ఎర - స్వాతి శ్రీపాద

    
చిన్నప్పుడు ఎక్కడ ఉన్నామో పెద్దగా గుర్తులేదు కాని ఊహతెలిసాక ఓ మోస్తరు నగరంలో యాంత్రికంగానే వున్నట్టు గుర్తు.
    అప్పట్లో ఎవరితో వెళ్ళానో ఏవూరు అనేది అంతగా జ్ఞాపకం లేదు. కాని ఆవూరిలోని నది,వీలున్నప్పుడల్లా నదీతీరానికి వెళ్ళి నదివాలున జాగ్రత్తగా కాళ్ళు నీళ్ళల్లో వుంచి ఆడించటం నిన్న మొన్నలా అనిపిస్తూంది.
    ఎదురుగా ఒక మూతిసన్నని చేపలబుట్టపెట్టుకుని, కొక్కేనికి ఓ వానపామును గుచ్చి పొడుగాటి దారాన్ని నీళ్ళల్లోకి వదిలి అటూ ఇటూ కదిలించడం అంతలోనే సర్రున బయటకులాగి కొక్కేనికి తగులుకున్న చేపను లాగి బుట్టలో వేసుకోవడం ఎంతో అద్బుతంగా తోచేది.
    కాస్తో కుస్తో నాకూ చేపలు పట్టాలనే కోరికా కలిగింది, కాని ముందే మగరాయడిలా రోడ్డుమీద గోలీలు ఆడటం , గిల్లిదండు ఆడటం చేస్తానని అమ్మ గట్టిగా చెప్పింది కొత్తచోట బుద్దిగా వుండాలి కాని ఇలాంటి వేషాలు పనికిరావని. అందుకే నాకోరిక పెదవిదాటి బయటకు రాలేదు.
    కాని చేపలు పట్టే ప్రక్రియమాత్రం ఎంతగానో నచ్చేసింది.
    నాగురించి నేను చెప్పుకోవాలంటే బయటా ఏ డాంభికాలకు పోయినా మాది మాత్రం మధ్య తరగతి కుటుంబంగా కూడా చెప్పుకోలేము. నాన్నకు చేతనయినది పౌరోహిత్యం ఒక్కటే , దాని మీదే కుటుంబం మొత్తం గడవాలి. పెళ్ళిళ్ళు పేరంటాలు పురుళ్ళు పుణ్యాలు , పిల్లల చదువులు వగైరా వగైరాలన్నీ ...సంపాదనకు కొరవవున్నా సంతానానికి మాత్రం కొరవ వుండరాదనేది నాన్న సిద్ధాంతం కాబోలు , దానికి తోడు కొడుకు అనే పిచ్చి వ్యామోహం ఒకటి---అందుకే దేవుడిని చాలెంజ్ చేసి మరీ కొడుకు పుట్టే వరకూ అమ్మాయిలను కంటూనే పోయారు.
    చాలీ చాలని తిండి చాలీ చాలని బట్టా ఆరుగురమ్మాయిలకేగాని సుపుత్రుడు మాత్రం రాజ యోగంతో పుట్టాడని తెగసంబరపడిపోయారు.
    నిజమే ఆరుగురి తరవాతపుట్టడమే కడా రాజయోగం ముందుపుట్టివుంటే ఎలాగవుతుంది?
    ఎప్పుడు ఏక్షణంలో నామనసులోకి ఆ ఆలొచన దూరిందో కాని మొదట్లో చాలా సంబరమనిపించింది.
    చేపల వల ఎప్పటినుండో నా ఆలోచనలను ఆక్రమించుకుని వున్నా , ఈ ప్రపంచం లో ప్రతి చర్యా ఒక ఎరలాంటిదేననే ఆలోచన ఎలా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో నాకే తెలీదు. ప్రతి మాటా చేతా వానపామే దాన్ని కొక్కేనికి తగిలించి జనాలను పట్టిబుట్టలో వెయ్యడమే.
    డబ్బు, సంతోషం , తిండీ బట్టా చలవ , వేడీ అన్నీ వానపాములే వాటిని కావాలనుకోవడం ఆలశ్యం -అక్కడికి పరిసమాప్తమే.
    ఈ ప్రపంచమేమీ మా నీతిని నిజాయితీని మెచ్చి మేకతోలు కప్పలేదు. మానాన్న లేమితో వాటిని మసకేసి ఎన్నిసార్లు అనుమానించి అవమానించలేదు? మర్చిపోదామన్నా మరచిపోలేనిది మొదటి దెబ్బ.
    ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకునే వయసది , బహుశా పదేళ్ళకు తక్కువే. ఇంతకూ ఎవరితో ఆడుకున్నానో , ఆ పిల్లలెవరో ,వాళ్ళమోహాలేమిటో మచ్చుకైనా గుర్తు లేవు. గుర్తున్నది మాత్రం ఒక ఆమ్మాయి చెవిపోగు పోయిందట అని మాత్రమే..
    ఎవరిని అడిగారో ఎం చేసారో కాని ఒకరోజు మాత్రం నన్ను చాలా ప్రేమగా పిలిచి," స్వీటీ నీక్కాస్త పటికబెల్లం పెడతాను-మా మంచి పిల్లవుకదూ చెవిరింగు నీకు దొరికిందా?"

    ఎవరిదగ్గర ఏం తీసుకున్నా అమ్మ చంపేస్తుంది, అందుకే ఇచ్చినా తీసుకోకుండా వద్దని తిరస్కరించాను.

    ఆవిడ మళ్ళీ అడిగింది - చెవిపోగు ఎక్కడ పెట్టావు? నేను వెర్రి చూపులు చూశాను. అంటే అది నేను తీసుకున్నాననే తీర్మానించారన్నమాట? అవమానంతో ఎంత రగిలిపోయానో .. ఇప్పటికీ 
తలుచుకున్నప్పుడల్లా మనసు మసిలిపోతుంది... డబ్బులేదనేగా నన్నలా అవమానించారు... అందుకే కసిగా సంపాదించాను రాత్రీ పగలూ కష్టపడి -- అయితే మాటిమాటికీ చేపల గాలం మాత్రం గుర్తుకు వస్తూనేవుంది. ఎరకోసం వెళ్ళి కొక్కేనికి తగులుకున్న చేపల బదులు మనుషులే కనిపించే వారు.
    గుడ్డిలో మెల్లగా మా నాన్నగారు మమ్మల్ని చదివించారు ఏదో --స్కూల్ కి పంపడం , ఎవరిదగ్గరో పుస్తకాలు అడుక్కుని చదువుకోవడం ...ఆలోచిస్తే ఆ చదువు చెప్పించటమూ ఒక ఎరే అనిపిస్తూంది... మాటకి ముందు నేనుగనక మిమ్మల్ని చదివించాను అనడం , అది విశాల దృక్పధంతో కాదని అందరికీ తెలుసు ............. ’ఈ ఆడముండల్ని చెప్పుకిందతేళ్ళలా నలిపివేసి అణిచివుంచాలని అందరికంటే చిన్నవాడయిన కొడుక్కి నూరిపోసే ఆయనకు విశాలదృక్పధమా?
    అటు పెళ్ళిళ్ళు చేసే స్తోమత లేదు ..చెయ్యాలనీ లేదు. చేసేస్తే సరిపోయిందా? పండగలూ పబ్బాలూ , కడుపులూ సీమంతాలూ పురుళ్ళు...
    పైగా ఎదిగొచ్చిన పిల్లలకు పెళ్ళిళ్ళుచేస్తే ఏటా కాన్పులతో రోగాలబారిన పడిన భార్య పనులెలా సమర్ధించుకు రాగలదు...
    అందుకే అక్కలు పెద్దగా చదువుకోకున్నా వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యలేదు..
    నాకు అన్నివిషయాలూ స్పష్టంగా అర్ధమవుతున్నా నోరు విప్పలేని అశక్తత.
    అక్కలని ఎరలుగా వాడుకుంటున్నారు... అమ్మ...నాన్న అనిపించేది.  
************************

    ఉద్యోగంలో చేరి ఆర్నెల్లుకావస్తోంది. ప్రతినెలా వచ్చిన జీతం అణా పైసలతో సహా అమ్మకివ్వలసిందే..
    గంతకు తగ్గ బొంత అన్న ధోరణీలో ఇద్దరక్కల పెళ్ళిళ్ళూ చేసారు గాని ధరని బట్టేగా నాణ్యత.
    పెద్దబావకొచ్చేజీతం పేకాటకూ తిరుగుళ్ళకూ సరి, ఇహ రెండో ఆయన వెయ్యిళ్ళ పూజారి.
    అందుకే పెళ్ళనేమాటే ఒళ్ళుజలదరించేలా చేస్తోంది.
    అలాగని ఇక్కడే వుండే పరిస్తితులూ కాదు.
    "నీ జీతం ఇంతేనా? కాస్త దాచుకున్నావా"లాంటి ప్రశ్నల దగ్గర ఆరంభించి," అవునూ ఈ నెల ఇంకా బయట చేరలేదేమిటి ? ఆఫీస్ పేరుచెప్పి ఎక్కడైనా దొమ్మరి తిరుగుళ్ళు నే॑ర్చావా?"
    మనసు సిగ్గుతో కుంచించుకు పోయేది. కొక్కేనికి తగులుకుని గిలగిల లాడే చేప చందమే అయ్యేది నా పరిస్తితి. ఓపక్క నెలసరి వచ్చినప్పుడల్లా తట్టుకోలేనంత కడుపునొప్పి .. , సక్రమంగా కాకుండా ఏ రెణ్ణెల్లకో రావడం --దానికి కారణం హార్మోన్ల ఇబ్బందిలాంటిదని తెలుసుకున్నా -బ్రతికి బట్టకట్టిన వాళ్ళే నాపిల్లలనుకునే అమ్మ ఏంచెయ్యగలదు? తనతో పాటు చదువుకునే ఉషకూ ఇలాగేవుంటే వాళ్ళమ్మ లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి మందులిప్పించటం తెలుసు తనకు...
    ఎందుకు నన్నింత అనుమానిస్తోంది అమ్మ? విలువలు తనకొక్కదానికేవున్నాయా? నాకుండవని ఎందుకనుకుంటోంది?
    తల్లిదండ్రులంటే పిల్లల్ను అపురూపంగా పెంచాలి కాని ఇలానా? ఎప్పుడు వీళ్ళను వదిలి పారిపోదామా అనిపించేలాగునా?
    పారిపోవడం అంటే ఒకటే దారి --నాకున్న నవలా పరిజ్ఞానం లోకవ్యవహార దృష్టితో ఎవర్నీ నమ్మలేను ఎవరితోనూ స్నేహాలూ పెంచుకోలేను ..పారిపోగలిగే దారి రాజమార్గాన పెళ్ళిచెసుకుని పోవడమే.
    అది ఇప్పట్లో అమ్మానాన్నా చెయ్యరని సుస్పష్టం.
    ఎప్పటికైనా చేస్తారా అనేది అనుమానం  
    చదువుకునే రోజుల్లోనూ ఉద్యోగంలో చేరాకా చాలామందితోటే పరిచయాలు ఏర్పడ్డా నాకున్నా ఎర నోషన్ నన్నెవెరికీ దగ్గర చెయ్య లేకపోయింది.
    అందుకే నువ్వంటే అదనీ ఇదనీ, నీ సమక్ష్యంలో ప్రపంచం మర్చిపోతామనీ చెప్పే మాటలన్నీ కొక్కేనికి వేళ్ళాడే వానపాముల్లాగా తోచేవి.అందుకే సరదాగా వాళ్ళను నాచుట్టూ తిప్పుకుని ఏడిపించేదాన్ని.     ఒకసారి ఓ మిత్రుడు పెళ్ళి ప్రపోజల్ తెచ్చాడు ...
    అదీ సూటిగా చెప్పే ధైర్యం లేక ఓ ఉత్తరంగా వ్రాసి తెచ్చాదు. అది నాచేతికివ్వడనికే అతనికి ముచ్చెమటలు పట్టాయి. అదిసరే ఓ పెద్ద అయోమయంలో సంక్లిస్టంలో అతన్నిచూసేందుకు కూడా సాహసించక నా ఆలోచనల్లో నేనున్న క్షణాల్లో.. అతన్ని ఉపేక్షించానన్న అనుమానమో లేక తిరస్కరించానన్న అవమానమో గానిమరో ఉత్తరం వ్రాశాడు " ఏదో పెద్ద నిప్పులాంటిదాననని అనుకుంటూన్నావేమో ...నువ్వెంత నిప్పులాంటి దానవో నాకు తెలుసు..." ఏమారుమూలో అవునందామా అనిపించే మనసు కుంచించుకు పోయింది. ఇప్పుడే, ఇంకా అవును కాదు అని ఏమాటా చెప్పక మునుపే నన్నిలా దూషించే మనిషి ఇక జీవితాంతం ఎలా సతా ఇస్తాడో నన్న ఊహ వణికించింది.
    ఆ వ్యవహారం అక్కడితోముగిసినా అది నామనసును పట్టుకు వేళ్ళాడుతూనేవుంది.నన్నంత మాట ఎలా అనగలిగాడు ఏ ధైర్యంతో అని.
    సరే ఎలాగూ అర్ధమయిపోయింది గనక నా దారి నేను ఎలాగోలా చూసుకోవాలి...
    ఆ వేటలో నే ఎందరినో ఎన్ని రకాలుగానో పరీక్షించాక, నన్నునన్నుగా, బాహ్య సౌందర్యానికి విలువ నివ్వకుండా ఆత్మకు సన్నిహితుడని అనిపించాక మనసా వాచా అతనిలాంటి ఉత్తముడు ఉండదనిపించాక పెళ్ళికి ఒప్పుకున్నాను.
    పెళ్ళికి ముందురోజురాత్రి సంకుచితమైన ఊహలతో సంక్షోభితమైన మనసుతో నిద్రపోలేక ఒక చిత్రం గీసుకున్నాను. అదీ మసక వెన్నెట్లో దొడ్లో కూర్చుని ఎవరికీ ఆటంకం కలిగించకుండా..

    కనిపించని చేతి వేళ్ళలో గాలం. గింగిర్లు కొడుతున్న గాలానికి చివర కొక్కేనికి చేప ఆకారం లో నేను...
    అది పూర్తి చేసే సరికే తెల్లవారటం నా జీవితం ఒక మలుపు తిరగటం జరిగింది.
    చిన్న చిన్న తగాదాలు అలకలు వచ్చినప్పుడల్లా నావెంట తెచ్చుకున్న అస్త్రాన్ని బయటకు లాగి స్పష్టంగా రంగులద్దేదాన్ని కాని దాన్ని ఓపెన్ గా ప్రదర్శించక మునుపే మాతగాదాలు సమసిపోయేవి.. ఇంతకూ ఆచిత్రాన్ని నేను తప్ప మరెవెరూ చూడనే లేదు.
    ఇప్పుడు ఇన్నేళ్ళకు మళ్ళీ నా మనసుకు గాలం ఎర గుర్తుకు వచ్చాయి. ఎక్కడో దాచుకున్న నాచిత్రమూ ఎదలో మెదిలింది. దాన్ని బయటకు తీసి ....కాస్సేపు విప్పకుండానే దానివైపు దృష్టి సారించి ..ఓ నిర్ణయానికి వచ్చాక గుండ్రం గా చుట్టిన దాన్ని విప్పాను.
    నిజమే ఎంత జాగ్రత్త పడ్డాననుకున్నా నేను గాలానికి చిక్కిన చేపనే ...
    ఈ జీవితం ఈ సుఖాలు పిల్లలు సంసారమనే ఎరకు నన్ను నేను తగిలించుకుని ఏళ్ళుగా కొట్టుమిట్టాడుతున్న నేను ఒడ్డున పడి గిలగిలలాడుతున్న చేపనే...
ఇప్పుడు మాత్రం ...  
    ఊహకే ఊపిరి ఆగినట్టనిపించింది.  
    నిజమే... అయిదారేళ్ళుగా ఎంతనరకాన్ని అనుభవించాను... పక్షవాతంతో మంచం పట్టి ఊద్యోగానికి ఏమాత్రం పనికిరాని అతను నిస్సహాయంగా చూడటం తప్ప .. మనసును చూపుల్లో తప్ప పెదవి విప్పి పలికించలేని అతను... దివారాత్రాలు అతని అవసరాల వత్తులు కళ్ళల్లో వేసుకుని కాపలాగా ...నిద్రాహారాలు త్యాగం చేసినా చివరకు ...
    ప్చ్!
    మళ్ళీ నా కొడుకు నా పిల్లలనే వ్యామోహం .. అత్తగారు నచ్చని కోడలు...
    ఆ ఈతి బాధల్లోమరొకటి జీవచ్చవంలా మిగిలున్న అతని తల్లి ...ఎంత కోపం వచ్చినా ... అతనే లేకపోయాక నాకేంటి అని విదిలించుకోజూసినా ఏమూలో వున్న జాలో మరింకేమిటో గాని విసుక్కున్నా కసురుకున్నా మళ్ళీ ఆవిడని చూడగానే జాలి వేస్తుంది. తా దూరకంతలేదు మెడకో డోలన్నట్టూంది ఆవిడ చందం ..అప్పుడో ఇప్పుడో తిక్క రేగినప్పుడల్లా సభలనీ సమావేశాలనీ ఆవిడను ఎక్కడో చోటదింపి వారం పది రోజులపాటు తిరిగి వస్తూనేవుంటుంది.

    అలాంటి సమావేశాల్లోనే పరిచయమయాడు కధక చక్రవర్తి . మంచి కధకుడే
    అంతో ఇంతో సానుభూతిగా మాట్లాడిదగ్గరతనం ప్రదర్శించేసరికి మంచి మిత్రులం మంచిమిత్రులం అనగానే నమ్మేసింది.
    అప్పట్లో తన ఎర కాన్సెప్ట్ ఏమైపోయిందో తెలీదు. నిజంగా స్నేహానికి ఎల్లలు లేవనే నమ్మింది. ఎవరితోనూ చెప్పుకోని విషయాలు నీతో చెప్తున్నానంటే నిజమేననుకుంది. ఆడవాళ్ళతో మాట్లాడలేని మాటాలన్నీ చెప్పినప్పుడూ మంచి స్నేహితురాలిగా చెప్తున్నాడనే అనుకుంది.
    కాని ఒళ్ళుమరచిపోయి స్నేహం ముసుగులో అతను వేసే పిచ్చి వేషాలను గమనించలేకపోయింది. అతనే లేకపోయాక నీ సుఃఖం నువ్వు చూసుకోక ఎందుకీ జంజాటాలన్నీ అన్నప్పుడు ఎందుకు గట్టిగా జవాబు చెప్పలేకపోయింది? తన మిత్రురాలికీ తనకూ వున్న శారీరిక సంబంధాల గురించి చిలవలు పలవలుగా వర్ణించినప్పుడు ఎందుకు ఖండించి తెగతెంపులు చేసుకోలేకపోయింది?

    తనలోనూ ఏదో చాపల్యం మిగిలేవుందా? లేకపోతే ఇవ్వాళీ రోజు వచ్చేదా?
    పుట్టిన తరువాత మొదటిసారి జన్మ దినం జరుపుకుందామనివుంది చిన్నపార్టీ రమ్మంటే హోటల్ కామత్ కి వచ్చింది.
    ఎంత సిగ్గులేకుండా ఎలా అడగ గలిగాడు? ఎంత జుగుప్సగావుంది తలుచుకుంటేనే ......
    ఒకరోజు నాతో గడిపితే అరిగిపోతావా కరిగిపోతావా? అనా?
    పైగా ..ఛి ఛి తలుచుకుందుకు కూడా అసహ్యంగావుంది...
    చెప్పాపెట్టకుండా లేచి చక్కా వచ్చేసింది.
    ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్త లేదు.
    అక్కడితో ఆ స్నేహం ఆప్రహసనం ముగిసిపోయిందనే అనుకుంది
    వారం క్రితం సుమలత ఫోన్ చేసే వరకూ కూడా...  
    ఆమాటా ఈ మాటా మాట్లాడాక సుమ నెమ్మదిగా నానుస్తూ అడీగింది..
    "నువ్వేమీ అనుకోనంటే ఒక మాట అడగనా ... ఉహు అడగటం కాదు ..అడిగితే నీ మీద నమ్మకం లేక నిన్ను అనుమానించినట్టే... నాకు నీ మీద వందకు నూటాయాభై శాతమ్ నమ్మకముంది... నీ మంచి మిత్రుడని చాలా సార్లు చెప్పావుగా అతనే కధక చక్రవర్తి--అతనీ మధ్య చెప్తున్న కధ ఏమిటో తెలుసా... ఒంటరితనం భరించలేక నువ్వు అతని చుట్టూ తిరుగుతున్నావట ... తన కధలు బాగున్నాయన్న వంకతో పరిచయం పెంచుకుని రోజుకు ఇరవై సార్లు ఫోన్ చేస్తున్నావట ... చివరకు సరే నంటే ఎంతకైనా సిద్ధంగా వున్నావటగాని భార్యా పిల్లలకు అన్యాయం చెయ్యలేక............." నా మొహం చూసి ఆగిపోయింది సుమ.
    నిలువెల్లా కన్నీళ్ళ పర్యంతమౌతూ...
    " ఇంత అన్యాయమా? " అని మాత్రం అనగలిగాను.
    మనసు అవమానంతో చితికిపోయింది...     
    నా ఎర భావన పూర్తిగా తెలిసిన సుమ నవ్వేస్తూ,
    " ఒక్కటే ..నాకు తెలిసిందల్లా వాడి ఎరకు చిక్కలేదన్న అక్కసుతో అభాండాలు వేస్తున్నాడు ...జాగ్రత్త పడతావని చెప్తున్నానంతే " అంది.
    చాలా రోజులు ఆలోచించి బుర్రబద్దలు కొట్టుకున్నక నాకు నచ్చిన పరిష్కారం ఇది. మరొకరు వాడి వాడి ఎరకు చిక్కకుండా వుండాలంటే ఏదేమైనా ఈ కధ బయటకు రావాలి దానికి నాకున్న ఒకే ఒక్క దారి ఈ ఎర కధను లోకం మీదకు విసరడమే.

***************************
Comments