చిరుగు బొంత - సోమవఝల నాగేంద్రప్రసాదు

    
'ఏంటిరా ఏదో అర్జంటుగా మాట్లాడాలన్నావు. తీరా వస్తే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటావేం' అడిగాడు జగన్నాథం తన చిన్న నాటి స్నేహితుడు కామేశాన్ని.

    'ఏంలేదురా, నీతో ఎన్నో విషయాలు పంచుకోవాలనే ఉంది. కానీ, తీరా నా మాటలు విన్న తరువాత నువ్వు ఏమనుకుంటావోనని అనుమానంగా ఉందీ మెల్లిగా చెప్పాడు కామేశం.

    'ఒరేయ్ కామేశం, ఇన్నేళ్ళ మన స్నేహంలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా?' అతని భుజం మీద చేయివేస్తూ అన్నాడు జగన్నాథం. 

    'ఛఛ... నేనెప్పుడూ అలా అనుకోలేదురా! తీరా నువ్వు నేను చెప్పింది విని నవ్వుతావేమోనని' అర్థోక్తిగా ఆగాడు కామేశం.

    'నీకా భయం అక్కర్లేదురా. నీ మాటలు, వాలకం చూస్తుంటే, నీ మనసులో ఏదో తెలియని బాధ ఉందనిపిస్తోంది. మన బాధలు వేరొకరితో పంచుకున్నప్పుడు మన మనసుకి కొంత ఊరట కలుగుతుంది. అందుచేత, నువ్వు ఏమాత్రం సంకోచం లేకుండా నీ మనసులోని మాట నాకు నిర్భయంగా చెప్పు. నాకు చేతనైన సహాయం చేస్తాను' పార్కులో ఉన్న ఓ చెట్టునీడ క్రింద కూర్చుంటూ అన్నాడు జగన్నాథం.

    'సరేరా! నువ్వు భరోసా ఇచ్చావు కదా అని చెబుతున్నాను. ఐతే ఈ విషయాలు మన ఇద్దరి మధ్యనే ఉండాలి' జగన్నాథానికి దగ్గరగా కూర్చుంటూ అన్నాడు కామేశం.

    'ఒరేయ్ నీకు వయసుతోపాటు చాదస్తం కూడా పెరుగుతున్నట్లుంది' నవ్వుతూ అన్నాడు జగన్నాథం.

    జగన్నాథం మాటలకు చిన్నబుచ్చుకున్న కామేశం 'అనరా అను. నా బాధలు వింటే నువ్వలా మాట్లాడవు' ంలానమైన గొంతుతో అన్నాడు కామేశం.

    'సారీ రా కాముడూ! నిన్ను ఏదో ఏడిపించాలని అలా అనలేదు. నువ్వంటే ఉండే చనువుతో అలా అన్నాను అంతే' స్నేహితుని బుజ్జగిస్తూ అన్నాడు జగన్నాథం.

    జగన్నాథం చూపించిన ఆప్యాయతకి తట్టుకోలేని కామేశం అతని మనసులోని బాధనంతా స్నేహితునితో మొరపెట్టుకున్నాడు.

    'ఒరేయ్ జగ్గూ చెప్పాలంటే మాయింట్లో నా బ్రతుకు 'చింకి బొంత' కన్నా అధ్వాన్నంగా ఉందిరా' చెప్పడం ఆపి జగన్నాథం వంక చూసాడు కామేశం.

    'ఏంటిరా నువ్వంటున్నది. ఏంటి నీకూ నీ కోడలికి పడడం లేదా?' అడిగాడు జగన్నాథం.

    'అబ్బే అదేంలేదురా! కొడుకు కోడలు నన్ను బాగానే చూసుకుంటున్నారు. కానీ నాకే ఇంట్లో విలువలేదేమో అనిపిస్తోంది' చెప్పాడు కామేశం.

    'అంటే' అడిగాడు జగన్నాథం.

    'ఏముందిరా, నా కొడుకు కానీ నా కోడలు కానీ ఇంటి విషయాలలోను వారి విషయాలలోను నా సలహాగానీ, అభిప్రాయంగాని అడగటం లేదురా. అసలు ఇంట్లో నేనొక పెద్దవాణ్ణి ఉన్నానన్న్న ధ్యాసే లేకుండా పోయింది వాళ్ళకి' జగన్నాథం కళ్ళల్లోకి బాధగా చూస్తూ అన్నాడు కామేశం.

    'ఊ... ఇంకా...' అతని బాధ పూర్తిగా తెలుసుకొనే ప్రయత్నంగా అడిగాడు జగన్నాథం.

    'ఇంకేముంది. ఆ యింట్లోవాళ్ళకి నేనొక పనివాడి క్రింద తయారయ్యాను. ఇంట్లో పాలు, కూరల దగ్గరనుంచి, మనవణ్ణి స్కూలుకు దింపేవరకు అన్నీ నేనే' బాధగా అన్నాడు కామేశం.

    'ఓస్ ఇంతేనా. ఇందులో నువ్వంతగా బాధపడవలసింది ఏముందిరా' అడిగాడు జగన్నాథం.

    'ఏంటిరా ఇవన్నీ నీకు కష్టాల్లా అనిపించడంలేదా? ఈ వయసులో ఇటువంటివి ఎంత కష్టమో నీకు తెలియదు. ఆ అనుభవం నీకు ఎదురైతే అప్పుడు తెలుస్తుంది' మొహం చిన్నబుచ్చుకుంటూ అన్నాడు కామేశం.

    'ఒరేయ్ కామూ. నువ్వేమనుకోనంటే నీకో చిన్నమాట చెప్పాలిరా' అతనివంక చూస్తూ అన్నాడు జగన్నాథం.

    'చెప్పరా' అన్నాడు కామేశం.

    'ఏంలేదురా. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్లుగా అవి నీ కష్టాలు కాదురా, అవి నీ బాధ్యతలు' చెప్పాడు జగన్నాథం.

    'ఏంటిరా ఈ వయసులో బయటికి వెళ్ళి పాలు తేవడం, కూరలు తేవడం, పిల్లవాణ్ణి స్కూలుకి దింపడం ఎంత కష్టమో నీకు తెలియదా?' తిరిగి ప్రశ్నించాడు కామేశం.

    'కష్టమే కాదని ఎవరన్నారు. కానీ అవి నీకు ఒక విధంగా ఓ కాలక్షేపం అని ఎందుకనుకోవడం లేదు?' అడిగాడు జగన్నాథం.

    'కాలక్షేపమా' అర్థం కానట్లుగా అతనివంక చూసాడు కామేశం.

    'అవునురా ముమ్మాటికి కాలక్షేపమే' అన్న జగన్నాథం మాటల్లో ఏదో గూఢార్థం కనిపించడంతో అదే విషయాన్ని జగన్నాథాన్ని అడిగాడు కామేశం.

    'ఒరేయ్ ఇటువంటి బాధలు నీ ఒక్కడికే కాదురా చాలా మందికే ఉన్నాయి. అయితే అవి బాధలు కాదు బాధ్యతలు అనుకున్న నాడు ఎవరికి ఇబ్బందులు అనిపించవు. అంతెందుకు నా విషయమే తీసుకో. నేను కూడా నీలాగే మొదట రిటైర్ అయిన తరువాత హాయిగా రెస్టు తీసుకోవాలని అనుకున్నాను. కానీ ఓ రోజున మా కోడలు 'మావయ్యగారూ, పాపని స్కూలుకి తీసుకెళ్ళే రిక్షావాడికి వంట్లో బాగోలేదట. కొంచెం పాపని స్కూలుకి దిగబెడతారా?' అని అంది. ఆమె అలా అన్నప్పుడు ముందర నేనూ నీలాగే చాలా బాధపడ్డాను. ఏమిటి ఈ వయసులో, పాపని స్కూలుకి తీసుకెళ్ళాలా అని. ఐతే మనసులోని భావాన్ని పైకి తెలియనీయకుండా ఆ రోజున పాపని స్కూలుకి తీసుకొని వెళ్ళాను. కాని తరువాత రోజున తెలిసింది. పాప రిక్షావాడికి ఆరోగ్యం బాగా పాడైందని, కనీసం ఒక నెలరోజుల వరకుక్ రాడని. నమ్మకమైన రిస్ఖావాడు వెంటనే దొరకక కష్టమైనా నేనే రోజూ పాపని స్కూలుకి తీసుకొని పోవడం, తీసుకుని రావడం చేసాను. మొదట్లో కొంచెం కష్టం అనిపించినా, మెల్లిమెల్లిగా నాకూ అదొక కాలక్షేపంగా తయారైంది. నాలాగే స్కూలుకి తమ పిల్లల్ని వదలడానికి వచ్చినవారితో పరిచయమై, క్రమేపి స్నేహంగా మరింది. అందుకే ఓనాడు మా కోడలితో అన్నాను 'అమ్మా పాపకి వేరే రిక్షా వాడిని పెట్టొద్దు. ఓపిక ఉన్నంతవరకు నేనే రోజూ పాపని దింపి తీసుకుని వస్తాను' అనడంతో 'సరే మావయ్యా మీయిష్టం' అంది కోడలు. దీనివల్ల నాకు రెండు లాభాలు అనిపించాయి. ఒకటి మనపిల్లల బాగోగులు మనం పట్టించుకోవచ్చు. రెండోది రిక్షావాడికిచ్చే డబ్బులు ఆదా చెయ్యవచ్చుననిపించింది. అందుకే ఇంట్లో మూల పడి ఉన్న నా స్కూటరుని బాగుచేయించి, రోజూ దానిమీదే పాపని దింపుతున్నాను. స్కూలు నుండి తిరిగి వస్తున్నప్పుడు ప్రక్కనే ఉన్న రైతుబజారు నుండి తాజా కూరలు తీసుకుని వస్తూండడంతో నా కొడుకు, కోడలు కూడా ఏంతో సంతోషిస్తున్నారు. మెల్లిమెల్లిగా పాప క్లాసునోట్సులు పూర్తిచేయించడం, హోంవర్కులు చేయించడంతో ఇప్పుడు పాప నాతో ఎక్కువ సేపు గడుపుతోందిరా. ఈ వయసులో నాకు అంతకన్నా ఇంకేం కావాలిరా. పిల్లల కష్టాళ్లో పాలుపంచుకోవడం వల్ల వాళ్ళు కూడా నన్నెంతో అభిమానంతో చూసుకుంటున్నారు' చెప్పడం ఆపిన జగన్నాథం 'ఇప్పుడు చెప్పరా నేనూ నీలాగే ఆలోచిస్తే ఈనాడు నా పరిస్థితి కూడా నీలాగే ఉండేది కదా!'

    'నువ్వన్నది కొంతవరకు నిజమేరా. కాఈ నా కోడలు అలాకాదురా. ఏవిషయంలోను నన్ను సంప్రదించదు. వాళ్లకు కావలసింది నా డబ్బులు మాత్రమే' అన్నాడు కామేశం.

    'ఒరేయ్ కాముడూ ఈ విషయంలో ముమ్మాటికి తప్పు నీదేరా. రిటైరయినప్పుడు వచ్చిన డబ్బులు కొంచెం కూడా నీ దగ్గర ఉంచుకోకుండా మొత్తం డబ్బులు కొడుకు చేతిలో పోసావు. ఇప్పుడు నీదగ్గర ఇవ్వడానికి ఇంకేం లేదని తెలిసిన తరువాత వారి ప్రవర్తన మారడంలో తప్పులేదు' చెప్పాడు జగన్నాథం.

    'అంటే మామధ్యన ఉన్నది కేవలం ఆర్థిక సంబంధమేనా. అంతకు మించి మరే అనుబంధమూ లేదా?' అడిగాడు కామేశం.

    'లేదని ఎవరన్నారు. కానీ ఈనాడు డబ్బుకున్న విలువ మరి దేనికీ లేదురా! ఇది జీర్ణించుకోలేని ఓ నిష్ఠుర సత్యం. అన్ని బంధాలు డబ్బుతోనే ముడిపడిఉన్నాయి. అంతెందుకురా నీ అల్లుణ్ణే తీసుకో. అతని అవసరాని డబ్బులు సర్దలేకపోయావని ఎంతో అలిగి ఆఖరికి నీ భార్య పోయిన నాడు కన్న కూతుర్ని కడసారిగా తల్లి శవాన్ని కూడా చూడడానికి పంపలేదు మర్చిపోయావా? ఇప్పుడు చెప్పరా అతని దృష్టిలో దేనికి విలువుందో' కొంచెం అసహనంగా అన్నాడు జగన్నాథం.

    'అది సరేరా! మొన్న ఒకరోజున కొడుకు కోడలు ఆఫీసులో ఏదో పార్టీ ఉందంటే నేను కూడా వస్తానన్నాను. దాంతో నా కొడుకేమన్న్నాడో తెలుసా. "అక్కడ పార్టీకి చాలామంది పెద్దవాళ్ళు వస్తారు. అక్కడికి మీరెందుక"ని నామీద విరుచుకు పడ్డాడు' ఉడుక్కుంటూ అన్నాడు కామేశం.

    అతని అమాయకత్వానికి మనసులోనే నవ్వుకున్న జగన్నాథం 'అవునురా మీ అబ్బాయన్నది నిజమే కదా... అక్కడ మనలాంటి వాళ్ళకేం పని. ఐనా అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది వస్తారు చెప్పు? నీ కొడుకు వాళ్ళు వాళ్ళమానాన వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటే నువ్వేమో తెలిసిన మొహం ఒక్కటీ కనబడక వెర్రిమొహం వేసుకుని ఏదో తిండికోసం వచ్చినవాడిలా అక్కడ సమయం గడపాలి. ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరమో ఎప్పుడైనా ఆలోచించావా? అలాగే ఆ పార్టీలో పెద్దవాళ్ళు తాగి తందనాలాడతారు. అవి చూసి నువ్వు తట్టుకోగలవా? అందుకే ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఊరుకోవడమంత ఉత్తమం మరొకటి లేదు' అతనికి నచ్చచెబుతూ అన్నాడు.

    'ఏంటోరా నువ్వు అన్నింటికి సర్దుకునిపోతావు కాబట్టి నీకు ఎటువూంటి ఇబ్బందులు ఉండవు. కానీ నాలాంటి 'స్వాభిమానం' ఉన్నవాడి పరిస్థితి ఏమిటి?' అడిగాడు కామేశం.

    'ఒరేయ్! చూడు ఈ లోకంలో నువ్వనుకుంటున్నట్లుగా స్వాభిమానం లేనివాడంటూ ఎవడూ ఉండడురా. కానీ మన స్వాభిమానం మన మనుగడకు అడ్డం కాకూడదు. ఈ కాలంలో ఏ ఎండకాగొడుగు పట్టేవాడే ఆనందంగా ఉండగలడు. మారుతున్న కాలాన్ని బట్టి మనమూ మారాలి' చెప్పాడు జగన్నాథం.

    'ఏమోరా  కాలం బాగా మారిపోయింది. ఇంట్లో పెద్దవాళ్లకి విలువలేకుండా పోయింది' బాధగా అన్నాడు కామేశం.

    'నా మాట విని నీ స్వాభిమానాన్ని వదిలి నేను చెప్పినట్లు మసలుకో' అంటూ గీతోపదేశం చేసి,  ఇంక బయలుదేరుతానన్నట్లుగా లేచాడు జగన్నాథం.

    'సరేరా. నువ్వు చెప్పినట్లే చేసి చూస్తాను' అంటూ అతనితో పాటు తనూ లేచాడు కామేశం.

    'ఆఁ అన్నట్లు కామేశం నేను వచ్చేవారమే అమెరికా చిన్న కూతురు దగ్గరకి వెళుతున్నాను. మరలా ఓ రెణ్ణెళ్ళు పోయిన తరువాత వస్తాను. ఈలోపులో నేను చెప్పినట్లు చెయ్యి. అప్పుడు చెప్పు నీ బ్రతుకు నీవనుకున్నట్లు "చింకిబొంత" లేక మరొకటో' అంటూ అతనితో హాస్యమాడుతూ తన యింటివైపు నడిచాడు జగన్నాథం.

* * *

    'ఇప్పుడు చెప్పరా కామేశం ఎలా ఉంది నీ లైఫు. ఇంకా నువ్వనుకున్నట్లు "చిరుగు బొంత" లాగే ఉందా?' అమెరికానుండి తిరిగి వచ్చిన తరువాత మొదటిసారిగా కలసిన కామేశాన్ని అడిగాడు జగన్నాథం.

    'ముందు పదరా ఎక్కడైనా కూర్చుందాం' అంటూ పార్కులో కొంచెం దూరంలో ఖాళీగా ఉన్న బెంచివైపు నడుస్తూ అన్నాడు కామేశం.

    కామేశం ఇంతకుముందుకన్నా హుషారుగా ఉన్నాడని గ్రహించిన జగన్నాథం అదే విషయాన్ని నవ్వుతూ అతనితో అన్నాడు.

    'ఔనురా ఇదంతా నీ చలవే! నువ్వానాడు నాకలా హితోపదేశం చేసి ఉండకపోయి ఉంటే, నేను ఇంతకన్నా అద్ధ్వాన్నంగా ఉండేవాడినిరా' అంటూ జగన్నాథానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు కామేశం.

    'ఊరుకోరా ఇందులో నా గొప్పేమీ లేదు. నేను ట్రీట్‌మెంటు ఇచ్చింది నీ సైకాలజీకి' నవ్వుతూ అన్నాడు జగన్నాథం.

    'నిజమేరా. నాలోని వీక్‌నెస్‌ని బాగా అర్థం చేసుకుని నన్ను ఈరోజు ఇలా హుషారుగా ఉండేలా చేసావు. ఈ క్రెడిటంతా నీదే. ఇప్పుడు నాకు దేనికి చింతలేదు. అలాగే నా కొడుకు కోడలు ప్రతీ విషయాన్ని నాతో చర్చిస్తూ పెద్దవానిగా నాకో గౌరవాన్నీ, ప్రత్యేకమైన స్థానాన్నీ ఇస్తున్నారు. అంతే కాదురా నేనిప్పుడు రోజంతా బిజీనే. ఉదయం మార్నింగ్ వాక్‌తో ప్రారంభమయ్యే నా దినచర్య, మనవణ్ణి స్కూలుకి దింపడం నుంచి రోటరీక్లబ్ తరఫున బీదసాదలకు సేవచేయడంతో ముగుస్తుంది. ఇప్పుడు నాకు నా గురించి ఆలోచించుకునే టైము లేకపోవడంతో, ఎంతో హాయిగా ఉంది. ఇప్పుడు నా బ్రతుకు "చిరుగు బొంత" కాదురా. అడిగిన వారికి తోచిన సహాయం చేస్తూ, ఎందుకూ పనికిరాని "చిరుగు బొంత"ననుకున్న నేను, కనీసం కాళ్ళుతుడుచుకునే గుడ్డలా వారికి ఉపయోగపడుతూ, సమాజానికి కొంతైనా సేవ చేయగలుగుతున్నాను' అంటూ ఎంతో ఆనందంగా చెబుతున్న కామేశాన్ని చూసిన  జగన్నాథం స్నేహితునిలో వచ్చిన మార్పుకి ఆనందంతో తృప్తిగా నవ్వుకున్నాడు.

(కళాదీపిక మాసపత్రిక జూలై 2009 సంచికలో ప్రచురితం)  


Comments