దీవారేఁ - షాజహానా

 

    యవ్వనంతో తుళ్ళిపడే ప్రతి శరీరానికి వృద్ధాప్యం వచ్చి తీరుతుంది. కానైతే చివరి మజిలీ ఎవరి చేతుల్లో వెళ్ళమారుతుందో ఎన్నెన్ని నరకాలు వెళ్ళదీయాలో తెలీక చివరకు మిగిలే దుఃఖంతో చెలిమి చేస్తాం. ఒంటరితనంతో పాటు ఎత్తిపొడుపులు, కసిరింపులు మనకోసమే సృష్టించబడినట్లున్న ఒక చీకటి గది మూల... ఇదే మన గమ్యం..!   అనుభవపు ముడతలకు ఎక్కడా గౌరవమే లేదు. ప్రేమతో కూడిన ఒక పలకరింపు కోసం కూడా 93 సంవత్సరాల జీవి ఎదురు చూడాలా? నాకెందుకో మా దాదీమాను చూస్తున్న కొద్దీ దుఃఖం చెలిమలా ఊరుతుంది. ఇంతమంది సృష్టికి మూలమైన మాతృమూర్తిని ఇరుకింటింట్లో కాకుండా చివరి రోజుల్లో హాయిగా గాలి వెలుతురులో తిప్పాలని రెండు గదులు ఆమె కోసం కేటాయించాలన్న కోరిక నాలో మొలకెత్తింది. మా అబ్బా అమ్మీల హృదయం విశాలమైనా ఇంట్లో భాయి భాభీ పిల్లలు ఎవరైనా వస్తే వచ్చే ఇబ్బంది నాకర్థమయిపోయింది. దాంతో మాకున్న రెండు గదుల ఇంటి పక్కనే మరో రెండు గదులు కట్టించాలన్న తలంపు కలిగింది. అబ్బాతో అంటే చాలా సంతోషపడి, పక్కనున్న స్థలంలో కడదామని అన్నారు. ఇరుకింటితో ఇప్పటిదాకా నెట్టుకొచ్చినా ఇప్పుడూ బాగా ఇబ్బందిగా అనిపించడంతో కూడా అభిప్రాయానికి వచ్చారు అబ్బా. రెండుగదులు దాదీ కోసం... తరువాత నావి!

 

    వెంటనే ఊళ్ళో సీనియర్ మేస్త్రీని పిలిపించారు అబ్బా. మేస్త్రీ నెల్లూరు వాస్తవ్యుడు, కానీ ఇక్కడే స్థిరపడ్డాడు. ఆయనతో పాటు ప్రాంత యాస కూడా వచ్చి మా వాకిట్లో నిలబడింది. చాలా మర్యాదగా మాట్లాడుతున్నట్లున్నాడు కానీ నన్ను దాటి ఎవరూ ముందుకెళ్ళలేరు అన్న అహంభావమేదో ప్రతిమాటలో ప్రతిధ్వనిస్తుంది. అబ్బా అన్నారు, కాయితం రాసుకుందామని. కానీ ఎందుకండీ నేను మాటంటే ప్రాణం ఇచ్చే వాణ్ణి అనుకుంటూ వెళ్ళిపోయాడు మేస్త్రీ. రెండ్నెలల్లో రెండు గదులు కట్టడం పూర్తిచేయాలనేది ఒప్పందం. ఎస్టిమేషన్ కూడా వేసిచ్చాడు. కొంత అటు ఇటుగా అవుతుందని కూడా చెప్పాడు. అబ్బా ఆరోగ్యం కూడా అంతంత మాత్రానే ఉండటం వలన కొంత లౌక్య ప్రపంచంతో లావాదేవీలు అయనకు అలవాటు లేకపోవడం వలన కూడా ఇంటి పని మొత్తం పూర్తయ్యే వరకూ నేనే చూడాలని అబ్బా చెప్పడం వలన ఇక నేను పనుల్లో కూరుకుపోయాను

 

    నేను కట్టిస్తున్నానని అందరూ అనుకుంటున్న రెండు రూమ్‌ల పునాది తీయడానికి ఒక శరీరం భారంగా నడుచుకుంటూ వచ్చింది. మేస్త్రీ ఆదేశాల మేరకు ముగ్గు గీసింది. కొబ్బరికాయ కొట్టి అగర్‌బత్తీలు వెలిగించిన శరీరం కాలిపోయి చివరకు మిగిలిన నల్లని పుల్లలా వుంది. ముగ్గురు కొడుకులను, ముగ్గురు కూతుర్లను కన్న దేహానికి ఇప్పుడెవరూ తోడులేరు ఒక రెండు చేతులు, రెండు కాళ్ళు తన భార్య తప్ప. ఇప్పుడు పునాదులు తీస్తే లోపల ఆకలి గోతులను పూడ్చుకోగలదు. అసలు పునాదుల్లోనే ఎంత ఆకలి ఉంది? ముడుతలు పడిన దారుఢ్యంతోనే దేహం పునాదుల్ని తవ్వింది. వెళ్తూ వెళ్తూ అతను తన ఆకలిని, దాహాన్ని కొంత దుఃఖాన్ని పునాదుల్లోనే వదిలేశాడేమో


   ఇక  నెల్లూరు మేస్త్రీ మాటెంత తీపో... పనులు కూడా అంతే చేస్తున్నట్లు కనపడతాడు. అతను చేస్తున్న మోసం మోసమని నాకు అతను వెళ్ళిపోయాక కానీ అర్థమయేది కాదు. మళ్ళీ ఉదయాన్నే నవ్వుకుంటూ వచ్చేవాడు. నేను ఏమన్నా గట్టిగా అనడానికి లేదు. ఆయన సీనియర్ మేస్త్రీ..! నేను జూనియర్ వినియోగదారుని... ఏమన్నా అంటే మీకు తెలియదు లేమ్మా... అనేవాడు. దాంతో నిజమేనేమో... అనుకునేదాన్ని. కానీ చీప్ క్వాలిటి ఇటుకలు, బఠాణీ ఎక్కువున్న ఇసుకను మేస్త్రీ పాత బకాయిలకింద నాకు అంట గట్టాడని సమాచారం తెలిసేంతవరకు నాకు  అర్థం  కాలేదుకొంతలో కొంత నయమేమంటే... ఇంటిపనులు ఏమేం చేయాలో అతను చెప్పి వెళ్ళేవాడు... ముఖ్యంగా క్యూరింగ్ బాగా చేయాలని చెప్పేవాడు. క్యూరింగ్ చేయకపోతే గోడలు గట్టిగా ఉండవని చెప్పేవాడు. ఇక నేను డ్యూటీలో ఉండేదాన్ని... గోడల్ని తడుపుతూ నేను తడుస్తూ. ప్రదేశమంతా నీళ్ళు కారుతూ వర్షాకాలాన్ని తలపించేది. అదంతా నాకు కొత్తగా ఉండి ఇష్టంగా నేను పనుల్లో మునిగిపోయేదాన్ని. దాదీకి బయటికెళ్ళడానికి ఇబ్బందవుతుందని ఎటాచ్డ్ బాత్‌రూమ్ ప్లాన్ చేశాను. వెస్ట్రన్ టాయ్‌లెట్‌ను చూసి దాదీ ఎలా ఫీలవుతుందోనని పక్కన మామూలుది కూడా పెట్టించాలని మేస్త్రీతో మాట్లాడాను. ముందు మాట్లాడిన దానికంటే డబ్బులు పెంచేశాడు

 

    ఒకోసారి ఇసుక కుప్పపైన అనువాద కవిత్వం కథలు చదువుకుంటూ, మధ్యమధ్యలో వాళ్ళు గోడలు కడుతున్న వైనాన్ని గమనిస్తూ ఉండేదాన్ని!

 

    ఇక సాయంత్రమయిందంటే నా క్యూరింగ్ డ్యూటి మొదలయ్యేది! బాగా ఆకలిగా ఉన్న పసిపిల్ల నోట్లో పెట్టిన పాల బాటిల్‌ని ఆవురావురని తాగుతున్నట్లు పైపులోంచి వచ్చే నీళ్ళని గోడలు దేహం మొత్తంతో పీల్చేస్తున్నాయి. పైపు చివరనున్న నన్ను కూడా తాగేస్తాయోమోనన్నంత ఆకలిగా ఉన్నాయి గోడలుక్యూరింగ్/క్లీరింగ్ చేస్తున్నాను గోడలకు. నిన్నటి దాకా ఇటుకలుగా ఒక పక్క, ఇసుక కుప్పలుగా మరో పక్క... సిమెంట్ బస్తాలో కూర్చబడి వరండాలో ఉన్న విభిన్న పదార్థాలు ఇవి. హఠాత్తూగా వీటికి ఆత్మెలా వచ్చింది? ఎంతగా తాగేస్తున్నాయై నీళ్ళని!

 

    కడుపు నిండిన పిల్లాడు మొహం తిప్పినట్లు గోడలు నీళ్ళను తాగడం వదిలేసాయి... నేను మోటార్ స్విచ్ఛాఫ్ చేసాను. గోడల్లో ఆత్మనెవరో రచించారు... సిమెంట్, ఇసుకతో పాటు ఆకలిని ఎవరో ఒంపారు. గోడల్లో ఇటుకలను పేర్చిన చిట్టి చేతుల్లో ఏంశక్తి దాగివుంది? చేతుల వెనుక... చిన్న దేహం... దేహం వెనుక మరో కొన్ని దేహాల సమూహం... సమూహాలతో కూడిన ఒక విసిరేయబడిన తండా... ఇవన్నీ గోడల్లో దాక్కున్నాయా? లేక దాహం పాలబుగ్గల తండా పిల్లగాడు కట్టిన గోడ కింది పునాది తీసిన ముసలిచర్మం చేతులదా?

 

    మేస్త్రీ గొణుక్కుంటున్నాడు "బుజ్జమ్మా, నువ్వేమో నెల్లోపు అంతా ఐపోవాలంటుండవ్. ఇక్కడ మనుషులు దొరకడం లా... వరికోతలు, పత్తి తీయడం అన్నీ ఒక్కసారే వచ్యుండ్లా... ఒక్కోడికి ఎంత డిమాండ్ అనుకుంటుండవ్... మూడొందలిచ్చి ఆటోలో తీసుకెళ్ళినా రావడల్లా" అంటున్నడు. విని ఊరుకున్నాను. మనుషులు ఇలాంటి పనులకు దొరకకపోవడమే మంచిది. కావలసింది కూడా అదే.

 

    నేను మధ్యలో దాదీని చూడ్డానికని వెళ్ళివచ్చేసరికి పునాదులయిపోయి గోడ కూడా లేచింది. అయితే నాకు బాత్‌రూమ్ చిన్నగా అనిపించింది. మా దాదీమా ఆరడుగుల ఎత్తు. ఆమెను కూర్చోపెట్టి స్నానం చేయించడానికి అది సరిపోదు. మేస్త్రీని పిలిచి చెప్పాను. ఆయన ముందు గోడను జరిపి కట్టడానికి ఒప్పుకోలేదు. కానీ నేను పట్టుపట్టేసరికి, మళ్ళీ కొన్ని డబ్బులు పెంచేసి అంగీకరించాడు.పెద్దగా విశాలంగా ఉన్న బాత్‌రూమ్ గోడలను చూసాక నాకు తృప్తిగా అనిపించింది.

 

    మేస్త్రీలు ఎన్ని ఇళ్ళు కట్టిస్తారు... ఎంతమంది పనిచేస్తారు వీళ్ళకింద.కాని మొదట ఒప్పుకున్న మొత్తానికే చివరికటా ఉండటం కష్టం. మధ్యలో ఖర్చులన్నీ మీదేస్తారు నిర్దాక్షిణ్యంగా. ఒకవేళ మేస్త్రీ దాహం కాదు కదా గోడల్లో ఉంది. అదే అయితే ఎంత నీళ్ళు పెట్టినా, నిరంతరం పెట్టినా అది తీరేది కాదు.

 

    నేను ఇంటి నిర్మాణం కోసమే వచ్చాను కాబట్టి వర్కర్స్ వచ్చిన దగ్గర్నుంచి వెళ్ళేంతవరకు బయటే కూర్చునేదాన్ని. ఇసుక, కంకర, ఇటుక వేయడానికి పక్కన గుబురుగా పెరిగిన చెట్లను సగానికి పైగా నరికేయాల్సి వచ్చింది. నరుకుతుంటే చాలా ఆకులు రాలి పడుతుంటే కొన్ని ఆకులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఎగిరిపోతున్నాయి.   అవి సీతాకోకచిలుకలు. పెద్దవి, చిన్నవి, రంగురంగులవి... నేను చాలా ఆనందించాను. చాలా రోజులకు ఎన్ని బటర్‌ఫ్లైలను ఒక్కచోట చూశాను. మధ్యాహ్నానానికి చూస్తే ఒక సీతాకోకచిలుక కిందపడి ఉంది. దాన్ని ఎర్ర చీమలు కసిగా తినేస్తున్నాయి. చీమల్లో నేనూ ఒక చీమనా? ఉలిక్కి పడ్డాను. సాయంత్రానికల్లా నా చుట్టూ ఎగురుతూ వందల బటర్‌ఫ్లైలు నన్ను నిలదీస్తున్నయి. మా ఆహారమేది? మా నివాసమేది? కంకర మీద వాలుతున్నాయి. వాటికి తేనే దొరకలేదు. ఇసుక మీద ఇటుకల మీద కూడా ఆహారం దొరకలేదు. పాలుపోని సీతాకోక చిలుకలన్నీ ద్రిమ్మరుల్లా వూరికే అటూ ఇటూ తిర్గుతున్నాయి. నాకు వాటి మాటలు వినాలనిపించింది. కనిపించిన ప్రతి సీతాకోకను అడిగాను. అవి వాటి దుఃఖంలో వాటి ఆకలి దప్పుల్లో అవి మునిగిపోయి వున్నాయి. మాటిమాటికీ నన్ను శాపనార్థాలు పెడుతున్నట్లుగా అనిపిస్తుంది నాకు

 

    వాటికి రాళ్ళలో, ఇటుకలో, ఇసుకలో, ఇనుపరాడ్లలో ఏమీ దొరక్కపోగా వాటి ఆకలి, దప్పిక కొంత వీటికే అంటినట్లుంది. అదే గోడలకి చేరిఉంటుంది. రాత్రి ఇసుక దిబ్బ మీద కూర్చొని నేను వాటి పెద్దతో అతి కష్టం మీద మాట్లాడించాను. ఎట్‌లీస్ట్ భావాలను నా మనసుతో అనువాదం చేసుకున్నాను. నా మూసిన పిడికిలి మీద ఎగరడానికి సిద్ధంగా వున్న విమానంలా కూర్చున్న సీతాకోక చిలుక నాతో కొన్ని మాటలు మాట్లాడింది."ఎలా చెబితే నీకు అర్థమవుతుంది. మీరనుభవిస్తే తప్ప మా బాధ అర్థం కాదు కదా! మనుషులకు మనుషులు, ప్రాంతాలకు ప్రాంతాల్నే ఆక్రమిస్తున్నారు... మేమెంత? పోలవరం కట్టిస్తే ఎంతమంది బాధపడతారో... పడుతున్నారో తెలుసుగా. అదిగో అలాంటిదే మా బాధ. మాకెవరూ వాగ్దానాలు చేయరు పునర్నివాసాల గురించి. మధ్యాహ్నం మావాళ్ళు పాతిక మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఎవరికి పట్టింది. దీనికి కారణమైన నీక్కూడా బాధాలేదు. పోలవరంలో మా బంధువులున్నారు. వాళ్ళప్పుడు చెప్తుంటే మాకర్థం కాలేదు కానీ ఇళ్ళు కోల్పోవడం అంటే ఏమిటో ఇప్పుడిక్కడ జరిగిన విధ్వంసం చూస్తుంటే అర్థం అవుతుంది. ఎక్కువగా ఏడిస్తే తడికి నా రెక్కలు అతుక్కుంటాయి... నేను ఎగరలేను... శత్రువులు నన్ను పీక్కుతింటాయి. అలా అని ఏడవకుండా వుండలేను. మా పసిపిల్లలు ఎక్కడ పడుకోవాలో తెలియక ఏం తినాలో తెలియక అయోమయంగా తిరుగుతున్నాయి, ఇంక నేను వెళ్తాను" అని సున్నితమైన రెక్కల్ని రెపరెపలాడిస్తూ పైకెగిరింది.

 

    నాకు పోలవరం నిర్వాసితుల గోడు కళ్ళముందు మెదిలింది. నేను వీటికి వాగ్దానం చెయ్యలేక పోతున్నానే..? నాకేం హక్కుంది వీటిని అనాథలుగా మార్చడానికి. తల భూమిలోకి కృంగిపోతుంటే హృదయం సాక్షిగా క్షమార్పణలు అడిగాను. కానీ ఏం లాభం... క్షమార్హురాల్ని కాదు కదా!

 

    కడుతున్న రెండు రూమ్‌లలో దాదీమా పడుకునే రూమ్‌లో టీవీ పెట్టాలని అనుకున్నాను. ఎందుకంటే టీవీ చూడాలంటే అందరూ దాదీమా రూమ్‌లొకే రావాలి. అప్పుడు దాదీమాకి బోర్ కొట్టదు..! ఏదన్నా కావాలంటే దాదీమా మొత్తుకోనక్కర్లేదు... ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు అనుకున్నాను.

 

    పని చేయడానికి వస్తున్నవాళ్ళంతా భవానీలు, అయ్యప్పలు. వీళ్ళంతా తండావాళ్ళే. ఇప్పుడు వాళ్ళని ఎవరూ బూతులు తిట్టరు. ఒరేయ్ అనరు, ఇంకేమీ అనరు. కేవలం భవానీ, స్వామి అని మాత్రమే అంటారునేను భయ్యా అని పిలిచేదాన్ని. వాళ్ళు మాతా అంటుంటే చెప్పలేని వాత్సల్యం పుట్టుకొస్తుంది. ఇల్లంతా అయిపోయాక వీళ్ళందరికీ తలా ఒక టీ షర్ట్ కొనాలనుకున్నాను. అసలెందుకు వీళ్ళందరూ ఇవన్నీ వేసుకోవడం. అందరిలో సమానంగా భవానీ అని పిలిపించుకోవడం వెనుక ఎన్ని తరాల అవమానం దాగుంది. ఎవరి విజయం ఇది? ఎవరి వైఫల్యం? వెలుతురు కోసం సిటీ బస్సుల కోసం తండా ఇంకా ఎంతగా ఎదురు చూస్తుంది. తెగిన గాలిపటాల్లాగా పడిఉన్న తండాలు బయటికెగరడానికి ప్రపంచంలోకి ఎగరడానికి ఇంకెంత కాలం పడుతుంది? తపనేనా గోడల్నిండా పరుచుకుంది?

 

    దాదీమాకి ఎండ రాకుండా కిటికీలకు కూలింగ్‌గ్లాస్‌లు పెట్టించాలనుకున్నాను. ఇండోర్‌ప్లాంట్స్... బయట హ్యాంగింగ్ ప్లాంట్స్... ఒకటేమిటి... ఇల్లంతా పూలతీగలతో... పరిమళాలతో నింపేయాలనుకున్నాను. ఇసుక మీద కూర్చుని ఇల్లుని దాదీమాకు అనుకూలంగా ఉండేలా రకరకాలుగా ఊహల్లో ముందే కట్టేస్తున్నాను నేను! చిన్నప్పుడు దాదీ పాలగోకు రాచిప్పతో గీకి అర్చేతుల నిండా పాలు కారంగా ఎలా పెట్టేది? అప్పుడు దాదీమా చేతులు ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవి? ఇప్పుడు పాలమీగడల్లా మెత్తగా అయిపోయాయి. ఎంతమందికి దానం చేసిన చేతులు... ఎంత పనో అలుపెరుగక చేసుకుంటూ పోయిన చేతులు... ఇపుడు సహారా కోసం చూస్తున్నాయి..!

 

    మా దాదీ... ఒకటే ఏడుపు. తొంభై ఏళ్ళ మా దాదీ ఎండిన కళ్ళలోంచి కన్నీళ్ళు సుడిగుండాలై చుట్టేస్తున్నాయి నన్ను. ఆమె దేహం ప్రేమను ఆప్యాయతను కోరుతూ కోరుతూ ముడుతలు ముడుతలుగా మడతలు పడిపోతుంది... గోడలు దాదీ శరీరంలోని ముడుతల్లా చాలా అగాధాలను ప్రేమరాహిత్యాన్ని దాచుకుని వున్నాయా? దాహమేనా అది..? అందుకేనా అంత దాహం? 'వాడు నన్ను పలకరించను కూడా లేదు. వాడిది ఎంత కఠిన హృదయం...' చిన్న కొడుకుని తలచుకొని దాదీ మనసు తడిసిన దూదిలా కనిపిస్తుంది నాకు. దాదీకి కాలం గీసుకుని శరీరం మీద ఎన్ని లెక్కలేనన్ని గీతలు పడ్డాయో, చిచ్చా మాటలకు దాదీ మనసు కూడా అంతలా గీసుకుపోయిందని నాకు అర్థం అయింది.అందుకే ఇల్లు పూర్తవ్వగానే ఇంకెప్పటికీ చిచ్చా ఇంటికి దాదీని పంపించకూడదనుకున్నాను. అబ్బా కూడా అదే అన్నారు.

 

    అయ్యప్ప, భవానీ దీక్షలు అయిపోయి పనులకు యథావిథిగా వస్తున్నారు వర్కర్స్. నాకు రోజు బూతులతో మెలకువ వస్తుంది. నాయక్ నాకొడుక్కు ఏమయిందటరా... పనికి రాలా... తాగుడెక్కువైందేమో..? మేస్త్రీ అధికారపు మాటలు నా చెవుల్లో మంటను లేపుతున్నాయి...

 

    మొత్తానికి చివరి ఘట్టానికి వచ్చింది ఇల్లు. దాదీకి కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. హాయిగా లేత వెన్నెల్ల కనిపించే రంగులు వేయాలని నేను మా అబ్బా అనుకున్నాము.

 

    చిచ్చా ఇంట్లో ఉన్న దాదీ కింద పడిందన్న వార్త మా ఇంట్లో కలకలం రేపింది. వెంటనే ప్రయాణమయ్యారు అమ్మీ అబ్బా...

 

    వెళ్ళిన తెల్లారే మిగతా అందర్నీ ఇంటికి తాళం వేసి రమ్మని కబురు. ఆందోళనతోనే అందరం చిచ్చా దగ్గరకు వెళ్ళాం..! ముడుతల్లోంచి మౌనంగా జాలువారుతున్న కన్నీరు వీడ్కోలు పలుకుతుంది... ఆమె గాలి వెలుతురు పరుచుకున్న విశాల విశ్వంలో తన నివాసాన్ని వెదుక్కుంటూ వెళ్తుందన్న విషయం నాకు అర్థమై పోయింది..! ఇంత పెద్ద వంశానికి మూలమైన ఇద్దరిలో దాదా ఎప్పుడో వీడ్కోలు తీసుకోగా మిగిలిన దాదీ ఇప్పుడు అదే దారిలో ఉంది. మేమంతా చెంచాతో నీళ్లు ఆమె నోట్లో పోస్తున్నాము. మా అమ్మీ పోస్తున్నప్పుడు ఇంకా పోయమని అతి కష్టం మీద సైగ చేసింది. చూస్తుండగానే దాదీమా అందర్నీ వదిలి ఎవరో పిలుస్తున్నట్లు వెళ్ళిపోయింది. మా దాదీ కోసం మా స్వంత ఊర్లో దర్గా చింత కింద శాశ్వతగృహం నిర్మించారు.

 

    కాని నేను ఆమె కోసమే మూడునెలల కాలాన్ని, ప్రేమని రంగరించి కట్టించిన గూడులో మాత్రం ఆమె ఒక అడుగు కూడా వేయలేదు... ఒక్కరోజు కూడా నివసించలేదు... కనీసం ఒకసారి చూడను కూడా లేదు! నాకు ఒక్కసారిగా దుఃఖం తన్నుకు వచ్చింది

 

    అంతా పూర్తయ్యాక బస్సెక్కి కూర్చున్నాను. చుట్టూ కుప్పలుగా ఆలోచనలు కందిరీగల్లా కుడుతున్నాయి

 

    అసలు ఇల్లెవరిది? అసంఖ్యాకంగా కనిపిస్తున్న ఇళ్ళన్నీ ఎవరివి? ఇటుక ఇటుకలో రక్తం, చెమట దాగుందని నాన్నలు అనుకుంటారు కదా! ఇళ్ళన్నీ నాన్నలవేనేమో. నాన్నల రక్తం, చెమట చిందించేందుకు అన్ని విధాల ఇంట్లో కష్టపడేది అమ్మలు. ప్రతి కష్టం నష్టం భరించేది అమ్మలే. ఇళ్ళను తుడిచి, ఊడ్చి ప్రతిక్షణంవాటితో అనుబంధాన్ని కొనసాగిస్తుంటారు అమ్మలుఇళ్ళన్నీ అమ్మలవేనేమో. ఆస్తులన్నీ కొడుకులవనుంటారు కదా!ఇళ్ళన్నీ కొడుకులవేమో. పరాయి ఇంటినుంచి కట్నం తీసుకొని వచ్చేది ఇళ్ళు చూసి కూడా కదా! ఇళ్ళన్నీ వీళ్ళవేనేమో. అసలు ఇళ్ళన్నీ అంత అవసరమా!

 

    "బుజ్జీ! ఇల్లు కడుతున్నావంట కదా!" ఊరివాళ్ళ పలకరింపులు... మనసులో ఎంత సిగ్గుపడ్డాను. ఎంత అపరాధ భావన. "నీదేనంట కదా!"

 

    నాదా? నాదనేది ప్రపంచంలో ఏదైనా ఉందా? నేనే నాది కాదు! నేనే నాది కాదు! నేనే నాకు చెందను. నవ్వొచ్చింది నాకు.

 

    నాకు ఇంటి మీద ఆసక్తి లేకుండా పోయింది. రోజు సీతాకోక చిలుక చెప్పింది కదా - మరో చెట్ల సమూహంలోకి అన్వేషణ...ఏదీ శాశ్వతం కాదు... తమ ప్రయాణం రేపే - అని. నాక్కూడా సుతిమెత్తని రెక్కలేవో ఉన్నట్లు నా చేతులకేసి చూసుకున్నాను. కొంచెం సంతృప్తిగా అనిపించింది. అప్పటిదాకా గూడు కట్టుకున్న దిగులేదో తలుపులు తెరుచుకుని ఎగిరిపోయింది

Comments