చిన్న ఆశ - తాడికొండ కె.శివకుమార శర్మ

    వెలుగురేఖలు చీకటికి చిచ్చుపెట్టకముందే ఆ చౌరస్తావైపు నాలుగు దిక్కులనుండీ చేరుతున్న మానవ ప్రవాహాన్ని గమనించినవాళ్ళు లేకపోలేదు.  రాలీలకీ, ధర్నాలకీ హైదరాబాద్ ప్రజలు కొన్నేళ్లుగా తలవంచుకు తప్పించుకు తిరగడం తప్ప ఏమీ చెయ్యడం అలవాటు లేనివాళ్లయినాకూడా వాళ్ల నావరించిన నిద్రమత్తు పూర్తిగా పోయివుంటే ఆ ప్రవాహ ప్రత్యేకతని గుర్తించేవుండేవాళ్లు. 

    అది ఆప్రవాహంలో కనిపించని బానర్లగూర్చీ, జెండాలగూర్చీ, పార్టీ నాయకుల కటౌట్‌లగూర్చీ అని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెబుతోంది చీకటితో కలిసిపోయేటంతగా మాసిపోయిన వాళ్ల బట్టలగూర్చీ, వాటికున్న చిల్లులలోంచి కనిపించే మట్టికొట్టుకుపోయి అంతకన్నా నల్లబడ్డ వాళ్ల శరీరాలగూర్చీ, వయసుభారంతోగాక తిండిలేమితో వెన్నెముకకి వెన్నెముకకి అతుక్కుపోయి శరీరాన్ని విల్లంబులా వెనక్కి వంచేసిన వాళ్ల పొట్టలగూర్చీ, ఆ శరీరాన్ని ఈడుస్తూ అక్కడికి చేరవేస్తున్న వాళ్ల నడకలగూర్చీ.  అలా ఈడవడానికి గురయినవాళ్లల్లో పిల్లలున్నారు, తాతలున్నారు, పిల్లతాతలున్నారు. రక్తసంబంధం కాకపోయినా పిన్నీ, అత్తా, మామా, బావా, బాబాయ్ అనే వావివరుసలున్నయ్.  తిండిలేమివల్ల మాత్రమేకాక సరయిన వైద్యసహాయం లేకపోవడంవల్లా, తండ్రులనబడ్డవాళ్లు కాళ్లూ చేతులూ విరిచేయడంవల్లా కళ్లు పొడిచేయడంవల్లా వాళ్ల పంచనచేరి ఎప్పటికీ వదలనని ప్రమాణం చేసిన అంగవైకల్యం ఉన్నది. మీరుతప్ప నాకాశ్రయం ఇచ్చేవాళ్లెవరని దీనంగా ప్రార్థిస్తూ వాళ్లని అంటిపెట్టుకుని జ్యేష్టాదేవి ఉన్నది.  

    ఎలక్ట్రిక్ రైళ్లున్న కాలంలో గమ్యం చేరినందుకు బొగ్గు ఇంజన్ వదిలిన నిట్టూర్పులాగా వాళ్లు ఆ చౌరస్తాలో చతికిలబడడం మొదలుపెట్టారు. ఆ జంక్షన్లో ట్రాఫిక్ రెండే రకాలుగావుంటుంది - ఎక్కువగానూ, తక్కువగానూ.  చీకటి చిక్కుముడిని విప్పని ఆ తక్కువ ట్రాఫిక్ వుండే సమయంలో మామూలుగా వెళ్లే వాహనాలు విమానంలా ఎగిరినంత ఆనందపడతాయి. అందుకని ఆ అడ్డొచ్చిన ప్రవాహంమీద కలిగిన చికాకుతో మామూలుగాకన్నా ఎక్కువగా నల్లపొగల్ని అక్కడ చతికిలబడుతున్నవాళ్ల మొహాలమీద తమ అసంతృప్తి ముద్రగా గుద్ది మరీ వెళ్లాయి. మరి కాసేపయిన తరువాత అక్కడికి చేరిన ద్విచక్ర, త్రిచక్ర, మల్టిపుల్‌చక్రశకటాలకి ఆ చౌరస్తాకి చుట్టూ గోడకట్టి నల్లముద్రలని వెనకవాళ్ల మొహాలమీద వేయడంతప్ప చెయ్యగలిగిందేమీ లేకపోయింది.

    ఆ చౌరస్తా సామాన్యమైనది కాదు. ఒప్పుకోరుకానీ, చుట్టుపక్కల పదికిలోమీటర్ల ప్రాంతంలోవుండే మనుషులు రోజూ చుట్టూ తిరిగే గుడి అది.  పంజాగుట్ట, లకడీకాపుల్, రాజ్‌భవన్, ఆనంద్‌నగర్ కాలనీ, బంజారాహిల్స్, టాంక్‌బండ్ మీదుగా అక్కడికివచ్చే ప్రజలు రోజూ గుడిలో గంటలు కొట్టినట్లుగా అక్కడ విపరీతంగా హారన్లు మోగించి తాము అక్కడికి వచ్చామని హాజరు వేయించుకుని వెడుతూంటారు. చౌరస్తాలో చతికిలబడ్డ గుంపుచుట్టూ కనుచూపుమేర దడిగట్టిన ఆ వాహనాలన్నీ ఆగకుండా హారన్లు మోగిస్తూ ఆవేళ దేవుడికి చెముడొచ్చిందేమోనని ఎక్కువగా "హాజర్" అని చెప్పడం మొదలుపెట్టాయి.

    ఆ హాజర్లు కాదు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి) సుఖ్విందర్ సింగ్‌కి వినిపించింది - డబుల్‌బెడ్ పక్కనేవున్న సెల్‌ఫోన్ చేసిన గణగణ.

    "హలో" అని అవతలవాళ్లు చెప్పింది విని, "కౌన్ సా పార్టీ?" అనడిగాడు - కత్తితో పొడవబడ్డవాణ్ణి హాస్పిటల్‌కి తీసుకుని వెడితే ముందుగా "పొడిచిన వాడెవడు?" అని అడగడానికి అలవాటుపడ్డ డాక్టర్లలాగా. ధర్నాలు, రాస్తారోకోలు ఏదో ఒక పార్టీ ఆదేశాలమేరకు జరిగే కార్యక్రమాలని అతను ఉద్యోగంలో చేరేముందే అర్ధంచేసుకున్నాడు. అవతలనించీ వచ్చిన జవాబు విని మంటెత్తిపోయాడు. "నహీ మాలూమ్? పఢనా ఆతాహై క్యా? బానర్స్ దేఖ్. ఝండా దేఖ్!" కామన్‌సెన్స్‌ని కృష్ణుడి గీతోపదేశంలా బోధించాడు. జవాబుని విన్న తరువాత నిద్రమత్తు తొలగింది. "బానర్స్ బినా, ఝండా బినా యే క్యా ధర్నా హై? నహీఁ సమఝతా. వున్ కో పూఛో. దేఖో క్యా జవాబ్ దేతా."

    "అడిగాం సార్. ఎవరికీ తెలియదంటున్నారు," అన్నాడు అవతలనించీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డిసిపి) కృష్ణంరాజు. 

    "డిడ్ యు కాంటాక్ట్ ది పొలిటికల్ పార్టీస్?"

    "యస్సర్. నేను కాంటాక్ట్ చేసింది లోయర్ లెవెల్స్‌ని. వాళ్లకేం తెలియదంటున్నారు."

    "నోబడీ సాట్ పర్మిషన్ ఫర్ దిస్ సిటిన్. దిసీజ్ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్. క్లియర్ ది చౌరస్తా" ఆర్డర్ జారీ చేశాడు.

    "క్యా ప్రాబ్లం హై?" అడిగింది ఏసిపి భార్య రేష్మా.

    "బ్లడీ బెగ్గర్స్," చిరాకుపడ్డాడు ఏసిపి.

* * *

    "ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర ఏం జరుగుతోంది?" పదిగంటల ప్రాంతంలో చీఫ్ మినిస్టర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సి.పి.)ని ప్రశ్నించాడు.

    "ఎవిరిథింగ్ అండర్ కంట్రోల్. బెగ్గర్స్ సిటిన్. డి.సి.పి. కృష్ణంరాజు ఈజ్ ఇన్‌ఛార్జ్," సి.పి. శ్రీనివాస పిళ్లై జవాబిచ్చాడు.

    "మనోళ్లు కాదనుకుంటా సెకట్రీ. మన పార్టీ హైకమాండ్‌తో మాట్టాడి కన్‌ఫర్మ్ చెయ్."

    "ఆల్రెడీ కనుక్కున్నాను సార్. కాదు," అన్నాడు సెక్రటరీ.  సి.పి. పిళ్లై కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు లాఠీఛార్జీ జరిగినా ఫరవాలేదు.

    "దొంగ దెబ్బ తీశారా ఎగస్పార్టీవోళ్లు?" సి.ఎం. ప్రశ్నించాడు.

    "ఎవరూ సంబంధం లేదన్నారు," సి.పి. పిళ్లై జవాబిచ్చాడు.

    "హౌ డిడ్ వుయ్ నాట్ నో దిస్ విల్ హాపెన్?" సెక్రటరీ సి.పి.ని ప్రశ్నించాడు. ఆ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్‌నించీ ఆ ప్రశ్న వస్తుందని తెలిసి జవాబుని ఎప్పుడో రెడీచేసి పెట్టుకున్నాడు సి.పి. "ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్."

    ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా జవాబుతో రెడీగానే వున్నాడు. "దిసీజ్ నాట్ టెర్రరిజమ్. ఆ బెగ్గర్స్ అక్కడ పార్కులో కూర్చున్నట్టు కూర్చున్నారుతప్ప సంఘ విధ్వంసక కార్యక్రమాలేవీ చేపట్టలేదు. దిసీజ్ ఓన్లీ ఎ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్."

    సి.పి.కి మంటెత్తింది. "ఎస్, మిగిలిన రాస్తారోకోల్లాగా బస్సులు తగులబెట్టడాల్లాగా, బాంబులు పేల్చడాల్లాగా కాదు. ఇదొక్కటే లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్," గొంతులో వెటకారం మాటల్లో ఈటెలయింది.  అయినా, ఆ పొజిషన్లల్లోకి రావాలంటే కవచాలు తగిలించుకోవడం తప్పనిసరి. అందుకే అట్లాంటి మాటలని ఎవరూ పట్టించుకోరు - శాసనసభలో దొర్లే తిట్లని పట్టించుకోనట్లుగానే.

    "గరీబోళ్లతో పిచ్చర్ దిగితే ఎట్లుంటదంటావ్?" అన్నాడు సి.ఎం. సెక్రెటరీతో. ఆయన సలహా అడిగినప్పుడల్లా తరువాత జరగబోయే కార్యక్రమమేదో తెలిసినవాడు గనుక "సి.ఎం. అక్కడికొస్తున్నారు" అన్నాడు సెక్రటరీ సి.పి.ని చూస్తూ. సి.పి. ద్వారా ఆదేశాలనందుకున్న పోలీసులు వలయాకారంలో ధర్నాని చుట్టుముట్టడంతప్ప మరేమీ చెయ్యలేకపోయారు.

* * *

    అష్టదిగ్బంధనం చేసివున్న ఆ చౌరస్తాలోకి అభిమన్యుడు కాకపోయినా సి.ఎం. తేలిగ్గానే చేరగలిగాడు. "ఇందాక టీవీలో చూసినప్పుడు ఇక్కడ జెండాలూ, బానర్లూ ఏవీ లేవు?" అన్నాడు సెక్రటరీతో.

    "ఇప్పుడు కూడా వాళ్ల చేతుల్లో ఏవీ లేవు సార్," అన్నాడు సెక్రటరీ టెక్నికల్‌గా మాట్లాడుతూ. డి.సి.పి. ఎంక్వరీని ఎడ్వైస్‌గా తీసుకుని ఎగురుకుంటూ వచ్చి జెండాలతో చుట్టూ చేరారు రకరకాల పార్టీల ప్రతినిధులు. అక్కడ మొండి కొడవలి, అందివ్వని చెయ్యి, కదలని సైకిలు, వాసనలేని కమలం జెండాలమీద ఎగురుతున్నాయి. 

    జరుగుతున్న హడావుడినిబట్టీ అక్కడికొచ్చిన వ్యక్తి పెద్ద రాజకీయ నాయకుడని అర్ధమైంది అయిదారు గంటలుగా అక్కడ నేలమీద చతికిలబడ్డవాళ్లకి.  సి.ఎం.కి దగ్గరగావున్న వాళ్లు లేచినిల్చున్నారు.

    టీవీ లైవ్ కవరేజ్‌లో ఏంకర్ సౌమ్య రిపోర్టర్ ఉమేష్‌ని అడిగింది - "సో. ఉమేష్. ఇది - డు యౌ థింక్ - దిసీజ్ మన ఓన్ ఆక్యుపై ఖైరతాబాద్ చౌరస్తా - ఓ.కె.సి?"

    "చూస్తుంటే - వుయ్ కెన్ థింక్ లైక్ దట్.  కానీ అరబ్ స్ప్రింగ్, అమెరికాలో ఆక్యుపై వాల్‌స్ట్రీట్ రెండిట్లో అవన్నీ చదువుకున్నవాళ్లు చేసిన పని - జాబ్స్ వున్నా లేకపోయినా. బట్ హియర్ - వీళ్లు బెగ్గర్స్. ఇదే ఏ కాలేజీ స్టూడెంట్లో ఏ ఎన్జీవోలో చేస్తే ప్రెస్టీజియెస్‌గా వుండేది.  అప్పుడు దాన్ని ఓ.కె.సి. అని అనగలిగేవాళ్లం. వన్ మినిట్. సి.ఎం. మైక్ అందుకుంటున్నారు," అన్నాడు ఉమేష్.

    సి.ఎం.కి చాచిన మట్టికొట్టుకునివున్న చేతులని అందుకోవాలంటే గగుర్పాటుకలిగింది.  అందుకే పోలీసులు తెచ్చుకున్న మైక్‌ని పట్టుకున్నాడు. వాళ్లు ఆపూట రోటీకోసం అడుగుతుంటే వాళ్లకి తను చేపట్టబోయే ఘర్ ఘర్ కీ రోటీ ప్రోగ్రాం గురించి చెప్పాడు. ఆకలి మనిషికి ఎంత శత్రువో చెప్పాడు.  శత్రుసంహారాన్నే తన ధ్యేయంగా పెట్టుకుని రాముడు రావణుణ్ణి వేటాడినట్లు తను ఆకలిని వేటాడతానన్నాడు. (అది రావణ్ సినిమాలోననీ, రామాయణంలో రాముడు రావణుణ్ణి వేటాడలేదని ఆయన్ని సరిచెయ్యకూడదనీ సెక్రటరీకి తెలుసు.) రాబోయే పదేళ్లల్లో శత్రుసంహారం తథ్యమని నొక్కివక్కాణించాడు. మిగిలిన పథకాలగురించి ఆయన మాట్లాడబోతుంటే గందరగోళం మొదలైంది.

    అక్కడ కూర్చున్నవాళ్లు చేసిన రణగొణలమధ్య సి.పి.కీ, సి.ఎం. సెక్రటరీకేకాక ఉమేష్‌కి కూడా అర్ధమైంది వాళ్లు రోటీని ఆ క్షణమే కావాలంటున్నారని.

    "రోటీ లావో. హమ్ యహాఁసే నికలేంగే," అన్నదొక బలమైన కంఠం.

    "తూ పాగల్ హైఁ క్యా? అబ్ ఇతనీ రోటీ కహఁసే లావోంగే?" ఎ.సి.పి. దగ్గర్లో వున్న ఒకణ్ణి గద్దించాడు జనాలందరినీ చూపిస్తూ.

    "మీరు మాకందరికీ రోటీ ఇప్పిస్తరని చెప్పిండ్రయ్యా," అన్నదో ముసల్ది.  ఎ.సి.పి., సెక్రటరీ ఒకళ్ల మొహాలు ఒకళ్లు చూసుకున్నారు. వాళ్లకి గడ్డివాములో సూది దొరికినట్లయింది.

    "కహాఁ కౌన్?" డి.సి.పి. గద్దించాడు ముసల్దాన్ని.  అందరూ కూడా ముఖ్యమంత్రి వచ్చి రోటీ పంచిపెడతారని తెలిసిందని చెప్పారుగానీ చెప్పిందెవరో తెలియదన్నారు.  కొంతమందిచేత ప్రైవేటుగా నిజాన్ని కక్కించాలని టునాట్‌వన్‌నీ, త్రీనాట్‌ఫోర్‌నీ, రకరకాల నాట్‌లని ఆ బెగ్గర్స్‌ని పోలీస్ వాన్లల్లో ఎక్కించమన్నారు.  కాలేజీ అమ్మాయిలయితే చెయ్యో నడుమో పట్టుకుని ఈ నాట్‌లు లాక్కెళ్లేవాళ్లేగానీ వీళ్లని మాత్రం ముట్టుకోకుండా లాఠీలతో వాన్లవైపు తొయ్యడం మొదలుపెట్టారు. రోటీకోసం వస్తే లాఠీ ఎదురయిందని కోపమొచ్చి వాళ్లు పోలీసులని అటకాయించారు. బెదిరిపోవడం ఇష్టంలేని లాఠీలు తమసైజు ఎముకలున్న గూళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టాయి. నలువైపులా పోలీసులుండడంతో ఎవరినీ ముద్దుపెట్టుకోకుండా లాఠీలు వదల్లేదు.

    "గూండాలకి గౌరవమిచ్చే గవర్నమెంట్ బలంలేనివాణ్ణి బాదింది," "హైదరాబాద్‌లో జలియన్‌వాలాబాగ్," "అవర్ గవర్నమెంట్ - ప్రివెన్షన్లో లాస్ట్, ఓవర్ యాక్షన్లో ఫస్ట్," అని పత్రికలు హెడ్‌లైన్స్ రాశాయి. లాఠీ దెబ్బలు తిని కింద రాలిపోయినట్టున్న వాళ్లని పోలీలుసు ఒంటిచేత్తో ఈడ్చుకుపోవడాన్ని విడియోకెమేరాలేగాక ఐఫోన్లు, సెల్‌ఫోన్లు కాప్చర్‌చేసి నిముషాల్లో యుట్యూబ్‌లోపెట్టి ప్రపంచమంతా ప్రచారంచేశాయి.

    ప్రెస్‌మీట్ పెట్టిన సి.పి, ఎ.సి.పి, ఇందులో విదేశీహస్తం వుందని రూఢి అయిందన్నారు. (వాళ్లకి ప్రతాప్ అన్న పేరు వినిపించిందిగానీ అంతకంటే వివరాలు తెలియకపోవడంవల్ల విచారణని గుప్తంగా వుంచడంకోసం ప్రజలకి చెప్పలేదు.) "ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి ఇది అప్పొజిషన్ వేసిన ప్లాన్" అని అంతకుముందు సి.ఎం. చేసిన ప్రకటన మాటేమని ఆ పాత్రికేయులు ప్రెస్ చెయ్యలేదు.  

    ఏ పార్టీతోనూ సంబంధంలేకుండా, ప్రజల్లో ఒకశాతం కూడా ఉండరనిపించే బెగ్గర్స్ నగరజీవనాన్ని స్తంభింపజెయ్యడం, సి.ఎం.తో కలిసినాకూడా రోజూవుండే రోటీగూర్చి తప్ప వేరే డిమాండ్లేవీ వాళ్లు చెయ్యకపోయడం నగరవాసులని ఆశ్చర్యచకితులని చేసింది.

* * *

    "కంగ్రాట్యులేషన్స్," అన్నాడు డెప్యూటీ జనరల్ మేనేజర్ ప్రతాప్‌తో కరచాలనం చేస్తూ. అతనందించిన కవర్లో ప్రమోషన్ లెటర్‌తోబాటు కంపెనీ షేర్ సర్టిఫికెట్స్ వున్నాయని ప్రతాప్‌కి తెలుసు. ఇకనించీ అతను ఆ మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో రిసెర్చ్ వింగ్‌కి ఇంఛార్జ్. అవుట్‌సోర్సింగ్ వల్ల రిసెర్చ్‌ని కూడా ఆ కంపెనీ ఇండియాకి పంపించింది.  భార్యకి ఫోన్ చేసి చెప్పగానే ఇంక పిల్లల పెళ్లిళ్లగూర్చి ఆలస్యం చెయ్యడానికి వీల్లేదని చెప్పింది.  క్యాబిన్‌లో ఒంటరిగా కూర్చొని "నెక్స్ట్ స్టెప్" అనుకుంటూ టెక్స్ట్ మెసేజీలని పంపడం ప్రారంభించాడు. 

* * *

    సిటీ బస్సుల లైట్నింగ్ స్ట్రైకులకి అలవాటుపడ్డ హైదరాబాద్ నగరవాసులు కాలేజీ విద్యార్థులుకూడా అంత సమర్థులేనని జీర్ణించుకోలేకపోయారు - ఒక్క ఉద్యోగరీత్యా బషీర్‌బాగ్ చౌరస్తాని రోజూ దాటివెళ్లేవాళ్లు తప్ప. ఒకపక్క నిజాం కాలేజీ, రెండోపక్క గాంధీ మెడికల్ కాలేజీ ఉన్నాగానీ స్టేడియంనించీ పట్టుకొచ్చినట్లుగా అంతమంది విద్యార్థులని - అదికూడా ఏ పార్టీతోనూ సంబంధంలేకుండా, బస్సుల్లో ఎక్కణ్ణించీ తెప్పించకుండా - అక్కడ ఎలా పోగుచెయ్యగలిగారనేది రాజకీయ నాయకులకేగాక పోలీసులకిగూడా అంతుపట్టని విషయం.

    "ఇది ఆక్యుపై బషీర్‌బాగ్ చౌరస్తా కదా- ఓ.బి.సి.?" అన్నది యాంకరీమణి సౌమ్య.

    ఏ పార్టీతోనూ సంబంధంలేనివాళ్లు కదా అని వాళ్లని తనివితీరా తాకాలని పోలీసు లాఠీలు ఉవ్విళ్లూరాయి. అయితే పోలీసులకి విద్యార్థులలో ఉద్రేకం ఎక్కడా కనిపించలేదు. వాళ్ల చేతుల్లో రాళ్లు, సీసాలవంటి ఆయుధాలు కూడా లేవు. వాళ్లకి ఆ చౌరస్తాని యుధ్ధావనిగా మారుద్దామన్న ఉద్దేశంకూడా కనబడలేదు. ఎవరికీ ద్రోహంచెయ్యడానికి తయారయినట్లుగాకూడా వాళ్లు లేరు.  ప్రొఫెషనల్ ఉద్యమకారులని పోలీసులు తేలిగ్గానే గుర్తుపట్టగలరు గనుక అలాంటి రణప్రౌఢక్రియాశీలురు ఈ గుంపులో లేకపోవడం వాళ్లకి ఆశ్చర్యంకూడా కలిగించింది.

    "సౌమ్యా, లుక్స్ లైక్ వీళ్లు ఇక్కడ మీటింగ్ పెడతారని పోలీసులకికూడా తెలియదనుకుంటా. పోలీసులు లేట్‌గా వచ్చారు. ఈ స్టూడెంట్స్ లీడర్ ఎవరో తెలియదన్నారు. వెయిట్.  ఐ సీ సంథింగ్. టాంక్‌బండ్ వైపుకి వెళ్లడానికి విద్యార్థులు ట్రై చేస్తున్నారు," అన్నాడు ఉమేష్ లైవ్ టెలీకాస్ట్‌లో. కష్టపడకుండానే పోలీస్‌లైన్‌ దగ్గరకి చేరుకున్నాడు.

    "వుయ్ ఆర్ ది 99 పర్సెంట్," అన్నారు స్టూడెంట్స్ పోలీసులనీ తమనీ కూడా కలిపిచూపిస్తూ. " డబ్బులో దొర్లుతున్న ఒక శాతంవాళ్లకీ మనం కొమ్మెందుకు కాస్తున్నాం?" అని ప్రశ్నించారు.

    "మా డ్యూటీ మేం చెయ్యాలి.  మీరు ఇక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్నారు. మీరిక్కడినించి వెళ్లాలి," అన్నారు పోలీసులు.

    "అయితే ఇందిరా పార్కుకో పబ్లిక్‌గార్డెన్స్‌కో వెడతాం," అన్నాడొక కుర్రాడు తనకొచ్చిన ఎస్సెమ్మెస్ చూసి.

    "క్లాస్‌రూముకో ఇంటికో వెళ్లండి," అన్నాడు డి.సి.పి.

    "కాదు. సి.ఎం. దగ్గరికి వెడతాం," అన్నాడింకొక కుర్రాడు తనకొచ్చిన ఎస్సెమ్మెస్ చూసి.

    "కుదరదు," అన్నాడు డి.సి.పి.  (ఓ.కె.సి తరువాత అలాంటివాటి జోలికి వెళ్లకూడదని సి.ఎం. డిసైడ్  చేసుకున్నారు.) ఆయన మాటని పట్టించుకోకుండా ముందుకెళ్లబోయిన స్టూడెంట్స్‌ని లాఠీలు ముద్దాడాయి. తరువాత జరిగిన సంఘటన ఎత్తిన లాఠీలని పోలీసులు గాల్లోనే ఆపేలాచేసింది.

    మామూలుగా అయితే లాఠీ ఛార్జ్ మొదలవగానే పోగయిన జనం నాలుగు దిక్కులా పరుగెత్తాలి. రాళ్లని, సీసాలని పోలీసులమీదకి విసరాలి. ఆస్తులని ధ్వంసంచెయ్యడం మొదలుపెట్టాలి. అయితే ఇవేవీ జరగలేదు. లాఠీ దెబ్బలు తిన్నవాళ్లని వాళ్ల వెనకవాళ్లు పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. ఎక్కణ్ణుంచో అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్లు ప్రత్యక్షమయ్యాయి. అప్పుడు ఇంకో బాచ్ విద్యార్థులు పోలీసులముందు నిలబడ్డారు.  లాఠీలకి బ్రిటిష్ పోలీసుల చేతుల సహాయంతో మహాత్మాగాంధీతోబాటు దండి మార్చ్ చేసిన భారత స్వాతంత్ర్యయోధులకు దెబ్బలు వడ్డించిన తరువాత ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఇదే మొదటిసారి. 

    "బ్రిటిష్‌వాళ్లు లాఠీలని ఎత్తారంటే వాళ్లు వేరే జాతివాళ్లు. మనని తొక్కివుంచారు గనుక అర్థంచేసుకోవచ్చు. (బ్రిటిష్‌వాళ్లు మనల నేలినప్పుడూ, ఇప్పుడూకూడా లాఠీ ఛార్జీలు చేసింది మనవాళ్లే.) మన పోలీసులు ఎదురుచెప్పని మనవాళ్లని - పిల్లలని కూడా చూడకుండా అలా కొట్టడం శోచనీయం, గర్హనీయం," అని ఘోషించింది మీడియా. "టీవీలో ప్రత్యక్షప్రసార మవుతున్నాగానీ అన్ని వందలమందిని అలా చితకబాదడం సిగ్గు సిగ్గు," అన్నారు ప్రజలు. వాళ్లకి ఇలాంటివి చాటుమాటుగా జరగడమంటేనే యిష్టం.

* * *

    పోలీసులు ప్రతాప్‌ని అరెస్ట్ చెయ్యడం, ఓకెసి, ఓబిసిలను ఆర్గనైజ్ చేశాడన్న నేరాలకి అతణ్ణి బాధ్యుణ్ణిచెయ్యడం అతని కుటుంబసభ్యులను, స్నేహితులను దిగ్భ్రాంతులని చేసింది. అతను ప్రతిఘటించకుండా సంకెళ్లు వేయించుకుని తమతో రావడం, ఏ రాజకీయ పార్టీకూడా అతనికి వెనక లేకపోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అతను సిమ్ కార్డులని మార్చినా అతని సెల్‌ఫోన్‌నించే ఓబిసి విద్యార్థులకి క్షణక్షణానికీ ఆదేశాలు అందెయ్యని తమకు ఆధారాలు దొరికాయని పోలీసులు ప్రకటించారు.  టీవీలో లైవ్ కవరేజ్ చూస్తూ కుర్రాళ్లకి ఎస్సెమ్మెస్‌లు పంపాడనీ, ఓకెసి, ఓబిసి రెండిటికీ ముందుగానే రిపోర్టర్ ఉమేష్‌కి వార్తని చేరవెయ్యడంవల్ల పోలీసులకంటే ముందుగానే ఉమేష్ అక్కడికి చేరుకున్నాడనీ పోలీసులు స్టేట్‌మెంటిచ్చారు.

    అరెస్ట్ కాకముందే ప్రతాప్ కోరిన ప్రకారం అతని స్నేహితుడు మీడియా‌కి ఒక కవర్ అందజేశాడు. మీడియా అందులోని స్టేట్‌మెంట్‌ని యధాతథంగా ప్రజలకు అందజేసింది.

    "అందరికీ నమస్కారం. ఈపాటికి నాగూర్చీ నా కుటుంబాన్నిగూర్చీ వివరాలన్నీ మీకు తెలిసేవుంటాయ్. పెళ్లీడుకొచ్చిన పిల్లలు వుండగా, ఇంకో పదేళ్లల్లో రిటయిరవబోతుండగా బంగారంలాంటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి నేను ఇలాంటి బాటలో ఎందుకు వెడుతున్నానని మీకు అనిపిస్తే దానికి నా సమాధానం - సమాజ శ్రేయస్సునీ సంఘ సంస్కరణనీ కోరి - అని సవినయంగా మనవిచేసుకుంటున్నాను.

    మీతోబాటుగా ధర్నాలలోనూ ఉద్యమాలలోనూ భాగంగా కలిగే ఇక్కట్లకీ జరిగే విధ్వంసాలకీ నేనుకూడా గురవుతూ పెరిగినవాణ్ణే. రజాకార్ల తిరుగుబాటులో మా నాన్న తన తమ్ముణ్ణి కోల్పోయినా ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో నా చదువు కుంటుపడ్డా పెద్దగా పట్టించుకోని నేను ఇప్పటి నా మానసిక పరిపక్వతవల్ల ననుకుంటాను, టాంక్‌బండ్‌మీద జరిగిన విగ్రహాల విధ్వంసం వల్ల చాలా అశాంతికి గురయ్యాను.

    'తెలుగు భాష, ప్రజల పురోభివృధ్ధిలో కీలక పాత్రని పోషించిన నన్నయ, పెద్దనలాంటివాళ్లని అంతగా అగౌరవపరచడం ఎలా సాధ్యం?' అని పత్రికలు ఆక్రోశించాయి.  పట్టించుకున్న ప్రజలు స్థాణువులయ్యారు. 'ధ్వంసంచేసిన వాళ్లకి వాళ్లు చేస్తున్నదేమిటో తెలుసా?' అని ఎవరూ ప్రశ్నించలేదు. కోహినూర్ వజ్రాన్ని గాజు పెట్టెలో పెట్టి టాంక్‌బండ్‌మీద పెడితే వెంటనే ఎత్తుకుపోతారు - దాన్ని దాచుకోవడంకోసం మాత్రం కాదు;  వెలకట్టే వేరొకరికి అమ్ముకోవడానికి!  ప్రపంచంలో కొనడానికి ఎవరూ లేనప్పుడు ఆ వజ్రపు పరిస్థితి కంకర్రాయి పరిస్థితే! అంటే, మాటలేగానీ చేతలు లేని మనం ఆ తెలుగుభాషకి వెలుగులు తీర్చిన వజ్రాలని కంకర్రాళ్లుగా ఒప్పేసుకున్నట్టేనా?

    ఆ విగ్రహాలని ధ్వంసంచేసినవాళ్లల్లో కనీసం కొందరిని పోలీసులు అరెస్టుచేసేవుంటారు - సెల్‌ఫోన్ రికార్డులని చూసి నన్ను పట్టుకున్నట్లుగానే. వాళ్ల  సెల్‌ఫోన్లనుంచీ  కాల్స్ ఏ నాయకులకి వెళ్లాయో తెలుసుకునే వుంటారు. అయితే, వాళ్లని ముట్టుకోలేదు, నన్ను అరెస్టు చేశారు - అంతే తేడా. విచారకరమైన పరిస్థితి ఏమిటంటే, చదువు రాక ఆ విగ్రహాలు దేనికి ప్రతినిధులో తెలియక వాటిని పగులగొట్టినవాడొకడయితే, చదువు వంటపట్టినా లేకపోయినా వాటి ప్రాతినిధ్యం తెలిసికూడా పగులగొట్టమన్నవాడొకడు. సమాజంలో రాయివంటివాడు మొదటివాడు. వాడు పిచ్చివాడిచేతికందడం మన దురదృష్టం.

    పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించడమో లేక వాళ్లని నిర్వీర్యులని తిట్టడమో చేసేముందు మన సమాజం తనని తాను అద్దంలో చూసుకోవాలి. పోలీసులు కూడా ప్రజలలోంచే కదా వచ్చింది! మనం ఎన్నుకునే ప్రజానాయకులు కూడా అందరిలాగానే డబ్బునీ అధికారాన్నీ సంపాదించడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లే. వాళ్లకి అది చేతనయింది, మిగిలినవాళ్లకి చేతకాలేదు. అంతే తేడా! మనకందరికీ 'కోటివిద్యలు కూటికొరకే' అని తెలుసు. కానీ ఈనాడు డబ్బుని సంపాదించడానికి సహకరించేవే విద్యలు. ఇవి కాలేజీల్లో బోధించేవి మాత్రం కాదు. ఒకప్పటి రాజులు తరతరాలకీ తినికూర్చున్నా తరగనన్ని ఆస్తిపాస్తులని సంపాదించి పెడదామనుకోలేదు. కోశాగారమెప్పుడూ ప్రజలదే. ఇప్పుడు ఎన్నికలలో గెలిచిన, ఓడిన నాయకుల కోశాగారాలు ఆనాటి రాజుల కోశాగారాలని సిగ్గుపడేలా చేస్తున్నాయి. 

    ఆ డబ్బు ఈనాడు ఎలా ఉపయోగపడుతోంది? పదవులు కొనుక్కుని ఇంకా సంపాదించుకోవడానికి ఆస్కారాన్ని కల్పించడానికీ, పదవులు పొందినందుకే విగ్రహాలని స్థాపించుకోవడానికీ!  ఈ నాయకులగూర్చే ఈ తరం ప్రజలకి తెలుస్తోంది. ఈ జ్ఞానంతోనే ఈనాటి పిల్లలు పెరుగుతున్నారు. పరాయి పాలనని ప్రతిఘటిస్తూ వాళ్ల బుల్లెట్లకి గుండెని ఎదురుపెట్టిన నాయకుల పేర్లని చెరిపేసీ వాళ్ల విగ్రహాలని పగులగొట్టీ ఆ స్థానంలో ఈనాటి వినానాయకులని ఉంచుతున్నాం.

    మహాత్మాగాంధీని గానీ, అల్లూరి సీతారామరాజునిగానీ, నేతాజీ సుభాష్‌చంద్రబోసునిగానీ డబ్బుతో కొనవచ్చునేమోనన్న అనుమానంకూడా బ్రిటిష్‌వాళ్లకి రాలేదుగానీ ఈనాడు ప్రతి నాయకుడి సమ్మతినేగాక అసమ్మతినికూడా డబ్బుతో కొనుక్కునే పరిస్థిలో వున్నాం.  గాంధీకోరిన సమసమాజం మనకి సాధ్యమవకపోవచ్చుగానీ విలువలేవీ లేని సమాజాన్ని నెలకొల్పి అందులో జీవించడమే మన ధ్యేయమా?  అలా జీవించడం జంతుజీవనంవైపు దారితియ్యడంకాదా? ఈ పరిస్థితిని మార్చలేమా?

    ఈనాటి సామాజిక పరిస్థితులని చూస్తుంటే మనకు స్వాతంత్ర్యం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంవేస్తుంది. మహాత్మాగాంధీ ఒక్కడేకాదు జైల్లో ఏళ్లపాటు గడిపింది. ఆయనకి సహకరిస్తూ లక్షలమంది ఆయన వెనుక - జైళ్లల్లోనూ బయటా కూడా - ఉద్యోగాలని వదిలి, ఆస్తులని అమ్మేసి, భార్యా పిల్లలని గాలికి వదిలేసి - నిలబడకపోతే మనం ఇంకా బానిసలకిందే ఉండేవాళ్లం.  ఆస్తులున్నవాళ్లేకదా అమ్ముకోగలిగేది! అంటే, ఆనాడు బీదా బిక్కీ, లేదా విద్యార్థులు చేసిన ఉద్యమాలవల్ల కాదు మనకి దాస్యశృంఖలాలు తెగింది!  అమెరికాలో జాతి వివక్షత పోయింది అది పోవాలని నల్లవాళ్లు చేసిన ప్రతిఘటనవల్ల కాదు - ప్రజలలో అత్యధిక శాతమైన తెల్లవాళ్లు జాతి వివక్షతని అమానుషంగా పరిగణించడంవల్ల.

    పెద్ద ఓడ నడిచే దారిని మార్చడానికి సమయం పడుతుంది. కానీ మార్చడానికి కావలసిన ముఖ్యమైన దినుసు మార్చాలన్న ఆశయం. ఆ ఆశయసాధనకి కావలసినది ఆ మార్పుకై వెచ్చించడానికి కావలసినంత బలం.  ఆ ఆశయం ఎంతోమంది మదిలో నిక్షిప్తంగా వున్నా దానికి ఒక రూపాన్నివ్వడం మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మాండేలా లాంటి వ్యక్తులవల్ల సాధ్యంకావచ్చు.  కానీ, మహాత్మాకంటే ముందుగా ఎందరు భారతీయులో బ్రిటిష్ వాళ్లని ప్రతిఘటించి జైళ్లకి వెళ్లారు, వాటిల్లో మగ్గి అసువులు బాశారు. గాంధీ వాళ్లందరి భుజస్కంధాలమీద నిలబడ్డారు కాబట్టే, ఆయనకి లక్షలమంది సహకరించారు కాబట్టే మనం స్వతంత్రులమయ్యాం.

    ఓ.కె.సి.నీ, ఓ.బి.సి.నీ చూసిన తరువాత మీకు అర్థమయ్యే వుండాలి - బీదాబిక్కీలు లేక నిరుద్యోగులు చేసే ఆందోళనలవల్ల మన పరిస్థితి మారేదికాదని!  ఒకరికి ఆ పూట తిండిగూర్చి చింత. ఇంకొకరికి భవిష్యత్తుని గూర్చిన ఆందోళన - కానీ అనుభవం లేకపోవడంవల్ల ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి.  అందుకే, నాలాగా పిల్లల బాధ్యతలు తీరిపోయినవాళ్లకి నాదొక విన్నపం. మీరూ నాలాగే స్వాతంత్ర్యం వచ్చిన కొత్తరోజుల్లోనో లేక దాని గూర్చి గర్వంగా చాటి చెప్పుకుంటున్న రోజుల్లోనో పుట్టారు, పెరిగారు. మన సంఘంలో వచ్చిన మార్పులు నాకులాగే మీకుకూడా నచ్చట్లేదని నా నమ్మకం. నిజం చెబుతానని ప్రమాణంచేసి అబధ్ధం చెప్పాడని అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ని ఇంపీచ్ చేశారు.  సెనేటర్ పొజిషన్ని వేలంవెయ్యబోయాడని ఇల్లినాయ్ రాష్ట్ర గవర్నర్ బ్లగోయావిచ్‌కి పధ్నాలుగేళ్ల కారాగార శిక్ష విధించారు 2011లో.  మనం? లంచగొండితనాన్ని ప్రభుత్వంలోని అన్ని లెవెల్స్‌లోనూ ఒప్పేసుకున్నాం.

    మనం ఆలోచించవలసినది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రెండువందల సంవత్సరాలకాలంలో అమెరికాలో రాని చెడుమార్పులు మనదేశంలో యాభయ్యేళ్లుకూడా కాకుండానే రావడానికి గల కారణాలేమిటని.  ఇంకా చెప్పాలంటే, స్త్రీలు, పిల్లలు, వృధ్ధులు ఎవరూ ఆకలి చావులు చావకూడదని అమెరికా నిర్ణయించుకుని దేశప్రజలకి తిండిలోటు లేకుండాచేసి ఎనభై ఏళ్లయింది.  అమెరికాలో జాతి వివక్షతని సమాజంలో నిర్మూలిస్తూ ప్రభుత్వం ఆజ్ఞలు జారీచేసి యాభై ఏళ్లు కూడా కాలేదు.  అంటే, స్వాతంత్ర్యం వచ్చిన నూట అరవయ్యేళ్ల తరువాత అమెరికా ఇంకా పురోభివృధ్ధిని సాధించింది.  అమెరికాని అభివృధ్ధికి మైలురాయిగా చూపిస్తున్నప్పుడు మనం సాంకేతిక అభివృధ్ధిని గూర్చి మాట్లాడతామేగానీ సామాజిక అభివృధ్ధినిగూర్చి పట్టించుకోమెందుకని?

    మనం ఆశయంగా పెట్టుకోవలసినది మనచుట్టూ దెయ్యంలా నాట్యంచేస్తున్న తిరోగతి నరికట్టి మన పూర్వీకులు చూపిన ప్రగతిబాటలో ఇంకా ముందుకు వెళ్లడాన్ని.

    మనం చెయ్యవలసింది చదువు అంటే డిగ్రీ సర్టిఫికెట్లని చేకూర్చడంతోబాటు సామాజిక బాధ్యతనికూడా నేర్పేదని పిల్లలకి తెలియజెప్పడం.  అందులో భాగంగా పిల్లలని కాన్వెంట్ల కప్పజెప్పేసి మనపని అయిపోయిందని చేతులు దులుపుకుని కూర్చుంటే చాలదని ఒప్పుకోవడం.  ఇంకోభాగం మన పూర్వుల త్యాగఫలం మనకి అందజేసిన వజ్రాలు ప్రతి ఒక్కరి సొత్తని వాటిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిదీ అని వాటిని కంకర్రాళ్లుగా మార్చకూడదని డిగ్రీ సర్టిఫికెట్ల అవసరంలేకుండా అందరికీ మనసుల్లో నాటుకునేలా తెలియజెప్పడం. ఉద్యమాల పేరుతో జరిగే విధ్వంసకాండలకి గురయ్యేది, తగులబెట్టిన బస్సుల నష్టాలని భరించేది వేరెవరో కాదని, మనమేననీ చాటిచెప్పడం. మనం అహర్నిశలూ కృషిచెయ్యవలసినది ఆ ఆశయసాధనకి - ఎందుకంటే, అది మనకోసం కాదు.  మన పిల్లల భవిష్యత్తుకోసం. మన తాతల జనరేషన్ స్వాతంత్ర్యంకోసం సమస్తం ఒడ్డారు.  మన తండ్రుల జనరేషన్ దాని ఫలితాలననుభవించారు. మనం స్వాతంత్ర్యసమరం ఎప్పుడో అయిపోయిందనీ, మనవంతుగా సమాజం మననించీ ఏమీ ఆశించటంలేదనీ అనుకుంటూ నిద్రావస్థలోవున్నాం. మనపిల్లల భవిష్యత్తుని గూర్చిన భయమన్నా మనని ఇప్పటికయినా మేలుకొల్పి మార్పులకోసం పోరాడేలాచెయ్యాలి.

    మనం ఆశపడాల్సింది త్వరగా వచ్చిన చెడుమార్పులని అంతకంటే త్వరగా వెళ్లగొట్టగలమేమోనని!  ఆ ఆశ నెరవేరాలంటే మనం మార్పుని ముందుగా తేవాల్సింది ప్రభుత్వంలో కాదు, పోలీసుల్లో కాదు, రాజకీయ నాయకుల్లో కాదు. సామాన్య ప్రజానీకపు ఆలోచనావిధానాల్లో.  అది ముందుగా మనం ఒకరికొకరు ఇచ్చే గౌరవంతో మొదలవ్వాలి.

    నా ఆలోచనలతో ఆశయాలతో మీరు ఏకీభవించినట్లయితే ఈ సమాజగతిని మార్చడానికి నాకు తోడ్పడండి. మన సమాజాన్ని గూర్చిన నా ఆశయాలు కొత్తవీ కావు, ఈ ఉద్యమం ఇవాళ నేను మొదలుపెడుతున్నదీకాదు. స్వాతంత్ర్యం రాగానే స్వర్గం చేరామనుకుని తొందరపడి తపోదీక్షని విరమించిన దీపధారులకి వాళ్ల నమ్మకాన్ని వమ్ముచేసినందుకు క్షమించమని కోరుతూ తిరిగి మొదలుపెడుతున్నది మాత్రమే. మామూలుగా అయితే నన్ను ప్రభుత్వం కోర్టులో హాజరుచేసి కేసుని విచారించాలి. కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు నా ఈ ఉపన్యాసాన్ని వినడానికి ఇది సినిమా కాదు గనుక ఎవరికీ టైం వుండదు గనుక 'ఆన్సర్ టు ద పాయింట్' అని నా నోరు కుట్టేస్తారు. నేను ఏ పార్టీకి చెందినవాణ్ణి కాదు గనుక నన్ను ప్రభుత్వం బెయిలుమీద కూడా విడిచిపెట్టదు. నా వెనుక ఓ.కె.సి., ఓ.బి.సి.ల్లో ఇంకా ఎవరున్నారో తెలుసుకోవడానికి నన్ను పోలీసులు కుళ్లబొడుస్తారు. బతికుంటే కొన్నేళ్ల తరువాత జైలునించీ విడుదలయ్యే అవకాశముంది. 

    బ్రిటిష్‌జడ్జీలని వాళ్ల రాజ్యాంగంగూర్చే ప్రశ్నించి వాళ్లని సిగ్గుపడేలా చెయ్యగలిగిన ఘనత గాంధీమహాత్ముడిది. నేను ఆయనంతటివాణ్ణికాదుగానీ కోర్టులో జడ్జీలకన్నా కూడా మీరే సరైన తీర్పునిస్తారని నా నమ్మకం.  అందుకే మీకు ఈ ఉత్తరం. బ్రిటిష్‌వాళ్ల జులుంనుంచీ దేశాన్ని తప్పించడానికి మహాత్ముడికి దాదాపు జీవితకాలం పట్టింది.  సంఘంలో నేను కోరే మార్పులు నా మిగిలిన జీవితకాలంలో చూడాలన్న చిన్న ఆశ నాది. అది దురాశ కాదనీ నేను కోరుకుంటున్న సమాజం మీకుకూడా కావాలనిపిస్తోందనీ నా నమ్మకం. పెట్టుబడి లేకపోతే వ్యాపారం లేనట్టే కృషిలేనిదే ఏ ఆశయసిధ్ధీ కలుగదు.   'ఎందరొ వీరుల త్యాగఫలం - మనదేశ ప్రగతికే మూలధనం' అన్నాడొక కవి. ఆ మూలధనాన్ని దుబారా చెయ్యడం ఆపి దాన్ని పెంచడానికై కృషిచేద్దాం. మీ పిల్లలభవిష్యత్తుని గూర్చిన ఆలోచన మీచేత మీవంతు పెట్టుబడిని పెట్టిస్తుందని ఆశిస్తాను.  లాభాలని త్వరలోనే పంచుకుందాం. జై హింద్!"

* * *

    వరదలు మొదలయ్యేదికూడా చిన్న చినుకుతోనే!

(ప్రజాశక్తి ఆదివారం సంచికలో ప్రచురితం)

Comments