ద్రౌపదీ భారతమ్ - కొంపెల్ల లక్ష్మీసమీరజ

    డాన్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఇటీజ్ ఎ వే ఆఫ్ ఎక్స్‌పీరియన్సింగ్ వన్‌సెల్ఫ్ 'అశ్వత్థ'ను చూడగానే మొదటిసారి అనుకున్నాను నేనా మాట! కానీ,'పాదముల పెదవులకు - గుండెల అందెలను జతకూర్చి- అంగభంగిమలే స్వరాలుగా - మనస్సు చేసే మంత్రోచ్చారణ నాట్యమంటే' అని చెప్పాడతడు. ఆ మాటలను మనస్సుకు పట్టించుకుని, అర్థం చేసుకోవటానికి - నేను అతడి నాట్యాన్ని ఎన్నోసార్లు చూశాను.     నేను 'బార్క్'లో సైంటిస్ట్‌గా ముంబాయిలో ఉంటున్నాను. ఈ మధ్యనే నాకు 'ఉత్తర'తో మ్యారేజి సెటిలయింది. అయితే ఉత్తర మా దగ్గర జూనియర్ సైంటిస్ట్‌గా జాయినవటమూ, మా పెళ్ళి కుదరటమూ రెండూ ఒకే సారి జరగటంతో ఏది ముందు జరిగిందనేది చెప్పటం కష్టం. ఇద్దరం ఒకే చోట ఉద్యోగాలు చేస్తూ ఉండటంతో ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే అవకాశం కలిగింది. తనూ నాలాగే వాళ్ళ పేరెంట్స్‌కి ఒక్కటే సంతానం కావటంతో మా కుటుంబాల మధ్య రాకపోకలవీ జరుగుతూ దాదాపు పెళ్ళికి ముందే అందరం ఒకే కుటుంబంలా కలిసిపోయాము.     మా పెళ్ళి మరో మూణ్ణెల్లలో జరుగుతుందనగా అప్పుడు వచ్చాడతడు మా ఆఫీసుకి-     తుఫానులా వస్తూనే, నా దగ్గరకొచ్చి చేయి చాపి..."మిస్టర్ మోహనచంద్ర గ్లాడ్ టు మీట్ యు" చెప్పాడు.     "అయాం సారీ... మీరెవరో నాకు తెలియటంలేదు" చెప్పాను కుర్చీలోంచి లేచి నిల్చుంటూ.     "ఇదే మొదటిసారి మనం కలుసుకోవటం... నా పేరు అశ్వత్థ నారాయణ. నేను కెనడాలో ఉంటాను. రేపు ఉదయం మీ పేరెంట్స్ ని తీసుకుని మహాలక్ష్మీ టెంపుల్‌కి రావాలి మీరు ప్లేజ్" చెప్పాడు చేతినలా చాచి ఉంచే!     "ఏమిటి విషయం?" అతడి చేతిని పట్టుకుంటూ అడిగాను.     "విషయం అక్కడ మాట్లాడు కుందాం... పదిన్నరకంతా అక్కడికొచ్చేయండి ప్లీజ్" నా చేతిని మృదువుగా కదిపి, ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు.     మెరిసేకళ్ళూ, ఆజానుబాహు రూపమూ, విశాలమైన నుదుట జ్యోతిలా కుంకుమబొట్టూ... అతడినెక్కడో చూశాననిపించింది.     ఇంటికి వెళ్ళి మా అమ్మకీ, నాన్నగారికీ చెప్పానతడిగురించి.     అమ్మ 'ఎవరో అనామకుడు పిలిస్తే వెళ్ళడమేమిటి వద్దం'ది. నాన్న ఒక్క క్షణం ఆలోచించి, వెళ్ళి నాలుగు రోజుల క్రితం వచ్చిన 'హిందూ'పేపరు తీసుకువచ్చి... లోపల పేజీల్లో వెతికి, ఒక ఫోటో చూపించి "వచ్చిన అబ్బాయి ఇతడే కదూ!" అడిగారు. అవును! అప్పుడు గుర్తొచ్చింది నేనతడి ఫోటో చూసిన విషయం!     "వచ్చే సంవత్సరం మార్చి 25వ తేదీన 'రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్'లో జరిగే 'మఘం' మ్యూజిక్ అండ్ కల్చరల్ ఫెస్టివల్‌లో భారతదేశం తరఫున 'భరతనాట్యం' ప్రదర్శించటానికి అతడిని అక్కడి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వాళ్ళు పిలిచారట. ఒక భారతీయుడు, ఆదేశాన్ని సందర్శించి మన కళను అక్కడ ప్రదర్శించటం ఇదే మొదటి సారి. ఇతడు కెనడాలో ఉంటున్నాడు" అంటూ ఇతడిని గురించి రాశారక్కడ. నాకు బాగా నచ్చినది - 'ఐ సెట్ మై గోల్ అండ్ లివ్ మై ప్యాషన్' అని అతడన్న మాట! అప్పుడే అనుకున్నాను - 'డాన్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఇటీజ్ ఎ వే ఆఫ్ ఎక్స్‌పీరియన్సింగ్ వన్‌సెల్ఫ్'అని!     మర్నాడు మేము గుడికి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ మా మామగారు అత్తగార్లతో ఉత్తర కనిపించింది. 'ఉత్తరని తీసుకుని ఈ టైమ్‌కి ఇక్కడికి రమ్మ'ని మా మామగారిని కలిసి చెప్పాడట అశ్వత్థ. ఆయన కూడా 'అతడిని గురించి పేపర్లో చదివాన'ని చెప్పారు. కారణం ఏమిటో ఎవ్వరం ఊహించలేక పోయాము.     ఆ వెనకే వచ్చాడతడు. వస్తూనే మమ్మల్ని అమ్మవారి దర్శనం చేసుకున్నారా అని అడిగి - 'అయింద'ని చెప్తే ..."సరే! నేను వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. వెళ్ళి సముద్రం దగ్గర కూర్చోండి" చెప్పి అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు.     కొద్ది సేపటి తరువాత, వస్తూనే 'థాంక్స్ ఫర్ కమింగ్'అన్నాడు మా దగ్గర కూర్చుంటూ -     "ఇప్పుడు చెప్పండి... మీకేం కావాలి?" అడిగాను వెంటనే.     "ఉత్తర" చెప్పాడు.     "వ్వాట్?" బుల్లెట్‌లా దూసుకొచ్చిందా మాట అందరి దగ్గరనించీ ఒకేసారి.     "అయాం సారీ... అయాం ఎక్స్‌ట్రీమ్లీ సారీ...! డోంట్ మిసండర్‌స్టాండ్ మీ..." రెండు చేతులూ జోడించి దణ్ణం పెడుతూ చెప్పి -     "నేనొక భరతనాట్య కళాకారుణ్ణి... ఉత్తర, ఒక సంవత్సకాలం పాటు నాకు శిష్యురాలిగా కావాలి...ఐ మీనిట్...ఎస్...ఐ మీనిట్..." చెప్పాడు.     అందరం ఒక్కసారి షాకయ్యాం ఆ మాటవిని -     మా పరిస్థితి అతడికి అర్థమయినట్లుంది -     "మా నాన్నగారు ఫ్లోరిడా యూనివర్సిటీలో మేథమెటిక్స్ ఫాకల్టీలో ప్రొఫెసర్. నేను నాకు పదిహేడేళ్ళు వచ్చేదాకా ఇక్కడే తమిళనాడులోని మా బామ్మ తాతగార్ల దగ్గర పెరిగాను. అప్పుడే దాదాపు రెండేళ్ళ వయస్సునించీ... పదిహేనేళ్ళపాటు డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యంగారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను. తరువాత ఫ్రాన్స్‌వెళ్ళి అక్కడ 'విలే'యూనివర్సిటీ నించి ఫ్రెంచ్ లాంగ్వేజ్‌లో పి.హెచ్.డి డిగ్రీ తీసుకున్నాను. ఇప్పుడు కెనడాలో.."అంటూ చెపుతుంటే -     "అవును. అదంతా మొన్న హిందూపేపర్లో చదివాము. అసలు మేము మీకెలా తెలుసు?" మా నాన్న అడిగారు.     "రెండు నెలల క్రితం మా ఫ్రెండ్ రాజీవ్ వివాహం జరిగింది ఇక్కడ ముంబాయిలో! తను ఆ క్యాసెట్ మాకు చూపించాడు. దానిలో పెళ్ళికూతురు ఫ్రెండ్‌గా నేను ఉత్తరను చూశాను. దాదాపు మూడేళ్ళుగా నేను "ద్రౌపదీ భారతమ్" అనే నృత్యరూపకం ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నాను. అందులో ద్రౌపది పాత్ర పోషించగలిగిన ఆర్టిస్ట్‌లు ఎవరూ నాకు కనిపించలేదు. ఆ కారణంతోనే అది ఇన్నేళ్ళయి ఆగిపోయింది. ఇప్పుడు ఉత్తరలో నాకు ద్రౌపది దర్శనమిచ్చింది. ఆగిపోయిన నా నృత్యరూపకం తిరిగి ప్రారంభించాలన్న నా నిర్ణయం స్థిరపడినప్పుడే - చెన్నయ్ నుంచి- మా గురువుగారు రింగ్ చేసి, ఇక్కడ 'సీతా కల్యాణమ్' నృత్యరూపకం ప్రదర్శించటానికి రమ్మని ఆహ్వానించారు. నాకది శుభసూచకంగా అనిపించింది. 'ఆ రూపేణా ఇక్కడకు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కలిసి ఉత్తరను నా శిష్యురాలిగా తీసుకోవచ్చును కదా'అని! నేను చెన్నయ్ వచ్చి రెండు రోజులయింది. "ద్రౌపదీ భారతమ్" గురించి మా గురువుగారితో చర్చించాను. ఉత్తర ఫోటో చూపించాను. ఆవిడ చాలా సంతోషించి ఆశీర్వాదం అందించారు. వెంటనే నేనిక్కడకు బయలుదేరి వచ్చాను. రాజీవ్ తన వైఫ్‌ను అడిగి మీ అడ్రస్ ఫోన్‌నెంబర్లూ ఇచ్చాడు. అంచేతే నేను మిమ్మల్ని వెంటనే కాంటాక్ట్ చేయగలుగుతున్నాను."     "మీరు పేపర్లో చదివామంటున్నారు కదా! 'మఘమ్' మ్యూజిక్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ గురించి తెలుసుకోవాలంటే - ముందు 'మఘమ్' అంటే - రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజన్ లోని అత్యంత ప్రాచీనమైన శాస్త్రీయ సంగీతం. రెండువేల మూడవ సంవత్సరంలో యునెస్కో ఆ సంగీతం యొక్క ప్రాశస్థ్యాన్ని గుర్తించింది. లయ, సంగతులు, ఆధ్యాత్మికత - వీటిలో ఈ సంగీతం మన భారతీయ సంగీతంతో సమాంతరంగా సాగుతుందని నేను గమనించాను.ఆ విషయంలో ప్రస్తుతం రీసెర్చి ప్రారంభించాను. అలా నేను అక్కడి వాళ్ళకి పరిచయం కావడంతో, నన్ను ఈ ఫెస్టివల్‌లో ఒక ప్రోగ్రాం ఇవ్వమని అడిగారు. నేను 'సోలో' ప్రోగ్రాం కంటె - మన సంస్కృతి, సభ్యతలను తెలియజేసే ఒక నృత్య రూపకం - టీమ్ ఐటమ్‌గా చూపిస్తే బాగుంటుందని అభిప్రాయపడి - ఈ ద్రౌపదీ భారతమ్ అక్కడ ప్రదర్శించవచ్చు కదా అని అనుకున్నాను. సో... మీకిప్పుడు అర్థమయి ఉంటుంది. ఉత్తర, నాకు సంవత్సర కాలం పాటు శిష్యురాలిగా కావాలి. బదులుగా నేను అంతర్జాతీయ రంగస్థలం మీద ఆ దేశంలో భరత నాట్యం ప్రదర్శించిన ప్రథమ స్త్రీగా తనకి ఖ్యాతిని ఇవ్వగలను" చెప్పాడు అశ్వత్థ.     "నా గురించి అంత పెద్ద నిర్ణయం తీసుకోవటానికి మీరెవరసలు? అదే నాకు నచ్చలేదు ముందు. నేను ఒప్పుకోవటం లేదు. ఐ డోన్ట్ లైకిట్... సారీ! పదండి అందరం వెళ్ళిపోదాం" చాలా క్విక్‌గా రియాక్టవుతూ చెప్పింది ఉత్తర వెంటనే.     "ముక్కూ మొహం తెలియని పరాయి ఆడపిల్ల... అందులోనూ పెళ్ళికుదిరి మూణ్ణెళ్ళలో పెళ్ళి ఉందనగా ఇలాంటి విషయం గురించి నువ్విలా అడగటం చాలా తప్పు బాబూ!" మా అత్తగారన్నారు.     "నేనూ ఆ మాటే అంటాను" మా అమ్మ అంది ఆ వెనకాలే.     "సరే... విన్నావుగా బాబూ! మా అమ్మాయీ వాళ్ళూ చెప్పిన మాట! నేనూ అదే చెప్తాను సారీ" మా మామగారన్నారు లేస్తూ.     ఇక మిగిలింది మా నాన్న, నేను! అశ్వత్థ, మా ఇద్దరి ముఖాలూ పరిశీలనగా చూశాడు 'మీరేమంటారు' అన్నట్లు!     "మాకు ఆలోచించుకునేందుకు టైమ్ కావాలి" నాన్న చెప్పారు నా మనస్సు అర్థం చేసుకుని.     "అదేమిటి అలా అంటారు? తనకి ఇష్టం లేదని అమ్మాయి చెప్పేసిందిగా" అమ్మ కొంచెం గట్టిగానే అంది వెంటనే!     "అమ్మాయి ఆ మాట అన్నది కోపంతో! ఏ నిర్ణయమూ ఆవేశంగా తీసుకోకూడదు. ఇది ఒక గోల్డన్ ఆపర్ట్యూనిటీ! అందరం కలిసి అన్ని వైపులనించీ జాగ్రత్తగా అలోచించి నిర్ణయించాలి. ఉత్తరా! నేనిలా అంటున్నందుకు కోపం తెచ్చుకోకు తల్లీ - ఫైనల్‌గా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేమెవ్వరం కాదనము. కానీ అది... ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమై ఉండాలి..." మా నాన్న కాస్త గంభీరంగానే చెప్పి -     "మేము ఎప్పటిలోగా చెప్పాలి మా నిర్ణయం మీకు?" అశ్వత్థ వంక తిరిగి ప్రశ్నించారు.     "థాంక్యూ సర్... థాంక్యూ వెరీముచ్" రెండు చేతులూ జోడించి నాన్నకు దణ్ణం పెడుతూ చెప్పి, "నేను రేపు ఉదయం పదకొండు గంటల ఫ్లయిట్‌కు బయలుదేరి చెన్నయ్ వెళ్తున్నాను. అక్కడ దాదాపు ఇరవై రోజులు ఉంటాను. ఇది నా ఫోన్ నంబర్! మీరీ ఇరవై రోజుల లోగా ఎప్పుడైనా నాకు చెప్పవచ్చు" చెప్పాడు అతడు. వెంటనే మా అమ్మ... అత్తగార్ల వంక తిరిగి -     "అమ్మా! వెంపటి చినసత్యంగారని, కూచిపూడి నాట్యంలో అపర భీష్మాచార్యులు! ఆయన తన కోడలికి స్వయంగా నాట్యం నేర్పించి, ఎన్నో ప్రదర్శనలనిప్పించారు. నాట్యం అనేది తప్పు పనీ కాదు - పెళ్ళి అనేది దానికి అడ్డమూ కాదు. నాట్యం ఒక దైవోపాసన! ఒక పూజ! పాదముల పెదవులకు - గుండెల అందెలను జతకూర్చి- అంగభంగిమలే స్వరాలుగా - మనస్సు చేసే మంత్రోచ్చారణ నాట్యం. ఈ రకంగా దైవాన్ని ఉపాసన చేయగలిగే అదృష్టం అందరికీ కలగదు. అర్థం చేసుకోండి ప్లీజ్" దణ్ణం పెడుతూ చెప్పాడు.     తరువాత, నా దగ్గరకొచ్చి - "మిస్టర్ చంద్రా! ఉత్తరలో నాకు ఒక గొప్ప స్త్రీమూర్తి దర్శనమిచ్చింది. ఆమెను నేను వెలికి తీసుకురావాలని తాపత్రయపడుతున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ హర్!" చెప్పాడు నా చేతులు పట్టుకుని.     నేను తలపంకించాను నెమ్మదిగా!     అతడు వెళ్ళిపోయాడు.     అతడు చెప్పిన విధానమూ... ద్రౌపది పాత్రపై అతడికున్న గౌరవమూ... ఉత్తరలో ద్రౌపదిని చూపాలని అతడు పడే తాపత్రయమూ ఇవన్నీ నాకు అతడి మీద మరింత గౌరవం పెంచాయి. అవును భావరహితంగా... బండరాయిలా ఉన్న అహల్యను, పరిపూర్ణమైన మనస్సు నిండిన స్త్రీగా మలచిన రామచంద్రునిలా - పురాణ పరిజ్ఞానం ఏమాత్రంలేక... నాట్యం అంటే ఏమిటో కూడా తెలియని ఉత్తరని ద్రౌపదిలా మలుస్తానని చెబుతున్న అద్భుతమైన శిల్పి అతడు అనిపించింది - వెళ్ళిపోతున్న అతడి వంక చూస్తుంటే!     తమాషా ఏమిటంటే ఆ పెళ్ళి కేసెట్లో ఏం చూశాడో - ఇప్పుడు మాత్రం అతడు ఉత్తర వనక కన్నెత్తి చూడలేదు, తనతో ఒక్క మాటైనా మాట్లాడలేదు! అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇంతలో-     "సారీ మామయ్యా! నేనింక ఆలోచించేదేమీ లేదు.అదే నా ఫైనల్ డెసిషన్" చెప్పింది ఉత్తర స్థిరంగా.     తనతో పాటే తన పేరెంట్సు, మా అమ్మా కూడా లేచారు.     "ఇంకా ఆలోచించేటందుకు ఏముంది? తన మాటే మన అందరి మాటా" అంది మా అమ్మ - "పదండి వెళ్దాం... అనామకుడి మాట వినేదేమిటని నిన్ననే చెప్పాను."     "మోహన్...! అసలు నువ్వేమీ మాట్లాడ వేమిటి? నేను నా ఉద్దేశం చెప్పాను. నువ్వు నీ మనస్సులో ఏమనుకుంటున్నావో చెప్పు" ఉత్తర కొంచెం కోపంగానే అంది.     "నాకు అతడు మనిషిగా నచ్చాడు. అతడు మాట్లాడే విధానమూ - విషయమూ రెండూ నచ్చాయి. ముఖ్యంగా మనల్ని... పెద్దవాళ్ళతో పాటు దైవ సన్నిధికి పిలిచి ఇక్కడ, తను కావాలనుకుంటున్నది అడిగాడు... ఆ సంస్కారం నాకు బాగా నచ్చింది. అందుకే పెద్దవారు నాన్న మాట్లాడుతున్నారు కదా అని నేనేమీ మాట్లాడటంలేదు. నాకు నచ్చక పోతే ముందే చెప్పేసే వాడిని నీలాగే" చెప్పాను.     "నేను పద్మాసుబ్రహ్మణ్యం గురించి పేపర్లో చాలాసార్లు చదివాను. టి.వి.లో ఆవిడ నాట్యం చూశాను. సామాన్యమైన కళాకారిణి కాదావిడ. ఇతడు ఆవిడ శిష్యుడు. పైగా ప్రపంచ దేశాలలో ప్రదర్శనలిచ్చినవాడు. చాలా సంస్కారం ఉంది మనిషిలో - మా అబ్బాయి చెప్పినట్టు! పైగా అతడు ఉత్తర చేత వేయిస్తానంటున్నది మహా పతివ్రత అయిన ద్రౌపది పాత్ర! సినిమాలలో వ్యాంపు పాత్ర అయితే అసలు విషయం ఇంతవరకు రానిచ్చేవాళ్ళమే కాదు! అందుకని ఈ అవకాశం వదులుకోవటం మంచిది కాదని నా ఉద్దేశం! మనం అందరం ముఖ్యంగా ఉత్తర సరేననుకుంటే - అతడి 'సీతా కళ్యాణమ్' నృత్యరూపకం చూడటానికి చెన్నయ్ వెళ్దాం" నాన్న చెప్పారు.     మా మామగారు ఉత్తర వంక చూశారు.     తను ముఖం ముడుచుకునే ఉంది.     "ఇంటికెళ్ళి ఆలోచించుకుని నాకు చెప్పండి. సరేననుకుంటే రేపు ఒకసారి అతడిని కలిసి మాట్లాడదాం" నాన్న చెప్పారు అందరం నడుస్తూ ఉండగా.     "అతడు మిమ్మల్ని అడిగాడు. మీరంతా ఆలోచిస్తున్నారు. నాగురించి ఎవరూ ఆలోచించటం లేదు. నేనా పాత్ర వేయాలనుకుంటున్నవాడు నన్నే ఒక మాట అడగవచ్చు కదా! నేను 'నో' అన్నాక కూడా నన్ను అడగలేదు. అటువంటి వాడు చేయమంటే చేసేయాలా...మీరంతా ఏం ఆలోచిస్తారో నా కర్థం కావటం లేదు" నాతో పాటు అడుగులు వేస్తూ అంది ఉత్తర.     నాకు నవ్వొచ్చింది. అదన్న మాట తను 'నో' అనడానికి కారణం! 'నన్నే అడగొచ్చుగా' అనే ఇగో! అతడు తనను అడగలేదు కనుక తను చేయదు. ఒకవేళ తనను అడిగినా ఆడపిల్లగనక వాళ్ళ అమ్మగారినీ... అత్తగారు కనుక మా అమ్మనీ సలహా అడుగుతుంది. వాళ్ళు పెద్దవాళ్ళు కనక 'నో' అనే అంటారు. దానికి వాళ్ళు చెప్పే కారణాలు ఏవైనా ఉండవచ్చు. ఆ ప్రభావం తనపై ఉంటుంది. మా మామగారు, నాన్న, నేను తనను ఒప్పించాలని ప్రయత్నించినా అటు ఇటు ఆలోచనలతో ఊగిసలాడుతూ త్వరగా నిర్ణయించుకోలేదు. అందుకే నాగురించి తెలుసు కనుక నాన్న మంచి డెసిషన్ తీసేసుకున్నారు.     ఇంతలో నాన్న - "ఉత్తరా! మేము నిన్ను బలవంతంగా ఒప్పిస్తామని భయపడకు. మేమంతా సరేననుకున్నా నువ్వు నో అంటే నో అనే చెప్తామతడితో! కాకపోతే ఆ మాట వెంటనే చెప్పనవసరం లేదు. పదిహేను రోజులు దాటేదాకా మళ్ళీమళ్ళీ ఆలోచించుకుని చెప్పవచ్చు.'ఎస్'అనాలంటే మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పాలి. ఎందుకంటే అతడివేవో ప్రోగ్రాములు ఉన్నాయి కదా! మనం ఒకసారి వెళ్ళి చూస్తే అతడు ఎలా చేస్తాడో... ఎలా చేయిస్తాడో...అవన్నీ కూడా చూసి అప్పుడున్న పరిస్థితిని బట్టి మనకిష్టం లేకపోతే అప్పుడే 'నో' అని చెప్పవచ్చు. కోపంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించు! అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది" చెప్పారు తన దగ్గరకొచ్చి తల నిమురుతూ.     "లేదు మామయ్యా! పెద్దవాళ్ళు, మీరంతా ఏం చెప్పినా నా శ్రేయస్సు కోరే చెప్తారు. నేను ఆలోచిస్తాను. మీరు చెప్పినట్టు ప్రశాంతంగానే ఆలోచిస్తాను" చెప్పింది తను.     "ఒకవేళ ఉత్తర, ఈ ప్రోగ్రామయ్యాక 'నేను డాన్సరుగానే స్థిరపడిపోతాను. నాకు పెళ్ళి వద్దు' అంటే అప్పుడేం చేస్తారు మీరిద్దరూ?" ఇంటికి రాగానే కోపంగా అడిగింది అమ్మ.     "ముందే అన్నీ ఊహించుకోవద్దమ్మా! అప్పుడు పరిస్థితిని బట్టి అప్పుడు ఆలోచిద్దాం!" చెప్పాను నేను. నాన్న నవ్వుతూ నా భుజం తట్టారు.     రాత్రి ఎనిమిదవుతూ ఉండగా మా మామగారి దగ్గర నించి ఫోను వచ్చింది - 'ఉత్తర అంగీకరించినట్లు'గా! వెంటనే నాన్న, మరునాడు ఉదయం తనను కలవాలని చెప్పి, అశ్వత్థని అతడుంటున్న హోటల్ అడ్రస్సు, రూం నెంబరు కనుక్కున్నారు. తెల్లవారు ఝామున అయిదున్నర...ఆరింటికల్లా వచ్చేయమని చెప్పాడతడు.     మరునాడు అతడు చెప్పిన టైముకే అందరం అక్కడకు చేరుకున్నాము. మమ్మల్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి కూర్చోమన్నాడు. నాన్న, నిన్న మేమంతా కలిసి ఆలోచించుకున్న విషయాలన్నీ అతడికి వివరంగా చెప్పారు. ఎంతో ఓపికగా విని, "శాస్త్రీయ సంగీతమూ, నాట్యమూ కూడా మరుగున పడిపోతున్న ఈ పరిస్థితుల్లో, ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వృద్ధులైన ఆనాటి కళాకారులనించి ఆ అమృత భాండాల్ని అందుకుని తరువాతి తరాలకి వాటిని అందించటానికి ఎవరూ ముందుకు రాకపోవటం... వాటి విలువ తెలుసుకోలేక, పాశ్చాత్య విద్యల ప్రభావానికి లోనై, వాటి వైపే మొగ్గు చూపటం... ఇవన్నీ ఇప్పటి యూత్‌లో బాగా చూస్తున్నాను నేను. ఆర్ట్ ఫర్ ద సేకాఫ్ ఆర్ట్...కళని కళకోసం నేర్చుకుని దానిని ముందు రాబోయే తరాలకి యాజిటీజ్‌గా అందించే కళాకారుల్ని తయారు చేయటం మా గురువుగారు డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం చేస్తున్న మహోన్నతమైన కార్యం! కళను సాధ్యమైనంత ఉన్నతంగా చూపాలనే నా తాపత్రయం! మీరు నా మాటను కాదనక ఇక్కడకు వచ్చినందుకు చాలా థాంక్స్!" అన్నాడు అశ్వత్థ.     "మీరు కళగురించి చెబుతున్నారు. కానీ ఉత్తరకు భరతనాట్యమే కాదు అసలు ఏ డాన్సూ రాదు. చిన్నప్పుడు కూడా ఎప్పుడూ నేర్చుకోలేదు. అలాగే నటనా చేతకాదు. మరి మీరు తన చేత ద్రౌపదిగా ఎలా చేయించగలరు?" మా మామ గారు అడిగారు వెంటనే! "నో ప్రాబ్లెం! తనకేమీ రాకపోవటమే నాకు కావాలి. ఒక మైనం ముద్దలాంటి తనని ద్రౌపదిగా మలచుకోవటం... అ పాత్రకు తగినంత నాట్యమూ, నటనా నేర్పటమూ నాకు ఇప్పుడే తేలిక! తనకు నేను నేర్పిస్తాను. మీరంతా వచ్చి... మా ప్రాక్టీసు చూద్దురుగాని! ముందు - నేను మా గురువుగారినడిగి ప్రాక్టీసు ప్రారంభించేందుకు మంచి రోజు చూసి డేట్ ఫిక్స్ చేయిస్తాను. తరువాత మా టీమ్ అందరం కెనడానించి ముంబాయి వచ్చి ఇక్కడే ప్రాక్టీసు చేస్తాం. మీకా డేట్స్ ఇస్తాను. లీవ్ తీసుకుని వచ్చి ద్రౌపది ఏరకంగా ఉద్భవించిందో - మహాభారత గాథను ఏవిధంగా ముందుకు నడిపిందో అంతా చూడండి" చెప్పాడతడు చాలా సంతోషంగా.     ఇంతలో అతడు మాకోసం ఆర్డర్ చేసిన చాయ్ రావటంతో, దానిని తనే స్వయంగా మా కందరికీ సర్వ్ చేస్తూ -     "భరతనాట్యం గురించి మీరు అర్థం చేసుకునేందుకు కొన్ని విషయాలు చెప్తాను. విసుగనుకోకుండా వినండి ప్లీజ్..." చెప్పి - మా ఎదురుగా మంచం మీద మఠం వేసుకుని కూర్చుని చెప్పటం ప్రారంభించాడు.     "ఓంకార శబ్ద జనని సరస్వతీదేవిని, వాగ్దేవిగా, నాట్యానికి ప్రతిరూపం పరమశివునిగా చెపుతుంది సామవేదం. ఋగ్వేదం నించి గానాన్నీ, యజుర్వేదం నించి అభినయాన్నీ, అధర్వన వేదం నించీ రసాన్నీ గ్రహించి 'నాట్యవేదాన్ని' సృష్టించి భరతమునికి ఉపదేశించాడు చతుర్ముఖ బ్రహ్మ. భరతుడు దానిని తన పుత్రులకందించాడు. నాట్యంలో స్త్రీ పాత్రలకోసం ఇరవైనాలుగు మంది అప్సరసలు సృష్టించబడ్డారు. భరతుడు తన పుత్రులు...అప్సరసలతో 'అసుర పరాజయం' అనే నృత్య రూపకం - బ్రహ్మ విరచితమది - దానిని ప్రదర్శించాడు. దానిని ప్రదర్శించటానికి విశ్వకర్మ నాట్యశాలను నిర్మించాడు. ఆవిధంగా - నాటకం, నాట్యం రెండూ కలిసిన నృత్యరూపకం - విశ్వకర్త అయిన బ్రహ్మ సృష్టితో పాటే సృష్టించినవి! తరువాత భరతుడు కైలాసగిరి మీద - 'త్రిపుర దాహం', 'సముద్ర మథనం' అనే నృత్యరూపకాలను ప్రదర్శించినపుడు శివపార్వతులు ప్రసన్నులై - అతడికి శివుడు తన తాండవాన్నీ, పార్వతి తన లాస్యాన్ని, బ్రహ్మ నాలుగు వృత్తులను, శృంగారాది నాలుగు ప్రధాన రసాలనూ ఉపదేశించారు. దేవ సభలలో జరుగుతున్న ఈ ప్రదర్శనలను గురించి విని, నహుష మహారాజు భరతమునిని పుత్ర సమేతంగా భూలోకానికి రమ్మని ఆహ్వానించాడు. ఆ విధంగా 'నాట్యవేదం' దేవ సభలనించి భూమి పైకి వచ్చింది. మానవులకు భరతముని దానిని ఉపదేశించాడు.     గురువందనం ఎవరికి చేయాలి? గురుపరంపర ఏమిటి? భూమి మీద నాట్య వేదం ఏ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది? దీని దివ్యత్వం ఏమిటి? అనే విషయాలను భరతముని తను రచించిన 'అభినయ దర్పణమ'నే మహాగ్రంథంలో వివరిస్తాడు. వశిష్ఠ, వాల్మీకి, విశ్వామిత్ర, అగస్త్య, గౌతమ, పరశురామ, నారదాది మహర్షులందరూ నాట్య వేదాన్ని ప్రచారం చేశారని చెపుతారు.     రామాయణంలోని బాలకాండంలో, అయోధ్యలోని నాట్యశాలలు అద్భుతంగా వర్ణించ బడ్డాయి. దశరథ మహారాజు - పుత్రకామేష్ఠి యాగానికి నటనర్తకులను కూడా ఆహ్వానించినట్లుగా ఉన్నది. సుందరకాండలోని లంకాపుర వర్ణనలో రావణాంతఃపురంలో నిద్రిస్తున్న స్త్రీల భంగిమలు ఆంగికాభినయ భాగమైన 'అంగహారాలు' అభినయిస్తున్నట్లు ఉన్నాయంటాడు వాల్మీకి మహర్షి.     మహా భారతంలోని విరాటపర్వంలో అర్జునుడు, బృహన్నలయై విరాటరాజ పుత్రిక ఉత్తరకు నాట్యగురువుగా దర్శనమిస్తాడు. విజయనగర సామ్రాజ్యంలోని నాట్యశాలలలో నర్తకుల కోసం ప్రత్యేకమైన వ్యాయామ శాలలు కూడా ఉండేవని చరిత్ర గ్రంథాలలో ఉన్నది. అటువంటి వ్యాయామ శాలలు ఇప్పటికీ కేరళలో 'కథకళి' నాట్య కళాకారుల కోసం కనిపిస్తాయి.     నాట్యాన్ని 'యోగం' అనికూడా అంటారు. యోగం అంటే జీవాత్మ - పరమాత్మల ఐక్యతా సిద్ధి!     'అనాహత నాదం' ఉపాసించగలిగిన వాళ్ళకే సంగీతం యొక్క విశిష్టత అర్థమైనట్లుగా అంగన్యాస - కరన్యాస రహస్యము తెలిసి, శరీరంలోని శక్తి ప్రసారం నియంత్రించగల వాళ్ళకే రంగప్రవేశం యొక్క విశిష్టత తెలుస్తుంది.     సంగీత - నాట్య యోగం యొక్క గొప్పదనం ఏమిటంటే - కళాకారుడితో పాటు ప్రేక్షకుడు కూడా బ్రహ్మానుభవం పొందుతాడు.     సామాన్య ప్రజలు వీటిని 'లలితకళలు'గా భావిస్తారు."     ఒక జ్ఞానవృద్ధునిలా కూర్చుని ఘనాపాఠీ వేదమంత్రాలను సుష్పష్టంగా ఉచ్చరిస్తున్నట్లుగా అతడా విషయాలను భక్తిశ్రద్ధలతో వివరించి చెపుతుంటే అందరం మంత్ర ముగ్ధులమై విన్నాము.     "అడిగానని ఏమీ అనుకోకపోతే, ఒక చిన్న అంశమేదైనా నాట్యం చేసి చూపించగలవా బాబూ!" మా అమ్మ అడిగింది కాస్త మొహమాటంగానే!     "అమ్మా! మీరామాత్రం పోజిటివ్‌గా వస్తే చాలు నాకు! తప్పకుండా చూపిస్తాను" చెప్పి వాయిస్ రికార్డర్లోనించి సంక్షిప్త భాగవతం శ్లోకం వినిపించేలా సెట్ చేసుకుని భూదేవికి నమస్కారం చేసి ప్రారంభించాడతడు. దేవకీదేవి గర్భంనించి కృష్ణుడు జన్మించటం, వసుదేవుడు ఆ శిశువును తలపై మోస్తూ యమునా నదిని దాటి గోకులంలోని యశోద వద్దకు చేర్చటం...అతడికి ఆదిశేషుడు సహాయ పడటం, యమునా నది ఆనంద పరవశంతో ఉప్పొంగి ఆ పసిబిడ్డియైన పరమాత్మ పాదాలను కడగటం, కృష్ణుని బాల్య లీలలు, పూతన కథ, గోవర్ధన పర్వతం చిటికెన వేలితో పైకి ఎత్తటం, కంస కథ, ద్రౌపదికి చీరనివ్వటం, మహాభారతంలోని ముఖ్య ఘట్టమైన రాయబారం, కురుక్షేత్రం నట్టనడుమ ప్రదర్శించిన విశ్వరూపం - భాగవతాన్నంతటినీ ఒక్కసారి కళ్ళముందు దర్శింపజేసి - ఒక మహాత్ముని ప్రవచనం విన్న భావాన్ని మాకందరికీ పంచాడు. చాలాసేపు ఎవ్వరం తేరుకోలేక పోయాము.     ఇంతలో బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది. మేము వద్దన్నా వినకుండా, బలవంతంగా మాకు తనే స్వయంగా అందించాడు తినమని బతిమాలుతూ! "నేను కూడా మీ ఫ్యామిలీలో ఒకడిననుకోండి. కాదనగలరా?" అని అతడడిగేసరికి ఎవరం కాదనలేక పోయాము.     అతడు చెప్పిన సమయానికి, చెన్నయ్ వెళ్ళాము అతడి ప్రోగ్రాములు చూడటానికి. అతడు దర్శకత్వం వహించిన 'సీతాకళ్యాణమ్' చూశాము. రామజననం మొదలు పృథ్విలోనించి సీత ఉద్భవించిన వైనం... ఆ శిశువును చూసిన మహర్షులు- వేదవతిగా భస్మమై లంకకు చేరి బాలగా శివుని సాన్నిధ్యంలో ఉద్భవించి, ఆ బాలికను పెట్టెలో పెట్టి సముద్రం ఆవల దూరంగా భూస్థాపితం చేసి రమ్మని మండోదరి చెప్పగా విదేహ రాజ్యంలోని భూమి గర్భంలో చేరిన లక్ష్మీస్వరూపంగా గుర్తించటం...అయోధ్యలో రాముడు - మిథిలానగరంలో సీత పెరిగి పెద్దవాళ్ళయి యవ్వనంలో ప్రవేశించటం...విశ్వామిత్రుడు - తాటకవధ, పరశురాముడు శివధనుస్సు 'పినాకిని'ని జనక మహారాజు వద్దకు తెచ్చిన వైనం... సీతాస్వయంవరం... శివధనుర్భంగం... సీతారాముల కళ్యాణమ్... రామాయణంలోని ఈ భాగాన్ని ... ఒక పుస్తకరూపంలో ప్రతీ అక్షరం మనస్సులో ముద్రించుకుంటూ చదివిన విధంగా కళ్ళకు కట్టినట్టు చూపాడు. తరువాత అతడొక్కడే చేసిన రెండున్నర గంటల కార్యక్రమాలలో అతడు అప్పుడు చెప్పిన 'నాట్యమంటే మంత్రోచ్చారణ' అనే మాటని చూసి గ్రహించుకున్నాము.     అప్పుడే మా అమ్మ, అత్తగారు కూడా ఉత్తరకు వచ్చినది సామాన్యమైన అవకాశం కాదని గ్రహించారు. ఉత్తరలో కూడా అతడి మీద గౌరవం పెరిగినా... అంతటి మనిషి... తనను శిష్యురాలిగా కోరివచ్చినప్పుడు... తననే ఎందుకు అడగకూడదనే 'అహం' మాత్రం పెరుగుతునే ఉంది.     మేము ముంబాయి బయలుదేరి వచ్చేసేముందర మమ్మల్ని అందరినీ పద్మా సుబ్రహ్మణ్యంగారి దగ్గరకు తీసుకు వెళ్ళి పరిచయం చేశాడు. ద్రౌపది పాత్రను ధరించబోతున్న ఉత్తరను చూసి... ఆవిడ చాలా ఆత్మీయంగా తన దగ్గరకొచ్చి చేతులు పట్టుకుని పలకరించి -"భరత నాట్యం... ఒక ఉపాసనా మార్గం! భరత్ముని శాస్త్రబద్ధం చేసిన ఈ నాట్య శాస్త్రంలో సంగీతమూ-శిల్పమూ కూడా అంతర్గతంగా లీనమై ఉన్నాయి. పురాణాలనూ, కావ్యాలనూ అధ్యయనం చేశాడు అశ్వత్థ! ఇతడి శరీరంలో ప్రవహిస్తున్నది సంగీతం... శరీర ఆకృతి శిల్పం అన్నంతగా నాట్యంలో కలిసిపోయి జీవిస్తున్నాడు. ఇతడు నిన్ను శిష్యురాలిగా స్వీకరించటమనేది నీ పూర్వజన్మ సుకృతం! ద్రౌపది అనే స్త్రీ... మహాభారతంలో ఒక స్త్రీగా తన విశ్వరూపం చూపించింది. సంపూర్ణమైన నారీత్వం చూపించింది. కృష్ణుడు యుద్ధభూమిలో విశ్వరూపం చూపిస్తే...కృష్ణ నామధేయురాలైన ఈ స్త్రీ తన పుత్రహంతయైన అశ్వత్థామకు నమస్కరించి... అతడిని క్షమించటంలో చూపింది తన విశ్వరూపం. సీతమ్మ మౌనం రామాయణాన్ని నడిపించింది. మహాభారత గాథని ద్రౌపది వాక్కు నడిపించింది. అశ్వత్థ ... ఆ పాత్రని నీకు బాగా ఒంటపట్టేలా వివరించి చెప్తాడు. నీలోని ద్రౌపదిని జాగృతపరచి ప్రపంచానికి ఆ విశ్వరూపం దర్శింపజేయి. విజయోస్తు" అంటూ ఆశీర్వదించారు. అప్పుడే ఆవిడ 'కరణములు'అనే సిద్ధాంత గ్రంథం రాశారనీ, దానిలో భరతముని నాట్యశాస్త్రానుసారమైన మార్గీనాట్యం గురించి చర్చించారనీ అశ్వత్థ చెప్పాడు.     ఆ తరువాత ఆవిడ చెప్పిన డేట్స్ నోట్‌చేసుకుని లీవుకు అప్లయి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుని, అందరం వాళ్ళ దగ్గర నుంచి శెలవు తీసుకుని ముంబాయి బయలుదేరాము. ప్రాక్టీసు కోసం తన టీమ్‌లోని కళాకారులందరినీ తీసుకుని ముంబాయి వచ్చాడు అశ్వత్థ. మేమంతా ఉత్తరతో కలిసి అతడు బస చేసిన హోటల్‌కు వెళ్ళాము. ఉత్తర మాత్రం 'నేను రాను' -'చెయ్యను' అంటూ గొడవ చేస్తూనే వచ్చింది.     అశ్వత్థ...మమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి- ఉత్తర ఎదురుగా కూర్చుని ద్రౌపది పాత్రను గురించి చెప్పసాగాడు.     "తనను అవమానించటమే గురుదక్షిణగా కోరిన ద్రోణుని పాదాల వద్ద తనను బందీగా పడవేసిన అర్జునుణ్ణి చూసిన మరుక్షణమే తనకు అటువంటి పుత్రుడు ఉంటే ఈ దుర్గతి పట్టేది కాదనీ, ఒక కుమార్తె ఉంటే అర్జునుణ్ణి అల్లుడిగా చేసుకునేవాడిననీ ఆలోచించాడు ద్రుపద మహీపతి! అదే ఆలోచనతో యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండం నించీ రథసమేతుడైన ధృష్టద్యుమ్నుడు వచ్చాడు ముందుగా - ఆ తరువాత కళ్ళు మిరుమిట్లు గొలిపే తేజోపుంజంలా నిండు యవ్వనవతి అయిన ఒక యువతి ఉద్భవించింది ఆ యజ్ఞగుండంలోనించి! అశరీరవాణి ఆమెకు 'కృష్ణ' అనే నామాన్ని ఇచ్చింది. ఆమెయే ద్రౌపది!     స్త్రీలకు సైతం మోహం కలిగించేరూపం ఆమెది. అది కేవలం భౌతిక సౌందర్యం మాత్రమే కాదు. మనోగతమైనదీ- ఆత్మగతమైనదీ- వ్యక్తిత్వ నిష్ఠయైనది! అగ్ని తాత్వికత ఆమె! అందుకే ఆమెను సమీపించాలని చూసిన దుష్టులందరూ శలభాల్లా మాడిమసి అయిపోయారు.     'కృష్ణ' నామధేయుల అవతార ప్రయోజనమే అది!     లాక్షాగృహంతో పాటు కుంతి పంచ పాండవులూ దగ్ధమయ్యారన్న వార్త విని ద్రుపదుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అర్జునునిభార్యగా పంపాలనుకున్న తన కుమార్తెకు వివాహం చేయటానికి స్వయంవరమొక్కటే మార్గమని నమ్మి దుర్భేద్యమైన మత్స్యయంత్రాన్ని స్వయంవర సభ మధ్యలో నిలబెట్టి దానిని ఛేదించిన వానినే ఆమె వరిస్తుందని ప్రకటించమని పుత్రుని ఆదేశించాడు.     దుష్టచతుష్టయంలో ఒకడైన కర్ణుడు యంత్ర ఛేదనకై లేచినప్పుడు - "నేను సూతపుత్రుణ్ణి వరించను" అంటుంది ద్రౌపది.     అది మొదలు మహాభారతంలోని ముఖ్య పరిణామాలన్నీ ఆమె వాక్కు కారణంగానే జరిగాయి.     'తనకు భిక్ష దొరికింద'ని ద్రౌపదిని గురించి చెప్పిన అర్జునుడితో, 'దానిని ఐదుగురూ పంచుకోండి నాయనా' అని చెబుతుంది - ఆమెను గమనించని కుంతి. ఆ రకంగా పంచపాండవుల పట్టమహిషి అయింది ఆమె! ఆ రోజునే యుధిష్ఠిరునిచేతిలోని భిక్షాపాత్రలో నున్న ఐదుగురి అన్నదమ్ముల భిక్షనూ కుంతి ఆదేశం ప్రకారం దైవ నివేదన చేసి, బ్రాహ్మణులకూ, అతిథులకూ దానమిచ్చి మిగిలిన దానిని రెండు భాగాలు చేసి, ఒకటి భీమసేనునికిచ్చి మిగిలినది అందరికీ పంచింది. దర్భలు పరిచి దానిపై పడకలు ఏర్పాటు చేసి... ఆ పడకలపై పాండవులు ఐదుగురూ శయనిస్తే... వారి పాదాలవైపు తను శయనించింది. కూంతి... అప్పుడే ఆమెలో ఒక యోగ్యురాలైన కోడలిని చూడగలిగింది!     పాండవుల మయసభలో దుర్యోధనుడు అవమానితుణ్ణయ్యానని క్రోధం పెంచుకున్నాడు. వాళ్ళ వైభవం లాగేసుకోవాలనే దురుద్దేశంతో మాయాజూదం కోసం యుధిష్ఠిరుని ఆహ్వానిస్తాడు. యుధిష్ఠిరుడు - మణిమాన్యాల్నీ...సంపదల్నీ...రాజ్యాన్నీ...తమ్ముళ్ళనీ - తననూ ఓడిపోయాక శకుని ఆశ పెట్టేసరికి... గెలుస్తానన్న ఆశతో... ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఆడతాడు...ఓడిపోతాడు! ఇక్కడ ద్రౌపది పాత్ర క్రోధం...రోషం...పౌరుషం నిండి ఉంటుంది..."చెప్పి - "ముందు ఇక్కడి దాకా ప్రాక్టీసు చేద్దం అంటూ లేచి - "ప్లీజ్"అన్నాడు ఉత్తర స్టేజిమీదకు రమ్మన్నట్లు చేయి చాచి!     తను నా వంక చూసింది.     "ఆల్ ద బెస్ట్..." చెప్పాను కుడిచేతి బొటనవేలు పైకెత్తి చూపుతూ.     తను స్టేజి వైపు అడుగులు వేయబోతుంటే - "పెద్దవాళ్ళు నలుగురికీ సాష్టాంగ నమస్కారం చేసి రావాలి" చెప్పాడతడు.     అలాగే చేసి వెళ్ళింది తను.     నాలుగు సార్లు లేచి...దణ్ణం పెట్టే సరికే ఆయాసం వచ్చేసింది!     నేను నవ్వుకున్నాను - 'మంచి గురువు దొరికాడు'అనుకుంటూ.     ముందుగా తనకి గురువందనం - తరువాత అడుగులు ముద్రలు నేర్పించాడు. ఇవి వారం రోజులపాటు రోజుకి ఐదారుగంటలపాటు ఇంట్లో ప్రాక్టీసుచేసుకోమని... ఇక్కడ మిగిలిన కళాకారుల ప్రాక్టీసు చూసేందుకు కనీసం మూడునాలుగు గంటలు రోజూ అక్కడకు రమ్మని చెప్పాడు. ముఖ్యంగా - "ఈ ప్రాక్టీసు జరిగినన్ని రోజులూ 'ద్రౌపదినే' అనే భావంతో ఉండాలి" ఆర్డర్ వేసినట్లుగా చెప్పాడామాట. తరువాత రెండు గంటలపాటు తను ఆమె ఎదురుగా కూర్చుని ప్రాక్టీసు చేయమన్నాడు. అదయ్యాక, మరో రెండుగంటలు అక్కడి ప్రాక్టీసు చూసి అందరం ఇంటికి వచ్చాము.     "అమ్మా! మావైపూ...మీవైపూ కూడా మన కుటుంబాలలో నాట్య కళాకారులెవరూ లేరు. ఈ రెండు కుటుంబాలకూ నువ్వు పేరు తీసుకురావాలి. తపస్సు నువ్వు చేసేది - ప్రాక్టీసు కాదు - గుర్తుందిగా 'నువ్వు ద్రౌపది'ననకోవాలని చెప్పాడతడు" నాన్న ఉత్తరతో చెప్పారు వాళ్ళు వాళ్ళింటికి బయలుదేరినప్పుడు.     ఆ ప్రాక్టీసు పుర్తయాక, కొద్దిగా అభినయం నేర్పి... అడుగులు, ముద్రలతో అభినయం కలిపి చేయించాడు. దానిని మరో వారం ప్రాక్టీసు చేయమన్నాడు.     స్లిమ్‌గా ఉండాలని ఆహారం తీసుకోని ఉత్తర... బాగా చిక్కిపోయి - నీరస పడటంతో - తనకి ఇవ్వవలసిన డయిటు, కొద్దిగా ఎక్సర్‌సైజూ నేర్పించాడు.     అదిపూర్తయ్యాక... నవరసాల అభినయం నేర్పాడు. పాత పాఠం ప్రాక్టీసు చేస్తూ దీనిని పదిహేను రోజుల పాటు సాధన చేయమన్నాడు.     మొదట్లో..."అతడు నన్ను 'ప్లీజ్'అని స్టేజ్ పైకి పిలిచాను గనక వెళ్ళి చేస్తున్నాను" అంటూ సరదాగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఉత్తర, ముందు ముందుకు వెళ్ళేకొద్దీ - అతడు చేయిస్తున్న కఠోర సాధనను తట్టుకోలేక విసుగ్గా ఫీలవసాగింది. "నాకు బోరింగ్‌గా ఉంది. వద్దు... చెయ్యనని చెప్పేయండి" అంటూ చిన్నపిల్లలా మమ్మల్ని వేధించసాగింది. మెల్లమెల్లగా బుజ్జగించి ...నచ్చచెప్పినా - ప్రతి రోజూ అలాగే చేస్తుంటే మాకందరికీ కూడా తన మీద... అర్థం చేసుకోవటం లేదని - విసుగు రావటం ప్రారంభమైంది. అటువంటిది అశ్వత్థ మాత్రం - ఎంతో ఓపికగా... తను ఎన్నిసార్లు తప్పుచేసినా... కనీసం మందలించటమైనా చేయకుండా నేర్పుతున్నాడు. అభినయం బాగా చేస్తే అడుగులు, ముద్రలలోనూ - ఆ రెండూ బాగా చేస్తే అభినయంలోనూ తప్పులు చేస్తోంది. ఒక్కొక్కసారి నాకు 'కావాలని తనలా చేస్తోందా' అనే డౌటు కూడా వస్తోంది. విసుగూ విరామం లేకుండా అశ్వత్థ మాత్రం నేర్పుతునే ఉన్నాడు - "ఆ మూడింటిలో పర్‌ఫెక్షన్ ముఖ్యం" అంటూ.     అప్పటికే నాలుగు నెలలు దాటింది ప్రాక్టీసు మొదలుపెట్టి!     ఇంకో రెండు నెలల్లో నృత్యరూపకం గనక పర్‌ఫెక్ట్‌గా వస్తే... అందరం డ్యూటీల్లో జాయినయి, ప్రతి నెలా వారం రోజులు సెలవు తీసుకుని ప్రాక్టీసు చేసుకోవచ్చని చెప్పాడతడు. 'అయితే అది ఉత్తర అతడికి కోఆపరేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది' - అని కూడా చెప్పాడు.     పూర్తిగా రాకపోయినా - ప్రాక్టీసుతో పర్‌ఫెక్షన్ వస్తుందని - మెల్లగా నృత్యరూపకం ప్రారంభించాడు. పది రోజులలో అతడు చెప్పినంత వరకూ కొంచెం తప్పులు ఉన్నా బాగానే చేసింది ఉత్తర ద్రౌపదిగా - "గుడ్... ఇంత త్వరగా నేర్చుకుని ఇలా చేయటం గొప్ప విషయమే" ఎంకరేజింగ్‌గా అన్నాడతడు.     ఆ రోజు ఉత్తర ముఖం వెలిగిపోయింది సంతోషంతో!     ఆ తరువాత అతడు మళ్ళీ, తన వద్ద కూర్చుని - దుశ్శాసనుడు అంతఃపురంలోకి వెళ్ళి ద్రౌపదిని జుట్టు పట్టుకుని లాక్కు రావటం దగ్గరనించీ చెప్పటం ప్రారంభించాడు.     "ప్రకృతి శక్తి స్వరూపం...దానికి ప్రతిరూపం స్త్రీ! అంతటి శక్తిమంతురాలైన స్త్రీయొక్క భావాలను నియంత్రించటం అవసరం. లేకుంటే జరిగేది ప్రపంచాన్ని నామరూపాలు లేకున్న విధంగా నాశనం చేసే ప్రళయమే! అందుకే - స్త్రీకి స్వాతంత్ర్యం లేదనీ - తండ్రి - సోదరుడూ - భర్త - బిడ్డగా పురుషుడు ఆమెను వెన్నంటి ఉండాలనీ చెప్పే మాటలు వచ్చాయి. సీత మౌనం రామాయణాన్ని నడిపింది. ఆమె మౌనంలో దాగిన శక్తి నించి ప్రపంచాన్ని రక్షించటానికి రాముడు కోదండం పట్టి నిలిస్తే సరిపోయింది. కానీ ద్రౌపది వాక్కు మహాభారతాన్ని నడిపింది. వాక్కు యొక్క శక్తిని వర్ణించాలంటే ఒకే మాట చెప్పుకోవాలి. 'మౌనంగా ఉండే జ్ఞాన దక్షిణామూర్తి తన మౌనానికి భాష్యం చెప్పటానికి ఆదిశంకరాచార్యుల వారిలా భూమి పైకివచ్చాడు' అంటారు. శంకరులు రచించినదంతా ఆ మౌనానికి వాగ్రూపమే. అది లోకాన్ని రక్షించే వాక్కు. కానీ ద్రౌపది... తన స్వాభిమానం దెబ్బతిన్నప్పుడల్లా దుష్టుల్ని శపించింది. దానికి కేవలం దుష్టులుమాత్రమే కాదు - వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది. అందుకే ఆమెను - అయిదుగురు భర్తలు (లేదా 'పాండవుడై'న భర్త ఐదు రూపాలలో)వివిధ ఆయుధాల్ని ధరించి కాపు కాశారు.     కథలో ఇక్కడ నించీ జరిగిన సంఘటనలే దానికి ఆయువుపట్లు. విదురాది ప్రముఖులు వద్దని వాదిస్తున్నా వినకుండా జూదమాడటానికి వెళ్ళాడు యుధిష్ఠిరుడు. అప్పుడే క్రోధితురాలైంది ద్రౌపది. కలుగులో ఉన్న సర్పంలా బుసలు కొడుతున్నట్లు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నది అంతఃపుర కక్ష్యలో. మణిమాన్యాలూ - సంపదలూ - రాజ్యమూ - తమ్ముళ్ళు అందరూ - చివరికి తనను తానూ ఓడిపోయాడని వార్తలు తెలుస్తున్నాయి. క్రోధం... అశాంతి ఆమెను ఒకచోట నిలవనీయటం లేదు. లేచి అటూ ఇటూ తిరగసాగింది అసహనంగా! అప్పుడు వచ్చింది వార్త...పట్టమహిషిని తననూ పణంగా పెట్టాడనీ...ఓడిపోయాడనీ! దుర్యోధనుడు తనను సభకు తీసుకురమ్మన్నాడనీ చెప్పాడు ఆ వార్త తెచ్చిన దూత!     "తన్నోడి నన్నోడెనా - నన్నోడి తన్నోడెనా - ధర్మ విజితనా - అధర్మ విజితనా? కనుక్కుని రమ్మ"ని వెనక్కి పంపింది.     దానికి జవాబు ఏదైనా ఆమె జూదంలో గెలువబడినది కాదు. అందుకే దుశ్శాసనుడొచ్చాడు. "బానిసవి... దాసీదానివి నీకు జవాబివ్వాలా" అంటూ జుట్టు పట్టి... ఎదురుతిరుగుతున్న సర్పాన్ని ఒడిసిపట్టి కలుగులోనించి లాగినట్లుగా - ఆమెను అంతఃపుర కక్ష్యలో నించి ఈడ్చుకుని వచ్చి సభామధ్యంలో విసురుగా పడేస్తాడు. పడగవిప్పి అంతెత్తున లేచిన నల్ల త్రాచులా లేచింది ద్రౌపది. అదే ప్రశ్న సభలోని తలలు పండిన రాజనీతిజ్ఞులందరినీ అడిగింది. అందరూ తలలు దించుకున్నారు.     దుర్యోధనుడు తోడను చూపించాడు!     దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేశాడు!     పరాభవం! పరాభవం!!     ధృతరాష్ట్రుడు మూడవ వరం కోరమని వారిని మించిన పరాభవం చేశాడు. క్షత్రియ కాంతలకు రెండు వరాలు కోరుకునేందుకే అర్హత ఉంది. మూడో వరం దాసీకాంతలకు ఇస్తారు. భగ్గున రగిలింది ఆమె హృదయం!!!     ఆ అగ్నిజ్వాలకే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. కురు వంశం సర్వనాశనమయ్యింది. చివరకు ఆ జ్వాలలో ఆమె పుత్రులు కూడా హతులయ్యారు.     ఈ అవమానానికి కురులను విరబోసి ఉండి - పాండవులలో క్రోధాగ్ని రగుల్చుతూ వచ్చిన ఆమె - తన పుత్రహంతయైన అశ్వత్థామను పాండవులు తనవద్దకు తెచ్చినప్పుడు - గురు పుత్రుడని నమస్కరిస్తుంది. "నీ తల్లి 'క్రుపి'కి నాలాగే పుత్రశోకం కలుగజేయటం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను క్షమిస్తున్నాను. హత్యాపాతకం వెన్నాడుతూ ఉండగా జీవించమంటుంది. అదే ఒక తల్లిగా తాను తన పుత్రుల్ని చంపిన గురుపుత్రుడికి విధించే శిక్ష అంటుంది. ఈ రెండు సంఘటనల మధ్య - జయద్రధుడూ... సింహబలుడూ వస్తారు ఆమెవద్దకు - దీపానికి ఆకర్షితులై వచ్చిన శలభాల్లా! ఇద్దరూ మాడి మసై పోతారు.     విశ్వరూపం... స్త్రీత్వం యొక్క విశ్వరూపం చూపాలి ఇక్కడి నించీ. ద్రౌపదిని అణువణువునా ఆవాహన చేసుకుని ద్రౌపదే అయి జీవించాలి" చెప్పాడతడు.     ఉత్తరకు అతడు ఆశించిన విధంగా చేయటం రాలేదు.     అతడాశించిన ఎక్స్‌ప్రెషనివ్వలేక పోతోంది!     అతడెంతో సహనంగా చెపుతున్నాడు... అయినా తనకు చేత కావటం లేదు! విసిగి పోయింది - పది రోజులయ్యేసరికి!     "ఇందుకే నేను చెయ్యనని చెప్పాను. ఎన్నాళ్ళిలా ఈ నాన్సెన్స్ భరించాలి? నో... ఐ డోంట్ డూ దిస్... వెళ్ళిపోతున్నాను" చెప్పింది. అంతేకాదు - "స్త్రీకి స్వాతంత్ర్యం లేదట - పురుషుడు కాపాడాలట...! ఈ పుక్కిటి పురాణాలు వింటూ నేను తలాడించి చేయలేను..."అంటూ స్టేజి దిగటానికి మెట్ల వైపుకు అడుగులు వేయసాగింది.     అశ్వత్థ వెంటనే, తన చేయి పట్టిలాగి విసురుగా ఒక్క చెంపదెబ్బ కొట్టాడు. ఒక్క క్షణం అందరం అచేతనమయ్యాం. మా మామగారు కూర్చున్న చోటు నించీ లేవబోయారు. నేనాయన చేయి పట్టి ఆపాను.     "నేను చేయలేక పోతున్నాను - నాకు చేత కాదు అని చెప్పండి. మీకు అర్థం కాలేదు కదా అని పురాణాల్ని అవహేళన చేయ్యద్దు" కుడి చేతి తర్జనిని చూపిస్తూ స్థిరంగా చెపాడు మెల్లగానైనా స్పష్టంగా!     "ఏం... అందుకేనా నేనీ పాత్ర చెయ్యాలని నన్ను ఎన్నుకున్నది? నేను ఓడిపోయానని చెప్పించాలనా? కొట్టి అవమానించాలనా?" ఆవేశంగా అంది ఉత్తర.     "అయితే గెలిపించి చూపించండి" చెప్పాడతడు సవాల్ చేస్తున్నట్లు!     అంతే! ఆ క్షణంలోనే-     ఉత్తరలోని ద్రౌపది జాగృతమైంది.     ఇక తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా సంవత్సర కాలం పాటూ అతడు చెప్పినట్లే ప్రాక్టీసు జరిగింది.     గురువుగారి ఆశీస్సులు తీసుకుని - అందరం ఆ దేశానికి చేరాం. అక్కడి ఆ ఉత్సవాలలో మహాభారత గాథను వినిపించి, ద్రౌపది గురించి చెప్పినప్పుడు అందరూ చప్పట్లు చరిచారు!     సంవత్సర కాలం పాటు కఠోర తపస్సులా సాగిన సాధన- ప్రపంచ ప్రజల ముందు ప్రదర్శించటం జరిగింది!     నిజం! అశ్వత్థ చెప్పినట్లు, అక్కడ ప్రదర్శించినది కేవలం ఒక నృత్యరూపకమూ - కళాకారుల లోని టాలెంటూ లేదా ఒక పురాణ కథా కాదు. భారతీయ సభ్యతా సంస్కారాలూ సంస్కృతీ ప్రదర్శింపబడ్డాయి.     దాదాపు పావుగంట సేపు ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లు చరిచారు. అశ్వత్థ మాత్రం ఒక స్థితప్రజ్ఞుడిలా చిరునవ్వు నవ్వాడు అంతే!     భారతదేశం తిరిగి వచ్చి అందరం గురువుగారిని కలుసుకున్నాము. అశ్వత్థ, ఆవిడ ఆశీస్సులు తీసుకుని మాకందరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు - శివ ధనుర్భంగం చేశాక, రాముణ్ణి విడిచి వెళ్ళిన విశ్వామిత్ర మహర్షిలా!
Comments