దిష్టి బొమ్మ - రావాడ శ్యామల

    "నాన్నా... నాన్నా..." అని కేకలేస్తూ సైకిల్ స్టాండ్ వేసి హడావిడిగా వచ్చాడు మురళి.

    ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. గబగబా లోపలికి వచ్చి మళ్ళా 'నాన్నా......నాన్నా....ఎక్కడ ..' గొంతులో విసుగు ధ్వనించింది.

    లోపల గోపాలం లేడు . మురళి విసురుగా బయటకు వచ్చాడు . ఇంటి ముందు బోరు దగ్గర బట్టలుకుతున్న పెళ్ళాన్ని ఉద్దేశించి అన్నాడు .

    "ఏమే ...నాన్నేడి?..."

    "ఏమో ...నాకేటి తెల్సు ..." అంది నిర్లక్ష్యంగా .

    "ఇంటి కాడ ఉండి... ఏం చేస్తావే.. నీ కళ్లు పోయాయా - ఎక్కడికి ఎల్లాడో తెలియదూ.." అన్నాడు కోపంగా .

    "ఇది మరీ బాగుంది... నీ అయ్య మీద కోపం నా మీద చూపీస్తావేం - అరగంట మునుపే అన్నం  తిన్నాడు . ఎక్కడికి ఎలతున్నారో సెప్సీపీ ఎలతారేంటి.. మీ అయ్య...కొడుకులు - ఊహు అయినా ఎక్కడికి ఎలతాడూ -- సీతాలు బడ్డీ ఎనకాల సింత సెట్టు దగ్గర సూడు . కూకోని సుట్ట కాలుత్తుంటాడు . 

    వెంటనే సైకిల్ని చింతచెట్టు దగ్గరకు పోనిచ్చాడు .          

    పెళ్ళాం చెప్పినట్లే అక్కడే కూర్చున్నాడు బీడీ కాల్చడం లేదు. ఎందుకో విచారంగా ఉన్నాడు. అయినా అది గమనించనట్లు నటిస్తూ....

    "నాన్నా... ఇక్కడున్నావా...పద...అర్జెంటుగా ఆర్డరులొచ్చాయి . ఏడు బొమ్మలు కావాలి . ఉదయం కల్లా రెడీ సెయ్యాలి . పద ఇంటికి....

    "నువ్వెల్లరా.... నువ్వెల్లి అన్నం తిను...పావుగంట్లో వస్తాను..."

    "సరే - బేగిరా - అసలే టైం తక్కువ..." సైకిల్ మీద సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. 

    వెళుతున్న కొడుకు వైపు చూస్తున్న గోపాలం కళ్ళు చెమ్మగిల్లాయి .

    చిన్నప్పటి నుండి గోపాలానికి బొమ్మలు చెయ్యడమంటే  మహసరదా... ఇంట్లో చెల్లెల్లకి...గుడ్డతో బొమ్మలు కుట్టి ఇచ్చేవాడు. చెల్లెలు వాటిని ప్రాణపదంగా చూసుకొని ఆడుకునేవారు. అలాగే వెదురు బద్దలు... గడ్డితో బొమ్మలు చేసి, వాటికి పాతబట్టలు వేసి దిష్టిబొమ్మలు చేసే వాడు. తండ్రి మెచ్చుకొని, వాటిని పొలంలో ఉంచాడు... పక్షులు రాకుండా ఉండడానికి. క్రమంగా బొమ్మలు చెయ్యడంలో మంచి నైపుణ్యం సంపాదించాడు. ఆరడుగుల పొడవుతో దిష్టిబొమ్మలు చేసే వాడు. బొమ్మలోని మహిమో, గోపాలం చేతి మహిమో తెలియదు గాని, పొలాలలో పక్షుల దాడి బాగా తగ్గిపోయింది . అందుకే చాలామంది రైతులు.. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా గోపాలం దగ్గర దిష్టిబొమ్మలు కొనడానికి ముందుకొచ్చారు.

    గోపాలం తండ్రి మాత్రం..."ఒరే ఆళ్ళంతా...మనలాటీ మామూలు రైతులు.. ఆల్ల అవసరాన్ని...యాపారం చెయ్యకు... నీ ఖరుసు ఎంత అయ్యిందో అంతే ఆల దగ్గర తీసుకో..." అనేవాడు.

    తండ్రి మాటని ఏనాడు జవదాట లేదు. తను ఏనాడూ ఎక్కువ డబ్బులు తీసుకోలేదు. గోపాలం చేతి వాసి మంచిదని --పంట నష్టం ఉండదని --అంతా అనుకోసాగారు. ఆ ఊర్లోనే కాక పక్క ఊర్లోని పొలాల్లో కూడా- ఎక్కుడ చూసినా గోపాలం చేసిన దిష్టిబొమ్మలే--పెద్ద పెద్ద కళ్ళతో అందంగా-నిటారుగా- సైనికుల్లా పహరా కాస్తున్నాయి. వాటిని చూసినప్పుడల్లా గోపాలం గుండె ఉప్పొంగిపొతుంది .

    క్రమంగా పెద్దాడయ్యాడు. గోపాలం తండ్రి- ఆడపిల్లల పెళ్ళల కోసం- పొలాన్ని అమ్మక తప్పింది కాదు. తరువాత వాళ్ళ పురుళ్ళు- అన్నీ అయ్యాక- గోపాలంని ఓ ఇంటివాడ్ని చేసి- చనిపోయాడు.

    తండ్రి ఇచ్చిన అప్పు భారాన్ని నెమ్మదిగా దించుకునేటప్పటికి - గోపాలానికి నలభైయేళ్ళు వచ్చేసాయి. ఇద్దరు పిల్లలు- వాళ్ళని చదివించాడు . కొడుకు మురళి మంచి తెలివైనవాడు. పక్కూరుకెళ్ళి..పదో తరగతి చదివేవాడు. దానికోసం ఊరి చివర దాకా నడిచి అక్కడ బస్సెక్కి వెళ్ళి వస్తుండేవాడు.
బస్సు ప్రయాణంలో- రకరకాల మనుష్యులలో పరిచయాలు- మురళిలో కొత్త ఆలోచనలు, ఆశలు రేకెత్తించాయి. లోకమంతా ముందకు పోతుంటే-- తామెంత వెనకబడి పోతున్నామో అర్థమైంది. 

    "జీవితమంటే పోరాటం --జీవితమంటే వ్యాపారం--"   

    తండ్రి పాత తరం మనిషి- నేటి వ్యాపార విలువలేవీ తెలియవు. తండ్రిలా మెతగ్గా ఉంటే...ప్రపంచం- మనల్ని తన పాదాల కింద అణిచి వేస్తుందని గ్రహించాడు. తండ్రి లాభాన్నాశించకుండా దిష్టిబొమ్మలు అమ్ముతుంటే..వాటిని కొందరు కొని ...రెట్టింపు ధరకి పక్క గ్రామాల్లో అమ్మడం చూసాడు.
అంతే-- తండ్రి చేత బొమ్మలు చెయ్యడాన్ని ఆపించాడు. బ్రతుకు పోరాటానికి సిద్దం కమ్మని-- పట్నం పోయి బ్రతుకుదామని చెప్పాడు. 

    ముందు పుట్టినూరుని విడిచి రాలేనన్నాడు గోపాలం . కాని.. తల్లి...పిల్లలు ఒక పక్షమైపోయారు. ఇంక వారి మాట కాదనలేక.. ఉన్న పూరిల్లు కాస్తా అమ్మి-- చిల్లర అప్పులు తీర్చగా- మిగిలిన- ముప్ఫై వేలు పట్టుకొని-- ఓ రోజు పట్నంకి పయనమయ్యారు. 

    గోపాలంకి ఊరు విడిచి వస్తుంటే- చేలల్లోని దిష్టిబొమ్మలు వీడ్కోలు చెపుతూ--బావురుమన్నట్టు అనిపించింది.  

    పట్నం వచ్చాక కుటంబ భారమంతా పదహరేళ్ళ మురళి తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ముందుగా చిన్నా ఇల్లు ఒకటి అద్దెకు తీసుకున్నాడు. దీనావస్థలొ ఉన్న పాత పెంకుటిల్లు అది. దానికన్నా ఊర్లో తామున్న పూరిల్లే నయమనిపించింది గోపాలానికి. "ఇష్టపడి పనిచేస్తే ఎంత కష్టమైనా తెలియదన్నట్లు.." పెళ్ళం...పిల్లలు అందరికీ ఆ ఇల్లు నచ్చింది .

    మురళి...తండ్రితో పాటు తాపీ పట్టుకొని కూలిగా జీవితాన్ని ప్రారంభించాడు. సాయింత్రం ఇంటికి వచ్చాక... తల్లితో బజ్జీలు... పకోడీలు... చేయించి... బజారుసెంటర్లో... బండి మీద పెట్టి అమ్మేవాడు. సాయంత్రాలు...చిరుతిళ్ళకు అలవాటుపడ్డ జనం ఆబగా కొనుక్కు తినేవారు. అలా వ్యాపారం మొదలు పెట్టాడు.

    మురళి ఊర్లో పూరిల్లు అమ్మగా వచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు. బాగా పరిచయమైన వాళ్ళకు--తన తోటి కూలీలక, మొదట్లో తక్కువ వడ్డీకి డబ్బులిచ్చేవాడు. అలా బ్రతకడానికి--డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. అందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలేవాడు కాదు. పైసా...పైసాని కూడబెట్టాడు.

    పట్నం వచ్చిన నాలుగేళ్ళకే- తాను ఒక చిన్న మేస్త్రీ స్థాయికి ఎదిగి పోయాడు. అంతకు తగ్గ బొంత అన్నట్లు- పెద్ద సంబంధాల జోలికి పోకుండా - తన లాంటి ఇంకో మేస్త్రీతో చెల్లెలి పెళ్ళిచేసాడు.  

    తల్లి బాగా జబ్బుపడినా-- సరైన వైద్యం చేయించలేదు. కూడబెట్టిన డబ్బంతా - కరిగి పోవడం చూడలేడు. గవర్నమెంటు మందులతో పోరు సాగించి  సాగించి-- తల్లి ప్రశాంతంగా కళ్ళు మూసింది.

    మురళి ఆడదిక్కు లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. వెంటనే.. ఓ పేదింటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళెయి ఆరు సంవత్సరాలయింది.

    ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు. ఖర్చులు పెరిగిపోయాయి. ఒక వైపు వడ్డీ వ్యాపారం--మేస్త్రీ పనులు- నిరంతరం పనులతో బిజిబిజీగా తయారయ్యాడు. ఎప్పుడూ డబ్బు ధ్యాసే...

    అందుకే ఇంట్లో పెళ్ళాన్ని ఖాళీగా కూర్చుంటే తిడతాడు. న్యూస్ పేపర్లతో కవర్లు చెయ్యమనో, మిషను మీద బట్టలు కుట్టమనో-- ఏదో ఎకటి చెయ్యమనేవాడు.

    అలాగే కూలికి వెళ్లలేని ముసలి తండ్రి- ఖాళీగా ఉండడం చూస్తే చిరాకుగా ఉండేది. అప్పుడే వచ్చిందా-- అయిడియా "ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుంది" అదేదో సెల్ఫోన్ అడ్వర్టైజ్ లాగా - మురళికి వచ్చిన అయిడియా గోపాలంకి నూతనోత్సాహం కలగజేసింది.

    తండ్రి తయారు చేయడం మానేసిన దిష్టిబొమ్మలు --మళ్ళీ తండ్రి చేతి చేయించాడు. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు... హస్పిటల్స్, హోటల్సు..ఇల్లులు కోసమని మూడు నుండి ఆరేడు- అడుగుల వరుకు ఉన్న దిష్టిబొమ్మలు చేయించి బయట అమ్మేవాడు మురళి. కొడుకు ఎంతకు అమ్ముతున్నాడో-- ఎవరికి అమ్ముతున్నాడో ఇవేవీ గోపాలంకి తెలియదు. తనలోని కళకి మళ్ళీ జీవం వచ్చిందన్న ఆనందంతో ఇంట్లో కూర్చుని సంతోషంగా బొమ్మలు తయారు చేస్తున్నాడు.

    కాని-- ఈరోజు --మధ్యాహ్నం --కోడలు తనకి అన్నంపెట్టి, బయట బోరు దగ్గరికి బట్టలుతకడానికి వెళ్ళిపోయింది. ఆ టైంలోనే బోరు దగ్గర ఖాళీగా ఉంటుంది మరి. గోపాలం -- పోర్టబుల్ టీ.వి ఆన్ చేసి వార్తలు చూస్తూ అన్నం తింటున్నాడు. రాష్ట్రంలో  పలుచోట్ల ఏవో గొడవలు జరుగుతున్నాయి. అవే చూపిస్తాన్నారు. గోలగోలగా ఉంది. ఛానల్ మార్చబోయాడు. అంతలో 'మంత్రి వెంకట్రావ్-డౌన్, డౌన్ ' అంటూ కొంతమంది కుర్రాళ్ళు ఓ దిష్టిబొమ్మని పిడిగుద్దులు గుద్ది- నేలకేసి కొట్టి- పెట్రోలు పోసి తగులబెట్టేసారు. అలా రెండు- మూడు చోట్ల జిల్లాలోని మంత్రి వెంకటరావు దిష్టిబొమ్మలు దగ్ధం చేసినట్లు చూపించారు. అది చూసి అన్నం తింటున్న గోపాలం పొలమారాడు. కడుపులో కెలికినట్లయింది. ఎందుకంటే అవన్నీ తను చేసిన దిష్టిబొమ్మలే.." అంటే.. మురళి.. ఈ దిష్టిబొమ్మలతో వ్యాపారం చేస్తున్నాడా".. మనసంతా ఏదోలా అయిపోయింది. అన్నం తినబుద్ధి కాలేదు. అలా లేచి వచ్చి - ఇలా ఇక్కడ చింతచెట్టు దగ్గర కూర్చుండి పోతాడు.
      
    "ఆర్డర్ వచ్చింది.. అర్జెంటుగా బొమ్మలు చెయ్యాలి.. పద" అని

    అదే ఇంతకు ముందు అయితే-- కొడుకు అలా అనగానే మొఖం దివిటీలా సంతోషంగా వెలిగిపోయేది. ఈరోజు అలా లేదు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడు.

    అప్పటికే గబగబా భోజనం ముగించాడు మురళి.

    "రా- నాన్నా---అన్నీ తెచ్చీసాను- ఎదురుముక్కలు , గడ్డీ- తెల్లగుడ్డ, దారం-- ఇదిగో అన్నీ ఉన్నాయి. నువ్వు బేగీ మొదలెట్టు" గబగబా చెప్పుకు పోతున్నాడు.

    కొడుకు వైపు నిర్వేదంగా చూసాడు.

    అది గమనించి.. "ఏమైంది నాన్నా- వొంట్లో బాలేదా" గాభరగా అడిగాడు.

    "ఈ.. దిష్టిబొమ్మలు ఎవరికి అమ్ముతన్నావురా.." 

    "అవన్నీ.. నీ కెందుకు గాని- బేగి చెయ్యి- ఉదయం కల్లా కావాలి..."

    "కాదు-- ముందు చెప్పు-- బిల్డింగులకోసమని తీసుకెళ్తన్నావు. కాని.. అయి గొడవలు కోసం... ఆటిని తగలెట్టం కోసమని నాకు సెప్పలేదు." టీవిలో చూసిన విషయం చెప్పాడు గోపాలం.

    విషయం ఎలాగూ తెలిసిపోయింది కదాని మొండి ధైర్యం వచ్చింది మురళికి.

    "అయితే... ఏంటట... డబ్బులు ఎక్కువ వస్తాయి. అందుకే అమ్ముతున్నాను..."

    "ఇంత- కష్టపడి సేత్తే - ఆటిని తగలెట్టీడం ఏటి బాగుందిరా..."

    "అదేదో-- నువ్వు ప్రాణం ఉన్న బొమ్మని చేసినట్లు , మాట్లాడతావేంటీ-"

    నీకు అయి ప్రాణం లేని బొమ్మలుగా కనిపించుతాది. కాని.. నాకు- అయి-- ఈ సేతులతో సేసిన బొమ్మలు రా-- అందుకే మమకారం- చేలల్లోని- పెద్ద పెద్ద బిల్డింగుల మీద ఎండకి ఎండుతూ-- వానకి తడుస్తూ గర్వంగా నిలబడతాయి. నరదృష్టిని తిప్పికొడతాయి. ఆటిని అలా చూస్తుంటే మనసు ఎంత పొంగిపోతుందో-- ఆటిని కాలితో తోక్కి-- తగలెట్టేస్తుంటే-- నా గుండెల మీద ఎవరో తొక్కి-- తక్కుతున్నట్లుగా అనిపించిందిరా-- ఇదిగో-- సూడు-- నీ పిల్లలకి గుడ్డబొమ్మలు సేసి ఇచ్చాను. నువ్వన్నావే-- ప్రాణం లేదని- కాని నీ కూతురు సూడు - దాన్ని-- దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా సూసుకుంటుంది. దానికి రంగురంగుల గుడ్డముక్కలు సుట్టి మురిసిపోవడానికి బొమ్మమీద మమకారం- సూడు"  సుమారు ఒక అడుగు పొడుగున్న గుడ్డ బొమ్మని తన పక్కనే పడుకో బెట్టుకొని- ఆదమరిచి పడుకున్న- నాలుగేళ్ళ మనవరాలిని చూపిస్తూ అన్నాడు.
        
    "అయితే ఏటంటావు నాన్నా-- అందరూ నీ బొమ్మలని పూజిస్తూ కూకోమంటవా- ఏభై రూపాయిలు కూడా చెయ్యని, ముష్టి దిష్టిబొమ్మకి ఆ గొడవల పుణ్యమా అని -- క్కోదానికి మూడొందలు దొరుకుతుంది. డబ్బు- సంపాదించడం ఇంక ఎప్పుడు నేర్చుకుంటావు-- నువ్వు కాకపోతే ఇంకొకడు చేస్తాడు. ఆడికాడే జనం కొనుక్కుంటారు. ముందు బతకడం నేర్చుకో- తర్వాతే ఆ మమకారాలు..." కోపంగా అని- అక్కడనుండి వెళ్ళి పోయాడు.

    "బ్రతుకిచ్చిన వాడికి బ్రతకడం ఎలాగో నేర్పిస్తున్నాడు" గోపాలం కళ్ళకి నీటి తెర కమ్మేసింది. మవునంగా-- కూర్చుని బొమ్మ తయారీలో పడ్డాడు.
            
    ఇన్నాళ్ళు- దిష్టిబొమ్మని పెళ్ళికూతురిని అలంకరించినట్లు - అత్తారింటికి పంపుతున్నట్లు ఊహించుకుంటూ చేసే వాడు....
          
    ఇప్పుడు- చనిపోయిన కూతురిని అలంకరించినట్లు- శవ యాత్రకు సాగనంపుతున్నట్లు అనిపించింది.
         
    కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు ఆ దిష్టిబొమ్మ మీద పడి అశ్రుతర్పణం చేసాయి.

(నవ్య వీక్లీ జూలై 25, 2012 సంచికలో ప్రచురితం)

Comments