ఏలినవారి దివ్య సముఖమునకు - పొత్తూరి విజయలక్ష్మి

ఏలినవారి దివ్య సముఖమునకు-

    రత్తమ్మ నమస్కరించి రాయునది.

    అయ్యా..! ఏడాది క్రిందటి దాకా మా బతుకులు దరిద్రంగా వుండేవి. రెక్కలు ముక్కలు చేసుకున్నా డొక్క మాడ్చుకుని బతుకుతూ వుండేవాళ్ళం. ఓ పూట తింటే, ఓ పూట పస్తు. అవడానికి మనుషులమే అయినా జంతువుల కన్నా హీనంగా వుండేది మా బతుకు.

    మీ పుణ్యమాని మా కష్టాలు తీరిపోయాయి. మీ దయవల్ల మా జీవితాల్లో మార్పు వచ్చింది. కష్టపడుతున్నాం. కడుపు నిండా తింటున్నాం. చిరుగులు లేని బట్టలు కట్టుకుంటున్నాం. కంటినిండా నిద్రపోతున్నాం. మాకు ఈ అదృష్టం కలగడానికి కారణం అయిన మిమ్మల్ని రోజూ తల్చుకుని దణ్ణం పెట్టుకుంటున్నాం.

    నేనొక్కతినే కాదు బాబుగారూ..! నాతోబాటు మా అత్తమ్మ, మా అలివేలుమాతోబాటు మరికొంతమంది ఆడవాళ్లూ కూడా మీకు ఎంతగానో రుణపడి వున్నాం.

    అసలు నేనెవరో ఏమిటో చెప్పకుండా- ఏదో సోది చెప్తున్నాను కదూ..! కోపం చేసుకోకండి. అయ్యా..! అసలు విషయం ఇదీ అని వివరంగా చెప్తే మీకు అర్థం అవుతుంది గానీ, ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తే ఎలా అర్థం అవుతుంది?

    విషయం అంతా వివరంగా చెప్తాను.. వినండయ్యా..!

    నా పేరు రత్తమ్మండీ. పూర్తిపేరు రత్నమాణిక్యం. కానీ, అంతా రత్తమ్మనేఅంటారు. మా అయ్య,అమ్మ కూలి చేసుకుని బతికేవాళ్ళు. మాకు తాటాకులఇల్లుండేది. అంతకుమించి ఆస్తులేమీ లేవు బాబూగారూ..

    నేను ఎనిమిదో క్లాసు దాకా చదువుకున్నా. చదివిస్తే ఇంకా చదువుకునేదానే్న. కానీ మా ఇళ్ళల్లో ఆడపిల్లలకి చదువుకంటే పెళ్లి ముఖ్యం. చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు. అట్టానే నాకూ చేసేశారు.

    పరాయివాడికి కాదు.. మా బావకే ఇచ్చి చేశారు. మేనత్తింటికేకాపురానికెళ్లాను. మా అత్తా,మావా కూడా కూలి పనులు చేసుకునేవాళ్ళు. నా పుట్టింటారికిలాగానేఅత్తారికి కూడా ఓ తాటాకులఇల్లుంది. అందరం కూలి పన్లుచేసుకునేవాళ్లం. మాకేలోటూవుండేది కాదు.

    నాకు ఓ కూతురు పుట్టింది. అలివేలు మంగమ్మ అనిపేరెట్టుకున్నాం. అలివేలూ- అని పిలుస్తాం. దాన్నీ పదో తరగతి దాకా చదివించి పెళ్లి చేసేశాం.

    మాకు మగ పిల్లలు లేరు కదా, అందుకే నా తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేసి మా ఇంట్లోనే అట్టే పెట్టుకున్నాం ఇద్దర్నీ. వాడూ చాకులాటి కుర్రాడు. అదీ తెలివిగల పిల్ల.. ఇద్దరూ కష్టం చేసుకుని నాలుగు డబ్బులు కళ్ళజూసుకుంటారు.

    అయ్యా..! ఇంటిల్లిపాదీ కష్టం చేసుకుని సంపాదించుకుంటూ వుంటే మా జీవితాలు ఎలాగుండాలో మీరే చెప్పండి? మేడలూ మిద్దెలూ కట్టకపోయినా తిండీ, బట్టకీ కరువు లేకుండా దర్జాగా వుండాలా?

    అలా వుండవు! ఎందుకంటే బాబూ... మా ఇళ్ళల్లోమగాళ్ళకితాగుడలవాటువుంటుంది.

    ఈ తాగడం అన్నదిఈనాడొచ్చింది కాదు. ఏనాటినుండోవున్నదే. కాకపోతే- పాతకాలానికీ ఇప్పటికీ ఎన్నో మార్పులొచ్చాయి.

    మా అత్తమ్మ చెప్పేది. ఆమె పెళ్లయిన కొత్తల్లో మా మావ ఏ పండగ రోజునో ఊరి బయట తాటితోపులోకి వెళ్లి కల్లు తాగొచ్చేవాడట..!

    నా తరం వచ్చేసరికి ఊళ్ళోనే ప్రభుత్వ సారా దుకాణాలొచ్చేశాయి. నా మొగుడు మొదట్లో రోజు విడిచి రోజు తాగేవాడు. ఆ తర్వాత రోజూ తాగడం మొదలెట్టాడు.

    ఇక నా కూతురి తరంలో సారాకి కొదవేలేదు కదా బాబూ..! గుడి పక్కనా మందుకొట్టే, బడిపక్కనా మందు కొట్టే.

    మంచినీళ్ల పొట్లం దొరకని బజారుంటుందేమోగాని మందు పొట్లం దొరకని బజారే లేదు కదా ఇపుడు!

    అప్పట్లో పిల్లలకి పప్పుబెల్లాలు పంచినట్టూ, ముత్తయదువఇంటికొస్తే పసుపూ బొట్టూ ఇచ్చినట్టూ నేడు మగాళ్లకి మందు పొట్లాలివ్వడంఅలవాటైపోయింది కదా అయ్యా! మీటింగెట్టినామందుపొట్లాలే, ఓట్లెయ్యడానికైనామందుపొట్లాలే పంచుతారు కదా!

    మరలా మందు దొరుకుతూ వుంటే కాయకష్టం చేసినవాడు తాగక వూరకుంటాడా? ఇపుడు మా పేటలో ఏ మగాడూ ఇంటికొస్తూ పిల్లలకి తాయిలాలు తేడు. పెళ్లానికి ఓ మూర మల్లెపూలు తేడు. మందు, అందులోకినంజుడుతెచ్చుకుంటాడంతే.

    ఒక్కమాటలో చెప్పాలంటే మగాళ్ళ సంపాదన అంతా సారాయికే. అది చాలక ఆడాళ్ళనిడబ్బులియ్యమని అడగటం. ఇయ్యకపోతే నోరు చేసుకోవడం, చెయ్యి చేసుకోవడం.

    వాళ్ళ చేత తన్నులు తిని, ఒళ్ళుపచ్చిపుండులాగైపోయి, మర్నాడు పన్లోకెళ్ళలేక, పన్లుకెళ్ళకపోతే కూలి డబ్బులు రాక, ఇల్లు గడవక.. అదో పెద్ద కథలే బాబూ. ఎంత చెప్పినా తరగదు.

    వాళ్ళకంట పడకుండా మా కూలి డబ్బులు ఏ మూలో దాచుకున్నా ఇల్లంతా గాలించి పట్టుకుపోతారు.

    మా కుటుంబం అంతా కష్టపడి సంపాదించిన దాంట్లో మూ డొంతులు మందుకే పోగా మిగిలిన అడుగుబొడుగు డబ్బుతో ఇల్లు గడుపుకోవాలంటే ఈ కరువు రోజుల్లో ఎంత కష్టమో మీరే ఆలోచించండయ్యా..!

    మా దగ్గర నగా నట్రావుండవు. పెళ్లినాడు చెవులకి దుద్దులు, ముక్కుపుడకా, మెళ్లోచింతాకంతపుస్తె, కాళ్లకి వెండి గొలుసులు.. అంతే....
అవి కూడా కాళ్ళొచ్చినడిచిపోతాయి. ఇక మనుషులం మాత్రం మిగుల్తాం. అప్పు చెయ్యక తప్పదు. తీర్చలేక అగచాట్లు పడక తప్పదు. అప్పు ఇచ్చినోళ్లు గుడిసె ముందర నిలబడి తిడుతుంటే చెవులప్పగిస్తాం. జుట్టు పట్టుకుని బయటికీడిస్తే బావురుమని ఏడుస్తాం. అంతకంటే ఏం చెయ్యగలం బాబూ?

    ఈమధ్యనరోడ్డెంబటేవెళ్తుంటేరోడ్డుపక్కన పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తున్నాయి. ‘‘మద్యపానం హానికరం. తాగి వాహనం నడిపితే ప్రమాదం, మద్యం తాగి మీ పెళ్లాం బిడ్డలకి అన్యాయం చెయ్యకండి..’’-అనితాటికాయంతఅక్షరాల్తో రాసి వుంది వాటిమీద.

    ఇప్పుడీ బోర్డులు ఎవరు పెట్టించారా? అని అనుమానం వచ్చింది. ఓ పెద్దమనిషిని అడిగాను. ‘‘ఇంకెవరూ?ప్రభుత్వం వాళ్ళే పెట్టించారు!’’ అన్నాడాయన.

    ‘‘మరి అడుగడుగునా సారాకొట్టెవరు పెట్టించారు?’’ అని అడిగా.

    ‘‘అవి కూడా ప్రభుత్వం వాళ్ళే పెట్టించారు!’’ అన్నాడాయన.

    నాకాశ్చర్యం వేసింది. ‘‘ఓ పక్కన తాగమని మందు షాపులు పెట్టించి, మరో పక్కన తాగొద్దని బోర్డులు పెట్టించడం ఎందుకూ?ఆ షాపులన్నీ మూయించేయచ్చుగా’’ అని అడిగాను.

    దానికా పెద్దమనిషి చాలా పెద్ద కథే చెప్పాడు.

    మందు అమ్మిస్తే బోలెండడబ్బొస్తుందిట ప్రభుత్వానికి. ఆ దుకాణాలన్నీ మూయిస్తే ఖజానా ఖాళీ అయిపోతుందిట. అప్పుడు- శనివారం ఆ ఏడుకొండలవాడి గుడి దగ్గరా, గురువారం సాయిబాబా గుడి దగ్గరాముష్టివాళ్ళు అడుక్కుతిన్నట్టే ప్రభుత్వం వాళ్ళుకూడా చిప్పలు పట్టుకుని అడుక్కుతినాలిట..!

    ఒకసారి ఎప్పుడో మందు అమ్మకూడదని సర్కారోళ్లు రూలు పెట్టారుట. అపుడు వాళ్ళ పళ్ళు రాలిపోయాయట. నెత్తి బొప్పికట్టిందిట. ఆ అనుభవంతో బుద్ధొచ్చి మళ్లీ మందు అమ్మించటం మొదలెట్టారుట.

    కాబట్టి-‘‘కష్టమో నిష్ఠూరమో మందు వ్యాపారం చేస్తేనే ప్రభుత్వం బతికి బట్టకట్టేది’’ అన్నాడు.

    అంతేలెండి బాబూ.. ఎవరి తిప్పలు వాళ్ళవి.. అన్నాను

    వీధి చివర మాంసం కొట్టు దగ్గరికెళ్లి ఆ కొట్టాయనతోఎందుకయ్యా ఆ గొర్రెని నరికి చంపుతారు, పాపం కాదా? అంటే వింటాడా? అది- అతని బతుకుతెరువు.

    మా ఊళ్ళో రంగాలమ్మఅనిఒకావిడ వుంది. ఆవిడ తన భర్తతో కలిసి ఆడపిల్లల్ని పట్నానికి తీసుకుపోతూ వుంటాది. అదేదో దేశంలో షేకులని వుంటార్ట. వాళ్ళకి చిన్న పిల్లల్ని అమ్మేస్తారు. ఆవిడ దగ్గరికెళ్లి.. ‘‘ఇదేం పని..
రంగాలమ్మా’’ -అంటే నోరెట్టుకు పడిపోతుంది. ‘‘పాపమోపుణ్యమోనేనెరగ. ఇది నా వ్యాపారం. నా జోలికొస్తే చంపేస్తా’’ అంటుంది.

    మరి మీరూ, మీ సారా వ్యాపారం కూడా అంతే కదా బాబూ! ఇది మీ వృత్తీ, మీ వ్యాపారం! ఇలానైతే ఎలా బాబూ? అని అడగడానికి మాకేంహక్కుంది?
మా బతుకులు తెల్లారిపోతున్నాయి. ఆడవాళ్లం ఇట్లా రోజూ చస్తూ బతుకుతున్నాం. మరి తాగిన మగాళ్లు సుఖపడిపోతున్నారా అంటే అదీ లేదే! ఒళ్ళుగుల్లయిపోతోంది. డాక్టరు దగ్గరికిపోతే ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, కాలేయం పాడైపోతుంది, తాగడం మానేసి పళ్ళూ, పాలూ, టానిక్కులూ తీసుకోమంటాడు.

    ఆ మాట వాళ్ళకి చెప్పినా ఒకటే, ఆ గోడకి చెప్పినా ఒకటే. వినరు, వినరని వూరుకోలేం. ఏదైనా చేసి- తాగుడు మాన్పించాలని ఆరాటం!

    మీకు చెప్పానో లేదో బాబుగారూ! నేను నాలుగిళ్ళల్లో పాచిపన్లు చేసుకుంటాను. ఓ ఇంట్లో అయ్యగారు పెద్ద ఆఫీసరు. మనిషి దిట్టంగా పాత సినిమాల్లో ఎస్వీ 

    రంగారావులా వుంటాడు. ఆయన గారి భార్య కూడా మంచి ఉద్యోగమే చేస్తుంది. చాలా మంచిది.

    అదుగో అటువంటి పెద్దవాళ్ళతో మా బాధలు చెప్తే వాళ్ళు మా వెధవలని పిల్చి తిటి,్ట కొట్టి భయపెడితే దారినపడతారేమో.. అని ఆశ కలిగింది.

    ఆ అమ్మ దగ్గరికెళ్లి చెప్పుకున్నా. అమ్మగారూ! మా మగాళ్లు ముగ్గుర్నీ మీ దగ్గరకీడ్చుకొస్తా, అయ్యగారితో చెప్పి వాళ్ళకి గడ్డి పెట్టించండిఅన్నా.

    అంతే! ఎప్పుడూ దేవుడి పటంలో అమ్మవారిలాగా నవ్వుతూ వుంటే ఆ అమ్మగారు తలొంచుకుని గుడ్ల నీళ్లు కక్కుకుంది.

    ‘‘అయ్యో.. బతుకా! ఇంకోళ్ళకి నీతులు చెప్పే రాత కూడానా? నా మొహాన’’ అని బాధ పడింది.

    ఆ అయ్యగారూ.. తాగుబోతేనట. పొద్దున ఆఫీసుకెళ్ళేటప్పుడు ఠీవిగా మహారాజుగా నడుచుకుంటూ వెళ్తాడట. రాత్రికి ఇంట్లోకి వచ్చేటప్పుడు వొంటిమీదతెలివుండదుట. డ్రైవరు బియ్యం బస్తాని ఈడ్చుకొచ్చినట్టూఈయన్నీఈడ్చుకొస్తాడుట. ఏవిటేవిటోతాగుతాడట. ‘‘పాటలేనా, పద్యాలేనా ఒకటి కాదు.. ఏం చెప్పమంటావు రత్తమ్మా? వూరుకోబెట్టేసరికి నా తల ప్రాణం తోకకి వస్తుంది. ఇరుగూ పొరుగూ నవ్విపోతారేమో? అని గుట్టుగా సంసారం లాక్కొస్తున్నాను. నాకంటే నువ్వే అదృష్టవంతురాలివి. నీ బతుకంతా బట్టబయలు. నాకట్టా కాదు. లోపల ఏడ్చుకుంటూ బయటికి నవ్వుతూ నాటకం ఆడాలి’’ అని చెప్పుకొని ఆ అమ్మ దుఃఖపడుతుంటే నా కడుపు చెరువైపోయింది.

    ఏవిటో.. ఎంత చెట్టుకి అంత గాలి అనీ ఎవరి ఏడుపులు వాళ్ళవి.

    సర్లే.. ఏం చేస్తాం? ఆర్చేవాడు లేడు తీర్చేవాడూ లేడు. మన మొహాన ఈ రాత రాశాడా దిక్కుమాలిన దేవుడు. ఈ జన్మకి ఇక ఇంతే అని గుండె రాయి చేసుకున్నాం.

    కానీ.. మా తలరాతలు మారాయి బాబూ...!

    మీకు గుర్తుందో లేదో.. నిరుడు ఈ రోజుల్లోనే మా ఊళ్ళో కల్తీ సారాయి తాగి ముప్ఫై అయిదు మంది చచ్చిపోయారు. అన్ని పేపర్లలోనూవేశార్లెండి. మీదాకా వచ్చే వుంటుంది ఆ వార్త.

    అట్లా పోయిన వాళ్ళల్లో మా మావ, మా బావ, మా అల్లుడూ కూడా వున్నారు బాబూ. మూడు శవాలనీ తీసుకొచ్చి గుమ్మంలో పడేశారు. బోలెడంతమంది జనం వచ్చారు.

    అయ్యో.. ఒకే ఇంట్లో ముగ్గురు మగాళ్లు పోయారు..! మగ దిక్కులేని సంసారం అయిపోయింది.. అని వాళ్ళంతా జాలిపడ్డారు.. ఏడిచారు..
వింటుంటే నాకు నవ్వొచ్చింది. మగదిక్కా? ఎవరు బాబూ? ఎవరికీ? ఇంటి యజమాని సంసారం బరువూ బాధ్యతా నెత్తినేసుకుని పెళ్లాం బిడ్డలని తిన్నగా చూసుకుంటే- వాడూ మగాడు, అపుడే మగదిక్కు. అంతేగానీ తను సంపాదించిందీ, పెళ్లాం సంపాదించిందీ కూడా కలిపి తాగేసిపెళ్లాన్నీ, అడ్డం వచ్చిన బిడ్డల్నీతనే్నవాడుమగదిక్కు కాదు. గుదిబండ. అలాంటి గుదిబండ లాటి మగాడు చస్తే- పీడ విరగడైందని సంతోషం తప్ప ఏడుపొస్తుందా? పైకి నవ్వితే బావుండదు కదా.. అని మొక్కుబడిగా ఏడిచాం. ముగ్గుర్నీ మట్టి చేసేశాం. చేతులు దులిపేసుకున్నాం.

    ఇక తర్వాత ఏం జరిగిందో మీరే ఊహించుకోగలరు.

    అమావాస పోయి పున్నమి వచ్చినట్టయింది.

    కష్టానికి ఎప్పుడూ భయపడం బాబూ మేము. చచ్చేదాకా ఏదో ఓ కష్టం చేసుకుని బతికే సత్తువ ఇచ్చే పంపిస్తాడు ఆ దేవుడు.

    మా అత్తమ్మ పొద్దుటి పూట ఆకుకూరలు అమ్ముతుంది. అవి అమ్మేశాక నాలుగు శేర్లుపూలు కొని మ ధ్యాహ్నం మాల కట్టి సాయంత్రం పూలు అమ్ముతుంది.

    నా సంగతి చెప్పేశానుగా బాబూ! అయిదిళ్ళల్లో పని చేసుకుంటున్నాను. మా అలివేలు ఒక టైలరమ్మ దగ్గర పనిచేస్తోంది. తాగి తందనాలాడితేనో, చీట్లపేకలూ, బ్రా కెట్టాటలు ఆడి తగలేస్తేనో ఎక్కడి డబ్బూ చాల్దు గానీ, మనిషికి- తిండికీ, బట్టకీ ఎంత కావాలి బాబూ?

    మా ముగ్గురి సంపాదనా మాకు ఎక్కీతక్కీ. నాలుగు రాళ్లు మిగుల్తున్నాయికూడానూ. ఈనాడు ఇట్లా సుఖంగా వున్నామంటే ఇదంతా మీ చలవే కదా బాబూ! మీరు కల్తీ సారాయి అమ్మబట్టే కదా మాకీ అదృష్టం పట్టింది! మమ్మల్నిఒడ్డునపడేసిన పుణ్యాత్ములు మీరు. మీకు దణ్ణం పెడుతూ ఒక ఉత్తరం రాయాలనిపించి ఇదుగో ఇలా ఉత్తరం రాస్తున్నాను.

    మీతో మరో మాట మనవి చేసుకోవాలి అయ్యగారూ! మా పేటలో మూడొందల కుటుంబాలున్నాయి. ఒకరోఇద్దరో తప్పించి అందరు మగాళ్ళూ తాగుబోతులే. కల్తీ సారా తాగి పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళ భార్యా బిడ్డలూ రోజూ ఛస్తూ బతుకుతూనే వున్నారు.

    ఇరుగుపొరుగు ఆడవాళ్ళు మా దగ్గరికొస్తారు. ‘‘రత్తమ్మొదినా.. ఓ వంద రూపాయలు ఇస్తావా, రేషను షాపు నుంచి బియ్యం తెచ్చుకుంటా. డబ్బు ఇంట్లో భద్రంగా దాచి పెట్టినా, ఆ దొంగ సచ్చినోడు ఇల్లంతా గాలించి పట్టుకుపోయాడు. రాత్రికి తిండికి లేవు!’’ అని దీనంగా అడుగుతుంది ఓ ఇల్లాలు.

    ‘‘అమ్మాయ్..అలివేలూ! ఓ యాభై వుంటేఇస్తావా.. పిల్లాడికి జొరం. ఒళ్ళు మాడిపోతోంది. డాక్టరు దగ్గరికితీసికెళ్లాలి. ఇంట్లో నయాపైసా లేదు’’ అని దీనంగా అడుగుతుంది ఇంకో ఇల్లాలు.

    ఆ కష్టాలన్నీ పడ్డవాళ్ళమేగా. అందుకే ఇచ్చి పంపిస్తాం. డబ్బు తీసుకుని మా వంక చూస్తారు. ఆ చూపులో కృతజ్ఞతతో పాటు మీకేం సుఖంగా వున్నారుఅనే అసూయ కనిపిస్తోంది బాబూ!

    ఆ చూపు నా గుండెల్ని పిండేస్తోంది.

    ధర్మప్రభువులు. ఇక మీరే దయ చూపాలి. ఎపుడోఓసారి కాకుండా విరివిగా కల్తీ సారా అమ్మించండి బాబూ! అది తాగితే పోయినవాళ్లుపోతారు, మిగిలినవాళ్ళ జీవితాలైనా బాగుపడతాయి.

    అమ్మో, అట్టా చేస్తే పాపం సుట్టుకుంటుందని అంటారా! ఏం కాదు బాబూ, మనిషినీ, వాడి కుటుంబాన్ని రోజూ కాస్త కాస్తగా చంపుతూ వుంటే రాని పాపం ఒకేసారి చంపేస్తే వస్తుందా?

    పాపం రాదు కానీ.. మీకు బోలెడంత పుణ్యం వస్తుంది. వానాకాలంలో దోమలు చావడానికి మందుకొట్టిస్తారుగా కదా..! ఇదీ అంతే బాబూ..!
కల్తీసారా అమ్మించినా, మామూలు సారా అమ్మించినా మీ డబ్బులు మీకొస్తాయి. తాగి పీనుగుల్లా మారిన వాళ్ళంతా చచ్చి సుఖపడతారు. శని విరగడ అయిందని ఆడాళ్ళూ, పిల్లలూ ఆనందిస్తారు. అందరికీ లాభమే కదా బాబూ..!

    మేము మీ ప్రజలం. మీకు మేమంటే చాలా ప్రేమ, అభిమానం వుంది కదయ్యా! ఈ ఒక్క సాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని నా ఆశ. వెంటనే ఈ పని ప్రారంభిస్తారు కదా బాబూ! మా రాజులు! మీది జాలిగుండె. నా మాట కాదనరు.. నాకు తెలుసు.

    - మీకు వెయ్యి దండాలతో...

రత్తమ్మ వ్రాలు *

(ఆంధ్రభూమి దినపత్రిక ఆగష్టు17,2013 సంచికలో ప్రచురితం)
Comments