ఏకాంతంతో చివరిదాకా! - అరుణ పప్పు

    ఒక సుదీర్ఘ విరామం.. మౌనం..

    వాటిని భగ్నం చేస్తూ "నిన్నొకటి అడగాలనిపిస్తోంది అమ్ములూ. అడగనా.." అన్నాడాయన. 

    "చేతిలో చెయ్యేసి మాటివ్వలేను కానీ, మీరు చెప్పండి ముందు.." అన్నాన్నేను. 

    "నిజంగా..? తీరా నేన్చెప్పాక నువ్వు నవ్వకూడదు, తిట్టకూడదు, ఫోన్‌ పెట్టెయ్యకూడదు.."

    "ఛ.. ఏమిటది చిన్నపిల్లల్లా. నేను మిమ్మల్ని తిట్టడమేమిటి? అంతమాటా! నవ్వడం, ఫోన్‌ పెట్టెయ్యడం.. మ్మ్‌... అంత కోరరానిదా.. ఒకవేళ అలాంటిదయితే అడక్కండసలు... ఎందుకొచ్చిన బాధ.."

    "అలాకాదమ్ములూ.. ఒకోసారి సమయం మించిపోతే ఇబ్బంది. ఇంతకు ముందు అడిగినలాంటిది కాదులే.  అందుకనిప్పుడే చెప్పాలి.." 

    "సరే మరి చెప్పండయితే.."

    'నా అంత్యక్రియలకు తప్పకుండా రావాలి నువ్వు.. నీకేమీ ఇబ్బంది ఉండదు. ఉమా, చలం, జీవీ, వేణు.. అందరూ ఉంటారు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు.. ఎవ్వరూ ఏమీ అనరు..  ఒస్తావు కదూ..'

    ఒక్కసారి నా మెదడు మొద్దుబారింది. 

    అసందర్భంగా ఏమిటీ ప్రస్తావన?

    "అమ్మో.. ఆ రచయితా? అస్సలు ఆ జోలికేపోవద్దు.. నువ్వతని కథలూ, నవలలూ ఏమైనా చదివావా.. ఎంత అరాచకత్వమో వాటినిండా.. అతని లైఫ్‌స్టయిలూ అంతే. నీకేం తె లుసు.. మహా ప్రమాదకరం అనుకో. ఆడపిల్లవి. అతనితో స్నేహమంటే కోరి కొరివితో తలగోక్కోవడం.." అచ్చం ఇవే మాటలు కాదుగానీ, ఇంతకన్న ఓ పాలు ఎక్కువగానే కొందరు పరిచయస్తులు  హెచ్చరించారు నన్ను.. కొత్తలో నేను తన గురించి ఆరాలు తీస్తున్నప్పుడు. అదేమాట పరిచయం పెరిగిన తర్వాత అతనితో అంటే, "అస్తిత్వంలో ఉన్న సాంఘిక నైతిక సరిహద్దులు తనకు తానే సృష్టించుకున్నవన్న సంపూర్ణమైన అవగాహన కలిగినవాడు... వాటిని అధిగమించడానికి సంశయించనివాడు.. కళాకారుడైనప్పుడు.. వాడు సంఘంలో ప్రస్ఫుటమయిన అరాచకుడిగా కన్పడ్డం చాలా చాలా సహజం.అసలు కళాకారుడెవరమ్ములూ? తన అంతశ్చేతన లోతుల్లోకి తనే దూకి ఆ చీకటి లోయల్లో తనన్తాను వెతుక్కునేవాడు... ఆ క్రమంలో ఎదురయ్యే వైరుధ్యాలకి, వికర్షణలకీ  తాను ఆకర్షితుడై ఒకోమాటు తనన్తాను వెతుక్కోవడం మానేసి హీ ఫాల్సిన్‌ సర్చాఫ్‌ అన్నోన్‌! తనకే తెలియని ఆ అన్వేషణే అరాచకత్వమనుకుంటా! నేనలాంటివాణ్నేనంటావా? అయితే నేన్నిఖార్సయిన అరాచకుణ్నే..'' అని నవ్వారు.

    నాకలా చెప్పిన వాళ్లంతా పరిచయస్తులుగానే మిగిలి.. పోయారు గానీ, మా పరిచయం మాత్రం డాబా మీదకెక్కే సన్నజాజి పొదలా విస్తరించింది. అనేకమందికి ప్రస్ఫుటంగా కనిపించే అతని అరాచకత్వం నాకెందుకో మనసులో నాటుకోలేదు. ఒకటి మాత్రం గమనించాన్నేను. ప్రేమకు తప్ప మరే నియమానికీ లోబడని తత్వం. ప్రపంచ సాహిత్యం.. ఉత్తర దక్షిణాల సంగీతం, విభిన్న వర్ణాలూ ఛాయలూ కలగలిసిన జీవితం.. నాకు అర్థమై - సగం చదవడంలో, మరో సగం సస్పెండెడ్‌ యానిమేషన్‌లో గడిచిపోయిన జీవితం.. ఇదీ అని చెప్పలేని రకరకాల ముద్రల  కలనేత.. ఈ క్షణాన నాతో మాట్లాడుతున్న వ్యక్తి. 

    "నబకోవ్‌ లోలితా పూర్తయిందా? కాఫ్కానీ చదువు, బాదిలేర్‌, అపోలినేర్‌ని బుచ్చిబాబునీ కాళిదాసునీ చలాన్నీ హెర్మన్‌ హెసానీ.. అందర్నీ చదవాలమ్మా.. " 

    పుస్తకం తర్వాత పుస్తకం!

    "భీంపలాస్‌ మన అభేరీనే అమ్ములూ. అహీర్‌భైరవ్‌ మన చక్రవాకంలా. మలయమారుతం చక్రవాక జన్యం. కొండగాలి తిరిగింది... పాట తెలుసుగా!" అటకెక్కించిన నా బొబ్బిలి వీణను దించి దుమ్మయినా దులపాలనిపించేలా!!

    "ఎవళ్ల బొమ్మలో నకలు చెయ్యడం కాదు.. బీ క్రియేటివ్‌.."

    ఫూ.. మా కార్టూనిస్ట్‌ను నకలు చెయ్యడం నేనాదెబ్బకు మానేశా. 

    ఒక్క క్షణం.. నాకివన్నీ చప్పున గుర్తొచ్చాయి. 

    మరి అకస్మాత్తుగా ఈ కోరికేమిటి! ఎందుకొచ్చిందీ ఆలోచన? ఎంత కాదనుకున్నా రక్తనాళాల్లో ప్రవహిస్తున్న బ్రాహ్మణ సంస్కృతి దీనికి ప్రేరణనిచ్చిందా..? జన్మ సంస్కారం అంటే ఇదేనా? అభిజాత్యమా ఇది?

    అందరూ ఆడిపోసుకునే అరాచక ధోరణులన్నీ పైపైన పేరుకున్నవేనా... లోపలున్నది ఇంత చిక్కనిదా... అందుకే అతని రచనల భాషా యాసా అలా ఉంటాయా?

    ఆయన కోరిక విన్నప్పుడు లోపల బాధ తొణికిసలాడింది.. ఎందుకో విచిత్రంగా అది తెరలుతెరలుగా నవ్వుగా బైటికొచ్చింది.

    "ఇదేమిటి? ఏదో నా పెళ్లికి రా, అన్ని వసతులూ ఉంటాయిలే, అందరూ వస్తున్నారు, నువ్వు మిస్సయిపోకు.. మంచి చీర పెట్టి పంపిస్తాం, జాగ్రత్తగా దిగబెడతాం అన్నట్టు అలా పిలుస్తున్నారు? నవ్వొస్తోంది నాకు''

    నవ్వినవ్వి ఆగిపోయా. 

    అకస్మాత్తుగా ఏర్పాటయిన పెళ్లి చూపులు.. బెదురు చూపులతో కాలేజీలో అందరికీ పంచిన శుభలేఖలు.. ఎంతో సరదాగా జరిగిపోయిన పెళ్లి.. ఏమీ తెలియనితనంలో ఎంతో ధీమా! ఎందుకో అన్నీ గుర్తొచ్చాయి. 

    ఉన్నట్టుండి వాస్తవంలోకి వచ్చిపడ్డా. 

    కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతోంటే..

    అతను లేని శూన్యాన్ని మనసు క్షణకాలం ఊహించుకుందేమో.. చప్పున ఏడుపొచ్చింది. నిగ్రహించుకున్నాను. అట్నుంచి ఏదో అనబోతుంటే అడ్డం పడ్డాను. "అడిగారు గనుక ఇప్పుడే చెబుతున్నా.. అప్పుడెంతమందొచ్చినా నేను రాను. అసలు మీకన్నా ముందు నేనే చచ్చిపోతే?''

    "అలా అనకమ్ములూ.. నేను వినలేను..''

    'ఏం ఎందుకనకూడదు? నేనంటాను. రేపే ఎప్పుడో అకస్మాత్తుగా ఆఫీసుకు వెళుతూనో, వస్తూనో..  ఏ లారీకిందకో బండెళ్లిపోయి, ఎవడో గుద్దేసి నేనే ముందు  చచ్చిపోతే? అప్పుడేం చేస్తారు? మీకెలా తెలుస్తుంది నేన్చచ్చిపోయినట్టు? ఫోన్‌ చేసి చెప్పడానికి నేనుండనుగా. మరి మీరొస్తారా నా అంత్యక్రియలకి?''

    "తల్లీ.." 

    "మనుషులు ఉన్నప్పుడు ప్రేమించాలి, వాళ్ల కోసం  చెయ్యాల్సిందేమైనా ఉంటే బతికున్నప్పుడే.. వాళ్లు మనతో ఉండగానే చెయ్యాలి. చచ్చిపోయాక, ఉన్నాయో లేవో తెలీని సూక్ష్మ శరీరాల కోసం అవి  సాఫీగా చేయగల ప్రయాణం కోసం ఊర్థ్వ లోకాల కోసమంటూ.. ఈ  క్రతువులన్నీ అవసరమని నేననుకోను. నా నమ్మకాలన్నీ మానవత్వం చుట్టూరానే. మీకు కష్టంగా అనిపిస్తోందేమో. అయినా కాదూకూడదంటే మీ తృప్తి కోసం.. అదికూడా కాదు, మీకిచ్చే మాటకోసం వస్తానేమో తప్ప, అంత్యక్రియల తంతునంతా నమ్మి మాత్రం కాదు. అందుకే ఆ సమయంలో రాను. చలనం లేకుండా.. మిమ్మల్నలా చూడటం నాకిష్టం లేదు. అదో సిద్ధాంతమని కూడా కాదు.. ఎందుకో, ఆ ఆలోచనే నా మనసుకు బాధగా ఉంది.. అందుకే  ముందే చెబుతున్నా. ఇప్పుడు నేనేం చేస్తే మీకు సంతోషంగా ఉంటుందో అది అడగండి. ఇలా  చెబుతున్నందుకు  ఏమీ అనుకోకండి.." అని నేరుగా చెప్పేశాను. 

    బాధ పడ్డారేమో అనిపించింది.. నా జోరులో పట్టించుకోలేదు. 

    "నువ్వంత కచ్చితంగా చెప్పాక నేనేమనగల్ను చెప్పు.. ఎందుకో అలా అనిపించి అడిగానంతే. కాళ్లోసారి ఫోన్లో పెట్టమ్మా.. దండం పెట్టుకుంటా.. గుడ్‌నైట్‌.." 

"గుడ్‌నైట్‌"

* * * * *

    నిద్దర్లోకి జారుకుందామని ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. 

    ఈయన ఫోన్లెప్పుడూ ఇలాగే ఉంటాయెందుకు? 

    ఆఫీసుకు జూబ్లీహిల్స్‌ కొండల్లోకెళ్లాలంటే నాకు చాలా ఇష్టం. నిజానికి అవి మా ఇంటికి చాలా దూరం. వెళ్లి రావడం కష్టం కూడా. అయినా ఇష్టమెందుకంటే ఆ రోడ్లు. పైకెక్కి.. అంతలోనే కిందకి జారి.. విచిత్రంగా ఉంటుందా అనుభవం. జెయింట్‌ వీల్లాగా.. రోలర్‌ కోస్టర్‌ రెయిడ్‌లాగా.. ఎత్తుపల్లాలను చాలా తక్కువ వ్యవధిలో చూపిస్తుంది రోజూ నా ప్రయాణం. జీవితాన్ని ప్రతిఫలిస్తూ!! మా పరిచయమూ  అలాగే. 

* * * * *

    ఇంటర్‌ చివర్లోనో డిగ్రీ మొదటేడాదిలోనో బస్సు ప్రయాణం చేస్తూ.. విశాఖపట్నంలో తోచక ఓ పుస్తకం కొన్నా. నిజానికి బస్టాండుల్లో దొరికే పుస్తకాల మీద సదభిప్రాయం లేదు నాకు. ఎందుక్కొన్నానో మరి.. అలా చదివాతని నవలను. మొదటిసారి. నేను ఊహల్లో సైతం చిత్రించుకోలేని మరో జీవితాన్ని నా కళ్లముందు నిలబెట్టిందా పుస్తకం. ఇదంతా ఈయన అనుభవించే రాసుంటాడా.. సందేహం మొలకెత్తింది. ఒక్కసారి మనిషిని చూడాలనిపించింది. పేరు, చిరునామా చూశాను.. అదెక్కడో మేం అమెరికా కన్నా దూరమనుకునే జిల్లా. చాలారోజులు గుర్తుపెట్టుకున్నాను.

    ఐదారేళ్లు తిరిగిపోయాయి. పెళ్లి, ఉద్యోగం.. అన్నీ చకచకా నడిచిపోయాయి. ఉద్యోగంలో చేరిన కొత్తలో, కుర్ర జర్నలిస్టుగా పడుతూలేస్తూ పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు.. యువ రచయితల మీద ఓ కథనం చెయ్యాలని డెస్కులో ప్రతిపాదన. అదిగో అప్పుడు వచ్చిన  పదిమంది పేర్ల జాబితాలో ఈయనదీ ఒకటి. అందరివీ ఫోన్‌ నంబర్లు రాసుకుని వరసగా చేశాను. 

    "మీ ఇంటర్వ్యూ కావాలి.."  నేనడగటం, ఇంటికో ఆఫీసుకో రమ్మని వాళ్లు చెప్పడం.. వెళ్లి వాళ్లు చెప్పినవన్నీ రాసుకోవడం. ఇవన్నీ. 
తర్వాత అతని వంతు. పొట్టి సందేశాలు పంపిస్తే స్పందన లేదు. 

    ఫోన్‌ చేసి "మీరుండేది హైదరాబాద్‌ విద్యానగర్లోనే కదా.. నేనక్కడికి రానా.. మీ గురించి కొంచెం చెబితే రాసుకుంటాను.." అన్నా. నవ్వినట్టు వినిపించింది. "నేనా సిటీలో లేనండి. ఇంటర్వ్యూలు ఇవ్వను కూడాను. నమస్కారం.." అని ఫోన్‌ పెట్టేశారు. సరే, అప్పటికి ఊరుకున్నా. పట్టు వదలడం పాత్రికేయ లక్షణం కాదు మరి. వాళ్లనీ వీళ్లనీ కదిపి కొన్ని వివరాలయితే సేకరించి, ఒకట్రెండు నెలలు గడిచాక మళ్లీ ఫోన్‌ చేశాను. అర్థమయిందేమో.. "నేను మీరనుకున్నంత కుర్రాణ్నేమీ కాదండి. యాభైరెండు నడుస్తోంది. అయినా, మీరు నా రచనలు ఇంకొన్ని చదివితే అసలిలా ఇంటర్వ్యూ అడగరేమో.."

    పట్టుపట్టి పది రోజుల్లో అన్నీ పోగేసి చదివాను. "మీ కవిత్వం నాకర్థం కాలేదు, కానీ, చాలా రోజులుగా.. కాదు కొన్నేళ్లుగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను..." అంటూ అప్పుడెప్పుడో చదివిన నవల గురించి వివరాలు అడిగాను. అలా మొదలైన ఫోన్‌ సంభాషణ కొద్దిగా పరిచ యాన్ని పెంచింది. తర్వాత నేనూహించని మలుపులు తిరిగింది. 

* * * * *

    "నాకో కూతురంటే నీ అంతే ఉండేదేమో.."

    "ఉంటేగింటే ఊహలెందుకు.. నేనే అనుకోవచ్చుగా"

    "అవున్నిజమే.. కానీ, అమ్ములూ.. నీకో మాట చెప్పాలనుంది.. చాలా రోజులుగా. నువ్వు చాలా బావుంటావమ్ములూ. నిఝంగా నిజం..."

    "హహ.. ఆ సంగతి నాకు తెలుసులెండి. ఇంకా ఏమిటి కబుర్లు.."

    'అందం అంటే ఇలా చూడగానే అలా వెర్రెక్కించేలా కాదమ్ములూ. నువ్వు మా అమ్మలా అనిపిస్తావు చాలాసార్లు..  ఈ మాటంటే నవ్వుతావు కానీ, ఏదో చాలా జన్మల నుంచీ నువ్వు నాకు తెలుసనిపిస్తుంది'

    "అవును స్వామీ, నవ్వడం కాక మరేం చెయ్యను? ఇది కూడా మీరు చాలాసార్లు చెప్పేరు. ఇప్పుడెందుకు దానిగురించి?"

    "నువ్వేమీ అనకూడదు మరి. ఏమీ అనుకోకూడదని అననుగానీ.. సరే చెప్పేస్తా. ఎందుకో నీమీద పితృవాత్యల్యాన్ని మించినదేదో కలుగుతోంది.. అదేమిటో కచ్చితంగా చెప్పలేను కానీ, అసంగతమైనదేమైనా కోరుకుంటున్నానేమో కూడా. అలాగని దేహంలో చివరి ఓ భాగంతో, నిషా తలకెక్కిన మైకంతో కోరరాని కోరికేదో కోరుతున్నానని కూడా అనుకోకు. ప్లీజ్‌... యూ కెనండస్టాండ్‌ వాట్‌ అయ్‌ మీన్‌ అండ్‌ వాటయామ్‌ సేయింగ్‌ "
లోపల ఫెటీల్మని ఏదో తగిలినట్టనిపించింది.

    ఒకానొక విహ్వలత కమ్మేసి మహా నిశ్శబ్దంలోకి జారుకున్నాను. "యూకెనండస్టాండ్‌..." ఏమని అర్థం చేసుకోను? 

    "ఏయ్‌ అదితీ... ఏంటలా చూస్తున్నావ్‌? ఏ మగవాడయినా, మహిళకు స్నేహం అంచుల్లో ఇదే ప్రతిపాదిస్తాడు. స్త్రీత్వం తప్ప మరేదీ ఆనదు వీళ్లకి. ఈ మనిషి దానికతీతం కాదనుకుంటున్నావా... అతనేం చెబుతున్నాడో అర్థమయిందా... ఈ మాత్రం అర్థం కాకపోతే, ఇరవయ్యారేళ్ల వయసుండి వేస్ట్‌. అందునా పెళ్లయి సంసారం కూడా చేస్తున్నావంటే నీదేదో మాన్యుఫాక్చరింగ్‌ డిఫెక్టేమో. మీడియాలో పనిచేస్తూ, ఇన్ని కథలు చూస్తూ, ఇంత మంది మగవారి మధ్యలో ఉండి, రకరకాల వెకిలి వేషాలను చూసి...నీకర్థంకాదేమిటే? అతనటువంటి మనిషి కాదంటావ్‌. అంతేగా. అది కాదంటే మరేమిటో చెప్పమ్మా.. ? కాదంటే నీతో అతనికి స్నేహం ఏమిటి? ఓ పెద్ద రచయిత నీతో మాట్లాడుతున్నాడని నీకూ సంబరమే. నిజం చెప్పు, నిజంగా నీ ప్రతిభను చూసి మాట్లాడుతున్నాడా ఆయన? ఇదే నీ వయసు మగ జర్నలిస్టయి ఉంటే స్నేహం చేసేవాడేనా... అసలింతదాకా తెచ్చింది నువ్వే. పైగా నువ్వే ఇలాంటి సందర్భం కోసం ఎదురుచూస్తున్నావేమో.. నిన్ను నువ్వే మోసం చేసుకోగా లేనిది, ఇంకెవరో ఏదో అంటే ఏం లే.." అంతరాత్మ లోపల్నించి నిలదీసింది.. ఈసడించింది.. ఏమిటేమిటో కలగాపులగంగా చెప్పింది.   

    అంతా విన్నాను. నాలోపలికి నేను తరచి చూసుకున్నాను. అలజడి కలిగించిన అన్ని ప్రశ్నలకూ సంతృప్తికరమయిన సమాధానాలే వచ్చాయి.  

    మరో కోణంలో ఆలోచించడం మొదలెట్టాను.

    యాభై దాటిన వయసులో స్థిరత్వాన్ని కోరుకుంటోందా అతని మనసు? అన్నిటా అర్థం చేసుకునే తోడు కోసం పరితపిస్తున్నాడా అతను? అది స్నేహంతో పూరించే ఖాళీ కాదా.. అది నేను పూరించాల్సిన ఖాళీనా.. దానికేదీ మార్గం.. ఇదేనా.. 

    "ఏదో సామెత చెప్పినట్టు, నీ మాటలకన్నా మౌనానికి విలువెక్కువ అమ్ములూ.. నీ నిశ్శబ్దానికి డబ్బు ఖర్చవుతోంది.. మాట్లాడకుండా ఉండటానికి  ఫోన్‌ బిల్లు కట్టేదానికి నువ్వేనేమో.." అని నవ్వేవాడాయన ఒకరికొకరం తెలిసిన కొత్తలో. తర్వాత్తర్వాత అతనూ నా నిశ్శబ్ద సంభాషణలకు అలవాటు పడిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత "సరే మరి  ఉంటానేం.." అని ఫోను పెట్టేసినా, అసంపూర్తిగా ఉన్నట్టు తోచేది కాదు ఇద్దరికీ.
ఇప్పుడలాంటి ఘనీభవించిన మౌనంలో సమాధానమేదో దొరికే ఉంటుందతనికి. 

    ఐదారు నెలల పాటు దాన్ని నేను కరిగించలేదు.

    నిజంగా నిజం చెప్పాలంటే, నేనూ రకరకాల భావావేశాల్ని అనుభవించే ఉన్నాను ఆపాటికి, అతని విషయంలో! అయితే మజ్జిగను చిలగ్గాచిలగ్గా వచ్చే వెన్నలాగా, నాలో ఓ భావం స్థిరపడింది. అందుకే "ప్లీజ్‌ ..అపార్థం చేసుకోకు.. నా అక్షరంలో నువ్వు తిరగాలి.. " అని ఓ ఉత్తరం వస్తే, ధీమాగా, ప్రేమగా ప్రత్యుత్తరం రాశాను. "అనేకమైన వరాలిమ్మని దేవుణ్ని కోరుకుంటాం. కానీ దేవుణ్నే కోరుకోం. ఆయనే వచ్చి అకస్మాత్తుగా ఇలాంటి ఆలోచనుందని చె ప్పినా తట్టుకోలేం.." అని. 

    నాలుగైదు రోజుల తర్వాత..  మా ఫోన్లు మళ్లీ హాయిగా పలకరించుకున్నాయి. నిన్నటివి వాడిపోయినా, ఇవాళ విరిసిన జాజిపూలు చుక్కల్లా నవ్వినట్లు... రెల్లుపూలు సంధ్యవేళ ఏటిగాలికి ఊగినట్టు... ఓ పేరు తెలీని పిట్ట సాయంత్ర పు నీరెండలోకి సుదూరంగా, ఒంటరిగా వెళ్లిపోయినట్టు! 

* * * * * 

    అతన్ని  చూడాలనిపించి ప్రయాణమై వెళ్లాను.  

    సాయంత్రం ఓ కొండ కొమ్మున. శ్రీశైలం బ్యాక్‌వ్యాటర్స్‌లో ములిగిపోకుండా తెచ్చి, ఉన్నదున్నట్టుగా కట్టిన ఓ చిన్నపాటి  శివాలయం. "మనల్ని కాపాడాల్సిన ఈశ్వరుణ్ని మనం కాపాడామన్నమాట.." అని నిట్టూరిస్తే "అబ్బా.. అంత తాత్వికత  నీకతకదమ్మాయ్‌.. వదిలేద్దూ.." అన్నాడాయన. దూరంగా  కనిపిస్తున్న తుంగభద్ర. చూస్తుండగానే నిమిషంలో మబ్బులు కమ్ముకొచ్చాయి..  చెట్టు మీద చెట్టును చూస్తూ ఉంటే.. ఎలా వచ్చాయో తెలీదు.. చినుకు మీద చినుకు. రెండే నిమిషాల్లో సన్నగా తడిసిపోయాం. రాళ్ల ప్రాంతంలో... అందునా ఆ ఊరి చివరన.. ఆ కొండ చివరకు అనుబంధంగా అలాంటి పచ్చదనం నిండిన లోయ ఉందంటే, అది ఆ సాయంత్రం మౌనంగా మాకోసమేనన్నట్టు అత్యద్భుత సౌందర్యాన్ని ఆవిష్కరించిందంటే..  వేరే ఎవరూ నమ్మకపోవచ్చు. అతని ఆప్యాయతలోని లోతుల్ని కూడా. ఆ సన్నివేశం మేమిద్దరం ఉన్నందువల్ల సంపూర్ణమయి, అంత అందంగా అనిపించిందా.. నిజంగానే అంతందంగా ఉందా అన్నది మూడేళ్లు గడిచినా నాకర్థం కాలేదు. ఒక జర్నలిస్టుగా దాన్ని తెలుసుకోవాలని అప్పుడప్పుడూ అనిపిస్తుంది కానీ, ఒక మహాద్భుత అనుభవానికి సంబంధించిన జ్ఞాపకాల్ని  బుద్ధితో బేరీజు వేసుకుని తుడిపేసేంత వెర్రితనం నాకు లేదు మరి!

    తిరిగిరావడానికి బస్సులో కూర్చున్నా. సాయంత్రం కనిపించిన మబ్బులు నా మనసులోకొచ్చేశాయి. 

    కళ్లలో చిన్న తడి వెక్కిళ్ల ఏడుపుగా మారింది.

    అతను బస్టాండు చివర మలుపు తిరిగి మాయమయ్యాడు.  

    "మీ నాన్ననా? ఎందుకంత ఏడుపు? ఇంత పెద్దయినవుగదా.. మళ్లొస్తావుగదా.." అంది నా పక్కసీటులో కూర్చున్నావిడ తొలి పలకరింపులోనే ఓ ప్రశ్ననూ, సమాధానాన్నీ, ఓ పరామర్శనూ, ధైర్యాన్నీ, ఒక సందేహాన్నీ, ఒకానొక అష్యూరెన్స్‌నూ నాలోకి పంపిస్తూ.

    నాన్నేనా.... నేను పెద్దయ్యానా... మళ్లీ వస్తానా??

    ఎక్కడికి? అప్పుడితనుంటాడా? అతని జ్ఞాపకం మాత్రం ఉంటుందా? కనుమరుగయిన అందరూ జ్ఞాపంగా పరిణమిస్తారా... 

    ఊహూ... కొందరే. 

* * * * *

    ఆఫీస్‌ పనితో అలసట. కళ్లు మూతలు పడుతుండగా రాత్రి పదకొండింటికి అకస్మాత్తుగా గుర్తొచ్చారు. 

    నిన్న రాత్రి అతనడిగిన కోరిక్కూడా. అసలలా ఎందుకడిగినట్టు? ఎందుకని నేనెందుకడగలేదు?

    ఫోన్‌ చేశా. 

    కభీ తన్హాయీయోంమే.. హమారీ యాద్‌ ఆయేగీ.. 

    ముబారక్బేగం కాలర్‌ ట్యూన్‌.. నా గుండెలో పాడుతోంది.

    జవాబు ఎవరో చెప్పారు. ఏదో చెప్పారు. నేను వినలేదు.. ఒకే ప్రశ్న దగ్గర బుర్ర ఆగిపోయింది. 

    వీళ్లెందుకు ఫోన్‌ తీసుకున్నారు? తనకేమయింది.. బాత్రూమ్‌లో ఉన్నారా? లౌకిక స్మృతిలో లేరా? 

    వినకూడనిది.. కాదు నేనసలు వినదలచుకోనిది వినాలా ఇప్పుడు?

    కట్‌ చేసేశాను.

    రాత్రి చీకటిలాగా ఒక మహా మౌనం కమ్మేసింది. 

    ఒంటరిగా.. మనిషికి ఎప్పటికీ తోడై నిలిచే ఏకాంతంలో... ఏమీ తెలుసుకోవాలని లేదు. 

    ఉమా, చలం, జీవీ, వేణుగోపాల్రెడ్డి.. అందరూ ఉంటారు. ప్రపంచం పరిగెడుతూనే ఉంటుంది. తన్హాయీని మోస్తూ తిరిగేది నేనొక్కదాన్నే. కేవలం నేను. నా అంత్యక్రియల దాకా. తన్హా దిల్‌.. తన్హా సఫర్‌...! 


(నవ్య వీక్లీ 29.04.2009 సంచికలో ప్రచురితం)
Comments