దింపుడు కళ్ళం - రంగనాథ రామచంద్రరావు,

    ఆ వార్త విని నా గుండెలు బద్దలు కాలేదు. కాళ్ళు వొణకలేదు. కళ్లు తిరగలేదు. కంటనీరు రాలేదు. స్పృహ తప్పలేదు. నా తల మీద ఆకాశం విరిగి పడలేదు. కాళ్ల కింద భూమి కృంగి పోలేదు. అసలు ఎమీ జరిగినట్టు నాకు అనిపించలేదు. వినరానిది ఏదో విన్నట్టు అనిపించలేదు. ఎన్నాళ్ళ నుంచో ఇలాంటి అనిపించలేదు. ఎన్నాళ్ళ నుంచో ఇలాంటి వార్త వినటానికే నా చెవులు సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. చాలా కాలం క్రితమే నాకు తెలిసిన వార్తనే, మళ్ళీ విన్నట్టుగా, ఎవరో నాకు మళ్ళీ చెప్పినట్టుగా అనిపించింది.     ఆ వార్త చెప్పిన డాక్టర్ వేపు, అతడి పక్కనే నాకేదో భారీ నష్టం జరిగిందన్న భావంతో, అనుకంపనతో నా వేపు చూస్తూన్న మా బావ వేపు ఏమీ ఎరగనట్టు నిర్లప్తంగా చూశాను. నా ముఖంలో వాళ్ళు ఆశిస్తున్న లేదా ఎదురుచూస్తున్న ఏదా ఊహించిన భావం కనిపించకపోవటం వల్ల కామోను ముఖాల్లో బాధను, ఇబ్బందిని ఏదో చెప్పలేని జాలిలాంటి భావాన్ని నింపుకుని మరోసారి ఆ విషయాన్ని చెప్పీ చెప్పనట్టు, నత్తినిత్తిగా ఆగిఆగి మెల్లగా నసుగుతూ చెప్పారు. అలా చెప్పి అలాంటి వార్త చెబుతున్నందుకు, చెప్పాల్సి వచ్చినందుకు తమకెంతో బాధగా ఉందన్నట్టు నొచ్చుకుంటూ ముఖాల్ని మరింత వొత్తిడికి గురిచేసి నా వేపు చూశారు.     ఆ ముఖాల్ని చూసి నాకు నవ్వాలనిపించింది. అయితే నవ్వలేదు. ఎలాంటి భావాన్ని ప్రదర్శించని నా ముఖాన్ని చూసి ఇద్దరూ ఓ క్షణం ఆశ్చర్యంతో తెల్లబోయారు. వాళ్ళు చెప్పిన విషయం బహుశా నాకు అర్థం కాలేదేమోనన్న అనుమానంతో ఒకరి ముఖాలొకరు చూసుకుని ఆ వార్తను కాస్త గట్టిగా స్పష్టంగా చెప్పారు. అయితే ఇద్దరూ ఒకే విషయాన్ని ఒకరి తరువాత ఒకరు మొదలు పెట్టి పూర్తి చేయటంతో అది మరింత గందరగోళంగా తయారయింది.     నాకు విషయం అర్థమైందన్నట్టు తలాడించాను. వాస్తవానికి నేను ఆ విషయాన్ని మొదట్లోనే గ్రహించాను. అయితే నేను గ్రహించిన విషయం నిర్ధారణ చేసుకోవడానికే డాక్టరుగారిని తీసుకొచ్చానని బహుశా వాళ్ళిద్దరూ ఊహించి ఉండరు. ఆ కారణంగానే నా ప్రవర్తన వాళ్లకు అసహజంగా కనిపించి ఉండాలి.     అయితే నా ప్రవర్తన సహజమో, అసహజమో, అవసరమో, అనవసరమో నాకే తెలియదు. ఇలాంటి సమయంలో అందరు ఇలాగే ప్రవర్తిస్తారా అంటే అది కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇలాంటి స్థితిని నేను మొదటిసారిగా అనుభవిస్తున్నాను.
    అయితే కథల్లో, నవలల్లో చదివినట్టుగా నాకు ఎలాంటి బాధ కలగలేదు. సినిమాల్లో చూపెట్టినట్టుగా ఎలాంటి దుఃఖం ఉప్పొంగి పోలేదు. నేను గుండెలు బాదుకుని ఏడవలేదు. నేల మీద పడి దొర్లి రోదించలేదు. ఎలాంటి ప్రతిక్రియ చూపకుండా మౌనంగా, నిర్లిప్తంగా ఉండిపోయాను.     డాక్టరుగారు నా వేపు చూశారు. బహుశా నేను విషయాన్ని అర్థం చేసుకుని ధైర్యంగానే ఉన్నానని గ్రహించినట్టున్నారు.     "అమ్మకు ఏదైనా సెడెటివ్ ఇవ్వనా?" డాక్టరుగారు అడిగారు.     "వద్దు డాక్టర్, ఆమె ధైర్యవంతురాలు. సెడెటివ్ ఇవ్వాల్సిన అవసరం లేదు"అన్నాను.     ఇరవై నిమిషాల క్రితం పేషెంట్లతో బిజీగా ఉన్న క్లినిక్ నుంచి ఆయన్ను పిలుచుకుని రావటం నాకు గుర్తే. అందుకనే మళ్ళీ అన్నాను-     "మీకు చాలా ఇబ్బంది కలిగించాను డాక్టర్. పాపం చాలా మంది పేషెంట్లు మీ కోసం ఎదురు చూస్తున్నారనుకుంటాను" అన్నాను క్షమాపణపూర్వకంగా.     "ఆ! ఏం ఫరవాలేదు. ఇది రోజూ ఉన్నదే" అంటూ వెంట వచ్చిన కాంపౌండర్ రసూల్ వైపు తిరిగి, "పేషంట్లను పంపేసి క్లినిక్ మూసేసి వచ్చేయ్" అన్నారు డాక్టరుగారు.     నేను వెంటనే "వద్దు డాక్టర్, మీరొచ్చారు, చూశారు. చేయవలసినదంతా చేశారు. అది మాకు చాలు డాక్టర్. అక్కడ మీకోసం పేషంట్లు ఎదురు చూస్తుంటారు. వాళ్ళకు మీ అవసరం చాలా ఉంటుంది. మీరు వెళ్ళండి" అని అన్నాను.     ఆయన ఆర్తిగా నా వేపు చూశారు. రసూల్ నా అభిప్రాయాన్ని సమర్థిస్తున్నట్టు "పేషంట్లు చాలా మందే ఉన్నారు సార్" అని నసిగాడు.     అతని బాధ అతడిది. పేషంట్లు ఇచ్చే పదో పరకో లేకుండా పోతుందేమోనన్నది అతని బాధ కావచ్చు.     డాక్టరుగారు మళ్ళీ నా వేపు చూశారు. "మీ అన్నయ్యకు కబురు పెట్టాలేమో కదూ?" అని అడిగారు.     "అవును డాక్టర్! తన జన్మస్థలంలోనే దహన సంస్కారాలు జరపాలని, కావేరిలో తన అస్థికలు కలపాలని ఆయన చివరి కోరిక కోరాడు" అన్నాను.     "నేను మీ అన్నయ్యకు ఫోన్ చేసొస్తాను. నెంబరు ఉందా?" అని మా బావ వెంటనే అడిగాడు.     ఉందన్నట్టు తలూపి, జేబులోంచి చిన్ని డైరీ తీసి నెంబరు వెతికి చెప్పాను. బావ నెంబరు నోట్ చేసుకున్నాడు.     స్కూటర్ ఇగ్నిషన్ కీని ఇటూ అటూ తిప్పుతున్న రసూల్‌ను చూడగానే అతడి బాధ అర్థమయింది. మళ్ళీ డాక్టర్‌గారితో అన్నాను "మీరు వెళ్ళండీ డాక్టర్. మీకోసం పేషంట్లు ఎదురు చూస్తుంటారు"     డాక్టర్‌గారు సంకోచంగా నా వేపు చూశారు.     "మీరు సంకోచించకండి డాక్టర్. మీరొచ్చారు. అదే మాకు పదివేలు. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు" అన్నాను.     "నో... నో ఇట్స్ మై డ్యూటీ. మరి బాడీని తీసుకు వెళ్ళాలంటే డెత్ సర్టిఫికెట్ అవసరమవుతుంది. సర్టిఫికెట్ లేకపోతే ప్రయాణంలో లేనిపోని ఇబ్బందులు. నేను సర్టిఫికెట్ రాసి పంపుతాను అన్నారు.     "థాంక్యూ డాక్టర్... థాంక్యూ వెరీమచ్... బాడీని తీసుకెళ్ళటమో, మానటమో, అన్నయ్య ఫోన్ చేస్తే కాని తెలియదు" అన్నాను.     కాంపౌండర్ రసూల్ స్కూటర్ స్టార్ట్ చేశాడు. అదే సమయంలో నీలం రంగు అంబాసిడర్ కారొచ్చి ఆగింది. కారులోంచి రాఘవేంద్రగారు దిగారు. ఆయన కంపెనీలోనే బావ పని చేసేది. ఆయన, బావ కాలేజీలో సహాధ్యాయులు. కారులోంచి దిగిన ఆయన నేరుగా నా దగ్గరికి వచ్చి- "ఐయామ్ వెరీ సారీ, ఎలా జరిగింది" అంది అడిగారు తను ఏదో తప్పు చేసినట్టు; అందుకు నొచ్చుకుంటున్నట్టు మొహం పెట్టి.     అసలే తెల్లగా ఉన్న ఆయన ముఖం విచారాన్ని వ్యక్తీకరించటంతో మరింత పాలిపోయింది.     ఇలాంటి ఫార్మాలిటీస్ పట్ల ఎలాంటి ఆసక్తి లేని నేను నిర్లిప్తంగా ఆయన వేపు చూశాను.     ఆయన డాక్టర్ వేపు, మా బావ వేపు మార్చి మార్చి చూశారు.     "సడన్ కార్డియాక్ అరెస్ట్, అటాక్ వచ్చిన వెంటనే ప్రాణం పోయుండాలి అన్నారు స్కూటర్ ఆపేసిన డాక్టర్‌గారు.     "ఓహ్! హార్ట్ అటాకా! నేనూ అదే అనుకున్నాను. ఎవరైనా రావాలా?" అని అడిగారు.     "అన్నయ్యకు కబురు పెట్టాలి" అన్నాను.     "నేను ఫోన్ చేసి వస్తాను" అంటూ మా బావ కదలబోయాడు.     "నువ్విక్కడ ఉండు. నెంబరిస్తే నేను ఫోన్ చేసి చెబుతాను" అన్నాడు రాఘవేంద్రగారు మా బావతో.     బావ తను నోట్ చేసుకున్న నెంబరు ఆయనకు ఇచ్చారు.     "ఆయన తన శవ సంస్కారం తను పుట్టిన గడ్డపైనే జరగాలని, తన అస్థికలు కావేరీలో కలపాలని చివరి కోరికగా చెప్పారు" అన్నాను.     "అందుకే నేను ప్రయాణంలో ఏ ఇబ్బందులూ కలగకుండా ఉండటానికి డెత్ సర్టిఫికెట్ రాసి పంపుదామని అనుకుంటున్నాను" అన్నారు డాక్టర్.     "మీరు సర్టిఫికెట్ పంపండి డాక్టర్. నేను టాక్సీ అరేంజ్ చేస్తాను" అన్నాను రాఘవేంద్రగారు.     "అలాకాదు. ముందుగా ఫోన్ చేసి తెలుసుకుంటే బాగుంటుంది" అన్నాను వెంటనే.     ముగ్గురూ నా వేపు ప్రశ్నార్థకంగా చూశారు.     "మా అన్నయ్య కుటుంబసమేతంగా మామగారింట్లో ఉన్నాడు. ఇది శుభకార్యం కాదు కదా? చెప్పా చెయ్యకుండా వెళ్ళడానికి. డెడ్‌బాడీని తీసుకెళ్ళడం. మా అన్నయ్యకు అభ్యంతరం లేకపోయినా వాళ్ళ మామయ్యకు అభ్యంతరం ఉండొచ్చుగా" అన్నాను.     "మీ నాన్నగారికి ఆయన స్వయాన బావ అనుకుంటాను..." మాటలు పూర్తి చేయలేక పోయారు రాఘవేంద్రగారు.     "కావచ్చు... అయినా ఇలాంటి సమయాల్లో ఎవరి ప్రతిక్రియ ఎలా ఉంటుందో చేప్పలేం" అన్నాను.     కాస్సేపు అక్కడ మౌనం రాజ్యమేలింది. అసలే చీకటి. ఆ చీకట్లోని మౌనం ఏదో భయాన్ని కలిగిస్తోంది.     మౌనాన్ని ఛేదిస్తూ "సరే! ముందుగా మీ అన్నయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పి అతని అభిప్రాయం తెలుసుకుంటాను." అంటూ బయలుదేరారు.     రాఘవేంద్రగారు ఎక్కిన కారు, డాక్టర్‌గారి స్కూటర్ రెండూ కదిలి రోడ్డూను మింగేస్తూ కళ్ల నుంచి దూరమయ్యాయి.     మా బావ మా యింటి పొరుగునే ఉన్న వాళ్ళింటి వేపు వెళ్ళాడు. నేను మెల్లగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చాను. మధ్య హాల్లో నేల మీద కదలకుండా పడుకుని ఉన్న నాన్న శరీరం. పక్కనే అమ్మ.     ఈ లోకంలో లేని నాన్న.     ఈ లోకంలో లేనట్టున్న అమ్మ.     నా మనస్సు చివుక్కుమంది. నాన్న చావుకు బాధపడని నా మనస్సు, అమ్మ పరిస్థితికి కన్నీరైంది. 'మంచిగానో, చెదుకానో' ఏదో విధంగా ఇంతకాలం తోడుగా ఉన్న ఓ వ్యక్తి ఈవాల్టి నుంచి ఆమెకు లేడు కదా- అని మనస్సంతా దుఃఖంతో నిండిపోయింది. ఆర్తిగా అమ్మ భుజం మీద చేయి వేశాను. అమ్మ తలెత్తి నా వేపు చూసింది. కళ్ళనిండా నీళ్ళు. ప్రపంచంలోని దైన్యం, దుఃఖం ఆమె ముఖంలోనే ఉన్నట్టనిపించాయి.     "ఊరుకోమ్మా!" అన్నాను.     అన్నాననుకున్నాను. అయితే నా నోటి నుంచి ఒక్క మాట బయటకి రాలేదు.     "పెద్దోడికి ఫోన్" అంది.     ఆమె గొంతు మధ్యలోనే పూడుకు పోయింది.     నేను బయటికి వచ్చాను. నాకు దుఃఖం కలిగినా, కలగకపోయినా, నియంత్రణలోనే ఉండగలను. అయితే ఎదుటి వ్యక్తి దుఃఖాన్ని చూడటం నా వల్ల కాదు.     ఇంటి ముందున్న పెద్ద రోడ్డు ఖాళీగా ఉంది. ఎప్పుడూ రద్దీగా, అన్ని రకాల వాహనాలతో బిజీగా ఉండే రోడ్డు సాయంత్రం కాగానే ఖాళీగా బావురుమంటూ ఉంటుంది. ముఖ్యంగా కాలేజి వేళలు దాటితే ఆ రోడ్డు ఖాళీగా, నిరాసక్తంగా పరివర్తనం చెందుతుంది. అదే కాలేజీ వేళలైతే, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలతో, కాలేజీకి చక్కర్లు కొట్టి కులాసాగా తిరిగే కుర్రకారుతో రోడ్డంతా సందడిసందడిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ రోడ్డు మా ఇంటిలా బావురుమంటున్నట్టుగా ఖాళీ ఖాళీగా కనిపించింది.     రోడ్డు వెడల్పు వంద అడుగులు ఉంటుంది.     రోడ్డుకు అటు ప్రక్కన అన్నీ గుడిసెలే.     ఇటు పక్కన అన్నీ బిల్డింగులే.     మధ్యన నల్లతాచులా పొడవైన రోడ్డు     పుట్టుకకు చావుకు మధ్య జీవితంలా...     అయితే ఈ రోడ్డు ఎక్కడ పుట్టి ఎక్కడిదాకా పయనిస్తుందో తెలుసుకోవచ్చు. కానీ జీవితం?ప్చ్! చెప్పలేం, ఊహించలేం. అది తన దారిన తాను ప్రారంభమై, సాగి, మలుపులు తిరుగుతూ, మున్ముందుకు సాగుతూ, వెనక్కు తూలుతూ, పడుతూ,లేస్తూ, గుట్టలు ఎక్కుతూ, లోయల్లోకి జారుతూ ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఓసారి హఠాత్తుగా ఏ కొండ చెరియ విరిగిపడి ఆ దారి అక్కడితో అంతమైనట్టు జీవితం ముగిసిపోతుంది- 'ఎవరూ ఎన్నటికీ తమ ముగింపును ఊహించలేరు. తెలుసుకోలేరు' అన్న ధీమాను ధీమాగా ప్రదర్శిస్తూ.     నా ఆలోచనలను చెదరగొడుతూ బావగొంతు వినిపించింది -"రా! కాస్త కాఫీ తాగుదువు" అంటూ.     "వద్దులే" అన్నాను.     ఆ వద్దనటంలో కాఫీ వద్దనటం కంటే; కాఫీ కోసం అక్కడికి వెళ్ళడంలో ఉన్న ఇబ్బందిని గుర్తుకు తెచ్చుకుంటూ.     "ఫరవాలేదు రా!" - అంటూ బలవంతంగా నన్ను అక్కడ్నుంచి కదిలించాడు.     'తప్పనిసరి' అన్నట్టు అతడి వెనకే అడుగులు వేశాను.     నా అడుగులు ముందుకు పడుతున్నా, మనస్సు మాత్రం వెనక్కి అడుగులు వేస్తోంది. అందుకు కారణం నా భార్య తల్లి. అంటే మా అత్తగారన్న మాట! కొన్ని విషయాల్లో ఆమెకు ఉన్న పట్టింపులు తలుచుకుంటే భయం వేస్తుంది. ఎవరికైనా 'చావు మైల' ఉంటే; వాళ్ళని ఇంట్లోకి రానివ్వటంలో మా అత్తగారి ప్రవర్తన ఎలా ఉంటుందో నాకు తెలియంది కాదు. ఎదుటి వ్యక్తి బాధ పడతాడనే సంకోచం లవలేశమైనా ఆమెకు ఉండదు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పేస్తుందామె. అందుకే నాకు భయం. జంకు. సంకోచం.     ఇప్పుడు నేనూ 'చావు చొచ్చిన' ఇంటికి చెందినవాడిని. 'చావు మైల' నన్నూ పట్టుకుని ఉంది కదా! అలాంటప్పుడూ ఇలాంటి సమయంలో వాళ్ళింట్లో, ఎంత అత్తవారి ఇల్లయినా నేను కాలు పెట్టడం భావ్యమేనా? ఆమెకు ఎంత మాత్రం ఇష్టం ఉండదని తెలిసీ. బహుశా ఆమెకు అయిష్టం కంటే భయమే ఎక్కువుండొచ్చు. 'భయం' మనిషిని ఎంతైనా భయపెడుతుంది కదా! అయితే బావను నొప్పించలేక అతనితోపాటు ఇంట్లో కాలు పెట్టాను.     హాల్లోకి రాగానే నా భార్య, అత్తయ్య కనిపించారు. నా భార్య కళ్ళల్లో కన్నీళ్ళు. బహుశా నేను పితృవియోగం వల్ల బాధపడుతూ ఉండొచ్చని భావించటం వల్ల ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చిండొచ్చు. ట్యూబెక్టమీ చేయించుకున్న ఆమె ఆ సమయంలో ముందుకు వచ్చి నా భుజం మీద చేయి వేసి ఓదార్చలేకపోయింది. అయితే ఆమె ఓదార్చవలసిన స్థితిలో నేనూ లేను. అయినా అలాంటి సమయంలో మనిషి ఎదుటి వ్యక్తి నుండి సానుభూతి ఆశిస్తాడనుకుంటాను. మా అత్తగారు కాఫీ తేవటానికి వెళ్ళారు.     "కూర్చో" అన్నాడు బావ.     నేను నేల మీద కూర్చోబోయాను.     "అరే! నేల మీదెందుకు? మంచం మీద కూర్చో" అన్నాడతను.     నేను కూర్చోలేదు. అలా కూర్చుంటే ఆ మంచం మీది గుడ్డలన్నీ మైలపడిపోతాయని నాకు తెలుసు కదా. మళ్ళీ వాటిని శుద్ధి చేసే కార్యక్రమం వారికి కల్పించటం నాకు ఇష్టం లేక మౌనంగా నేలపై కూర్చున్నాను.     "అన్నవాహికలో ఏదో గడ్డ అడ్డంగా పెరుగుతూ ఉందట. పదిహేను రోజుల క్రితం ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళారు. అప్పుడక్కడ ఏదో టెస్ట్ చేయించుకున్నారట. అయితే ఆ విష్యాలేవీ ఆయన ఇక్కడకు వచ్చాక చెప్పలేదు. అన్నయ్య కూడా ఫోను చేసి ఏమీ చెప్పలేదు. ఇప్పుడూ డాక్టర్‌గారు ఆ రిపోర్టులు చూసి చెప్పారు. అంతే కాకుండా 'సడెన్ కార్డియాక్ అరెస్ట్' కారణంగా గుండెనొప్పి వచ్చి క్షణాల్లో పోయారు" అన్నాను.     నాన్న నా చేతుల్లో ప్రాణాలు వదలటం నాకు గుర్తొచ్చింది. ఆయన కొద్ది క్షణాలు నా చేతుల్లో విలవిల్లాడటం, మరుక్షణం గొంతులో ఏదో గురగురమనటం, ఆ తరువాత ఏదో వాయువు శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు శబ్దం రావటం, ఆ తరువాత ఆయన నా చేతుల్లో వాలిపోవటం ఒకదాని వెంబడి ఒకటి జరిగిపోయాయి. ఆయన కళ్ళు తేలవేయడం చూసి నాకు అప్పుడే అర్థమైపోయింది. ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని. అయినా డాక్టర్ను పిలుచుకొచ్చాను. శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు కదా!          నా ఆలోచనల గొలుసును తుంచేస్తూ మా అత్తగారు కాఫీ తెచ్చి నా ముందుంచారు.     కాఫీ అందుకుని సిప్ చేయసాగాను.     "ఆపరేషన్ చేసి ఉంటే బ్రతికి ఉండేవారేమో?" అంది నా భార్య.     "ఏమో?" అన్నాను.     అందరూ 'అయ్యో' అన్నట్టు నా వేపు చూశారు. నాకు కంపరంగా అనిపించింది. ఎదుటి వ్యక్తి జాలిని చిన్నప్పటి నుంచే నేను భరించేవాడిని కాదు. వేడివేడి కాఫీని గడగడా తాగి లేచాను.     "నేను రానా?" అని నా భార్య అడిగింది.     "ఎలా వెళతావు? అసలే ఆపరేషన్ అయిన మనిషివి. వెళ్ళొచ్చాక స్నానం ఎలా చేస్తావు?" అని మా అత్తగారు వెంటనే అన్నారు.     "వద్దు" అన్నాను గబుక్కున.     మా బావ వాళ్ళమ్మ వేపు గుర్రుగా చూశాడు. నా భార్య ఏం చేయాలో తోచనట్టు ముఖం పెట్టి నా వేపు చూసింది.     "మీ అమ్మ అన్నది నిజమే. అసలే ఆపరేషన్ అయిన మనిషివి. నీళ్ళు తగలకూడదని డాక్టర్ చెప్పారు కదా! వద్దు. రావద్దు" అన్నాను.     మళ్ళీ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా బయటికి వచ్చాను. నా వెనకే మా బావ వచ్చాడు.     పక్కపక్కనే ఉన్న ఇళ్ళు మావి.     మా ఇంటి వేపు అడుగులు వేస్తుండగా రాఘవేంద్రరావు పంపిన వ్యక్తి వచ్చాడు.బెంగళూరుకు ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడారట. విషయం చెప్పారట. నాన్న చివరి కోరిక కూడా చెప్పారట. అన్నయ్య పిల్లనిచ్చిన మామగారితో సంప్రదించి ఏ విషయమూ గంటలో తెలియజేస్తానని అన్నాడట. కబురు తెచ్చిన వ్యక్తి విషయమంతా చెప్పి వెళ్ళిపోయాడు.     నా మనస్సు బాధగా మూల్గింది. అన్నయ్య నుంచి ఇలాంటి సమాధానం వస్తుందనే నా మనస్సు అనుమానించింది. అందుకనే ఫోన్ చేయకుండా నాన్న శవాన్ని తీసుకెళ్ళటానికి ధైర్యం చేయలేక పోయాను. అన్నయ్య ఈ రోజు ఏ మామ దగ్గరున్నాడో; అలా ఉండగలగడానికి అవకాశం కల్పించింది నాన్న కాదూ? ఆయన చెల్లెలి కూతుర్ని అన్నయ్యకు చేసుకోవటం వల్లే కదా వీడికి ఈ స్థితి కలిగింది. తన ఈ స్థితికి కారకుడైన వ్యక్తి కోరిన చివరి కోరిక తీర్చటానికి ఇతగాడికి మామగారి అనుమతి కావాలా? గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులో ఉన్న వ్యక్తి, ఇద్దరు బిడ్డల తండ్రి అయిన వీడికి తండ్రి కోరిక తీర్చటం నిజంగా సాధ్యంకాదా? తండ్రి చివరి కోరిక తీర్చటం అంత కష్టమా? నాకు అర్థం కాలేదు.     ఇంటి ముందు గుమ్మంలో కూచున్నాను. నా పక్కన బావ కూర్చున్నాడు. లోపల...     నేల మీద నాన్న చిర నిద్రలో పడుకునే ఉన్నారు.     నాన్న తల దగ్గర దీపం వెలుగుతునే ఉంది.     నాన్న పక్కనే అమ్మ కూర్చునే ఉంది.     ఆమె కళ్ళల్లోంచి కన్నీరు వర్షిస్తూనే ఉంది.     ఆ కళ్ళు నాకు తెలిసినంతవరకు, నాకు గుర్తున్నంతవరకు, నా చిన్నప్పటి నుంచి అలా వర్షిస్తూనే ఉన్నాయి. ఇరవై నాలుగు గంటల పాటు నేను ఏనాడూ వాటిని పొడిగా చూడలేదు.     అవును! నేను మొట్టమొదటిసారిగా అమ్మ కన్నీళ్ళు ఎప్పుడు చూశాను? బహుశా అమ్మ నన్ను ఈ లోకంలోకి తెచ్చినపుడు, ప్రసవ వేదనతో కంట తడి పెట్టి ఉండొచ్చు. అయితే నేను అప్పుడు మరీ చిన్న పిల్లవాడినిగా! కాబట్టి ఆ కన్నీళ్ళు నాకు తెలియనివి. నాకు ఊహ తెలిసిన తరువాత అమ్మ కంట తడి పెట్టింది నాన్న కొట్టినప్పుడు. అమ్మతో పాటు అన్ననూ కొట్టినప్పుడు. 'ఏమే! నేను ఎక్కడుంటే అక్కడికి వీణ్ణి పంపుతావా? నేను పెద్దపెద్ద వాళ్ళతో ఆనందంగా ఉండటం నీకు కష్టంగా ఉన్నట్టుంది' అంటూ నాన్న అమ్మ జుత్తు పట్టి వంచి వీపు మీద దభీదభీమని పిడిగుద్దులు గుద్దినపుడు నేను భయంతో ఉచ్చపోసుకోవడం నాకిప్పటికీ జ్ఞాపకమే.     అప్పుడు 'ఇంకోసారి అక్కడికి పంపితే చంపేస్తాను' అని నాన్న విసురుగా వెళ్ళిపోయాడు.     అమ్మ నేల మీద బోర్లా పడుకుని కొంగులో ముఖం దాచుకుని ఏడ్వసాగింది. అన్నయ్య ఓ మూల నుంచోని ఏడుస్తున్నాడు. నేను మెల్లగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పక్కన కూర్చుని అమ్మ భుజం పట్టి ఊపుతూ 'అమ్మా, ఏడ్వకమ్మా, ఏడ్వకు' అని ఏడుస్తూ అనటం కళ్ళ ముందు కదిలి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.     పళ్ళు బిగించి, గుటకవేసి, దుఃఖాన్ని దిగమింగి కన్నీళ్ళను కనురెప్పల తోటే అణచి వేశాను. అలా అణచివేసుకుంటూ పక్కకు చూశాను. పక్కనే కూర్చున్న మా బావ విచారంగా ముఖం పెట్టి "నా పెళ్ళి చూడాలని ఉందని చాలా సార్లు అన్నారు. ఆయన కోరికను తీర్చలేక పోయాను" అన్నాడు. కొద్ది క్షణాలాగి మళ్ళీ "మీ నాన్నది చాలా సున్నితమైన మనస్తత్వం" అన్నాడు.     నాకు నవ్వాలనిపించింది. అయితే నవ్వలేదు. నాన్నది సున్నితమైన మనస్తత్వమా? ఆయనదెంత సున్నితమైన మనస్తత్వమో నాకు తెలియదా? ఒకసారి...     ... ఒకసారి ఆడుకోవటానికి బయటికి వెళ్ళిన నేను, అన్నయ్య తిరిగొచ్చేసరికి అమ్మా నాన్న పోట్లాడుకుంటున్నారు. మేమిద్దరం తలుపుల దగ్గరే బిక్కమొహాలు వేసుకుని నుంచుండిపోయాం. అమ్మ ఆరోజు చౌక దుకాణం నుండి తెచ్చిన ఐదు కేజీల బియ్యం ఉన్న సంచీని గట్టిగా పట్టుకుని లాగుతున్నాడు.     "వద్దు, ఇంట్లో గింజలే లేవు. ఇది కూడా తీసుకుని పోతే పిల్లలు ఆకలికి మాడి చస్తారు. వద్దు..." అంటూ కన్నీళ్ళు పెడుతూ రుద్ద స్వరంతో అంటోంది.     "వొదులుతావా? లేదా? ఒక్క రోజు తిండి లేకపోతే ఈ గాడిదలు చావరులే" అంటూ అమ్మ పట్టుకున్న సంచిని పట్టి లాగాడు.అమ్మ గట్టిగా సంచిని పట్టుకుని ఉండటం చూసి అమ్మను కాలితో గట్టిగా తన్నాడు.     అమ్మ చేతిలోంచి సంచి జారిపడింది. ఆమె దూది మూటలా వెళ్ళి దూరంగా పడింది. కింద పడిన సంచిని తీసుకుని, "దొంగ ముండా! నాకే ఎదురు చెబుతుందా?" అని గొణుక్కుంటూ బటికి వెళ్ళిపోయాడు.     అమ్మ కొంగులో ముఖం దాచుకుని ఏడ్వసాగింది. "అమ్మా ఏడ్వకమ్మా" అంటూ నేనూ, అన్నయ్య అమ్మ దగ్గరికి పరుగెత్తాం.     "నా కడుపున ఎందుకు పుట్టార్రా మీరు? మీ నాన్న ఇంట్లో ఉన్న బియ్యం కూడా తీసుకుపోయార్రా. ఏ గుర్రప్ప అంగట్లోనో వాటిని అమ్మి దాంతో పేకాట ఆడతాడ్రా' అంటూ ఏడ్వసాగింది.     "వద్దమ్మా, వద్దమ్మా... ఏడ్వకమ్మా" అని మేమిద్దరం అప్పుడు అంతటం గుర్తొచ్చి బాధతో గుండె గొంతులోకి వచ్చినట్టయ్యింది.     ఇలాంటి నాన్నని బావ చాలా సున్నితమైన వాడంటున్నాడు. బయటికి కనిపించే మనిషికి, అతని 'లోపలి మనిషికి' ఎంత తేడా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఎవరైనా ఫలానా వ్యక్తి గురించి తమకు బాగా తెలుసనో, అతడినికానీ, ఆమెనుకానీ తను బాగా అర్థం చేసుకున్నాడని అనటం, నేను వినటం తటస్థిస్తే మనస్సులోనే నవ్వుకునే వాడిని.ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరినీ నూటికినూరుపాళ్ళు అర్థం చేసుకోవటంకానీ, అంచనా వేయటంకానీ సాధ్యం కాదు. అది భార్యాభర్తల విషయంలోనైనా కానీ, తల్లీపిల్లల విషయంలోనైనా కానీ. ఒకవేళ అర్థం చేసుకున్నామని అనుకుంటే అది కేవలం భ్రమ! ఒట్టి భ్రమ!!     ఇరుగు,పొరుగు వారొచ్చి గుమ్మంలో నిలబడి క్కాస్సేపు నేల మీద చిర నిద్రలో ఉన్న నాన్నను, నాన్న పక్కన ఉన్న అమ్మను మౌనంగా నుంచోని చూసి విచారాన్ని వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. కొందరు నా దగ్గరకు వచ్చి సంతాపాన్ని తెలియజేసి వెళ్ళారు. నేను మౌనంగా, నిర్లిప్తంగా జరుగుతున్నదంతా చూస్తున్నాను.     రోడ్డుకు అటువేపున్న గుడిసెలో ఉంటున్న రంగమ్మ రోజూ వచ్చి అమ్మతో కబుర్లు చెప్పేది. ఆమె వచ్చి "రాత్రంతా అమ్మ దగ్గర ఎవరైనా తోడుగా ఉండటానికి పిలుచుకురానా?" అని అడిగింది.     'అలాగే'అన్నట్టు తలూపాను. ఈ సమయంలో అమ్మ ఉండాల్సింది మా కష్ట సుఖాల్లో పాలుపంచుకోవలసిన బంధువులు, ఆత్మీయులు... కానీ ఎక్కడున్నారు బంధువులు? ఎవరున్నారు ఆత్మీయులు?     నా ఆలోచనలకు అంతరాయంగా బావ కంఠం వినిపించింది.     "పాపను అమ్మ దగ్గర కూర్చోబెడదామా?" అన్నాడు.     "వద్దు, ఆపరేషన్ అయిన మనిషి..." అన్నాను.     మళ్ళీ మా మధ్య మౌనం నెలకొంది.     ఎవరి ఆలోచనల్లో వాళ్ళం మునిగిపోయాం. బహుశా నేను మౌనంగా ఉండతం చూసి మా బావ నన్ను పలకరించటానికి ప్రయత్నించలేదనుకుంటాను.     నా మనస్సు అమ్మ చుట్టూ, నాన్న చుట్టూ, బెంగళూరులో ఉన్న అన్నయ్య చుట్టూ, అతని బంధువుల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇప్పుడూ అన్నయ్య ఏం చేయబోతున్నాడనే ప్రశ్న నన్ను పురుగులా తొలుస్తూ ఉంది.     రాత్రి మెల్లమెల్లగా కరిగిపోతోంది.     రాఘవేంద్రగారి కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. నేను, బావ లేచి కారు దగ్గరికి వెళ్ళాం. ఆయన కారు దిగొచ్చారు. నేను ప్రశ్నార్థకంగా ఆయన వేపు చూశాను.     "మీ అన్నయ్య కోసం మళ్ళీ ఫోను చేశాను. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. మీ బ్రదర్‌వాళ్ళు కార్లో బయలుదేరారట" అన్నారు.     నాకు మళ్ళీ నవ్వాలనిపించింది. అయితే నవ్వలేదు.    మనిషి మనస్తత్త్వాన్ని తలచుకుంటున్న కొద్దీ అసహ్యం వేయసాగింది. గంటలో ఏ విషయమూ చెబుతానన్న మనిషి, ఏమీ చెప్పక అలా బయలుదేరాడంటే దాని అర్థం ఏమిటి? చచ్చిన మనిషి చివరి కోరిక తీర్చడం అతడికి కష్టమయ్యిందా? చచ్చిన మనిషి వలు, లక్షలు కోరాడా? స్వర్గాన్ని తెచ్చి తన ముందు ఉంచమన్నాడా? ఒకవేళ నాన్న శవానికి అక్కడ దహన సంస్కారాలు చేయడానికి కుదరకపోతే అదే విషయాన్ని ఫోన్లో చెప్పాక, తాను బయలుదేరొచ్చు కదా! బాధ్యతల నుంచి తప్పించుకునే మనస్తత్త్వం. మొదటి నుంచీ అంతే. నాన్నదీ అలాంటి మనస్తత్త్వమే. స్వసుఖమే వాళ్ళుకి ముఖ్యం. అంతే! నాన్నకు అసలు బాధ్యత అనే 'పదం' బహుశా తెలీదేమో?     "అమౌంటు ఏమైనా కావాలా?" అన్నారు రాఘవేంద్రగారు.     ఆలోచనల్నుంచి బయటికి వస్తూ "అక్కర్లేదు సార్! థ్యాంక్స్" అన్నాను.     "మొహమాట పడకండి. అవసరమైతే కబురు చేయండి" అన్నారాయన.     "మొహమాటమేముంది సార్. అవసరమైతే తప్పకుండా అడుగుతాను. అయినా ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాం" అన్నాను.     "నో... నో... శ్రమేంకాదు, ఏ అవసరమొచ్చినా సంకోచించకండి" అంటూ కారెక్కి స్టార్ట్ చేశారు.      కారు ముందుకు సాగింది.   

    నేను మళ్ళీ వెనక్కి వచ్చి మెట్ల మీద కూర్చున్నాను. మా బావ సిగరెట్ వెలిగించి ఏదో ఆలోచిస్తూ గుప్పుగుప్పుమంటూ పొగ వదలసాగాడు, అచ్చం మా నాన్నలా.

   అవును! నాన్న కూడా అంతే! నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ చూస్తున్నా. నిద్ర పోయేటప్పుడు తప్ప ఎప్పుడూ నోట్లో ఎర్రగా కాలుతున్న సిగరెట్ పీక కనిపించేది. చివరకి భోజనాల సమయంలో కూడా వెలుగుతున్న సిగరెట్ పీకను పక్కనే పెట్టుకుని భోంచేసేవాడు. రెండో సిగరెట్ వెలిగించడానికి ఆయనెప్పుడూ రెండో అగ్గిపుల్ల గీయలేదు.
    ఆయన ఉద్యోగం సరిగ్గా చేసిందీ నేనెప్పుడూ చూడలేదు. నేను, అన్నయ్య పెరిగి పెద్దవుతున్న కొద్దీ మాకు కొద్దికొద్దిగా విషయాలు అర్థమవసాగాయి. నాన్న డ్యూటీకి సరిగా వెళ్ళేవాడే కాడు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా ఆ ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకోక, పని ఎగ్గొట్టి క్లబ్బులకు వెళ్ళి పేకాడుతూ కూర్చునేవాడు. ఇంటికి రెండుమూడు రోజులకోసారి వచ్చేవాడు. నా మటుకు నాకు ఆయన ఇంటికి రాకపోతేనే బాగుంటుందనిపించేది.     అయితే నాన్న ఇంటికి రాకపోతే అమ్మ ఏడ్చేది. ఆమె ఏడ్పు చూస్తే బాధ వేసేది.     ఒక్కొక్కసారి నన్నూ, అన్నయ్యను వెళ్ళి నాన్నను పిలుచుకుని రమ్మనేది.     పగలైనా, మధ్యాహ్నమైనా, రాత్రయినా మేము అమ్మ పంపితే మారుమాట్లాదకుండా నాన్నను పిలుచుకుని రావటానికి వెళ్ళేవాళ్ళం.     మమ్మల్ని చూడగానే నాన్న ముఖం చిట్లించుకునేవాడు. పళ్ళు కొరుకుతూ "ఎందుకు వచ్చార్రా?" అని అరిచేవాడు.     మేము భయంతో "అమ్మ పిలుచుకురమ్మంది" అనే వాళ్ళం.     "వస్తాన్లే పొండి" అని కసిరేవాడు.     మేము నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేసేవాళ్ళం.     నాన్న ఏ అర్ధరాత్రో లేదా ఏ తెల్లవారుజామునో వచ్చేవాడు. పొద్దున్నే లేచి స్నానం చేసి మల్లెపూవులాంటి తెల్లటి షర్టు, పైజామా వేసుకుని కాఫీ తాగి బయలుదేరేవాడు.     అమ్మ ఇంటికి వేళకు రమ్మని, సమయానికి భోజనం చేసి పొమ్మని బతిమిలాడేది.     "వస్తాన్లేవే" అంటూ బయటికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ నాన్న రావటం ఏ మూడు రోజులకో, నాలుగు రోజులకో.     మేము పెరిగి పెద్దవుతున్నకొద్దీ మా నాన్న ప్రవర్తన మాకు బాగా అర్థమవ్వసాగింది. అమ్మను కష్టపెట్టే నాన్న అంటే మా అన్నదమ్ములిద్దరికీ ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఉన్న ఉద్యోగం సరిగ్గా చేసుకోక, సంపాదించినదంతా తాగటానికి,పేకాటకి, మందుకు, ముండలకి తగిలేసే నాన్నంటే చెప్పలేని అసహ్యం. 

ఒక రోజు...     ... ఆ రోజు నాన్న కోసం హాస్పిటల్ వాచ్‌మెన్ వచ్చాడు. నాన్న ఇంట్లో లేడని అమ్మ చెప్పింది. నాన్న ఇంటికి వచ్చిన వెంటనే డాక్టర్‌ను కలవటానికి పంపమని చెప్పాడు. విషయమేమిటో చెప్పమని అమ్మ వాచ్‌మెన్‌ను వొత్తిడి పెట్టింది. హాస్పిటల్‌కు వచ్చిన మందుల పార్శిల్‌ను విడిపించుకు రమ్మని పంపితే, నాన్న ఆ పార్శిల్‌ను తీసుకుని హాస్పిటల్‌కు రాలేదని, ఇది జరిగి మూడు రోజులైందని చెప్పాడు. డాక్టర్ను వచ్చి వెంటనే కలవకపోతే అది పోలిసు రిపోర్టు అవుతుందని, నాన్న ఉద్యోగం పోవటమేకాక, ఆయన జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పి వెళ్ళాడు.     అమ్మ ఏడుపు మొదలెట్టింది.     మేము నాన్న కోసం పరుగులు తీశాం. నాన్న సామాన్యంగా ఏఏ క్లబ్బుల్లో పేకాట ఆడుతూ ఉంటాడో, ఏఏ స్నేహితుల ఇళ్ళల్లో మిత్రులతో కలిసి మందుకొడుతూ ఉంటాడో,ఆ ఇళ్ళన్నీ వెతికాం. కనిపించలేదు. తిరిగొచ్చి అమ్మకు అదే విషయం చెప్పాం. ఉదయంలోపున డాక్టర్‌గారిని నాన్న కలవక పోతే ఏమవుతుందోనని అమ్మ నాన్నని శాపనార్థాలు పెడుతూ ఏడవసాగింది. ఆ తరువాత ముగ్గురం కలిసి మళ్ళి నాన్నకోసం వెతకసాగాం. మళ్ళీ క్లబ్బులన్నీ చుట్టాం. ఒకటి రెండు బ్రాందీ షాపుల దగ్గర వెతికాం. చివరికి మా నాన్నతో పాటు అప్పుడప్పుడు పేకాటలో కూర్చొనే అదే హాస్పిటల్ ఉద్యోగి ఈరన్న కనిపించాడు. అతన్ని అమ్మ నాన్నగురించి అడిగింది. అతను మొదట ఏమీ తెలియదని నసిగాడు. చివరికి విషయం అంతా తెలుసుకుని నాన్న కార్వాన్‌పేటలోని ఓ బసివిరాలింట్లో ఉండొచ్చని చెప్పి వెళ్ళిపోయాడు.     అమ్మ, అన్నయ్య, నేను ముగ్గురం కార్వాన్‌పేటకు వెళ్ళాం. ఈరన్న చెప్పిన స్త్రీ ఇంటిని వెతుకుతూ వెళ్ళాం. ఆమె ఆ ఇంటి గుమ్మంలోనే నుంచుని కనిపించింది. ఆ మరో స్త్రీని చూసి నేను బిత్తర పోయాను. లావుగా, ఎత్తుగా సినిమాల్లో ఏ శూర్పణఖలానో ఉన్న ఆమె మమ్మల్ని ఎవరన్నట్టు చూసింది. అమ్మ నాన్న గురించి అడిగింది.'ఇంగా రాలేదు. రేతిరికొస్తే అంపిస్తాను'అని చెప్పింది. ముగ్గురం ఇంటికి తిరిగొచ్చాం.     అమ్మ గుమ్మంలోనే కూర్చుంది. మేమిద్దరం ఓ మూల పుస్తకాలు పట్టుకుని కూర్చున్నాం. అన్నయ్య చదువుతున్నాడో లేదో నాకు తెలియదు. నేను మాత్రం పుస్తకాలు ముందు పెట్టుకుని ఉన్నా నా మనస్సంతా అక్కడ చూసిన ఆ మరో స్త్రీ గురించే ఆలోచించసాగింది. 'ఆమె ఎవరు? ఆమె దగ్గరికి నాన్న ఎందుకు వెళుతున్నాడు? ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది?' అనే ప్రశ్నలు తలెత్తాయి. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలను అర్థం చేసుకోగలిగే వయస్సు నాకు అప్పట్లో లేదు.     ఓ గంట తర్వాత నాన్న ఇంటికి వచ్చాడు. సైకిల్‌ని ఇంటి ముందు స్టాండ్ వేసి నిలబెట్టి, ఇంట్లోకి అడుగుపెట్టగానే అమ్మ సివంగిలా నాన్న మీదకు పోయింది. ఎడమ చేత్తో నాన్న షర్టు పట్టుకుని కుడిచేత్తో లాగి లెంపకాయ కొట్టింది. "నన్ను మోసం చేస్తావా? నీకు మరో ఆడది కావలసి వచ్చిందా? కట్టుకున్న దానికి, పుట్టిన పిల్లలకి తిండి పెట్టడానికి చేతకాదుకాని లంజలు కావాలా నీకు?" అంటూ గర్జించింది.     నాన్న ఓ క్షణం నోట మాట రానట్టు నుంచుండిపోయాడు. ఆ తరువాత "ముండా నన్నే కొడతావా? నిన్ను చంపేస్తానే. నేను మగాణ్ణి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. దాన్నే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. ఏం చేస్తావే నీయమ్మ" అంటూ అమ్మను నేల మీదికి తోసి ఎడాపెడా తన్నసాగాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టసాగాడు. జరుగుతున్న గొడవకు నేను బిత్తర పోయి ఏడ్వసాగాను. అన్నయ్య నాన్న వేపు నిప్పులు కక్కుతూ చూడసాగాడు. ఇరుగు పొరుగు వారు మా ఇంట్లోని గొడవకు వచ్చి చేరారు. అమ్మా నాన్నలను విడిపించి, విషయం తెలుసుకుని నాన్ననే కేకలేసి వెళ్ళిపోయారు.     ఆ రాత్రి ఇంట్లో ఎవ్వరం ఎంగిలి పడలేదు. ఎవ్వరం నిద్రపోలేదు. ఈ రోజు మేల్కొన్నట్టే ఆ రోజూ మేల్కొనే ఉన్నాను. తెల్లవారే వరకు ఈ రోజులాగే ఆ రోజు కూడా ఆ ఇల్లు 'చావు చొచ్చిన' ఇంటిలానే నిశ్శబ్దంగా,శూన్యంగా,నిర్జీవంగా ఉంది. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం, మధ్య మధ్యన అమ్మ వెక్కిళ్ళు వినిపించటం తప్ప. ఈ రోజు అవికూడా లేవు. నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ "టీ తీసుకో" అన్నాడు బావ.     మౌనంగా 'టీ' అందుకుని సిప్ చేయసాగాను.     నా ఆలోచనల్లోపడి గమనించనేలేదు కానీ అప్పుడే తెల్లవారుతోంది. రోడ్డుకు అటు వేపున్న గుడిసెవాసుల్లో కొందరు లేచి వీధి కొళాయి దగ్గరకు, బోరింగ్ దగ్గరకు బిందెలతో వెళుతూ కనిపించారు. మరికొందరు చెంబులు పట్టుకుని రోడ్డుకు మరో పక్కన ఉన్న ముళ్ళచెట్ల తోపు వేపు వెళ్ళటం కనిపించింది. ఒకటి రెండు ఎడ్ల బండ్లు బాట పట్టుకుని వెళ్ళటం కనిపించాయి.     "మీ అన్నయ్య వచ్చేలోగా ఏదైనా అరేంజ్ చేయాలా?"     నేను ప్రశ్నార్థకంగా చూశాను.     "అదే, దహన సంస్కారాలకు కావలసిన వస్తువులు" అంటూ అడిగాడు.     ఓ క్షణం మనస్సు ఎందుకో వణికింది. ఏదో బాధావీచిక గుండెని అదిమింది. 'న్నిన్నటి వరకౌ ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి ఈ రోజు నుండి ఉండడు' అనే భావన మనస్సును కలచివేసింది. అయితే అదే సమయంలో ఏదో తెలియని రిలీఫ్... మనసుకు... నెమ్మది... ముళ్ళ చట్రంలోంచి విముక్తి పొందిన శాంతి.     "ఏం చేద్దాం?" బావ మళ్ళీ అడిగాడు.     "అవును అంతా సిద్ధం చేసుకుని ఉండటం మంచిదేమో" అన్నాను.     "నేను అరేంజ్ చేసి వస్తాను. మరి నీవు ఒంటరిగా..." బావ ఆగాడు.     "ఏం ఫరవాలేదు. నువ్వెళ్ళు" అన్నాను.     "నేను వెంకటేశ్వర్లునో, శంకర్నో, ఎవర్నో ఒకర్ని పట్టుకుని వాళ్ళకీ పని పురమాయించి తొందరగా వచ్చేస్తాను" అంటూ వెళ్ళిపోయాడు.     నేను లోపలికి నడిచాను.     నాన్న అలాగే పడుకుని ఉన్నాడు. అమ్మ అలాగే కూర్చుని ఉంది. తల మీద కొంగు వేసుకుని ఉంది. నుదుట రూపాయి కాసంత పెద్ద బొట్టు మెరుస్తూ ఉంది.     నా మనస్సు పిండేసినట్టయ్యింది. ఆ బొట్టు ఇక ఉండదా? ఆ నుదురు బోసిగా మారుతుందా?     లేచి బయటికి వచ్చాను. ఆమె నుదుటి మీది బొట్టే కళ్ళ ముందు కదిలింది. ఈ బొట్టు కోసమే కదా నాన్న ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని అకృత్యాలు చేసినా భరించింది. అది ఎంతటి పాడుపనైనా సహించింది. కొన్ని సార్లు మౌనంగా సహకరించింది.     అప్పుడు నాకు పన్నెండేళ్ళుండొచ్చు. అన్నయ్య స్కూల్ ఫైనల్లో ఉన్నాడు. అప్పటికి మాకు ఊహ తెలుస్తుందనే చెప్పాలి. ఒక వేళ నాకు అంతగా అర్థం కాకపోయినా నా కంటే అయిదారేళ్ళు పెద్దవాడైన అన్నయ్యకు బాగానే అర్థం అవుతూ ఉండాలి. ఒక రోజు నాన్న తనతో పాటు హాస్పిటల్లో పని చేసే నర్సును తీసుకొచ్చాడు. అమ్మ అప్పటికే వంట చేసింది. నర్సు పాత చెక్క కుర్చీ మీద కూర్చుని చెక్క స్టూలు మీద కంచెం పెట్టుకుని భోజనం చేసింది. నాన్న కూడా మంచం మీద కూర్చొని భోజనం చేశాడు. నేను, అన్నయ్య, అమ్మ వంటింట్లో కూర్చొని భోహనాలు చేశాం. ఆ రోజు అమ్మ వడియాలు చేసింది. వడియాలంటే నాకెంతో ఇష్టం. 'కరకు కరకు' అని శబ్దం చేస్తూ కడుపు నిండా తిన్నాను.     భోజనాల తరువాత నేను, అన్నయ్య, అమ్మ వరండాలో చాపలు పరచుకుని పడుకున్నాం. నాన్న, నర్సు ఇంట్లోనే ఉన్నారు. తలుపులు మూసుకుని ఉన్నారు. నాన్న, నర్సు లోపల ఎందుకు ఉన్నారో, తలుపులు ఎందుకు మూసుకుని ఉన్నాయో నాకు అర్థం కాలేదు.     "అమ్మా, మనమూ లోపల పడుకుందాం" అన్నాను అమ్మ భుజం పట్టి వూపుతూ.     "ఉష్ ఊరుకో..."అంటూ అమ్మ అటు వేపు తిరిగి కళ్ళొత్తుకుంది.     అన్నయ్య గబుక్కున లేచి కూర్చున్నాడు. వాడి ముఖం భయంకరంగా ఉంది. కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా ఉన్నాయి. పళ్ళు కొరుకుతూ పంటి బిగువున "తలుపులు విరగ్గొట్టి ఇద్దర్నీ తంతాను" అంటూ అన్నయ్య రోషంగా లేవబోయాడు.     అమ్మ వాడి నోరు మూసి "నోరు మూసుకో! కట్టుకున్న దాన్ని నేనే ఊరుకున్నాను. నువ్వు పసివాడివి. నువ్వేం చేయగలవు" అంటూ నోట్లో కొంగు కుక్కుకుంది.     అమ్మ అన్నయ్య నిశ్శబ్దంగా ఏడ్వసాగారు. నేను బిక్కమొహం పెట్టుకుని అమ్మ వొడిలో తలదాచుకుని పడుకున్నాను. ఆ రోజున ఆ సంఘటన నాకు అర్థం కాక పోయినా, అటు తరువాత స్త్రీ పురుష సంబంధాల గురించి తలుచుకున్నప్పుడల్లా కోపంతో వణికి పోయేవాడిని. ఆ సమయంలో అమ్మ, అన్నయ్యలు పడిన బాధ ఇప్పటికీ నా గుండెను సన్నగా కోస్తూ ఉంది. అయినా అమ్మ అతడిని క్షమిస్తూ వచ్చింది. ఎందుకు? కేవలం ఆ నుదుటిమీది బొట్టు కోసమా? మెడలో కనిపించే ఉరిత్రాడులాంటి పసుపుతాడు కోసమా?     ఇంటిముందు తెల్లటి మారుతి కారొచ్చి ఆగింది. ఆలోచనల్లోంచి బయటపడి రాఘవేంద్రగారు వచ్చారేమోనని చూశాను. వచ్చింది ఆయన కాదు. కారు డోర్ తెరుచుకుని అన్నయ్య దిగాడు. అన్నయ్యతో పాటు మామయ్య, ఆయన ఇద్దరు కుమారులు మూర్తి, జగ్గా, అన్నయ్య కుమారుడు వినయ్ దిగారు. వినయ్ చేతిలో పూలదండ. బుట్టలో పాములా. ఫార్మాలిటీ! బ్లడీ ఫార్మాలిటీ! ఈ పూలదండ కోసమా ఎదురుచూసేది?     నాకు నవ్వాలనిపించింది. కానీ నేను నవ్వలేదు. ఎదురెళ్ళి ఆహ్వానించాలో వద్దో అర్థం కాలేదు. అయితే ఇది ఆహ్వానిచాల్స్నిన సంఘటన కాదని గుర్తొచ్చి ఉన్న చోటనే నుంచుండిపోయాను.     అందరూ మౌనంగా లోపలికి వచ్చారు. అన్నయ్య నేరుగా లోపలికి వెళ్ళి వినయ్ చేతిలోని పొట్లం తీసుకుని దాన్ని విప్పదీసి పూలదండను వినయ్ చేత నాన్న శవం మీద వేయించాడు. వాడు పూలదండ వేసి అమ్మ పక్కన కూర్చున్నాడు. అన్నయ్యని చూడగానే అమ్మ ఏడుపు మొదలెట్టింది. "మీ నాన్న నన్ను అన్యాయం చేసి పోయాడ్రా" అంటూ.     అన్నయ్య గబుక్కున లోపలికి గదిలోకి వెళ్ళి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించాడు. నాకూ దుఃఖం ఆగలేదు. అంతవరకు రాని దుఃఖం ఒక్కసారిగా తన్నుకు వచ్చినట్టయింది. అమ్మ అన్నయ్య వెనకే లోపలికి వచ్చి "పెద్దోడా, ఏడ్వద్దురా, అసలే నీ ఆరోగ్యం బాగాలేదు" అంది కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుని అన్నయ్యను సమాధానపరుస్తూ.     నాన్న పోయాడన్న దుఃఖం కంటే, అమ్మ ఒంటరిదైందన్న బాధతో కలిగిన దుఃఖానికి ఏదో అడ్డుపడ్డట్టయింది.     నాకు మళ్ళీ నవ్వాలనిపించింది. అయితే నవ్వలేదు.     మామయ్య పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ "ఊరుకోండి. ఊరుకోండి. ముందు జరగవలసింది చూడండి" అన్నాడు.     అమ్మ అన్నయ్య వేపు చూసింది. అన్నయ్య నా వేపు చూశాడు.     "బావకు చెప్పాను. అంతా అరేంజ్ చేయటానికి వెళ్ళాడు" అన్నాను.     అదే సమయంలో బావ లోపలికి వచ్చాడు. అతని వెనకే వెంకటేశ్వర్లు. బావ నన్ను పక్కకు పిలిచాడు. టన్నున్నర కట్టెలు చెప్పానని, డబ్బా కిరసనాయిల్ చెప్పానని, మిగతా వస్తువులు, పాడె కట్టటానికి కావలసిన వెదురు బొంగులు అన్నీ సిద్ధం చేశానని అవన్నీ వస్తున్నాయని వెంకటేశ్వర్లు చెప్పాడు. ఎవరైనా మనుషులు కావాలా? అని మళ్ళీ అడిగాడు.     "ఎందుకు?" అని అడిగాను.     "మోయడానికి" అన్నాడు నసుగుతూ.     "వద్దు" అన్నాను.     మామయ్య ఇంటిముందు పిడకలు, పుల్లలతో నెగడు వేశాడు. అలా నెగడు వేస్తే ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపొయారంటానికి అది సంకేతమట!     అదే సమయంలో రిక్షాలో వెదురుబొంగులు, కొత్తకుండ,పూలు, కొత్తబట్ట ఇంకా ఏవేవో సామాన్లు వచ్చాయి. వెంకటేశ్వర్లు ఆ సామాన్లు కిందికి దింపించి రిక్షావాణ్ణి పంపేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడిగాడు "మనుషులు ఎవరైనా కావాలా?" అని.     మామయ్య అది గమనించింది ఏమిటని అడిగాను. విషయం చెప్పాను.     "మేమున్నాం. ఇంకెవరూ అక్కర్లేదు" అన్నాడు మామయ్య.     మూర్తి, జగ్గాలిద్దరూ చకచకా వెదురు బొంగులు తీసి నేలమీద పెట్టి, దానిపై అడ్డంగా వెదురు బద్దలు పేర్చి చకచకా పాడె కట్టేశారు. దాని మీద గడ్డి పరకలు పరిచారు. తెల్ల రంగు గుడ్డను దాని మీద పరిచి గడ్డి మీద పసుపు నీళ్ళు చెల్లారు.     మా బావ కాఫీలు పట్టించుకుని వచ్చాడు. అందరం కాఫీలు తాగాం. ఈ లోగా అమ్మ నన్ను పిలిచి చాకలికి కబురు పెట్టమంది. ఎదురింటి కుర్రాణ్ణి పిలిచి చాకలమ్మకి కబురు పంపించాను.     మామయ్య నాన్న శవానికి స్నానం చేయించాలన్నాడు. నేను అన్నయ్య కలిసి పెరట్లో కుర్చీ వేశాం. అమ్మ వేడినీళ్ళు పెట్టింది. నేను, అన్నయ్య, మూర్తి, జగా నలుగురం కలిసి నాన్న శవాన్ని తీసుకొచ్చి పెరట్లో వేసిన కుర్చీ మీద కూర్చోబెట్టాం. ఎవరో కాగులో నీళ్ళు తోడారు. వేడివేడి నీళ్ళు చెంబులో ముంచుకుని శవం తల మీదుగా పోస్తూ ఉంటే నాన్న తల మీద నుంచి జారుతున్న నీళ్ళు నేల మీద మడుగు కట్టసాగింది. స్నానం చేయించటం అయ్యాక ఒళ్ళంతా తుడిచి, పంచె కట్టించి ముఖానికి బొట్టు పెట్టి, తీసుకొచ్చి పాడె మీద పడుకోబెట్టాం.     నిర్లిప్తంగా, నిర్వికారంగా,మౌనంగా చిరనిద్రలో ఉన్న నాన్నను చూస్తూ ఉంటే ఆశ్చర్యమనిపించింది. జీవితమంతా బాధ్యతారహితంగా గడుపుతూ, పేకాటలోనూ,మందులోనూ, ముండలతోనూ కుషీగా జీవితాన్ని జల్సాగా గడిపిన వ్యక్తికి ఈ రోజుతో ఈ లోకంతో సంబంధం తెగిపోయింది. ఈ లోకంతో మారమేనా? కాదు, కాదు మాతోనూ సంబంధం తెగిపోయింది.     గతంలోనూ అతను ఎన్నో సార్లు మాతో సంబంధాలు తెంపుకోవాలని చూశాడు. మమ్మల్ని వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవాడు. కొన్నిసార్లు అమ్మతో పోట్లాడి వెళ్ళిపోతే, చాలా సార్లు దొరికిన చోటంతా అప్పులు చేసి బయట ఎవరికి ముఖం చూపించే సాహసం చేయలేక పారిపోయేవాడు. అయితే కొన్నాళ్ళ తరువాత అంటే అందరూ అతన్ని మరిచిపోతున్నారు అనుకునే సమయానికి మళ్ళీ ప్రత్యక్షమయ్యేవాడు.     చిన్నతనంలో నాన్న అలా మమ్మల్ని వదిలేసి వెళ్ళినపుడు అమ్మ కుళ్ళికుళ్ళి ఏడ్చేది. అమ్మ అలా ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. నా మటుకు నాకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే అతని చేత అమ్మకు దెబ్బలు తినటం తప్పేది. అతని కోసం మేం క్లబ్బులు, బ్రాందీ షాపులు, ఇతరత్రా కొంపలు గాలించాల్సిన అవసరం ఉండేది కాదు. నాన్న ఎక్కడెక్కడో చేసిన అప్పులు అమ్మ తన నెత్తిన వేసుకుని కష్టపడి కడుపు కట్టుకుని తీర్చవలసిన అవసరం ఉండదు. అందుకే అతను ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతేనే బాగుంటుందని అనిపించేది. ఒక్కో సారి అమ్మతో పోట్లాది నాన్న ఇల్లు వొదిలి వెళ్ళిపోయి వారానికో, పదిరోజులకో తన మిత్రుల్ని వెంట పెట్టుకుని వచ్చేవాడు. వాళ్ళు అమ్మకు ఏవేవో నచ్చజెప్పేవాళ్ళు. అమ్మ కంట తడిపెడుతూ వినేది. వాళ్ళ మాటలకు అమ్మ ఒప్పుకుని నాన్న మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాడేమోనని భయంవేసి "అమ్మా! నాన్న వద్దే. నాన్నను మనం ఉంచుకోవద్దు" అని ఏడ్వటం నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. అయితే స్త్రీ తన మంగళ సూత్రానికి ఎంత విలువనిస్తుందో, భర్త వదిలేసిన స్త్రీ అని పిలిపించుకోవటానికి ఎంత భయపడుతుందో అర్థం చేసుకోగలిగే వయసు అప్పుడు నాకు లేదు.     ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తిని ఇంట్లో ఉంచుకోగలుగుతామా? ఊహూ! ఉంచుకోం. మనిషి బతికి ఉన్నంతవరకే మనిషికి ఇంట్లో స్థానం. చనిపోయిన తర్వాత అతడి పట్ల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ అతడి స్థానం శ్మశానంలోనే.     మామయ్య చిన్న కుండను పట్టుకోడానికి వీలుగా తాడు కట్టాడు. కుండలో మండుతున్న పిడకలు వేశాడు. నాన్న శవానికి చివరి నమస్కారాలు చేసుకోండని మామయ్య అందర్నీ హెచ్చరించాడు. అన్నయ్య నాన్న మీద పూలు చల్లి, నోట్లో నువ్వులు వేసి కాళ్ళకు నమస్కారం పెట్టాడు. నేనూ పూలు వేసి, నోట్లో నువ్వులు వేసి, మడీమలు,పాదాలు చీలి చేప పొలుసుల్లా మారిన నాన్న కాళ్ళకు నమస్కరించాను. మామయ్య, మూర్తి, జగ్గా, వినయ్, బావ అందరూ నాన్న నోట్లో నువ్వులు వేసి కాళ్ళకు నమస్కారాలు చేసి గౌరవాన్ని ప్రదర్శించారు. మా అత్తగారొచ్చి దూరంగా నుంచుని నమస్కారం చేసి వెళ్ళిపోయారు. ఆపరేషన్ అయిన నా భార్య వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుని నమస్కారం చేసింది. మా పిల్లలిద్దరూ వాళ్ళమ్మ కొంగు పట్టుకుని భయంగా, వింతగా నాన్న శవాన్ని, అక్కడ చేరిన జనాన్ని, జరుగుతున్న తంతుని మార్చిమార్చి చూడసాగారు.     అమ్మను కూడా చివరి నమస్కారం చేసుకోమన్నాడు మామయ్య.     అమ్మ మౌనంగా నాన్న శవం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసింది. తలదగ్గర కూర్చుంది. నోట్లో నువ్వులు వేసింది. నేను అడుగు ముందుకు వేసి అమ్మను లేపబోయాను.అమ్మ 'చివరి సారి కదరా' అంది దీనంగా. నేను ఆగిపోయాను. అమ్మ నాన్న తలను వొడిలోకి తీసుకుంది. జుట్టు సరిచెసింది. చెంపలు నిమిరింది. దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అక్కడ చేరిన వారందరి కళ్ళల్లోనూ నీళ్ళు తిరిగినట్టు కన్నీటి తెర గుండా గమనించాను. నాన్న పట్ల అమ్మకున్న అభిమానాన్ని, ప్రేమను, విశ్వాసాన్ని గుర్తిస్తున్న కొద్దీ ఆయన పట్ల మరింత ఏవగింపు కలగసాగింది. ఆమె అతని పట్ల ఎంత నిజాయితీగా ఉందో అతను ఆమెకు అంత ద్రోహం చేస్తూ జీవించాడనే చెప్పాలి.     మామయ్య పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ 'శవాన్ని లేవనెత్తండని' అన్నాడు. అన్నయ్య పొగలు కక్కుతున్న తలకొరివి పట్టుకుని అందరి కంటే ముందు నుంచున్నాడు. నేనూ, మూర్తి, జగ్గా,ఎదురింటి ముసలయ్య పాడెను భుజాలకు ఎత్తుకున్నాం. మా బావ భుజం ఇవ్వడానికి రాబోతే వద్దన్నాను. తండ్రి బతికి ఉన్న పిల్లలు శవయాత్రకు రాకూడదు అంటారు. మనకు పట్టింపులున్నా లేకున్నా ఎదుటివారికున్న పట్టింపుల్ని గుర్తించాలి కదా!      ఎవరో 'గోవిందా గోవిందా' అని అరిచారు. మేమూ 'గోవిందా గోవిందా' అంటూ ముందుకు కదిలాం. అమ్మ గొల్లుమంది. అక్కడ చేరిన ఇరుగు పొరుగు ఆడవాళ్ళు మా వెంట రాబోయిన అమ్మను బలవంతంగా ఆపారు.     అన్నయ్య అందరికంటే ముందు తలకొరివి పట్టుకుని నడవసాగాడు.     శవానికి ఎడమ వేపున కుడి భుజాన్నిచ్చిన నేను మిగతా ముగ్గురితో పాటు అడుగులు వేస్తున్నాను. శవయాత్రలో కేవలం ఆరేడు మంది మాత్రమే ఉన్నాం. బంధువులు, ఆత్మీయులు ఎవరూ మా వెంట లేరు.చివరికి నాన్న స్నేహితులుగా భావించేవారు ఒక్కరంటే ఒక్కరు మా వెంట లేరు. నా అడుగు ముందుకు పడుతున్నా అంతరంగంలో మాత్రం నా అడుగులు గతం వేపు సాగాయి.     ఓ డాక్టర్‌గారి పుణ్యమా అని అమ్మకు హాస్పిటల్లో ఓ చిన్న ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగమే మా చీకటి జీవితాల్లో ఓ చిన్ని దీపాన్ని వెలిగించింది. మా సంసారం కాస్త కుదుట పడింది. నాన్న చేసిన అప్పులన్నీ అమ్మ మెల్లమెల్లగా తీర్చింది. అన్నయ్యను, నన్ను కష్టపడి చదివించింది. మేము చెడు అలవాట్లకు ఆకర్షింపబడకుండా చాలా కఠినంగా కట్టుబాట్ల మధ్య పెంచింది. అన్నయ్య, నేనూ కష్టపడి చదువుకున్నాం. ప్రయోజకులయ్యాం. ఈలోగా నాన్న అనేక సార్లు అప్పులు చేసి, కొన్ని అప్పులు అమ్మ తీర్చి, కొన్ని అప్పులకు, అప్పుల వాళ్ళ బాధలకు నాన్న ఊర్లు పట్టి పోవటం మళ్ళీ తిరిగి రావటమూ సాధారణ విషయమైపోయింది. నాన్న చేసే గవర్నమెంటు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తే దొంగలా తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండేవాడు. బయటికి వచ్చేవాడు కాదు. చివరికి ఒకటికి, రెండుకు కూడా! ఈలోగా అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది. పెళ్ళయింది. పిల్లలు కూడా పుట్టారు. ఉద్యోగ రీత్య ఊళ్ళు పట్టి తిరగసాగాడు. అయితే నేను! ఉన్న ఊల్లో ఉద్యోగం దొరకటం నా దురదృష్టం. నాన్న సృష్టించే నరకానికి బలి కావలసి వచ్చేది.     జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, ఎన్ని పోగొట్టుకున్నా నాన్నకు బుద్ధి రాలేదు. చెడు అలవాట్లను మానుకోలేదు. ఉద్యోగం పోగొట్టుకున్నది కాక ఆడదాని సంపాదనతో బతకాల్సి రావటంతో అతని అహం దెబ్బతింది. దీంతో ఇంటిని మరింత నరకం చేసేవాడు. అతని పోరు పడలేక అమ్మ ఓ కిరాణా దుకాణాన్ని పెట్టించింది. నాలుగు రూకలు చేతిలో ఆడటం మొదలయ్యేసరికి నాన్నలోని వ్యసనాలు మళ్ళీ విజృంభించాయి. 'ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాద'న్నట్టు అతణ్ణి ఎంత మారుద్దామని అమ్మ ప్రయత్నించినా అతను మారలేదు. సంపాదన మొదలవ్వటంతో పాత అలవాట్లు రెక్కలు విప్పుకున్నాయి. చెడు గుణాలకు ఉండే ఐక్యత మంచి గుణాల్లో ఉండదేమో? రాత్రి వరకు కొట్లో కూర్చుని, చీకటి పడగానే కొట్టు మూసి బయటకు వెళ్ళి తాగి వచ్చేవాడు. తాగాడంటే అతను ఏం వాగుతున్నాడో, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నాడో అనే జ్ఞానమే లేదు. భార్య ముందు ఏం మాట్లాడాలి, కొడుకుల ముందు ఏం మాట్లాడాలి, కోడళ్ళ ముందు ఎలా మసలుకోవాలి అనే ఇంగిత జ్ఞానం, సంస్కారం లేని పశుప్రవర్తన అతనిది.     జీవితం నరకమనిపించేది. ఒకప్పుడు ఏమీ లేక నరకం అనుభవించాం. ఇప్పుడు అన్నీ ఉండీ, జీవితాన్ని హాయిగా, ఆనందంగా గడపగలిగి ఉండీ ఈ వ్యక్తి ప్రవర్తన వల్ల నరకయాతన అనుభవించాం. మాకు సుఖం, శాంతి కరువైంది. ఆలోచిస్తే తమ జీవితాలతో పాటు ఇతరుల జీవితాల్ని నాశనం చేయటానికే నాన్నలాంటి వాళ్ళు పుడతారని అనిపిస్తుంది.     ఎవరో భుజం ఇవ్వటానికి రావటంతో నేను పక్కకి తప్పుకున్నాను. ఆలోచనల గొలుసు ఓ క్షణం తెగింది.     శవయాత్ర తిక్కస్వామి దర్గా దగ్గర మలుపు తిరిగి శ్మశానం దారి పట్టింది. దారికి ఇరుపక్కల ఉన్న గుడిసె వాసులు బయటకి వచ్చి చూడసాగారు. ఇంటిముందు పాత్రలు తొలుస్తున్న ఓ ఆడమనిషి లేచి తలమీద కొంగు వెసుకుని శవానికి భక్తిగా నమస్కరించింది.     నాకు మళ్ళీ నవ్వాలనిపించింది. కానీ నవ్వలేదు. ఈయనగారు ఎలాంటి వారో, ఎలాంటి జీవితం గడిపారో ఈమెకు తెలుస్తే ఇలా నమస్కారం చేస్తుందా? దారి పక్కన నుంచోని మమ్మల్ని చూస్తున్న కొందరు మా వేపు సానుభూతిగా చూస్తున్నారనిపించింది. బహుశా ఇంత తక్కువ మందితో సాగే ఏ శవయాత్రనూ వారు ఇంతకు మునుపు చూడలేదేమోనని అనిపించింది. వీరంతా మమ్మల్ని బంధుహీనులని, దిక్కులేనివాళ్ళు అని భావించి ఉండొచ్చు. నిజమే! మాలాంటివాళ్ళకు బంధువులు, ఆత్మీయులు ఎక్కడి నుండి వస్తారు? ఆత్మీయుల్నీ, బంధువుల్ని సంపాదించుకుని నిలుపుకునే సంస్కారవంతుడా మా నాన్న? ఆ సంస్కారమే అతడిలో ఉంటే ఈ రోజున మేము ఇలా బంధుబలగం లేకుండా, ఆత్మీయులు లేకుండా ఎందుకు జీవిస్తాం?     హఠాత్తుగా ముసలయ్య కంఠం వినిపించింది.     "ఇక్కడ శవాన్ని దించాలి"     "ఎందుకు?" అడిగాను.     "ఇది 'దింపుడు కళ్ళం' బాబు" అన్నాడు ముసలయ్య.     "అంటే..." అన్నాను.     "అదే బాబు...'దింపుడు కళ్ళం' దగ్గర శవాన్ని ఒకసారు దింపడం ఆనవాయితీగా వస్తోంది బాబు" అన్నాడు.     "ఎందుకు?" కంగారుగా అడిగాను.     "మనిషి మరణించినా ఆత్మకు మరణం లేదంటారు. మరణించిన వారి ఆత్మ ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుందట. అందుకే ప్రతీ శవాన్ని ఇక్కడ కొద్దిసేపు దింపుతారు. మరణించిన వారి తాలూకు ఆత్మీయులు ప్రేమతో తిరిగి రమ్మని వారి చెవిలో పిలుస్తారు. ఒక వేళ ఈ మరణిచిన వ్యక్తికి ఈ భూమ్మీద ఇంకా నూకలు రాసి పెట్టి ఉంటే ప్రాణాలు తిరిగి రావచ్చంటారు. మరి మీ అదృష్టం ఎలా ఉందో?" అన్నాడు.     అందరూ నాలుకలు చచ్చినవారిలా మౌనంగా నుంచొన్నారు.     భయపెట్టే శ్మశాన మౌనం అక్కడంతా ఆవరించింది.     అన్నయ్య నాన్నవేపు కదిలాడు.     నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.     ఈ ముసలయ్య చెప్పేది నిజమా? మనిషి చనిపోవడమంటే ఏమిటి? ఆత్మ అతనిలోంచి వెళ్ళిపోవటమేనా? మరి ప్రాణం పోవటం అంటే ఏమిటి? ఒక వేళ ప్రాణం ఉంటే ఆత్మేనా? ప్రాణం ఆత్మ రెండూ వేరువేరు కాదా? అలా వెళ్ళిపోయిన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందన్నది నిజమా? ఆ ఆత్మ మళ్ళీ తిరిగొచ్చి చనిపోయిన మనిషిలో ప్రవేశితుందా? చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతుకుతాడా? ఇది సంభవమా? ఒకవేళ సంభవమే అయితే నాన్న మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉందా? నాన్న లాంటి బాధ్యత లేనటువంటి, వ్యసనాల పుట్ట అయినటువంటి మనిషి మళ్ళీ తిరిగి రావటమా? జీవితాంతం భార్యను, పిల్లల్ని హింసించిన ఈ వ్యక్తి, తన స్వసుఖమే తప్ప తనవారి బాగోగులు, మంచి చెడ్డలు ఏమాత్రం పట్టించుకోని ఇలాంటి వ్యక్తి మళ్ళీ పునర్జన్మ ఎత్తటమా? ఇతనివల్ల జీవితంలో కనీసం ఒక్క రోజైనా అమ్మ సుఖంగా గడిపిందా? మేం ఒక్కనాడైనా ప్రశాంతంగా బతికామా? సభ్య సమాజంలో గౌరవంగా తలెత్తుకుని తిరిగామా? బంధువుల్ని, ఆత్మీయుల్ని ఏర్పరచుకోగలిగామా? ఈ మనిషి మారటానికి ఎన్ని అవకాశాలు ఇచ్చాం. అయినా మారాడా? లేదే! ఇలాంటి వ్యక్తి మళ్ళీ బతికొచ్చి ఏం చేస్తాడు? పేకాడుతాడు. తాగుతాడు. ముండల దగ్గరికి పోతాడు. భార్యాబిడ్డల కన్నీళ్ళూ బ్రాందీలో కలుపుకుని గుటగుట తాగుతాడు. ఇలాంటి మనిషి కంటెఏ చచ్చిన ఊరకుక్క బతికొచ్చినా మేలేమో! కుక్కకు విశ్వాసమైనా ఉంటుంది. ఇతనికి అదికూడా లేదు. ఇలాంటి వ్యక్తులు సభ్య మానవ సమాజంలో ఉండకూడదు. కట్టుకున్న వారిని, కన్నబిడ్డల్ని సమ్రక్షించని వాడు ఈ మానవ ప్రపంచంలో ఉండటానికి అర్హుడు కాడు. ఇళాంటి జూదగాడు, తాగుబోతు, తిరుగుబోతు, అబద్ధాలకోరు, అనైతిక వర్తన కలవాడు బతకకూడదు. కూతుళ్ళలోనూ, కోడళ్ళలోనూ 'ఆడదాన్ని' చూడటానికి ప్రయత్నిచే ఇలాంటి కాముకులు, దుర్మార్గులు ఈ లోకంలోకి రాకూడదు. తిరిగి రాకూడదు. అసలు వాళ్ళను మనం రానివ్వకూడదు. అవును! రానివ్వకూడదు... రానివ్వనే కూడదు...     "ఒరే అన్నయ్యా! పిలువకురా! ఆ దుర్మార్గుడ్ని తిరిగి రమ్మని పిలవకురా!" అని గొంతు చించుకుని గట్టిగా అరిచాను.
[విపుల మాసపత్రిక ఏప్రిల్ 2000 సంచికలో ప్రచురితం]
Comments