ఎవరి 'షుర్మా'కెవరు కర్తలు - అవసరాల రామకృష్ణారావు

    
నీతిబోధ అంతటి నికృష్టపు పని మరొకటి లేదని ఎప్పుడు అనుకునే వాణ్ణి. ఎందుకంటే ఆ చెప్పే నీతి ముందే మనం ఆచరించి చెప్పాలని ఎక్కడా లేదు. ఇక మనం చెప్పింది విన్న శ్రోత దాన్ని తప్పక ఆచరించి తీరుతాడని మనకెలాగా నమ్మకం ఉండదు. ఇక ఎందుకు చెప్పండి, కంఠశోష తప్ప? అయితే రాజకీయ నాయకుల్లో కూడా పెద్దమనుషులున్నట్టు మన హితోపదేశం కూడా ఒక్కొక్కప్పుడు స్వప్రయోజనకారి కావచ్చు.  

    అలా నాకు జరిగింది కాబట్టే మీతో చెప్పడం.     ఇలాంటిదే ఇంకోవిషయం కూడా దీనికి జోడించి చెబితే నా అనుభవం మీకు పూర్తిగా అర్థమౌతుంది.

    సానుభూతి అంటారు చూశారూ, అదంటే నాకు పరమ ఒళ్ళుమంట. అయితే దాన్నికూడా పూర్తిగా కొట్టిపారేయనక్కర్లేదు. ఒకరి సానుభూతి మన స్వీయ రసానుభూతిగా కలసిరావచ్చు!

    అలా అనుభవించాను గనకనే, మీకు వివరించడం.
    ఇక హస్కు చాలించి అసలు కథలోకి దిగుతాను. 

    అప్పటి విదేశీ ప్యాకేజీ టూరులో నమోదు చేయించుకున్న పదిమంది హనీమూన్ జంటలతో పాటు విడిమనుషులం మేం ముగ్గురమే. నేనూ, రాజూ, శీనూ. పాతికేళ్ళకి కాస్త అటూఇటుగా వాళ్ళుంటే రిటైరై రెండేళ్ళు దాటిన వయసునాది.  తొలిచూపులోనే రాజుకి నా ఆకారం చూసి ఓ విధమైన హేళనా, శీనుకి పెద్దవాళ్ళంటే ఆరాధనా కనిపించాయి. ఏదో చెప్పేను కానీ ఎవరేమనుకుంటే నాకేం. నన్ను నేనుగా కాపాడుకోగల దక్షత నాకుంది. కాదు, అవును ఈ మధ్యనే లభించింది! అవును, ఆర్థిక స్వేచ్ఛే అసలైన స్వేచ్ఛ అని మా ఆవిడ పోయిన తర్వాతే కదా నాకు తెలిసింది! తక్కిన సుఖాలు ఎన్ని సమకూర్చుతేనేం పైసా ఖర్చు పెట్టకుండా తొక్కి పెట్టేది. పంజరం వీడి ఏడాదై తానెక్కడికి ఎగిరిపోయిందో తెలీదుగాని నాకు మాత్రం బంధవిముక్తి కలిగింది అప్పుడే!! ఇంత మోటుగా చెబుతున్నందుకు నేనేం సిగ్గుపడటం లేదు. కూడబెట్టింది, కుదువబెట్టింది అదేం కట్టుకుపోగలిగిందా? అన్నీ నాఖే వదిలిపెట్టక తప్పలేదు కదా! అప్పుడే కదా అంత ఆస్తి మీద నాకు అధికారం దక్కింది! అది దక్కాకే కదా నేనెవరో నాకు తెలిసుకొచ్చింది! ఇప్పుడింత ఖరీదు పెట్టి ఫారిన్ ట్రిప్ టికెట్ కొన్నానంటే ముందుగా అది 'విమానం' ఎక్కేయడం వల్లనే కదా!  

    ఆస్తి ఖర్చు పెట్టగలిగే అంతస్థు అందరికీ అందదు. అది తెలిశాక బంధువులందరూ బెల్లం చుట్టూ చీమల్లా చేరడం సహజమే. ఎవరో ఎందుకు, ఉన్న ఒక్క కూతురే దానిమీద కన్నేసింది. 'వచ్చి నా దగ్గరుండ'మని ఓ వంద సార్లయినా చెప్పి ఉంటుంది. నేను కొరకబడక పోతే అల్లుణ్ణి ఉసిగొల్పింది.

    "అత్తగారు మిమ్మల్ని ఒంటర్ని చేసి వెళ్ళిపోయారు. మీకింక ఎవరున్నారని? మిమ్మల్ని తలుచుకుని మీ అమ్మాయి కంటికీ మింటికీ ఏకధారగా ఏడుస్తోందంటే నమ్మంది. దగ్గరుండి అన్ని తీసుకువెడదామని ఏర్పాట్లూ చేసుకు వచ్చాను. ఇక కాదనకండి. ఈ వయసులో ఎలా బతుకుతారు?"

    ఈ దొంగ సానుభూతి కబుర్లు ఎవరెరుగరని! ఓ జీవితకాలం నరకమే అనుభవించాను. ఇక దీని ప్రతినిధి దగ్గరా నా రోజులు వెళ్ళదీసుకునేది! ఇంతకీ నా వయసు ఏం ముదిరిపోయిందని? చెప్పాలంటే నాకు వయసొచ్చినట్టు అనిపిస్తున్నది ఇప్పుడిప్పుడేకదా!

    ఇక మొహమాటమెందుకని పైకిలా కక్కేశాను. "చూడమ్మా అల్లుడూ! ఎప్పుడో నేను నిశ్చయించేసుకున్నాను. అమ్మాయితో పదే పదే చెప్పేను కూడా. బ్రహ్మరుద్రాదులొచ్చినా నన్నిక్కణ్ణుంచి కదిలించలేరు. వచ్చి పిలిచేవు థాంక్సు. మళ్ళీ వచ్చి పిలవక పోతే మరింత థాంక్సు. ఇంకా నాకు ఇల్లుంది. సుఖపడాలనే థ్రిల్లుంది. ప్రతినెలా ఇన్నిన్ని పచ్చనోట్లు జేబులో వచ్చిపడే పెన్షను సదుపాయం అనేది బతికినన్నాళ్ళు ఉంటుంది. నాగురించి ఎట్టి విచారమూ పెట్టుకోవద్దని అమ్మాయికి చెప్పు. ఇక నువ్వు బయల్దేరొచ్చు." అతను వెళ్ళిపోతూ "ఎవరికర్మకెవరు కర్తలు!" అని గొణుక్కోవడం నాకు వినిపించక పోలేదు. ఇప్పటికైనా నా కర్మకు నేనే కర్తననే వెసులు బాటు దొరికింది. దానిలో ఒకరి చెయ్యి పెట్టనిస్తానా!  

    ఈనాటి ఈ ఫారిన్ ట్రిప్‌లో జతపడిన ఈ కుర్ర కుంకలా నన్ను అంచనా వేసేది! ఒకడు చీదరిస్తే నేం. మరొకడు మర్యాద యిస్తే నేం. మా స్థాయి మేం ఎరుగమా! అయితే ఈ ఇద్దరి కుర్రాళ్ళతోనే నా అనుభవం ముడిపడి ఉంది కనుక ఇంతగా పాత సంగతులు బయట పెట్ట వలసి వచ్చింది. రాజు అనే కుర్రాడికి ఇంకా పెళ్ళి కాలేదుట. అదాట్టే అవసరం లేదన్న ధీమంతుడు. ఆ తీరులోనే ఉండేది అతగాడి తిరుగుడు.

    ఇక నాకేమాత్రం తీరిక దొరికినా శ్రీనివాసరావు తోనే సరిపోయేది. విడిగాళ్ళమని మాకు ముగ్గురికీ ఓ రూం ఎలాట్ చెయ్యడం కాదుగాని శీను సొదతో నా చెవులు హోరెత్తేవి. 

    శీనుకి ఆరునెలలై రాధ అనే అమ్మాయితో పెళ్ళయిందట. అసలు ఈ హనీమూన్ ట్రిప్‌లో వాళ్ళ జంటా ఉండి ఉండేదట. ఆఖరి క్షణంలో రాధ డ్రాపైపోయిందట. వాళ్ళ నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలిసి ఉండి పోవలసి వచ్చిందట.

    "ఏమిటో అంకుల్. నేనొక్కణ్ణే యిలా బయల్దేరి రాక పోవలసింది. అనవసరంగా కంగారు పడి ఉండి పోయిందిగాని అదేమంత ప్రమాదకరమైన స్ట్రోకు కాదట. ఫ్లైటు దొరకడాన్ని బట్టి కౌలాలంపూర్‌లో గాని సింగపూర్‌లోగాని నన్ను కలుస్తానంది. ఆ అదృష్టమైనా ఉందో లేదో! పట్టయ్యా బీచి ప్రకృతి అందాలు అయిపోయాయి కదా! కోరల్ ఐలాండులోని వాటర్ స్పోర్టులో కపుల్స్ కోసం ఓ పోటీ నిర్వహించారు. మేమందులో పాల్గొనలేక పోయాం కదా! మీ కళ్ళల్లోని ఆప్యాయత నన్నింకా యింకా చెప్పుకోమని ప్రోత్సహిస్తోంది. ఏదైనా సగం సగం పంచుకొనేటంత దగ్గరి వాళ్ళం మేం."

    "ఒకర్ని ఒకరు శక్తి కొద్దీ దిగమింగడం తప్ప సంసారంలో సగం సగం ఎక్కడుంటుందిరా వెర్రిమొగం!" 

    అని నేననుకుంటున్నానని తెలిసే అవకాశం వాడికి లేదు. వాడి ధోరణికి అడ్డుకట్ట వేసే ఛాన్సు నాకివ్వకుండా ఎంతో ఉత్సాహంతో, ఉద్రేకంతో అదే చెప్పుకు పోవడం! "నా వేదన వినే పెద్ద మనసున్న వారు, మిమ్మల్ని విసిగించడం లేదనుకుంటాను. ఏదైనా సరిసమానంగా పంచుకునే అపురూప దాంపత్యం మాది. బ్రెడ్ స్లైసెస్ అయినా లెక్కపెట్టుకుని చెరో సగం తీసుకోవలసిందే. ఏ పండయినా హెచ్చుతగ్గులు లేకుండా సరిగ్గా రెండుముక్కలు చేసుకోవలసిందే. ఆఖరుకి నోట్లో వేసుకునే స్ట్రాంగ్ బిళ్ళయినా సగానికి సగం చప్పరించి అవతల నోటికి అందించవలసిందే!" 

    అలా వాడు చెప్పుకు పోతుంటే వినీవిననట్టు చూస్తూ తలకిందకి దించుకుని కండువా చివరితో మొహం తుడుచుకున్నాను. ఆస్తి చేజిక్కాక వేషభాషల్లో కుడా కొంత మార్పు తెస్తే లాభసాటిగా ఉంటుందని సమాజాన్ని చూసి నేర్చుకున్నాను. అప్పట్నించీ ఇదిగో ఇలా పంచె, లాల్చీ విధిగా కండువా. కోడెవయసు కోరికలు లోలోపల జ్వలిస్తున్నా పైపైకి ఉన్న వయసుకంటె ఎక్కువ ఉన్నట్టు భ్రమ కలిగిస్తే ఎవరైనా చెయ్యి అందిస్తారు. అప్పుడప్పుడు అది ఆడ చెయ్యి కూడా అయి ఉంటే అదో అదనపు సౌకర్యం.అందుకే తలకు రంగు వేసే పిచ్చిపని పెట్టుకోలేదు. దాని అవసరం లేకపోయినా కర్ర పట్టుకు తిరుగుతాను. ఇంకా సీనియర్ సిటిజన్ కాకపోయినా ఆ కన్సెషన్ పొందుతూ ఏడాదై రైలు ప్రయాణాలు చేస్తున్నాను. పెద్దమనిషి వేషంలో సుఖమెంతుందో అనుభవించిన జ్ఞానులకుగాని అర్థం కాదుకదా!
 "వయసు పైబడినా కుర్రాళ్ళలో కుర్రాడిలా మీరు మాతో కలిసి పోతున్నారు. మా నాన్న గారి దగ్గర ఇలాంటి పర్సనల్ విషయాలు బయట పెట్టలేను కదా! ఇంతకీ రేపు రాత్రయినా రాధ నన్ను కలిసే అదృష్టం ఉంటుందో ఉండదో."
    అయితే ఆరాత్రికే సగం సగం అని వాడు చెప్పుకుంటున్న వారి దాంపత్య శోభ బలం ఏపాటిదో రుజువు చేసే సంఘటన ఒకటి జరుగుతుందని ఆక్షణం నేననుకోలేదు!
    అది మేం థాయ్‌లెండ్ చేరిన రెండో రోజు. మర్నాటి తెల్లవారు ఝమునే మకాం ఎత్తేసే ఏర్పాటు. చెప్పేను కదా జంటలు మాతో కలవరనీ, ఆ రాజుగాడు ఎప్పుడు మారూంకి వస్తాడో మాకే తెలీదనీ. ఇక స్త్రేంట్ బెడ్ ఫెలోస్‌లా నేనూ, శీనూ మిగిలాం. నేను కర్రపోటు వేసుకుని ఆయాసం నటిస్తుంటే శీను నా బ్యాగు మోసేవాడు. 

    ఆరాత్రి బుద్ధా టెంపుల్ చూసివచ్చి డిన్నరు పూర్తి చేసి రూం చేరేసరికి ఏ పదకొండయిందో.  

    "కొంత వయసు దాటాక నిద్రయినా సరిగా పట్టి చావదు కద. చూడమ్మా శీనూ, ఆ బల్ల మీద చిన్న డబ్బాలో నిద్రమాత్రలుంటాయి. కూడా తెచ్చుకుంటాను. ఎందుకైనా మంచిదని. ఆ డబ్బా కాస్త ఇలా యిస్తావూ!" అన్నాను.
    శీను ఆడబ్బా నాకు అందించాడు. అందుకున్నాను గాని ఎప్పుడో అవసరం వస్తే తప్ప వేసుకోను. బాగా పవర్‌ఫుల్ మాత్రలవి. ఓ అరగంట గడిచాక చూద్దాం అనుకొని రగ్గు ముసుగెట్టి ఇటు తిరిగి పడుకున్నా. టెంపుల్ మెట్లెక్కి వచ్చిన అలసటో ఏమో ఓ పట్టాన నిద్ర పట్టలేదు. చేతనున్న రేడియం వాచీ ముళ్ళు పన్నెండున్నర అయ్యిందని సూచిస్తున్నాయి. ఇక లాభం లేదని దగ్గర పెట్టుకున్న డబ్బా వైపు చెయ్యి జాపబోతే రాజు వచ్చిన అలికిడయ్యింది. ఆ స్టార్ హోటళ్ళ గదులకి తాళాల బదులు ఎలెక్టానిక్ లోహపు రేకుల్లాంటివి మా ముగ్గురికీ మూడు ఇచ్చారు. తలుపు దగ్గిర స్లిట్‌లో అమరిస్తే తలుపు తెరుచుకుంటుంది. వస్తూనే రాజు తెచ్చిన భోగట్టాతో మరి నిద్ర అవసరం లేదనిపించింది. చాచిన చెయ్యి వెనక్కి తీసుకుని గాఢ నిద్ర నటించాను.

    రాజు సుఖాన్వేషి. కార్యవాది. ఒకప్పటి క్లాస్‌మేట్ అయిన శీనుతోనే ఆట్టే మాట్లాడడు. అలాంటిది నిద్రలోకి జోగుతున్న శీనుని లేపి కూర్చోబెట్టి చేసిన బోధ వింటూంటే అంత చలిలోనూ నాకే వేడెక్కింది.
    రాజు ఆ చుట్టుపక్కల గల ఓ మసాజ్ సెంటర్లో మజా అనుభవించి వచ్చాడట. పేరుకి మసాజు అయినా అక్కడ రివాజుగా జరిగేదేమిటో అందరికీ తెలుసు. అంతకు ముందే అనేక సృంగార రసానుభూతులు చవిచూసిన రాజుకే ఆ స్థాయి హాయి చూశాక "మర్రోజు మరెందుకు?"అనిపించిందట. ఇంకా ఇలా చెప్పేడు.

    "మన లాంటి యువకులం ఇంతదూరం ఎందుకొస్తాం బోలెడు డబ్బు ఖర్చు పెట్టుకుని. రంగు రంగు చిలకలు మనప్రాంతంలో లేవనే! వీళ్ళ టెక్నిక్ ఓసారి రుచి చూస్తే మగపుట్టుక పుట్టాలే గాని, ప్రతి ఏడాది ఇలా పరిగెత్తుకు రానూ! మన వైపు సెక్సు అనేది ఆయా దేహ ప్రాంతాలకే పరిమితం. ఇక ఇది? శరీరమంతా పరుచుకుని ఉన్న చర్మంలోని అణువణువూ అన్య శరీర స్పర్శతో మైమైకం పొందే మధురానుభూతి! మన భాష కాదు, మనకు తెలిసిన మొహం కాదు, మళ్ళీ మనం జన్మలో కలుసుకుంటామనే గ్యారెంటీలేదు. అయితేనేం? ఆ కాస్సెపయినా శరీరభ్రాంతి పోగొట్టి కాంతిమయం చేసే ఆ నువెచ్చదనం ఎవరిస్తేనేం, ఎంత వెచ్చిస్తేనేం?"  

    పోటెత్తిన పొటెన్షియల్ ఉందిగానీ ఆ రాజు గాడికి ఇంత ఎక్స్‌ప్రెషన్ టాలెంట్ ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. పైగా నామీద చురకలు కూడా వేశాడు దొంగగాడిద!

    "ఎంతసేపూ ఆ ముసలాడితో గుసగుసలు తప్ప నీకేం పనున్నట్టులేదు. అన్నీ ఉడిగిన ఆ ధోవతీ గాడితోనా నీ దోస్తీ! ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకోకపోతే మగతనం మగతలోకి జారిపోగలదు జాగ్రత్త! ఆ వృద్ధ జంబుకంలా గాడి తప్పిన మగాడివి కాదుగనక నీకో సలహా. ఇదొగో ఆ మాసేజింగ్ సెంటరు కార్డు. వెంటనే ఫోన్ చేసి అపాయింట్‌మెంటు వెంటనే ఫిక్స్ చేసుకో. వాళ్ళు రాత్రి తెల్లవార్లు ఉంటారు. నీ నంగనాచి మొహం చూస్తే ఇలాంటి వాటికి మొహంవాచి ఉన్నావని స్పష్టంగా తెలుస్తోంది. జెట్ స్పీడుగ రంగంలోకి దిగక నీకేం జబ్బా! నీతులన్నీ నిలువెత్తు గోతుల్లో కప్పెట్టడానికే కదా పుట్టింది. ఇక ఆలోచించకు. నాకు నిద్దరొస్తోంది. బెస్ట్ ఆఫ్ సెక్స్ ఎక్స్‌పీరియన్స్" అంటూ సైడ్ వింగ్‌లోకి జారబడి పక్కేశాడు రాజు. అయిదు నిమిషాలు దాటకుండా గుర్రెట్టి నిద్రపోయాడు.  

    నేనా ముసుగులోంచి శీను కదలికలు గమనిస్తూనే ఉన్నాను. హుషారుగా ఉన్నప్పుడు ఈల వేస్తూ పనులు చేసుకోవడం అతనికలవాటు. దాన్ని బట్టి కూడా అతని మూమెంట్సు అక్కణ్ణుంచే ఫాలో అవడం నాకు సుళువైంది.

    శీను వేణ్ణీళ్ళ టబ్ స్నానం ముగించాడు. ఒళ్ళంతా ఫారిన్ టాల్కమ్, సెంటెడ్ స్ప్రే కొట్టుకొన్నాడు. తెల్లటి ఇస్త్రీ మడతల్లోకి మారిపోయాడు. పైజామా జేబునిండా విదేశీ నోట్ల కట్టలు కుక్కుకున్నాడు. టెలిఫోన్ క్రెడిలు ఎత్తబోయాడు. నేను సమయానికి అక్కడ చేరి ఆ చెయ్యి పట్టుకున్నాను. ఊహించని ఈ పరిణామానికి తృళ్లిపడ్డాడు.

    "మీరు నిద్రపోలేదా సార్?" అన్నాడు వణుకుతూ. బాల్కనీలో లైటు వేసి అక్కడికతన్ని లీడ్ చేశాను. ఆ పెద్ద బల్లకి అటూ ఇటూ కుర్చీలో కూర్చున్నాక నేను మొదలెట్టేను.

    "నిద్ర పట్టలేదయ్యా... శీను! మీ ఫ్రెండు చేసిన హడావిడితో ఎక్కడి నిద్ర అక్కడ ఎగిరిపోయిందనుకో"
    "అంటే మీరు?"

    "రాజు నీతో చెప్పిన మసాజు విషయం ప్రతిముక్కా నా చెవిన పడింది. దానిమీద నా అభిప్రాయం చెబుదామనే పిలిచాను. మసాజు చేయించుకోవడానికే కదా నీవూ ముస్తాబు? ఫీజెంతో కనుక్కున్నావా? నీదగ్గరున్నది చాలకపోతే ఆత్మీయుణ్ణి నేనున్నాను సుమా! ఆ కారణం చేత విత్‌డ్రా అవుతావేమోనని డిస్టర్బ్ చేశాను. ఇదిగో ఈ సొమ్ముకూడా తీసుకో."  

    పట్టుబడిన కన్నపు దొంగలా అతను మొహం దించేశాడు. చెయ్యి పట్టుకు చూస్తే అంత చల్లని వేళా అతని అరచేతిలో చిరుచెమటలు!     "నా పెద్దరికం మీద నీకేమాత్రం గౌరవమున్నా ఒక్క విషయం అలోచించు. చెప్పనా?"

    "ఏముంది, మసాజ్ సెంటర్‌కి వెళ్ళొద్దంటారు. అంతేకద!"     "అదేం కాదు. వెళ్ళమనే కదా చాలకపోతే డబ్బిస్తానని చెప్పేను! అయితే దాంతో పాటు మరొకటి నువ్వు చెయ్యాల్సి ఉంది. చేస్తానని మాట ఇవ్వు."     "ఇంతటి సిగ్గుచేటు పని తలపెట్టాక, ఇప్పుడు మీరు వెళ్ళమంటే మాత్రం, వెడతానని ఎలా మాట ఇస్తాను?"     "అది కాదు. నేను చెప్పింది పూర్తిగా విను. రాధ అనే అమ్మాయి ఎవరో, అదే నీ భార్య, మహా అదృష్టవంతురాలు. మీరిద్దౌ ఎంతగానో ప్రేమించుకుని ఉండకపోతే ఇంతగా మీ అనురాగ శోభ పరాయి వ్యక్తికి, అందునా ఓ వయసు కాని వాడికి, చెప్పుకుని తరించి ఉండవు. ఏ అనుభవమైనా మెమిద్దర చెరిసగం పంచుకుంటామని నువ్వు చెప్పిన ఆ తీయని భావన ఏ జంటకయినా ఆదర్శప్రాయం. ఆ భావన చెడకుండా ఉండేందుకు నేనో సలహా ఇవ్వదలచుకున్నాను. మరెలాంటి ఫోన్ చేసి ఆఘమేఘాలమీద రప్పిస్తావో, మీ రాధని వెంటనే ఇక్కడికి రప్పించు. ఇంత గొప్ప మసాజు మాధుర్యాన్ని నువ్వొక్కడివే అనుభవించే స్వార్థం నీకు ఉందనుకోను. మసాజు సుఖం అందించే మహరాణులు మగవారికి ఎలా ఉంటారో, ఆడవాళ్ళకి కూడా అలాంటి సుఖం ప్రసాదించే మగధీరులు ఉండకపోరు. వాకబు చేసి, మన జేబు మనది కాదనుకుంటే, ఆ సెంటర్‌లోనే దొరుకుతారు. నిజంగా నీ అర్థాంగితో అన్నీ పంచుకొనే వాడివే అయితే కట్టుకున్నదానికి కూడా అలాంటి సుఖం అందించటం ఆదర్శ భర్తగా నీ బాధ్యత."     "సార్, అంకుల్" అన్నాడు హీన స్వరంతో, బట్టలు మార్చుకుంటూ.

    "చూడు శీను. ఈ నీతిబోధ కేవలం యాక్సిడెంటల్. నేనుంటాను, ఉండకపోతాను. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. కట్టున్న ఆడదానితో కట్టి ముడేసుకోవలసింది మనసు. మరేం కాదు. నీ ఆలోచనని అల్లకల్లోలం చేసి పారేసినట్టున్నాను. ఇక నీకు నిద్ర పట్టడం కష్టం. ఇదిగో నాదగ్గరున్నాయి. రెండు వేసుకో. మరేం ప్రమాదం లేదు. నేను వేసుకుంటాను" అంటూ మంచినీళ్లిచ్చి మాత్రలు మింగించాను. ఓ అరగంటలో శీను నిద్రలోకి జారుకున్నాడు.     నన్నో ముసలిముతకగా జమ కట్టినందుకు వీళ్లకిలా మిగలవలసింది పడుచు గురకలే! వీళ్లు మేలుకుని ఉన్నా బరితెగించటానికి నాకైతే అభ్యంతరం లేదు కాని నా పెద్దమనిషి బురఖా ఏంగాను!     ఇక నిద్రపోవలసిన అవసరం నాకేముంది! వెంటనే మసాజ్ సెంటర్‌కి లైట్నింగ్ కాల్ బుక్ చేశాను. తక్షణం ఎపాయింట్‌మెంట్ బుక్ చెయ్యమని, ఎంతైనా ఫరవాలేదని! 

(నవ్య వీక్లీ దీపావళి ప్రత్యేకసంచిక 2009లో ప్రచురితం)
 

      

    

   

    

Comments