ధిక్కార స్వరం - పంతుల జోగారావు

    
‘‘ 
య్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు’’ అటెండరు భీముడి గొంతు.

    పట్టించుకోకుండా, పొగరుగా, విసుగ్గా తలెత్తి చూసాడు వామన రావు.

    ‘‘  ఎవడ్రా అయ్య గారు ! ... రాను పొమ్మన్నానని చెప్పు ’’ అరిచి నట్టుగా అన్నాడు వామన రావు. అతని గొంతు లోని తీవ్రతకీ, విసురుకీ ఆ చిన్న ఆఫీసు గదిలోని చిరుద్యోగులందరూ హడలెత్తి పోయేరు. ఒకే సారి అందరి చూపులూ వామన రావు మీద పడ్డాయి. అతని ధైర్యానికి అందరూ చకితులయ్యేరు.  అతని తెగువకి అబ్బుర పడ్డారు. అతని తిరుగుబాటుకి సంతోషంతో తలమునకలయ్యేరు. అంతా మెచ్చుకోలుగా అతని వేపు చూసేరు. అందరూ తనని ఆరాధనా భావంతో చూడడం గమనించి, వామన రావు మనసు పొంగి పోయింది.

       మొత్తం మీద,  ఆ చీకటి గుయ్యారం  లాంటి ఆఫీసు  గదిలో ఒక్కసారిగా ఓ కొత్త వెలుగు పరుచుకున్నట్టయింది.

     ఓ నూతనోత్తేజం అలుముకున్నట్టయింది.  ఆ వెలుగుని వామన రావు పోల్చుకున్నాడు. ఆ ఉత్తేజం వెదజల్లిన కైపుని ఆస్వాదించ గలిగేడు. అతనికిదంతా కొత్తగా ఉంది. అయినా, గమ్మత్తుగానే ఉంది. అతను గర్వించేడు. అతని ఛాతీ పొంగినట్టయింది. అతని పాలి పోయిన పెదాల మీద చిరు నవ్వు మొలకెత్తింది. అతను కాస్సేపు నేలకి బారెడు ఎత్తున విహరించేడు. వామనుడు త్రివిక్రముడైనట్టు భావించేడు. సంతోషించేడు.

    అప్పుడతని మాటలో  – ఝళిపించిన కొరడా కొస వినిపించిన  ఛళ్ మనే శబ్దం చేసే తీవ్రత ఉంది.

    అప్పుడతని మాటలలో  – లాఘవంగా త్రిప్పుతున్న కత్తి పదను ఉంది.

    ఆ మాట అన  గలిగినందుకు  అతని మనసు  దూది పింజెలా  తేలికయింది.

    తరతరాల దుమ్ము వదిలి పోయినట్టయింది.

   ‘‘ మిమ్మల్నే ... అయ్య గారు రమ్మంటున్నారని చెబితే అలా చూస్తారేం ? ...వినపడ లేదా ... అసలే అయ్య గారు కోపంతో శివాలెత్తి పోతున్నారు...’’

    ఇప్పుడిదీ భీముడి గొంతే !

    ఇప్పుడు వాడి గొంతు కర్కశంగానూ, విసుగ్గానూ, దులపరించేదిగానూ ఉంది.

    ఇప్పుడా గొంతు గొంగళి పురుగును గొరక చీపురుతో విదిలించి కొట్టేదిగానూ ఉంది.

   ఊహా లోక విహారం  చాలించి, వామనరావు ఒక్క  సారిగా వాస్తవంలోకి వచ్చేడు.  భయం కర్రిమబ్బులా  అతనిని నిలువెల్లా  ఆవరించింది. గజగజా వణికి  పోయేడు. గొంతు  తడారి పోయింది.  ముఖంలోకి రక్తం  ఎగజిమ్మింది.

    అప్పుడతను కలల  స్వర్గం లోంచి  వైతరణిలోకి  విసిరి వేయబడిన  మహాపాపిలా  ఉన్నాడు. అతని  ముఖంలో ప్రేత  కళలాంటిది చోటు చేసుకుంది. గుల్లలో ముడుచుకు పోయిన  నత్తలా ఉన్నాడు. చక్రంలా చుట్టుకున్న రోకలిబండలా  అసహ్యంగానూ ఉన్నాడు. అంగుష్ఠ మాత్రుడిగా వంగి పోయేడు. క్రుంగి పోయేడు. మొత్తం మీద అతను – పురుగు కన్నా మెరుగ్గా మాత్రం ఏమీ లేడు.

     ‘‘ వ ...వ ... వస్తున్నాను ...’’ నంగి నంగిగా, భయం భయంగా, బెదురు బెదురుగా లేచాడు. అతనంత సేపూ కూర్చున్న పాత కుర్చీ కిర్రుమంది. ‘తెలివి తెచ్చుకోరా, నాయనా ’ అన్నట్టుగా ఓ సారి గిచ్చింది. దానికున్న పాత మేకు తగిలి, అతనికున్న ఆ ఒక్క మంచి చొక్కా కొంత మేరకు ఫర్రుమంది. అతనది పట్టించుకునే స్థితిలో లేడు.

     లేచాడే కానీ, వామనరావుకి  నడవడానికి అతని  శరీరం ఏ మాత్రం  సహకరించడం లేదు. ఎలాగో శక్తినంతా  కూడదీసుకుని,  అయ్యగారి  గది వేపు అడుగులు  వేసాడు. వెళ్తూ వెళ్తూ ఓ సారి గదంతా కలియ చూసేడు. అక్కడెవరూ తనని గమనించడం లేదు. ఫైళ్ళలో తలలు దూర్చి, ఏదో గిలుకుతున్నారు. ఆ పాత కాలపు భవనంలో, ఆ గదిలో – దుమ్ము పేరుకు పోయిన ఫైళ్ళ మీద నుండి , అలమరా అరల్లోంచి , చెమ్మతో నాని పోయిన గోడల్లోంచి  -  విధమైన ముతక వాసన వేస్తోంది. అలవాటు పడిన వాసనే అయినా, అతనికిప్పుడు కడుపులో తిప్పినట్టవుతోంది. తల దిమ్ముగా తయారయింది.

     అటెండరు భీముడితో  నిజంగానే తనా  మాట అన్నాడా  ! అనగలిగేడా … తన స్వర పేటిక నిజంగానే పెకిలిందా? ఆస్య గహ్వరం లోంచి ఆ   మాటలు నిజంగానే వెలువడ్డాయా ...

    కాదనే సంగతి స్ఫురించడానికి అట్టే సేపు పట్ట లేదు.

    తడబడే అడుగులతో  అయ్యగారి  గది సమీపించేడు.

* * * * *                   

      చీకటి చిక్కగా  అలుముకుంది. వీధి  దీపాలు చీకటిని  చిమ్మ లేక,  చతికిల పడి  మిణుకు మిణుకుమంటున్నాయి. దేదీస్యమానంగా వెలిగే దీపాల తోరణాల మధ్య మిరు మిట్లు గొలిపే షాపింగ్ మాల్స్ ని యీదుకుంటూ, చివరికా యిరుకు గొంది లోకి వచ్చి పడ్డాడు వామనరావు. అక్కడికతని యిల్లు ఎంతో దూరంలో లేదు. బికారిలా హీనంగానూ, దగా పడ్డ మనిషిలా దీనంగానూ ఉంటుందది.

       కొంప సమీపిస్తున్నకొద్దీ వామనరావులో అలజడి అధికం కాసాగింది. ఇంట్లో అడుగు పెట్టాలంటే అతనికి భయంగా ఉంది. కొద్ది రోజులుగా అతనొక తీవ్రమయిన సమస్యని ఎదుర్కొంటున్నాడు. పరిష్కారం తెలీదు. కర్తవ్యం బోధ పడదు. దిగులు దిగులుగా ఉంటోంది. భయం భయంగా ఉంటోంది.

      అతని మనసంతా  కలవరంగా ఉంది. దానికి తోడు , యిందాక – గది లోకి పిలిచి అయ్య గారు తిట్టిన తిట్లతో అతని మెదడు శూన్యమైపోయింది. అదేమీ కొత్త కాదు. రోజూ ఉండేదే. చాన్నాళ్ళగా ఆ తిట్లకి అలవాటు పడిపోయేడు. కానీ, ఇవాళ పరిస్థితి వేరుగా ఉంది. మనసు తిరుగు బాటు చేస్తోంది.  ఆ తిరుగుబాటు కార్య రూపం దాల్చడం లేదు. అందుకే అతనెంత తిడుతున్నా భరించేడు. తన మౌనం అయ్య గారిని మరింత గంగ వెర్రులెత్తించింది.  మరి కొన్ని తిట్లు యివాళ తనకి బోనస్ గా లభించేయి. అతని నోటి నుండి రాలిన ఆ తిట్లని పదిలంగా ఏరుకుని, తిరిగి తన సీటు దగ్గరికి వచ్చేడు. అతడిని అప్రమత్తం  చేయడం కోసం – కుర్చీ మరో సారి గిచ్చింది. ‘ దీనమ్మ ’ తొలి సారిగా ఓ తిట్టు అతని నోటి వెంట వచ్చింది. ఆ తర్వాత, ఆఫీసు ముగిసే వరకూ ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూచుని, బయట పడ్డాడు.

       వామనరావు  తన యింటి సందు  దగ్గరికి వచ్చి,  అక్కడి వాతావరణం  చూసి నిశ్చేష్టుడై  పోయేడు. తనుండే వీధిలో ఆ చివరి నుండీ ఈ చివరి వరకూ  దారి మూసుకు పోయి ఉంది. యీ కొస నుండి ఆ కొస వరకూ షామియానాలు వేసారు. టేబిళ్ళూ కుర్చీలూ వేసారు.  అటూ యిటూ వీధిని మూసేస్తూ వాల్ డ్రాప్స్ కట్టేరు.  లోపల ఏదో భోజన కార్యక్రమం జరుగుతున్నట్టుంది.  దాని కోసం ఆ చిన్న సందునంతా మూసేసారు. బ్లాక్ చేసారు. ఆ సందులోకి ఎవరూ ప్రవేశించ కుండా అనధికారికంగా బంద్ చేస్తూ , ఆ సంగతి తెలియడం కోసమా అన్నట్టు వీధికి రెండు చివర్లా రాళ్ళు కూడా పెట్టారు.  అంతా బాగానే ఉంది. యేర్పాట్లు సరిగానే చేసారు... కానీ యిది దారుణం కాదూ ?  ఎవరికీ యీ సంగతి యింత వరకూ పట్టినట్టు లేదు. అక్కడి వరకూ వచ్చి, దారి మూసుకు పోయినట్టు గమనించి ఓ సారి చిన్నగా విసుక్కుని, వెనక్కి తిరిగి మరో దారంట పోతున్నారు...ఎవరయినా, ఇదేం ధర్మమని అడిగిన పాపాన పోలేదు. ఇప్పుడు తను కూడా ఆ యిరుకు సందులో కేవలం నాలుగయిదు యిళ్ళ తర్వాత వచ్చే తన యింటికి చేరుకోవాలంటే చుట్టూ తిరిగి మరో దారంట పోవాల్సిందే...షామియానాకి ఆ చివర ఉంది అతని యిల్లు. వామన రావుకి వొళ్ళు మండి పోతోంది. కోపం కట్టలు తెంచుకు వస్తోంది. షామియానా సందులోంచి ఓ ముఖం కనబడితే అడిగి తెలుసుకున్నాడు. ఎవరిదో దినం జరుగుతోందిట... భోజనాలు పెడుతున్నారు. మరి కాస్సేపటిలో పూర్తయి పోతుందిట... తాము చేసేది కర్మ కాండ కనుక దయతో సర్దుకు పొమ్మని కోరేడు.  చేసేది లేక వామన రావు వెనుతిరిగేడు. ఇంతలో అక్కడేదో గొడవ ప్రారంభమయింది. కేకలు వినిపించాయి. రోడ్డంట పోయే వారిలో ఒకతను వాళ్ళతో గొడవకి దిగినట్టుంది. వామన రావు ఆగి, కతూహలంగా వెనక్కి వచ్చేడు. రాను రాను వారి వివాదం ముదిరింది. ఎవరూ వెనక్కి తగ్గ లేదు. గొడవ ఎక్కువయింది.  వెంటనే అడ్డు తొలిగించి వచ్చీ పోయే వారికి దారి యివ్వాల్సిందే అని అతను పట్టు పట్టేడు. భోజనాలు కాస్సేపటిలో ఎలాగూ పూర్తవుతాయి కనుక – అంత వరకూ అడ్డు తొలిగించేది లేదని వాళ్ళ వాదన...చాలా మంది జనం మూగేరక్కడ. పోలీస్ రిపోర్టు వీళ్ళిస్తామంటే, దిక్కున్న చోట చెప్పుకోమని వాళ్ళంటున్నారు. చూస్తూండగానే అక్కడ నానా బీభత్సంగా తయారయింది. కేకలతో వీధంతా దద్దరిల్లి పోతోంది. వామనరావులో కొంచెం తెగింపులాంటిది వచ్చింది.

        ‘‘ వెధవల్లారా ! … ఈ వీధి మీ అబ్బ గారి సొత్తనుకున్నార్రా ...వీధి మొత్తం బ్లాక్ చేసి పారీసేరు ...పీకెయ్యండి షామియానాలని ... విసిరెయ్యండి కుర్చీలని ... ఎత్తయ్యండి టేబిళ్ళని ...’’ అని అరిచేడు.

         ఆ గోలలో అతని  గొంతెవరికీ  వినపడ లేదు. బహుశా వినపడదనే  భరోసాతోనే అలా  అరిచాడేమో కూడా !   ఏమయితేనేం... వామనరావు జీవితంలో తొలి సారిగా తన గుండె లోని మంటని బహిర్గతం చెయ్య గలిగేడు. అతనికిప్పుడు మనసు తేలిక పడింది.  ఆ గలాటా మధ్య ఎవరూ గమనించకుండా తనా కేక వెయ్యగలిగినందుకు  వామన రావు తనని తనే అభినందించుకున్నాడు.

     వామనరావు  తనలో చెల రేగే భావాలను మాటల రూపంలో వ్యక్త పరచడం బహుశా యిదే తొలిసారి. ఎప్పుడూ ఆ సాహసం చెయ్య లేదు. పిరికి పిరికిగానే గడిపాడు.

     తాగుడికీ, యితర  వ్యసనాలకీ వందలాది  రూపాయలు ఖర్చు  చేసే తండ్రి  – తన చదువు విషయంలో మాత్రం  లేదు పొమ్మంటే మౌనంగా రోదించాడే తప్ప, ఎదురు చెప్ప లేక పోయేడు. స్కూల్లో మేష్టరు తన తప్పు లేక పోయినా చితక బాది నప్పుడు దెబ్బలకి వోర్చుకున్నాడే కానీ యిదేమని అడగ లేక పోయేడు. ఆఫీసులో ఏళ్ళ తరబడి తనని ఒకే సీటుకి పరిమితం చేసినా, కిక్కురుమన లేదు.

     ఓ సారి ఓ  ప్రముఖ రాజకీయ  నాయకుని కాన్వాసుకి  పొరపాటున సైకిలు  మీద వెళ్తూ అడ్డు తగిలితే తనని సెక్యూరిటీ వాడు విసిరి కొట్టేడు. సైకిలుతో సహా వెళ్ళి దూరంగా పొలాల్లో పడ్డాడు. చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలేయి. అప్పుడు కూడా వాడిని మనసులో కూడా తిట్టు కోడానికి అతనికి ధైర్యం చాలింది కాదు...

      వీధిలో పక్కింటాయనా,  పచారీ కొట్టు  వాడూ, ఇంట్లో రిపేరు చెయ్యడానికొచ్చే మెకానిక్కూ, కూరలమ్మే ముసిలావిడా, వీధి ఊడ్చే మనిషీ, ఆఖరికి తమ యింట్లో పని మనిషీ ...వాళ్ళ చూపుడు వేలు తనకి గురి పెట్టి నప్పుడు తల దించుకు పోవడమే తప్ప – తల అడ్డంగా తాటించడం అతనికి తెలీదు...అలాంటి వామన రావు తొలిసారిగా – ఎవరూ గమనించక పోతేనేం గాక !    -  కసి తీరా తిట్ట గలిగేడు ...అదే పది వేలు !

         మరి కాస్సేపటికి గొడవ చల్లారింది. ఆ యింటి వాళ్ళు దిగిరాక తప్పింది కాదు. తక్కిన భోజనాలు సమీపంలోని ఓ యింట్లో పెట్టుకోడానికి ఒప్పుకుని, రోడ్డు మీది అడ్డంకులు తొలిగించేరు. షామియానాలు తీసేసారు. ఈ ప్రజా విజయంలో తన భాగ స్వామ్యాన్ని మననం చేసుకుంటూ వామనరావు యిల్లు చేరాడు.

     ఇంట్లోకి అడుగు  పెడుతూనే వామనరావుని  కొద్ది రోజులుగా  వేధిస్తున్న  కలతలు మళ్ళీ  చుట్టు ముట్టేయి. చుట్టు ముట్టి  కందిరీగల్లా  బాధించ సాగేయి.

    ఇంట్లోకి వెళ్తూనే భార్య ఎక్కడుందా అని చూసేడు. కూతురి కోసం అతని కళ్ళు వెతికేయి. భార్య అతని రాకని గమనించి కూడా పట్టనట్టే ప్రవర్తిస్తోంది. కూతురు ప్రసన్న యింట్లో ఉన్నట్టు లేదు.

     వామనరావు  ఉస్సురంటూ కుర్చీలో  కూల బడ్డాడు.  అతని తల పగిలి  పోతోంది. భార్య  కాఫీ యిచ్చే  జాడ లేదు. ఆ యింట్లో దాదాపు వారం రోజుల నుండీ ఒక భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది.ఏం జరుగుతోందో, ఏం జరగ బోతోందో అంతు చిక్కడం లేదు. ఒక విషాద కరమయిన అనిశ్చితి అందర్నీ వెంటాడి వేదిస్తోంది.

     ప్రసన్న జీవితం  ఎలాంటి మలుపు  తిరగ బోతోంది?  పెళ్ళి కావలసిన  పిల్ల... ఈ చిక్కుల్లోంచి బయట పడగలదా?  అదే అతనిని కలవర పెడుతున్న విషయం. ప్రసన్నకి సుధీర్ తో పరిచయం రెండేళ్ళ నుండీ ఉందన్న విషయం తొలిసారిగా తెలిసినప్పుడు దిగ్ర్భాంతికి లోనయేడు.  ఓ ప్రక్క కోపం వస్తున్నా కూతురిని ఏమీ అనలేక పోయేడు. అతని భార్య మాత్రం యింట్లో పీనుగు లేచినట్టుగా నిత్యం శోకాలు పెడుతూనే ఉంది. ప్రసన్నని కొట్టినంత పని కూడా చేసింది. ప్రసన్న తల్లి తండ్రుల మాటలకి వేటికీ జవాబు చెప్పలేదు.

      రెండేళ్ళ పరిచయాన్ని  ఒక్క మాటలో  కాదన గలిగేడు  సుధీర్.! ఎంత పొగరు ! గొప్పింటి బిడ్డ కావడం వల్ల వచ్చిన తెగువ కాబోలు ! సుధీర్ తండ్రికి ఊళ్ళో  గొప్ప పలుకుబడి ఉంది. ఎన్నో వ్యాపారాలున్నాయి. ఎంతో మంది అధికారులతోనూ, రాజకీయ నాయకుల తోనూ సంబంధాలున్నాయి. తనేం చేసినా చెల్లుతుందనే ధీమా పుష్కలంగా ఉంది. అలాంటి వ్యక్తిని ఎదిరించ బోతోంది ప్రసన్న !! తట్టుకో గలదా ?  ... తట్టుకుని, అతనిని తన దారికి తెచ్చుకో గలదా ? ఈ అల్లరితో దాని బ్రతుకు ఛిద్రం కాదు కదా!  వామనరావుని రాత్రీ పగలూ వేధిస్తున్న ప్రశ్నలివి ...

     ఒక్కో రోజు  – నిద్రలో మెళకువ వచ్చి, తుళ్ళి పడి లేస్తాడు. కూతురు మంచం మీద ఉందో లేదో అని అనుమానంతో లైటువేసి చూస్తాడు. ఏ అఘాయిత్యం తలపెట్ట లేదు కదా అని బెంబేలు పడిపోతాడు...

    ప్రసన్న ఏం  చెయ్యబోతోందో  అతనికి అర్ధం కావడం లేదు. రోజూ ఎక్కడికో వెళ్ళి వస్తోంది. ఎవరెవరినో కలుస్తోంది. ఆమె కోసం ఎవరెవరో వస్తున్నారు.  ఆ వచ్చే వాళ్ళలో స్త్రీలే ఎక్కువ. ఏవేవో చర్చిస్తున్నారు. కాగితాలు రాస్తున్నారు. మంతనాలు జరుపుతున్నారు.

      వామనరావు కిదేమీ అంతు పట్టడం లేదు. అతడిని భయం భల్లూకంలా పట్టుకుని పీడిస్తోంది. పెద్ద వాళ్ళతో వ్యవహారం....కొండతో తన కూతురు ఢీ కొనబోతోందా? ... యీ ఆలోచన రాగానే అతను నిలువునా వణికి పోతున్నాడు. కూతురికి నచ్చ చెప్పాలనుంది. జరిగిందేదో జరిగింది. ఈ ఊరికి దూరంగా ఎక్కడికేనా పోదాం అని ఆమెతో అనాలనుంది.... కూతురి ముఖం లోకి దీనంగా చూస్తాడు. నోటమ్మట మాట పెగలదు... చెప్పాలనుకున్న మాటలు గొంతు లోనే మిగిలి పోతాయి. తండ్రి అవస్థ గమనించి ఓ సారి ప్రసన్నే అంది ;      ‘‘ బెంగ పడకండి నాన్నా! ’’… అని.

     అలాంటి పరిస్థితిలోకూడా ఆమె అంత నిబ్బరంగా ఎలా ఉండ గలుగుతోందో వామనరావుకి అబ్బురమే !

      అతనికి తన  మీద తనకే అసహ్యం  వేస్తోంది. తన  చేత గానితనానికి  తన మీద తనకే  రోత కలుగుతోంది.ఎన్ని  అయిష్టతలనయినా, ఎన్ని అవమానాలనయినా మౌనంగా , పిరికిగా భరించడమే తప్ప – మనసులోని మాట బయట పెట్ట లేని తన అసమర్ధత మీద ఏవగింపు కలుగుతోంది.

      కళ్ళ ముందు  జరుగుతున్న  అన్న్యాయాన్ని  గొంతెత్తి ఖండించాలనుకుంటాడు.  నచ్చని వ్యక్తిలోని  నచ్చని గుణాన్ని  అతని ముఖం  మీదే ఫెడీల్మని  చెప్పెయ్యాలనుకుంటాడు. ఏమీ చెయ్య  లేక ముడుచుకు  పోతాడు – గొంగళి పురుగులాగా ....

    ఇంతకీ ప్రసన్న ఏం చెయ్య బోతోంది? 

 * * * * * 

      మర్నాడే ఆ  ప్రశ్నకి సమాధానం  దొరికింది వామనరావుకి. జవాబు తెలిసిపోయింది. అతను నివ్వెర పోయాడు. ఒక శూన్యం అతని మెదడంతా ఆక్రమించింది.

      సుధీర్ యింటి ముందు తనకి న్యాయం జరగాలని కోరుకుంటూ ప్రసన్న నిరశన వ్రతానికి పూనుకుంది. ఆమెకి మద్దతుగా చుట్టూ చాలామంది చేరారు. క్రమేపీ ఆమెకి న్యాయం జరిగి తీరాల్సిందేననే పోరాటానికి అనుకూల నినాదాలు మిన్నంటుకున్నాయి. అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూస్తూ వామనరావు విస్తు పోయేడు. భార్య కూడా ప్రసన్న ప్రక్కనే కూచుని నినాదాలు చేస్తోంది. అది మరీ ఆశ్చర్యపోయేలా చేసిందతనిని. వామన రావు ఎటూ పాలు పోక అక్కడక్కడే తచ్చాడుతున్నాడు. ఇదంతా చివరికి దేనికి దారి తీస్తుందో అతనికి అర్ధం కావడం లేదు. తన కుటుంబం వీధిని పడిపోయిందనిపించిందతనికి..సుధీర్ కుటుంబంతో తలపడ గలిగే సత్తా తమకుందా ? ప్రసన్నకి చివరికి న్యాయం జరుగుతుందా ?...ఈ ధిక్కార స్వరం మధ్యలోనే మూగబోదు కదా ?  ... అతని ఆలోచనలన్నీ గజి బిజిగా తయారయ్యేయి.  ఆ మధ్యాహ్నానికి  ఆ సంఘటనల తీరు తెన్నులు పూర్తిగా మారి పోయేయి. ప్రసన్న పోరాటం ఓ కొత్త రూపు సంతరించుకుంది. పత్రికల వాళ్ళూ, టీవీల వాళ్ళూ వచ్చి చేరారు. ప్రసన్నతో ఆమె డిమాండ్స్ గురించి, ఆమె చేస్తున్న ఆరోపణల నిజా నిజాల గురించీ అడిగి తెలుసుకుంటున్నారు.... మరి కాస్సేపట్లో దేశ వ్యాప్తంగా ఆమె వినిపిస్తున్న నిరశన గళం వింటారు కాబోలు !  వామనరావుకి ఉత్కంఠగా ఉంది. భయంగా ఉంది.

      ప్రసన్న న్యాయ  పోరాటం రకరకాల  మలుపులు తీసుకుంటోంది. చాలా సేపటి  వరకూ సుధీర్  కుటుంబ సభ్యులు   అసలు స్పందించనే  లేదు.  వాళ్ళ  మీద ఒత్తిడి  అధికం కావడంతో  వారిలో కొంచెం  కదలిక మొదలయింది.  సుధీర్ మొదట్లో  ఆమె గురించీ,  ఆమె నడవడిక  గురించీ కూడా  కొంచెం దురుసుగానూ, నీచంగానూ ఆరోపణలు చెయ్యడానికి ప్రయత్నించేడు. కాని ఆందోళన చేస్తున్న వారి ఆగ్రహానికి జడిసి మాట మార్చేడు. ఆమె తనకి రెండేళ్ళుగా తెలిసినప్పటికీ, ఎప్పుడూ ఆమెని పెళ్ళి చేసుకునే ఉద్దేశం తనకి లేదని వాదించేడు. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకీ తనకీ ఎలాంటి సంబంధం లేదని బుకాయించేడు.

      ప్రసన్న  పోరాటం  మూడో రోజుకి  తీవ్ర రూపం  దాల్చింది. ఈ  మధ్యలో వామనరావుకి కొన్ని  అభ్యర్ధనలు, కొన్ని  వేడికోళ్ళు, కొన్ని  బెదిరింపులూ,  హెచ్చరికలూ  వచ్చేయి.  దాంతో  అతను భయంతో  వణికి పోతున్నాడు..బెదిరి  పోతున్నాడు. పత్రికల  వాళ్ళూ, టీవీల వాళ్ళూ అతనిని గుచ్చి గుచ్చి ఏవో అడుగుతూనే ఉన్నారు. వామనరావు గొంతు పెగలడం లేదు. బిక్క చచ్చి పోయి ఉండి పోయేడు. అతని మౌనాన్ని – ‘‘ఆ తండ్రికి - తన కుమార్తెకు జరిగిన అన్యాయంతో గొంతు మూగ పోయింది...మౌనంగా రోదిస్తున్నారు... ఆ విషాద వేదన గుండెలని జలదరించి వేస్తోంది ...’’ లాంటి కథనాలతో వార్తలు వెలువడ్డాయి. టీవీల్లో లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నారు.

      సుధీర్ తనకి  చేసిన అన్యాయానికి  బలమైన ఆధారాలు  చూపిస్తూ ప్రసన్న  తన వాదనని  గట్టిగా వినిపిస్తోంది.  అతను తన తప్పు  ఒప్పుకుని, తనని  వివాహం చేసుకో వలసిందే అనీ, తనకి పుట్ట బోయే బిడ్డకి తండ్రిగా బాధ్యతలు తీసికో వలసిందేననీ ఆమె పట్టు బడుతోంది. అంత వరకూ తన న్యాయ పోరాటం విరమించే ప్రసక్తే లేదని తెగేసి చెబుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది....

 * * * * *  

    నాలుగో రోజు  ఉదయానికి ఆ పోరాటానికి తెర పడింది. మొత్తానికి ఎలాగయితేనేం, సుధీర్, అతని కుటుంబ సభ్యులు పూర్తిగా తమ పట్టు సడలించుకున్నారు. సుధీర్ తన తప్పు అంగీకరించి, ఆమెని వివాహం చేసుకోడానికి అంగీకరించేడు. ఆ పరిణామంతో అందరి ముఖాల్లోనూ సంతోష రేఖలు వెల్లి విరిసేయి. ఆనందం పట్ట లేక, ఒకరి నొకరు అభినందించుకున్నారు.

     అంత వరకూ నరాలు  తెగే ఉత్కంఠతో  స్థాణువై ఉండి  పోయిన వామన  రావులో చలనం  మొదలయింది.

     ప్రసార మాధ్యమాల  వ్యక్తులు వామన  రావుని చుట్టు  ముట్టి ఉక్కిరి  బిక్కిరి చేసారు. రక రకాల ప్రశ్నలు  సంధించేరు. 

      ‘‘ మీ అమ్మాయి న్యాయ పోరాటం విజయవంతమయింది ... అభినందనలు... సుధీర్ ఆమెను వివాహం చేసుకోడానికి ఒప్పుకున్నాడు కదా, దీనికి మీరెలా స్పందిస్తారు ? ...’’ ఎవరో అడిగేరు.

       ఆ ప్రశ్నకి  వామనరావు  వెంటనే జవాబు  చెప్ప లేదు. అతని ముఖంలో  రకరకాల భావాలు  వ్యక్తమౌతున్నాయి. అతని తలలో  ఏవో నిశితమైన ఆలోచనలు గింగిర్లు తిరుగుతున్నాయి. మనసులో ఘర్షించే ఆలోచనలు క్రమేపీ ఒక నిశ్చితాభిప్రాయంగా రూపు దాల్చడానికి కొన్ని నిముషాలు పట్టిందతనికి. సకాలంలో స్పందించడానికి చిన్నప్పటినుండీ ఎప్పుడూ సహకరించని అతని గొంతు నెమ్మదిగా విడివడింది. ఒక్కొక్క మాటా పేర్చుకుంటూ, అయినా స్ఫుటంగానే అన్నాడు ; ‘‘ ఇంత పెనుగులాట తర్వాత, యింత పోరాటం తర్వాత ... మా ప్రసన్న సాధించిన విజయం నాకు సంతోషాన్ని కలిగించింది ... అయితే ...యిదొక ఆహ్లాదకరమయిన ముగింపుగా మాత్రం నేను భావించడం లేదు ... అనివార్యంగా జరిగే ఈ వివాహంతో ఆమెకి ఓ భర్తా, ఆమెకి పుట్టబోయే బిడ్డకి ఓ తండ్రీ లభిస్తారు ... సుధీర్లో వచ్చిన ఈ మార్పు ఎప్పటికీ స్థిరంగా ఉండాలని ఓ ఆడపిల్ల తండ్రిగా నేను కోరుకుంటున్నాను...అలా కానప్పుడు ...తనకి జరిగిన అన్యాయాన్ని ఇంతలా ప్రతిఘటించగలిగిన  నాబిడ్డ – జీవితంలో ఒంటరి పోరు సాగించ లేని అశక్తురాలు కాదు ! … నాకిప్పుడు సంతోషాన్నీ, కొండంత నిబ్బరాన్నీ కలిగిస్తున్న విషయం యిదే ! … నా జీవితంలో ఎన్నో సందర్భాలలో గొంతు దాటి రాని స్వరం, యివాళ నా బిడ్డ నోట  వినిపించి , నాకెంతో  ఆనందంగానూ, గర్వంగానూ ఉంది ...’’ అన్నాడు. 

                 

(నవ్య  దీపావళి ప్రత్యేక సంచిక – 2009 లో ప్రచురితం.) 

 

   

Comments