ఎర్రని ఎరుపు - టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి

    సెంట్రీ తాళం తీసి ఇనుపచువ్వల తలుపు తెరిచాడు. బాగా పెరిగిన గడ్డం, మీసాలతో ఒకే ఒక వ్యక్తి కూర్చుని వున్నాడు సెల్‌లో.

    "ఈ ముసలాయన్ని ఎక్కడో చూసినట్లుంది" అనుకుంటూ లోనికి అడుగుపెట్టాడు దానయ్య. అతని ఆలోచనకు తగినట్లుగానే ముసలి వ్యక్తి గాజు కళ్ళలో ఎక్కడో కొద్దిపాటి చురుకు కన్పించింది.

    "ఓ... నువ్వా" అన్నట్లుగా దానయ్యను పరికించి చూసి తల తిప్పుకున్నాడు.

    తలుపు మూసి, తాళం వేసి సెంట్రీ వెళ్ళిపోయాక మౌనంగా కూర్చున్న ముసలి వ్యక్తికేసి చూస్తూ మరోవైపు నేలమీద గోడ కానుకుని చతికిలబడ్డాడు దానయ్య.

    నిశ్శబ్దం ప్రారంభమైంది!

    జైలు గోడల మధ్యన అరచీకటి గదులలో ఆ నిశ్శబ్దమూ, అడపాదడపా కొద్దిపాటి సందడీ సర్వసాధారణమే... కానీ... అదివరకు జైలు జీవితం గడపని దానయ్యకు ఆ నిశ్శబ్దం చాలా ఇబ్బందికరంగానూ, బాధాకరంగానూ ఉంది. 

    "ఈ ముసలాడేదైనా మాట్లాడితే బావుండును" అనుకున్నాడు కానీ...అప్పటికే...తన మనసు పొరల్లో చెప్పరాని దిగులూ, గుండెలోతుల్లో కొద్దిపాటి దుఃఖం కమ్ముకుంటుండడం వల్ల తనూ మాట్లాడే ప్రయత్నం చెయ్యలేకపోయాడు. సమయం భారంగా కదులుతోంది.

* * *   

    రాత్రి భోజనాలు చేసి వచ్చాక...సెల్‌లో చెరోవైపు మౌనంగా పడుకున్నారు - ముసలాయనా, దానయ్యా. అప్పటికీ ఇరువురి మధ్యనా మాటలు లేవు! మాడిపోయిన బల్బు మార్చనందున చీకటిగా ఉన్న సెల్‌లో కొద్దిపాటి దుర్వాసనతో పాటు దోమల మోత కూడా కొంత వినిపిస్తోంది.

    జైలు ప్రహారీ గోడల మీదుగా సాగిన వాలు వెన్నెల తాలూకు చంద్ర కిరణాలు సెల్ గోడపైనున్న చువ్వల కిటికీ గుండా వారిద్దరి మధ్యనా పడి చీకటిని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

    అంతరంగ మథనం వల్లా, బాధవల్లా చాలా రాత్రివరకు కంటిమీద కునుకు పడలేదు దానయ్యకు. చివరికి నెమ్మదిగా కళ్లు కాస్త మూతలు పడుతుండగా సెంట్రీ వచ్చి ఇనుప చువ్వలను భయంకరంగా బాది బార్‌టెస్ట్ చేసి పెళ్లడంతో...పట్టబోతున్న నిద్ర కూడా కొండెక్కిపోయింది చిన్న ఉలికిపాటుతో.

    అదే సమయంలో ముసలివ్యక్తి భారంగా నిట్టూరుస్తూ ఇటువైపు ఒత్తిగిల్లాడు.

    "ఏం పెద్దాయనా, నిద్రరావడం లేదా?" మొట్టమొదటి పర్యాయం తనే పలుకరించాడు దానయ్య.

    ముసలాయన జవాబు చెప్పకపోవడంతో "మనం ఎక్కడో ఎప్పుడో కలుసుకున్నాం. జ్ఞాపకం ఉన్నానా?" అంటూ మళ్ళీ తనే ప్రశ్నించాడు.

    "నిన్ను మరిచిపోతానా నాయనా? బాగా జ్ఞాపకం ఉన్నావు" ముసలివ్యక్తి స్వరంలో కాఠిన్యంతో పాటు ఇంచుక ఆక్రోశం.

    "అంతగా జ్ఞాఫకం ఉన్నానా? ఎలా?"

    "ఎలాగేమిటి? నా ఈ దుస్థితికి నీవే కదా కారణం?"

    "నేనా?" నిర్ఘాంతపోతూ ప్రశ్నించాడు దానయ్య.

    "ఖచ్చితంగా నీవే...కానీ నేను మాత్రం నీకిచ్చిన మాట తప్పలేదు నా ధర్మంగా! అందువల్లే నావల్ల నీకు ఇబ్బంది రాలేదు"

    దానయ్యకు అతను చెప్పేదేమీ అర్థం కాలేదు.  

    "నేనేం చేశాను?" అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.

    "పనికి మాలిన బొంద రివాల్వరు ఇచ్చావు కదా?"

    ముసలాయన అలా అనగానే దానయ్య మనసులో ఓ మెరుపు మెరిసింది. తేజస్సు కలిగిన ముఖాకృతితో ఓ వ్యక్తి రూపం కళ్లముందు మెదిలింది...జ్ఞాపకాలను కదిలిస్తూ!

* * * 
   
     "దానయ్యా, ఓ సిన్న గిరాకీ వచ్చింది" అంటూ నారాయణ రావడంతో చేతున్న పని ఆపి తల ఎత్తి చూశాడు దానయ్య.

    "ఎవడో ముసలాడు...పిస్తోలో, రివాల్వరో గావాలట."

    "పోలీసోల్ల చూపిప్పుడు ఇటేపు కూడా వుంది కదరా?" అన్నాడు దానయ్య సంశయంగా. 

    "ఆ దిగులొద్దు...పెద్ద రంగయ్య గుర్తుల్సెప్పి అంపించాడు! అన్నీ కనుక్కునే వచ్చాను"

    "అలా అయితే పట్టుకురా" అన్నాడు దానయ్య ఉత్సాహంగా. అరగంట తరువాత నారాయణ వెంట వచ్చిన వ్యక్తికేసి పరీక్షగా చూశాడు దానయ్య. వృద్ధాప్యంలో అడుపు పెట్టినా దాష్టీకంగానే ఉన్న మనిషనిపించింది. ముఖం మంచి కళగా ఉంది.

    కానీ పరీక్షగా చూస్తే కళ్ళ లోతుల్లో ఏదో పెద్ద దిగులే కన్పిస్తోంది.  

    తనను తరచూ అనేకరకాల మనుషులు కలుస్తుంటారు. కాబట్టి దానయ్యకు ముసలాయన రాక, ఆకారం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. తనవద్ద వున్న వస్తువులను చూపేముందు యథాలాపంగా ఓ ప్రశ్న వేశాడు.

    "ఇంతకూ ఈ వయసులో ఆయుధం నీకెందుకయ్యా?"

    "చెప్పను...కానీ నాకివ్వడం వల్ల ఎప్పుడూ నీకెలాంటి ఇబ్బందినీ కలిగించను" అన్నాడు. అతని స్వరంలో నిజాయితీ ధ్వనించింది.

     అతని మాటలు విశ్వాసం కలిగించినా వృత్తి జాగ్రత్తలో భాగంగా చాలాకాలంగా నిలిచిపోయి వున్న తాతల కాలంనాటి తపంచాల నుండీ రివాల్వర్ల వరకూ  పాత సరుకే చూపించాడు.

    "ఇవన్నీ చాలా తుప్పు పట్టినట్లున్నాయే? అసలు పనిచేస్తాయా ఇవి?" అన్నడు ముసలాయన సంశయంగా.

    నారాయణ నవ్వేశాడు. దానయ్య కూడా చిన్నగా నవ్వి అన్నడు. "నూనె పడి చిలుం వదిల్తే అన్నీ కొత్తవే... పనిచేసేదీ లేనిదీ చూపుతాం కదా? ముందు నీకేది కావాలో చూడు మరి"

    "తల పగలకొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేంలే?" అంటూ పరిశీలన మొదలు పెట్టాడు ముసలాయన.

    పదిహేను నిముషాలలో ఎన్నిక ముగిసింది. అరగంటలో ఆయిలింగ్, గంట తరువాత పెద్దడివిలో ప్రయోగించి చూపడం, మరో ముప్పవు గంటలో ఎలా ఉపయోగించాలో నేర్పడం కూడా ముగిశాక రివాల్వరునూ, కొన్ని బుల్లెట్లనూ అందించారు.
   
     ముసలాయన వాటిని తన  జిప్‌బ్యాగులో బట్టల మధ్యన జాగ్రత్త చేసుకుని దానయ్యకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి బయల్దేరాడు.

* * *   
   
     "అయితే ఆనాడు నేనిచ్చింది పనికి మాలిన రివాల్వరా?" తగ్గు స్వరంతోనే అయినా చాలా కోపంగా ప్రశ్నించాడు దానయ్య.

    "అవును. చిలుం పట్టిపోయిన దానివల్లనే కదా... నేను ఇలా ఈ ఖర్మ అనుభవిస్తున్నది?!"

    "అవునా?"

    "కాక?"

    "నేనలాంటివి లెక్కలేనన్ని అమ్మాను పెద్దాయనా! నాకెప్పుడూ, ఎక్కడా ఇలాంటి అభాండం రాలేదు"

    ముసలాయన మాట్లాడలేదు. కానీ భారంగా నిట్టూర్చాడు.

    "పెద్దాయనా! ఇంతకూ నీకెందుకు కావాల్సి వచ్చింది?"

    దానయ్య ప్రశ్నకు వెంటనే బదులు పలకలేదు ముసలాయన. కానీ... నిముషం తర్వాత నిట్టూర్చాడు...మరో మారు!

* * *   

    వరుసగా నాలుగేండ్లు మోసం చేసిన వర్షాలు ఐదో యేడూ అదేబాటలో నడిచి తెచ్చిపెట్టిన కరువు కరాళనృత్యం చేస్తున్న దానిలా తయారయ్యే వరకూ కష్టం అన్నదే ఎరుగని రైతు రామయ్య. ప్రతి రోజూ పదిమందికి అన్నంపెట్టి అన్నపూర్ణ అన్పించుకున్న ఉత్తమ ఇల్లాలు ఆయన భార్య సీతామహాలక్ష్మమ్మ.

    ఎండ కన్నెరుగని చెరువడుగెప్పుడో ఎండి పగుళ్లు బారింది. భూములన్నీ నెర్రులు చీలాయి. కనీసం నాకడానికయినా నేల మీద పచ్చిక వాసన కన్పించక పశువులు దిగులు పడిపోయాయి. బడుగు పడ్డ గొడ్లను కొద్దో గొప్పో ముట్టచెప్పి తోలుకు పోతున్నారు కబేళాల ఏజెంట్లు.

రైతుల ఇండ్లలోని గాదెలు, గరిసెలూ ఎప్పుడో నిండుకున్నాయి. బావులే కాక పంచాయితీ వాళ్ళేయించిన బోరుబావులు కూడా లోతు పెంచుతున్నా క్రమంగా ఎండిపోయాయి. సాగునీటి మాట దేముడెరుగు...తాగునీటికి కూడా మైలున్నర దూరం వెళ్ళిరావాల్సిన దుస్థితి ఏర్పడిపోయింది.

    అంతవరకూ ప్రశాంతంగా ఉండిన చుట్టుపట్ల పల్లెల మధ్యకు నెమ్మదిగా కరువు రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. దాంతో చాలా పల్లెలు అంతర్గత కక్షలతో, కార్పణ్యాలతో, అక్కరకురాని, రాజీలేని రాజకీయాలతో, అడపాదడపా అక్కడక్కడ హత్యలతో అట్టుడికి పోసాగాయి క్రమంగా.

    కొన్ని పల్లెలలో...చాలా ఇళ్ళలో ఆయుధాలు, నాటుబాంబులు... అవిలేని కొన్ని ఇళ్ళమీదయితే పెద్ద కంకర రాళ్ళ గుట్టలు... అవసరం అయితే వీధిలో అడుగుపెట్టే వైరివర్గాల మీదకు విసరడానికీ, యుద్ధాలు చెయ్యడానికీ వీలుగా.

    ఈ పరిస్థితుల మధ్యనా ఆకాశం కేసి ఆశగా, దీనంగా, దిగులుగా చూసే కళ్ళకూ కరువే లేదు! 

    రామయ్య ఇంటిపెరట్లో కొట్టాలలో ఉంటుండిన ఎద్దులూ, ఆవులూ, ఎనుములూ మేత దొరకక ఎండిపోతూ రావడంతో కాస్త సుభిక్షంగా వున్న ప్రాంతాల రైతులు వచ్చి అడిగినప్పుడు వాటి సంక్షేమం కోరి వాటిని ఏదో ఒక ధరకు ధారపోయాల్సి వచ్చింది.

    పశువుల కొట్టాలను గోపురాలలా కప్పి ఉంటుండిన గడ్డివామిలెప్పుడో కరిగిపోవడం వల్ల అతని కంతకన్నా గత్యంతరం లేకపోయింది. కానీ ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కొట్టాలను చూస్తుండడం మరీ బాధాకరం అయిపోయింది. 

    గాదెలు, గరిసెలు నిండుకోక మునుపే బంధు జనుల రాకపోకలు నిలిచిపోతూ వచ్చాయి. నిండుకున్నాక, జీతగాళ్ళు, పశువుల కాపర్లు, ఇంటి చుట్టూ తిరుగుతుండిన మనుష్యులే కరువయిపోయారు... పలికే దిక్కు లేకుండా!

    విధి చేతిలో రైతు చెయ్యి కురచయ్యాక, ఇండ్లలో తిండి గింజలు కరువయ్యాక క్రమంగా ప్రేమానుబంధాలు తగ్గి మనుషుల మధ్య దూరం బాగా పెరిగింది. ఎవరు ఎవరింటికి వెళ్ళాలన్నా సంశయం. అందువల్ల ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కృతకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఎవరు ఎవర్ని చూసినా కొద్దో గొప్పో బాధ.  

    అక్కా, అన్నా, అత్తా, మామా, ఒదినా, బావా అంటూ ఆప్యాయంగా పలకరించే మనుషులూ మూగవాళ్ళయి పోతున్నారు.

    బావురుమంటున్న లంకంత ఇల్లు, బోసిపోయి కన్పిపిస్తున్న పెద్దంత పంచె, ఖాళీ పశువుల కొట్టాల నడుమ అనామకంగా జీవిస్తున్నట్లుగా బాధపడ్తూ గడపడం కష్టమైపోయింది.

    పొలాలకేసి నడిచినా ఎడారి మధ్యకు వెళ్ళిన భావం...అది మరింత బాధాకరం! 

    ఎక్కువమంది మనుషులలో కనిపించే దైన్యాన్ని చూడలేకపోయారు వారు. ఎందరికని శక్తికి మించి సహాయపడగలరు?

    ఆ పరిస్థితులలో రామయ్య దంపతులు పల్లె వదిలి పట్నంలో స్థిరపడ్డ కొడుకువద్దకు చేరక తప్పలేదు.

    కరువు పల్లెల మధ్యకు మళ్ళీ వెళ్ళినా అన్ని నగలు ఇంట్లో ఉండడం మంచిది కాదని అన్పించడంతో తన నగలలో సగం కోడలికిచ్చేసింది సీతామహాలక్ష్మమ్మ.

    మొదట్లో కొద్దినెలలు సజావుగానే గడిచాయి. తరవాతయినా కొడుకులో పెద్దగా మార్పు లేదుకానీ కోడలి ఆలోచనలలోనే అనేక మార్పులు చోటు చేసుకుంటూ రావడంతో...అత్తా మామల ప్రతి కదలికా, ప్రతి చర్యా ఆమెకెందుకో కంటగింపయిపోతూ వచ్చాయి.

    రామయ్యకయితే తను తన చిన్నతనంలో రామాపురం వీధి బడిలో చదువుకున్న రోజుల్లో వల్లెవేసిన...

"కమలములు నీటబాసిన కమలాక్షుని
రస్మి సోకి కమలిన భంగిన్,
తమతమ నెలవులు దప్పిన తమ మిత్రులె
శత్రులగుట తథ్యము సుమ్మీ!"

    అన్న పద్యం జ్ఞాపకం రాసాగింది.  

    కుమారుడు ఇరవైనాలుగు గంటలూ కాపలావుండి తల్లిదండ్రుల్ని సంరక్షించుకోలేడు కదా?

    అయినా మూడవ మనిషికి ఎలాంటి అనుమానం కలగనీయకుండా ముసలివాళ్ళను అకారణంగా ఇబ్బంది పెట్టగలగటం అనేది కేవలం కొద్దిమంది ఆడవాళ్లకు అబ్బగల అద్భుతమైన ఆధునిక విద్య నిజానికి. దానికి శత్రుత్వమో మరో కారణమో అవసరం లేదు బహుశా.

    కనీసం ఒక్క సంవత్సరం అయినా గడవక ముందే ఆ ఇల్లు నరకం అయిపోయింది భార్యాభర్తలిరువురికి. ఇంట్లో ఉండలేరు. వెలుపల అడుగు పెట్టడానికి స్వేచ్ఛలేదు. అడుగడుగునా ఆంక్షలు, అవమానాలు, సూటిపోటి మాటలు, దెప్పి పొడవడాలూ...వాటివల్ల అనేవాళ్ళకు ఆనందం ఉన్నప్పుడు వాటికిక నిలకడ ఏముంటుంది? మనిషిలో మనిషితనం అన్నది పోయాక? 

    చిట్ట చివరికి ముసలివాళ్ళిద్దరిలో ఎవరు నీళ్ళగదికి వెళ్ళివచ్చినా... వెంటనే...ప్రతిసారీ సీతామహాలక్ష్మమ్మ వాషింగ్ పౌడర్ చల్లి, ప్లాస్టిక్ బ్రష్‌తో శుభ్రంగా బేసిన్ తోమి నీళ్ళు వదిలిరావాలనే ఆంక్ష నిశ్శబ్దంగా, పరోక్షంగా విధించబడే సరికి ఇహ భరించలేక పోయాడు రామయ్య. తన సంసారాన్ని ఎంతో ఉన్నతికి తెచ్చిన గృహలక్ష్మిని మరీ అంత హీనమైన పరిస్థితులలో చూడలేకపోయాడు. పైగా అప్పటికే కోడలు చెప్పే పితూరీలకు కొడుకు తల వాల్చేస్తున్నట్లుగా ఆ దంపతులకు అర్థం అవుతోంది.

    ఘర్షణ పడే వైఖరి వారికి ఎప్పుడూ లేదు. అందుకే కుమార్తెను, ఆమె పిల్లల్ని చూసివచ్చే మిషమీధ ఆ ఇంట్లోంచి వెలుపలపడి అల్లుని ఊరుచేరారు. 

    అల్లుడు మంచివాడే! అతని తల్లిదండ్రులు దూరంగా ఉన్న ఓ నగరంలో తమ పెద్దకుమారుని వద్దే ఉండిపోవడం వల్ల అత్తనూ, మామనూ పెద్దదిక్కుగా ఆదరించాడు హృదయపూర్వకంగా. అందువల్ల కుమారుని ఇంట తాము పొందలేకపోయిన స్వేచ్ఛ ఏదో తమకు అక్కడ లభించినట్లయింది వారికి. 

    కూతురి రుణం మాత్రం ఎందుకుంచుకోవాలి? అనుకుంటూ మిగిలిన సగం బంగారాన్ని కుమార్తెకు అప్పజెప్పేసింది సీతామహాలక్ష్మమ్మ. 

    అక్కడ ఓ సంవత్సరంపాటు సజావుగానే సాగిపోయింది కానీ...ఇబ్బంది ఇంకో రూపంలో ఎదురయింది.

    ఎవరి దురదృష్టమో కానీ... రామయ్య దంపతులు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పట్నుండి పిల్లలో పెద్దలో ఎవరో ఒకరు తరచూ జబ్బు పడడం ఆనవాయితీ అయికూర్చుంది. దాంతో కడుపున పుట్టిన కూతురి మనసులోనే ఉత్పన్నమైంది సంశయం పుట్టింటివాళ్ళు ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవడం అరిష్టం కాబోలు - అని.

    "అమ్మా! పుట్టింటివాళ్ళు శాశ్వతంగా ఆడబిడ్డ ఇంట్లో ఉండిపోరాదని అందరూ అంటున్నారు. ఇక్కడ ఆర్నెల్లు, అన్నయ్య గాడింట్లో ఆర్నెల్లు గడపండి...అప్పుడయితే దోషం ఉండకపోవచ్చు" అంటూ కూతురే తెగబడి చెప్పేశాక అక్కడ్నుంచీ ఆర్నెల్లు వెలుపల గడపడానికి బయల్దేరక తప్పలేదు. అయితే కుమారుని వద్దకు వెళ్ళడానికి ఇద్దరికీ ఇష్టం, ధైర్యం రెండూ లేకపోయాయి. అందువల్ల పట్టుగా పల్లె చేరారు. ఆలోపు అడపాదడపా నాలుగు వర్షాలు పడి ఉండడంవల్ల చెరువు సగం నిండింది. నీటికి కొరతలేదు.

    పాడుబడడానికి సిద్ధపడ్తున్న ఇంటిని నానా ప్రయాసలూ పడి బాగు చేసుకున్నా ఇంటికి మునుపటి కళ రాలేదు. సందడిగా తిరిగే మనుషులూ లేరు. అంత పెద్ద ఇంట్లో బరువుగా కదులుతూ ఇద్దరే ఇద్దరు!

    కొద్దో గొప్పో వర్షాలుపడి నేలతల్లయితే శాంతపడింది కానీ తమ చుట్టుపట్ల ప్రాంతాలలో కరువుకాలం తెచ్చిపెట్టిన కార్పణ్యాలు, తిష్ట వేసిన దుష్ట రాజకీయాలు మాత్రం సాగిన నీటితో పాటు కొట్టుకుపోలేదు. సరికదా యథావిధిగా రగుల్తూనే వుండడం బాధాకరం అయింది రామయ్య దంపతులకు. 

    ఏ మార్పులకూ నోచుకోని తమ ప్రాంతపు పల్లెలను పరిశీలిస్తూంటే తన కుమారుడు స్థిరపడ్డ పట్టణం, కుమార్తె నివసిస్తున్న ఊరు కళ్ళముందు మెదలసాగాయి రామయ్యకు.

    నగరాలలో, పట్టణాలలో వీధులు విశాలమవుతూ విస్తరిస్తున్నాయి. దార్ల మధ్య సైతం ఉద్యానవనాలు పెంపొందుతున్నాయి. చీకటంటే ఏమిటో తెలియనివ్వకుండా వీధుల మధ్యన ఖరీదైన దీపస్తంభాలతో విలువైన విద్యుత్ దీపతోరణాలు కనువిందులు చేస్తున్నాయి. వైద్య సేవలకయితే కొరతే లేదు. అతి ముఖ్యంగా పొట్ట చేత్తో పట్టుకు వచ్చి కష్టపడే వారికి ఏదో ఒక పని దొరికి కూలిపాటు లభ్యమయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి.

    నగరాలను బస్తీలను గూర్చి ఇంత శ్రద్ధ తీసుకునే ప్రభుత్వాలు, పాలకులు పల్లెలను కబళిస్తున్న దాహాన్ని, ఆకలిని, చీకటిని గూర్చి పెద్దగా ఆలోచిస్తున్నట్లు లేదు. పైగా రాజీలేని రాజకీయాలు మారుమూల పల్లెలకు సైతం విస్తరించి వినాశకర పరిస్థితులు కలిగిస్తున్నా చేష్టలుడిగి చూస్తున్నాయి.

    అందువల్ల పల్లెప్రజల మనస్తత్వాలలో కూడా విపరీతమైన మార్పులు చోటు చేసుకుని గ్రామీణ జీవితాలలో అభద్రతాభావాలు పెంపొందడానికి అవకాశం కలిగించి మనుషుల మధ్య దూరాలు పెరిగి పోవడానికి ఆస్కారం ఎక్కువవుతుంది. 

    వీటన్నిటి గూర్చి ఆలోచిస్తూ ఆవేదన పడ్తూ ఖాళీగా ఉండలేక తెలిసిన వాళ్ళ గొడ్లను పట్టుకుని తన పొలందున్ని పంటలు వేసే ప్రయత్నాలు మొదలు పెట్టాడు రామయ్య. అయితే మునుపట్లా కష్టపడడానికి ఓపిక లేకపోయింది. ఏళ్ళతరబడి సాగిన పల్లెలోని కరువు, పట్నం రోజులలోని బరువు అతని శక్తిని బాగా హరించాయి.

    పైగా విస్తరిస్తున్న రాజకీయాల పుణ్యమా అని మట్టితప్ప మరో లోకం తెలియని మనుషులలో కూడా అలసత్వం పెరుగుతోంది అప్పటికే. దానికితోడు దాపుల్లోనే వున్న చిన్న టవున్ విస్తరిస్తుండడం వల్ల అక్కడ హెచ్చుకూలీ ముట్టే తాపీ వడ్రంగం పనులు సులభంగా దొరుకుతున్నాయి కష్టం కలిగిన వాళ్ళకు. మరికొద్దిమంది కష్టపడకుండా దళారీ వ్యాపారాల కలవాటు పడిపోయారు.

    ఈ కారణాలవల్ల పల్లెలో సైతం కూలీ రేట్లు బాగా పెరిగాయి. కోరినంతా ధారపొయ్యడానికి రామయ్య సిద్ధపడ్డా కూలికి వచ్చే మారాజులు దొరకకుండా ముఖాలు చాటెయ్యసాగారు. చాలని కొదువకు ఎరువుల ధరలూ చుక్కల్ని చూస్తున్నాయి. అయినా వెరవకుండా ఆరుగాలం కష్టపడ్డాడు రామయ్య.  

       చివరికి పండించిన పంటను ఇంటికి చేర్చుకుని లెక్కలు చూసుకునేసరికి ఖర్చు పాతికా రాబడి పది అని లెక్కలు తేలాయి.

    నేలనే నమ్ముకుని భూమిలోంచి బంగారాన్ని వెలికితీసిన రైతుగా అతనా ఓటమికి తట్టుకోలేక పోయాడు. దిగులుతో చెయ్యీ కాలూ సరిగ్గా ఆడడం మానుకున్నాయి.

    "ఈ సేద్యం ఇంక చాలు...ఇంక చాలు..."అంటూ బట్టలు సర్దడం మొదలుపెట్టింది సీతామహాలక్ష్మమ్మ.

    తమకెంతో ఇష్టమైన సొంత పల్లెలో, తమ ప్రాణమైన తమ ఇంట్లో ఉండడానికి సైతం ఎంద్కో ఆమెకు కాస్త అయిష్టం కలుగుతోంది అప్పటికే.

    ఒకనాడు కళకళలాడిన తమ ఇల్లిలా అయిపోవడం, పిలిస్తే పలికే మనుషులు కరువవడం, అరుదుగా వచ్చి కంపించే వారిలోనూ స్వార్థపు ఆలోచనలు తప్ప మంచితనం మచ్చుకైనా కంపించకపోవడం వంటి కారణాలవల్ల మరికొంత మంచికాలం వచ్చేదాకా ఎటయినా వెళ్ళిపోతే బావుండు నన్పిస్తోందామెకు. రామయ్య పరిస్థితీ కాస్త హెచ్చు తగ్గులతో అలాగే ఉంది. 

    ధాన్యం అమ్ముడైపోవడం ఆలస్యం ఇద్దరూ బయల్దేరి వెళ్ళి మళ్ళీ కుమార్తె ఇల్లు చేరారు. 

    రోజులు సజావుగానే గడిచాయి.

    మళ్ళీ కూతురు హెచ్చరించేదాకా ఎందుకని ఆరో నెల మధ్యలోనే బట్టలు సర్దుకోవడం మొదలు పెట్టింది సీతామహాలక్ష్మమ్మ.

    తిరిగి పల్లె చేరాక పొలం కౌలుకిద్దామని చూశాడు రామయ్య...సేద్యం చేసేందుకు ధైర్యం చాలక! పంట వేస్తామంటూ ముందుకు వచ్చిన నాథుడే లేకపోయాడు. గతంలో రైతు తలకు విలువుండేది...వెల కట్టబడ్తోంది ప్రస్తుతం!!! వర్షాలూ అంతంతమాత్రమే! ఆశాజనకంగా లేవు!! 

    కేవలం నష్టాల్నే తెచ్చిపెట్టే చవుకబారు వ్యాపారంలా తయారయింది ఆ ప్రాంతంలో వ్యవసాయం అప్పటికి. ఆ కారణంవల్లే తమ పల్లె జనాభా సైతం సగానికి పైగా తగ్గిపోయింది.

    అయినవాళ్లూ, ఆత్మీయులూ కొద్దిమందీ వెళ్ళిపోయి ఎక్కడెక్కడో చేరిపోయారు. పిలిచినా పలికేవారు లేకపోవడమే కాదు...పిల్లలు కానీ...వారిపిల్లలు కానీ కరువుతో కరిగిన పల్లెలో అడుగుపెట్టడమే మానుకున్నారు.

    "వంటరితనం చెడ్డదయితే... వృద్ధాప్యం అంతకన్నా చెడ్డది నిజానికి" అని అనుకోసాగాడు రామయ్య.

    అతనికి తరచు భయం కలిగించే ఆలోచనలు అనేకంగా ముసురుకుంటున్నాయి. దాంతో తామెంతో ప్రేమించే ఇంటిని పొలాన్ని కూడా అమ్మేసి ఆ డబ్బుతో కుమార్తె ఉన్న ఊరు వెళ్ళిపోయి అక్కడే ఎక్కడో ఓ చిన్న ఇల్లు కొనుక్కుని కాలం గడిపెయ్యాలని ఆలోచించాడు. కానీ "అమ్మబోతే అడివి...కొనబోతే కొరివి" అన్న సామెత వాస్తవమనిపించిందే తప్ప అందుకూ ఎలాంటి సానుకూలత ఏర్పడలేదు. పొలం పలికిన ధరయితే...ఆ సొమ్ము తీసుకోవడం కన్నా పొలాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చెయ్యడం మంచిదన్పించింది. ఇహ ఇంటికేసి అసలెవరి చూపూ పడనేలేదు. అమ్మకాలకు లెక్కలేనన్ని ఇండ్లున్నాయి మరి!

    పడుతూ, లేస్తూ ఆర్నెల్లు గడిపేశాక బయల్దేరి అల్లుని ఇల్లు చేరారు. కానీ ఈ పర్యాయం మూడు నెలలే సాగింది సజావుగా!

    అక్కడ తమ పెద్ద కోడలితో పొసగకో మరే కారణం చేతో అల్లుని తల్లిదండ్రులు వచ్చేసి కూతురిల్లు చేరిపోయేసరికి అర్థాంతరంగా పల్లెదారి పట్టక తప్పలేదు రామయ్య దంపతులకు. 

    ఈసారి పల్లెలో "ఇలా ఎంతకాలం?" అన్న దిగులు జబ్బు పట్టుకుంది సీతామహాలక్ష్మమ్మకు... ఉడిగిపోతున్న తమ శరీరాలు చూసుకుంటుంటే! లంకంత తమ ఇంటిని కొంత మేరయినా శుభ్రపరచుకునేందుకు ఓపిక లేకపోతోంది ఆమెకు. 

    "ఎవరు ముందో ఎవరు వెనకోగానీ... మన ఇద్దరిలో ఎవరు పోయినా రెండో వాళ్ళగతేమిటి?" అంది ఓరోజు కళ్లనీళ్లతో.

    చలించిపోయాడు రామయ్య. ఆ రోజు నుండీ ఉన్న దిగుళ్లకు తోడు ఆ కొత్త దిగులొకటి పట్టుకుంది ఇద్దరికీ. 

    "మళ్లీ వర్షాలు పడడంలేదు. పడినా నేను సేద్యం చెయ్యలేను. కౌలుకు తీసుకునేవారూ లేరు. మనకా ఇక్కడ పలికే దిక్కూ లేరు. పోనీ మళ్లీ కొన్ని రోజులు కొడుకింట్లో గడిపి చూద్దామా?" అన్నాడు రామయ్య ఓరోజు యథాలాపంగా.

    "అయ్యో రామ! అక్కడికి వెళ్లడంకన్నా ఏ బావో చెరువో చూసుకుని చచ్చిపోవడం మేలు కదా?" అనేసింది సీతామహాలక్ష్మమ్మ.

    అంత వేసారి పోయింది ఆమె మనసు.

    రామయ్య మనసులో ఓ మెరుపు మెరిసింది. 

    ఇద్దరూ కలిసి మరణించగలిగితే...ఒకే పర్యాయం? అది కాస్తా శాశ్వత పరిష్కారం కాదా?? అతని ఆలోచనలో ఆ విషయం పదే పదే చోటు చేసుకుంటూ వచ్చింది.  ఆపై చివరికో రోజు అన్నాడు.

    "సీతా, ఇలా అనామకంగా, దిగులుగా, బాధతో బతకడం కన్నా...ఇద్దరం ఒకే రోజు చచ్చిపోయి మన ఈ మట్టిలో మట్టయిపోతే ఏ బాధా లేదు కదూ?"

    "ఎంత పుణ్యం...అంత అదృష్టానికి నోచుకోగలమా?" అందామె అర్థం కాక.

    "నీవు ఊ అంటే ఆ అదృష్టం మనకు లభిస్తుంది."

    "ఎలా?"

    అతడు చెప్పాడు మరణాన్ని ఆశ్రయించిన రైతులను మననం చేసుకుంటూ...

    అదిరిపోయింది సీతామహాలక్ష్మమ్మ. జ్వరం కూడా వచ్చేసింది, ఆ ఆలోచనల తోటే! ఆ వచ్చిన జ్వరం పాతికరోజులపాటు వదలలేదు. ఆమె తేరుకునే వరకూ రామయ్య పనికూడా చచ్చిన చావయిపోయింది. ఆమె కాస్త కోలుకోగానే అతడూ జ్వరంతో పడిపోయాడు నెలరోజులపాటు.

    కారణమేమిటోగానీ కబురు పెట్టినా కొడుకు రాలేదు. కూతురు కూడా! ఊర్లో వాళ్ళూ, కనీసం ఇరుగు పొరుగులూ కూడా అలాంటి సమయంలోనూ పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం మంచినీళ్ళు రెండు బిందెలయినా తెచ్చి పెట్టే వాళ్ళు కూడా కరువయ్యారు. తాము వెళ్ళి తెచ్చుకునే ఓపికా నశిస్తోంది క్రమంగా.

    ఈ పరిస్థితుల మధ్యన తరచు జ్వరం వస్తోంది సీతామహాలక్ష్మమ్మకు. పక్క టౌన్ డాక్టర్ రక్తహీనత అంటూ రకరకాల మందులు రాశాడు కొంతకాలం. ఆపై అనుమానించి నగరానికి వెళ్ళి రమ్మన్నాడు.

    నగరంలోని అతి నాగరిక ఆస్పత్రిలో అనేక పరిక్షల అనంతరం తేల్చారు ఆమెకు లుకేమియా అని. అదంటే ఏమిటో తెలిసే సరికి ఇక జీవితాలమీద పూర్తిగా ఆశ నశించింది వారికి. అయినా నెలరోజుల పాటు ఆ ఆస్పత్రిలోనే కాపురంచేసి వైద్యం చేయించుకున్నారు.

    కొడుకు కోడలు చుట్టపు చూపుగా ముచ్చటగా మూడుసార్లు వచ్చి కొంత డబ్బు ఇచ్చి తమ డ్యూటీ అయిపోయినట్లుగా ఆపై రావటం మానుకున్నారు.

    కుమార్తె సరేసరి... ఓ పర్యాయం అల్లుడితో కలిసి వచ్చి కాస్సేపు కన్నీరు కార్చి ముక్కు చీదుకుని సెలవు తీసుకుంది.  

     ఆస్పత్రి నుండి తిరిగివచ్చి పల్లె చేరాక...

    "అన్నం పెట్టిన ఇల్లు అడుగంటిపోతుంది" అన్న మొరటు సామెతలా ఆ ఇల్లు ఓ నిశ్శబ్ద నిశీధిలా మారిపోయింది అంత దుఃఖంలోనూ వారు వంటరివాళ్ళయి పోవడం వల్ల!

    కాలానికి దాసరా? కరువుకు దాసరా? అన్నట్లు మనుషులు తమ తమ సమస్యలతో తాము అవస్థలు పడ్తూ పక్కవాణ్ణి గురించి స్పందించడం, ఆలోచించడం, బాధపడడం, సానుభూతి చూపడం మరిచిపోతున్నారు క్రమంగా.

    చాలని కొదవకు రాజకీయ విద్వేషాల వల్ల పెరుగుతున్న అశాంతి మధ్యన మనిషి ఆలోచనలు హరించబడడమో, పక్కదారి పట్టడమో జరుగుతున్నందున ఇక స్పందిచడానికయినా మనిషికి వ్యవధి ఎక్కడుంది?

    తమ జీవితాలలో అసలు సిసలైన దిగులు, నిజమైన దుఃఖం అనుభవించారు రామయ్య దంపతులు ఆ కొద్దిరోజులూ.

    ఉన్న డబ్బంతా ఆమె వైద్యానికి హరించుకుపోయినా ఆమె ఆరోగ్యంలో మాత్రం ఆశాజనకమైన మార్పు రాలేదు. కనీసం సీతామహాలక్ష్మమ్మ ఒంటిమీద చింతాకంత బంగారమైనా లేకుండా పోయింది. వాళ్ళ పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకోలేని స్థితిలో పిల్లలుండిపోయారు. ఎలా మళ్ళీ ఆస్పత్రికి వెళ్ళడం?

    తమ ప్రాంతంలో భూమిని నమ్ముకున్న వారు ఘోరంగా విఫలం అయిపోతున్నందువల్ల తమ పొలం తమకు ఏదయినా ఒరగబెట్టే పరిస్థితులూ కనుచూపు మేరలో కన్పించడంలేదు.

    అయిన వాళ్ళనుకుంటూ ఎవరి దగ్గరకయినా వెళ్ళి సహాయం అర్థించడానికి సంకోచం, అనుమానం, భయం!

    బాధలు పడ్తూ బరువుగా మరికొద్దిరోజులు గడిపాక ఆమెలోనూ మార్పు వచ్చేసింది. "కష్టాలు మనుషులకు కాక మాన్లకొస్తాయా?" అంటూ ధైర్యాన్నిస్తుండిన ఆమె అనేసింది చివరికి...

    "నీవు చెప్పిందే మంచిదనిపిస్తోంది. కలిసి బతికాం...కలిసే వెళ్ళిపోతే ఎంతో మంచిది. నేను లేకుండా నీ గతేమిటి?"

    ఆమె మాటల్లో అతనికెలాంటి స్వార్థమూ కన్పించలేదు.   

* * *    

    ఆకలి తీర్చే ఆహారం, ప్రాణం పోసే మందులు... చివరికి దాహం తీర్చే నీరు కూడా పుష్కలంగా లభ్యం కాకపోవచ్చునేమో కానీ ప్రాణం తీసే పరికరాలకూ, మందులకూ కరువా? ఎటొచ్చీ ప్రాణం తీసే మందు తాగేముందు నరకం చూపిస్తుంది... ఒక్కోసారి మోసం చేస్తుంది కూడా!

    అందుకే అతడు పరికరాన్నే ఎంచుకున్నాడు! 

    వాస్తవానికయితే పరికరాలు పదిమంది వద్దా ఉంటున్నాయి తమ ప్రాంతంలోనే! కానీ ఒక్కరూ బయట పడరు. కనీసం లభించే చోటయినా చెప్పరు.

    చివరకెలాగో సిఫార్సు చేసే మనిషి తాలూకు ఆచూకీ చిక్కింది. కానీ... ఎంత తిరిగినా బతిమిలాడినా అతనికి రామయ్య మీద విశ్వాసం కలుగలేదు. రామయ్య లాంటి మనిషికి ఆయుధం అవసరమేమిటో అతడికి అర్థం కాలేదు.

    అయినా రామయ్య అతణ్ణి వదిలిపెట్టాక ఓపికగా తిరిగాడు. సుఖంగా పోవాలంటే ఆ అయుధానికి మించిన వస్తువు మరొకటి లేదని నామ్మాడతడు అప్పటికే! అందుకే తిరిగి తిరిగి ఆ మనిషికి నమ్మకం కలిగించాడు. దాంతో ఇచ్చే మనిషికి సందేశం లభించింది.

    వ్యయప్రయాసలకోర్చి వెళ్ళి రహస్యంగా తెచ్చుకోగలిగాడు. 

* * *

    మనిషి జీవితంలో అరవై సంవత్సరాలకు వచ్చే పండగ 'షష్టి పూర్తి'. డెబ్బయి సంవత్సరాల ఏడునెలల ఏడు రోజులకు వచ్చేది "భీమ రథి'. ఎనభై మూడు సంవత్సరాల మూడునెలల మూడురోజుల ప్రాంతంలో వచ్చేది 'సహస్ర చంద్ర దర్శనం'.

    ఇలా దంపతుల గమనానికైతే పండుగలు, పర్వదినాలు వరుస క్రమంలో ఉన్నాయి. కానీ 'మరణం' అనే మంచి కార్యానికి మాత్రం ప్రతిక్షణం సుముహూర్తమే అని భావించాడు రామయ్య. కానీ... భీష్మ ఏకాదశినే ఎన్నుకున్నాడు.

    ఆనాడు ఇద్దరూ తలస్నానాలు చేసి గ్రామదేవత గంగమ్మ గుడికి వెళ్ళారు.

    తిరిగి వచ్చేటప్పుడు తమకెంతో ప్రాణమైన తమ పల్లెను తదేకంగా చూసుకున్నారు.

    ఇంట్లోకి ప్రవేశించే ముందు కూడా ఆకాశంకేసి ఆశగా చూశాడు రామయ్య! కానీ... చాలా నిరాశాజనకంగా నిర్మలంగా ఉంది ఆకాశం... ఎక్కడా ఒక్క చిన్న మబ్బు తునకయినా లేకుండా.

    తలుపులు మూసేసి హాల్లోకి వచ్చి...

    "నిశ్చింతగా కూర్చుని కళ్ళు మూసుకుని దేముణ్ణి తలచుకో...ఇక మనకే బాధాలేదు" అన్నాడు.

    ఆమె ఆపనే చేస్తోండగా తెచ్చుకున్న పరికరాన్ని ఆమె కణతకు ఆనించి ప్రయోగించాడు వణుకుతున్న చేతివేళ్ళతోటే.

    అడవిలోకన్నా పెద్ద శబ్దంతో పేలింది పరికరం. కిక్కురుమనకుండా పక్కకు పడిపోయింది ఆమె. 

    'ఒక పని అయిపోయింది' అనుకుంటూ ఆ వెంటనే తన కణతకు ఆనించుకుని కళ్ళు మూసుకుని మరో మారు ప్రయోగించాడు.

    భయంకరమైన శబ్దం రాలేదు!!!

    'టుప్' మన్న శబ్దం మాత్రమే వచ్చింది!

    ఉలిక్కి పడ్డ రామయ్య కళ్ళు తెరిచాడు.

    'ఇదేమిటి?'అనుకుంటూనే మళ్ళీ కణతకు ఆనించుకుని మూడు నాలుగు పర్యాయాలు ప్రయోగించాడు కళ్లు మూసుకోకుండా...

    "టుప్...టుప్..." మని శబ్దం వస్తోందే తప్ప ప్రయోజనం లేకపోయింది. 

    నోరు తడారిపోయింది. శరీరమంతా చమటలు దిగకారి పోసాగాయి గబగబా. ఇంటి వెలుపల మనుషులు గుమిగూడుతున్నట్లు మాటలు వినపడ్తున్నాయి. ఎవరో తలుపు తడ్తున్నారు...

    'అయ్యో! అదెల్లిపోయి నేనుండిపోతే ఎలా?' అనుకుంటూ భార్యలో ఇంకా ఎక్కడైనా ప్రాణముందేమోననే ఆశతో పరీక్షగా చూశాడు. 

    కాల్చిన కణతమీద చాలా చిన్న రంధ్రమే. రక్తం ఓడుతున్నది. కానీ...అవతలివైపే తల పగిలిపోయి, మెదడుకూడా కొంత వెలుపలికి వచ్చి పరమ భయానకంగా చచ్చిపోయుంది సీతామహాలక్ష్మమ్మ... ఎర్రని ఎరుపు మడుగులో...

    "ఓరి దేవుడో" అనుకుంటూ పరికరాన్ని తలకానించుకుని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు.

    "టుప్... టుప్... టుప్..."మంటోంది పరికరం. అంతే!  ఎవరో తలుపులు పగలగొడ్తుండగా స్పృహ తప్పి భార్య శవం మీద పడిపోయాడు రామయ్య.  

* * *

    దారి చూపిన మనిషికీ, ఇచ్చిన మనిషికీ చెప్పిన మాట మాత్రం తప్పలేదు రామయ్య.

    పోలీసులు ఎన్ని వందలసార్లు ప్రశ్నించినా..."నా చిన్న తనం నుండీ కూడా అదీ అటకమీది చెక్క పెట్టెలోనే ఉంది. తాతదో తండ్రిదో నాకే సరిగ్గా తెలియదు. కానీ పెద్దవాళ్ళకు తెలియకుండా చిన్నతనంలోనే రహస్యంగా దాన్ని ఉపయోగించడం నేర్చుకున్నాను" అంటూ ఓ కట్టుకథ నమ్మకంగా చెప్పి అవతలి వాళ్ళ ప్రస్తావన లేకుండా చేయగలిగాడు.

    పని చేయకుండా పోయిన చిలుంపట్టిన పరికరం, తుప్పుపట్టిన తూటాలూ అతని మాటలకు వాస్తవ రూపాన్నిచ్చాయి. 

    పోలీసు కేసు నడిచినన్నాళ్ళూ ఒకే ఒక ఆశ ఉండేది రామయ్యకు... తనకు ఉరి లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడ్తుందని!

    అందుకే తన ముఖం చూడడానికి కూడా ఎవరూ రాకపోయినా ధైర్యం కూడగట్టుకుంటూ గడిపేశాడు.

    కానీ జడ్జి మోసం చేసాడు.

    "ఎక్కడ్నుండీ ఎక్కడికి పోతున్నాడు మనిషి?" అంటూ ప్రారంభించి, మానవతా విలువలు...చరిత్ర...నాగరికత...సమాజం...పరిస్థితులు...సంస్కరించడం...ఇలా ఏవేవో పెద్ద పెద్ద మాటలన్నీ చాలా ఎక్కువగా మాట్లాడి, శిక్ష మాత్రం చాలా తక్కువ వేశాడు.

* * *

    నిశ్శబ్దం...

    జైలుగోడల మధ్యన అరచీకటి గదులలో ఎక్కువగా రాజ్యమేలే భయానక నిశ్శబ్దం...చాలా నిముషాలుగా.

    అప్పటికే వెన్నల కిరణాలు తమ మధ్య నుండీ మాయం అయిపోయి ఉండడం వల్ల ఏనాడూ కంటతడి పెట్టని దానయ్య కంట్లోంచి రాలిన కన్నీటి చుక్కలు రామయ్య కంట పడలేదు.

    కానీ...

    'స్ప్రింగు తెగిపోయుంటుంది. అయితే... ఎప్పుడూ అలా జరిగింది లేదూ అంటూ అతడు సణుక్కోవడం మాత్రం అస్పష్టంగా వింపించింది.

    పది నిమిషాల తరువాత...

    "నీవెప్పుడు బయటకు పోతావు?" నిశ్శబ్దాన్ని చీలుస్తూ రామయ్య ప్రశ్నించాడు.

    నెమ్మదిగా నిట్టుర్చి తను ఎప్పుడు విడుదల అయ్యేదీ చెప్పాడు దానయ్య.

    "అలాగా! నీవు పోయాక ఆర్నెల్లకనుకుంటాను...నేను బయటకు వచ్చేస్తాను. తరువాత డబ్బు తీసుకుని నీ దగ్గరకే వస్తాను మళ్ళీ! అప్పుడయినా మోసం చెయ్యని, చిలుం పట్టని తుపాకీనివ్వు" అన్నడు రామయ్య.

    చీకట్లో అతని స్వరం అదోలా విన్పించింది. అరనిముషం తరువాత చిన్నగా ఉలిక్కి పడ్డాడు దానయ్య.

(విపుల మాసపత్రిక మే 2008 సంచికలో ప్రచురితం) 
Comments