దేవుడు ఎక్కడ ఉన్నాడు? - వాయుగుండ్ల శశికళ

    ఒకటే ఆటోల శబ్దం... విసుగ్గా నిద్ర పోలేక బయటకు వచ్చి చూసింది విద్య. మధ్యాహ్నం నిద్ర బాగా అలవాటు. ఉండి ఉండి ఒక్కో ఆటో 'జుయ్య్ 'అని వెళుతున్నాయి నిండుగా జనాలు బస్తాలో మిర్చి కుక్కినట్లు. ఎక్కడికీ వీళ్ళందరూ? చిన్న కుతూహలం తనలో.

    చుట్టూ చూసింది. దూరంగా ఎక్కడో ఊరు. తమ బడ్జెట్ కి ఇంతకంటే మంచి స్థలం రాలేదు. ఏదో ఒకటి సొంత ఇల్లు. చుట్టూ అక్కడొకటి ఇక్కడొకటి ఇళ్ళు.
పక్కనే చిన్న హరిజన కాలనీ. మనుషులు కనిపిస్తూనే ఉంటారు కాని. ఇలాగా ఆటోలు రావడం ఎప్పుడూ లేదు. అవసరం అయి ఆటో మాట్లాడుకున్నా అరవై రూపాయలు అడుగుతాడు. అలాంటిది ఇన్ని ఆటోలు పక్కన మలుపులోకి తిరిగి ఎక్కడకు వెళుతున్నాయి.

    దారిలో పొలాలే ఉండేది. ఒక ఎనిమిది కిలోమీటర్లు వెళితే కాని ఇంకో పల్లె రాదు.అ యినా ఆ పల్లెకు వెళ్ళే జనాలు ఇంత మంది ఉండరు. కుతూహలంగా చూస్తూ ఉన్న విద్యకు దూరంగా కనిపించింది నాగమ్మ.

    వేప చెట్టు కింద నుండి ఇంటి వైపు వస్తూ కనిపించింది . 

    నాగమ్మ ఇరవై ఐదేళ్ళు ఉండొచ్చు. అలాగ కనిపించదు.  మనిషి నల్లగా ఉన్నా కళ గా ఉంటుంది. మంచి పొడుగు. పెద్ద కళ్ళు అమాయకంగా చూస్తూ....  మంచి చీర కట్టి జడ వేసి పూలు పెట్టిందంటే చూపు తిప్పుకోలేము. పెళ్లి చేసుకుందామని వచ్చిన వాళ్ళు ఎందరో. అయినా పెళ్లి చేసుకోలేదు. పెద్ద కారణం లేదు. 

    ఎప్పుడూ దేవుడు, దేవత అంటూ ఆ వేప చెట్టు  కింద ఉండే రాళ్ళను పూజ చేస్తూ, దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. దాని పిచ్చి ఎవరికీ అడ్డం లేదు కాబట్టి ఎవరు ఏమి అనరు. ఎప్పుడైనా దీపాలు వెలిగించను నూనె లేక పొతే ఎవరినో ఒకరిని అడిగి తీసుకుంటుంది. ఎవరైనా పిలిచి ఏమైనా తినడానికి పెడితే తింటుంది.

    పెద్దగా మాట్లాడదు. కొంచెం దాని వంట్లో దేవుడు ఉండాడేమో అనే అనుమానంతో కాని లేకుంటే ఏదో రకంగా ఎవరో ఒకరు సొంతం చేసుకొని ఉందురు. 

    ''నాగమ్మా ఇలారావే'' పిలిచింది విద్య.

    ''ఏమిటే ఈ హడావడి?"అడిగింది.

    ''అమ్మా దేవత అమ్మా దేవత నాగ దేవత వెలిసింది అదిగో ఆ పక్క తుప్పల్లో'' ఆనందంగా మెరుస్తున్న కళ్ళతో చెప్పింది.

    ''నీ మొహం నాగదేవత వెలియడం ఏమిటి సరిగ్గా చెప్పు'' విసుగ్గా అడిగింది.

    "అవునమ్మా అదిగో ఆ నల్లోడు చెప్పాడు." దూరంగా చూసింది.

    అక్కడ చెట్టు కింద నిలబడి నల్లోడు ఇటే చూస్తున్నాడు. వాడి పేరు ఏమిటో. అందరు పిలిచేది కర్రోడనే. నల్లగా పొడుగ్గా ఉంటాడు . ఎప్పుడు పని చేస్తాడో తెలీదు. కాని ఎప్పుడూ నాగమ్మదగ్గరే తిరుగుతూ ఉంటాడు. వాడి కళ్ళలో నాగమ్మ మీద వల్లమాలిన ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. దానిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. 

    వాడికేమో నాగమ్మ పిచ్చి . దానికేమో దేవుడు పిచ్చి . ఈ పిచ్చి కుదిరి పెళ్లి అయ్యేదేప్పుడూ అని అందరు నవ్వుకుంటూ ఉంటారు . 

    ''ఏమి చెప్పాడు?''

    ''అదిగో రెండు కిలోమీటర్లు పోయినాక రోడ్ పక్కన కలేచెట్లు తుప్పల మీద పడుకొని ఉందంట మూడుమూరల నాగదేవత. తెల్లగా మెరిసిపోతూ ఉందంట. మూడు సిరసులంట. నిన్నటి నుండి కదలకుండా అక్కడే ఉందంట.అందరు అక్కడికే వెళుతున్నారు. మనుషులు తాకినా ఏమి అనడం లేదంట. నేను కూడా వాడితో అక్కడికే పోతున్నాను. మీరు కూడా రండమ్మ చూద్దురు'' అనింది.

    ''నువ్వు పోవే ఇవన్నీమూఢనమ్మకాలు నేను రాను'' విసుగ్గా అని లోపలి వెళుతూ... వెనక్కి తిరిగి చూసాను.

    ''పెళ్లి ఎప్పుడు చేసుకుంటావే ?''సందర్భం కాక పోయినా ఆ రోజు అడగాలని అనిపించింది. అడక్కపోతే ఇక అడగలేనేమో!

    ''లేదమ్మా. నాకు దేవుడు కనిపించాల. ఇదిగో వీడే నీకోసం పుట్టినోడు అని చూపించాల. అప్పటి దాకా చేసుకోను''

    ''నీ మొహం దేవుడు ఎక్కడున్నాడు ?నీకు కనపడేదానికి? నా మాటిని కర్రోడ్ని చేసుకోవే. లోకంకోసం అయినా భర్త ఉండాలి''  మాట చెవిలో కూడా వేసుకోకుండా అప్పటికే కర్రోడితో  కలిసి నాగమ్మ మలుపుతిరుగుతూ కనిపించింది.  

    మబ్బు చాటు చంద్రుడిలాగా మొహం సాయంత్రపు వెలుగులో మసగ్గా కనిపించింది. ఎందుకో ఒక ఊహ మెరిసి ఉలిక్కిపడింది విద్య.
దేవుడా కొంపతీసి ఇది దాని చివరి చూపు కాదు కదా!
                                     
* * *
    
    సాయంత్రం ఆఫీస్ నుండి తొందరగా వచ్చిన శ్రీవారిని చూసి లేచి వెళ్లి నీళ్ళుఇచ్చింది.

    ''ఏమబ్బా దొరగారు ఈ రోజు తొందరగా వచ్చేసారు''

    ముచ్చటగా భార్య చేతిని నిమురుతూ గ్లాస్ తీసుకొని నవ్వాడు.

    ''రోజు ఈ సమయానికే వచ్చేది. కాకుంటే ఆటోలు దొరక్క బస్ లో వేలాడి  వచ్చేసరికి ఆ టైం అవుతుంది''.

    పెళ్లి అయి ఐదేళ్ళు అయినా పిల్లలు లేక పోయేసరికి ఇంకా కొత్తదంపతులుగానే ఉంటారు.

    ''ఏదో నాగ దేవత పుణ్యమా అని ఇన్ని ఆటోలు ఈ రోజు తొందరగా వచ్చేసాను''ఆకాశం వైపు చూసి దణ్ణం పెట్టుకున్నాడు.

    ''చాల్లెండి మీ పిచ్చి''కసిరింది.

    ''వాళ్ళు సరే చదువుకోలేదు. మీకేమి అయింది? నాగుపాము ఏమిటి? దేవత ఏమిటి?''

    ''ఏమో విద్య ఏది నిజమో ఎవరికి తెలుసు ప్రస్తుతానికి ఆటోలు దొరుకుతున్నాయి. అంటే నాదేవేరిని  సేవించుకొనే సమయం ఎక్కువగా వచ్చినట్లే. నాకు మాత్రం దేవతే'' చిలిపిగా చూస్తూ అన్నాడు.

    ''చాల్లెండి''అని చేయి విడిపించుకొని లోపలి వెళుతూ ఉంటే ఊహలో నాగమ్మ మళ్ళా తటాలున మెరిసింది. ఔను అది తిరిగి వచ్చి విశేషాలు చెప్పలేదే.

    బయట ఇంకా ఆటో శబ్దాలు సాయంత్రం ఆరు దాక హారన్ లు మోగుతూనే ఉన్నాయి. చీకటి చేతులు చాచి అడ్డం పడిన తరువాత రోడ్ పాపం చెవులు తెరిచి నిద్రపోయింది 

    ''రేపు ఎవరినైనా అడగాలి నాగమ్మ గురించి... అయినా నా పిచ్చి గాని అదేమైనా చిన్న పిల్లనా?'' అనుకుంటూ నిద్రపోయింది.

* * *

    ఉదయం నుండి చూస్తూ ఉంది నాగమ్మ కోసం.

    ఇది ఏమైనట్లు? మళ్ళీ ఎందుకో తెలీదు. అదే అనుమానం, అసలు బ్రతికి ఉందా? తన అనుమానానికి తననే తిట్టుకుంది . 

    మళ్ళా ఆటోలు సందు లేకుండా సందు మలుపు తిరిగి వెళుతూనే ఉన్నాయి.

    ఏమిటో ఈ జనాల పిచ్చి! నవ్వుకుంది విద్య .

    దూరంగా కనిపించింది లక్ష్మి. అప్పుడప్పుడు నాగమ్మ తో పాటు వస్తూ ఉంటుంది.

    ''లక్ష్మి'' పిలిచింది... గొంతులో రవంత కంగారు.

    ''ఏమి విద్యమ్మా?'' అడిగింది లక్ష్మి.

    ''నువ్వు... నువ్వు... నాగమ్మని చూసావా?''

    ''యాడకి పోతాది లెమ్మా అదిగో నాగ దేవత వెలిసుల్లా.... ఇంక ఆ అమ్మి ఆడే ఉండాది, కూడు నీలు లేకుండా''

    ''హమ్మయ్య'' అనుకొని నిట్టూర్చింది విద్య.

    ''దాన్ని కొంచెం అరిచి ఇక్కడికి పంపకూడదా? ఏమవుతుందో ఏమో !'' బంధం లేకపోయినా మనుషులకు మధ్య ఎందుకో కొన్ని ఆప్యాయతలు కలుగుతూ ఉంటాయి నల్ల మబ్బుల్లో మెరుపు వచ్చినట్లు . 

    ''ఏమి కాదు లెమ్మా... కర్రోడు ఉండాడు అక్కడే '' లక్ష్మి ఇంకా చెపుతూనే ఉంది.

    ''అమ్మగారో ఏ మాటకు ఆ మాటే నాగ దేవత భలే పవర్ఫుల్ అమ్మా... మొన్న ఒకాయన  పొలం బేరం పెట్టి మొక్కుకున్నాడు అంట,  వెంటనే బేరం కుదిరిందంట. ఒకామెకి నడవలేని కూతురంట ఐదేళ్ళ పాప, ఈడ మొక్కుకోగానే చిన్నగా అడుగులేస్తున్నాదంట. నిన్న తీసుకోచ్చింది పాపని, ఏమైనా దేవతమ్మ దేవత'' ఆకాశం వైపు చూసి దణ్ణం పెట్టుకుంది.

    చిరాకేసింది విద్యకి ''ఎందుకే మూఢనమ్మకాలతో రాళ్ళను, పుట్టలని పూజిస్తారు. ఆ ప్రేమేదో పక్కన ఉండే మనుషుల మీద చూపించ వచ్చు కదా''

    ''అలా అనవాకు విద్యమ్మ కళ్ళు పోతాయి. యెంత దేవత కాకపొతే మనం తాకినా గమ్మునుంటాది. నేను కూడా తాకి చూసినా తెల్సా?ఎందరికి మహిమలు చూపిస్తా ఉండాది. తపస్సు చేస్తా ఉండాదమ్మ నాగ దేవత. ఆటోలు వాళ్ళు అందరు చందాలు వేసుకొని గుడి కట్టిస్తారంట. ఇంకో మూడు రోజుల్లో శంకుస్తాపన, ఎం.ఎల్.ఏ చేత చేయిస్తారంట''చెప్పుకుంటూ పోతూ ఉంది లక్ష్మి తన్మయంగా.

    ''ఏమో పో నీ పిచ్చి'' విసుగ్గా అని లేచింది విద్య.

    ''అమ్మా మిమ్మల్ని అక్కడికి తీసుకెలతాను రండి. మీకు నమ్మకం కుదురుద్దో లేదో చూద్దురు కాని'' అనింది. 

    ''ఏమి నమ్మకమో ఏమో, మనకు ఆటోలు బాగా వస్తునాయి అది చాలు'' అనింది విద్య.

    ''రామ్మా ఒక్కసారి,ఒకే ఒక్కసారి'' బ్రతిమిలాడింది లక్ష్మి.

    ''సరే రేపు ఈయన ఆఫీసుకు వెళ్ళినాక చూద్దాము లే'' అనింది విద్య.

    ఆ మాటకే లక్ష్మి మొహం వెలిగిపోయింది. రెడీ అయి ఉండమని మూడు సార్లు చెప్పి వెళ్ళిపోయింది. 
                             
* * *

    ఉదయాన్నే వచ్చి కూర్చుంది లక్ష్మి .

    మళ్ళా నాగ దేవత పురాణం మొదలు పెట్టింది.

    ఇంతలు అంతలు అయి ''ముని నాగయ్య పురాణం'' అని చెప్పసాగింది. అప్పుడే దేవుడికి పేరు కూడా పెట్టేసారా? దీని మొహం అసలు అక్కడ అంత ఉందో లేదో... కాని నిన్నటి కంటే ఆటోలు మాత్రం పెరిగాయి. భారత దేశం లో మూఢ నమ్మకాలకు లోటేమిటి? ఏట్లో కాసింత చెలమ తోడినా నీరు వచ్చినట్లు, ఎవరి మనసు తడిమినా బోలెడు ఊరుతుంటాయి . 

    ''సరే సరే పదా... తొందరగా వెళితే అన్నం టైముకు ఇంటికి వచ్చేయ్యవచ్చు'' బయలుదేరదీసింది విద్య. రోడ్ మీదకు రావడం ఆలశ్యం బోలెడన్ని ఆటోలు. కాని ఒక్కటీ ఖాళీ లేవు. ఎంత మంది జనాలను మోసుకోస్తున్నాయో! వెళ్ళే వాళ్ళే కాని తిరిగి వచ్చేవాళ్ళు కనిపించడం లేదు. ఎలాగో  ఒక ఆటోలో ఇరుక్కొని కూర్చొని వెళ్ళారు.

    గుడి (మరి అప్పటికే అలా ప్రచారం జరిగిపోయింది)దగ్గర అయ్యేసరికి రోడ్ కి అటు ఇటూ చిన్న చిన్న తుప్పలు నరికేసి గుంజలు నాటుతున్నారు. బహుశా లైట్లు పెడతారు కాబోలు. నాలుగు రోజులకే అక్కడంతా తిరణాలు లాగా ఉంది. పిల్లలు, పెద్ద వాళ్ళు ఒకటే తోక్కిసలాట. ఒకటే అరుపులు. అక్కడ ఆటో ఆగిపోయింది.

    ''ఇంకా ముందుకు పోనీ''అనింది లక్ష్మి.

    ''పోదమ్మ చూస్తున్నారు కదా జనాలు'' అన్నాడు ఆటో అబ్బాయి.

    దిగి నడవసాగారు.

    రోడ్ కి పక్కనే లేదు గుడి ఒక పది మీటర్లు కిందకి దిగి పొలంలో నడవాలి. మరి రోడ్ మీద పోయే ఆటో అతనికి పాము ఎలా కనిపించింది? బహుశా కిందకి దిగి చూసి ఉంటాడు.

    ఈ నాలుగు రోజులకే జె.సి.బి తెచ్చి రోడ్ నుండి మళ్ళా చిన్న రోడ్ లాగా వేసిఉన్నారు మట్టితో.

    ఎవరో కాంట్రాక్టర్ కి మొక్కుకుంటే పని అయినాదంట.

    ప్రస్తుతానికి పాము పడుకున్న ముళ్ళ తుప్ప మీద పాముకు ఎండ తగలకుండా కొబ్బరాకుల పందిరి వేసి ఉంది.

    ఆటో వాళ్ళు చందాలు వేసుకుంటూ ఉన్నారంట గుడి కట్టటానికి.... విశేషాలు వదలకుండా చెపుతూ ఊదరకొట్టేస్తూ ఉంది లక్ష్మి.

    చుట్టూ పరిశీలనగా చూస్తూ ''ఊ'' కొడుతుంది విద్య.

    ఎక్కడా నాగమ్మ కనిపించలేదు. కనులతోనే వెదుకుతూ ఉంది.

    పాము పడుకున్న తుప్ప చిన్న పుట్ట మీద ముళ్ళ కంప పెరిగినట్లు ఉంది. దాని చుట్టూ క్యు కట్టేశారు. ఇంకా పక్కన కొబ్బరి కాయలు, కర్పూరాలు పిల్లల కోసం బొమ్మలు, కాఫీ,టీ అంగళ్ళు, మెల్లిగా టిఫిన్ లు అమ్మే బండి కూడా చేరింది.

    చెట్టు పచ్చగా ఉంటె పక్షులకు లోటేమిటి? ఎక్కడ నుండైనా ఆకలికడుపులు పట్టుకొని వలస వచ్చేస్తాయి. అబ్బో పొట్టకూటి కోసం తిప్పలు పడక్కర్లేదు.
అన్నింటి మీద నాగ దేవత అనే పేరు.చిన్నగా నవ్వుకుంది విద్య.

    పుట్ట వైపు నడిచింది విద్య . క్యూ లో నిలబడకుండా గుంపు లోకి తొంగి చూసింది. 

    నిజంగానే మూడు మూరలు పాము కలే పొద కంప మీద ముళ్ళ మధ్యలో తాడు లాంటి శరీరాన్ని చుట్ట చుట్టుకొని పడుకొని ఉంది. చిన్ని తల ముడుచుకొని ఉంది. పడగ విప్పితే కానీ ఏమి పామో చెప్పలేము. తెల్లగా మాత్రం ఉంది. వచ్చిన వాళ్ళు చిన్న పెద్ద అందరు చేత్తో తాకి దణ్ణం పెట్టుకుంటూ ఉన్నారు. కనీసం కళ్ళు విప్పకుండా అలాగే ఉంది అది. అదిగో పక్కనే కనిపించింది నాగమ్మ, పూజారిణి అవతారంలో... 
 
    అక్కడ ఉన్న చిన్న ఇటుక రాయికి పసుపు కుంకుమలు పూసి, పక్కనే టెంకాయలు కొడుతూ, కర్పూరం హారతి ఇస్తూ ఉంది నాగమ్మ. పక్కన ఉండే పళ్ళెంలో కొందరు డబ్బులు వేస్తూ ఉన్నారు. దాని పిచ్చి నాకు తెలుసు. ఖచ్చితంగా డబ్బులు తాకదు.

    అప్పుడప్పుడూ పక్కకు తిరిగి చూస్తూ ఎవరో చెప్పినదానికి తల అడ్డం ఊపుతూ వద్దు అని విసుక్కుంటూ అంటూ ఉంది. ఎవరా అని తల కొంచెం ముందుకు వంచి చూస్తే కనపడ్డాడు కర్రోడు. దానిని టీ త్రాగమని బ్రతిమిలాడుతున్నాడు. ఇదేమో పూజలో పడిపోయి వద్దు అంటుంది. దానికేమో దేవుడి పిచ్చి, వాడికేమో దీని పిచ్చి. సరిపొయారు... ఇద్దరికిద్దరు నవ్వుకుంది విద్య.

    విద్య ను చూడగానే ఇద్దరి మొహాలు నవ్వుతో నిండిపోయాయి.

    కర్రోడు ఎప్పుడూ విద్యతో మాట్లాడడు.

    గౌరవంగా పక్కకు తప్పుకొని నిలబడ్డాడు 

    వాడిని చూడగానే మొన్న వాడిని అనుమానించినది గుర్తుకు వచ్చి మనసులోనే సిగ్గుపడింది విద్య. అభిమానంగా నవ్వింది వాడిని చూసి.వాడు తల వంచుకొని మిగిలిన వాళ్ళను పక్కకు పొమ్మని విద్యకు దారి చేసాడు.

    పుట్టకు దగ్గరగా వచ్చి నిలుచుంది విద్య.

    ఇక నాగమ్మ సంతోషానికి అంతే లేదు.

    ''చూడమ్మా, తాకమ్మా''అని నాగ దేవతను చూపించి ఒకటే సంబరం... ఏమిటో దీనికి నాకు బంధం . 

    దగ్గరకు వెళ్లి దాని మొహం పై కుంకుమ పెట్టింది నాగమ్మ.

    ''అమ్మా చూడండి ఇది మూడు శిరసులది''

    ''ఎక్కడ?'' ఏమి కనిపించక అడిగింది విద్య.

    ఇదిగో తల మీద రెండు బుడిపలు చూపించింది. 

    ''తాకమ్మా...తాకు ఏమి అనదు నాగమ్మ తల్ల్లి. దణ్ణం పెట్టుకో''

    ఇష్టం లేక పోయినా దానిని బాధ పెట్టడం ఇష్టం లేక దణ్ణం పెట్టుకుంది విద్య. ప్రత్యేకంగా విద్య  కోసం హారతి ఇచ్చి ''అమ్మ ఇక నేను ఇక అక్కడికి  రాను.
దేవుడో ,దేవతో నాకు ఇక్కడనే అవుపడాల... లేకుంటే సచ్చేదాకా ఇక్కడనే, నన్ను చూడాలి అంటే నువ్వే రా''చెప్పి సాగనంపింది.

    ఏమిటో దీని పిచ్చి దేవుడు ఎక్కడ కనిపిస్తాడు అని మనసులో అనుకొని తల వూపి వచ్చేసాను .
                          
* * *

    అప్పుడే రెండు రోజులైంది నాగమ్మని చూసి ఎలా ఉందొ ఏమో పిచ్చిది. అయినా కర్రోడు ఉండాడులే దానిని చూసుకోనేదానికి... చిన్నగా నవ్వుకుంది.
పెళ్లి చేసుకుంటేనే బంధమా? ఇదీ ఒక రకం బంధమేమో.

    ''విద్యమ్మా'' కేకలు పెడుతూ వచ్చింది లక్ష్మి.

    ''ఏమైంది లక్ష్మి'' 
    
    ''అమ్మ.... అమ్మ'' గస పెడుతూ ఉంది.

    ''ముందు చెప్పవే'' కంగారుగా అనింది విద్య.

    ''అమ్మా నాగమ్మ చావు బ్రతుకుల్లో ఆసుపత్రిలో  ఉంది'' ఆ ఒక్క ముక్క చెప్పేసి తొందర చేసింది బయలుదేరమని.

    ఉలిక్కిపడి  ఇంటికి తాళం వేసి బయలు దేరాను.

    ఆటోలో చెప్పుకొచ్చింది.

    ఆ పాము నిన్న చెట్టు మీద నుండి క్రిందకు దిగింది అంట. ఇక ఆ కంప పైకే రాలేదంట. ఆ రోజంతా నాగమ్మ దిగులుగా అన్నం తినకుండా రాత్రంతా అక్కడే ఉంది పోయిందంట. ఈ రోజు ఉదయం పాము తుప్పల్లోంచి 
బయటకు పాకుతూ వెళుతూ కనిపించిందంట. నాగమ్మ వెంటనే దానిని తీసుకొచ్చి మళ్ళా  పుట్టలో వేసేసిందిఅంట. మళ్ళా బయటకు వచ్చి పక్కకు 
పాకుతూ పోయిందంట పాము. నాగమ్మ మళ్ళా పట్టుకున్నది అంట పుట్టలో వేయటానికి... అంతే దానికి ఏమైందో ఏమో బుస్సున లేచి కాటు వేసిందంట.
నాగమ్మ నురుగు వచ్చి పడిపోయిందంట.

    ''ఎవరు తీసుకెళ్ళారు హాస్పిటల్ కి ?'' ఆత్రుతగా అడిగింది.

    ''ఇంకెవరమ్మాకర్రోడే... వాడి బాధ చూడాల... చిన్న పిల్లోడికి మల్లె అందరి కాళ్ళు  పట్టుకొని అడుక్కొని డబ్బులు తెచ్చి ఆటో ఎక్కించి తీసుకొచ్చి చేర్పించాడు. ఇప్పటి దాకా కూడు నీళ్ళు వదిలేసి ఏడుస్తూనే ఉన్నాడు. ఆ ఆమ్మి దగ్గర కూకోని'' బాధతో మాటలు తడబడి వెక్కసాగింది.

    వింటూ ఉన్న విద్యకు కూడా కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి.

    హాస్పిటల్ దగ్గరకు రాగానే ఆటో ఆగక ముందే దూకేసింది.

    నాగమ్మను ఐ.సి.యు లో ఉంచారు.

    ఎవరిని లోపలి అనుమతించడం లేదు. లోపలకి చూసింది విద్య. ఊపిరి ఆగిపోతూ వస్తూ ఉన్నట్లు తెలుస్తూనే ఉంది.

    ''ఎలా ఉంది డాక్టర్''అడిగింది.

    ''చెప్పలేము ...చాలా లేట్ గా తీసుకొచ్చారు'' చెప్పాడు డాక్టర్.

    అది వినగానే పెద్దగా ఏడుపు పక్కకు చూసింది. ఎప్పుడు వచ్చాడో కర్రోడు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతున్నాడు డాక్టర్ని.

    ''అయ్యా అదంటే నాకు ప్రాణం దాన్ని బ్రతికించండి ...జీవితాంతం మీకు సేవ చేస్తాను'' వెక్కుతూ కాళ్ళ మీద పడి బ్రతిమిలాడుతున్నాడు.

    కాసేపు కూర్చుంది విద్య. వాడి ఏడుపు చూడలేక పోతుంది. ఉండలేకపోయింది. లక్ష్మి మనం వెళ్లిపోదాము లేచింది. కర్రోడి దగ్గరకు పోయింది. ఒక ఐదు వందలు చేతిలో పెట్టింది.

    ''ఏదైనా అవసరం వస్తే పిలువు. ఏమి కాదులే నాగమ్మకు'' మాటలు రాకపోయినా బలవంతంగా చెప్పింది.

    ''వద్దమ్మా నాకు డబ్బులు వద్దు నాకు నాగమ్మే కావాలి? దేవుడా ఎట్టైనా దానిని బ్రతికించు అది ఒట్టి పిచ్చిది'' పైకి చూస్తూ దణ్ణం పెట్టుకుంటున్నాడు.

    మెల్లిగా నాగమ్మ దగ్గరకు వెళ్లి చూసింది. ఏదో జీవిత శ్వాస మెల్లిగా ఆ మొహంపై వాలుతూ ఒక చిన్న జీవకళ . 

    ''లేయ్యవే పిచ్చిదానా, నిజంగా దేవుడు నీకోసం పంపిన తోడును చూడు . నీ ప్రేమ కోసం పడే తపన చూడు. దేవుడు ఎక్కడో లేడే, వాడి నిజమైన ప్రేమలో ఉన్నాడు'' నిజంగా దేవుడు అనేవాడు ఉంటే పెదాలు దాటకుండా నేనన్న మాటలు దాని హృదయాన్ని కదిలించి ఆ ప్రేమను బ్రతికించే తీరుతాయి . 

    బయటకు వెళుతూ మలుపులో తిరిగి చూసింది. కర్రోడి మొహంలో ఏదో కళ, రూం వైపు చూస్తూ ఉన్నాడు. ప్రేమ ఆశను నింపుతూనే ఉంటుంది కాబోలు.

    ''వాళ్ళు బాగుండాలి'' అని కోరుకుంటూ వచ్చేసాను.
Comments