దావాద్రి -మంచికంటి వేంకటేశ్వరరెడ్డి

    
"ఒరేయ్ సుబ్బరాయుడా నువ్వన్నా ఇటురాయ్యా! నన్నీ కుక్కి మంచంలో కూలదోసి పట్టించుకున్న పాపానే పోవడము లేదు" ఇంటి ముందుగా పోతున్న సుబ్బారాయుణ్ణి పిల్చాడు నరసయ్య.     తలవంచుకుని వెళుతున్న సుబ్బారాయుడు నరసయ్య మాటలకు తలెత్తి "ఏందే నన్నేనా!" అన్నాడు.     అవునయ్యా నిన్నే పిలుస్తుంది. అగసాట్ల మారి బతుకై పోయింది. సావన్నా రాలేదయ్యా" ఏడుపులాంటి మాటలతో బాధపడుతూ చెప్పాడు.     "ఏందంటనే ముసిలోడు అఘోరించేదీ?" అంటూ అటువైపుగా వొచ్చాడు సుబ్బారాయుడు.     "ఆ ఏముందీ తిని ఊరక పడుకునే వోడికి పనా పాటా! దారిన పోయేవొళ్ళందరూ వొచ్చి ఆయనకు అలాజన జెప్పాలి" నిలబడే గబగబా అన్నం తింటున్న ఈశ్వరమ్మ కోపంగా చెప్పింది.     "ఆ నాకు పనేం లేదు. యాడేడు పనులన్నీ భుజానేసుకుని చేస్తున్నావుగా నువ్వు. ఇవతల మణిసి చచ్చాడా బతికాడా అని కూడా పట్టిచ్చుకోకుండా నీపాటికి నువ్వు సంపాయిచ్చి లిబ్బి గట్టాలని పరుగులు దీస్తున్నావుగా" ఈశ్వరమ్మ వైపు కోపంగా చూస్తూ అన్నాడు నరసయ్య.     "ఏందే మీ ఇద్దరి గోల" పంచలో అడుగుపెడుతూ ఇద్దర్నీ ఉద్దేశించి అడిగాడు సుబ్బారాయుడు.     "అయ్యయ్య ఇదుగో ఇటొచ్చి కొద్దిగా చెయ్యి ఆసరా పట్టుకోవయ్యా. పడుకోని పడుకోని పక్కలు నెప్పి పుడతన్నయ్యి. వొళ్ళంతా ఒకటే కసిమరిగా ఉంది. ఈ మంచం గూడా చూడవయ్యా ఏంత కుక్కిగా ఉందో! తాళ్ళన్నీ తెగిపోయి కిందకి యాలాడతా ఉండయ్యి చూడయ్యా! ఎవరన్నా పలకరించే దిక్కు ఉంటే గదయ్యా" బాధపడుతూ చెప్పాడు.     "కాస్త ముసలాడి గోడు కూడా పట్టిచ్చుగోగూడదా!" ఈశ్వరమ్మతో అంటూ నరసయ్య వీపుపై చెయ్యివేసి పైకి లేవదీశాడు.     "యాడయ్యా చూస్తానే ఉంటివే. ఇంట్లో పనీ, గొడ్ళ పనీ చూసుకునే తలికే ఈ యాళ అయ్యింది. నాలుగు మెతుకులు తినేదానికి గూడా లేకుండా పరుగులు తీస్తున్నా. ఇట్ట జూసే తలికి పొద్దు బారెడెక్కుతుంది. ఆటోని తెచ్చి బజాట్లో నిలబెడుతున్నాడు.     "నువ్వే జెప్పయ్యా దీనికి ఎందుకింత దావాద్రి. ఎవురికీయ్యా ఇంత ఇదిగా పరుగులు తీస్తా చేసి పెట్టేది. అమ్మ యెనకోళ్ళు అబ్బెనకోళ్ళు ఎవురుండారయ్యా తింటానికి. ఇద్దరి పిల్లలకీ పెళ్ళిళ్ళయి, వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్దోళ్ళు అవుతుండారు.అయినా ఇప్పుడు కూడా రేత్రింబవుళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుంటూనే ఉందయ్యా. ఏం జెప్పాల చెప్పయ్యా. అదేమంటే లేనోళ్ళేనా పనులు చేసుకునేది. ఇంట్లో ఊరుకుండి ఏం జెయ్యాల అంటది గానీ, కాలూ చెయ్యీ పడిపోయినోడిని నేనొకణ్ణి ఉన్నానని తెలుస్తుందా దీనికి. పడుకోని పడుకోని ఉక్కిష్టపు బతుకు అయిపోయిందయ్యా నాది" బాధగా కళ్ళు వొత్తుకున్నాడు.     "ఏం జెయ్యమంటావే నన్ను. అవతల గొడ్లుకి ఎండ పడుతుంది" సుబ్బారాయుడు నర్సయ్య వాగ్దాటికి అడ్డుకట్ట వేస్తూ అడిగాడు.     "అయ్యా కొద్దిగా చెయ్యి ఆసరాగా పట్టుకో అయ్యా, వొళ్ళంతా కసిమిరిగా ఉంది. ఆ తడి గుడ్డతో తుడుచుకుంటాను" అనడంతో సుబ్బారాయుడు నర్సయ్యను ఇంకొంచెం పైకి లేపబోయాడు.     "అయ్యయ్యా వీపు పచ్చి పుండై పోయిందయ్యా చిన్నంగా లేపయ్యా" బాధగా మూలిగాడు.     "పడుకునేవాడు పడుకోక, పనికిపోయే వాళ్ళని కూడా పోనియ్యకుండా పిలుస్తా ఉంటాడు" అంటూ అన్నం తిన్న పళ్ళేన్ని కడగటానికి కుడితి తొట్టి దగ్గరకు పోయింది ఈశ్వరమ్మ.     సుబ్బారాయుడి ఆసరాతో కూర్చున్న నరసయ్య గిన్నెలో ఉన్న గుడ్డతో తడి చేసుకుని పొట్టమీద రుద్దుకోసాగేడు.    "ముసిలోడికి కాస్తె నీళ్ళన్నా పోయగూడదంటే!" ఇంట్లోకి వొస్తున్న ఈశ్వరమ్మ వైపు చూస్తూ అడిగాడు సుబ్బారాయుడు.     "యాడంట నీళ్ళు పొయ్యబోతే అమ్మో అయ్యో అంటూ ఒకటే సోకండాలు పెడుతుంటే. అదీగాక ఈయన్ని లేపాలన్నా కూర్చోబెట్టాలన్నా ఇంకా ఇద్దరు మణుసులు గావాల. ఇయ్యాల ఇళ్ళకాడ ఎవురు ఖాళీగా ఉంటుండారు. ఇంతకు ముందైతే ఊళ్ళో పనులుంటే చేసుకునేవోళ్ళు లేదంటే ఖాళీగా ఉండేవోళ్ళు. ఈ ఆటోలు వొచ్చాకనే ఎంతెంత దూరమో పోయి యాడేడ పనులు చేస్తుంటిరి. ఎవుర్ని పిలిస్తే ఎవురు వొస్తారయ్యా".     "అందరి సంగతెందుకు. నువ్వు ఖాళీగా ఉంటన్నావా! సూడయ్యా ఎక్కడెక్కడిదీ రొళ్ళు కోవాలనే తపనెందుకు దీనికి. ఒక పక్క సడుగు నెప్పి అని కుంటుకుంటూ నడుస్తుందా! అయినా ఒక్క చ్చెణం ఖాళీగా ఉంటుందంటయ్యా. ఇంట్లో పని చేసుకోవాలా! దీనికి తోడు బర్రెలు కూడా ఉండాలి. దాన్లో గూడా ఒక సూడి బర్రె ఉండాల. ఒక పాడి బర్రె ఉండాల. ఒక పడ్డదూడ ఉండాల. ఎవురయ్యా ఈటన్నిటిని సాకి సంతరిచ్చే వోళ్ళు. జంగిలి గొడ్లలో తోలితే గొడ్లు ఇప్పేటప్పుడు కట్టేసేటప్పుడూ దారిని పోయే వాళ్ళందర్నీ కేకలు వేయాల్సి వొస్తంది. రోజూ ఎవురు చేస్తారయ్యా. ఎపుడైనా ఒక రోజైతే సరేగానీ"     "ఎవురో విసుక్కుంటారని వొదిలెయ్యమంటావా! ఎప్పటి నుండో ఇంటి ముంగిట్లో గొడ్లు ఉంటా వస్తుండాయి. ఇయ్యాల లేకపోతే ఇల్లు దిబూసి మనదంటయ్యా" కొబ్బరినూనె సీసా, దువ్వెన తెచ్చుకుని నేలమీద కూర్చుని కొబ్బరి నూనె తలకు రాసుకోసాగింది ఈశ్వరమ్మ.     "ఎప్పటి సంగతో జెబితే ఎట్టయ్యా. చూడు మాకెన్ని గావాల. చిన్న మరచెంబెడు పాలయితే సరిపోతయ్యి గదా! అయినా ఈ బాదరబందీ తప్పక పోతుండే. ఇదొక్కటే అయితే సరేనయ్యా. అవతల ఉండే పొలంలో సుబాబులు ఏసింది గదా! అంతటితో ఊరుకోవచ్చు గదా! ఇంకా కౌలుకు తీసుకోని సెనగ ఏసింది. మొన్నటి వానకి అదీ పోయింది. మళ్ళీ సెడగొట్టి యెయ్యాల అంటది. ఒక మణిసి ఎన్ని పనులు జేసుద్దయ్యా నువ్వన్నా జెప్పు" మొకాన తుడుచు కుంటూ చెప్పాడు.     "ఎన్నా... ఎన్ని పనులైనా చెయ్యాల. పుట్టింది ఎందుకు? బొందిలో పేణం ఉన్నన్నాళ్ళు చేస్తానే ఉండాల గదయ్యా!     "అదేనయ్యా వితండవాదం. ఎందుకు చెయ్యాలని నేనంటాను. తింటానికి తిండి లేకపోతేనా! బేంకీలో డబ్బులు ఒక పక్క మూలుగుతా ఉండయ్యా! వాటిని మళ్ళీ రూపాయికి రూపాయి వొడ్డీల కింద మార్చుకోవాలి. ఏం బతుకయ్యా ఇది. ఇంకా కుర్ర పిల్లనే అనుకుంటుందయ్యా."     "అదిగాదు సుబ్బరాయుడా నలుగురితో పాటు నడవాలా అక్కర్లేదా! అందరూ ముఠాలు ముఠాలుగా జేరి ఎంతెంత సంపాయిచ్చుకుంటున్నారో! వాళ్ళని చూస్తా చూస్తా మనం గమ్మున కూర్చొనేది ఎట్టనో చెప్పు" తల దువ్వుకొని ముడివేసుకుంటూ అడిగింది.     "అయ్యా సుబ్బరాయుడా ఈ గుడ్డ దీసుకోని ఈపున అద్దయ్యా" అంటూ తడిగుడ్డ ఇచ్చాడు.     సుబ్బారాయుడు చెయ్యి మార్చుకొని, రెండో చేత్తో వీపు వెనుక తడి గుడ్డతో నెమ్మదిగా అద్దసాగాడు.     "అయ్యా అయ్యయ్యా చిన్నంగా... ఈపంతా రెడమైపోయిందయ్యా" బాధగా చెప్పాడు.     "ముసిలోడు ఇట్ట ఉంటే, ఈయన్ని చూసుకోకుండా అందరితోటీ పోటీ బెట్టుకుంటే ఎట్ట. ఇంటి పట్టున ఉండి ముసిలోణ్ణి చూసుకోకపోతే ఎట్టా!" ఇంట్లోకి పోతున్న ఈశ్వరమ్మను చూస్తూ చెప్పాడు సుబ్బారాయుడు.     "ఏముందిలేయ్యా చూసుకోవడానికి. ఈయన కోసం ఇంటి పట్టున కూర్చుంటే రేపు మన చేలోకి పనికి రమ్మంటే ఎవురు వస్తారయ్యా. అంతా ముఠాలు గడితిరే. మనం గూడా వాళ్ళతో చచ్చినట్టు చేరాల్సిందే! అద్దమూ దువ్వెనా ఇంట్లో పెట్టి, బయటకు వొచ్చి, ఎండలో ఉన్న దూడని కట్టేస్తూ చెప్పింది ఈశ్వరమ్మ.     "ఇంక చాల్లేయ్యా చాల్లే" అనడంతో సుబ్బారాయుడు వీపు తుడవడం ఆపి తడిగుడ్డని నీళ్ళ గిన్నెలో వేసేడు.     "మూడు రోజుల్నుంచీ వొళ్ళు తుడవ మంటే ఇదుగో ఇయ్యల్టికి కూడా తీరలా దానికి. ఇదిగో నీళ్ళు వేడిజేసి నా మొఖాన యేసింది. ఇదయ్యా యెదవ ఉక్కిష్టం బతుకు. తొందరగా పోనన్నా పోతే బాగుండంటే ఆ పిలుపు రాకపోతుండే."     "సర్లేగానీ పడుకుంటావా! కూర్చుంటావా!"     "కొద్దిగా ఆగయ్యా ఆగు. వోళ్ళు ఆరనియ్యయయ్యా" అనడంతో ముసలివాడిని పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకుంటున్న ఈశ్వరమ్మను చూస్తూ అలాగే పట్టుకుని నిల్చున్నాడు సుబ్బారాయుడు.     బజార్లో ఆటో బుర్రుమంటూ దుమ్ము లేపుకుంటూ వొచ్చి ఇంటిముందు ఆగింది.     ఆ శబ్దం వినడంతో హడావిడిగా కట్టుమట్టు చిమ్ముతున్న ఈశ్వరమ్మ పరుగులాంటి నడకతో ఇంట్లోకి పరుగెత్తింది.     "చూడయ్యా ఈ వొయిసులో ఇంతలావున పరుగు అవుసరమయ్యా దానికి. జారిపడితే కాలో చెయ్యో ఇరిగితే ఎవుడయ్యా దీనికి దిక్కు. పిల్లలు ఊళ్ళో ఉండారని అనుకోవడానికైనా వాళ్ళ బాదరబందీలు వాళ్ళికి ఉండయ్యిగా. ఇయ్యాల్టప్పుడు ఒకరికి వొకరు చేసేటట్టు ఉందంటయ్యా. తల్లులెవరో బిడ్డలెవురో! ఎవరికి వారే యమునా తీరే గదా!" ఆయన బాధ తారాస్థాయికి చేరింది.        "ఇంక ఆరిపోయిందిలే పడుకోవే" అంటూ నెమ్మదిగా మంచమ్మీద పడుకోబెట్టాడు నర్సయ్యని.     "ఇయ్యాల్టికి సాలయ్యా. వొంటికి హాయిగా ఉందయ్యా. నీ మేలు ఈ జెన్మలో మర్సిపోనయ్యా".     ఇంటిలోనుండి అన్నం గిన్నె తెచ్చి నర్సయ్య మంచం దగ్గర పెట్టి, గంప బోర్లించి, తలుపుకు తాళం వేస్తూ "జాగర్త కుక్కలు తినిపోతయ్యి" అంటూ తలుపుకు తాళం బెట్టి కేరేజీ తీసుకుంది పోవటానికి.     "ఇదుగో ఈశ్వరమ్మా ఇంత సంపాయిస్తున్నావు గానీ, ఏ పూటన్నా కాస్తె స్థిమితంగా కూర్చొని నాలుగు మెతుకులు తిన్నావంటే" సుబ్బారాయుడు ప్రశ్న ములుకుల్లా గుండెల్లో గుచ్చుకుంది.     పరిగెత్త బోయిందల్లా ఒక్క క్షణం ఆగిపోయింది. సుబ్బారాయుడి మొఖం వంక పేలవంగా చూసింది.          "ఏందన్నా నువ్వు అనేది?" అయోమయంగా అతని వంక చూసింది.     "ఎంత ఉండి లాభమేముంది! తాను ప్రాప్తంగా, ఇంత తిని, పక్కనోడికి అంత పెడితేనే కదా మనిషి జన్మకి సార్థకత ఉండేది. సంపాయిస్తావు సంపాయిస్తావు సచ్చేదాక సంపాయిస్తావు. ఏం జేయనూ! ఎవురికోసరం. పోయేటప్పుడు నువ్వేమన్నా మూట కట్టుకోని యెత్తుకోని పోతావా!"     "ఏమోనన్నా నేను గూడా ఎప్పుడూ ఆలోసించలేదూ!" గల గలమంటూ గోలగోలగా అరుస్తూ ఆటోను కమ్ముకుంటున్న వాళ్ళనూ, సుబ్బారాయుడినీ మార్చి మార్చి చూడసాగింది.     "సూడు ఆ ముసిలోడు పడే పాటు జూడు. తోటి మణుసుల్ని గూడా సూడకుండా చేస్తందే ఈ డబ్బు.దీన్ని ఎవుడు కనిపెట్టేడో కానీ అబ్బో అబ్బో ఈ మణుసుల్ని ఎవుడికీ ఎవుణ్ణీ కాకుండా జేస్తందే."     "అట్టా పెట్టయ్యా దానికి గడ్డి" ఈగల్ని తోలుకుంటూ అక్కసుగా అన్నాడు నరసయ్య.     "నీకింత ఉండీ పదిమైళ్ళు పదిహేను మైళ్ళు ఆ ఆటోలో ఊగులాడతా బోయి పనులు చెయ్యాల్సిన గాశారం ఏమొచ్చింది? ఆ యెదవ డబ్బేగా ఇంత జేస్తంది."     బజార్లో ఆటోవాడు రయ్యిరయ్యిమని ఇంజన్ రైజ్ చేస్తూ హారన్ కొడుతున్నాడు.     "ఏం జేస్తామయ్యా లోకంతో పాటే నడవాల. అందరూ అంత లావున ఆరాటపడతండారు. నలుగుర్లో బతికే వాళ్ళం గదా! వాళ్ళతో పాటే మనం గూడానూ..."     "ఎందుకీ ఆరాటం? బొందిలో ప్రాణం ఉన్నంత కాలమే గదా కొట్టకలాడేది. ఆ తరవాత...!!"     "అంతేనయ్యా... అంతే! ఖర్మా గాశారం ఎట్ట ఉంటే అట్ట జరగాల్సిందే! కళ్ళల్లో తిరిగిన నీళ్ళను తుడుచుకుంటూ వొస్తానయ్యా వొస్తా     అంటూ పరుగులాంటి నడకతో పోయి ఆటో ఎక్కి నిలబడింది.     "చూడయ్యా దాని పాటు జూడు. అది ఆ ఆటో ఎనక నిలబడి యెంతెంత దూరం పోవాలయ్యా. మంచికేనా ఇది" మనసులో బాధ గొంతులోకి వొచ్చింది.     "హూ... ఎంత మంది ఆటో పట్టుకుని యాలడతుండారో! అన్ని రోజులూ ఒకలాగ ఉంటయ్యా. ఇయ్యాల సగానికి సగం మంది ఆటోల్తోనే చస్తండారు. ఏం జేస్తావు డబ్బు మణిసిని కుక్కని జేస్తుంది. నేను వొస్తానే గొడ్లకి ఎండ బడింది" అంటూ సుబ్బారాయుడు అక్కణ్ణుండి కదిలాడు.          "మణిసికే ఇలువ లేకుండా పోతందిలే! నువ్వు పదయ్యా పదా పాపం చాలాసేపు నిలబడే ఉండావు. కేక వెయ్యంగానే పలుకుతావయ్యా దర్మాత్ముడివి... ప్చ్...ఎవురికి ఎవురో...! బోసినోరు ఆడిస్తూ గొణుక్కుంటూ తల కింద చెయ్యి పెట్టుకుని పడుకున్నాడు నరసయ్య.

[సాహిత్య ప్రస్థానం మాస పత్రిక జూన్ 2009లో ప్రచురితం]
Comments