చివరికి మిగిలేది - కె.వాసవదత్త రమణ

  
  
     
"నేనంటే నా కిష్టం! ఆ తర్వాత నా కుటుంబం అంటే నా కిష్టం!" ఇలా అనుకోని వాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నేను మొన్నటి వరకు నమ్మేవాడ్ని కాదు, కాని అనూరాధని చూసాక నా అభిప్రాయం మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది!!

    అనూరాధని చూసి దాదాపు పదేళ్లు దాటిందేమో? మనిషిలో కాని మనస్తత్వంలో కాని అప్పటికి ఇప్పటికి ఎటువంటి మార్పు ఆమెలో నాకు కనపడలేదు!!!

* * * 

పదేళ్ళ క్రితం.

    కాకినాడలో దేవాలయం వీధిలో పాటల కచేరి ఉంటే వెళ్లాను! అప్పుడే తొలిసారిగా చూసానామెని! చక్కని రూపం, కమ్మటి స్వరమే కాక ఆమెలో ఆకర్షించే గుణం, ఆమె మాటలోని సరళత!! ఆమె ముఖంలోని స్వచ్ఛత!!! ఆడవాళ్లకి సరళత అంత ఆభరణంలో ఉంటుందని నాకప్పుడే మొదటిసారిగా తెలిసింది!!!

    "అనూరాధ మంచి గాయకురాలు" నిర్వాహకురాలు కార్యక్రమ అనంతరం నాకు పరిచయం చేసారామెని!

    "నమస్తే! మృదువుగా అంది, చిరునవ్వుతో చేతులు జోడిస్తూ!

    "నమస్కారం!" అప్రయత్నంగా చేతులు జోడించాను. సాధారణంగా నాకు నేనుగా చేతులు జోడించి నమస్కారం చేయడం నాకు అంతగా నచ్చదు! ఎవరైనా అలాచేసినా, జస్ట్ తలపంకించి  గంభీరంగా ఉంటాను!

    "శ్రీ ప్రసాద రాజు గారని చాలా పెద్ద లాండ్‌లార్డ్. చుట్టుపక్కల చాలా ఊళ్లలో ఆయనకు ఎన్నో రైస్‌మిల్స్, ల్యాండ్స్ ఉన్నాయి! మన సంస్థకి ఆయనే ఛైర్మన్, బ్యాక్‌బోన్ కూడా! వారి అబ్బాయే 'కళ్యాణ చక్రవర్తి'గారు! వీరు కూడా మన సంస్థకి ముందునుంచి అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నారు!" సెక్రటి ఉత్సాహంగా చెబుతుంటే ఆమె అంత ఆసక్తిగా వింటున్నట్టుగా అనిపించలేదు.

    ఆమె ప్రవర్తన నాకు కొద్దిగా చికాకుగా అనిపించింది. అసలు నిజమేమిటంటే, ఎవరైనా నన్ను గుర్తించకపోతే నేను అస్సలు వాళ్ల ఉనికే భరించలేను! నాకు వంగి వంగి సలాములు పెట్టక్పోతే అస్సలు తట్టుకోలేను!! అలాంటిది, సాదా నేత చీరలో, మెళ్లో కనీసం బంగారు గొలుసు కూడా లేని ఈ ఆమ్మాయి నా లాంటి ఆరడుగుల అందగాడ్ని, ఆస్తిపరుడ్ని గుర్తించకపోవడం నాకు చాలా చాలా అవమానకరంగా అనిపించింది.

    అంతే! గబగబా ముందుకు కదిలాను. ఎంతో మంది నన్ను పలకరించడానికి, నాతో మాట్లాడడానికి చాలా ఉత్సాహపడ్డారు. అందరి అభివాదాలు అంద్కుంటూ, మిగతా గాయకుల్ని కూడా పరిచయం చేశాక, కారు వద్దకు రాగానే సెక్రటరి గబగబా కారు డోర్ తీసి పట్టుకున్నారు.

    దర్పంగా కారు ఎక్కి కూర్చున్నాను. అందరూ భయభక్తులతో, గౌరవంగా కారు చుట్టూ నిలబడగానే నాకు చాలా చాలా సంతృప్తిగా అనిపించింది. ఎ.సి. గాలి చల్లగా తగులుతూ ఉంటే రిలాక్స్‌డ్ గా కారు వెనుక సీట్లో వాలాను. 

    కాని మనస్సులో ఎంత సంతోషంగా ఉన్నా, ఎక్కడో చిన్న అపశృతి! 'అదేమిటి?' అన్న ప్రశ్నకు అనూరాధ ముఖం సమాధానంగా నా కళ్ల ముందు నిలిచింది.

    చిరాగ్గా తల విదిలించాను.

* * *

    మళ్లీ నెలరోజులకి, రాజిరెడ్డి గారి ఇంట్లో పెళ్లిలో పాటకచేరి చేస్తూ కనపడింది! ఈసారి సినిమా పాటలు పాడుతోంది, ఆశ్చర్యంగా!!!

    తెల్లటి లాల్చీ, పైజామా, మెళ్లో పెద్దగొలుసు, కస్టమ్‌స్ వాళ్ల దగ్గర్నుంచి డైరెక్టుగా కొన్న ఫారిన్‌సెంటు ఘుమఘుమలతో నేను చాలా అందంగా ఉన్నానని నాకు తెలుసు!!! అందుకే అందరి చూపులు నామీదే ఉన్నాయని కూడా నాకు తెలుసు! పాతికేళ్లు దాటుతున్న పెళ్లి కొడుకుని, ఆడపిల్లలే కాకుండా, ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా నా వంక ఆసక్తిగా చూడటంలో, నా కోసం ఆశపడటంలో తప్పులేదన్న విషయం నాకు తెలుసు!!!

    సమ్మోహనంగా నవ్వుతూ, నా కోసం వేయించిన ప్రత్యేక కుర్చీలో కూర్చున్నాను! అనూరాధ పాటల ప్రోగ్రాం అయ్యాక నా దగ్గరకు వచ్చి విష్ చేస్తుందనుకున్నాను. కానీ ఆమె అస్సలు నా వంకే చూడలేదు! పాటలు పాడడం అయ్యాక, పొడవాటి జడ పిరుదుల మీద లయబద్ధంగా కదులుతుండగా స్టేజి వెనుక నుంచి ఆమె నెమ్మదిగా నడుచుకుంటు వెళ్లిపోవడం ముందువరసలో కూర్చున్న నాకు కనపడుతూనే ఉంది! నాలో ఇర్రిటేషన్ పెరిగిపోతున్నట్టుగా అనిపించింది! కంట్రోల్ చేసుకుంటూ అందరికీ వీడ్కోలు చెబుతూ నా కారులోకి ఎక్కి కూర్చున్నాను, అస్థిమితంగా!!!

                                                 * * *

    ముచ్చటగా మూడోసారి ఆమెని మాధవపట్నం ఎలిమెంటరీ స్కూల్‌లో చూసాను! ఆ రోజు రాత్రి స్కూల్‌లో ఫన్క్షన్‌కి నేనే ముఖ్య అతిథిని! అక్కడ అనూరాధ పిల్లల చేత రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేయించింది.

    బహుమతి ప్రదానం అయ్యి, బయటికి వస్తూంటే, వీడ్కోలు చెబుతూ నా పక్కగా నిలబడింది!

    "మీరిక్కడ పనిచేస్తారా?" తొలి ప్రశ్న నేనే వేసాను.

    "అవును! ఈ ఊళ్లోనే మా ఇల్లు" అంది.

    "పర్మినెంటా?" ఏదో అడగాలన్నట్టుగా అడిగాను.

    "లేదండీ, గవర్నమెంట్ స్కూలు కదా! టెంపరరీ లీవ్ వేకెన్సీ ఉంటే చేస్తున్నాను"

    చులకన భావంతో కూడిన చిరునవ్వు నా పెదాలపై లాస్యం చేసింది.

    ఆమె అది గమనించిందో లేదో కాని, పిల్లల్ని ఆ రాత్రి వేళ గ్రూప్స్‌గా ఇంటికి జాగ్రత్తగా పంపే ఏర్పాట్లు చేస్తోంది.

    "అయ్యా! కాలువ మీద 'బ్రిద్జి' ఇప్పిడే కుంగిందట! మన కారు వెళ్లడం కష్టం" ఈలోగా డ్రైవర్ వచ్చి అన్నాడు.

    "అయితే ఈ రాత్రికి ఇక్కడే ఉండాల్సి వస్తుంది కళ్యాణ చక్రవర్తి గారూ! మీరీవాళ మా ఊళ్లోనే బసచేఅయల్సి ఉండడం నిజంగా మా అదృష్టం" ఆ గ్రామ పెద్ద అందరికేసి చూస్తూ ఆనందంగా నాతో అన్నాడు.

    అసహనంగా తల విదిల్చి, "పడవ ఉంటే ఏర్పాటు చేయండి! కాలువ దాటేసి వేరే కారులో వెళతాను. మా కారు రేపు వస్తుంది, బ్రిడ్జి బాగయ్యాక" అన్నాను.

    "కాలువ బాగా నిండిందయ్యా, పడవ ప్రయాణం కొద్దిగా ప్రమాదకరం" నసుగుతూ అన్నాడు.

    "ఈ పల్లెటూళ్లో మా 'అనూరాధమ్మ' ఇల్లు మీకు బాగా వసతిగా ఉంటుందండీ! అక్కడ మీకే ఇబ్బంది ఉండదు. ఈ ఒక్క రాత్రికి రెస్ట్ తీసుకుంటే రేపు వెళ్లిపోవచ్చును" స్కూల్ చైర్మన్ నసుగుతూ అన్నాడు.

    "అనూరాధ ఇల్లా!" ఆశ్చర్యంగా అనుకున్నాను మనసులో.

    "అయ్యా, రండి" అంటూ అతను ముందుకు కదిలాడు. ఇక తప్పలేదు నాకు.

    "ఇక ఈ టీచరమ్మ గుడిసె నాకీ రాత్రికి తప్పేటట్టుగా లేదు" చికాకు పడుతూ అనూరాధ వెంబడి అడుగువేసాను.

    స్కూల్‌కి దగ్గరలో నాలుగో వరసలో ఉందా ఇల్లు. ఇల్లు వంక చూడగానే నేను నోరు తెరిచాను! పాత జమీందారీ బంగళా అది. ఠీవిగా దర్పంగా ఉందా మేడ! గదులన్నీ బాగా విశాలంగా, చాలా పెద్దవిగా ఉన్నాయి.

    అందరూ వీడ్కోలు చెప్పి వెళ్లిపోయాక,

    "ఇది మీ ఇల్లా?" ఆశ్చర్యంగా అడిగానామెని.

    చిన్నగా నవ్వి,

    "ఇది మా తాత ముత్తాతల ఇల్లు" అంది.

    "అంటే" ఆసక్తిగా అడిగాను.

    "మా పూర్వీకులు మిగిల్చిన ఇల్లు ఇది. నేను మా తల్లిదండ్రులకు ఒక్కదాన్నే. నాన్నగారు పోయి అయిదేళ్లు దాటింది. నేను, అమ్మా ఇద్దరమే ఈ లంకంత కొంపలో. ఆస్తంతా ప్రస్తుతం దావాల్లో ఉంది"

    "మరి ఇంత ఇల్లు, ఆస్తి ఉండి, మీరు ఇలా టీచరుగా...?" అర్థోక్తిగా ఆగాను.

    ఆమెను 'నువ్వు' నుండి 'మీరు' అని నేను సంబోధించడంలోని మార్పుని నేను గుర్తించాను. కాని ఆమె అదేం పట్టించుకున్నట్టుగా లేదు.

    "వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. మనసు వేరు, మనిషి వేరు. ఈ జమీందారి వేరు, ఈ పిల్లల పట్ల నా ప్రేమ వేరు. అదీ కాక ఆస్తి జప్తులో ఉండడం వల్ల మాకు ఈ ఇంటిమీద కాని, ఆస్తి మీద కాని ప్రస్తుతం ఎటువంటి ఆదాయమూ లేదు. అలా అని అమ్మే హక్కూ లేదు. మరి ఎలా గడుస్తుంది? అందుకే ఈ కచేరీలు, ఉద్యోగాలు. మా అమ్మకికి అన్ని విష్యాలు పూర్తిగా తెలియనివ్వను. అన్ని ప్రోగ్రాంస్కి 'నేను' ఛీఫ్ గెస్ట్‌గా మాత్రమే వెళుతున్నాననుకుంటుంది, కాని అక్కడ నేను పాడతానని, డబ్బులు తీసుకుంటానని ఇక్కడింకా పరదాల మాటున ఉన్న ఆమెకి తెలీదు.  తెలిసిన రోజున ఆమె మనసు ముక్కలవుతుంది. మనిషి దక్కడం కష్టమవుతుంది"

    క్రమంగా నాలో మబ్బులు విడిపోతున్నాయి! ఆ క్షణంలో ఆమె ముందు చాలా అల్పుడిగా నాకు నేను తోచాను.

    'ఎంతో డబ్బున్న కుటుంబం నుంచి వచ్చి కూడా ఎంత నిరాడంబరంగా ఉందీమె. ఎంతటి కష్టాల్ని మోస్తూ ఎంత నిబ్బరంగా ఉందీమె'

లైట్లు ఆర్పి, తలుపు దగ్గరగా వేసి ఆమె ఆ గదిలోంచి వెళ్లిపోతూంటే అప్పటి వరకూ నా చుట్టూ ఉన్న వెలుగేదో హఠాత్తుగా మాయమైయ్యిందనిపించింది. చిత్రంగా రాత్రంతా నా కలల్లో అనూరాధ అందంగా మెరుస్తూనే ఉంది.

* * *

    ఒక నెల గడిచేటప్పటికి ఆమెని చూడలేని స్థితి నాకు కలిగింది. ఒక్కసారయినా ఆమెని కలవాలన్న తహతహ నాలో మొదలైంది. కానీ నాకు నేనుగా ఆమె ఇంటికి వెళ్లలేను. అలా అని అది అహం అంటే నేను ఒప్పుకోలేను. అలా నేను కొట్టుమిట్టాడుతుండగనే మరో మూడు నెలలు గడిచిపోయాయి.

    రెండు మూడు సందర్భాలలో, కాకినాడలో ఫంక్షన్స్‌కి వెళ్లినప్పుడల్లా, నా కళ్లు ఆమెకోసం ఆత్రంగా గాలించేవి. కాని ఎక్కడా ఆమె మళ్లీ నాకు తారసపడలేదు. 

    ఆరు నెలలు గడిచాక ఎవరో చెబితే తెలిసింది,ఆమె తల్లి చనిపోయిందని. ఆస్తి అంతా దాయాదులకే దక్కిందని. అప్పుడు బయలుదేరి వెళ్లాను, ఆమె ఊరికి. కాని ఆశ్చర్యం ఏమిటటే, ముందు ఎందుకు వెళ్లలేక పోయానో నాకు తెలియదు, ఇప్పుడు ఎందుకు బయలుదేరి వెళ్లానో కూడా నాకే తెలియదు. 

    ఆమె అదే వీధిలో చిన్న ఇంట్లో ఉంటోంది. రెండే రెండు గదులు! కానీ అనూరాధ ముఖంలో అస్సలు ఆందోళన కాని, కలిగిన కష్టాల పట్ల విచారం కాని కనిపించలేదు. అలాగే కనీసం నా రాక పట్ల కూడా ఆమె ఏ మాత్రం ఆశ్చర్యం ప్రకటించలేదు. అది నన్నింకా బాధించింది.

    ఒక ఇంట్లో మనిషి చనిపోతే, అందరూ ఇంటికి వచ్చి పలకరించడం అనేది సమాజంలో ఉండే ప్రతి మనిషిలోని సహజమైన దయార్ద్ర గుణంగా ఆమె అర్థం చేసుకుందని నాకు అనిపించింది. అంతే కాని ఇంత గొప్పవాడు తన ఇంటికి వచ్చి తనని పలకరించడం ఎంత గొప్పో అనే విషయం ఆమె అర్థం చేసుకోలేదని కూడా నాకు అనిపించింది.

    "రండి, కూర్చోండి" అంటూ ఓ పాత కుర్చీ చూపించింది. నా మల్లెపూవు లాంటి లాల్చీ ఆ పాత కుర్చీలో కూర్చుంటే పాడయిపోతుందనిపించింది. ఇబ్బందిగా అసహనంగా కూర్చున్నాను.

    "పాపం, మీ అమ్మగారు" అనబోయాను.

    "అదృష్టవంతురాలు" అంది చటుక్కున.

    "కాని...!"

    "ఈ దావాల్లో ఓడిపోవడాలు, ఇల్లు స్వాధీనం చేసుకోవడాలు, అన్నీ చూడకుండా హాయిగా వెళ్లిపోయింది. ఈ విషయంలో దేవుడు నా పట్ల కరుణ చూపించాడు"

    అంత బాధాకరమైన విషయాల్ని ఆమె అంత సులువుగా తీసుకోవడం నేను జీర్ణించుకోలేక పోయాను.

    "ఎన్నాళ్లు ఇలా?"

    "నాకీ ఆస్తి విషయంలో ఎటువంటి బాధ లేదు. అయినా లాయరు సుప్రీం కోర్టులో కేసు వేస్తానన్నాడు. చూడాలి!"

    "అందుకే, నేను...!" గొంతు సవరించుకుంటూ నేను చెప్పబోతుంటే, బాగా పొడవుగా, కొంచెం చామనఛాయగా ఉన్న ఒకతను అప్పుడే లోపలికి వచ్చాడు. అతన్న్ని చూడగానే అనూరాధ ముఖంలో తెలియని వెలుగు నిండింది.

    "అనూ! కార్డ్స్ తెచ్చాను" అన్నాడతను, నా వంక తల తిప్పి చూస్తూ.

    అతను 'అనూ' అని ఆమెని అంత సన్నితంగా పిలవడం నాకెందుకో సుతరామూ నచ్చలేదు.

    "చంద్రం  గారూ వీరు కళ్యాణ చక్రవర్తి గారు" పరిచయం చేసింది అనూరాధ.

    "నమస్కారం" అన్నాడతను. నా అలవాటుగా తల పంకించాను. ఈ లోగా అనూరాధ ఓ శుభలేఖ తీసి నా చేతిలో పెడుతూ, "వీరు చంద్రం గారు, నా కాబోయే భర్త. వచ్చే నెల ఆరో తారీఖు మా పెళ్లి" అంది.

    అంతే! దిమ్మెరపోయాను. "మీరు తప్పకుండా రావాలి. పెళ్లవగానే మేం మా ఊరు శ్రీకాకుళం వెళ్లిపోతున్నాం" అతను నవ్వుతూ అన్నాడు. తల ఊపాను, కాని నా ఎదలో వేల విస్ఫోటనాలు! ఏదో జరగరానిది జరిగినట్టు, నా ప్రాణానికి ప్రాణమైంది ఎవరో లాక్కుపోయినట్టు, తట్టుకోలేని పరిస్థితి.

    ఇంటికి ఎలా చేరానో, నాకే తెలియదు. ఏదో కోపం! ఏదో కసి! అంతే. నా జీవితంలో మళ్లీ ఆమె ముఖాన్ని తిరిగి చూడకూడదనుకున్నాను. అవమానంతో రగిలిపోయాను. ఎన్నో నెలల వరకు ఆ పరాభవాన్ని జీర్ణించుకోలేక పోయాను. ఆ తర్వాత బాగా డబ్బున్న, అందమైన జమీందార్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు. జీవితం హాయిగా సాగుతోంది. కాని అనూరాధ అన్న పేరు వింటే మటుకు నాకిప్పుడు కోపం, అసహ్యం.

* * *

    నా జీవితంలో ఆమెను చూస్తాననో, అసలు చూడాలనో కూడా నేను అనుకోలేదు. కాని మళ్లీ పదేళ్ల తర్వాత ఆమెని కలవడం తటస్థించింది. శ్రీకాకుళంలో ఇంజనీరింగు కాలేజి వార్షికోత్సవానికి నేను ముఖ్య అతిథిగా వెళ్లాను. అక్కడ కాలేజీలో అనూరాధని మళ్లీ చూసాను. ఆమెలో అదే చిరునవ్వు. అదే ప్రశాంతత.

    కాని నాలో ఏదో అలజడి. మళ్లీ ఉవెత్తున ఎగుస్తున్న కోపం.

    కార్యక్రమం పూర్తి అయ్యాక, రెండు చేతులు జోడిస్తూ, ఆమే నా దగ్గరగా వచ్చి "ఎలా ఉన్నారు? చాలా కాలమైంది మిమ్మల్ని చూసి" అంటూ ఆత్మీయంగా పలకరించింది.

    తలపంకించాను గంభీరంగా.

    ఆమెతో ఇంకేం మాట్లాడడానికి నాకు మనస్కరించలేదు. లోలోపల పాత గాయాలు రేగి నన్ను చాలా బాధపెడుతున్నాయి. మౌనంగా హోటల్‌కి చేరాను. 

* * *

    మర్నాడు 'శ్రీకూర్మం' వెళ్లి స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతూంటే, దోవలో 'రామ్ ఆర్గన్ ఫౌండేషన్' అన్న బోర్డు, ఆ ప్రక్కనే పెద్ద ఆశ్రమం కనిపించింది.

    "ఈ మధ్య ఈ కేంద్రం గురించి ఎక్కువగా వింటున్నాం కదా!" నాతో ఉన్న ఇంజనీరింగు కాలేజి ప్రిన్సిపాల్ మూర్తిగారితో అన్నాను.

    "అవునండీ! ఈ అవయవ దాన కేంద్రం మన రాష్ట్రమంతటా ప్రఖ్యాతిగాంచింది. అది మా ఊళ్లో ఉండటం మాకెంతో గర్వకారణం!" అన్నారాయన.

    "చాలా మందికి ప్రాణదానం చేసిందీ సంస్థ కదా" అన్నాను. 

    "అవునండీ. చాలా మంచి ఉద్దేశ్యంతో నడుస్తున్న సంస్థ ఇది. అన్ని చోట్లా బ్రాంచీలున్నాయి. నిజంగా ప్రమాదాల్లో, రోగాల్తో ప్రాణాలు పోయేముందు మన అవయవాలు ఇంకో వ్యక్తికి దానం ఇవ్వడం ద్వారా, ఆ మనిషిలో మనం పోగొట్టుకున్న ఆత్మీయుల్ని మళ్లీ చూడగలుగుతాం. ఇంకో మనిషికి మళ్లీ ఆయుష్షును పోసినవాళ్ళమవుతాం."

    "మరి, ఈ పక్క ఈ ఆశ్రమం ఏమిటి?"

    "అది అనాథ పిల్లల కోసం, పేద పిల్లల కోసం ఆ సంస్థే నడుపుతున్న అనుబంధ విద్యాకేంద్రం. మీకభ్యంతరం లేకపోతే మనం ఒక్క పదినిముషాలు ఇక్కడే ఆగుదాం. ఆ సంస్థ నిర్వాహకులు నాకు బాగా పరిచయం ఉన్నవాళ్లే. మీరూ కాసేపు రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది. ఏమంటారు?"

    తలపంకించాను, అంగీకారంగా.

    కారు ఆశ్రమంలో ఆగింది. ఆశ్రమ వాతావరణం అంతా పచ్చటి చెట్లు, పూల మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది.

    ఓ పక్కగా పిల్లలు పాడుతున్న దేశభక్తి గీతం లీలగా వినబడుతోంది. చల్లగాలి ఎదకి తగులుతూంటే చాలా హాయిగా అనిపించింది.

    మూర్తిగారు మేడ మీద ఉన్న గదిలోకి తీసుకెళ్లి, "కళ్యాణ చక్రవర్తి గారు, మీరు కాస్త రీఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి, నేనీలోపల స్నాక్స్ అరేంజ్ చేస్తాను" అంటూ తలుపు దగ్గరగా పెట్టి వెళ్లారు.

    నేను ముఖం కడుక్కొని, టవల్‌తో తుడుచుకుంటూ కిటికీ వైపుగా వచ్చాను. కింద గ్రౌండ్‌లో అప్పుడు కనిపించింది అనూరాధ మళ్లీ అక్కడ! పిల్లలతో దేశభక్తి పాటలు పాడిస్తోంది ఆమెనే.

    'అయితే చివరికి ఇక్కడీ స్కూల్లో సంగీతం టీచరుగా చేరిందన్న మాట' అనుకున్నాను ఆమె వంకే చూస్తూ.

    మనిషి సాదా నేత చీరలో పొందికగా అలాగే ఉంది. పొడవాటి జడ వన్నె కూడా ఎంత మాత్రం తగ్గలేదు. పదేళ్ల క్రితం ఆమె ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది.

    ఆమెను అలాగే చూస్తుండి పోయాను. నాలో అలలు అలలుగా ఏవో జ్ఞాపకాలు.

    పాట మధ్యలో ఎందుకో ఆమె తలతిప్పి, నా వైపు చూసి చిన్నగా నవ్వినట్టనిపించింది.

    'ఇప్పుడు మళ్లీ నన్ను పలకరించడానికి వస్తుంది కాబోలు' చికాకుగా తల విదిలించాను. ఇంతలో మూర్తిగారు అటెండరుతో బిస్కట్స్, కూల్‌డ్రింక్స్ పట్టుకొని లోపలికి వచ్చారు.

    "మూర్తిగారూ, ఇక బయలుదేరుదాం. మళ్లీ రాత్రికి నేను మా ఊరు చేరాలి" అసహనంగా అన్నాను.

    "అలాగే లెండి! ఒక్కసారి మేడమ్ గారిని మీకు పరిచయం చేసాక, వెళ్లిపోదాం" అన్నారు కూల్‌డ్రింక్ చేతికిస్తూ.

    అంతలో ఆయన తలతిప్పి, కిటికీలోంచి కిందకి చూస్తూ, "చక్రవర్తిగారూ, ఇదిగో చూడండి, ఆవిడే అనూరాధాదేవి గారు. ఈ సంస్థకి ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్. అలాగే ఈ విద్యాకేంద్ర నిర్వాహకురాలు కూడా. చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు. మా కాలేజీలో నిన్న రాత్రి ఫంక్షన్‌లో మీరు గోల్డ్ మెడల్స్ ఇచ్చారే, ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఈ ఆశ్రమంలోనే పెరిగి, చదువుకొని వచ్చిన వారే. ఇంజనీరింగు వరకు వాళ్లని ఆమే ఉచితంగా చదివించారు."

    మూర్తిగారి ముఖంలో ఆమె పట్ల భయభక్తులే కాక గొప్ప ప్రశంసలు కనిపించాయి నాకు.

    విభ్రాంతిగా ఆయన వంక చూసాను.

    "ఈ సంస్థ ఆమెదా?" షాక్ కొట్టినట్టుగా అడిగాను.

    "అవునండీ! ఆమె ఆస్తంతా ఈ విద్యాకేంద్రానికి పెట్టుబడిగా పెట్టి చాలా అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు తృణప్రాయంగా ఈ పిల్లల చదువు కోసం, వాళ్ల ఉన్నతి కోసం దానం చేసారు" అన్నారు మూర్తిగారు.

    "ఆమెకు ఆస్తి ఎక్కడిది? ఏమీ లేదు కదా?" అప్రయత్నంగా అన్నాను.

    "అయ్యో లేక పోవడమేమిటండీ. జమీందారీ ఆస్తి చాలా ఉంది. ఇక్కడ మన కోర్టులో దాయాదుల చేతిలో ఓడినా, మళ్లీ సుప్రీం కోర్టు తీర్పు ద్వారా అంతా ఆమెకే చెందిందండీ. చిత్రమేమిటంటే ఆ డబ్బంతా ఇక్కడ మా ప్రాంతపు పిల్లలకు దక్కే యోగం ఉంది. ఎక్కడ కాకినాడ దగ్గర కుగ్రామం, ఎక్కడ ఈ ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు చెప్పండి?"

    నాలో మళ్లీ మబ్బులు అన్నీ విడిపోతున్నాయి. ఆమె ముందు మళ్లీ అల్పుడిగా మారి పోతున్నా ననిపించింది.

    "మరి రామ్ అవయవ కేంద్రం? అది ఎందుకు పెట్టారు?" నా గొంతు నాకే హీనంగా వినిపించింది.

    "అది వారి భర్తగారి పేరు మీద ప్రారంభించారండి. ఆయన పేరు రామచంద్రం గారు. పాపం పెళ్లయి నాలుగేళ్లు అయినా కాకముందే, బ్రెయిన్ హేమరేజ్ వచ్చి చనిపోయారు. ఆమె గట్టి మనస్సు చేసుకొని, ఆ కష్టాన్నంతా దిగమింగుకొని, ఆయన అవయవాలన్నీ వేరే వ్యక్తులకి దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ అవయవ గ్రహీతల ఆనందం చూసి, ఆ స్ఫూర్తితోనే ఆమే ఈ ఫౌండేషన్‌ని స్థాపించారు."

    "అయ్యో, అతను చనిపోయాడా!" షాక్ తిన్నట్టుగా అన్నాను.

    "అవునండీ ఆస్తంతా ఈ విద్యా కేంద్రం కోసం ధారపోసి నిరాడంబరంగా ఆమె జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ ప్రాంతంలో వెనుకబడిన వాళ్లు ఆమెని ఒక దేవతగా కొలుస్తారు"

    నాకు నేను మరీ మరుగుజ్జులా కనపడటం మొదలు పెట్టాను. ఇంతలో బెల్లు కొట్టారు. పిల్లలంతా తమ క్లాసుల్లోకి వెళ్లిపోయారు.

    అనూరాధ తలుపు తీసుకొని లోపలికి వచ్చి, "మీరీవాళ పెద్ద మనసు చేసుకొని మా విద్యాకేంద్రానికి రావడం, నాకు చాలా ఆనందం కలిగించింది" అంది రెండు చేతులు జోడిస్తూ.

    నాకెందుకో హఠాత్తుగా చనిపోయిన మా అమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె ప్రేమను నేను గుర్తించకపోవడం అప్పుడే గ్రహింపుకు వచ్చింది. ఎదురుగా ఉన్న అనూరాధలో ఆమె నాకు మళ్లీ కనిపించింది.

    యుగయుగాలుగా, అనంత ప్రేమ పరిమళాలను వెదజల్లుతున్న స్త్రీమూర్తికి ప్రతిబింబంగా ఆమె నా కళ్ల ముందు నిలిచింది.

    అప్రయత్నంగా నా కళ్లకి నీళ్లు వచ్చాయి.

    "అనూరాధా! డబ్బు కన్నా గుణం గొప్పంటారు, కాని అన్నింటి కన్నా మానవత్వం గొప్పది. మనకే చిన్న కష్టం వచ్చినా, అదే పెద్ద కష్టంగా భావిస్తూ, భరించలేనిదిగా ఫీల్ అవుతూ అందరి ముందు తెగ వాపోతూ ఉంటాం. కాని ఒక్కసారి కళ్లు తెరిచి కష్టాల చుట్టూ ఉన్న ప్రపంచం వంక చూస్తే అందరి కష్టాల ముందు మన కష్టాలు అల్పంగా మారిపోతాయి. పెద్ద గీత ముందు మన కష్టాలు చిన్న చుక్కల్లా మారిపోతాయి. కాని మనం కళ్లు తెరిచి చుట్టూ చూడాలంటే మన మనస్సు చాలా విశాలంగా ఉండాలి. అప్పుడే ఇతరుల కష్టాన్ని గుర్తించ గలుగుతాం. కన్నీళ్లు కార్చగలుగుతాం. స్పందించి చేయూత నివ్వగలుగుతాం.

    కాని డబ్బు, హోదా అన్నీ ఉన్న నాలాంటి వాళ్లు చేస్తున్నదేమిటి? ఉన్న అహంకారాన్ని రెట్టింపు చేసుకోవడం తప్ప! లాకర్లో బీరువాల్లో మురుగుతున్న డబ్బుని బూజు పట్టించడం తప్ప!

    అనూరాధా! నిన్ను కలిసిన ప్రతిసారి నాలో ఏదో అశాంతిగా అనిపించేది. కాని ఇప్పుడు అర్థమవుతోంది నాకు, నిన్ను చూసినప్పుడల్లా నాలో ఏదో అంతర్మథనం జరుగుతోందని. నాలో ఉన్న నేనును బయటి తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నానని.

    అనూరాధా! ఈ చిన్నై జీవితంలో ఎంతని సంపాదిస్తాం? ఎంతని మోసుకెళ్లగలుగుతాం? డబ్బు, బంగళాలు, కార్లు, బంగారాలు ఇవన్నీ కాదు మనకి మిగిలేది! చివరికి మిగిలేది - మానవత్వం నుంచి విరిసిన ఆత్మ సంతృప్తి అనే పరిమళం. అదిప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. నా అజ్ఞానం నుంచి నాకు విముక్తి కలిగించుకుంటున్నాను" రెండు చేతులు జోడించి ఆమె ముందు తల వంచి అభివాదం చేస్తూ అన్నాను.

(ఈనాడు ఆదివారం 15-03-2009 సంచికలో ప్రచురితం)
Comments