ధృతరాష్ట్ర కౌగిలి - ఆచాళ్ల శ్రీనివాసరావు

    ఈ కార్తీకపు ఓ ప్రత్యూషం వేళ... అలసిన శశి అస్తమయ కాంతిలో నిద్రలేచిన పిట్టలు ప్రపంచాన్ని నిద్ర లేపేందుకు సుప్రభాతాన్ని వినిపిస్తున్న వేళ... కళ్ళు తెరిచి, గది కిటికీ గుండా చూపు సారిస్తే... ఆశల ఆకాశంలో ఎక్కడో ఓ ఒంటరి నక్షత్రం - కదిలే కొబ్బరాకు చాటుగా కదిలాడే చందమామ. అప్పుడే రేకు విరుస్తున్న బాల గులాబిపై కురిసే తెలి వెన్నెల, తొలిమంచు, హిమస్నాత పునీత పుష్పమై, తెల్ల గులాబీ పరువంపు ప్రాయంలో కమల వాకిట దిద్దుకున్న ఏ కలల రంగవల్లికలనో పరికిణీ కుచ్చిళ్ళు సర్దుకుంటూ, యింటి ముంగిటి ముగ్గులుగా దిద్దుతున్న ఎదురింటి పదహారణాల తెలుగమ్మాయి - యివే ఈ ఉదయం నాకు కళ్ళు తెరిస్తే కనిపించిన దృశ్యాలు.

    తెల్లారి లేవగానే బిందెడు నీళ్ళ కోసం మున్సిపాలిటీ కుళాయి దగ్గర భగీరథ తపస్సు చేయనవసరం లేకుంటే, పావులీటరు పాల పేకట్టు కోసం క్షీరసాగర మధనమంత  యాతన పడే అవసరమే లేకపోతే ప్రతి ఉదయం యింత సుందరంగానూ, సుమధురంగానూ తెల్లవారుతుంది నాకు.

    రేయి స్వప్నాల జ్ఞాపకాల నీడలింకా తొలగిపోక అనుకుంటా నా పెదవులపై చిరునవ్వు. నాలుగేళ్ళ క్రితం యిరవై ఏళ్ళ వయసులో గుండెలోతుల రేకు విచ్చిన మమతల మల్లెలు -

నల్లని నీ కురులు నాకు నిద్ర ముసుగు కప్పాలి,
నవ్వే నీ కనులు నాకు శుభోదయం పలకాలి.

    అంటే చిరునవ్వు, ఆ చిరునవ్వుకి అర్థం - కులాల ఎల్లల మధ్య సంసారపు గోడలు లేచి భాగాలుగా విడిపోయిన ప్రపంచంలో మన నేస్తం ఎలా కొనసాగుతుందనే ప్రశ్న అని చెప్పకుండానే దూరమయిన 'నేస్తం' గుర్తుకొచ్చి కనుకొనలలో కదలాడిన నీటి బిందువు. హృదంతరాళంలో ఎక్కడో ఏ మూలో నిద్రలేచిన మాస్క్యులేనిటీ, మేల్ ఈగో... వెంటనే ఆ ఒంటరి కన్నీటి బిందువుని తుడిచిపారేసేంతలో...
 
    ...మోపెడ్ శబ్దం వినిపించింది. వెన్వెంటనే అది వీధి గుమ్మం ముందు ఆగడం, నేను తలుపు తీసుకుని వీధిలోకి వెళ్ళడం జరిగాయి. సత్యమూర్తి మోపెడ్ యింజన్ ఆపకుండానే - "శంకర్రావ్ ఏదో హడావుడి చేసాడు. త్వరగా బయల్దేరు" అన్నాడు. త్వరగా బయల్దేరేసాను. అయినా పర్సు జేబులో పెట్టుకోవడం మరచిపోలేదు. అవును మరి కీట్స్ భావుకత్వం కంటే, కీన్స్ ఆర్థిక తత్వానికి ఎక్కువ ప్రాధాన్యత యివ్వాల్సి రావడం కేవలం నా తప్పు కాదు. దారిలో చెప్పాడు సత్యమూర్తి - శంకర్రావ్ ఉరి పోసుకున్నాడనీ, ప్రాణం పోయిందనీను.
 
    సత్యమూర్తి రాకమునుపు రాబోయిన కన్నీటిబొట్టు... కనుకొలకుల నుండి రాలిందనుకున్నాను. ఊహు, వాస్తవాన్ని జీర్ణించుకోలేని మనసు కట్రాటే  అయి జారే కన్నీటి చుక్కని వేదనల వేడి సెగ ఆవిరిగా మార్చేసిందనుకుంటా;  ఓ వేడి నిట్టూర్పు మాత్రం బయటకు వచ్చింది.
 
    చనిపోయిన శంకర్రావ్ స్వంత ఊరు మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో వున్న ఓ చిన్న పల్లె. అయితే మా ఊరి వేంకట రమణమూర్తి గుడిలో కేశ ఖండనశాల నుండి పిల్లల చదువుల కోసం కాన్వెంట్ల వరకూ (రెండింటికీ చేసే ప్రక్రియలో పోలికలు కనిపిస్తాయి నాకు) అన్నీ అందుబాటులో వుంటాయని, కాపరం మాత్రం మా వూళ్ళో పెట్టాడు శంకర్రావ్. శంకర్రావ్ సత్యమూర్తికి దూరపు చుట్టమూ, నాకు దగ్గరి మిత్రుడూను. పల్లెలో అయిదారెకరాల పొలం, మా ఊరి మిల్లులో నెలకి అయిదు వందల రూపాయల గుమాస్తాగిరీ - మూడు గదుల యిల్లూ, ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలూ, యిల్లాలూ శంకర్రావ్ స్వంతం.

    యివేకాక, ఎప్పుడో టీనేజ్‌లో పరిచయం అయి,వయసుతోపాటూ, శంకర్రావ్ దినచర్యలో భాగంగా పెనవేసుకు పోయిన జూదమూ; తాగుడూ, యింకా వ్రాయడానికీ, చెప్పడానికీ ఈ సభ్య ప్రపంచం అంగీకరించని సర్వ సప్త వ్యసనాలూ శంకర్రావ్ (తనవీ అని ప్రకటించుకోకపోయినా) స్వంత ఆస్తులు.

    నిత్యం శంకర్రావ్‌కి అప్పిచ్చే కాబూలీవాలా నుండి, అప్పుడప్పుడు అతన్ని సతాయించే కట్టుకున్నదాని వరకూ శంకర్రావ్‌ని 'చెడ్డ' అని మాత్రం అనలేదు. శంకర్రావ్ భార్య అతని హసనానికి రాణీ అవునో కాదో కానీ అతడు మాత్రం నిశ్చయంగా వ్యసనాలకి బానిసే.

    మధ్యతరగతి కుటుంబీకుల జీవితాల్లాంటి రోడ్డుపై మోపెడ్ ప్రయాణిస్తోంది. మోపెడ్‌పై వున్న మా యిద్దరిలోనూ స్నేహితుడిని కోల్పోయామనే వ్యధ మాటలని కన్నీటిగా మార్చి మౌనాన్ని కోటగా పేర్చింది. మోపెడ్ గమ్యం చేరింది. 

    గుండె పగిలే వ్యధ గొంతు దాటి -

    ఓర్నాయనోయ్! నా తాళి మాయదారి దేముడెత్తుకుపోయాడ్రోయ్ - నాదింక దొంగమొహం అయిపోయింది నాయనోయ్... అనే మాటలుగా మా చెవుల పడింది. ఆ వ్యధా శకలాలు శంకర్రావ్ భార్య పగిలిన గుండెలవని అర్థం చేసుకోవటానికి పాఠకుడు ఈ రచయిత కానవసరం లేదు.

    శవం చుట్టూ వార్త విని చేరుకుంటున్న చుట్టాలూ, స్నేహితులూ - తమ (అప్పు) సంగతేం చేసాడో తెలుసుకోవాలనే ఆతృత (పైకి వెళ్ళగక్కకపోయినా)తో అప్పులవాళ్ళూ, పేకాట ఫ్రెండ్స్, పార్టీ మిత్రులు(రాజకీయం కూడా వ్యసనాలలో ఒకటి కదా!) ఒక్కొక్కరూ ఒక్కోలా... "దిక్కు మాలిన అప్పులు తీరకపోతాయా..." నుండి, "పాపం బిడ్డలు దిక్కు లేనివాళ్ళయి పోయారు..." వరకూ నిట్టూర్పుల వడగాడ్పులు విసురుతుంటే...

    నేనూ, సత్యమూర్తి మిగతా తంతు జరిపించే ప్రయత్నంలో పడ్డాం. నాకెందుకో శ్రీశ్రీ గుర్తుకొచ్చాడు. "అటు చూస్తే అప్పులవాళ్ళూ, యిటు చూస్తే బిడ్డల ఆకలి, ఉరిపోసుకు చనిపోవడమో, సముద్రములో పడిపోవడమో..."

    శంకర్రావ్ చావు 'అతని' సమస్యలని తీర్చివుండవచ్చు. కానీ, యింకా ముప్పయోపడి దాటని భార్య, పదమూడేళ్ళ కూతురూ, పండగకి మొదటిసారిగా ఫుల్‌పేంట్ తొడుక్కోవాలని సంబరపడే యిద్దరు కొడుకులూ... అంతేనా!

    కొడుకు చితికి నిప్పంటించవలసి వచ్చిన తండ్రి, కోడలి బొట్టు చెరిపేయవలసివచ్చిన తల్లి - గుండెలపై పడి రోదిస్తూ గుండెలలో తలదాచుకోవల్సిన చెల్లి -

    ఎవరు వీరి వేదనల వెనక కారకులు? విధా? కాలమా?? శంకర్రావ్‌లోని ఎస్కేపిజమా!? జూదం నుంచీ మద్యం మీదుగా రేసుల వరకూ దేనినీ పూర్తిగా బ్యాన్ చేయలేని ప్రభుత్వ అవకాశవాద విధానాలా??? తెలిసీ తెలియని వయసులో, ఫలితాలు తెలియని వ్యసనాల ధృతరాష్ట్ర కౌగిలికి బలయిపోయి, చివరికి బలవన్మరణపు బలిపీఠానికి జీవితాన్నప్పజెప్పి సభ్యప్రపంచపు సభ్యత్వం కోల్పోయిన శంకర్రావ్ బలహీనతా?? ఏమిటి కారణం???

    కారణం తెలియలేదు కానీ శంకర్రావ్ అంత్యక్రియల తర్వాత యింటికొచ్చేసరికి మరో పదిహేనేళ్ళ కుర్రాడు చేతిలో పేకముక్కలు సర్దుకుంటూ!...

(భారతి సాహిత్య మాసపత్రిక జనవరి 1990 సంచికలో ప్రచురితం)


     
Comments