దేవత - కత్తి మహేష్ కుమార్

 
   
బలమైన వ్యక్తిత్వంగల ఆడది మగాడ్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. మగ అహం, మగాలోచన, మగాహంకారం, మగభావాలు ప్రశ్నింపబడ్డాక మగటిమి ప్రశ్నార్థకమౌతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా మగాడి నరనరాల్లో నిక్షిప్తమైన మగసంస్కృతి పతనమౌతుంది. సుప్రియ అలాంటి ఆడది. పరిచయమయినప్పటి నుంచీ అంతే. నేను మగాడినన్న స్పృహేనాకు కలిగించలేదు. మగాడన్న స్పృహే తడబడ్డాక ఆడామగా మధ్య ఉన్న బంధం నిలుస్తుందా? ఆ విషయం ఇప్పుడైనా అర్థం చేసుకుంటుందనుకున్నాను. ఎంతైనా, ‘తను ఆధారపడటం నేర్చుకునే సమయం వచ్చిందికదా!’


* * *

    జీన్సు వేసుకునే మ్మాయిల ప్రోచబిలిటీ గురించి నేను చేసే ప్రతిపాదనల్ని క్లాస్ రూంలో ఒకమూల సైలెంటుగా కూర్చుని వింటుండగా మొదటిసారి చూశాను. అప్పుడే సుప్రియ నన్ను చూసి కళ్ళతోనే ఫక్కున వెక్కిరించినట్టనిపించింది. ఆ తరువాత నెలపాటూ, మా పరిచయం మొదలయ్యేవరకూ ఆ వెక్కిరింపే నన్ను వెంటాడింది. బెంగుళూర్ అమ్మాయిలంటే నాక్కొంచెం చులక భావం. ముఖ్యంగా అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలంటే మరీను. మేకప్పు, మార్కుల మీదున్న శ్రద్ధ వీరికి మనుషుల మీదుండదు. తమ వీకెండ్ ప్లాన్స్ మీదున్న ఆసక్తి వర్ల్డ్ దిస్ వీక్  మీదుండదు. హాలీవుడ్ సెలబ్రిటీలు ఫింగర్ టిప్స్ మీదుంటారుగానీ, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సినిమాల గురించి తెలీదు. ప్రపంచమంతా బెంగుళూరు చుట్టే తిరుగుతుందనే బలమైన నమ్మకం వీళ్ళకి. అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీషు మాట్లాడే అబ్బాయిలతో తప్ప బట్లరింగ్లీషుగాళ్ళు వీళ్ళలెక్కలో అసలు మగాళ్ళేకాదు.

    సుప్రియది బెంగుళూరు.కానీ తెలుగమ్మాయి అని తరువాత తెలిసింది. అప్పటికీ "మా అమ్మానాన్నా తెలుగు. నేను బెంగుళూరమ్మాయిని" అనే చెప్పింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ ని అని చెప్పినంత హుందాగా. అదేమిటోగానీ, నేను ‘హైద్రాబాదీని’ అని చెప్పుకుందామనుకున్నా దాంట్లోంచీ కూడా ఏదో ముతకవాసనే వస్తుంది. ఆ గుర్తింపులోంచీ మధ్యతరగతి అస్తిత్వపు అరుపు వినిపిస్తుందేతప్ప అర్బన్ పోష్ నెస్ అస్సలు కనిపించదు.

    మా పరిచయంకూడా చాలా విచిత్రంగానే జరిగింది. యూనివర్సిటీలో చేరిన నెలకు మా సీనియర్లు ఫ్రెషర్స్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో జూనియర్స్ కూడా ఏదో ఒకటి చెయ్యాలి. పాటలు పాడాలి కొన్ని గేమ్స్ డిజైన్ చెయ్యాలి అని ప్రతిపాదించారు. గ్రూప్ గేమ్స్ డిజైన్ చెయ్యడానికి కొందరు వాలంటీర్ చేసేస్తే, ఇక పాటలుపాడేవాళ్ళెవరనే దగ్గరకొచ్చి చర్చ ఆగింది. ఇబ్బందిగానే నేను పాడగలను అని చెప్పేసాను. సుప్రియకూడా పాడుతుందట. ఇద్దరూ ఒకొక సోలో సాంగ్ ఆ తరువాత కలిపి ఒక డ్యూయెట్ పాడాలని క్లాస్ వాళ్ళు నిర్ణయించేశారు. "హలో హేమంత్. యు సింగ్ టూ?" అంటూ దగ్గరకొచ్చింది. అప్పటివరకూ సుప్రియకు నా పేరు తెలుసనికూడా నాకెప్పుడూ అనిపించలేదు.

    మా క్లాస్ లోని ఐదుమంది బెంగుళూర్ అమ్మాయిలదీ ఒక జట్టు. ఎవరితోనూ కలిసేవాళ్ళు కాదు. వాళ్ళ జోకులూ, మాటలూ,నవ్వులూ మనలోకానికి సంబంధించినవిగా అనిపించేవికావు. వేరే అమ్మాయిలతో సంబంధం లేనట్లు ప్రవర్తించేవాళ్ళు. అబ్బాయిల్నైతే అసలు గుర్తించేవాళ్ళే కాదు. వాళ్ళుతప్ప మిగతావాళ్ళెవరూ మనుషులు కారన్నట్లుగా ఉండేది ప్రవర్తన. అందుకే సుప్రియకు నాపేరు తెలుసంటే ఆశ్చర్యం.

    "యెస్" అని ముక్తసరిగా సమాధానం చెప్పాను.

    "వాటార్యూ ప్లానింగ్ టు సింగ్? ఎనీ తెలుగు సాంగ్!" అంది.

    చులకన చేస్తోందేమో అనిపించింది.

    "లేదు. నో. అయాం సింగింగ్ ఎ హిందీ సాంగ్" అన్నాను.

    "హిందీ ఎందుకు? తెలుగులో చాలా మంచి పాటలున్నాయిగా!"

    అప్పుడే సుప్రియ నోటివెంట తెలుగు మాటలు వినడం. "నువ్వు తెలుగా" అన్నాను ఆశ్చర్యంగా.

    "కాదు. మా అమ్మానాన్నా తెలుగు. నేను బెంగుళూరమ్మాయిని" అంది. ఆ గొంతులో ఏదో ఆలోచన. తన గుర్తింపుని తనే నిర్దేశించుకునే తపన.

    ఒక్క క్షణం ఆలోచించి "తెలుగులో ఏం మంచిపాటలున్నాయ్!" అనగలిగాను.

    "కొత్తవి కాదు. పాత పాటలు. ముఖ్యంగా బాలసుబ్రమణ్యం లేతగొంతుతోపాడిన పాటలు ఎన్ని లేవు" అంది.

    తరువాత సుప్రియ కొనసాగింపుగా "రాజన్ -నాగేంద్ర సంగీతంలో కన్నడ తెలుగు భాషల్లో వచ్చిన బోలెడన్నిపాటలున్నాయి. అన్నీ నాకిష్టమైన పాటలే" అంటూ నా సమాధానం కోసం ఎదురుచూసింది.

    ఒక్కసారిగా షాక్ మీద షాక్. నాలోని తన ఊహాచిత్రం ఛిద్రమైన క్షణం. నా అభిప్రాయాల గోడ నామీదే కూలి నన్ను భూస్థాపితం చేసిన క్షణం. ఐ జస్ట్ హేటెడ్ హర్. నన్ను నా బలహీనతల సాక్షిగా కుదింపజేసిన సుప్రియని జీవితంలో క్షమించలేననుకున్నాను.

    "మరి నువ్వుకూడా తెలుగు పాట పాడుతావా?"

    "లేదులేదు. తెలుగు మాట్లాడటం వరకే. పాడటం నాకు రాదు. కాబట్టి హిందీ పాడతాను."

    "మరి డ్యూయెట్ ఎలా? హిందీ పాడదామా!" అని అడిగాను. వెంఠనే "సరే" అంది.

    క్లాసులైపోయిన తరువాత కలిసేవాళ్ళం.రెండ్రోజులు డ్యూయెట్ ప్రాక్టిస్ చేశాం. చష్మెబద్దూర్ అనే హిందీ సినిమాలోంచీ ‘కహాసే ఆయే బదరా...ఖిల్తా జాయే కజరా..’ అనే సెమీ క్లాసికల్ గీతం. నిజానికి ఏ కాంపిటీషన్లో పాడాల్సిన పాట. సుప్రియ "చాలా మంచిపాట కదా పాడుదాం" అంటే, ఫ్రెషర్స్ పార్టీ కోసం పాడటానికి ఒప్పుకున్నాను. ఎక్కడో ఒక మూల ఈ పాట విని నీరసంగా ఉందని సీనియర్లు వెక్కిరిస్తారని ఒక కోరిక. నేను పొందే అవమానంకన్నా, సుప్రియ ఆ అవమానంలో భాగవుతుందన్న ఆశ గొప్ప స్వాంతన కలిగించింది. దీక్షగా పాట ప్రాక్టిస్ చేశాను.

    ఆరోజు సాయంత్రం. సుప్రియ ఉమ్రావ్ జాన్ సినిమాలోంచీ ‘దిల్ చీజ్ క్యాహై ఆప్ మెరే జాన్ లీజియే’ అనే ఘజల్ పాడింది. ఆ తరువాత కాస్సేపటికి ఇద్దరి డ్యూయెట్. చాలా కష్టమైన పాట పాడామని అందరూ అభినందించారు.చివరిగా నా వంతు.

    నేను ‘పూజ’ సినిమా నుంచీ రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ’ అనే బాలసుబ్రమణ్యం పాట పాడాను. సుప్రియ కళ్ళలో మెరుపు. ఆ పాటపాడాలని నేనెందుకు నిర్ణయించుకున్నానో నాకు ఖచ్చితంగా తెలీదు. అంతగా ద్వేషించే సుప్రియని ఆకర్షించాలని నాలో అంతర్లీనంగా కోరికుందేమో. బహశా తనపై నా ఆధిపత్యాన్ని తనకిష్టమొచ్చింది చేసి సంపాదించుకోవావన్న కోరికనాలో కలిగిందేమో. ఇద్దరిమధ్యా పరిచయం పెరగడానికి ఆ పాట తోడ్పడింది. మరికొన్ని సాయంత్రాలు మామధ్య రాజన్-నాగేంద్ర రాజ్యమేలారు. బాలసుబ్రమణ్యం గాత్రం నా గొంతులోంచీ వినిపించేది. నా పాట మరుపుకు సుప్రియ కళ్ళలోని మెరుపు ఆరాధన అనిపించిన గర్వక్షణాల్ని, నా పాటకు బదులుగా తను పాడేపాటతో తునాతుకలు చేసేది. ఇక్కడా బదులు తీర్చుకునేది. నేనేదో "ఇచ్చానన్న" సంతృప్తినికూడా కలిగనిచ్చేది కాదు.

    సినిమాలలో,షికార్లలో, హోటళ్ళలో తనవంతు ఖర్చు తాను క్రమం తప్పకుండా ఇచ్చేది. ఒకవేళ నేను కావాలని మర్చిపోయినా గుర్తుచేసి మరీ అప్పు తీర్చేది. ప్రేమించే మగాడిగా, సాధికారంగా సుప్రియ కోసం నేను చేయాలనుకున్న ఏ పనులూ తను చెయ్యనిచ్చేది కాదు. "కలిసి తిరుగుతున్నాం. కాబట్టి, కలసి చేసే ఖర్చు పంచుకుని చెయ్యాలి" అని నా విలువని శంకిస్తూ మాట్లాడేది.తనని "ఆదుకునే" అధికారం నాకు ఏమాత్రం లేదని ఎప్పుడూ గుర్తుచేసేది. నా చెయ్యి తన శరీరాన్ని తాకినపుడు సహజమైన సిగ్గుతో కుంచించికుపోకుండా, దయతో ప్రేమతో కోరికతో సహకరించేది. అనుభవాన్ని అధికారంతో పంచుకునేది. "ఇలాకాదు ఇలా" అని మార్గనిర్దేశన చేసి నన్నొక వస్తువులాగా, కీ ఇస్తే ఆడే బొమ్మలాగా వాడుకునేది. ఎన్ని అవమానాలు. ఎన్ని ఆక్షేపణలు. ఇలా నా అహాన్నీ,వ్యక్తిత్వాన్ని ఫణంగాపెట్టి సుప్రియ వ్యక్తిత్వాన్ని భరించాల్సి వచ్చేది.


    ఏదోఒక స్థాయలో మనల్నిమనం మోసం చేసుకుంటేగానీ జీవితంలో ప్రేమించలేమేమో. "ఐ లైక్ యువర్ సింప్లిసిటీ అండ్ డౌన్ టూ ఎర్చ్ నేచర్" అని సుప్రియ అన్నప్పుడల్లా, నిజంగా నేనూ తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానేమో అనే అపోహ కలగేది. సుప్రియ నన్నంతగా అభిమానించడానికి నాలోని గుణాల్ని ఎంచిచూపించేదేకానీ తనకున్న కారణాలు చెప్పేది కాదు.సాధికారంగా జీవితాన్ని పంచుకునేదేగానీ, ఆధారపడుతూ నా ప్రాముఖ్యతను పెంచేది కాదు. నన్ను తన జీవితంలో ఒక ముఖ్యమైనవాడిగా చేస్తూ నన్నొక బానిసని చేసింది. తన జీవితంలో నన్నొక సమానమైన భాగం చేసి నా అహాన్ని కాలరాసింది.

    ఇలా ఒక సంవత్సరం నన్ను నేను చంపుకుంటూ తన నిర్వచనాల్లో ఒంపుకుంటూ గడిచింది. వేసవి శెలవులకి సుప్రియ వారం రోజుల ముందే బయల్దేరింది. సుప్రియ వెళ్ళిన మరుసటి రోజు ఒక దారుణమైన వార్త తెలిసింది. సుప్రియ వెళ్ళే బస్సుకి కర్నూలు -అనంతపూర్ల మధ్యన యాక్సిడెంట్ అయ్యింది. విండో సీట్లోకూర్చున్న సుప్రియ కుడిచెయ్యి మోచేతివరకూ తెగిపోయింది. ఆపరేషన్ కోసం బెంగుళూరు చేరేసరికీ తెగిన చెయ్యిని ఐస్ బాక్సులో పెట్టి జాగ్రత చెయ్యకపోవడంతో సర్జరీ చేసి అతికించేందుకు వీలులేకుండా పోయింది. నా గుండె ఆగినంత పనయ్యింది. హుటాహుటిన బెంగుళూరు బయల్దేరాను.ఈ క్షణం లో నా స్నేహితురాలిపై సానుభూతి తప్ప వేరే ఏ భావమూ కలగలేదు. ఐతే ఒక పక్కన ఆమెని నేను నిజం గా ప్రేమిస్తున్నానేమో.


    ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు. హఠాత్తుగా అనిపించింది ‘ఇప్పుడు తను ఆధారపడటం నేర్చుకునే సమయం వచ్చిందికదా!’ అని. నావ్యక్తిత్వాన్ని తిరిగి దక్కించుకునే అవకాశం నాకు దక్కుతుందేమో. నా మగతనాన్ని తిరిగి సంపాదించుకునే ఛాన్స్ దొరుకుతుందేమో. గర్వంగా తనని ఈ కష్టం నుంచీ ఆదుకునే అదను లభిస్తుందేమో. ఎక్కడో ఆశ. మై పాస్ట్ గ్లోరీ విల్ రెటర్న్.

    బాధలో,ఆలోచనల్లో,ఆశల్లో తేలుతూ హాస్పిటల్ చేరాను. సుప్రియ రూము బయటే తన తల్లిదండ్రుల్ని డాక్టర్ తో మాట్లాడుతుండగా కలిశాను. డాక్టర్ అంటున్నాడు "వాటే బ్రేవ్ గర్ల్ షి ఈజ్. స్పృహలోకొచ్చిన మరుక్షణమే, తన పరిస్థితి తెలిసి ఏడ్చి బాధపడకుండా, పక్కనే ఉన్న పెన్నూ, డైరీ తీసుకుని నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరేమిటి అని తెలుసుకుని ఏడమచేత్తో రాయడం మొదలెట్టింది. యు షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హర్".

    ఆమె పట్ల నాకేదైనా సాఫ్ట్ కార్నర్ /ప్రేమ అనే భావన ఉంటే ఆ క్షణమే పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.తన కష్టాలకీ, నా కష్టాలకీ తనే నా గుండె పై వాలి "హేమూ, నువ్వు లేకపోతే నేనేమైపోయే దాన్ని" అని భరింపరాని కృతజ్నత తో నా పురుషత్వాన్ని కన్నీటితో ముంచేసే స్త్రీత్వం లేని సుప్రియ ని ఏ మగవాడైనా ఎలా ప్రేమించగలడో నాకర్ధం కాలేదు.

    వెనక్కొచ్చేశాను. సుప్రియని కనీసం కలవకుండా వెనక్కొచ్చేశాను. సుప్రియ తల్లిదండ్రులు ఆగమని చెబుతున్నా వినకుండా వెనక్కొచ్చేశాను. సుప్రియను ఎప్పుడు కలుస్తానో, అసలు కలుస్తానో లేదో తెలీదు. కానీ ఒక లేఖ మాత్రం రాశాను. ఎప్పుడో ఒకప్పుడు తనకు ఇవ్వడానికి.

    "సుప్రియా, నువ్వు దేవతవి. నువ్వు గొప్పదానివని నేను నిన్ను ‘దేవత’ అని పిలవటం లేదు. నువ్వు నాకూ, ఈ ప్రపంచానికీ పనికిరానిదానివి కాబట్టి దేవతగా భావిస్తున్నాను. పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన మనుషులు మసలే సమానత్వమనే ఒక ఊహాలోకపు జీవివి నువ్వు. అందుకే నీకు ఈ లోకంలో అందరు మనుషుల్లా బ్రతికే హక్కులేదు. నీ ఉనికిని, వ్యక్తిత్వాన్నీ నేనూ,ఈ ప్రపంచం భరించలేము. అందుకే నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను."
ఇట్లు
హేమంత్ 
Comments