దూరం - జయంతి పాపారావు

    ఎంత దూరం నడిచొచ్చేశానో, 

    నాకే ఆశ్చర్యంగా ఉంది!

    ఎత్తు పల్లాలు దాటుకుంటూ, 

    ముళ్ల బాటల్లో నడుస్తూ, ఎంత దూరం నడిచొచ్చేశానో నాకే ఆశ్చర్యంగా ఉంది!


    దూరం కోసమే అన్నట్లు, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!

    దూరమే గమ్యమైనట్లు, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!

    అందరికీ, అన్నింటికీ, అంతిమంగా దూరం కావడం కోసమే అన్నట్లు, చల్లచల్లగా మెత్తమెత్తగా చిరునవ్వుల జల్లుల్లో అడుగులకు అడుగులు నేర్పుతూ, కాల ప్రవాహంలో అంగలంగలు వేస్తూ, పరుగులు తీస్తూ, అలసిపోయి, సొలసిపోయి ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


    ఎందరికో దూరమౌతూ, ఎందరికో దగ్గరౌతూ, అలా అలా దూరమౌతూ, దగ్గరౌతూ, అందరికీ అన్నింటికీ అంతిమంగా దూరం కావడం కోసమే అన్నట్లు, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


    నా చిన్ని చిన్ని పాదాలను పద్మాలుగా భావించి, ముద్దుగా ముద్దుగా ఎందరెందరో ముద్దుపెట్టుకున్న నా పాదాలతో, కాలాన్ని పాదాలతో వెనక్కి నెట్టేస్తూ, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


    నన్ను కని పెంచి పెద్దదాన్ని చేసిన నా తల్లిదండ్రులకు దూరమైపోతూ, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


    తోబుట్టువులకు దూరమౌతూ, దూరమైపోతూ, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!

    నన్ను కని పెంచి పెద్ద దాన్ని చేసిన తండ్రికి, నన్ను చేతుల్లో లాలిస్తూ, గుండెల మీద కూర్చోబెట్టుకుని, భుజాల మీద కూర్చోబెట్టుకుని, బుర్ర మీద కూర్చోబెట్టుకుని ఆడించిన నా తండ్రికి, పదహారేళ్లు దాటాక, ఒళ్లోకి వెళ్లి కూర్చోవాలనిపించినా, వెళ్లలేక వెళ్లలేక కాస్త దూరం దూరంగా ఉంటూ, దుఃఖాన్ని పెంచుకుంటూ, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


     దూరం ఏంటి, ఎందుకు, ఎలా వచ్చిందో, నాకు తెలియకుండానే, నాకు తెలిసీ తెలియకుండానే, దూరమైపోతూ, దూరమైపోతూ ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


    నాన్న దగ్గరే కాదు, అమ్మ దగ్గర కూడా, కాస్త దూరం దూరంగా ఉంటూ, దూరాన్ని పెంచుకుంటూ, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


    అలా దూరమైపోతూ, జ్ఞాపకాల వీచికల్ని, మధుర వీక్షణాల్లా మోసుకుంటూ, తొట్రుపడుతున్న పాదాలతో, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!

    ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏదో విధంగా తెలిసిన, తెలిసీ తెలీని వ్యక్తి వెనుక, ఏడడుగులు ఎందుకు నడవాలి? కన్నవారికీ, కన్న నేలకీ, తోబుట్టువులకూ దూరమైపోతూ, అతనికి ఎందుకు దగ్గరైపోవాలి? అలా కాకపోతే, ఏమౌతుంది? ఆనాటి, అలనాటి, ఎన్నో ప్రశ్నలను తనుపుకి తెచ్చుకుంటూ, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


    ఏమౌతుందో తెలీదా? ప్రకృతి ధర్మాన్ని, జీవన ధర్మాన్ని నిర్వర్తించవా? సృష్టికి న్యాయం చేయవా? కన్నవారూ, తోబుట్టువులూ, ఎవరి దారిన వారు దూరంగా వెళ్లిపోతూ ఉంటే, నువ్వు ఎవరికి దగ్గరగా, ఎవరి దగ్గర ఉండిపోగలవు? ఒంటరిగా, ఒంటరితనంలో ఏం చేస్తావు? ఏం సాధిస్తావు? నిజమే, నీ చదువుతో, నీ జ్ఞానంతో, నీ శ్రమతో, నీ మేధాశ్రమతో ధనాన్ని ఆర్జించి, నీ కాళ్ల మీద నువ్ బతకగలవు; అయితే జీవన గమనాన్ని ఒంటరి తనంలో అక్కడే ఆపేస్తావా? వృద్ధులు, పసిపిల్లలైపోతారు. చేయూత కావాలి. చేయూత లేకుండా, నడవలేని స్థితి కూడా రావొచ్చు. ఒంటరితనంలో నీ జీవితం ఎలా నడుస్తుంది? చేయూత లేకుండా ఎలా నడుస్తావ్?


    నీ పిల్లల్ని చూసి నువ్ మురిసిపోతూ, వాళ్ల పాదాల మువ్వల చప్పుళ్లలో సమస్త సంగీత స్వరాలూ వింటూ, ఆనందిస్తూ పరుగులు తీసే జీవితాన్ని ఎందుకు కాదనాలి? నీ పిల్లలు పెరిగి పెద్దవారై, ప్రయోజకులైతే, అదంతా నా సృష్టే అని గర్వించే మధుర జీవితాన్ని ఎందుకు కాదనాలి? అలా అలా ఎన్నో ఎన్నో తనుపుల భారాన్ని బుర్రలో పెట్టుకుని, బుర్రపై పెట్టుకుని, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


    ప్రతి అడుగూ, ప్రతి గమనం ఎంత మధురంగా, ఎంత కష్టంగా, ఎంతెంతో కష్టంగా, ఎంతెంతో సుఖంగా అనుభవిస్తూ, ఆనందిస్తూ, దుఃఖిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆనంద బాష్పాలు ఒత్తుకుంటూ, ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


    ప్రకృతి ధర్మం, జీవన ధర్మం చాలా తేలిగ్గా పక్కన పెట్టేశాను. అయితే ఒంటరితనం అన్న ఆలోచన రాగానే భయపడిపోయాను. జీవితంలో ఎవరైనా శత్రువంటూ ఉంటే, శత్రువు ఒంటరితనమేనని నా మనసులో బలంగా పాతుకుపోయింది. ఒంటరితనమనే శత్రువుతో జీవించడం కంటే, మరో శత్రువుతోనైనా జీవించడం మెరుగనిపించింది. 


    వివాహం చేసుకున్నాను. తెలిసీ తెలీని వ్యక్తితో జీవితం ప్రారంభించాను. అబ్బబ్బ! ఏం చెప్పను? మనోభాష, అక్షర భాషకు తెలిసీ తెలీనట్లుగానే ఉంది. జీవితం ఎంత గొప్పదో, ఎంత ఆనందమైందో, ఎంత సుఖవంతమైందో, ఎంత మధురమైందో, నేను తలచుకుంటూ మురిసిపోతూ ఉండేదాన్ని. 


     తెలిసీ తెలీని వ్యక్తికి అంత దగ్గరగా, అంత దగ్గర దగ్గరగా, ఎలా అయిపోయానో తలచుకుంటే, సిగ్గుగా ఎంతో సిగ్గుగా, అబ్బబ్బ! ఎంతెంతో సిగ్గుగా, ఆనందంగా, సంతోషంగా సుఖమంతంగా, అబ్బబ్బ! మరింక నేను చెప్పలేనంతగా అనిపిస్తూ ఉండేది. ప్రకృతి ధర్మమంటే అదేనేమో. జీవన ధర్మమంటే అదేనేమో. ఏమో స్పష్టంగా చెప్పలేను కానీ, అదేనేమోనని జీవన గమనంలో ప్రతిరోజూ ప్రతి క్షణం ఆనందంగా గడిపేశాను. 


    జీవితం ఎంత గొప్పది. కామం, ప్రేమ కలిసి బతుకుతాయేమో. కామం, ప్రేమా భార్యాభర్తలేమో! ఆడది లేని ప్రపంచాన్ని, అలాగే పురుషుడు లేని ప్రపంచాన్ని, జీవితాన్ని ఊహించుకోగలమా?


     రోజుల్లో ఆయన మీద నాకు అప్పుడప్పుడు కొద్ది క్షణాలు ఎంతో కోపం ముంచుకొచ్చేది. తల్లిదండ్రుల మీద, తోబుట్టువుల మీద, ఇతర బంధువుల మీద, స్నేహితుల మీద నాకు ఎంతో ప్రేమ ఉండేది. నా గుండెల్లో వాళ్లందరికీ ఎంతో చోటు ఉండేది. నా గుండెల్లో వాళ్లకున్న చోటు చాలా ఆయనే దురాక్రమణ చేసేశాడు. ఆయనకు నేను దగ్గరవుతున్న కొద్దీ, వాళ్లు నాకు కొద్ది నొప్పిగా దూరమౌతూ, దూరమైపోతూ ఉన్నారు.


    నాట్యం చేసే నా పాదాలతో నడుచుకుంటూ పరుగులు తీస్తూ, కాలాన్ని వెనక్కి నెట్టేస్తూ, ఎంత దూరం వచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది.


    సృష్టించడమంటే ఏమిటి? ఎందుకు సృష్టించాలి? సృష్టించకపోతేనేమి? ఏం జరుగుతుంది? నేను సృష్టించడానికే పుట్టానేంటి? సృష్టించకుండా జీవితాన్ని హాయిగా స్వేచ్ఛగా గడిపేస్తే ఏమౌతుంది? ఎలా ఉంటుంది? సృష్టించాలా, వద్దా అన్నది నా ఇష్టం. నా స్వేచ్ఛ. ఆయనకి సుఖాన్నే కాకుండా, పిల్లల్ని కని కూడా ఇవ్వాలా? అది నా ఇష్టం. అది నా స్వేచ్ఛ. విధంగా ఎంతగా ఆలోచించానో. ఎన్నాళ్లు ఆలోచించానో.


    అత్తా, అమ్మా కూడా ఏమమ్మా ఇంకా అలాగే ఉండిపోయావన్నప్పుడు నాకు ఒళ్లు మండిపోతూ ఉండేది. అది నా ఇష్టం, అది నా స్వేచ్ఛ అని నోరు విప్పి చెప్పకుండా, కళ్ల చూపుల్తో చెప్తూ వచ్చాను. మేమింకా ఎంత కాలం బతుకుతామో తెలీదమ్మా అని మామగారూ, నాన్నగారూ అంటూ ఉన్నప్పుడు, ప్రపంచం పిచ్చిదని అనుకుంటూ తలదించుకుని వెళ్లిపోతూ ఉండేదాన్ని.


    రోజూ చూసే చిన్న దృశ్యం, నా ప్రశ్నలన్నింటికీ రోజున జవాబు చెప్పినట్లయింది. ఎంత ఆశ్చర్యం! ఎంత మార్పు! చిన్న దృశ్యమేంటి, అంత మార్పు నాలో రావడం ఏంటి? నేనే ఆశ్చర్యపోయాను. రోజున మా పొలంలోకి వెళ్లాను. పరవళ్లు తొక్కుతున్న పచ్చని, పచ్చపచ్చని నేలనీ, పంటనీ చూశాను. 


     పక్కనే ఎండిపోయిన, గొడ్డు పోయిన ఎర్రటి మట్టి దిబ్బను చూశాను. దిబ్బని చూసి భయపడిపోయాను. ఎవరి జీవితం దిబ్బ కాకూడదనుకున్నాను. పచ్చ పచ్చని నేలా, పచ్చపచ్చని పంటా కావాలనుకున్నాను. అంతే! 


    ఓహో, అంతే అంతే! ఆహా, అంతే అంతే!


    కామం, ప్రేమ కలిసి కాపురం చేసి సంతానాన్ని సృష్టించాయి. అందరి కళ్లల్లో వెలుగు. నా కళ్లల్లో వెలుగు. నా గుండెల్లో గర్వం. పరవళ్లు తొక్కుతున్న పచ్చని, పచ్చపచ్చని నేలా, పంటా, నేను. ప్రకృతిని నేను. నా ప్రాణం కంటే గొప్పది నాకేదీ కాదనుకున్నాను. జీవన గమనంలో అది పూర్తి నిజం కాదని తెలుసుకున్నాను. నా ప్రాణం కంటే నాకు నా పిల్లలే గొప్ప.


    వాళ్లే నా ప్రాణం. వాళ్లే నా సమస్తం! నాకు నవ్వొస్తోంది. నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అతడు దురాక్రమణ చేసినా, నా గుండెల్లో చోటుని నా పిల్లలు క్రమక్రమంగా వశపరచుకున్నారు. ఇప్పుడతడు తెల్ల మొహం వేస్తున్నాడు. జీవన యాత్రలో జీవన గమనంలో గుండెలో చోటు కూడా చేతులు మారుతుందన్నమాట!


    కాలం ఆగదు; ప్రవహిస్తూనే ఉంటుంది. జీవితం ఆగదు; ప్రవహిస్తూనే ఉంటుంది...

     మధ్యనే ఏం జరిగిందంటే, మా పెద్దబ్బాయి తలకి కొబ్బరినూనె రాయమన్నాడు. ఎత్తయిన పీట వేశాడు. దానిమీద నిలబడ్డాను. వాడు బాగా ఒంగి ఒంగి తలదించుకుని నిలబడ్డాడు. మా కోడళ్లు, ఆయనా, ఇంట్లో అందరూ దృశ్యాన్ని చూసి ఎంతగా పకపకా నవ్వుకున్నారో! 


    ఎన్ని ఫొటోలు తీసేశారో. నేనూ నవ్వు ఆపుకోలేకపోయాను. నవ్వే నవ్వు. నవ్వులే నవ్వులు. అబ్బబ్బ! ఇప్పుడు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఏటంటే, మా అబ్బాయిలూ, అమ్మాయిలూ అంత ఎత్తుకి ఎదిగిపోయారు. చదువులో, ఉద్యోగంలో, జీవితంలో.... చెప్పుకోకూడదు కానీ, నేను ఎంత గర్వపడుతున్నాను.


    అలనాడు చిన్నతనంలో నా ఒళ్లో కూర్చుని కొబ్బరినూనె రాయించుకుని తల దువ్వించుకునేవాడు. ఇప్పుడు కూడా అలా చేయగలడా? జీవన గమనంలో దూరం... జీవన యాత్రలో దూరం... అంతే, అంతే!


    ఏవేవో జ్ఞాపకాలు, ఏవేవో ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జీవన గమనంలో దూరమే కాదు, దగ్గరతనమూ వస్తుంది. కొందరు దూరమౌతారు. కొందరు దగ్గరౌతారు. నానమ్మా, నాకు తల దువ్వు. అమ్మమ్మా నాకు తల రుద్దు. నాకు అన్నం పెట్టు నానమ్మా. నాకు బట్టలు తొడుగు అమ్మమ్మా. మేం నీ దగ్గరే పడుకుంటాం. మనవలూ, మనవరాళ్లూ ఎంత దగ్గరైపోయారో!


     దగ్గరితనం అలాగే ఉండిపోతుందా? మధ్యనే నా పెద్ద మనవరాలు ఏం చేసిందో! నానమ్మా, నానమ్మా నీకేమీ తెలీదు నానమ్మా. నువ్ నన్ను అంత దగ్గరగా తీసుకుని అంతలా ముద్దాడుతుంటే, ఆయన చూశాడంటే, చంటి కూచీ, చంటి కూచీ అని ఆటపట్టిస్తాడు. నీకేమీ తెలీదు నానమ్మా. చేతులు విడిపించుకుని గబగబా పారిపోయింది.


    ఎంత దూరం... ఎంతెంత దూరం... ఎలా నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది!


    ‘‘జీవన గమనంలో... జీవన యాత్రలో... ‘దూరంఒక సహజ పరిణామం. ‘దూరం’ - అనబడే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ‘ఒంటరితనంలోకి జారిపోతాం. నిరాశలో కూరుకుపోతాం. అలా కాకుండా జాగ్రత్త పడాలి. నీకుఒంటరితనంఅంటే పరమ భయం. అందుకే చెబుతున్నాను’’ ఆయన నవ్వుతూ అన్నాడు. 


    ‘‘మీరు పొరబడుతున్నారు. మనిషికిఒంటరితనంఏంటి? ‘ఒంటరితనంమనం సృష్టించుకుంటే ఉంటుంది. లేకపోతే ఉండదు. ‘ఒంటరితనంసహజ పరిణామం కాదు’’ నేను గలగల నవ్వుతూ అన్నాను. ఆయన కూడా నిజమేనన్నట్లు గలగల నవ్వుకున్నాడు.


    ఎంత దూరం నడిచొచ్చేశానో, నాకే ఆశ్చర్యంగా ఉంది! 


(3జూలై 2011 సాక్షి ఫన్‌డేలో ప్రచురితం)

Comments