దేవుళ్ళాట- పి.శ్రీనివాసగౌడ్

    ఆరోజు మిట్టమధ్యాహ్నం.. ఎండ నిప్పులు కుమ్మరిస్తుండగా.. మా కొబ్బరికాయల లారీ చెమటలు కక్కుతా.. గుడి ఆవరణలో ప్రవేశించింది. లారీ క్యాబిన్‌ లోంచి వడలిన తోటకూర కాడల్లా 
కిందకి దిగాం నేనూ, సంధ్యత్త, సీతమ్మ. 'మాకే ఇట్టుంటే.. వెనక కొబ్బరికాయలకాడున్న భద్రయ్య ఎట్టున్నాడో'ననుకున్నా ఒళ్ళిరుచుకుంటా. ''ఒళ్ళు హూనం అయిపోయింది బాబా..'' అన్నాడు భద్రయ్య లారీ దిగి వచ్చి. మా ఇంటి దగ్గర ఎరిగున్న మనుషులు భద్రయ్య, సీతమ్మ. మొగుడూ పెళ్ళాలిద్దరూ చేతి కింద సాయంగా వుంటారని, జీతానికి తెచ్చాం.


    చుట్టూ పరికించి చూసాను.


    విశాలమైన గుడి ఆవరణ.. పది, పన్నెండు ఎకరాలుండొచ్చు... చుట్టూ ప్రహరీ... ఎంట్రన్సు దగ్గర పెద్దగేటు.. లోపల తారురోడ్డు.. రోడ్డు పక్కన బారుగా పెద్ద పెద్ద చెట్లు.. గుడి ఒక పక్కగా వుంది. పాతది. గుడికి ఎదురుగా పొడుగ్గా ధ్వజస్తంభం.. దానికి ఎడమ పక్కన ప్రహరీ గోడకి ఆనుకొని బారుగా రేకులషెడ్లు - పాతబడి... అది దాటితే.. వరసగా పెంకుటిల్లు.. అందులో ఎవరో నివాసం వుంటునట్టున్నారు.. దండేల మీద ధోవతీలు.. గావంచాలు.. పై కండువాలు.. ఆరేసున్నాయి.. గుడి పూజార్లవి కాబోలు...


    ఇంతలో ఒకతను మా దగ్గరకు వచ్చాడు. పొట్టిగా...నల్లగా..ముఖాన బొట్టు.. బుగ్గన కిళ్ళీ... అమ్మా... మీరు.. అన్నాడు సందేహంగా


    ''నేనేనండి.. కొబ్బరి కాయల పాట పాడింది...'' అంది సంధ్యత్త.


    ''మీరేనామ్మా... ఆహాఁ మీకోసమే ఎదురుచూస్తన్నామమ్మా... నాపేరు మల్లేశమమ్మా... ఆలయం కమిటీ మెంబర్ని..'' అని లారీ డ్రైవర్‌ వేపు మళ్ళి.. పెంకుటిల్లు కనపటంలా... వరసగా... ఆఁ... అదిగో.. వాటిల్లో చివరి గది.. అక్కడ దింపు కాయలన్నీ'' అన్నాడు పూజార్ల పెంకుటిల్ల వైపు చూపిస్తా


    భద్రయ్య వెళ్ళి ఇంటి తలుపు తీసాడు. రెండే గదులు... ఒకటి కొబ్బరి కాయలకనుకుంటా..గోడలు - మరకలు... మరకలుగా.. ఎండిపోయిన కొబ్బరి పీచుల్తో సహా బూజు పట్టి.. చూస్తంటే 'వామ్మో' అన్నట్టుంది.


    భద్రయ్య, సీతమ్మలు.. గబగబా పక్కింటికెళ్ళి చీపిరి తెచ్చి, క్షణాల్లో గదులు శుభ్రం చేసారు. లారీల్లోంచి కొబ్బరికాయలన్నీ గోతాల్తో గదిలో చేరేసారు. గది దాదాపు సగం పైగా నిండిపోయింది. సంధ్యత్త లోపు వంట కానిచ్చింది


    లారీవోళ్ళు వెళ్ళిపోయారు. మల్లేశం కూడా సాయంత్రం వస్తానని వెళ్ళిపోయాడు. భద్రయ్య భుక్తాయాసంతో వసారాలో నడుం వాల్చాడు. అరువు తెచ్చుకున్న చాపల మీద బ్యాగుల్ని తలకింద పెట్టుకొని.. అలసిన ఒళ్ళుతో.. తెలీని ఆందోళన మెదులుతున్న కళ్ళతో.. సంధ్యత్తా, నేనూ చేరో పక్కా జారగిలపడ్డాం.


* * *


    గుడిలోనే ప్రక్కగా, చిన్నగదిలో వుంది కమిటీ ఆఫీసు. నేనూ, సంధ్యత్త వెళ్ళేసరికి అక్కడ మల్లేశంతో పాటు ఇంకా ఐదారుగురు వ్యక్తులూ... గుడి పూజార్లూ కూర్చొని వున్నారు. మల్లేశం వాళ్ళని పరిచయం చేసాడు. ఇద్దరు ఆలయం ధర్మకర్తలు... ఒకాయన కమిటీ సెక్రటరీ.. మిగతావాళ్ళు మెంబర్లు... పూజార్లు.. ముగ్గురూ అన్నదమ్ములంట... మూడు తరాల్నుంచి గుడిలో అర్చకత్వం చేస్తున్నారంట.. అందరూ.. అంటీ అంటనట్టుగా... తెచ్చిపెట్టుకున్న నవ్వుతో... ఒక రకంగా వున్నారు.


    కమిటీ సెక్రటరీ ఏవో కాగితాలు బయటికి తీసి ''ఇదిగో.. ఇక్కడ సంతకం పెట్టమ్మా...'' అన్నాడు.


    ''శ్రీశ్రీశ్రీ మల్లిఖార్జున స్వామి వారి ఆలయం కొబ్బరికాయల వేలంపాట 2011-12 సంవత్సరానికి లక్ష రూపాయల ధరావత్తుకి శ్రీమతి సంధ్యాకుమారి వైఫ్‌ ఆఫ్‌ పాండురంగారావు గారు పాడారని, బయానాగా యాభైవేల రూపాయలు ముట్టాయని, మిగతా యాభైవేలు రెండు వాయిదాలుగా ఆఖరి మూడు నెలల ముందే జమ చేయాలని.. లేని యెడల ప్రభుత్వం వారు తీసుకొనే చర్యలకు బాధ్యత వహించాలని'' కాగితాల్లో వుంది. సంధ్యత్త సంతకం పెట్టి ఇచ్చింది


    ''అమ్మా.. సంవత్సర కాలం మీరా పెంకుటింట్లో సుబ్బరంగా వుండొచ్చు... కొబ్బరికాయలు.. పూజా సామాన్లు.. పచారి సామాన్లు.. కాశీదారాలు.. పిల్లల బొమ్మలు... అమ్ముకోవచ్చు. మీకేదన్నా కావాలంటే.. మొహమాట పడకుండా మమ్మల్ని అడగొచ్చు'' అన్నాడు ధర్మకర్తల్లో ఒకాయన.


    ''ఏం పర్లేదమ్మా.. అంతా మల్లిఖార్జునుడి దయ.. మనదేం లేదు.. అంతా ఆయనే చూసుకుంటాడు.. ఏం పర్లేదు..'' అన్నాడు మరొకాయన'సరే'నని చెప్పి బయటపడ్డాం. మల్లేశం వెంటే వచ్చాడు.


    ''మల్లేశం గారూ.. పోయిన సంవత్సరం కొబ్బరికాయల పాట ఎవరిదండి..?'' మల్లేశాన్ని పెంకుటింటికాడ కూచోబెట్టి టీ ఇస్తా అడిగా.


    ''పోయిన సంవత్సరం ఏందండి? ప్రతి యేడూ కొబ్బరికాయల పాట పూజార్లదే... సంవత్సరమేగా మీకొస్తా...'' మల్లేశం కాస్త గొంతు తగ్గించి చెప్పాడు.


    ''ఏందీ.. మొన్నటిదాకానా..?'' ఆశ్చర్యపోయాను.


    ''అవునండీ... గుడి ప్రభుత్వంలో కలవక ముందు నుంచీ... అంటే వాళ్ళ తాతల కాలం నుంచి గుడి వీళ్ళ కిందే వుంది. నాకు తెలిసి.. పాటలొచ్చాక.. వీళ్ళే చవగ్గా పాడుకొని.. వీళ్ళే అమ్ముకుంటా వున్నారు. సంవత్సరం ఈవొగా ఒక కొత్తాయన వచ్చాడు. పాటల యవ్వారమంతా పేపర్లలో ప్రకటనలు ఏయించాడు. పాటల మీద తిరిగేవోళ్ళందరికీ.. గుడి మీద కన్నుపడేట్టు చేసాడు. లేకపోతే మీరెట్టా వచ్చేవోళ్ళు..? ఇరవై వేలక్కూడా కటకటలాడే పాట.. లక్ష రూపాయలకెట్టా పాడే వోళ్ళూ...? చెప్పండి''


    ''సరేగానీండి మల్లేశం గారూ.. ఇక్కడ జాతరేదో జరిగిద్దంట గదా.. రోజు మాత్రం పోతాయండి కాయలు..?''


    ''అబ్బో.. చిన్నగా అంటారేందండి.. మామూలు జాతరా..? చుట్టు పక్కల ఊర్ల జనమంతా ఆరోజు బండ్లు కట్టించుకొని వచ్చేస్తారు. ఇసకేస్తే రాలదారోజు. సంవత్సరం అంతా అమ్మింది ఒకెత్తు.. ఒక్కరోజు అమ్మింది ఒకెత్తు..''


    ''అయితే... రోజు రెండు లోడ్లకాయలు పోతాయాండి...?'' సంధ్యత్త ఆబగా అడిగింది.


    "రెండు లోడ్లా.. లెక్కలేకుండా పోతాయి..'' అన్నాడు మల్లేశం ధీమాగా మొకంపెట్టి.


    ''మీ నోటి వాక్కువల్లయినా అట్టా జరిగితే..'' సంధ్యత్త ఊహలోకెళ్ళి చూపులు ఎక్కడో నిలిపింది.


    ''ఏం పర్లేదు లేమ్మా.. మీ డబ్బులన్నీ జాతర్లలోనే తేలిపోతాయి..'' అన్నాడు మల్లేశం తేలిగ్గా.


    ఊరు గాని ఊరొచ్చి ఎట్ట నెగ్గుకొస్తాంరా.. అని గుబులు గుబులు పడుతున్న మాకు మల్లేశం మాటలు జీవం పోశాయి.


* * *


    జాతర ఇంక పదిహేను రోజులకొచ్చింది.. రా..రా..' అని సంధ్యత్త ప్రాణం తీస్తుంటే నేను ఊర్నుండి మళ్ళీ వచ్చాను.


    ''ఏం చేద్దాం రా కరుణా.. ఇంకో రెండు లోడ్లు తెప్పిద్దామంటావా..?'' మల్లేశం మాట అన్నకాడ్నుంచి సంధ్యత్త కాళ్ళు ఒక్కచోట నిలవడం లేదు. మనిషికి ఒకటే కంగారు....


    ఇక్కడ గుళ్ళో మాములు రోజుల్లో బేరం అంతంత మాత్రమే.. ఐదొందలు అమ్మితే గొప్ప! ఆదివారాలు.. సెలవు రోజులు.. పండగల రోజులైతే మాత్రం.. కాస్త సుమారుగా వుంటుంది.


    ''ఉండత్తా.. తొందర పడమాకు.. ఇప్పటికే మన దగ్గర లోడు కాయలున్నాయి... అంటే దాదాపు ఆరువేలు కాయలు.. ఇంకో రెండు లోడ్లంటే మొత్తం పద్దెనిమిది వేల కాయలు.. ఒక్క రోజులో ఇన్ని అమ్ముడుబోవడం అంటే మాటలా..? ఆలోచించు...''


    ''జాతర రోజు రెండు లోడ్ల పైనే పోతాయంటున్నారు కదరా... అందరూ..''


    ''పోతే మంచిదే అత్తా.. లేకపోతే ఏంటి పరిస్థితి.. కాస్త ఎనకా ముందూ ఆలోచించు..''


    సంధ్యత్త ఏం మాట్లాడకుండా, మౌనంగా ముఖం తిప్పుకొని కూచుంది. అంటే అలిగిందన్న మాట.


    సంధ్యత్త స్వయానా మా నాన్న చెల్లెలు. అస్తమానం అనుమానం మొగుడితో వేగలేక.. తెగతెంపులు చేస్కొని, ఇద్దరు పిల్లల్తో ఇంటికొచ్చేసింది. అమ్మానాన్నలు సంధ్యత్త కాపురం పోయినా సహించారు గానీ, అమ్మలక్కల సూటీ పోటీ మాటలు సహించలేకపోయారు. ఏం అనుకుందో - ఒకరోజు పిల్లల్తో - పక్క ఊర్లో వుద్యోగం చేస్తున్న నా దగ్గరకు వచ్చింది. 'సరే... ఒంటిగాణ్ణేగా.. నా దగ్గరే వుండత్తా' అన్నా వినలా. 'నువ్వయినా.. వాళ్ళయినా ఒకటే'నని ఎంత చెప్పినా వినకుండా, విడిగానే వుంటానంది. అన్నట్టే.. ఒక చిన్న ఇల్లు చూసుకొని.. అందులోకి మారిపోయింది. ఏవేవో చిన్న వ్యాపారాలు చేస్తా.. మిషను కుడతా.. పిల్లల్ని చదివిస్తా.. బతుకు బండిని పౌరుషంగా లాక్కొస్తావుంది


    ఇంతలో ఇక్కడ తగిలాడో ఏడుకొండలు- 'అక్కా..అక్కా' అంటా సంధ్యత్తని బుట్టలో వేసాడు. ఏడుకొండలు గాడు మహా మాటకారి. పందిని నందినీ, తిమ్మిని బమ్మినీ చేయగల సమర్థుడు.' అక్కడ గుడిపాటల్లో ఇంత లాభం వస్తుంది' అని ఊరించి, సంధ్యత్త అవసరాన్నీ, అమాయకత్వాన్నీ ఆసరా చేసుకొని, మెల్లగా ఆమెకి గుడిపాటల పిచ్చి అంటించాడు


    భక్తుల రద్దీ ఎక్కువగా వున్న ఆలయాల్ని ప్రభుత్వం ఎండోమెంట్‌ (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కింద కలుపుకొని తన ఆధీనంలో వాటిని నిర్వహిస్తూ వుంటుంది. వాటి అజమాయిషీకి కొంతమంది .వొ.ల్ని నియమించి, వాళ్ళ ఆధ్వర్యంలో గుళ్ళలో వినియోగించే వస్తువుల్ని ప్రాంగణంలో అమ్ముకోవడానికి వేలంపాటలు నిర్వహించి, వాటిద్వారా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటా వుంటుంది. కొబ్బరికాయల పాటనీ, కొబ్బరి చిప్పలపాటనీ, తలనీలాల పాటనీ, ప్రసాదాల పాటనీ, పప్పుబియ్యాల పాటనీ, చీరల పాటనీ.. ఇలా రకరకాలుగా.. ఒక్కొక్క గుళ్ళో ఒక్కోరకంగా అక్కడి ఆచారాల్ని బట్టి, వస్తువుల వినియోగాన్ని బట్టి.. పాటలు నిర్వహిస్తావుంటారు. బాగా రద్దీగా వుండే తిరుపతి, విజయవాడ, అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం... లాంటి పెద్ద పెద్ద గుళ్ళల్లో పాటలు మామూలు వాళ్ళకి అందవు. అక్కడ 'పెద్ద తలకాయలు' దిగిపోతాయి. గుడి పాటల్లో పోటీ వుండేది కొబ్బరికాయలకి... తలనీలాలకే... 


    ఏడుకొండలు చిన్న చిన్న గుళ్ళల్లో తలనీలాల పాట పాడుతుంటాడు. బాగా పోటీ వుండే కొబ్బరికాయ లాంటి పాటలకి... పాట కోసం వచ్చినోళ్ళందరితో కలిసి 'రింగు' కడతాడు. పాట గట్టిగా కావాలనుకున్నవాళ్ళు... మిగతా పోటీదారులకి లోపాయికారీగా ఎంతో కొంత ఇచ్చి, పోటీకి రాకుండా చేసుకొని.. పాట తక్కువకి పాడుకుంటారు. అలా రింగులు సంపాదిస్తున్న ఏడుకొండలు.. పెద్ద పాటలకి అడ్వాన్సులు సంధ్యత్త చేత పెట్టించి.. వచ్చేది చిలక్కొట్టుడు కొడతా పబ్బం గడుపుకుంటా వున్నాడు. 'పదో పరకో' కళ్ళజూస్తన్నాం కదాని ఏడుకొండలుగాడు ఎట్ట చేయమంటే అట్ట చేస్తావుంది. సంధ్యత్త. లెక్కనే ఎంతో కొంత కమీషన్‌ కొడదామని చెప్పి, సంధ్యత్తని ఇంతదూరం ఇక్కడి గుడికి తీసుకువచ్చాడు ఏడుకొండలు. నాకు చెబితే, నేనెక్కడ అడ్డుపుల్ల వేస్తానేమోనని నాకు చెప్పనీయకుండా చేసాడు. అక్కడ ఏం తంత్రం వేసాడో గానీ.. సంధ్యత్త చేత లక్ష రూపాయలు పాట పాడించాడు. యాభై వేలు బయానా కట్టించి.. చిన్నగా జారుకున్నాడు. పాపం... సంధ్యత్త..! ఎక్కడెక్కడి డబ్బులు పోగేసి.. అప్పులు తెచ్చి బయానా కట్టింది.


    కొబ్బరికాయలు, సరుకులు కొంటానికి డబ్బుల్లేక నన్ను అడిగింది. అక్కడకి నన్నూ రమ్మంది. 'ఒక్కతే అక్కడ ఏం ఇబ్బందులు పడుద్దో.. అసలే చాలా ఎక్కువ పెట్టి పాడిందని' సరే.. నేనూ నీతో వచ్చి, జాతర రోజు వుండి, నా పెట్టుబడి నేను తిరిగి తీసుకుపోయే షరతు మీద ఇస్తానన్నా'ను. 'సరే' నంది


* * *


    జాతరకు ఒకరోజు ముందే రెండు లోడ్ల కొబ్బరికాయత్తో గుడి దగ్గర దిగాను. కాయలన్నీ రెండు గదులకి సరిపోయాయి. గుడి దగ్గర ఊళ్ళోకి వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ కొనుక్కువచ్చాను.


    జాతరరోజు పొద్దున్నుంచే హడావుడి మొదలైంది. గుడి ఆవరణ అంతా అక్కడొక మైకు.. అక్కడొక మైకు పెట్టారు. చెట్టుకొక ట్యూబ్‌లైటు.. మధ్య మధ్యలో పెద్ద పెద్ద మెర్క్యూరీలైట్లు తగిలించారు. మధ్యాహ్నం దాటేసరికల్లా.. భక్త జనం పిల్లాజెల్లాతో... కోళ్ళూ మేకలతో గోలగోలగా రావడం మొదలైంది. చోటు చూసుకొని, మూడు రాళ్ళు పోగేసి.. ఎండు పుల్లల్తో వంట వండుకోవడం మొదలుపెట్టారు


    నేను పొద్దున్నే కొబ్బరికాయల్ని భద్రయ్య చేత ఒలిపించి, పసుపూ కుంకుమ, అగరొత్తులు, నెయ్యి పాకెట్లు అన్నీ పాకేట్లు చేసి వుంచాను. పిల్లల బొమ్మలు, కాశీ దారాలు, పచారీ సామాన్లు రడీగా వుంచాను


    కొద్దికొద్దిగా సరుకు అమ్ముడవుతోంది కానీ, కొబ్బరికాయలు కదలట్లేదు.


    నెమ్మదిగా చీకటి అలుముకుంటోంది. చీకటి పడిన తర్వాతే జాతర...


    ఏం తోచట్లేదు. మనసులో ఏదో శంక.. ఊపిరాడుతున్నట్టు లేదు. గుడి గేటు దాటి బయటకు వచ్చాను. గుడికి వచ్చే దారిలో అక్కడక్కడ ఇళ్ళ ముందు కొబ్బరికాయలు పెట్టి అమ్ముతున్నారు నా అనుమానం నిజమయ్యింది. ఇట్టయితే లాభం గూబలోకి వచ్చినట్టే-


    మల్లేశాన్ని వెతుక్కుంటూ కమిటీ ఆఫీసుకి వెళ్ళా. లేడు. ధర్మకర్తలో ఒకాయన కనపడితే విషయం చెప్పా.


    ఆయన నవ్వి ''ఆలయం లోపల పెడితే పెట్టనివ్వంగానీ, వాళ్ళింటి ముందు వాళ్ళమ్ముకుంటే మనం ఏం చెయ్యగలమండీ..?'' అన్నాడు నింపాదిగా


    చేసేది లేక భద్రయ్యకి, సీతమ్మకి కొన్నికాయలిచ్చి ఎంట్రన్సు గేటు దగ్గర కూచోబెట్టాను. నేనూ, సంధ్యత్త వసారాలో కొబ్బరికాయలు పేర్చి.. బొమ్మలు.. దారాలు చమ్కీదండలు.. అన్నీ కనపడేట్టు వేలాడగట్టి కూర్చున్నాము.


    రాత్రయ్యేసరికి జన సందోహం ఎక్కువయిపోయింది. గుడి ఆవరణంతా పూజార్ల మంత్రాలతో మైకులు మార్మోగిపోతావున్నాయి. మా బేరం కూడా మెల్లగా ఊపు అందుకుంది


    భక్తులు గుళ్ళో పోటెత్తుతున్నారు. మా దగ్గరకు రాకుండానే నేరుగా గుళ్ళోకి పోతున్నారు. వచ్చేప్పుడు కొబ్బరి చిప్పల్తో బయటకు వస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. మా దగ్గర కొనకుండా వాళ్ళకి కొబ్బరికాయలెక్కడివి..? ఎందుకు వాళ్ళు మా దగ్గరికి రావడం లేదు..?


    అర్థరాత్రి అవుతున్న కొద్దీ మా బేరం బాగా పల్చబడిపోయింది. నేరుగా గుళ్ళోకి పోయి కొబ్బరికాయకొట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువయిపోయింది.


    మా దగ్గర వేలాదికాయలు మిగిలిపోయాయి. నాకు అదుర్థా పెరిగిపోతోంది. సంధ్యత్త మొకంలో అయితే నెత్తుటి చుక్కలేదు


    చూస్తా వుండలేక.. అసలు విషయం ఏందో కనుక్కుందామని.. నేరుగా గుళ్లో కొబ్బరికాయలు కొట్టేసి వస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళా-


    ''మీ కాయలు బాగున్నాయండీ.. ఎక్కడ కొన్నారు..?'' అని అడిగా.


    ''యాడా కొనలేదండీ.. మా ఊర్నుండే తెస్తా...'' అన్నాడు వాళ్ళల్లో ఒకాయన.


    ''అదేందండి..? ఇక్కడ అమ్ముతారుగా... మీ ఊర్నుండి ఇక్కడ దాకా మోత బరువెందుకు..?'' అన్నా ఏం అర్థంకాక


    ''పోయినేడు ఈడే కొన్నామండీ.. యేడు.. ఇక్కడ కొబ్బరికాయలు అమ్మరు. ఊళ్ళోంచే తెచ్చుకోవాలని అన్నారండీ.. అందుకని ఊరోళ్ళమంతా మా కొబ్బరికాయలు మేమే తెచ్చుకొని.. దేవుడికి కొడతన్నామండి..''


    అది విని నా తల గిర్రున తిరిగింది. నోట మాట రాలేదు. 'ఎవరు చెప్పారని' కూడా అడగలేనంత నీరసం నిలువెల్లా ఆవహించింది. నిస్సత్తువగా పక్కనున్న ఒక చప్టా మీద కూలబడ్డాను


* * *


    నల్లగా అయిపోయిన మా మొఖాల మీదుగా తెల్లగా తెల్లారింది. చెదిరిపోయిన మనసులతో చెదురుమదురుగా చెల్లాచెదురుగా పడిపోయున్న కాయలన్నీ భారంగా లెక్కేస్తున్నాం... నేనూ.. సంధ్యత్త.


    భద్రయ్యా.. సీతమ్మ.. కనపడటం లేదు.. ఎక్కడ చచ్చారో.. కాయలులెక్కేయకుండా...


    ఒక లోడుకాయలు మిగిలిపోయాయి. కొన్ని ఒలిచినవి. కొన్ని అదృష్టం కొద్దీ ఒలవనివి.. అవీ, ఇవీ విడివిడిగా వేస్తున్నాం. ఒలిచినవి నిలవుంచితే కుళ్ళిపోతాయి. కుళ్ళిన కాయల పక్కన మిగతా కాయలూ కుళ్ళిపోతాయి.


    నాకు మనసంతా భగ్గుభగ్గుమంటోంది. ఎవరిమీదో తెలియని కసి, నాకు తెలియకుండానే పళ్ళు నూరుకోవడంలో తీర్చుకుంటున్నాని నాకు తెలుస్తూనేవుంది


    భద్రయ్య.. వాడ్ని తలుచుకుంటేనే.. కంపరంగా వుంది. రాత్రి ఏం చేసాడు..? మనసులో అదే దృశ్యం.. సుళ్ళు తిరుగుతూ...,


    నిన్న అర్థరాత్రి దాటిన తర్వాత అనుకుంటా.... జరిగిందా సంఘటన.. గుడి లోపల బేరం లేదు. ఏం తోచక చిరాకు చిరాగ్గా అలా గుడి బయట గేటు దగ్గరకు వచ్చా.


    అక్కడ భద్రయ్య లేడు. సీతమ్మ ఒక్కతే కునికిపాట్లు పడతా వుంది.


    ''సీతమ్మా... సీతమ్మా...'' తట్టి లేపాను. తత్తరపడి లేచింది.


    ''ఏడీ భద్రయ్య...? ఎక్కడికెళ్ళాడు..? ఎంతకమ్మేరు..?''


    సీతమ్మకి మత్తు పూర్తిగా వదిలి, నీళ్ళు నములుతోంది.


    ''భద్రయ్య ఏడంటే.. మాట్లాడవేందమ్మా..?''


    ''ఆయన..ఆయనా.. బాబూ...''


    'అప్పన్నతనామనా... అప్పన్నాతన్నామనా.. అందరికీ దండలన్నా... తాగినోడి నోట నిజం తన్నుకొని వస్తాదన్నా.. అప్ప..' పాడుకుంటా తూలుకుంటా వస్తున్న భద్రయ్య నన్ను చూసి నాలుక కొరుక్కొని.. పాట ఆపేసాడు.


    గుప్పున కొట్టింది మందు వాసన.


    భద్రయ్యని స్థితిలో చూసేసరికి.. ఛర్రున కోపం నడినెత్తికి కొట్టింది.


    ''ఏంది భద్రయ్యా.. కాయలమ్మమంటే అమ్మకుండా యాడ తిరిగొస్తున్నావ్‌...? ఆఁ.. ఇంతకీ ఎంతకమ్మావ్‌..?'' నా మాట నాకే విసురుగా వినిపించింది.


    ''బాబూ.. మీరు కాయ పదికి అమ్మమన్నారు.. పదికి ఈడ ఎవడూ కొంటంలా... హిక్‌.. అందుకే హిక్‌.. ఐదు చేసి అమ్మేసాం... ఏవే.. హిక్‌' అన్నాడు భద్రయ్య చివర్లో పెళ్ళాంకేసి దీర్ఘంగా చూసి...


    ''ఆఁ...ఆఁ.. అవును బాబు...'' పెళ్ళాం వంత పాడింది.


    ఛీ...! ఇంత తేలిగ్గా అబద్ధాలు చెప్తారా..? భద్రయ్య తాగి రావడం కన్నా... 'నాకే' అబద్ధం చెప్పడం భరించరానిదిగా వుంది నాకు.. అసలే బేరం లేదనే తిక్క మీద వున్నాను...


    ''భద్రయ్యా... ఏదీ... అమ్మిన డబ్బులిలా ఇయ్యి..''


    ''బాబూ..మరి..మరి... డబ్బులు.. బ్రాందీ షాపు కాడ ఎవడో కొట్టేశాడు బాబూ..హిక్‌..హిక్‌...''


    ఏం చేస్తున్నానో తెలియనంత ఆవేశం వచ్చేసింది నాకు.. భద్రయ్య గూబ గుయ్యమంది. దెబ్బతో కిందపడి బిత్తరపోయాడు భద్రయ్య... లేవాలని ప్రయత్నించి.. లేవలేక తూలుతున్నాడు...


    మళ్ళీ ఇంకోటి ఇచ్చేలోపు సీతమ్మ నాకాళ్ళ చుట్టేసుకుంది. ''బాబూ.. వద్దు బాబూ.. వదిలెయ్‌ బాబూ..'' అని...


    జరిగిన దాంట్లోంచి బయటకు రాలేక పోతున్నా.. తల దిమ్ముగా వుంది గట్టిగా విదిల్చాను.. ఉహు ఆలోచనలు మళ్ళీ మూగుతున్నయ్‌...


    ఎక్కడ చచ్చారు.. భద్రయ్య.. సీతమ్మ..


    అంతలో విశాలాక్షి గారు వచ్చారు. ఆవిడ ముఖం కాస్త నలిగిపోయి వుంది. సంధ్యత్త హడావుడిగా చాప తెచ్చివేసింది. ఆవిడ మౌనంగా కూర్చుంది

విశాలాక్షి గారు గుడి పెద్దపూజారి గారి భార్య. మా పక్క ఇంట్లోనే వుంటారు. చిటికీ మాటికీ.. ఉప్పుకీ పప్పుకీ ఆవిడే మాకు సాయం...


    ''ఏమ్మా.. సంధ్యా.. రాత్రి బేరం ఎలా అయ్యింది...?'' విశాలాక్షి గారు గొంతులోంచి మాట పెగుల్చుకొని అడుగుతున్నట్టు అడిగారు. సంధ్యత్త ఏం మాట్లాడలేదు. మొకం కనిపించకుండా నేలచూపులు చూస్తా వుంది


    గట్టిగా నిట్టూర్పు విడిచారు విశాలాక్షి గారు. ఎప్పుడూ పెదాల మీద వుండే చిరునవ్వు మాయమైంది.


    ''ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా.. మిమ్మల్ని చూస్తే చాలా బాధగా వుంది. మాలో మాకు ఎన్నున్నా ఇంతకాలం ఎట్టనో నెట్టుకొచ్చాం... తరతరాలుగా వస్తున్న అర్చకత్వం.. వదులుకోలేక.. అటు బయటకెళ్ళి బతకలేక.. ఇటు ఆఫీసర్ల ధాటికి తట్టుకోలేక.. ఎంత నలిగిపోతున్నామో భగవంతుడికి తెల్సు...'' విశాలాక్షి గొంతు జీరపోయింది


    ''....గుడిలో వచ్చింది.. అమ్మింది ఏదైనా.. మూడు వాటాలు.. తలో సంవత్సరం చేయాలని అనుకున్నాం... సంవత్సరం మా వంతు.. మేం చేయాలి.. వచ్చిన గుడి మీద కొత్త ఆఫీసరుకి మాకు కమీషన్‌ దగ్గర తేడా వచ్చి.. ఎందుకో పొసగలేదు. పోనీ ఎలాగో ఒకలాగ చేద్దామంటే.. మా ఖర్మకొద్దీ.. హాస్టల్లో చదువుతున్న మా అమ్మాయికి.. గుండెల్లో రంధ్రం పడింది.. లక్షల్లో ఖర్చు మీదపడింది.. అంత ఇవ్వలేమండీ.. ఇదండీ పరిస్థితి అని చెప్పుకున్నాం ఆయన గారికి.. ఆయన మనసు కరగలేదు సరికదా.. 'దాత్‌.. నాతో కథలు చెబుతారా.. మీ సంగతి నాకు తెలియదా..? ఇన్నాళ్ళు గుళ్ళ మీద తిన్నదంతా ఏం చేసారు..? నాకే ఎదురు చెపుతారా.. చూడండి.. ఏం చేస్తానో..' అని మా మీద కోపగించారు. ఎవరు చెప్పినా వినలా. బయటవాళ్ళని పాటలకి పిలిచారు. అప్పటికీ మా మరుదులు వాళ్ళ మనుషుల్ని పెట్టి పాట పాడియ్యాలని చూసారు గానీ... వాళ్ళకి పాట అందలా.. మీరు ఎక్కువ పెట్టి పాట పాడేసారు..'' విశాలాక్షి గారు చెప్పడం ఆపి ఒక్క నిమిషం మా వంక చూసారు. చూపులో లీలగా అపరాధ భావం..


    ''...మీరొచ్చారు... 'మీరొచ్చి ఇక్కడ పాతుకుపోతే.. మా నోటి కాడ కూడు పోతుంది కదా.. ఆదాయమంతా ఉత్తి పుణ్యానికి గవర్నమెంటుకి వెళ్తుంది కదా..' అని గుడి మీద ఆఫీసర్లూ, కమిటీ మెంబర్లు, మా వోళ్ళూ.. అందరూ కలిసి తెగ ఇదయిపోయారు. ఎట్టయిన మిమ్మల్ని ఎట్టా వచ్చారో అట్టా వెనక్కి పంపాలని ఆలోచించారు. అందుకే.. ఊళ్ళల్లో సంవత్సరానికి కొబ్బరికాయలు మీరే తెచ్చుకోండని చెప్పొచ్చారు.. బేరం లేకపోతే మీరు మాత్రం ఎంతకాలం వుంటారు..? అదిగో.. మీ కూడానే తిరుగుతున్నాడే.. మల్లేశం... అతనిక్కూడా తెలుసు.. భాగోతం అంతా.. ఇన్నాళ్ళుగా దేవుణ్ణే నమ్ముకొని వున్నాం... దేవుడి సొమ్మేగా తింటున్నాం... అనుకున్నాం.. కానీ.. ఇప్పుడు.. చేసింది.. ఊరికే పోతుందా.. అందుకే భగవంతుడు వెంటనే చూయించాడు.. కడుపుకోత పెట్టి...'' విశాలాక్షి గారి కళ్ళమ్మెట నీళ్ళు జలజలా రాలాయి. ఏడుపు బయటకి రాకుండా చెంగు అడ్డం పెట్టుకుంది. కొంతసేపటికి తమాయించుకొని.. 


    ''మా అమ్మాయికి ఇంతకాలం బయట పడలేదా జబ్బు.. ఇప్పుడే బయట పడింది.. ఆపరేషన్‌ చెయ్యకపోతే బతకదంటున్నారు.. లక్షలు పోసినా బతికిద్దో.. లేదో.. ఇది విన్న దగ్గర్నుంచి ఆయన ఒకటే బాధపడిపోతన్నారు.. నిన్నట్నుంచి అన్నం కూడా ముట్టలా.. మీ దగ్గర ఆయనకి మొకం కూడా చెల్లడం లేదు... చేసిన పాపం చెబితే కాస్తయినా పోతుందంటారు కదా.. అందుకనే మీకు చెప్పేసానమ్మా.. మా బిడ్డ క్షేమంగా వుంటే అంతే చాలమ్మా.. అంతే చాలు..'' అంటా విశాలాక్షి గారు మా సమాధానం కోసం కూడా చూడకుండా దబదబా వెళ్ళిపోయారు.


* * *


    ఒలవనియి అడుగున వేసి ఒలిచినవి పైన వేసాం.. లారీలో... ఒలిచిన కాయల్లో కొన్ని కుళ్ళి పోతున్నాయి. సుబ్బయ్యశెట్టి నాసిరం సరుకు అంటగట్టినట్టున్నాడు.. ఇప్పుడీ కుళ్ళిన కాయలు తిరిగి తీసుకోడు.. ఎంత నష్టం వచ్చిందో లెక్కలేస్తుంటే.. నాకు భలే అసహనంగా వుంది.. పైగా పుండు మీద కారం చల్లినట్టు.. లారీ బాడుగొకటి .. దండగ..


    ఇంతకీ.. భద్రయ్య.. సీతమ్మలు ఎక్కడికెళ్ళినట్టు.. పొద్దుట్నుంచి కనపడటం లేదు... సంధ్యత్త పెద్దగా ఎవరితో మాట్టాడటం లేదు. ముభావంగా ఉంటోంది. నా వంక చూసి మాత్రం బలవంతంగా నవ్వుతోంది. ఆమె మనసులో మాత్రం అగ్ని పర్వతాలు బద్దలవుతూ వుంటాయని నాకు తెలుసు.


    ''అమ్మా.. వెళ్దామా'' లారీ డ్రైవర్‌ తొందర పడుతున్నాడు.


     భద్రయ్య, సీతమ్మ ఎక్కడికెళ్ళారు..? ష్ష్‌...


    భద్రయ్య...భద్రయ్య గుర్తొచ్చాడు. భద్రయ్యను కొట్టడం పదే పదే గుర్తొస్తోంది. 'భద్రయ్య చేతికింద వాడనేగా చెయ్యి చేసుకున్నాను. మరి.. జరిగినదానికి ఎవరి మీద కొట్లాడాలి? పూజార్లనా.. కమిటీ మెంబర్లనా.. గుడి మీద ఆఫీసర్లనా... వాళ్ళ పై వోళ్ళనా.. ఎవర్నని అంటాం..? ఏమని అంటాం..? ఎవడూ మనముందుకు వచ్చి.. మనకి చెప్పి మాయ చేయడు. అంతా అదృశ్యంగా.. తెరవెనుక.. జరిగిపోతావుంటుంది. అసలు.. ఎవరా తెర వెనుక శత్రువు.. ఎవరా కనిపించని శత్రువు..? ఎక్కడో వుండి చావుదెబ్బతీసే శత్రువుని ఎట్టా ఎదురొడ్డి నిలవడం..? ఆధారం లేని తమలాంటి వాళ్ళు చివరికి చితికి పోవాల్సిందేనా...? జీవిక కోసం దేవులాడాల్సిందేనా..? వ్యవస్థ ఆడే ఆటలో సమిధలుగా మిగిలిపోవాల్సిందేనా..? ఎక్కడో ఏదో తెగిపోతోంది.. మనిషికీ మనిషికీ మధ్య వుండాల్సినదేదో.. అదృశ్యమైపోతోంది..'


    నా మొకంలో ఆందోళన గమనించినట్టు నా భుజం మీద చెయ్యేసింది సంధ్యత్త-'' ''పెద్ద పౌరుషం వున్నదాన్లాగ పిల్లల్ని బయటకు తీసుకొచ్చి, బతికి చూపిస్తానని ప్రగల్భాలు పలికాను కదా.. ఇక్కడన్నా నాలుగు రూపాయలు మిగిల్తే..  నలుగురి ముందు తలెత్తుకొని బతకొచ్చని ఆరాటం రా.. కరుణా.. ప్చ్‌.. ఏం చేస్తాం.. ఇంతకన్నా.. కాకపోతే. మళ్ళీ మొదలు.. మళ్ళీ.. దేవులాట..' అంది మొఖం మీద బాధ కొంకర్లు పోతుండగా నా దగ్గర మాటల్లేవు.


    కొంతసేపటి తర్వాత సంధ్యత్త తన్ను తాను సంభాళించుకొని... కళ్ళల్లో ఏర్పడ్డ నీటి పొర చిరగకుండా వుండటానికి శత ప్రయత్నం చేస్తూ...


    ''ఎందుకొచ్చామో.. సముద్రం మధ్యలోకి వచ్చాం.. పడవకి చిల్లుపడి మునిగిపోతన్నాం.. చిల్లు పూడ్చుకొని ముందుకు పోవాలి గానీ.. మునిగిపోతా అక్కడే వుంటామా..? ముందుకు పోక తప్పదు కదా.. పద''.. అని లారీ ఎక్కి కూర్చుంది


    కడుపులో ఏదో దిగులు కమ్ముకుంటుండగా.. వికలమయిన మనసుతో నేనూ లారీ ఎక్కాను


    లారీ కదిలింది.


     ప్రపంచంతో నిమిత్తం లేనట్టు.. సంధ్యత్త తల పక్కకు వాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది


    ఆమె ముఖం చూస్తుంటే.. జీవితం పట్ల ఇంకా తరగని ఆశేదో.. ఆమె ముఖంలో అదృశ్యంగా వ్యక్తం అవుతున్నట్టుంది


     మిట్ట మధ్యాహ్నం.. ఎండ నిప్పులు చెరుగుతుండగా.. మా కొబ్బరికాయల లారీ చెమటలు కక్కుతా.. మా ఊరి వైపు సాగిపోతా వుంది..


(సాహిత్య ప్రస్థానం మాసపత్రిక అక్టోబర్ 2013 సంచికలో ప్రచురితం)   

Comments