దత్తత - కంది శంకరయ్య

  
 
"... అన్నట్టు చెప్పడం మరిచాను. ఈ మధ్య శోభ కనిపించింది"
    సుధాకర్ మాటలు విని ఉలిక్కిపడ్డాను. ముఖంలో కలవరపాటును, ఉత్సుకతను బలవంతాన కప్పిపుచ్చుకుంటూ "అలాగా!" అన్నాను.
    "మొన్న నా ప్రమోషన్ గురించి హైదరాబాద్ వెళ్ళాను చూడూ ... అప్పుడు కనిపించింది. తను పలకరించకుంటే నేనసలు గుర్తుపట్టకపోయేవాణ్ణే. చాలా మారిపోయింది. అప్పటికంటే ఇప్పుడు అందంగా, నాజూగ్గా కనిపించింది...."
    "ఏం చేస్తోందిట?" అతని మాటలకు అడ్డు తగుల్తూ అడిగాను.
    "మన మూర్తి గారింటికి దగ్గర్లో ఓ కాన్వెంటుంది. అందులో ఆయాగా పనిచేస్తోందట! మూర్తిగారి పిల్లలూ అదే స్కూల్లో చదువుతున్నారు"
    "ఉహూఁ ..." అన్నాను నిరాసక్తంగా. కాని మనసులో శోభను గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనే ఉంది. 
    "వెంట నాలుగేళ్ళ అబ్బాయి ఉన్నాడు. అడిగితే కొడుకని చెప్పింది."
    సుధాకర్ చెప్పిన  విషయం నాలో ఆలోచనల్ని రేకెత్తింది. ‘నాలుగేళ్ళ అబ్బాయి ...!?’ శోభను నేను చివరిసారిగా చూసి దాదాపు అయిదేళ్ళు కావస్తుంది. అంతకు ముందు దాదాపు సంవత్సరకాలం మా ప్రణయకలాపాలు నిరాటంకంగా సాగాయి. ఆ అబ్బాయి శోభకు నావల్ల పుట్టినవాడు కాదు కదా! ... ఏమో ...?
    శోభ మాయింట్లో పనిమనిషిగా ఉండేది. ఒక్క మా యింట్లోనే కాదు, ఆ చుట్టుపక్కల అయిదారిళ్ళల్లో పని చేసేది. అందులో సుధాకర్ వాళ్ళ ఇల్లుకూడా ఉంది.
    శోభకు పెళ్ళయింది. ఏడాదైనా కాపురం చేసిందో, లేదో ఆమె మొగుడు ఊరి ముఠాతగాదాలకు బలయ్యాడు. అత్తారింటివాళ్ళు గెంటేయడంతో పుట్టింటికి చేరింది. వాళ్ళకు తాను భారం కాకూడదని మా యిళ్ళల్లో పనిమనిషిగా చేరింది. 
    శోభ నా కళ్ళకు అందంగానే కనిపించేది. ముఖ్యంగా ఆమె కదలికలు రెచ్చగొట్టే విధంగా ఉండేవి. మా ఆవిడ విమల గమనించకుండా దొంగచూపులు చూసేవాణ్ణి. నా కళ్ళలోని ఆకలిని గుర్తించినట్టుగా శోభ కొంటేగా నవ్వేది. విమల ఎదురుగా ఉన్నప్పుడు ఒకరకంగా, లేనప్పుడు మరోరకంగా ప్రవర్తించేది. నేను అవకాశం కోసం ఎదురుచూసాను.
    మా అత్తగారి ఆరోగ్యం బాగా లేదని కబురు రావడంతో విమల హఠాత్తుగా పుట్టింటికి వెళ్ళిపోయింది. 
    మరునాడు ఉదయం పనికి వచ్చిన శోభను మాటల్లో దించి చేయి పట్టుకున్నాను. ఆమె నా చేతిని సున్నితంగా విడిపించుకొని సాయంత్రం వస్తానంది. అన్నట్టే వచ్చింది. సంకోచించకుండా, సంతోషంగా, నేను కోరినవిధంగా నన్ను ఆనందసాగరంలో ముంచెత్తింది.
    రెండు రోజుల్లో వస్తానన్న విమల పుట్టింట్లో వారం రోజులుంది. ఆ వారంరోజులూ ఏ ఆటంకం లేకుండా శోభతో సరదాలు తీర్చుకొన్నాను. 
    విమల రాక మా ప్రణయకలాపాలకు తాత్కాలికంగా అంతరాయాన్ని కలిగించింది. ఒకరోజు శోభ నన్ను వాళ్ళ పిన్ని ఇంటికి తీసికెళ్ళింది. శోభ ఆవిడ కేం చెప్పిందో కాని మేం వెళ్ళగానే ఆమె బయటకు వెళ్ళిపోయేది. వారానికి కనీసం రెండుసార్లు అక్కడ కలుసుకునేవాళ్ళం. 
    శోభకు ఎప్పుడైనా డబ్బు లివ్వబోయినా, ఏదైనా కొనిస్తానన్నా వద్దనేది. ఆమె పిన్ని మాత్రం అప్పుడప్పుడు అయిదో, పదో అడిగి తీసికొనేది. 
    మా విషయం విమల కెలాగో తెలిసింది. ముందు శోభతో పని మాన్పించింది. అయినా శోభను వాళ్ళ పిన్ని ఇంట్లో కలిసేవాణ్ణి. ఒకరోజు విమల అకస్మాత్తుగా అక్కడికే వచ్చింది. వెంట సుధాకర్ ఉన్నాడు. అక్కడ మమ్మల్ని రెడ్ హాండెడ్ గా పట్టుకొంది. శోభను నోటికి వచ్చినట్లు తిట్టి రాద్ధాంతం చేసింది. ఆ వీధిలోని వాళ్ళంతా గుమిగూడారు. వాళ్ళముందు అవమానంతో ఏడుస్తూ, తలవంచుకొని మౌనంగా ఉన్న శోభ రూపం ఇప్పటికీ నా కళ్ళముందు మెదుల్తూ ఉంటుంది. 
    మళ్ళీ శోభముఖం చూడనని నా చేత ప్రమాణం చేయించుకుంది విమల. ఆ తర్వాత శోభను నేను ఎప్పుడూ చూడలేదు. కొంతకాలం తర్వాత ఓ రెండో పెళ్ళివాడికిచ్చి చేసారని విన్నాను. క్రమంగా ఆమెను మరిచిపోయాను. 
    మళ్ళీ ఇన్నాళ్ళకు సుధాకర్ తెచ్చిన ప్రస్తావనతో ఆమె జ్ఞాపకాలను తిరగదోడుకున్నాను. 
    "ఏంటి గురూ? మధురస్మృతులా?" వ్యంగ్యంగా అడిగాడు సుధాకర్.
    "స్మృతులే ... కొన్ని తీయనివి, కొన్ని చేదువి ... నీకు తెలుసుకదా!" అన్నాను నవ్వుతూ. 
    సుధాకర్ భావగర్భితంగా తలెగరేసి వెళ్ళిపోయాడు.
    శోభ కొడుకు నా కొడుకైతే ఎంత బాగుంటుంది? నేను పెంచుకుంటానంటే ఇస్తుందా? ఇవ్వకేం చేస్తుంది? ఆమె దగ్గర పెరిగి వాడేం చదువుతాడు? కూలివాడో, రిక్షవాడో అవుతాడు తప్ప మంచి స్థితికి రాగలడా? తన కొడుకు గొప్పవాడు కావాలని కోరుకుంటే తప్పక ఇస్తుంది. ఆమె మొగుడు ఒప్పుకుంటాడా? ఎంతో కొంత డబ్బు వాడి మొహాన కొట్టి ఒప్పించవచ్చు. అయినా ఆ పిల్లవాడు నాకు పుట్టినవాడే అన్న గ్యారంటీ ఏమిటి? వైద్యపరీక్షలవల్ల తెలుస్తుందంటారు. నిజమేనా? వాడు నా కొడుకే అని నిర్ధారణ చేసికొని, వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చినా విమల కేంచెప్పాలి? అనాథశరణాలయం నుండి తెచ్చానంటే? వాళ్ళ అక్కయ్య కొడుకును దత్తత తీసుకొందాం అని పోరుపెట్టే విమల ఎవరో అనామకుణ్ణి చేరదీస్తుందా? శోభ కొడుకని తెలిస్తే వాడి నీడను కూడా అసహ్యించుకొంటుంది. ఏం చేయాలి? 
    మా పెళ్ళై పదిహేనేళ్ళు దాటినా సంతానం లేదు. డాక్టర్లు మా యిద్దరిలో ఎవరికీ ఏలోపమూ లేదన్నారు. వాళ్ళు రాసిన మందులన్నీ వాడాం. తీర్థక్షేత్రాలు తిరిగాం. నోములూ, వ్రతాలూ చేసాం. చివరికి నాటువైద్యుల్నీ, గ్రామదేవతల్నీ ఆశ్రయించాం. ఫలితం లేకపోయింది. ఇక మాకు సంతానయోగం లేదని గుండె నిబ్బరం చేసుకున్నాం. కొంతకాలంగా విమల వాళ్ళ అక్కయ్య కొడుకును దత్తత తీసుకుందామని పోరుపెడుతోంది. అయినా ఇప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోలేదు. 
    ఎలాగైనా వెంటనే శోభను కలిసి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకోవా లనుకున్నాను. 
    ఆఫీసుకు సెలవు పెట్టి మరునాడే హైదరాబాదు చేరుకున్నాను. మూర్తిగారిల్లు విద్యానగర్ లో ఉంది. ఆయన మా యూనియన్ ప్రెసిడెంట్. సుధాకర్ చెప్పినట్లే ఆయనింటికి అవతల కొద్దిదూరంలో ఓ కాన్వెంట్ ఉంది. పేరు ‘లిటిల్ స్టార్స్ కాన్వెంట్’.
    అప్పటికి పదకొండయింది. కాన్వెంట్ లోపలికి వెళ్ళి శోభతో మాట్లాడాలంటే కుదరదు. లంచ్ టైంలో బయటికి వస్తుందో, లేదో? నాకు తెలిసినంత వరకు కాన్వెంట్లలో ఆయాలు పిల్లలతోనే ఉంటారు. సాయంత్రం కలిసి మాట్లాడా లనుకున్నాను.
    మా హెడ్డాఫీస్ దాకా వెళ్ళి పాతమిత్రులతో కాలక్షేపం చేసి మూడున్నరకల్లా కాన్వెంట్ దగ్గరికి వచ్చాను. నా అదృష్టం ... కాన్వెంట్ కెదురుగా ఒక ఇరానీ హోటల్ ఉంది. కాన్వెంటి మెయిన్ గేట్ కనిపించే విధంగా కూర్చుని టీ తాగి, సిగరెట్ కాలుస్తూ ఎదురుచూడసాగాను. 
    అప్పటికే పిల్లల్ని తీసికెళ్ళడానికి వచ్చిన వాళ్ళు చాలామందే గేటుముందు నిల్చొని ఉన్నారు. స్కూల్ వ్యానూ, కొన్ని రిక్షాలు ఓ పక్కన నిలిచి ఉన్నాయి. 
    నా ఆలోచనల నిండా శోభ! ఆమె కనిపించగానే ఏమని పలకరించాలి? నన్ను చూసి ఎలా రియాక్ట అవుతుంది? నాతో మాట్లాడుతుందా? పిల్లవాని ప్రస్తావన ఎలా తేవాలి? వాడిని చూస్తానంటే ఒప్పుకొని చూపిస్తుందా? నాతో వస్తానని అనదు కదా?
    లాంగ్ బెల్ కొట్టిన శబ్దం వినిపించింది. వరుసగా పిల్లలు బయటికి వస్తున్నారు. ఎదురుచూస్తున్నవాళ్ళు తమ పిల్లల్ని తీసికొని వెళ్తున్నారు. కొంతమంది పిల్లలు వ్యాను, రిక్షాలెక్కి వెళ్లిపోయారు. 
    నాలుగున్నరకల్లా కోలాహాలం తగ్గింది. టీచర్లు కూడా వెళ్ళిపోయారు. మెయిన్ గేట్ నిర్మానుష్యమయింది. శోభ మాత్రం బయటికి రాలేదు. అసహనంగా మరో అరగంట అలాగే కూర్చున్నాను. మరో కప్పు టీ ... సిగరెట్లు ఎన్ని కాల్చాలో లెక్కలేదు.
    పిల్లల్ని దించి వచ్చిన వ్యాన్ లోపలికి వెళ్ళిపోయింది. అసలివాళ శోభ డ్యూటీకి వచ్చిందా? ఉదయం వచ్చినప్పుడే ఆ విషయం కనుక్కోవలసింది. ఆమె పని చేసేది ఈ కాన్వెంట్ కాదేమో? సిటీలో వీధివీధికీ, పక్కపక్కనే ఎన్ని స్కూళ్ళు లేవు? మూర్తిగారిని కలిసి వారి పిల్లలు ఏ కాన్వెంటులో చదువుతున్నదీ తెలుసుకొంటే బాగుండేది.
    శోభ పలకరించే దాకా తానామెను గుర్తుపట్టలేదని సుధకర్ చెప్పాడు కదూ! అలాగే నేను చూస్తుండగానే వెళ్ళిపోయిన శోభను నేను గుర్తించలేదేమో? అలా జరిగి ఉండదు. ఆమెకు సుధాకర్ తో ఉన్న పరిచయానికి నాతో ఉన్న పరిచయానికి చాలా తేడా ఉంది. ఆమె నడకా, మాటా అన్నీ నాకు సుపరిచితాలు. ఎంతమందిలో ఉన్నా నేనామెను గుర్తుపడతాను. 
    టైం చూసుకున్నాను. అయిదున్నర! కాన్వెంట్ లోపలికి వెళ్ళి శోభ గురించి ఆరా తీయాల్సిందే అనుకున్నాను. లేచి బిల్లు కట్టి హోటల్లోంచి బయటపడ్డాను. 
    అదే సమయంలో కాన్వెంట్ లోంచి బయటికి వచ్చింది శోభ. మనిషి రంగు, కట్టుబొట్టు మారినా చూడగానే గుర్తుపట్టాను. ఆమె వెంట స్కూల్ యూనిఫాంలో ఓ అబ్బాయి ఉన్నాడు. నాలుగేళ్ళు ఉంటాయేమో? బాగున్నాడు. నా బాబేనా?
    "శోభా ...!" అని పిలుస్తూ గబగబా ఆమెను సమీపించాను. నా కాళ్ళల్లో ఏదో కారణం తెలియని వణుకు. 
    నన్ను చూడగానే ముందు ఉలిక్కిపడింది. ఆశ్చర్యపడింది. మరుక్షణం ఆమె ముఖం వివర్ణమయింది. "నమస్తే సార్!" అంది.
    సంబోధన మారింది. అప్పట్లో నన్ను ‘అయ్యగారూ!’ అని పిలిచేది. "బాగున్నావా?" అడిగాను నవ్వుతూ. నా చూపంతా బాబుమీదే. ముద్దొస్తున్నాడు. 
    "ఆ ... మీ దయవల్ల!" నేలచూపులు చూస్తూ అంది. పాత జ్ఞాపకాలు ఆమెను బాధపెడుతున్న ఫీలింగ్!
    "నేనంటే కోపంగా ఉంది కదూ?"
    "మీరు పెద్దోళ్ళు సార్! మీమీద మాకు కోపమా?"
    "అప్పుడు జరిగిందానికి నేనెంత బాధ పడుతున్నానో తెలుసా ...?"
    నా మాటలకు అడ్డొస్తూ "ఆ సంగతు లిప్పుడెందుకులెండి. ఎక్కడికి వచ్చారు?" అని అడిగింది.
    "ఆఫీస్ పనిమీద వచ్చాను. ఇటువైపు మా యూనియన్ ప్రెసిడెంట్ మూర్తిగారిల్లు ఉంది. వారిని కలిసి మాట్లాడాలని వెళ్తుంటే నువ్వు కనబడ్డావు... ఈ అబ్బాయి నీ కొడుకా?"
    "ఊఁ ..." అంది. ("మీ రొప్పుకుంటే మీ కొడుకు" అని అంటుందేమో అని చూసాను. అనలేదు).
    "ఏం పేరు?"
    "వివేక్"
    వివేక్ వంకే చూస్తున్నాను. అందంగా ఉన్నాడు. కాని పేదరికం అందాన్ని డామినేట్ చేస్తోంది. వాడి ముఖంలో నా పోలికల్ని వెదుక్కున్నాను. ఆ కళ్ళూ, నుదురూ నావే!
    "ఏం చదువుతున్నావు బాబూ?" వాడి చెక్కిళ్ళను చేతితో తడుతూ అన్నాను. ఆ స్పర్శ నాకు ఆనందాన్ని ఇచ్చింది. ‘పుత్రగాత్ర పరిష్వంగ సుఖం’ ఎలా ఉంటుందో ఊహించుకున్నాను. 
    వివేక్ సిగ్గుతో సమాధానం చెప్పకుండా తల వంచుకున్నాడు. చిన్నప్పుడు నేనూ ఇలాగే సిగ్గుపడ్డానా? ఏమో?
    "అంకుల్ కు చెప్పమ్మా నువ్వే క్లాసో" అంది కొడుకుతో శోభ. నన్ను వాడికి అంకుల్ని చేసింది.
    వాడు తల వంచుకొనే "ఎల్. కె. జి." అన్నాడు.
    "నే నిక్కడే పని చేస్తున్నాను కదా! వీడికి ఫీజు లేదు" అంది శోభ. 
    "మీ ఆయన ఏం చేస్తుంటాడు?"
    "ఆ తాగుబోతు సచ్చినోడు నన్నొదిలేసి సూరత్ కు వెళ్ళిపోయాడు. అక్కడే ఎవతెనో చేసుకున్నాడట!" శోభ గొంతు పూడుకుపోయింది. 
    హమ్మయ్య! లైన క్లియర్ ... మొగుడు లేక, ఆయాగా పనిచేస్తూ కొడుకు నేం చదివిస్తుంది? ఇటునుంచి ఇటే ఏదైనా లాడ్జింగ్ కు తీసుకెళ్ళి పాత అనుభవాలను గుర్తుచేసి వివేక్ విషయం మాట్లాడవచ్చు. లాడ్జింగ్ కు రమ్మంటే వస్తుందా?
    "అబ్బాయికి ఎన్నేళ్ళు?" నా గొంతులో ఎలాంటి ఆసక్తి ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ ప్రశ్నించాను.
    "నాలుగేళ్ళు. సమ్మక్క జాతరకు వెళ్ళివచ్చాక పదిరోజులకు పుట్టాడు"
    నా మస్తిష్కంలోని కంప్యూటర్ చకచకా లెక్కలు వేసింది. వరంగల్ జిల్లాలోని మేడారంలో రెండేళ్ళకోసారి ఫిబ్రవరిలో సమ్మక్క జాతర జరుగుతుంది. నాకు బాగా గుర్తు! శోభ పిన్నివాళ్ళ ఇంట్లో మా వ్యవహారం సాగుతున్న కొత్తలో వాళ్ళు జాతరకు వెళ్ళొచ్చారు. ఆ జాతర తరువాత నాలుగైదు నెలలకే విమల చేసిన గొడవవల్ల శోభ నాకు దూరమయింది. ఆ తర్వాత పద్దెనిమిది పందొమ్మిది నెలల తర్వాత ఆమెకు కొడుకు పుట్టాడు. అంటే ... నాకూ, శోభ కొడుక్కీ ఏ సంబంధమూ లేదన్నమాట! వాడు నా కొడుకయ్యే అవకాశం ఏమాత్రం లేదు. 
    శోభ ఏదో చెప్తోంది, కాని నేను వినిపించుకొనడం లేదు. వాడు నా కొడుకు కాదన్న విషయం నాకెంతో రిలీఫ్ నిచ్చింది. వాడు శోభ భర్తకే పుట్టి ఉంటాడు. కాకుంటే నాలాంటివాడు మరొకడు. నాకు మాత్రం కాదు. 
    "వెళ్ళొస్తాం సార్!" అంటోంది శోభ. 
    నేను వివేక్ ని చూస్తున్నాను. వాడు నా కిప్పుడు గొంగళిపురుగులా కనిపిస్తున్నాడు. జేబులోంచి చేతికి వచ్చిన నోటును బయటికి లాగాను. వంద రూపాయల నోటు! ఇరవై రూపాయల నోటు వస్తుందనుకున్నాను... సరే...
    వివేక్ చేతిలో ఆ వందరూపాయల నోటు పెట్టి "మంచిది. వెళ్ళిరా!" అన్నాను.
    శోభ అభ్యంతరం చెప్పలేదు. "ఇప్పుడే ఊళ్ళో చేస్తున్నారు సార్?" అని అడిగింది. కొంపదీసి అక్కడికి వస్తుందా ఏమిటి? 
    "రాజమండ్రి ..." అబద్ధం చెప్పాను. 
    శోభ ఏదో చెప్పాలని నోరు తెరిచింది. నేను అవకాశం ఇవ్వకుండా "వస్తాను. ఆలస్యమైతే మా ప్రెసిడెంట్ దొరకడు" అని ముందుకు నడిచాను.
    శోభ చూపులు శూలాల్లా నా వీపుకు గుచ్చుకుంటున్న భావన కలిగింది.
    వీధి మలుపు తిరుగుతూ వెనక్కి చూసాను. శోభ ఇంకా అక్కడే నిల్చొని ఉంది....
    వరంగల్ చేరగానే మొట్టమొదట చేయాల్సిన పని ... విమలను వాళ్ళక్కయ్య దగ్గరికి పంపి దత్తత స్వీకారానికి ఏర్పాట్లు చేయించాలి!
Comments