలు తీసుకుని వచ్చే సరికి అక్కడ జట్కా లేదు. వాళ్లకు టైం అయిపోతోందని జట్కా తీసుకుని వెళ్లిపోయారు. మా సూట్ కేసు రోడ్డు పక్కన ఒక ఇంటి అరుగు మీద వుంచి వెళ్లిపోయారు. అరుగు మీద సూట్ కేసు తెరిచి వుంది. వాటిలో రమేష్ బట్టలు లేవు. కొందరు పిల్లలు రోడ్డుకు అటు వైపు చిన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుతున్నారు.  పక్కన ఇంకో అరుగు మీద ఒక పెద్దాయన. ఆయన చెప్పాడు. క్రికెట్‍ ఆడుతున్న పిల్లలు సూట్ కేసులో రమేష్‍ బట్టలు చూసి ముచ్చట పడ్డారు. ఎవరికి నచ్చింది వాళ్లు తీసుకెళ్లారు. నేను వాళ్ల దగ్గరికి వెళ్లి రమేష్ మంచోడు తన బట్టలు తీసుకుంటే ఎట్టా అని అడుగుదామనుకున్నాను. వెళ్లాలని అడగాలని అనిపింలేదు.

ఏంచేయాలో తోచక నిలబడి చూస్తుంటే రమేష్ వచ్చాడు.

నువ్విక్కడ వుంటావని శాక్యముని వాళ్లు చెప్పారు. పద పోదాం అన్నాడు.

నేను రైలు టిక్కెట్ల గురించి అడగలేదు. దొరికి వుండవని అర్థమయింది. అయినా ఉన్నట్టుండి వెళితే ఢిల్లీకి టిక్కెట్లు దొరుకుతాయా, మరీ కల కాకపోతే?. సరేలే, అనుకుని ఇద్దరం బయల్దేరాం. సూట్‍ కేసు సంగతి ఇద్దరికీ గుర్తు రాలేదు. చీకటి. ఒక చౌరస్తా. దూరంగా జనం. రణగొణ ధ్వనులు. గొడవ గొడవగా మాట్లాడుతున్నారు. ఆందోళనగా ఏదో అరుస్తున్నారు. నేను చూసొస్తా. ఇక్కడే వుండు అని రమేష్ చీకట్లోకి వెళ్లాడు. చీకట్లో కలిసిపోయాడు. ఎప్పుడూ ఇంతే. ఇక వీడు రాడు అనుకుంటూ నేను అక్కడే నుంచున్నా.  

కాసేపటికి తిరిగొచ్చాడు. చీకటి. మాటలను బట్టి తెలుస్తోంది. తను రమేషే. అప్పటికి గుంపు చెదిరిపోయినట్టుంది. కొంత దూరం నడిచే సరికి నాకు చాత కాలేదు. రమేష్ రెండు చేతుల్లో నన్ను ఎత్తుకుని బయల్దేరాడు. వాడిలో బ్యూటీయే అది. దేన్నయినా చాల తొందరగా ఎత్తుకుంటాడు. ఇక వీడు వదిలెయ్యడు అనుకుంటూ వుండగా, మనల్ని పక్కన ఏ అరుగు మీదనో జాగర్తగా దించేసి వెళ్లిపోతాడు. అప్పటికి అలవాటు పడి వుండటం వల్ల మనకు కోపం వస్తుంది. ఎత్తు అలవాటయితే పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా పాడైపోతారని వాదిస్తాడప్పుడు. అట్టాంటి వాదాలు ఇంకా చాలా వున్నాయి తన దగ్గర.

రమేష్ చాల వేగంగా నడుస్తున్నాడు. తను నన్ను ఎత్తుకున్నాడో ఏ ఆటో లోనో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాడో‍ తెలీలేదు. గుంపులోంచి వచ్చిన ఇద్దరు ముగ్గురు మాతో నడుస్తున్నారు. వాళ్ల వొంటి మీద రమేష్ బట్టలున్నాయి. నేను గమనించి కూడా వూరికే వుండిపోయాను. ఆమాత్రం రమేష్ కు తెలియదా.  

కాస్త దూరం పోయే సరికి మరొక గుంపు కనిపించింది. కనిపించిందో వినిపించిందో. మళ్లీ ఏదో గొడవ జరిగినట్లుంది. రమేష్ మళ్లీ నేను చూసొస్తా, ఇక్కడే వుండు అని చీకట్లో కలిసిపోయాడు. మళ్లీ నేనుఎప్పుడూ ఇంతే. వీడు రాడు అనుకుంటూ అక్కడే నుంచున్నా.

ఈసారి నాకు బాగా దగ్గరగానే ఎవరో అరుస్తున్నారు. డిమ్ లైట్లతో ఒక పోలీసు వ్యాను ఆగి వుంది. నేను పేవ్మెంటు మీద పక్కన గోడ వైపు జరిగి నుంచున్నాను. పోలీసులు ఎవర్నో ఎత్తుకుని తెచ్చి వ్యాన్ లో పడేస్తున్నారు. అతడు వాళ్ల చేతుల్లోంచి తఫ్పించుకోడానికి ప్రయత్నిస్తూ అరుస్తున్నాడు. విప్లవం వర్ధిల్లాలి, పోలీసు జులుం నశించాలి. వీళ్లు నన్ను ఎన్ కౌంటర్ చేయడానికి తీసుకెళ్తున్నారు అని అతడు అరిచే అరుపులను ఎవరూ పట్టించుకోడం లేదు.

భయమేసింది. పోలీసు వ్యానులో ఎక్కుతున్నది రమేషేమో అని చీకట్లోకి కళ్లు చికిలించి చూశాను. రమేష్ కాదు. రమేష్ అంత ఎత్తు లేడు. లేత మొహం. నాకు తెలుసు. తన పేరు వీరాస్వామి. చాల మంచి మనిషి. బీడి కార్మికుల్లో పని చేస్తాడు. ఏం మాట్లాడినా ఏదో లోతుల్లోంచి మాట్లాడుతున్నట్టుంటుంది. మామాలుగా మనం గుర్తించని సత్యాల మీద టార్చి వేసి చూపించినట్లుంటుంది. తను... తను... అయ్యో! నేను పక్కన గోడ లోనికి మరింతగా ముడుచుకుపోయాను. గోడలో కలిసిపోయాను. అక్కడ నేను లేను. మరెవరో వున్నాను.

రోడ్డుకు అటు వైపు ఒక ఇరానీ హోటల్‍. చీకట్లోనే జనం చాయ్ తాగుతున్నారు, అచ్చం చీకటిని తాగుతున్నంత ఇష్టంగా. వాళ్ల మధ్య శాక్యముని వాళ్లు కనిపించారు. నాకిప్పుడు చీకటే బాగుంది చూడ్డానికి. అలవాటు పడిన చీకటి. జనవాది తన గులాబీ రంగు పెదిమలు కదిలిస్తూ, ఎడం చేతిలో కాగితం పట్టుకుని కుడి చెయ్యి చాచి వూపుతూ పొయెం చదువుతున్నాడు. పొయెం ఎలా వుంది అని అడుగుతున్నట్లు నావైపు చుశాడు. అయితే, దేశ పటాలు కలిశాయా అని అడిగాన్నేను కళ్లతోనే.

వీరాస్వామిని తీసుకెళ్లారు, తెలుసా అన్నాన్నేను మళ్లీ కళ్లతోనే. అలాగా, తెలియదే అన్నట్లు చుశాడు పక్కన బాష్పాంజలి. తనూ ఒక పొయెం చదవుతానని కాగితం బయటికి తీశాడు శాక్యముని. తను నన్ను గమనించినట్టు లేడు. నేను సందేహంగానో సిగ్గుగానో అసూయగానో తల పక్కకు తిప్పుకున్నాను. చీకటి.

నా పక్కన గోడ దగ్గర ఎవరో నుంచున్నారు. మేము దారి తప్పి చేలల్లోకి వెళ్లినప్పుడు కనిపించిన రైతులా కనిపించాడు. కాదు. మా తమ్ముడు. మోహన్ రెడ్డి. మా ఇద్దరి మధ్య వయసు తేడా బాగా తక్కువ. ఊళ్లో వుండి వ్యవసాయం చేసుకుంటాడు. నా వైపు, రమేష్ వైపు అందరూ హైదరాబాదు చేరారు. మాకు వూరి సంగతులు ఏం చెప్పాలన్నా తనే. వూరు చూడాలనిపించినప్పుడు వెళ్లడానికి తానొకడున్నాడని ఒక భరోసా. తను ఇప్పుడు, ఇక్కడేమిటి అని చూశాను.

మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడ లేదు. మాట్లడితే మీరు ఆర్చేవాళ్లా తీర్చేవాళ్లా అన్నట్లు ముభావంగా కనిపించాడు. వారం రోజుల క్రితం తన నుంచి ఫోన్. రాక రాక వచ్చిన వర్షాలకు బాయి ఒక పక్క గోడ కూలి, ఇంజను బాయిలో పడిపోయింది. గోడ, ఇంజను బాగు చేసుకుని చేనికి నీళ్లు పెట్టుకోవాలంటే పాతిక వేలయినా కావాలి. మేము ఏమీ చేయలేకపోయాం. ఉన్న సేవింగ్స్ ఖర్చయి పోతే తరువాత మా కథేమిటని ఆలోచించాం. అదంతా గుర్తొచ్చి నాకు ఏడుపొచ్చింది. పలకరించడానికి నోరు పెగల్లేదు. ఈలోగా మోహన్ రెడ్డి చీకట్లో కలిసిపోయాడు.  

కాసేపటికి రమేష్ వచ్చాడు. అలా వున్నావేం జవాబు ఆశించని స్వరంతో అడిగాడు. నేను నడవలేనన్నాను. ఫంక్షన్ కు వద్దంటే బయల్దేర దీశావు అన్నాను. అది రమేష్ కు వినిపించలేదు. నడుస్తావా ఎత్తుకోనా‍ అన్నట్లు చూశాడు నా వేపు.

ఎదురుగా ఒక ఇరుకు ఇనుప మెట్ల  స్పైరల్‍ స్టెయిర్ కేసు. తాసు పాము పైకెత్తిన పడగ లాగుంది. చేత్తో పట్టుకోడానికి దానికి రెయిలింగ్ వుంది.

పట్టుకోడానికి ఏదో ఒకటి వుంది కదా అని ఇద్దరం ఎక్కేశాం.

రెండు మూడు మెట్లు ఎక్కే సరికి లోపల్నించి చెమ్మ చెమ్మగా మాటలు వినిపించాయి. మాటలు తడి తడిగా లేవు. వెచ్చగానూ లేవు. చెమ్మ చెమ్మగా వున్నాయి. వెన్నుపూసలోంచి చలి పుట్టికొచ్చింది. ఏదో ఒక మెట్టు మీద ఆగిపోయాం. ఎవరో పైమెట్టు మీంచి పేవ్మెంటు మీద మురికి నీళ్ల గుంటలోకి తుపుక్కున వుమ్మేశారు. ఉమ్మి దెబ్బకు ఒక నల్లని కప్ప పిల్ల నీళ్ల లోంచి పక్కకు దూకింది.

అది ఒక పెద్ద బిల్డింగు. నడి మధ్యలో ఇటు నుంచి అటు వెళ్లడానికి ఒక ఇరుకు ప్యాసేజ్. ప్యాసేజ్ కి అటు ఇటు బాగా కిందికి వున్న కప్పు కింద చిన్నచిన్న గదులు. ప్యాసేజ్ భాగం ఒక మాదిరి గుహలా వుంది. లోపల మనుషులు కదుల్తున్నారు. చిన్న గొంతులతో మాట్లా‍డుతున్నారు. మనుషుల కాళ్ల చప్పుళ్లు, సీసాలు గ్లాసుల చప్పుడుతో కలిసి వినిపిస్తున్నాయి, అర్ధరాత్రి అటక మీద ఎలుకల చప్పుడు లాగ. ప్యాసేజ్ మావైపు చివర ఒకమ్మాయి నుంచుని వుంది. క్షణానికోసారి పైట తీసి వేసుకుంటోంది. సన్నగా, ఆకలి వేస్తున్నట్లుగా వుంది. ఈ లోపల ఎవరో మనిషి వచ్చి మాకు బాగా తెలిసిన వాడిలా మాట్లాడాడు.

ఏం సార్, చొక్కా లేకుండా వచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడతడు.

చూస్తే రమేష్ వంటి మీద నిజంగానే చొక్కా లేదు. ఇంత వరకు చీకటిలో ఇద్దరం గమనించలేదు. నన్నెత్తుకున్నప్పుడు స్పర్శ కూడా తెలీలేదు. నా చొక్కా ఇస్తా వేసుకుంటారా సార్ అని కొత్తతను అడిగాడు.ఎందుకు వేసుకోను మిత్రమా అన్నాడు రమేష్. అతడు అందుకోసమే ఎదురు చూస్తున్నట్లుగా  తన తెల్లని పైచేతుల ఖద్దరు చొక్కా తీసి ఇచ్చాడు. అదేంటో ఏమో, రమేష్ కు ఇచ్చాక కూడా అతడి వంటి మీద చొక్కా వుంది, సరిగ్గా అదే.

ఈలోగా ఒక పెద్దతను వచ్చాడు. ఎత్తుగా, లావుగా, నల్లగా, జుత్తు ముఖం మీదికి పడుతూ కొంచం కోపంగా, కొంచెం మొరటుగా వున్నాడు. రెండు వేళ్ల మీద వుంగరాలు మెరిశాయి. చొక్కా ఇస్తే వేసుకుని అలా వెళ్లి పోవడమేనా అని రమేష్ ను అడిగాడు. నీ దగ్గరున్నది ఇచ్చిపో అన్నాడు. అతడు గద్దించ లేదు. సినిమా టికెట్ కౌంటర్ వద్ద మనిషి డబ్బు కోసం చేయి చాచినట్లు మాట్లాడాడు.
 
మా దగ్గరేమున్నయ్ ఇవ్వడానికి? బస్సు ఛార్జీల మొయిని పది రూపాయలన్నా లేవు. మా దగ్గర ఇంకా ఏమయినా వున్నాయా అని ఇద్దరం చూసుకున్నాం. రమేష్ చేతికి వాచీ కూడా లేదు. పాపం, రమేష్! ప్రతిసారి వాచీలో డే అండ్ డేట్ చూసుకుంటే తప్ప ఇది ఇరవయ్యొకటో శతాబ్దమో పంతొమ్మిదో శతాబ్దమో గుర్తుండదు. రోజుకు కనీసం ఒకసారన్నా తేదీ వారం అడిగి విసిగిస్తుంటాడని మొన్న విజ‍య‍ దశమి నాడు... తన బర్త్ డేకి... నేనే ఆ వాచీ కొనిపెట్టాను. వాచీ ఏమయింది, వాచీ అని అడిగాను ఆందోళనగా. మొన్న కొనిపెడితే అప్పుడే పోగొట్టుకుంటావా అని కోపంగా. నా మాట ఎవరూ వినిపించుకోలేదు.

ఇప్పుడు కాలంతో ఏం పని అన్నట్లు చూశాడు కొత్తతను నా వైపు.

ఎప్పుడూ నా చెవులకు వుండే రింగులు కూడా లేవు.

మీ దగ్గరున్నయ్, వున్నయ్ అంటూ మాకు దగ్గరగా వచ్చాడు. చూస్తే అప్పటికి మేము స్టెయిర్ కేస్ పైమెట్టు మీదున్నాం. కాస్త పక్కకు జరగడానికి కూడా‍ స్థలం లేదు. అతడి వూపిరి మాకు తగులుతున్నట్లయింది. నేను మొహం తిప్పుకున్నాను.

ఈ చొక్కా నీది కాదు కదా? మిత్రమా! అన్నాడు రమేష్.

తను మిత్రమా అని పిలవగానే ఎవరైనా మంత్రం వేసినట్లు మిత్రులయిపోతారని, ఇంక తను పోట్లాడాల్సిన పని వుండదని రమేష్ కు ఎప్పటినుంచో నమ్మకం. ఇన్ని పోట్లాటల తరువాత కూడా అదే నమ్మకమా అనిపిస్తుంది నాకు. నిజానికి తనకూ నమ్మకం లేదు. ఎట్టాగో సర్దుకుని బతకడానికి వుపయోగించే స్ట్రాటెజీ అది. ఎవరి కోపింగ్ అప్ మెకానిజం వాళ్లది.

నాది కాకపోతే నీదా? నీదా, చెప్పు? అడిగాడతను చాల మర్యాదగా. ఈ చిక్కు ప్రశ్నకు జవాబు చెబితే వెళ్లిపోవచ్చు అన్నట్లు హుందాగా.

నాది కాదు. అదిగో అతడి... రమేష్‍ చుట్టూ చూశాడు తనకు చొక్కా ఇచ్చిన మనిషి కోసం. కనిపించలేదు.
 
అదీ నేనే, ఇదీ నేనే అన్నాడు కొత్తతను.

ఏం చెప్పాలో తోచక రమేష్ గమ్మున వుండిపోయాడు.

అప్పుడు గుంపులోంచి నీతో పాటు వచ్చిన ముగ్గురు కూడా నేనే అన్నాడతడు. అదెందుకు చెప్పాడో నాకు తెలియలేదు. కాని అతడు చెప్పింది నిజమే అనిపించింది.

మీ దగ్గర ఏం లేదంటారేం. ఉంది కదా. నో ఫ్రీ మీల్స్ అన్నాడతడు నా వైపు చూస్తూ.

నాకు భయం వేసింది. ఆడవాళ్లకు అదనంగా వుండే భయం. చీకటి.

ఇక చాల్లే పద అన్నాన్నేను.

నాకెందుకో చిక్కడపల్లి, గుల్షన్ కెఫేలో పిట్టలోళ్ల మాటలు వింటూ చాయ్ తాగాలనిపించింది. వాళ్లు పిల్లా పాపతో వచ్చి చాల ప్రేమగా‍ కబుర్లు చెప్పుకుంటూ టీలో బిస్కెట్‍ ముంచుకుని తినేవాళ్లు. చిన్న పిల్లలు గునగున నడుస్తూ మాదాకా వచ్చి కళ్లలో కళ్లు పెట్టి నవ్వేవాళ్లు. నేను నవ్వు ముఖంతో చేయి చాచి వాళ్ల జుట్టు సర్దితే అమ్మలు సంతోషంగా చూసే వాళ్లు. పిట్టలోల్లు ఇప్పుడు లేరు. ఎక్కడికి ఎగిరిపోయారో ఏమో. శాన్నాళ్లయింది వాళ్లను లేపేసి. ఆ స్థలంలో ఇలాగే గుహల్లాంటి ప్యాసేజ్ లతో బిల్డింగులు కట్టారు. నాకు శాక్యముని వాళ్లు కూడా గుర్తుకొచ్చారు. హోటల్లో వాళ్లకు కాస్త దూరంగా టేబుల్‍ మీది కూజా ఎత్తి నీళ్లు తాగుతున్న మా తమ్ముడి దగ్గరికి వెళ్లాలని అనిపించింది. పిట్టలోళ్ల మాదిరి మా తమ్ముడితో కలిసి టీలో బిస్కట్‍ ముంచుకుని తినాలనిపించింది. తను ఊరి సంగతులు, ఇంటి సంగతులు చెబుతుంటే వినాలనిపించింది.  

వాళ్లు కూడా నేనే అన్నాడతడు.

అతడి మాటలు చాల మామూలుగా, మనకు బాగా తెలిసి వుండీ ఎప్పటికప్పుడు మరిచిపోయే మాటల్లా వున్నాయి. భయంతో, సిగ్గుతో కుంచించుకు పోవడం వల్లనో, అప్పటికే మేము కొన్ని మెట్లు దిగి వుండడం వల్లనో... అతడు ఐదారింతలు ఎత్తుగా, లావుగా, ఆకాశాన్ని ఆక్రమిస్తున్నట్లుగా కనిపించాడు. ఒక్కడుగా కాకుండా‍ చాలా మందిలా కనిపించాడు. అతడికి చాల చేతులు, చాల తలలు వున్నట్లనిపించింది. బోధ చేస్తున్నట్లుగానో ఆజ్ఙాపిస్తన్నట్లుగానో ఒక కుడి చెయ్యి చాచి వుంది.

ఇప్పుడు అందరూ నేనే పాట పాడుతున్నట్లున్న అతడి గొంతు మా చుట్టూరా ఆవరించింది.  
          
        మాకు ఏంచేయాలో తోచ లేదు.

పోనీ, చచ్చిపోతే పోలా అనిపించింది. చచ్చిపోవడమంటే అన్నీ మరిచిపోవడం, ఏదీ కాకుండా అయిపోవడం. అదెలాగో మాకు తెలియలేదు. మనుషులు తమ అనుభవంలో వున్నవాటినే కలగంటారు. మనుషులు అనుభవాలకు బందీలు. అనుభవంలో లేనివి కలగనలేరు. మరణం మా అనుభవంలో లేదు. సరే, అది కుదరదులే అనుకున్నాం.

అయితే, మళ్లీ నడవాలా?

ఇప్పుడు నాకు రమేష్ ను కూడా నమ్ముకోవాలని లేదు.

ఎవర్నీ, దేన్నీ నమ్ముకోకుండా ఎలా నడవడం? ఎలా బతకడం?  

భగవంతుడా!  

(ఆదివారం వార్తలో ప్రచురితం)                                         
Comments