ఎండమావులు - వంశీ కంఠస్ఫూర్తి

    ట్రింగ్.. ట్రింగ్.. రింగ్‌తో పాటు వైబ్రేషన్ కలగలిసిన విచిత్ర శబ్దంతో మొబైల్ ఫోన్ మోగుతుంటే నిదురమత్తులోనే కంగారుగా ఫోన్ ఎత్తాడు సారథి. ‘కంగ్రాట్స్ షారథీ.. యువర్ ఆర్టికల్ ఇన్ అవర్ పేపర్ గాట్ ఎ గుడ్ రెస్పాన్స్.. హబీబీ కంగ్రాట్స్ వన్స్ ఎగైన్ షారథి..అంటూ అరబిక్ యాసలో తన బాస్ గొంతు వినిపించేసరికి ఆనందంగా నిద్రలేచాడు సారథి. ఇండియాలో ఎన్నో ప్రముఖ పత్రికల్లో పనిచేసి చివరికి దుబాయ్‌లోని-దుబాయ్ టైమ్స్ న్యూస్‌పేపర్లో రిపోర్టర్‌గా చేరాడు సారథి. డాలర్లు సంపాదించలేకపోయినా దుబాయ్‌లో దిరామ్‌లు సంపాదిస్తే భవిష్యత్తుకి ఏ ఢోకా ఉండదని ఎంతో కష్టపడి ఈ పత్రికలో ఉద్యోగం సంపాదించాడు. ఇంట్లో అమ్మా నాన్నా- ఒక్కగానొక్క కొడుకైన తనను దుబాయ్ వెళ్ళొద్దన్నా, సొంతగడ్డపై ఉంటే తన ఆశలకు తగ్గట్టు సంపాదించలేనన్న ఆలోచనతో పట్టుబట్టి దుబాయ్ వచ్చాడు. ‘‘మనకేంటి కన్నా తక్కువ.. ఎంతోకొంత ఇక్కడ కూడా బాగానే సంపాదిస్తున్నావుగా.. ఒక్కగానొక్క కొడుకువి మా కళ్ళముందు ఉండకుండా...’’ ఎప్పుడు ఇంటికి ఫోన్ చేసినా సారథి తల్లి తప్పకుండా అనే మాటలివి. డబ్బు సంపాదించాలన్న దృఢ నిశ్చయం ముందు తన తల్లి మాటలు ఎప్పుడూ వినబడవు సారథికి.


    సారథి ఈ న్యూస్ పేపర్‌లో రాసిన మొట్టమొదటి ఆర్టికల్ ‘‘ది షేక్ బిల్డ్ దిస్ ఫెంటాస్టిక్ సిటీ’’. ఆ ఆర్టికల్ గురించే సారథి బాస్ పొద్దునే ఫోన్ చేసి అభినందించింది. దుబాయ్‌లోని అద్భుత కట్టడాలు.. అవి కట్టడానికి దుబాయ్ ప్రధానమంత్రి షేక్ సలిపిన కృషిని ఆ ఆర్టికల్‌లో వివరించాడు సారథి. మొదటి ఆర్టికల్‌కే మంచి స్పందన వచ్చినందుకు ఆనందంగా కాఫీ తాగుతూ తన పదమూడవ అంతస్తు బాల్కనీలో నుండి దుబాయ్‌ని చూశాడు సారథి. భారీ కట్టడాలు, ఎన్నో చార్మినార్లు ఒక్క చోట ఉన్నట్టు అనిపించే మసీదులు, ఆర్థిక మాంద్యపు మబ్బులను ముద్దు పెట్టుకోవటానికా అన్నట్టు కట్టిన ఎత్తయన భవనాలు, ప్రపంచంలోనే ఎతె్తైన భవనం బుర్జ్ కలీఫా’.. ఆ భవనాల మధ్యలోంచి తొంగి చూస్తున్న సూరీడు. దుబాయ్ చాలా అందంగా కనిపించింది సారథికి. మొబైల్ మోగటంతో- ఆ మానవ నిర్మిత ఆకృతులతో కలగలిసిన ప్రకృతి ఆస్వాదన నుండి బయటికొచ్చాడు సారథి. షార్జా దగ్గరలో ఉన్న లేబర్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగిందట. వెంటనే వెళ్ళి ఆ న్యూస్ కవర్ చేయమని చెప్పి ఫోన్ పెట్టేశాడు సారథి బాస్.


* * *


    ఫైర్ ఇంజన్లు
, లోకల్ పోలీసులతో ఆ ప్రదేశమంతా చాలా హడావుడిగా ఉంది. అల్ అరబ్ లేబర్ సప్లైకి చెందిన ల్యాబర్ క్యాంప్ అది. బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన ఎంతోమంది ఆ లేబర్ క్యాంప్‌లో ఉంటున్నారు. వీరు నివసిస్తున్నారనడం కంటే తలదాచుకుంటున్నారని అనటమే సబబుగా ఉంటుందేమో! చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాంటి క్యాబిన్లు దగ్గర దగ్గర ఓ యాభైదాకా ఉంటాయి. అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్న రెండు క్యాబిన్లు దాదాపు దగ్ధమయ్యాయి. పదిమంది దాకా మరణించారని అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటుంటే విన్నాడు సారథి. ఆ లేబర్ క్యాంప్ సూపర్‌వైజర్‌తో మాట్లాడటానికి ప్రయత్నించాడు సారథి. ఏదో పురుగుని చూసినట్లు ఘోరంగా చూసి మాఫీ మాలుమ్.. నాకేమీ తెలియదు, నన్నేమీ అడగకండిఅంటూ కోపంగా అరబిక్ భాషలో చెప్పి అక్కడనుండి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న కార్మికులను, చుట్టూ గుమికూడిన వాళ్ళని ప్రశ్నించాడు కానీ ఎవరి దగ్గరనుండి సరైన సమధానం రాబట్టలేకపోయాడు సారథి. ప్రమాదం ఎలా జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఇలా వివిధ ప్రశ్నలు అడిగి సరైన సమాధానం లేక విసుగు చెందాడు సారథి. అందరూ భయం భయంగా, ఆందోళనగా సమాధానాలు చెప్పేవాళ్ళే. ప్రమాదంలో ఇద్దరు తప్ప అందరూ చనిపోయారు. గాయపడిన ఇద్దరిని మాత్రం భిన్ రషీద్ హాస్పిటల్లో చేర్చారని మాత్రం తెలుసుకోగలిగాడు సారథి.

* * *
    భిన్ రషీద్ హాస్పిటల్లో ఉన్న ఇద్దరిని చూడటానికి ఎవరినీ అనుమతించడం లేదు. హాస్పిటల్ యజమాని తన బాస్‌కి తెలిసినవాడే అవటంతో అతి కష్టంమీద హాస్పిటల్‌లో ఉన్న ఇద్దరినీ చూడటానికి అనుమతి సంపాదించాడు సారథి.

    "ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు, ఒకరు స్పృహలో లేరు, ఇంకొకరు స్పృహలో ఉన్నప్పటికీ ఎవరేమీ అడిగినా భోరుమని ఏడుస్తున్నాడు తప్ప సమాధానం లేదు.." అని ఆ ఇద్దరి పరిస్థితి వివరించాడు డాక్టర్ సారథికి. పేషెంట్స్‌ని డిస్టర్బ్ చేయకుండా చూసి వస్తానన్న ఒప్పందంతో ఆ ఎమర్జన్సీ వార్డులోకి అడుగుపెట్టాడు సారథి. స్పహలో ఉన్న పేషెంట్‌ని పలకరించటానికి ప్రయత్నించాడు సారధి. హలో.. ఆప్ కా నామ్.. వాట్ ఈజ్ యువర్ నేమ్..’. ఇలా ఏమి అడిగినా ఏ భాషలో అడిగినా బిత్తరచూపులు చూస్తున్నాడే తప్ప అతడి నుండి ఏ స్పందనా లేదు. పేషెంట్‌ని పరికించి చూశాడు సారథి. చేతిమీద ఏదో పచ్చబొట్టు ఉండి.. నిశితంగా చూస్తే నారిఅన్న రెండు అక్షరాలు తెలుగులో కనిపించాయి సారధికి. మీరు తెలుగా?’ అని సారధి తెలుగులో మాట్లాడేసరికి పేషెంట్ కళ్ళు పెద్దవయ్యాయి. ఒకరకమైన ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన చూపుతో సారథి చేయి పట్టుకొని భోరుమని ఏడ్చేశాడు. అతడి మనసులోని బాధంతా కన్నీటి రూపంలో బయటికి పెల్లుబుకుతోంది. వెక్కివెక్కి ఏడుస్తూ నే సారథి అడిగిన ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానాలు చెప్పటం మొదలుపెట్టాడు.

* * *

    "నా పేరు నారిబాబు.. అందరూ నారిగాడు అంటారు. కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం మాది. అమ్మా, నాన్న, ననె్నంతో ప్రేమించే నా రంగి, మా మూడు నెలల బుల్లికొడుకు, మూడు నెలలా కాదు బాబూ, నాలుగు యేళ్ళ మూడు నెలలు. నేను ఇల్లువిడిచి నాలుగేళ్ళు అయిపోనాయి." ఇంటిని తలుచుకుంటుంటే నారి కళ్ళల్లో నీరు ఈసారి జలపాతమే అయింది. ఏడుపుని ఆపుకుంటూ తన కథను సారథికి చెప్పటం మొదలుపెట్టాడు నారి.

    "నాలుగేళ్ళ క్రితం మా ఊరికి దుబాయ్ ఏజెంట్ ఒకడు వచ్చినాడు బాబూ, నెలకి 30 వేల జీతం సంపాదించే ఉద్యోగం సూపిత్తానని, రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తే చాలు అని, ఉండటానికి మంచి ఇల్లు, రెండు పూటలా కడుపునిండా తిండిపెట్టి ఎంతో బాగా సూసుకుంటారని, మేము సేయాల్సింది మొదట పాస్‌పోర్టు, వీసా నిమిత్తం లక్షా ఇరవై వేలు కట్టాలని. ఆ డబ్బు ఎలాగో మేము నాలుగు నెలల్లోసంపాదించేత్తాం అంటూ మాలో ఆశలు రేపాడు బాబు. నా కొడుకు నాలాగ కూలివాడు కాకూడదని, ఆఖరిరోజుల్లో అయినా అమ్మా నాన్నలను సుఖపెట్టాలని, రంగికి కనీసం ఓ బంగారు నగ అయినా కొనిపెట్టాలని ఉన్న ముప్ఫై సెంట్ల భూమిని సేటు దగ్గర తాకట్టు పెట్టి ఈడకొచ్చాను బాబూ... దుబాయ్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టినప్పుడు అంతా వింతగా, కొత్తగా బాగానే ఉంది బాబూ... నా జీవితం దుబాయ్‌లో ఎలా ఉండబోతుందో తెలియటానికి నాకెంతో సమయం పట్టలేదు బాబూ..

    ఇలా ఎయిర్‌పోర్టులో నుండి అడుగు బయటపెట్టానో లేదో నా పాస్‌పోర్టు మా కంపెనీ తీసేసుకుంది. ఆ తరువాత ఇప్పటివరకు నా పాస్‌పోర్టు నేను సూడలేదు బాబు". ఈ మాటలు అంటుంటే నారి గొంతులో వైరాగ్యం, దీనత్వం తొంగి చూసింది. "ఎయిర్‌పోర్టునుండి నేరుగా నేను పనిచేయాల్సిన చోటికి తీసుకెళ్ళారు బాబూ.. అక్కడ నాలాగే పనిచేయడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి కూడా వచ్చినోళ్ళున్నారు. అందరినీ కూర్చోబెట్టి మేము ఏంచేయాలో పైనుండి కిందిదాకా తెల్లని జుబ్బాలాటి బట్టలలో ఉన్నవ్యక్తి వివరిస్తున్నాడు. అతడి భాష అర్థంకాకపోయినా మేము రోజుకి పధ్నాలుగు గంటలు పనిచేయాలని, కాంక్రీటు బ్లాకులు, ఇటుకులు మొయ్యాలని మాత్రం అర్థమయ్యింది. పని ఎంతైనా సేత్తాను బాబూ, కాయకష్టం చేయటం ఏనాడూ కొత్త కాదు. ఒళ్ళుదాచుకోకుండా పనిసేయటమే తెలుసు మాకు." గత నాలుగేళ్ళలో నారి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడని కొంచెంసేపు మాట్లాడేసరికి అర్థమవుతోంది.

    "ఆ తరువాత మమ్మల్ని లేబర్ క్యాంప్‌కి తీసుకెళ్ళారు బాబూ..." నారి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. "అగ్గిపెట్టెలాంటి గది, అందులో మూడు రేకుమంచాలు ఒకదానిమీద ఒకటి అమర్చినవి. అలాంటి మంచాలు గదిలో మూడు వైపులా ఉన్నాయి. అంటే ఆ గదిలో నాతోబాటు ఇంకా పదకొండు మంది ఉంటారు. సామాన్లు కూడా పెట్టుకోడానికి చోటులేని గదిలో పన్నెండుమంది. ఇద్దరుకన్నా ఎక్కువ మంది ఒక్కసారి నించొంటే గదిలో ట్రాఫిక్ జామ్." నారి విరక్తితోకూడిన నవ్వుతో చెప్పసాగాడు. "గది శుభ్రం చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో తెలీదుగాని ఆ దుర్వాసన మా ఊళ్ళో చెత్తకుప్పల దగ్గర కూడా ఉండదు బాబూ. గదిలో పన్నెండుమంది చాలమన్నట్టు ఈగలు, దోమలు, నల్లులు మాతో సహజీవనం సాగిస్తాయి.

    ఇక్కడికి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో క్యాంప్‌లో మంచినీరు తాగి ఎరుగం బాబూ.. ఆ శుభ్రపరచని ఉప్పునీరే తప్ప మరో దిక్కులేదు. ఎంతమంది జబ్బులబారిన పడ్డారో లెక్కే లేదు. కానీ ఒక్కడు కూడా పనిమానడు. మానితే ఆ రోజు డబ్బులు ఇవ్వరుగా! ఈ నరకంలో ఇంకా ఎక్కువ రోజులు ఉండాలిగా! నాలుగు నెలల్లో భూమిని విడిపించుకోవచ్చని, ఆ తరువాత సంపాదించిందంతా నా వాళ్ళకే అన్న ఒకే ఒక్క ఆలోచనతో, ఆశతో అన్నిటికీ ఓర్చుకున్నాను బాబూ. నా ఆశంతా అడియాసే అని ఒక్క నెల అయితేగానీ తెలియలేదు. మొదటి నెల జీతాల రోజు అని ఆనందంగా వెళ్ళిన నాకు చేతిలో ఐదొందల దిరామ్‌లు పెట్టారు.. అంటే మన రూపాయలలో ఆరు వేలు. వేయి దిరామ్‌లు కంపెనీ ఇస్తే అందులో సగం మాకు, సగం మమ్మల్ని తీసుకొచ్చిన లేబర్ సప్లై కంపెనీకి అట . ఆరువేల రూపాయలు అంటే రెండు సంవత్సరాలపాటు ఊడిగం చేసినా నా భూమిని విడిపించుకునే డబ్బులు కూడా వస్తాయో లేదో? ఇంక నా పెళ్ళాం బిడ్డలకి ఏం పంపను? నేనేం తినను బాబూ?.

    యాభై డిగ్రీల ఎండలో యాభై కేజీల బరువులని ఎత్తుతూ రోజంతా ఊడిగం చేస్తే, చివరికి మాకు దొరికేది మట్టే బాబూ.. దగా పడ్డాను బాబూ.. దారుణంగా మోసపోయాను. ఏంటిది? అని ఎదురుతిరిగితే ఊరెళ్లిపొమ్మన్నారు బాబూ. కానీ ఎలా వెళ్ళను? విమానం టికెట్‌కి డబ్బులు ఎక్కడివి? పాస్‌పోర్టు ఎక్కడిది?
ఈ మండే ఎండలో రోజంతా శ్రమ చేసి రాల్చిన చెమటకి, కాదు రక్తానికి ఫలితమెక్కడిది బాబూ. మాకు జబ్బొచ్చినా, ఎండల్లో మాడి మసైపోయినా, మా శవాలతో అయినా పనిచేయించేసుకుంటారు బాబూ వీళ్ళు. ఇన్నాళ్ళు ఇక్కడ పనిచేసిన వాళ్ళంతా శవాలే బాబూ. పెదాలపై చిరునవ్వు ఉండదు, జీవితంపై ఆశ ఉండదు..." సారథి ని
శ్చేష్టుడై వింటున్నాడు.

    "ఆర్థిక మాంద్యపు దెబ్బ అని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన లేబర్ సప్లై కంపెనీ బోర్డు తిప్పేసింది. మా పాస్‌పోర్టులు ఏమయిపోయాయో? చివర్లో ఇస్తాం అంటూ దాటివేసినా ఎన్నో నెలల జీతాలు ఏమయిపోయాయి? మాకు వీసా కూడా లేదు ఇప్పుడు. బయటికి వెళ్తే అనధికారంగా ఈ దేశంలో ఉంటున్నామని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఎవడిమీద చూపించాలి ఈ కోపం? మా మీద మేమే, ఇక్కడ క్యాంప్‌లో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కానీ ఏ ఒక్కటీ బయటకి రాదు. అన్నీ ప్రమాదాలుగానే చిత్రీకరింపబడతాయి.

    అవును ప్రమాదాలే.. ఎందుకంటే మేమంతా ప్రమాదాల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాం బాబూ!

    ఎండమావుల్ని దూరం నుంచి చూస్తూ మంచినీరు దొరుకుతుందన్న ఆశతో చేసిన సుదూర ప్రయాణానికి ఫలితం- నోటినిండా మట్టేబాబూ..  మట్టికొట్టుకుపోయాం.. నారి భోరుమని ఏడుస్తున్నాడు. మట్టికొట్టుకుపోయాం..." అని మళ్ళీ మళ్ళీ అంటున్నాడు.

    "నేనున్నానో.. చచ్చానో కూడా మా వాళ్ళకి తెలీదుబాబూ. నేను వెనక్కి వస్తానని, వాళ్ళని ఉద్ధరిస్తానని ఎదురుచూసే నా వాళ్ళకి నా మొహమెలా చూపించను బాబూ.. అందుకే అందరం నిశ్చయించుకున్నాం, ఇక్కడేం దొరికినా, దొరకకపోయినా చవకగా పెట్రోల్ అయితే దొరుకుతుంది. అది చాలు.. ఈ నరకయాతన నుంచి బయటపడటానికి, ఈ అసమర్థ జీవితాన్ని ముగించటానికి. కానీ- నాకు ఆ అదృష్టం కూడా లేదు బాబూ, నాతోబాటు వాళ్ళందరూ చచ్చిపోయి ఈ నరకయాతన నుండి బయటపడితే నేనింకా బతికే ఉన్నా బాబూ..." అని నారి భోరుమని ఏడుస్తున్నాడు. ఏడుస్తూనే "ఒక్కసారి అమ్మా నాన్నల్ని చూడాలి బాబూ.. ఈ చేతకాని కొడుకుని క్షమించమని అడగాలి.. నా రంగి.. నా కొడుకు ఇప్పుడెలా ఉన్నారో? అయ్యో! నా జీవితం..." అంటూ నారి గట్టిగా ఏడుస్తూ స్పృహ కోల్పోయాడు.

* * *

    సారథికి నోట మాట లేదు. హాస్పిటల్ నుండి బయటికి ఎలా వచ్చాడో కూడా అతనికి గుర్తులేదు. దూరంగా కొత్తగా కడుతున్న అపార్ట్‌మెంట్ దగ్గర కార్మికులు కలిపే కాంక్రీటు ఎర్రగా కనిపిస్తున్నది సారథికి. ఎదురుగా ఉన్న ఫౌంటెన్‌లో నుండి రక్తం విరజిమ్ముతున్నట్టు అనిపిస్తున్నది. ఎత్తయన భవనాల పునాదుల నుంచి ఎవరో చేతులు చాచి రక్షించండి- అని అరుస్తున్నట్టు అనిపించింది.

    దుబాయ్ చాలా వికృతంగా కనిపిస్తుంది సారథికి. జేబులో మొబైల్ ఫోను తీసుకొని ఇంటికి ఫోన్ చేశాడు- ‘‘అమ్మా రెండు రోజుల్లో ఇంటికొచ్చేస్తున్నా.. ఇంక మీ దగ్గరే ఉంటా..’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సారథి. అటుగా వెళ్తున్న టాక్సీని ఆపి ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్... డ్రైవర్ హిందీలో అడిగాడు.

    ‘‘ఇండియన్ ఎంబసీకి’’. నిదురపోతున్న ప్రభుత్వాలని నిదురలేపాలి. ఎండమావులలో నీరు దొరుకుతుందని వచ్చి ఈ మట్టిలో కలిసిపోతున్న నారి లాంటి అభాగ్యులను రక్షించాలి. సారథి గుండె ల్లో ఆవేదన ఉప్పెనగా మారుతోంది.

(ఆంధ్రభూమి దినపత్రిక 23-06-2012 సంచికలో ప్రచురితం)

Comments