డామిట్! కథ అడ్డం తిరిగింది! - పినిశెట్టి శ్రీనివాసరావు

    "లక్ష్మి సాయంత్రం వెళ్ళిపోతుందిరా" అంది అమ్మ. "ఉహు." అని ఊరుకున్నాను. అంతకంటే ముందుకెళ్ళి, "ఇప్పుడే ఏం తొందరొచ్చింది. నాల్గు రోజులుండి వెళ్ళొచ్చుగా?" అనే ధైర్యంలేదు నాకు.

    చిన్న ఇల్లు - చిన్న జీతం - చిన్న జీవితం. ఒక్క మనిషి పెరిగితే - ఇల్లు ఇరుకు - బడ్జెట్ తారుమారు - ఎటూ తోచక బేజారు. "లక్ష్మి సాయంత్రం వెళ్ళిపోతుందిట" చెప్పింది నా శ్రీమతి. "అమ్మ చెప్పింది" అన్నాను. "చీర కాకపోయినా, కనీసం జాకెట్టు గుడ్డయినా పెట్టాలి. అలాగే పిల్లాడికి ఓ జత చొక్కా - నిక్కరు..." అంటూ నా ముఖంలోకి చూసి ఆగిపోయింది. "పెట్టు... నీ దగ్గర డబ్బులుంటే" అన్నాను.

    నా స్తోమత -అసమర్థత బాగా తెలుసు శ్రీమతికి. ఈ రోజు క్రొత్తగా చెప్పొచ్చేదేమీలెదు. అందుకే మారు మాట్లాడకుండా ఊరుకుంది.

    నేను సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి లక్ష్మి వెళ్ళిపోయింది. "చెల్లెలు వెళ్ల్ళిపోతుంటే కనీసం బస్సు చార్జీలు కూడా పెట్టలేదు. వెధవ" అందిట అమ్మ.

    శ్రీమతి చెప్పింది.

    అమ్మ అంటే అంది. అమ్మ అన్న మాటలన్నీ అక్షరాల... అంటే, 'వెధవ' అన్న మాటకూడ శ్రీమతి నాతో చెప్పటంలోగల ఉద్దేశ్యం? తన దృష్టిలో కూడ నేను వెధవనేగా?

    తల్లి తిట్తే ఫర్వాలేదు. కానీ పెళ్ళాం కూడ...

    అవమానం... సిగ్గు... ఆత్మాభిమానం వున్న వాడెవడైనా ఆత్మహత్య చేసుకుంటాడు.

    మరైతే నాకు ఆత్మాభిమానం వున్నట్లా? లేనట్లా?

    ఆత్మహత్య చేసుకోలేదు కన్క లేనట్లే!

    ఏమిటో జీవితం మరీ చప్ప చప్పగా తయారైంది.

    గొఱ్రెతోక ఆదాయం. అధిక వ్యయం. నేను - శ్రీమతి, అమ్మ, ముగ్గురు పిల్లలు - మొత్తం ఆరుగురం. ఎనిమిది వందల జీతం. కటింగులు పోను చేతికొచ్చేది ఆరు వందలు. ఇంటి అద్దె రెండు వందలు. పాలఖర్చు వంద. మిగిలిన సగం జీతంలో ఆరుగురం బ్రతకాలి. 

    ఇంతకంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళ సంగతి?

    "వాళ్ళ సంగతి మనకెందుకు? మనసంగతి మనం చూసుకుందాం" శ్రీమతి.

    నిజమే. ఎవడి స్వార్థం వాడు చూసుకోవాలి. ఎవడెలా ఏడిస్తేనేం? స్వార్థం లేకపోతే మామూలు మనిషి ఎలా అవుతాడు?

    రెండ్రోజులయ్యింది అమ్మ నాతో మాట్లాడి. అంటే నామీద కోపం వచ్చిందన్నమాట.

    ఇలా అమ్మకు నా మీద చాలా సార్లు వచ్చింది కోపం.

    చెల్లి పెళ్ళికి డబ్బు సర్దలేనన్నప్పుడు, బావగార్ని పండక్కి పిలిచి కట్నం చదివించనపుడు, అక్కచెల్లెళ్ళు వచ్చి వెళ్ళినప్పుడంతా చీర - జాకెట్టు పెట్టనప్పుడు... ఇలా ఎన్నో సార్లు... ఏవేవో చేయలేదని, జరుపలేదని.

    వీటన్నిటికీ కారణం... ఆర్థికంగా నా బలహీనతే. కేవలం జీతం రాళ్ళమీదే ఆధారపడి బ్రతికేవాడ్ని.

    బంధువులేకానీండి, మిత్రులేకానీండి... ఇంటికి వస్తున్నారంటే భయం. ఒక కప్పు టీ ఇవ్వగలనో లేదోనని.

    ఎంతైనా అమ్మ కదా! ఆమె మాట్లాడక పోయినంత మాత్రాన నేనే వెళ్ళి పలకరిస్తే తప్పేముంది!

    అందుకే "ఏమ్మా! అట్లా వున్నావ్? వొంట్లో బాగోలేదా?" అన్నాను.

    "ఎందుకు బాగోలేదు. బాగానే వుంది. నేను మీ అన్నయ్య దగ్గరకు వెళ్దామనుకుంతున్నాను. రేపు ఆదివారం నన్ను వాడిదగ్గర వదిలేసిరా" అంది.

    ఇదీ మామూలే. అమ్మకు కోపం వచ్చినప్పుడల్లా అన్నయ్యదగ్గరకు వెళ్ళిపోతాననటం. 

    కానీ, వెళ్ళిన నాల్గురోజులకే మళ్ళీ తిరిగిరావటమూ మామూలే. అమ్మకీ - వదినకీ పడదుమరి.

    అయినా, అన్నయ్యంటేనే అమ్మకు ఇష్టం.

    అన్నయ్య అమ్మ అడిగినంత డబ్బు ఇస్తాడు. డబ్బంటే లెక్కలేని మనిషి. సంపాదనెంతో తెలియని మనిషి అన్నయ్య.

    నాకు అది చేతకాదు కనుక నేను అమ్మకు ఇవ్వగలిగింది ఒక్కటే! నా దగ్గరుంచుకుని నేను - శ్రీమతి అమ్మకు సేవచేయటం.

    అన్నయ్య ఇచ్చే డబ్బుముందు మేము చేసే సేవలు అమ్మకు విలువైనవిగా అనిపించలేదనటం నిజం.

    అందుక్కారణమూ లేకపోలేదు. నాన్న చేసింది చిన్న ఉద్యోగం. ఎప్పుడూ డబ్బుకిబ్బందే. అందుకనే ఇద్దరి కొడుకుల్లో అమ్మకు కావల్సిన డబ్బు ఇవ్వగలిగే అన్నయ్యంటే ఆమెకు ఇష్టం. నాన్న మాదిరే నేను. నాన్నమీదున్న చిన్నచూపే నామీద వుంది అమ్మకు. నాన్నలాగానే నేను తెలివితక్కువవాడినని అమ్మ అభిప్రాయం. తెలివిగలవాడినైతే డబ్బెందుకు సంపాదించలేక పోతున్నాను?

    బిడ్డ తప్పుచేస్తుంటే వద్దని వారించి మంచి మార్గం చూపించవలసిన మాతృమూర్తి - ఆ తప్పు చేయకపోవటం అసమర్థతగా ఎంచి అప్రయోజకుడుగా చూడటం ఎంతవరకు సమంజసం?

    కొడుకు సంపాదనెంతో తెలిసి, ఆర్థిక స్తోమతు తెలిసి, అతడి శక్తికి మించిన ఖర్చులు పెట్టటంలేదని బాధించటం - పరోక్షంగా, అతన్ని డబ్బు సంపాదనకై అడ్డదారులు వెతుక్కోమనటమేగా?

    అమ్మ ఇష్టప్రకారమే ఆదివారం ఫస్టు బస్సులో తీసుకెళ్ళి అన్నయ్య దగ్గర వదిలివచ్చాను.

* * *

    ఇంటికొచ్చేసరికి శ్రీమతి ముఖం మాడ్చుకొని వుంది.

    "ఏం అలా వున్నావ్? వొంట్లో ఏదైనా నలతగా వుందా?" అన్నాను చెయ్యి పట్టుకోబోతూ. అమ్మ లేదు కనుక కాస్త చొరవతీసుకున్నాను.

    "ఈ ఇంటి చాకిరీ చేసి చేసి నా ఎముకలు అరిగిపోతున్నాయి. ఏవిటో గుండెల్లో దడ - నీరసం. ఇక నా వల్ల కాదూ; ఈ సంసారం చేయటం. నెలకు రెండు వేలు ఆదాయం వుండి, ఇంటిలో పని మనిషి, వంట మనిషి వుండి టైముకు అన్నీ అమరిపోతూ వుంటే, హాయిగా మంచమీద పడుకుని ఏ నవలో చదువుకుంటూ కూర్చునే జీవితం వుంటే ఇంకేం కావాలి? మనకు ఆ అదృష్టం కూడానా? ప్రొద్దస్తమానమూ వెట్టిచాకిరీ తప్ప" మనసులో బాధ బైట పెట్టేసింది.

    అటు అమ్మ - ఇటు శ్రీమతి.

    ఇద్దరిదీ ఒకటే మనస్తత్వం.

    పొరుగిళ్ళ పిల్లలు కాన్వెంట్లో చదువుకుంటుంటే, మా పిల్లలు మామూలు గవర్నమెంటు స్కూళ్ళల్లో చదువుకుంటున్నారని కోపం. ఇన్నేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నా... ఇంత బంగారమని కాని... రిటైరైయాక ఉండేందుకు ఓ ఇల్లు కాని, బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్లని కాని ఏర్పాటు చేసుకోలేకపోయానని కోపం. ఏడాదికొకసారి తిరపతో, మరో చోటుకో తీసుకు వెళ్ళటంలేదని కోపం. అందరిలా తరచూ సినిమాలకని... పండక్కి అందరికీ కొత్తబట్టలు ఉండవని కోపం... ఇలా నామీద శ్రీమతికి కోపానికి కారణాలు కోకొల్లలు.

    ఇన్ని మాటలెందుకు? శ్రీమతికి నా మీదున్న అభిప్రాయం ఈజీగా చెప్పాలంటే, శ్రీమతి ఒకరోజు నాతో చెప్పిన ఆ విషయం చాలు.

    "రాజాలాంటి సంబంధం వదిలేశాడు మా నాన్న. బ్యాంకులో పన్జేస్తాడతను. ఉద్యోగం మంచిది అయినా, జీతం తప్ప పై సంపాదన వుండదని ఆ సంబంధం వదిలేశారు. అదే టైములో మీ సంబంధం వచ్చింది. మీరు చేసేది గుమాస్తా ఉద్యోగమేయైనా, మీ డిపార్టుమెంటులో పై సంపాదన బాగా ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే మా నాన్న మీ సంబంధం సెటిల్ చేశారు. అందుకే అనుకున్న దానికంటే మీకు కట్నం ఐదు వేలు ఎక్కువ కూడ ఇచ్చింది. కానీ, మీ ప్రయోజకత్వం చూశాక మా నాన్న పొరబడ్డారని తెలుసుకున్నాను."  

    శ్రీమతి చెప్పింది విని 'డంగ్' అయిపోయాను. కుర్రాడి చదువు, ఉద్యోగం, ఫేమిలీ బేక్‌గ్రౌండ్‌ని బట్టి కట్నం రేటు నిర్ణయింపబడుతుందని తెలుసు కాని... ఉద్యోగం చిన్నదైనా పంజేసే డిపార్టుమెంటును బట్టి కూడ రేటు మారిపోతుందని అప్పుడే తెలుసుకున్నాను.
 
    "అందుకే చదువుకున్న కుర్రాళ్ళూ, మీ చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోయినా పర్వాలేదు. చిన్న ఉద్యోగమే అయినా, మంచి డిపార్టుమెంట్, అంటే పై రాబడి వుండే డిపార్టుమెంటును సెలక్టు చేసుకోండి. అప్పుడు కట్నాల మార్కెట్‌లో మంచి రేటు పలుకుతుంది మీకు. ఆ డబ్బు మదుపుపెట్టి 'సైడు బిజినెస్' చేసుకోవచ్చు."
 
     అటు అమ్మకి - ఇటు శ్రీమతికి ఇద్దరికీ ఒకటే అభిప్రాయం నా మీద.
 
     ఇంతకంటే దారుణం ఏముంటుంది?
 
     కన్నతల్లి - కట్టుకున్న ఇల్లాలు ఇద్దరూ కోరుకునేది ఒక్కటే.
 
     నేను పై సంపాదన సంపాదించాలి. దాంతో వాళ్లు సుఖపడాలి.
 
     ఏమైతేనేం, ఇన్నాళ్ళకు 'ఉద్యోగం పురష లక్షణం' అన్నట్లు, 'లంచం పుచ్చుకోవటం పురుష లక్షణం' అన్న సత్యాన్ని తెలుసుకున్నాను.
 
    అందుకే ఇంతకాలం ఏదైతే చేయకూడదని అనుకున్నానో, ఇప్పుడు అదే... పైసంపాదన చేయటానికే నిశ్చయించుకున్నాను.
 
* * *
 
    "మీ బిల్లు పాస్ అయిపోతుంది. 'ఫార్మాలిటీస్' చేసేసి చెక్కు తీసువెళ్ళిపోవచ్చు" అన్నాను చెక్కుకోసం వచ్చిన కాంట్రాక్టరుతో.
 
    "చెక్కు ఇప్పించండి. కేష్ చేసుకొచ్చి డబ్బు కట్టేస్తాను" అన్నాడతను.
 
    "అదేం కుదరదు. ముందు పేమెంట్ అయ్యాకే చెక్కు ఇచ్చేది" గట్టిగానే చెప్పాను.

    "ఇప్పుడు నా దగ్గర కేష్ లేదుసార్, చెక్కిస్తే కేష్ చేసుకుని వచ్చి ఇస్తాను" అన్నాడు.

    నా మొదటి కేసు వీడు. చెక్కు తీసుకున్నాక ఎగనామం పెట్తే... నో... నో... వీడు చెయ్యిజారిపోవటానికి వీల్లేదు.

    "అయితే రేపొచ్చి తీసుకెళ్లండి చెక్కు. ఇంకో విషయం, బిల్లు మీద వెయ్యిరూపాయలివ్వాల్సుంటుంది" అన్నాను.

    "అదేవిటి? ముప్పైవేల బిల్లుకు వెయ్యి రూపాయలా? వన్‌పర్సెంట్ ఇస్తున్నాం. ఆ లెక్కన మూడొందలొస్తుంది" అన్నాడు.

    "ఆ రేట్లు పాతరేట్లు. అప్పటికీ, ఇప్పటికీ ధరల్లో ఎంత మార్పు రాలేదు.అందుకే మీ రేట్లు కూడ పెంచాలి. థ్రీ పర్సెంట్ చూసుకోండి. వెయ్యిఇచ్చి చెక్కు తీసుకెళ్లండి" ఖచ్చితంగా చెప్పేశాను.

    "నా వల్లకాదు. వన్‌పర్సెంట్ ప్రకారం ఇస్తాను. అంతకు మించి ఇవ్వలేను... ఇవ్వను" నా అంత ఖచ్చితంగానూ చెప్పాడతను. 

    "ఇవ్వక పోతే మీ బిల్లు పాసు కాదు" అన్నాను.

    "ఎలా పాసుకాదో నేనూ చూస్తాను" అంటూ లేచాడు.

    "చూస్కో" అన్నాను రెక్‌లెస్‌గా.

    కోపంగా వెళ్లిపోయాడు కాంట్రాక్టరు.

    ఎవడికోసం ఇస్తాడు అడిగినంత, కాస్త మెత్తగా వుంటే వొట్టిచెయ్యి చూపిస్తారు. మొత్తానికి గట్టిగానే అడిగాను. నా ప్రవర్తనకు నాకే ఆశ్చర్యమేసింది. లంచం తీసుకోవటం అంటే భయపడే నేను ఇలా మాట్లాడానా అనిపించింది.
 
    ఆరోజు రాత్రి శ్రీమతితో చెప్పాను వెయ్యిరూపాయలు రాబోతున్నాయని.
 
    ముందు ఆశ్చర్యపోయినా, నేను "నిజం - ఒట్టు" అన్న మీదట నమ్మేసింది శ్రీమతి.
 
    "మరైతే ఒకపని చేద్దాం. మొట్టమొదటి పై సంపాదన కనుక అందులోంచి ఓ వద దేవుడికి ప్రక్కన పెడ్దాం" అంది.
 
    గాడ్ ద గ్రేట్... అడక్కుండానే వాటా కొట్టేస్తున్నాడు.
 
    తనకో చీర... నాకో జత బట్టలు... పిల్లలకు అవీ ఇవీ, మొత్తానికి మిగిలిన తొమ్మిది వందలకు లెక్క చెప్పేసింది శ్రీమతి.
 
    నీ ఇష్టం అలానే కానీ అన్నాను.

    ఎప్పుడూ సీరియస్‌గా, సమస్యల బరువుతో సతమతమైపోతూవుండే శ్రీమతి ముఖంలో ఏదో వెలుగు - తేటదనం కన్పడింది ఈఓజు. నాకు ఏదో రిలీఫ్ అనిపించింది.

 
    కారణం - తీరని కోరికలు కొన్ని మాత్రం తీర్చుకునే అవకాశం దొరికినందుకేనా? కావచ్చు. మధ్యతరగతి మనుషుల్లో పేరుకున్న నిరాశ నిస్పృహలకు కారణం... కోరికలు తీర్చుకోలేని అశక్తత కావొచ్చు. అందుకే డబ్బు చేతికందిన రోజు వాళ్ళు పొందే ఆనందం తాత్కాలికమైనా అదొక అనిర్వచనీయమైన అనుభూతి వాళ్ళకు. అల్ప సంతోషులు.
 
    మర్నాడు... రెండోనాడు కూడ రాలేదు కాంట్రాక్టరు.
 
    డబ్బుకోసం ప్రయత్నిస్తూవుంటాడనుకున్నాను. మూడోరోజు మేనేజరుగారు పిలుస్తే వెళ్ళాను.
 
    "నీమీద కాంట్రాక్టరు శివరామన్ కంప్లైంట్ చేస్తూ హెడ్డాఫీసుకు టెలిగ్రాం ఇచ్చాడట. వెయ్యి రూపాయలడిగావటగా బిల్లు పాస్ చేయటానికి.  ఎంక్వయిరీకి - జనరల్ మేనేజర్‌గారు వస్తున్నారు ఎల్లుండి" అన్నారు మేనేజర్‌గారు.

    బిక్కచచ్చిపోయాను నేను.
 
    నేను - శ్రీమతి కన్న కలలన్నీ కరిగిపోయాయి. వొళ్ళంతా చల్లబడిపోయినట్లయ్యింది. మాట్లాడాలంటే నోరు పెగలటం లేదు. మైండ్ పూర్తిగా పనిచేయటం మానేసింది.
 
    ఎందుకిలా మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది. టేకిల్ చెయ్యటం సరిగ్గా లేకనా? లేక దేవుడికిచ్చిన వాటా సరిపోకనా?
 
    ఆ రోజంతా మనశ్శాంతి కరువయ్యింది.
 
    రాత్రి ఇంటికి వెళ్ళాక,
 
    "పండక్కి 'డిస్కౌంట్' ఇస్తున్నారటండి చీరలమీద. ప్రక్కింటి కృష్ణవేణిగారు తీసుకున్నారు రెండు చీరలు. చాలా బాగున్నాయండి. మీరు పర్మిషనిస్తే నేనూ రెండు చీరలు కొనుక్కుంటాను. చూద్దాం... డబ్బులు సరిపోతేనేలెండి... ఏం మాట్లాడారేం? డబ్బు చేతికొచ్చిందా?" అని అడుగుతున్న శ్రీమతికి ఏమని సమాధానం చెప్పను?
 
    "ఇంకా అందలేదు" అన్నాను.
 
    "అందేకేలెండి" అంటూ సమాధానం చెప్పుకుంది శ్రీమతి.
 
    మర్నాడు ఉదయం మేనేజరు పిలిస్తే రూంలోకి వెళ్ళాను.
 
    "రేపే ఎంక్వయిరీ. జి.యం.వస్తున్నాడు తెలుసుగా?" అన్నాడు మేనేజరు కళ్ళద్దాల్లోంచి అదోలా చూసి.
 
    విని మౌనంగా వుండిపోయాను.
 
    "ఏం చేద్దామనుకుంటున్నావ్? జి.యం.సంగతి తెలుసుకదా, ఎంక్వయిరీలో నీ మీద 'ఎలిగేషన్స్' ఋజువయితే..." అంటూ ఆగాడు నా ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ.
 
    నాకేం చెప్పాలో తెలీటంలేదు.ఇలాంటి విషయాల్లో ఎ.బి.సి.డి.లు తెలియనివాడ్ని.
 
    నా మౌనం చూసి అతడే అన్నాడు.
 
    "నీకో ఉపాయం చెప్తాను, చేస్తావా?" అని.
 
    "ఏమిటి?" అన్నట్లు చూశాను.
 
    "ఓ అయిదువేలు పట్రా. అంతా నాకేననుకునేవ్. జి.ఎం.కి సగం - నాకు సగం. ఎంక్వయిరీ రిపోర్టు నీకు ఫేవరబుల్‌గా వచ్చేటట్లు చూస్తాను" అన్నాడు.
 
    దీన్నేమంటారు? కాకుల్ని కొట్టి రాబందులకు వెయ్యటమనా? చిన్న చేపను పెద్ద చేప తినటమనా? 
 
    నాకేం వినపడటం లేదు. అయిదువేలు అన్నమాట తప్ప. 
 
    "ఆలోచించుకో. సాయంత్రానికల్లా ఏ విషయం చెప్పాలి" అన్నాడు మేనేజరు మళ్ళీ.
 
    అక్కడనుంచి లేచి వచ్చేశాను.
 
    ఐదువేలు ఇవ్వటం నావల్ల కాని పని. అందుకే మేనేజర్ని మళ్ళీ కలవలేదు.
 
* * * 
 
    మర్నాడు జి.ఎం.గారు వచ్చారు.
 
    నామీద కంప్లైంట్ టెలిగ్రాం ఇచ్చిన 'శివరామన్' వచ్చాడు.
 
    ఆఫీసంతా గందరగోళంగా వుంది.
 
    "పూర్ ఫెలో... అత్యాశకిపొతే ఏమవుతుందో తెలీదు పాపం. అందుకే ఇరుక్కున్నాడు"
నా మీద కామెంట్స్ పాస్ చేస్తున్నారు స్టాఫ్ మెంబర్లు.
 
    ఏ క్షణాన నాకు మేనేజర్‌గారి దగ్గరనుండి పిలుపు వస్తుందోనని ఎదురుచూస్తున్నాను నేను.
 
    అనుకున్న సమయం రానేవచ్చింది.
 
    నేను భయపడుతూనే మేనేజర్‌గారి గదిలోకి ప్రవేశించాను. రూం లోపల జి.ఎం.గారు, మేనెజర్ గారు శివరామన్, స్టెనో కూర్చొని వున్నారు.
 
    నన్నూ కూర్చోమన్నారు.
 
    మేనేజర్‌గారి ముఖం సీరియస్‌గా వుంది.
 
    జి.ఎం.ముఖంలోకి చూసే ధైర్యం లేదు నాకు.
 
    ఎదురుగా వున్న గోడకు వ్రేలాడుతున్న జాతిపిత పఠం బోసి నోటితో నన్ను చూసి నవ్వుతున్నట్లనిపించింది.
 
    ముందుగా కొన్ని ఇతర ప్రశ్నలు అడిగిన పిమ్మట అసలు పాయింటుకు వచ్చారు జి.ఎం.
 
    ఒక టెలిగ్రాం కాయితం శివరామన్‌కి చూపిస్తూ "ఇది మీరిచ్చిందే అనుకుంటాను" అన్నారు జి.ఎం.
 
    శివరామన్ ఏం సమాధానం చెబుతాడోనని నా గుండె అతి వేగంగా కొట్టుకొంటోంది.
 
    ఆక్షణంలో జి.ఎం.గారు,మేనేజర్‌గారు 'కాలం తీరుఇన జీవుణ్ణి ఎత్తుకుపోవటానికి వచ్చిన యమభటు'ల్లా కనిపించారు నాకు.
 
    శివరామన్ ముఖంలోకి దీనంగా చూశాను నేను.
 
    మరుక్షణం "ఈ టెలిగ్రాం నేను ఇవ్వలేదు" అన్నాడు శివరామన్.
 
    అంతే; అప్పటివరకు నాలో ఉన్న టెన్షన్ ఒక్కసారిగా దిగిపోయింది.
 
    "క్రింద మీ పేరువుంది. మీరివ్వకపోతే మీపేరుతో ఎవ్వరిస్తారు? సరిగ్గా చెప్పండి" అన్నారు జి.ఎం. అధికార స్వరంతో.
 
    "నేనైతే ఇవ్వలేదు. నా పేరుతో ఎవ్వరైనా ఇచ్చారేమో" అన్నాడు శివరామన్.
 
    "మీరివ్వలేదు సరే. పోనీ మీ బిల్లు పాస్ చేయటానికి లంచం క్రింద ఇతను వెయ్యి రూపాయలు డిమాండ్ చేశాడా లేదా?"
 
    "లేదు" అన్నాడు శివరామన్.
 
    అంతే ఎంక్వయిరీలో నామీద ఎలిగేషన్స్ నిరూపించబడనట్లు తేలిపోయింది.
 
    అయితే శివరామన్ మొదట కంప్లైంట్ ఇచ్చి, తర్వాత ఇవ్వలేదని ఎందుకు అబద్ధం చెప్పాడో ఎవరికీ అంతుపట్టని విషయం.
 
    అది నాకు - శ్రీమతికే తెలుసు.
 
    కొనిపెడతానన్న చీరలు కొనిపెట్టకపోగా, శివరామన్ చేత ఆ టెలిగ్రాం తను ఇవ్వలేదని చెప్పించటానికి, అతడు డిమాండ్ చేసిన వెయ్యి రూపాయల కోసం శ్రీమతి చేతిగాజులు అమ్మవల్సి వచ్చింది. ఆ రహస్యం మా ఇద్దరికే తెలుసు.
 
    ఈసారి మెళ్ళో గొలుసుకూడ అమ్మేస్తాననుకుందేమో, శ్రీమతి నన్ను పైసంపాదన గురించి మరెప్పుడూ అడగలేదు.
 
(ఆంధ్రసచిత్రవారపత్రిక 23-12-83 సంచికలో ప్రచురితం)
Comments