ధనలక్ష్మి - శ్రీరమణ

    
సీతారామాంజనేలు ఎనిమిదో తరగతిలో నా క్లాసుమేటు. ఒకే బెంచిలో కూచునే వాళ్ళం. సిల్కు చొక్కా, సిల్కు పైజామా, వాచీ, రెండు ఉంగరాలూ - బొద్దుగా నిగనిగలాడుతుండే వాడు. పెళపెళలాడే ఇస్త్రీ చొక్కా జేబులో ఎప్పుడూ డబ్బులు గలగలలాడుతూ వుండేవి. వీటికి తోడు ఆకుపచ్చ హంబర్ సైకిలు వుండడం - సెంటు నూనె గమగమలతో సంషేర్‌గా స్కూలుకి వచ్చే సీతారామాంజనేలంటే మా అందరికీ కొంచెం ఈర్ష్యగానే వుండేది. వీటన్నిటి వల్లా సంక్రమించిన దర్జా కాకుండా అసలు పెద్దరికం ఇంకోటి కూడా వుంది అతనికి. అదేంటంటే - ఈశ్వరయ్య అనే ఓ పెద్దాయనకి పిల్లలు లేకపోతే దగ్గర దాయాది పిల్లడని సీతారామాంజనేయుల్ని దత్తు చేసుకున్నారు. ఆయన ఇప్పుడో కాసేపో అనే స్థితిలో వుండి ఇంటి దీపం పెళ్ళి కళ్ళారా చూడాలని తహతహలాడితే దత్తపుత్రుడి పెళ్ళి ధనలక్ష్మితో జరిపించేశారు. అంచేత సీతారామాంజనేలు మా స్కూలు మొత్తం మీద పెళ్ళయిన విద్యార్థి. ధనలక్ష్మి మా బళ్ళోనే మూడో క్లాసు చదువుతుండేది.

    ఈశ్వరయ్య గారొకటి తలిస్తే ఈశ్వరుడు వేరొకటి తలచాడు. ఇప్పుడో కాసేపో అనుకున్న ఈశ్వరయ్య గారు తిప్పుకుని తేరుకుని యధావిధిగా దుకాణంలో కూచుని వ్యాపారం వ్యవహారం చూసుకోవడం మొదలు పెట్టారు. "గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అంటారు - మా సీతారావుడు వచ్చి నాకు ఆయుష్షు పోశాడు" అని పెద్దాయన మురిసిపోయాడు. ఆయన బతికి పోవడం బానేవుంది కాని, అకాల వివాహం రామాంజనేలుకి కొంచెం ఇబ్బందినీ, బోలెడు పెద్దరికాన్నీ తెచ్చి పెట్టింది. అసలే అమిత మితభాషి. పైగా తనని విచిత్రంగా, కొంచెం హేళనగా అంతా చూస్తున్నారనే అనుమానం కొంత. ఎవరూ అతన్ని 'ఏరా' అని పిలిచేవారు కాదు. నాతో కొంచెం చనువుగానే వుండేవాడు. నేను మాత్రం 'ఏవోయ్' అని పిలిచేవాణ్ణి. అతనికి అప్పుడప్పుడు హోంవర్క్ దస్తూరి మార్చి నేను చేసి పెడుతూండేవాణ్ణి. దానికి బదులుగా గ్రౌండులో తన సైకిల్ మీద మూడు నాలుగు రౌండ్లు కొట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడు. ఆకుపచ్చ హంబర్ సైకిలు - పైగా బ్రూక్స్ సీటు, డైనమో, తళతళలాడే నికెల్ స్పోక్స్‌తో కాసేపైనా దాని మీద సవారీ చెయ్యడమంటే నా ప్రాణానికి చిన్న విషయం కాదు.

    ఒకరోజు సైన్స్ క్లాసులో కోడిగుడ్డులో భాగాలు చెప్పమని మాష్టారు అడిగితే "పై పెంకు మరియు కోడిపిల్ల" అన్నాడు రామాంజనేలు. సైన్సాయన రెచ్చిపోయి అతని పెద్దరికాన్ని పక్కన పెట్టి రామాంజనేల్ని బెంచీ ఎక్కించారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు సరిగ్గా అదే సమయానికి ధనలక్ష్మి గల్లుగల్లున గజ్జెల చప్పుడుతో పరుగున వచ్చి రొప్పుతూ రోస్తూ తరగతి గుమ్మంలో నిలబడి "ఇదిగో రామాంజనేలూ, నాకు పెన్సిలు కావాలి..." అని బిగ్గరగా అక్కడి నించే అరిచింది. ఒక్కసారి క్లాసంతా గొల్లుమంది. అసలే బెంచీ మీద అవమాన భారంతో కుంగిపోతున్న రామాంజనేలుకి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఆకుపచ్చ పట్టు లంగా, పట్టు జాకెట్, మెడలో ఎర్ర రాళ్ల నెక్లేసు, కంటి నిండా కాటుక, గట్టిగా అల్లిన ఒంటిజడ, ఎనిమిదేళ్ల ధనలక్ష్మి క్లాసు నవ్విన నవ్వుకి బిత్తరపోయి తత్తరపడి గల్లుగల్లున పారిపోయింది. పాపం! క్లాసు నిశ్శబ్దంగా వుంది. ధనలక్ష్మి గజ్జెల చప్పుడు క్రమంగా దూరమైంది. మాస్టారు కోడిగుడ్డు పాఠం మళ్ళీ అందుకోబోతుంటే - రామాంజనేలు ఆంజనేయుడిలా ఒక్కసారు డెస్క్‌మీంచి కిందికి దూకాడు. రోషం కమ్మేసిన అతని ముఖం తుమ్మల్లో పొద్దుగూకినట్లుంది. చరచరా బయటకు నడిచి, వరండాలో సైకిల్ స్టాండు పెద్ద చప్పుడయేలా తీసి అక్కడే సైకిలెక్కాడు. వెళ్తూ క్లాసు గుమ్మంలో ట్రింగ్ ట్రింగ్‌మని బెల్ కూడా కొట్టాడు.

    అంతటి వెర్రి ధైర్యం జరిగిన అవమానం లోంచి వచ్చిందే గాని పాపం అతను పెద్ద మనిషే! జరిగిందానికి మాస్టారు ఖంగుతిన్నారు. ఏమీ అనలేక "ఒరే వీడి పుస్తకాలు యావత్తూ తెచ్చి స్టాఫ్ రూంలో పెట్టు రాస్కెల్" అని క్లాస్ లీడర్‌కి పురమాయించి తిరిగి కోడిగుడ్డు పాఠంలోకి వెళ్ళిపోయారు.

    ఆ తర్వాత మళ్ళీ సీతారామాంజనేలు స్కూలు పక్కకి రాలేదు. ధనలక్ష్మి కూడా బడి ఆవరణలో మళ్ళీ కనిపించలేదు.

    "ఎటూ కొట్టుమీద నాకూ సొంత మనిషి అవసరమే...కాస్త మంచీ చెడూ, లాభం నష్టం తెలుసుకుంటాడు" అని ఈశ్వరయ్య గారు సరిపెట్టుకున్నారు. ఎప్పుడేనా వాళ్ళ దుకాణానికి వెళితే రామాంజనేలు కనిపించేవాడు. మాటా మంచీ వుండేది కాదు, ఏదో ముక్తసరిగా ఒక చిన్న నవ్వు తప్ప. 

* * *   

    సీతారామాంజనేలు స్కూలు మానెయ్యటం వల్ల అప్పుడప్పుడు హంబర్ సైకిల్ తొక్కే అదృష్టం నాకు పోయింది. పదో తరగతి తర్వాత ఇంటర్‌కి పక్క ఊరు వెళ్ళాలి. అప్పుడు ఎటూ సైకిల్ యోగం పడుతుందని ఆనందపడుతున్న తరుణంలో మా స్కూలుని జూనియర్ కాలేజీ చేశారు. నా చదువుతో పాటు దరిమిలా డిగ్రీ కాలేజి కూడా అయింది. ఇహ జన్మకి సైకిల్ యోగం లేదని అర్థమైపోయింది. అత్తెసరు మార్కులతో ఏదో గట్టెక్కాం అనే లెక్కలో మెల్లిగా డిగ్రీలోకి వచ్చి పడ్డాను.

    అసలు నాకు రామాంజనేలు స్ఫూర్తితో చదువు మానెయ్యాలని కోరిక ఉండేది. అయితే రామాంజనేలు వాళ్ళ నాన్న తీసుకున్నంత తేలిగ్గా మా నాన్న తీసుకోకపోగా "వాళ్ళ కంటే వ్యాపారాలున్నాయ్...మనకేం ఉంది బూడిద...ఎన్టీఆర్ పుణ్యమా అని కరణీకాలు కూడా పోయాయి. అక్షరమ్ముక్క లేకపోతే అడుక్కుతినాల్సిందే" అని ఘాటుగా దీవించాడు. ఒక రోజు ఈశ్వరయ్య గారికి ఈశ్వరుడి ఆజ్ఞ అయింది. ఆయన పోయాక తెలిసిందేమంటే ఎటూ ఎవడో పరాయి వాడికి పోయేదే కదా అని చేరదీసిన గుమాస్తాలు నలుగురూ కలిసి దుకాణం దోచేశారనీ, కరిమింగిన వెలగ పండులా అయిందనీ, ఇవ్వాల్సిన బాకీలకి, రావల్సిన జమలకీ సరికి సరి, హళ్ళికి హళ్ళి, సున్నకి సున్న అయింది. దుకాణం మూతపడింది. ఇరవై ఏళ్ళ సీతారామాంజనేలు, పదిహేడేళ్ల ధనలక్ష్మి మిగిలారు. దత్తపుత్రుడు అవడం వల్ల ఈశ్వరయ్యగారి వంశం మాత్రం మిగిలింది.

    ఒక రోజు సెంటర్లో కనిపించి "మీ కోసమే చూస్తున్నా. ఒకసారి మా ఇంటికి వస్తారా" అన్నాడు రామాంజనేలు - వెళ్ళాను. అంగడి వీధిలో ఇంటిమీద ఇళ్లు - అందులో ఒక చిన్న గది ముందు రేకుల వరండా.

    ఇంట్లో అడుగు పెట్టగానే "ఇదిగో ఆయనొచ్చాడు..." అన్నాడు రామాంజనేలు ముక్తసరిగా. అంతకు ముందు నా గురించి ఏం చెప్పాడో తెలియదు.

    "కూర్చో అన్నయ్యా, నీతో కొంచెం మాట్లాడాలి" లోపల్నించి రేకుల వరండాలోకి వస్తూ అంది ధనలక్ష్మి. ఆ రోజు ఎప్పుడో బుట్టబొమ్మలా వున్న ధనలక్ష్మిని క్లాసు రూం గుమ్మంలో చూడడం తప్ప మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. ఇదే మళ్ళీ చూడడం.

    వయసుకి మించిన పెద్దరికం. మటల్లో ఎంతో పొందిక స్ఫురించింది.

    "మా పరిస్థితి మీకు తెలిసే వుంటుంది. ఉన్నట్టుండి వీధిన పడ్డాం... ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు...మీ ఫ్రెండు సంగతి తెలుసుగా...అదేమన్నా అంటే ఏ కొట్లోనో పొట్లాలు కట్టే ఉద్యోగం చేస్తానంటాడు...నా వల్ల చదువు చెట్టెక్కిందంటాడు. చీమలకి చక్కెర దొరగ్గా లేంది...మనుషులం...మనకి నాలుగు మెతుకులు దొరకవా అని ధైర్యం చెప్పబోతే - ఉన్నదుండగా నాకో గుదిబండని నిన్ను తగిలించారు అని చిరాకు పడతాడు. ఎంత చెడ్డా ఈశ్వరయ్యగారి దత్తుడంటారు గందా"

    "సర్లే. ఆ సోది ఆపి అసలు విషయం చెప్పు" అన్నాడు సూటిగా రామాంజనేలు.

    "ఏం లేదన్నయ్యా! ఇక్కడే వసారాలో పిండి మర పెట్టాలని యోచన చేశాం. ఊళ్ళో ఎక్కడా లేవు కదా గిరాకీ వుంటుందని ఆశ. మిషను పదివేలు అవుతుందన్నారు. నగానట్రా అమ్మితే అంతవరకు వస్తుంది కానీ, కరెంటు సామానుకి మూడు వేలు అవుతుందట. అందుకని మరకి మూడు వేలు తగ్గుతుంది. నువ్వు కాస్త మీ ఫ్రెండుతో బెజవాడ వెళ్ళి కంపెనీ వాళ్ళకి నచ్చజెప్పి తగ్గే మూడు వేలూ వాయిదాల మీద తీసుకునేట్టు ఒప్పించాలి. మీ రామాంజనేలు రెండో ముక్క మాట్లాడితే నాలిక అరిగిపోతుందను కుంటాడు. కాస్త నువ్వు సాయం వెళ్ళి ఈ పని సానుకూలం చేసి పెట్టాలన్నయ్యా..." అడిగింది ధనలక్ష్మి. "ఓ దానికేం భాగ్యం. కంపెనీ వాళ్ళు అంత మాత్రం వాయిదాలు ఇస్తార్లే" అని భరోసా ఇచ్చాను.

    వారం తిరక్కుండానే పిండిమర బిగించారు. ఊళ్ళో పదిమందికీ తెలియడానికి అట్టే రోజులు పట్టలేదు. ఎప్పుడూ ధనలక్ష్మి అక్కడే ఉండి మర నడపడం, ఆపడం, బెల్టులు మార్చడం, కోనులు సరిచెయ్యడం, చిన్న చిన్న మరమ్మత్తులు చేయడంతో సహా అన్నీ నేర్చుకుంది. అప్పుడప్పుడే బస్తీ కళ వస్తున్న ఆ ఊళ్ళో ఏకైక పిండిమర అవడం వల్ల తొందర్లోనే అందుకుంది 'ఆదివారము నాడు అరటి మొలిచింది...సోమవారము నాడు...' అన్న వారాల పాటలాగానే.

    నెల తిరిగేసరికి పిండిమరకి రోజుకి పన్నెండు గంటలు తిరిగేటంత గిరాకీ వచ్చింది. బియ్యం, నూకలు, గోధుమలు, మినుములు, పెసలు పిండికోసం తెచ్చుకునే వాళ్ళు. తర్వాత నెలలో ఇవన్నీ తనే తలొక బస్తా తెప్పించి నిలవబెట్టింది. అక్కడే సరుకు కొనుక్కోవడం, అక్కడే మర ఆడించుకు వెళ్ళడం - జనం ఈ సౌకర్యమూ బాగానే వుందనుకున్నారు. బెజవాడ కంపెనీ వాళ్ళ వాయిదాలు తీరాయి. పసుపు కొమ్ములకి ఇంకో మిషన్ వాళ్ళే బిగించి వెళ్ళారు. ఇపుడు సమస్త పిండి రకాలే కాక, పసుపు కూడా మరపట్టడం మొదలైంది. మరకట్టేసే వేళకి మానిక నిండా చిల్లర వచ్చేది - చిల్లర శ్రీమహాలక్ష్మి అని మురిసిపోయేది - చిల్లర పదేసి రూపాయల వంతు పొట్లాలు కట్టి హోటళ్ళ వాళ్ళకి, ఇతర షాపుల వాళ్ళకి వందకి పది రూపాయల లాభానికి అమ్మేది. పొద్దుటే పిండిమర షెడ్డు ఊడిస్తే సమస్త పిండిరకాలు, పసుపు, రోడ్డు దుమ్మ దువ్వతో కలిసి ఒక సరికొత్త దినుసు చేరేది. అయిదేసి గుప్పిళ్ళు ఒక పొట్లంగా కట్టి, సున్నిపిండి పేరుమీద అమ్మడం ప్రారంభించింది ధనలక్ష్మి. రోజూ ఇరవై పొట్లాల దాకా అయ్యేవి. అమ్మకాలు బాగానే వుండటం చేత కవర్లు చేయించి, దానిమీద వాణిశ్రీ కలర్ ఫోటోతోబాటు - సమస్త వనమూలికలతో తయారైంది. చర్మసౌందర్యానికి తప్పక వాడండి - ధనశ్రీ సున్నిపిండి. వెల ఒక్కరూపాయి మాత్రమే" అని కూడా అచ్చువేయించింది. ఊడ్చిన సరుకుని బట్టి సున్నిపిండి ఆదాయం ఉండేది. ధనలక్ష్మి మళ్ళీ నగానట్రా ఏర్పాటు చేసుకుంది. పెద్దరికం పెరిగింది. కొడుకు పుట్టాడు. ఈశ్వర్ అని పేరుపెట్టుకుంది రామాంజనేలు అంతగా ఇష్టపడక పోయినా. ధనలక్ష్మిని అందరూ ధనమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. పిండిమర ఊళ్ళో ఓ కొండ గుర్తు అయింది. పిండిమర మెలకువలన్నీ ఇప్పుడు ధనమ్మకి కొట్టిన పిండి. 

    "ఎట్లాగూ బియ్యాలూ, అపరాలూ అమ్ముతూనే వున్నాం గందా - కాస్తో కూస్తో పెట్టుబడికి డబ్బుంది - ఉప్పూ చింతపండూ కూడా తెచ్చుకుంటే మళ్ళీ మన కిరాణా వ్యాపారం మన గుమ్మంలోకి వస్తుంది గందా - పిండిమర పుణ్యమా అని మన ఇల్లు సెంటరైపోయింది - ఇంట్లోనే కొట్టు పెడితే వచ్చినంత బేరం వస్తుంది. నీకూ చేతినిండా పని వుంటుంది..." అని సలహా ఇచ్చింది.

    వారం తిరక్కుండా సంచుల్లో, డబ్బాల్లో సరుకు దిగింది. సీతారామాంజనేలు మళ్ళీ ఓ కొట్టువాడయ్యాడు.

    "మనం చిన్నవాళ్ళం - సెంటర్‌లో పెద్ద షాపులవాళ్ళతో పోటీ పడాలంటే ఒకటే చిట్కా - మన దగ్గర సమస్తం దొరుకుతాయని పేరు పడాల. ధనియాలు, దాసించెక్క, గుగ్గిలం, గురిగింజలూ, కరక్కాయలు, కచూరాలు అన్నీ మన కొట్లో ఉండాలి - వాటి వల్ల మన కొట్టుకి పేరొస్తుంది - పేరొస్తే చాలు బేరాలు వాటంతటవే వస్తాయ్..." వ్యాపార సూత్రం చెప్పింది ధనలక్ష్మి. రామాంజనేలు మొదట కొంచెం రోషపడ్డా, సూత్రం అమలు పరచి ధనమ్మ చెప్పింది నిజమేనని నిరూపించాడు.

    రాత్రి పొద్దుపోయాక కొట్టు సర్దుకోవడం, అక్కడే పడుకోవడం - మళ్ళీ పిండిమర చప్పుడుతో వీధి మేల్కొనేది.
   
    సీతారామాంజనేలుకి భాగ్యమూ, దాంతో పాటు బట్టతల క్రమంగా రావడం ఊరంతా గమనించింది.

    నేను బి.ఇడి పూర్తి చేసి శాయంగల విన్నపాలై వున్న వూళ్ళో, చదివిన స్కూల్లో వెయ్యి రూపాయల కన్సాలిడేటెడ్ జీతం మీద ఉద్యోగంలో చేరాను. సొంత ఊరు, సొంత భార్య - కొంతనయం కదా! వద్దంటే వినకుండా ఫిబ్రవరి నెలలో నా పెళ్ళి ముహూర్తం పెట్టారు. అమ్మాయి బి.ఎ.ఫైనలియర్. పరీక్షలు అవనీండి అంటే - అదేం ఫర్వాలేదు పరీక్షలు పరీక్షలే, పెళ్ళి పెళ్ళే అన్నారు పెద్దలూ, సుముహూర్తం నిశ్చయించిన దైవజ్ఞులూ. ఇహనేం, ఏతత్ శుభముహూర్తానికి అందరూ తరలడం, పెళ్ళి అవడం జరిగింది. మూడు నెలల తర్వాత పెళ్లికూతురు పరీక్ష తప్పడమూ, నెల తప్పడమున్నూ కూడా జరిగింది. శుభలేఖల్లో చి.సౌ.శకుంతల - బ్రాకెట్‌లో బి.ఎ.అని ఏ ముహూర్తాన అచ్చు వేశారో, ఆ బ్రాకెట్లు విడకపోగా "...మనమేం ఈ మహానగరంలో ఊళ్ళేలాలా ఉపన్యాసాలివ్వాలా" అని సాగదీస్తూ శకుంతల ఇద్దరు పిల్లల తల్లిగా సెటిలై పోయింది. అద్దె నవలలు, సకుటుంబ వారపత్రికలు చదువుకోవడం, రేడియో వినడం, తిట్టుకుంటూనే టీవీలో సమస్త సీరియల్సు చూడడం శకుంతల వ్యాపకాలు. నా బడి, రాబడి కూడా శకుంతలని గొప్పగా ఆనందపరచలేకపోయాయి. అట్లాగని పెద్ద బాధా లేదు. 

    ఇంటి సరుకంతా నేను రామాంజనేలు షాపులోనే కొనేవాణ్ణి. ధనమ్మ చాలా ఆత్మీయంగా అంతవరకూ జరిగిన కొత్త సంగతులన్నీ అరమరికలు లేకుండా చెప్పేది. ఓ రోజు నే వెళ్ళేసరికి భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడుతున్నారు.

    "నువ్వేదో పెద్ద ఇందిరా గాంధీ అనుకున్నావ్...నోరు కాస్త కట్టెయ్యకపోతే మర్యాద దక్కదు...తెలివి తేటలు మాకూ వున్నాయ్..." రామాంజనేలు అరుపులకి ధనమ్మ బిక్కమొహం వేసుకుంది. నా వైపు చూసి

    "నువ్ చెప్పన్నయ్యా న్యాయం. ప్రతిదానికీ నేను అరుస్తానంట. రోజంతా పిండిమరలో వుంటే గొంతు పెంచి మాట్టాడ్డం అలవాటైంది. అది కూడా అపచారమేనా..." ధనమ్మ సంజాయిషీకి ఏం బదులు చెప్పాలో తెలియక తికమక పడుతుంటే - "మాట మార్చకు... నీకు మొగుడి మీద లక్ష్యం వుంటే రాత్రి అట్టా చేస్తావా..." అని కసిరాడు మళ్ళీ.

    "ఏంటి తప్పు...మంత్రసానితనం ఒప్పుకున్నాక ఏదొచ్చినా పట్టాల...అన్నయ్యా జరిగింది చెబుతా - ఎవరిది తప్పో నువ్ చెప్పు - నిన్న అర్ధరాత్రివేళ నాయుడు గారు సొయంగా వచ్చు తలుపు తట్టి వైద్యానికి శొంఠి కొమ్ము కావాలంటే ఈ మగాడూ కిటికీలోంచి లేదన్నాడు - నేను ఉంది అన్నాను - డబ్బాలన్నీ గాలించి నాయుడుగారికి శొంఠిపిక్క ఇచ్చాను. పదిపైసల బేరానికి కక్కుర్తిపడ్డావని తెల్లార్లూ నన్ను సాధించాడు. పైగా పెద్దాయన దగ్గర ఈయనగారి మాట పోయిందట...మీ ఫ్రెండు పెద్ద తెగోదారు. నేను కక్కుర్తి ముండని..." అంటూ ఎక్కిళ్ళు పెట్టింది ధనమ్మ.

    "అప్పుడేమో గుదిబండ గుదిబండ అన్నాడు...ఇప్పుడు చూస్తే ఈ తీరు..."

    "ఇహ చాల్లే నోర్ముయ్" అన్నాడు మితభాషి.

    నేను ఏ తీర్పు చెప్పలేదు. కానీ మూడోరోజున నాయుడుగారి పచారీ సరుకుల ఖాతా వేరే కొట్లోంచి రామాంజనేలు కొట్లోకి మారింది. రామాంజనేలు కాజా తిన్నాడు. 

* * *

    "సాయంత్రం స్కూలు తర్వాత మన కొట్లో కాస్త కాగితం గట్రా చూసి పెడితే మీకేమైనా ఇబ్బంది అవుతుందా? రోజూ ఓ గంట సేపు..." చాలా వినయంగా అడిగాడు రామాంజనేలు. నేను తటపటాయిస్తుంటే - "మీ పనికి వెలకట్టలేను గానీ, నెలకి మూడువందలు - లేదంటే సరుకుగా పుచ్చుకున్నా సరే" అన్నాడు. వెంటనే ధనమ్మ అందుకుని - "అన్నయ్యా, రొక్కం వద్దు. సరుకే లాయకి. మీ ఇంటి పట్టీ ఎంతైతే అంత...మేం ఇస్తున్నామని మీరు వృథాగా పట్టుకుపోరు కదా...పది రూపాయలు మీకు అదనంగా ముడితే మాకేం తరిగిపోదు - అయినా నువ్వెవరు? మేమెవరు?..." కాదనడానికి వీల్లేకుండా బిగించేసి పార్ట్ టైం ఉద్యోగానికి ఒప్పించారు దంపతులు.

    రోజూ సాయంత్రం స్కూలు నించి సరాసరి షాపుకి వెళ్ళి సరుక్కి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇంకేమైనా చిల్లర రాత పనులుంటే చూసేవాణ్ణి. సరిగ్గా నెల ఒకటో తారీఖున ఇంటి సరుకు మొత్తం, సున్నిపిండి మినహా ఇంటికి చేరేవి.

    అసలే బడిపంతులు ఉద్యోగంతో చిన్నబుచ్చుకున్న శకుంతలకి ఈ చిల్లరకొట్టు గుమాస్తాగిరి బొత్తిగా నచ్చలేదు. కానీ, నాకు మాత్రం డబ్బుల విషయంలో వెసులుబాటు కనిపించింది. ధనమ్మ అన్నట్టు లక్ష మాటలు గుప్పెడు కొర్రలకి సరికావు కదా!

    ఒకరోజు పని ఒత్తిడి వల్ల కొట్లో ఆలస్యం అయితే - ఒక మూర మల్లెపూలు, నాలుగు జిలేబీ చుట్టలు పొట్లం కట్టించి - "ఇంటికి తీసుకెళ్ళు అన్నయ్యా...నీకు చిన్న చిన్న సరదాలు కూడా తెలియవు" అంటూ చిరునవ్వుతో పొట్లాలు నా చేతికి ఇచ్చింది.

    "ఓవర్‌టైంకి ఓదార్పన్న మాట...తెలివంటే మీచెల్లిదే. వ్యాపార మర్మాలన్నీ ఓ పుస్తకం రాయించండి. ఎమ్మే బిజినెస్ మేనేజ్‌మెంట్ వాళ్ళకి టెక్స్టు పుస్తకంగా పెట్టచ్చు..." అన్నది శకుంతల, పొట్లాలు పరిశీలించి.

    ఎప్పుడైనా స్కూలుకి వెళుతూ "ఇవ్వాళ కొంచెం లేటవుతుంది" అని చెబితే - "పిల్లలూ! మీకు జిలేబీ చుట్టలు, నాకు మల్లెపూలు వస్తాయిరోయ్" అని బ్రాకెట్ బి.ఎ.చమత్కరించేది. మా ఆవిడ చమత్కారానికి నవ్వేసేవాణ్ణి. చమత్కారాలకి చింతకాయలు రాలవు కదా. 

* * *

    ధనమ్మ సంకల్పంతో భద్రాచలం యాత్రా స్పెషల్ బస్సు వేశాడు సీతారామాంజనేలు. నలభై మందిని కూడగట్టాడు. మూడోరోజు యాత్ర. భోజనాలతో సహా తలకి వంద రూపూఅయ్లు. ఇద్ద్రు వంటవాళ్ళతో, కావాల్సిన సరుకు, సరంజామాతో బస్సు బయలు దేరింది. మా జంటకి ఫ్రీ టికెట్లు మంజూరైనాయి. "యాత్రా స్థలాల్లో కొబ్బరికాయలు, గిలక్కాయలు వుంటాయి" అని చెప్పి రెండు వందల టెంకాయలు, పసుపు, కుంకుమ పొట్లాలు, అగరుబత్తీలు, కర్పూరం అన్నీ బస్సుమీద వేయించింది ధనమ్మ. కృష్ణ స్నానం, కనకదుర్గమ్మ దర్శనం, గోదావరి స్నానం, రాములవారి దర్శనం పూర్తి చేయించి, మూడోరోజుకి బస్సు ఇంటికి చేరింది.

    ఇక్కడి నించి తీసుకెళ్ళిన సరుకు సంబారాలు, టెంకాయలు అన్నీ ఖాళీ అవడం వల్ల ఆ బరువుకి సరిపడా భద్రాచలం అడవిలో కుంకుళ్లు, సీకాయ, విస్తరాకులు, కొండ చీపుళ్లు బస్సుమీద లోడ్ చేయించాడు రామాంజనేలు. స్వామి కార్యం, స్వకార్యం కూడా పూర్తయింది.

    ఇంటికి చేరాక ఏ లోపం లేకుండా చక్కగా యాత్ర జరిపించినందుకు అంతా సంతోషించారు - మా బి.ఎ."ఈ ట్రిప్పులో చాలా మిగులు - భక్తి సంగతి అట్లా వుంచండి - టెంకాయల అమ్మకాలు, భోజనాలకి కొట్లో సరుకే - ప్లస్ అక్కడ అడవి పంటలన్నీ అణాకానీకి తెచ్చారు కదా...ఇక్కడ బేడా అర్థణాకి అమ్ముతారు. ఈసారి తిరుపతి, శ్రీకాళహస్తి వేయించండి. అక్కడ చింతపండు కారుచౌక!" అంది. కాని అప్పటికే తిరుపతి యాత్ర ఖాయం అయినట్టు మా గుదిబండకి తెలియదు.

    నిత్య వ్యాపార పారాయణలో తగినంత డబ్బు చేరింది. పెద్ద బజార్లో పెద్దషాపు అమ్మకానికి వస్తే కొన్నారు కాని కలిసొచ్చిన చోటు గదా అని కిరాణా కొట్టు వున్న చోటే వుంచాడు. దండిగా చిల్లర కురిపిస్తున్న పిండిమర చప్పుడు వాళ్ళకి కమ్మని సంగీతంలా వీనులవిందు చేస్తోంది. ఆ ఇంటిమీదే గది, దానిమీద ఇంక గది వేశారు. అది వాళ్లకి ఒంటిస్తంభం మేడలాగానూ, చూసే వాళ్ళకి ఫ్యాక్టరీ పొగగొట్టం లాగానూ వుంది.

    సెంటర్లో విశాలమైన షాపు వుండడంతో ఎరువుల ఏజన్సీ యిస్తామని కంపెనీవాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు.

    "మనకెందుకు గొడవ - పైగా బోలెడు పెట్టుబడి" అన్నాడు రామాంజనేలు. 

    "మన దగ్గర రొక్కం వుంది కదా" అంది ధనమ్మ.

    "డబ్బుంటే ఉండదా?"

    "ఉంటది. డబ్బు కూడా పచ్చి సరుకులాంటిదే. ఇంట్లో వుంటే గుండ్రాయి. బయటకెళితే కోడిపెట్ట. ఎరువుల అమ్మకం మీద కమీషన్ ఉంటది. తరుణంలో ఎరువులిచ్చి పంటల్లో రైతుల దగ్గర సరుకు తీసుకుంటాం - సరుకు టోకున వస్తే చిల్లరన అమ్ముతాం. కొట్టుకి అద్దె లేదు. డబ్బుకి వడ్డీ వస్తది..." ధనమ్మ ధోరణికి అడ్డుపడి "ఇహ చాలు...అరటి పండు వొలవద్దు అర్థమయిందిలే" అన్నాడు రామాంజనేలు.

    పెద్ద బజార్లో ఈశ్వర్ ఏజన్సీస్ వెలిసింది. ఏజన్సి వ్యవహారాలు చూసుకోడానికి బెంచీ ఎక్కించిన సైన్స్ మాస్టారుని పెట్టుకున్నాడు. ఆయన రిటైరై బాధ్యతలు మిగిలి వుండడంతో ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారని తెలిసి స్వయంగా పిలిచి పెట్టుకున్నాడు రామాంజనేలు.

    ఎరువుల వ్యాపారం మూడు కాపులు ఆరు పంటలుగా సాగుతోంది. నేను మొత్తం అన్ని వ్యవహారాల్లోనూ ఆంతరంగిక సలహాదారుగా వుండిపోయాను. ఉన్నట్టుండి పెద్ద విపత్తు వచ్చిపడింది. జాతీయ విపత్తు! రాజీవ్ గాంధీ హత్య! దేశం యావత్తూ బావురుమంది. అల్లకల్లోలం అయి ప్రజా జీవనం స్తంభించి పోయింది. రైళ్ళు బళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని చోట్ల దారి తప్పాయి. ఎక్కడా కదలిక లేదు. లూటీలు, దహనకాండలు జరిగాయి. జాతికే కాదు. రైళ్ళకీ, బస్సులకీ గమ్యం అగమ్య గోచరమైంది. సరిగ్గా అదే సమయంలో ఈశ్వర్ ఏజెన్సీస్ వారికి చేరాల్సిన రెండు వ్యాగన్ల యూరియా బెజవాడ జంక్షన్‌లో దారి తప్పాయి. ఆంధ్రా రావల్సినవి బాంద్రా చేరాయి. ఇక్కడ ఎరువుల తరుణం వచ్చిపడింది. సరుకు లేదు. రైల్వే వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే...పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? రెండు వ్యాగన్లూ పొరబాటున వేరే గూడ్సుకి తగిలించేశారట! నేను కంగారు పడుతున్నాను గాని రామాంజనేలు నిమ్మకి నీరెత్తినట్టు వున్నాడు. 

    "ఎంత ప్రాప్తమో అంత - నువ్వు కంగారు పడొద్దన్నయ్యా" అని ధనమ్మ నాకు ధైర్యం చెప్పింది.

    నెల రోజుల తర్వాత వ్యాగన్ల జాడ తెలిసింది. మరో పది రోజులకి భద్రంగా ఆడంగు చేరాయి. అప్పటికి యూరియా ధర రూపాయికి అర్థ పెరగడమూ, ఎక్కడా స్టాకు లేక బ్లాకు మార్కెట్ అమ్మే స్థితి రావడం జరిగింది. సరుకు గోడౌన్ చేరకుండానే ఖర్చయిపోయింది.

    లక్షన్నర మిగిలింది నికరంగా తెలుపూ నలుపూ కలిసి. ఈశ్వర్ ఏజెన్సీస్ లాభాల ఊబిలో కూరుకుపోయింది.

    "కలిసి రావడం మొదలైతే అంతా కలిసి రావడమే..." అన్నాను సంతోషంగా. సీతారామాంజనేలు క్లుప్తంగా నవ్వి ఊరుకున్నాడు.

    "తంతే గారెలబుట్టలో పడ్డట్టయింది..." అంది ధనమ్మ. బొడ్లోంచి బంగారు నగతీస్తూ. "ఇదిగో చూడన్నయ్యా! రొక్కంగా ఇస్తే ఏ పులుసులోనో పడిపోతుంది. మనకింత ఉపకారం చేశారు గందా వాళ్ల రుణం ఎందుకు మనకి - ఆరుకాసులు పెట్టి చేయించా ఈ గొలుసు. ఇదిగో ఆయన గారి అడ్రసు. బెజవాడ రైల్వేస్టేషన్ దగ్గర్లోనే ఇల్లు - ఈ వారం ఆయనకి నైట్ డ్యూటీ. పగలు ఇంట్లోనే వుంటారు. గుట్టుచప్పుడుగా ఆయనకి చేర్చి రావాలి. రామాంజనేలు వెళితే లేనిపోని ఆరాలు...ఎందుకొచ్చిన తంటా..." అంటూ నగ నా చేతికి ఇచ్చింది ధనమ్మ. నాకు సంగతి పూర్తిగా అర్థం కాలేదు. ఆ ఊ అనకుండా నిలబడితే - "ఆ పెద్దాయన తల్చుకోబట్టే గారెల బుట్టలో పడ్డాం..." అంది ధనమ్మ.

    నేను నివ్వెర పోయాను. కాస్త తేరుకుని "ఇంకా నయం. తిరిగి తిరిగి వచ్చేసరికి యూరియా ధర పడిపోతే పుట్టి మునిగేది" అన్నాను.

    "అట్టాంటిది జరిగితే రైలు వాళ్ళ దగ్గర నష్ట పరిహారం లాగవచ్చని హామీ ఇచ్చాకనే..."తర్వాత మాటలేవీ నాకు వినిపించలేదు. నగ అందుకుని -

    "ఏ వేదంబు పఠించె లూత... చెంచేమంత్రం మూహించె...
    చదువులయ్యా కావు... శ్రీకాళహస్తీశ్వరా!"

    ఆ కవిగారికి మనసులోనే నమస్కరించాను.

* * *

    ఊరి మొగలో వున్న అరెకరం స్థలం బేరానికి వచ్చింది. ధనమ్మ కొనాలని ప్రస్తావించింది. "వాళ్ళ పిల్ల పెళ్ళి కుదిరిందట...అవసరానికి అమ్ముతున్నారు... లక్ష చెబుతున్నారు గాని, నాలుగైదు వేలు తక్కువకే ఖరారు చేసుకోవచ్చు... తీసుకుంటే బావుంటది గందా..." అంది.

    రామాంజనేలు రెచ్చిపోయాడు. "...నీకే పొయ్యేకాలం...అది తాడి లోతు గుంట...ఏం చేసుకుంటాం..."

    "పల్లం కాబట్టే అంత మంచి చోట ఆ ధరకి ఇస్తామన్నారు - నే చెప్పేది సవిత్రంగా విను", "నేను వినను, ఆ చెరువు పూడ్చాలంటే మన ఆస్తులన్నీ అమ్మాలి...నిన్ను నిలబెట్టి సమాధి చెయ్యడానికి పనికొస్తది..." అంటూ కొట్టిపారేశాడు.

    మళ్ళీ మళ్ళీ నచ్చ చెప్పింది. మా అందరి చేతా చెప్పించింది. రామాంజనేలు కాస్త మెత్తబడ్డాడు. అయినా డెబ్బై వేలకి మించి ధర పెట్టే ప్రసక్తి లేదన్నాడు. బేరసారాలు జరిగాయి. చివరికి డెబ్బై రెండు వేల రెండొందల యాభైకి రామాంజనేలు సరే అన్నాడు. స్థలం ధనమ్మ పేర బదిలీ అయింది. మంచి చోటు చౌకగా కొన్నాడని ఊళ్ళో అంతా అనుకున్నారు. రామాంజనేలు చాలా ఆనంద పడ్డాడు.

    "మీ రామాంజనేలు నివురుకప్పిన నిప్పు - పైకి తేలడు గాని బుర్రంతా గుజ్జే...మా మగ పురుషుడు మంకుపట్టుతో కూచోబట్టి ఆ ధరకి నిక్షేపం లాంటి స్థలం వచ్చింది. ఆ నిదానం...నిబ్బరం నిమ్మకి నీరెత్తినట్టు కూచున్నాడు. దానివల్ల పాతిక వేలు లాభించింది..." ధనమ్మ నాతో అంటున్న మాటలు గుగ్గిలం పొగలా హాయిగా రామాంజనేలుని ఆవరించాయి. ఆ రోజు అమ్మకాల తాలూకు డబ్బు లెక్కెట్టుకుంటూనే ధనమ్మ మాటలు వోరకంట విని ఆనందపడ్డాడు. ముచ్చట పడ్డాడు. మురిసి పోయాడు. రామాంజనేలు బుగ్గలు ఉల్లిగడ్డలైనాయి.

    చెరువు చెరువుగానే ఉంచి సిమెంట్ స్థంభాలు లేపి కప్పు వేశారు. అది విశాలమైన గోడౌన్ అయింది. ఎరువుల లారీలు సరాసరి గోడౌన్‌లోకి వెళ్ళిపోతాయి. తాడిలోతు గుంటని ఈ విధంగా సద్వినియోగం చేసుకున్న రామాంజనేలుని మెచ్చుకోని వాళ్ళు లేరు.

    "ఊరోళ్ళంతా నీ గురించి చెప్పుకుంటున్నారు...దిష్టి తగుల్తుందో ఏం పాడో..." అని రామాంజనేలుకి నిమ్మకాయ దిగదుడిచింది ధనమ్మ.  

* * *   

    రామాంజనేలు ఎరువ్లూ కొట్టుకి వెళ్లగా చూసి "ఈ మధ్యన మీ ఫ్రెండు మొహం మతాబులా వెలిగిపోతోంది చూశావా అన్నయ్యా" అంది ధనమ్మ. 

    "ఔను మరి స్థలం చౌగ్గా కొన్నాడు. బ్రహ్మాండమైన ఐడియాతో గుంటని గోడౌన్ చేశాడు!" అని నేనంటే ధనమ్మ మొహం చిన్నబుచ్చుకుని - "అన్నయ్యా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. తోడబుట్టిన లాంటి వాడివి కనక చెబుతున్నా. అన్నిట్టో నామాటే నెగ్గుతోందని తెగ ఉక్రోసపడి పోతున్నాడు. పనికట్టుకు కుళ్ళుమాటలు అంటాడు - అన్నీ ఉండి సంసారంలో సుకం లేకపోత ఏంటి లాబం? కాపరం అన్నాక తగ్గూమొగ్గూ వుంటే సర్దుకుపోవాలి గందా...లక్క బంగారం అంటి పెట్టుకు ఉంటేనే తాళిబొట్టు నిండుగా ఉండేది...ఎవరో ఒకరు తగ్గితే పోలా?" - ధనమ్మ మాటలు పొడుపు కథ పొడుస్తున్నట్టుంది గాని నాకేం అర్థం కాలేదు.

    "మనుసులో పెట్టుకో అన్నయ్యా - చిట్టీ పాడి పాతికవేలు స్థలం వాళ్లకి ఇచ్చా...ఎంత అవసరానికి అమ్మితే సలీసుగా ఇస్తారా...ఇదంతా తన తెలివి అని మురిసిపోతున్నాడు...ఆ గుంటలో నన్ను నిలబెట్టి సమాధి చేస్తానన్నాడు మీ ఫ్రెండు...గోడౌను ఆలోచన నాది...కాపరం కోసం ఆ కిరీటం ఆయనకే పెట్టా...తన తెలివిని గురించానని తెగ సంబరపడి పోతున్నాడులే...పదేళ్ళు యెనక్కి వెళ్ళిపోయాడంటే నమ్ము..." అంది ధనమ్మ కొంచెం సిగ్గుపడుతూ.

    ఇంతలో ఈశ్వరబాబు రావడంతో ప్రస్తావన దారి మళ్ళింది.

    "ధనమ్మా, ఓ పది ఇవ్వవే..." అన్నాడు వస్తూనే.

    "ఎందుకురా అస్తమానం పదులూ, పాతికలూ..." అంటూనే ధనమ్మ మానికలోంచి గుప్పెడు చిల్లర తీసి ఎంచబోతుంటే

    "నోటు...నోటు" అన్నాడు ఈశ్వరబాబు చిరాగ్గా.

    కొరకొరా ఒకసారి వాడి వంక చూసి నోటు ఇచ్చి పంపేసింది.

    "అన్నీ అబ్బ గుణాలే... అన్నయ్యా! వీడు ఎనిమిదో కళాసులోకి వచ్చాడు...మీ ఫ్రెండు పోలిక వస్తుందేమోనని దిగులుపడి చస్తున్నా"

    "మా ఫ్రెండు ఏం చేదు మేశాడు... మేమంతా చదివి ఏం సాధించాం"

    "అంత మాట అనకు అన్నయ్యా! మా ఈశ్వరబాబుని గట్టిగా చదివించాలి. ఆళ్ళ నాయన ఉప్పు, చింతపండు అమ్ముకుంటే ఈశ్వరయ్య హాయిగా ఎ,బి,సి,డిలు అమ్ముకుంటాడు. ఈ రోజుల్లో చదువుని మించిన యాపారం ఏముందన్నయ్యా!" అంటూ పింఛం విప్పింది. 

    కాకపోతే అతిగారాబంతో వాళ్ళ నాయన చెడగొడతాడని బయపడి చస్తున్నా. వాడు ఐదడిగితే పదిస్తాడు. పైగా ఉన్న యాపారాలు చూసుకుంటే చాలదా అంటాడు. కూస్తి ముందు చూపు ఉండాలి గందా. మనకి ఊళ్ళో ఎరువుల గోడౌను వుండనే వుండె... కాపోతే పైన ఇంకీ నాలుగు అంతస్తులు వేస్తాం గిరాకీని బట్టి. ఈశ్వరయ్య ఇక్కడుంటే చేతికి రాడు. ఎక్కడైనా మంచి ఇస్కూలు...మీ ఫ్రెండు ససేమిరా కాదంటాడనుకో - ఆడి సంగతి నే చూసుకుంటాగాని ఈడి సంగతి నువ్వు చూడన్నయ్యా..." చాలా గట్టిగా చెప్పింది ధనమ్మ. ఎరక్కపోయి చెప్పానని మనసులో లెంపలేసుకున్నాను.

* * *

    ఆ రోజు పొద్దుట పూట అందరం ఎరువుల షాపులో ఉండగా ఈశ్వరబాబు వచ్చి పాతిక రూపాయలు కావాలన్నాడు.

    "అడిగినంత ఇస్తాగాని ఓరయ్యా బాగా చదువుకో...పైగా ఎనిమిదిలోకి వచ్చావ్. దేవకమ్మ ఎనిమిదో కానుపు కంసుడికి ప్రాణగండం అయినట్టు మన వంశానికి ఎనిమిదో కళాసులో చదువుగండం ఉంది నాయనా - జాగరత..."

    రామాంజనేలు చుర్రున ఒక చూపు చూశాడు. ఈశ్వరయ్యకి వంద రూపాయల నోటు ఇచ్చాడు.

    "అసలెందుకురా డబ్బు" - ధనమ్మ నిలదీసింది.

    "పుస్తకాలు కొనుక్కోవాలి"

    "మీ నాన్న ఎనిమిదో తరగతి బుక్కులు ఇంకా మీ ఇస్కూల్లోనే వున్నాయిరా...పోనీ నీకు పనికొస్తాయేమో..." అంది ధనమ్మ కిలకిల నవ్వుతూ.

    ఈశ్వరబాబు వందనోటు అందుకుని ఆకుపచ్చ హంబర్ సైకిల్ ఎక్కాడు.

    ఎరువుల వ్యవహారం చూస్తున్న మాజీ సైన్స్ మాస్టారు ధనమ్మ మాటలకి వచ్చిన నవ్వు లౌక్యంగా ఆపుకున్నాడు.

    నేను ముఖం తిప్పుకుని దిక్కులు చూస్తూ నిలబడ్డా.

    అంతా విని అందర్నీ గమనిస్తున్న రామాంజనేలు మీసాలు మిరకాయలైనాయి. ముక్కుపుటాలెగిరి పడ్డాయి. ధనమ్మ వంక దెబ్బతిన్న పులిలా చూశాడు.

    కాసేపటికి నిబ్బరించుకున్నాడు. నా దగ్గరికి వచ్చి -

    "ఈశ్వరయ్యని ఎక్కడైనా హాస్టల్ వున్న మంచి స్కూల్లో వేయాలండీ...ఇక్కడ వుంటే ఆడాళ్ళ గారాబానికి గాడిదై పోతాడు...ఎక్కడ బావుంటుందో కాస్త వాకబు చెయ్యండి. ఎంత ఖర్చయినా పర్వాలేదు" అన్నాడు రామాంజనేలు రోషంగా ధాటిగా తిరుగులేని నిర్ణయం తీసుకున్న మగాడిలా.

    ధనలక్ష్మి హమ్మయ్య అనుకుంది తను నెగ్గినందుకు. 

(ఇండియా టుడే -వార్షిక సాహిత్య సంచిక 1995లో ప్రచురితం)
Comments