ఎవరు బాధ్యులు? - ఎం.వెంకటేశ్వరరావు

    
సమయం ఉదయం పదకొండు గంటలు. హైటెక్ సిటీ దాటాక కొండాపూర్ రోడ్‌లో ఉన్న ఓ మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పృథ్వి - హెచ్ఆర్ హరిత, టీంలీడర్ శ్రీధర్‌లతో ప్రాజెక్ట్‌వర్క్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఆ సమయంలో పృథ్వి ఫోన్ రింగయ్యింది. నంబరు చూసి కట్‌చేసి క్యూరియస్‌గా వింటున్నాడు. రెండు నిమిషాల్లో మళ్లీ ఫోన్ మోగింది.

    "ఎక్స్‌క్యూజ్‌మి..." అంటూ కొంచెం పక్కకెళ్ళి...    

    "హూ యీజ్ దిస్?"

    "పృథ్వి గారేనా?"

    "యా... స్పీకింగ్"

    "సార్... నేను మీరుంటున్న అపార్ట్‌మెంట్ సెక్రెటరీ రామ్మోహన్‌ని మాట్లాడుతున్నాను. మీ ఫ్లాట్‌లో వాటర్ ట్యాప్స్ క్లోజ్ చెయ్యలేదను కుంటాను. మీ ఇంట్లో నుంచి నీళ్లు బయటికొచ్చి, స్టేర్‌కేస్ నుంచి సెల్లార్‌లోకి వస్తున్నాయి."

    "ఓ... షిట్... సారీ! నేను మీటింగ్‌లో ఉన్నాను. ఎనీ ఆల్టర్నేటివ్?"

    "మీ ఇంటి డూప్లికేట్ కీస్ మన అపార్ట్‌మెంట్‌లో ఎవరి దగ్గరైనా ఉంచారా?"

    "నో... లేదు సార్! నా దగ్గరొకటి, నా మిసెస్ దగ్గరొకటీ ఉన్నాయి"

    "అయితే మీ ఇద్దర్లో ఎవరో ఒకరు అర్జంటుయ్గా రావాల్సిందే"

    "వాటర్ ట్యాంక్ కనెక్షన్ క్లోజ్ చేసే వీల్లేదా?"

    మన ఫ్లాట్స్‌లో ఇండివిడ్యువల్ వాటర్ లాకింగ్ సిస్టం లేదు. మెయిన్ కనెక్షన్ మూసేస్తే... మిగిలిన పధ్నాలుగు ఫ్లాట్స్ వాళ్లూ సఫరవుతారు. ఇప్పటికే సెకెండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వాళ్లు  గొడవ చేస్తున్నారు. త్వరగా రండి..."

    "ష్యూర్ సార్!" అని ఫోన్ ఆఫ్ చేసి, భార్య ధరణికి ఫోన్ చేశాడు.

* * *

    "ఊ... చెప్పు పృథ్వీ"

    "ఇంట్లో వాటర్ ట్యాప్స్ క్లోజ్ చెయ్యలేదా?"

    "ఓ... షిట్... రాత్రి కరెంట్ పోయిందిగా... ఉదయం మనం వచ్చేవరకూ నీళ్లు రాలేదు. మర్చిపోయుంటాను... ఏమైందిపుడు?"

    "ఇంట్లో నుంచి నీళ్లు బయటికి వస్తున్నాయట. డ్రైనేజి హోల్స్ బ్లాకయి ఉంటాయి. సెల్లార్ వరకూ వస్తున్నాయట. సెక్రటరీ ఫోన్ చేసాడు. నువ్వింటికెళ్లు... నేను మీటింగ్‌లో ఉన్నాను."

    "నో... మేన్‌... మా కంపెనీకి యు.ఎస్.డెలిగేట్స్ వచ్చారు. వాళ్లతో కాన్ఫరెన్స్ మొదలవబోతోంది. బిజీగా ఉన్నాను. ప్లీజ్... నువ్వే వెళ్లు."

    "హు..." అని నిట్టూర్చి, ఫోనాఫ్ చేసి వెనక్కి రాబోతూంటే సెక్రటరీ మళ్లీ ఫోన్‌ చేసాడు. మాట్లాడి, ఆఫీసులో చెప్పి బయటపడ్డాడు పృథ్వి.

* * *

     ఆకాశం మేఘావృతంగా ఉంది. వర్షం పడే సూచనలు కన్పిస్తున్నాయి. బైక్ మీద వేగంగా వస్తున్న పృథ్వి ఆలోచనలు ఇంటికెళ్లాయి.  

    'లోపల వస్తువులన్నీ ఏమయ్యాయో... కార్పెట్ నీళ్లలో నానిపోయుంటుందేమో, రెండో బెడ్రూంలో క్రిందేసిన పరుపు నీళ్లలో... ఛ! ధరణికి బుద్ధి లేదు. కరెంట్ లేక నీళ్లు రానపుడు వాటర్ ట్యాప్స్ ఎందుకు తెరవాలి? నీళ్లు రాకపోతే వెంటనే క్లోజ్ చేయాలన్న కామన్‌ సెన్స్ లేకుండా...' ఆలోచిస్తూనే బైక్ వేగాన్ని పెంచాడు.

    చల్లగాలి రివ్వున వీస్తోంది. మాదాపూర్ దాటాక సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ స్థంభించింది. రోడ్ మధ్య వాహనాల నడుమ ఇరుక్కుపోయాడు. ముందు, వెనక, రెండుపక్కలా ఆటోలు, కార్లు, బైక్‌లు... ఇంచ్ కూడా కదల్లేనంతగా అరెస్టయ్యాడు. 

    హారన్‌ శబ్దాలు, వాహనాల నుంచి వస్తున్న పొగలకి ముక్కులు, చెవులు బలవుతున్నాయి. ముందున్న ఆటో ఇంజనాఫ్ చెయ్యకుండా యాక్సిలేటర్ రెయిజ్ చేస్తూంటే సైలెన్సర్  నుంచి పొగ గుప్పుగుప్పు మంటూ  వెనక ఉన్నవాళ్ల మొహాల మీదికి కొడుతోంది.

    "యోవ్! ఆటోలో పెట్రోలు  బోస్తన్నవా? కిర్సినాయిల్ బోసి నడిపిస్తున్నవా? ఇంజనాపెహె... పొగతో ఊపిరాడ్డంలా" అరిచాడొక బైక్‌మీదున్న వ్యక్తి.

    గుట్కా నముల్తున్న ఆటోవాలా వెనక్కి తిరిగి  "క్యాబా! ఆప్ కూ క్యాహువా?"  అంటూ నోట్లో లాలాజలాన్ని తుపుక్కున ఉమ్మేసరికి, అది పక్కన ఆగిన తెల్లకారు ముందు భాగం మీద పడింది. అది చూసి కారు ఓనరు కిందికి దిగి...

    "ఎవడ్రా నువ్వు? బుద్ధిలేదా? ఎక్కడబడితే అక్కణ్ణే ఊస్తవురా అవులే... ఇంత పెద్ద కారవుపట్లేదురా నీ కళ్లకి... బేకార్‌గా... రా! ముందు వచ్చి తుడువ్ బే! సాలే..." అని బూతులు తిడుతూంటే, ఆటోవాడు తనని కాదన్నట్టు ముందుకి చూస్తుంటే, మెల్లగా ముందున్న వాహనాలు కొంచెం ముందుక్కదిలాయి. అంతే... ఆటోవాడు ఆ గ్యాప్‌ని ఉపయోగించుకుని, ముందుకెళ్లి మాయమయ్యాడు. ట్రాఫిక్ కదలగానే కార్లు, లారీల హారన్ల శబ్దాలతో హోరెత్తిపోతోంది. 

    ఆటోవాణ్ణి తిట్టుకుంటూ నిలబడ్డ తెల్లకారు ఓనర్ని ఓ లారీవాడు, "రేయ్! బేవకూఫ్! ట్రాఫిక్ కదిలింది అవుపడ్డం లేదురా? రోడ్డు మధ్యల కారాపుక్కూసున్నవ్... తియ్యరా! చల్... తియ్యి..." అంటూ తిడుతూ వెళ్లాడు.

    అప్పటి వరకూ శబ్ద, వాయు కాలుష్యాల మధ్య ఊపిరాడని పృథ్వి ఓ ఫర్లాంగు దూరం ముందుకొచ్చాక రిలీఫన్పించింది... బైక్ స్పీడు పెంచి, వేగంగా వస్తూంటే మళ్లీ సెక్రటరీ ఫోన్‌... బైక్ పక్కన ఆపి, మాట్లాడి, కదలబోతూంటే, ఒకతను 'నాగార్జున సర్కిల్ దగ్గర ట్రాఫిక్ జాం అయిందంట' అని ఎవర్తోనో చెబుతుంటే విన్నాడు పృథ్వి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‌వైపు వెళ్లటం విరమించుకుని, రోడ్ నెంబరు 36లోనుంచి జూబ్లీహిల్స్ కొచ్చి, కమలాపురి కాలనీలోకి ప్రవేశించేసరికి ట్రాఫిక్ లేకుండా రోడ్డు ఫ్రీగా ఉండటంతో, వేగంగా కృష్ణకాంత్ పార్క్ పక్క నుంచి మధురానగర్ రాగానే... ముందెళ్తున్న వెహికల్స్ స్లో అవటం గమనించాడు.

    రోడ్డంతా నీళ్లు. రోడ్డుపక్కనున్న మ్యాన్‌ హోల్‌నుంచి డ్రైనేజి వాటర్ చిన్నసైజు ఫౌంటెన్లా పైకి చిమ్ముతూ, రోడ్డంతా జలమయమయింది. ఆ దుర్గంధం ముక్కుకి తాకాక గానీ... పృథ్వికి గుర్తురాలేదు... స్వైన్‌ఫ్లూకి ప్రికాషన్‌గా ముక్కుకి తగిలించుకున్న మాస్క్ మాదాపూర్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు తొలగించి, మళ్లీ తగిలించుకోలేదని. బైక్ బాక్స్ లో ఉన్న స్పేర్ మాస్క్ తీసి ముక్కుకి అడ్డు కట్టుకుందామన్నా... బైక్ నిలపలేని పరిస్థితి. డ్రైనేజి నీళ్ల వాసనకి వాంతొచ్చేట్టుంది. ముందెళ్తున్న టూవీలర్సన్నీ రోడ్డు పక్కనుండి మెల్లగా ముందుకెళ్తున్నాయి.

  జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ మళ్లీ శబ్దం చేసింది. సెక్రటరియే అయుంటాడనుకుని, ముందుకెళ్లి మాట్లాడదామనుకుని, ఫోన్‌ కట్‌ చేయబోతూంటే... సడెన్‌గా వెనక నుంచి ఓలారీ రోడ్డు మీద పారుతున్న డ్రైనేజి నీళ్లల్లో స్పీడుగా ముందుకెళ్లేసరికి, నీళ్లు ఇంతెత్తున లేచి, పృథ్వి కుడివైపంతా మొహం నుండి కాళ్లవరకూ స్నానం చేయించాయి. ఒక్క క్షణం జరిగిందేమిటో్ అర్థంకాక, కళ్లు నులుముకుని, ముందెళ్తున్న లారీని చూసి... "రేయ్! కళ్లు కన్పించటం లేదా! నా...! నీ...!" అంటూ గాల్లో కల్సిపోయే తిట్లు తిడుతూ, బైక్ పక్కన ఆపాడు. ప్యాంటు, షర్టు పూర్తిగా తడిసిపోయి, దుర్వాసన కొడ్తూంటే పృథ్విలో కంపరం అరికాలి నుండి నడినెత్తి వరకూ పాకింది. అంతలో సెక్రటరీ ఫోను... కట్‌చేసి, తనే చేసాడు.

    'పృథ్విగారూ! తొందరగా రండి సార్! వాటర్‌ ట్యాంకులో చుక్క నీళ్లు లేవు. మోటార్ ఆన్‌ చేస్తే... మీ ఇంట్లో నుంచి నీళ్లొస్తున్నాయి. ఆఫ్ చేస్తే... అందరూ గొడవ చేస్తూ, పోలీసు కంప్లయింటిద్దామంటున్నారు. మీరో, మీ వైఫో ఎవరో ఒకళ్లు త్వరగా రండి!' అన్నాడు.

    బట్టలమీద, ఒంటిమీదే కాకుండా, షూసూ, సాక్సూ తడిసిపోయి, కాళ్లు కసకస మంటుంటే, పృథ్విలో అసహనం ఆకాశం వైపు చూసింది. బైక్ స్టార్ట్ చేసి సారథీ స్టూడియోస్ సిగ్నల్ దగ్గర కొచ్చేసరికి మళ్లీ ట్రాఫిక్ జాం అయింది. పదిహేన్నిమిషాల జాప్యం తర్వాత అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట మీదుగా జింఖానా గ్రౌండ్స్ కొచ్చేసరికి తలప్రాణం తోకకొచ్చినట్టన్పించింది. 

    కార్ఖానా దగ్గర లెఫ్ట్ తిరిగి, న్యూ బోయిన్పల్లి వెళ్లే గల్లీలోకి తిరిగాడు. కొంచెం ముందుకెళ్లగానే… ఓ చోట ఏడ్పులు విన్పిస్తున్నాయి. చూస్తుండగానే… జనం రోడ్డు మీదికొచ్చి అరుపులు, కేకలు పెడ్తున్నారు. పృథ్వి బైక్ నిలిపి ఎంక్వయిరీ చేయగా… "పాత బిల్డింగు కూలగొడ్తున్నారన్నా… పైనుండి పెద్ద గోడ ముక్క ఇరిగి, రోడ్ల సైకిల్ల బోతన్న పిల్లోనిపై బడ్డదంట… ఆనికిప్పుడు సీరియస్సుగుందంట, అంబులెన్సొచ్చింది" అనేసరికి, అప్పుడు చూసాడు పృథ్వి 108 అంబులెన్స్‌ని.  పృథ్వి ఫోను మోగింది. సెక్రటరీయే అయుంటాడనుకుని, నంబరు చూడకుండా… "సార్! ఐవిల్‌ బి దేర్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్" అనేసరికి… "పృథ్వీ!... నేనూ… ధరణిని… ఇంటికెళ్లావా? అనడుగుతూంటే… పృథ్వికి కోపం ఉచ్ఛస్థితికి చేరుకుంది. ఫోన్ కట్ చేసి, ముందుకెళ్లే వీల్లేక బైక్ వెనక్కి తిప్పి, తిరుమలగిరి చేరుకునే సరికి వర్షం మొదలయింది. తడుస్తూనే రామక్రిష్ణాపురం వచ్చి, అక్కణ్ణుంచి సైనిక్ పురి ఫ్లాట్స్ చేరుకునే సరికి మధ్యాహ్నం మూడయింది.

* * *
    సెల్లార్లో సెక్రటరీ రామ్మోహన్, ఇంకొంతమంది ఓనర్స్ నిలబడి ఉన్నారు. పృథ్విని చూడగానే గ్రౌండ్ ఫ్లోర్ క్రిష్ణమూర్తి… గయ్యిన… "వాటీజ్ దిస్ న్యూసెన్స్ మిష్టర్ పృథ్వీ! ఆర్యూ ఎడ్యుకేటెడ్? మీ వల్ల పొద్దుట్నుంచీ నీళ్లు లేక ఎంతమంది ఇబ్బంది పడ్తున్నామో తెలుసా? ఫ్లాట్స్లో ఉంటున్నప్పుడు యూ… మస్ట్ నో ద మేనర్స్"… అని విసుక్కుంటూంటే… 

    ఫస్ట్ ఫ్లోర్ సుబ్రమణ్యం జత కలిసి, ఒకళ్ల తర్వాతొకళ్లు క్లాస్ తీసుకుంటూంటే, గబగబా బైక్ పార్క్ చేసి, "సారీ! సారీ ఫర్ ద ట్రబుల్ అంటూ… లిఫ్టున్న సంగతి మర్చిపోయి, వేగంగా మెట్లెక్కబోయి, తడి షూస్ జారి, ముందుకు పడ్డాడు. వెనకాలే వస్తున్న రామ్మోహన్, పృథ్విని లేవదీస్తూ… జరిగిందేదో జరిగిపోయింది… నెమ్మదిగా రండి" అన్నాడు. 

    లేచి నిలబడ్డ పృథ్వి… సారీ అంటూ గబగబా థర్డ్ ఫ్లోర్లో ఉన్న తన ఫ్లాట్ చేరుకుని, తలుపులు తెరిచాడు. ఇల్లంతా నీళ్లతో నిండి, చిన్న సెలయేరులా కన్పించింది. నీళ్లలో చిన్న చిన్న వస్తువులు… న్యూస్ పేపర్లు, పాలకవర్లు, దువ్వెనలు, షాంపూ సాషేలు, వాటర్ బాటిల్స్… వాట్ నాట్… నీటిపై తేలగలవన్నీ తేలుతూంటే… వాటిలో బాటు బొద్దింకలు నీళ్లలో ఈత కొడుతున్నాయి.  ఆ దృశ్యం చూసిన పృథ్వికి కళ్లు తిరిగినట్టయింది.

    పృథ్వి వెనకాలే లోపలికొచ్చిన రామ్మోహన్‌తోబాటు క్రిష్ణమూర్తి, సుబ్రమణ్యం, మరో ఇద్దరూ... "ముందు ఎక్కడ బ్లాకయిందో చూద్దాం పదండి" అనేసరికి అందరూ నీళ్లలోనే లోపలి కొచ్చారు.

        బాల్కనీలో నీళ్లు వెళ్లే హోల్‌ దగ్గర క్యారీబ్యాగులు, పాలిథీన్‌ కవర్లు, వాటి మీద గుడ్డలు అడ్డుపడ్డాయి. బాత్రూంలో వెంట్రుకల తుట్టెలు, షాంపూ సాషేలు, నీళ్లెళ్లకుండా ఆపేస్తూంటే, కిచెన్‌ సింక్ నిండా ఎంగిలి వస్తువులు, తిని వదిలేసిన ఆహార పదార్థాలతో నిండిపోయి, నీళ్లు కిందికి దిగకుండా, అంట్లమీద నుండి పొర్లుతూ జలపాతంలా కిందికి దిగకుండా, అంట్లమీద నుండి పొర్లుతూ జలపాతంలా కిందికి పడుతున్నాయి. ఇంట్లో లైట్లు, ఫ్యాన్లూ వాటిపని అవి చేసుకుంటున్నాయి. హాల్లో కార్పెట్, రెండో బెడ్రూంలో పరుపూ నీళ్లలో తడిసి, మునిగిపోయాయి. 

    "సార్! ముప్ఫయి లక్షలు పెట్టి ఫ్లాటయితే కొన్నారు గానీ... మెయింటెనెన్స్ చాలా పూర్‌గా ఉండటం వల్ల చూడండి" అన్నాడు రామ్మోహన్‌.

    "లాస్ట్ వీక్ నుంచి సర్వెంట్ రావటం లేదు. సార్... అందుకే..." అన్నాడు పృథ్వి తడుముకోకుండా...

    "అయితే మాత్రం"... క్రిష్ణమూర్తి వ్యంగ్యంగా అంటూంటే...

    "ఇద్దరం ఉద్యోగాలకెళ్లి అలిసిపోయి వస్తాం... అందుకని ఇలా... అని నేను సమర్థించుకోవటం లేదు. సారీ!"... అన్నాడు పృథ్వి.

    "అవన్నీ తర్వాత... ముందు డ్రైనేజి క్లీన్‌ చే్సే వాడికి ఫోన్‌ చేసి పిల్పించవయ్యా బాబూ! చేసింది చాలక ఎక్స్‌ప్లనేషన్‌ ఒహటా!" సుబ్రహ్మణ్యం చిరాకు.

    'సారీ!' అని, రామ్మోహన్‌ దగ్గర నంబరు తీసుకుని, వెంటనే ఫోన్‌ చేసాడు పృథ్వి.

    క్రిష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం ఇల్లంతా... ఓ వ్యంగ్యపు లుక్కేసి, "ఎలా ఉంటున్నార్రా బాబూ!' అని గొణుక్కుంటూ బయటికొచ్చి "అవునూ... మొగుడూ, పెళ్లాం ఇద్దరేగా... ఇల్లేంటటి పదిమంది పిల్లల్లున్న ఇంటికంటే అధ్వాన్నంగా ఉంది..." అని సుబ్రహ్మణ్యం అనగానే, "ఇద్దరూ పైకి పోష్‌గా కన్పిస్తారో... చూసావా! ఇల్లు చూడు ఎంత చండాలంగా ఉంచుకుంటున్నారో... అసలా ఇంట్కో మనుషులు ఉంటున్నట్టుందా?"

    "వీళ్లే కాదు... ఈ కాలపు జనరేషనంతా ఇలాగే తగలడ్డది. వీళ్లంతా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి... ఆకాశాన్నుండి ఊడిపడ్డట్టు ప్రవర్తిస్తున్నారు తప్ప, ఎక్కడ ఉంటున్నాం... అనే ఇంగితం లేకుండా పోతోంది. రాన్రానూ వీళ్లలో... ఏదోవేళకి ఇంత తినడం, రాత్రికి ఎలాబడితే అలా పడూకోవడం, ఉదయం పది గంటలకి నిద్రలేవటం... అలంకరించుకుని ఆఫీసులకి పోవటం... ఛ! వీళ్ల మూలంగా నీళ్లు లేక మనం అల్లాడీపోతున్నాం... వెధవగోల" అని సుబ్రహ్మణ్యం అంటున్న మాటలు పృథ్వి చెవినబడ్డాయి.

    దబ్బున తలుపు మూసి... ఇల్లంతా తిరిగి చూసాడు. వాళ్లంటున్నదాంట్లో తప్పులేదన్పించింది.

    పడుకునే బెడ్‌మీద లేప్‌టాప్, కాఫీ కప్పులు, కంప్యూటర్ టేబిల్ మీద యాష్ ట్రే, సగం తిని వదిలేసిన స్నాక్స్, కూల్‌డ్రింక్ టిన్‌, బాటిల్స్, సగం తినివదిలేసిన ఫ్రూట్స్, బ్రెడ్, మూతల్లేని గిన్నెల్లో పెరుగు, పాలు...;

    వాషింగ్ మెషీన్ మీద విడిచిన బట్టలు, సోఫాలో అస్తవ్యస్తంగా దిళ్లు, దుప్పట్లు,న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు... ఛ! చూస్తే నిజంగా తనకే ఛండాలంగా వుందన్పించింది. 

    అరగంట తర్వాత కాలింగ్‌బెల్ మోగింది. రామ్మోహన్‌ డ్రైనేజి క్లీనర్‌ని వెంటబెట్టుకొచ్చాడు.

    రామ్మోహన్‌తో "సారీ సార్! ఎక్స్‌ట్రీమ్లీ సారీ! నాలుగు రోజులుగా సర్వెంట్ రాకపోవటం వలన ఇలా జరిగింది. కరెంటు పోయింది, ట్యాంకులో నీళ్లు లేవనుకుంటా... తెరిచిన ట్యాప్స్ క్లోజ్ చెయ్యకపోవటం తప్పే..." అన్నాడు పృథ్వి సంజాయిషీగా.

    "ఆ మాట అనకండి! పనిమనిషి రావటం లేదని పస్తులుండటం లేదుగా? ఒక పూట అన్నం తినకపోయినా పర్వాలేదుగానీ ఇలా ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే..." సగంలోనే ఆపేశాడు రామ్మోహన్‌.

* * *

    "చెప్తున్నానని ఫీలవటం లేదుగదా!"

    "అదేం లేదు... మీరు మా ఫాదర్లాంటివారు"

    "మనం చేసే ఇలాంటి చిన్న చిన్న అశ్రద్ధలు... పెద్దవై ఎంతోమందికి అసౌకర్యం కల్గజేస్తుంటాయి. మీరు టీవీలో చూసే ఉంటారు. మొన్నామధ్య బెజవాడలో కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీలు పూడుకుపోయి, నీళ్లెళ్లే దారి లేక, ఇళ్లల్లోకి, వీధుల్లోకి నీళ్లొచ్చి, రెండ్రోజులపాటు ప్రజలు నీళ్లల్లో గడపాల్సొచ్చింది. 

    ఎవరికి వారు స్పృహ లేకుండా చెత్తా చెదారం ఎక్కడపడితే అక్కడ పడెయ్యటం వల్లనే ఇలా జరుగుతోంది."

    "అవున్సార్"

    "తప్పెవరిదంటే మేం కాదంటూ తప్పించుకుంటున్నారు. మీకు తెల్సో లేదో... మా చిన్నతనంలో ఓ కథ చెప్పేవారు... రాజుగారికి ఏడుగురు కొడుకులు... ఏడు చేపలు..." అనగానే...

    "తెల్సుసార్! మా తాతయ్య చెప్పేవాడు"

    "అలానే ఉందివ్వాళ పరిస్థితి. ఒక కాలుష్యం ఇంకో కాలుష్యానికి దారితీస్తూ... దాన్నుండి మరొహటి పుట్టుకొస్తూ... అంతుతెగని చక్రభ్రమణంలా పెరిగిపోతోందీ కాలుష్య సమస్య. చెత్త ఎక్కడబడితే అక్కడ పడేస్తూ ఇళ్లనీ, వీధుల్నీ, ఊళ్లనీ, రాష్ట్రాన్నీ, దేశాన్నీ, ఆఖరుకి హిమాలయాల్నీ, సముద్రాల్నీ కూడా వదలకుండా చెత్తకుండీలుగా మారుస్తూ నేల, నీరు, నింగినీ కలుషితం చే్స్తూండటం వల్లనే గ్లోబల్ వార్మింగ్ సమస్య నానాటికీ పెరిగిపోతూ,'ఫ్లూ' వంటి సాధారణ రోగాలు, అసాధారణ్ 'స్వైన్ ఫ్లూ'లా మారి ప్రపంచమంతా స్వైరవిహారం చేస్తున్నాయి."

    పృథ్వికి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వింటున్నాడు. ఐదు నిమిషాల తర్వాత... పృథ్వి ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసాడు... "పృథ్వీ ఇంటికెళ్లావా? ఫోనెందుకు కట్ చేస్తున్నావ్? నాకు కాన్ఫరెన్స్ అయిపోయింది. ఇంటికి వస్తున్నాను" అంది ధరణి. 

    సరే... అని ఫోన్ కట్ చేసాడు. 

    అంతలో... డ్రైనేజి క్లీనర్..."సార్! క్లీన్ జేసిన... నైళ్లు పోతున్నయ్యిప్పుడు" అన్నాడు.

    అతనికి డబ్బులిచ్చిపంపి... రామ్మోహన్ వైపు తిరిగిగాడు.

    "మీకు క్లాసు తీసుకుంటున్నాననుకోకండి... సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను" అన్నాడు రామ్మోహన్. 

    "లేదండీ! కళ్లు తెరిపిస్తున్నారు... చెప్పండి" అన్నాడు విద్యార్థిలా...

    "ఇవాళ మన ఎన్విరాన్‌మెంట్... అంతా పొల్యూట్ అయిపోతోంది. మనిషికి కావాల్సిన గాలి, నీరుతోబాటు ధ్వని కాలుష్యమూ పెరిగిపోతోంది. ఎవర్ని కదిలించినా... కారణం నువ్వంటే, నువ్వనుకుంటున్నాం గానీ... అసలు కారణం తెల్సుకోవటం లేదు. మీకు తెలిస్తే చెప్పండి"

    "ఏముంది సార్! ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోతోంది."

    "ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? మన ఆలోచనల్లో కాలుష్యం పెట్టుకుని, ప్రభుత్వాన్ని నిందించటం తప్పు. ఇంటిముందు డ్రైనేజీలు పొంగి పొరలుతున్నా, రోడ్డు పక్కనున్న చిన్న త్రోవనుండి తప్పుకువెళ్తున్నాం గానీ... సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్దామనిగాని, నల్గురం కలిసి బాగుచేయించుకోగలమేమో ప్రయత్నిద్దామన్న సమిష్టి బాధ్యతని విస్మరిస్తున్నాం... ప్రతివాళ్లలో నాది కాదన్న ఉదాసీనం, నాకెందుకన్న సోమరితనం... ఔనా?"

    "ఖచ్చితంగా... ఇపుడు మీరు చెప్పినవన్నీ ఇవ్వాళ పదకొండు గంటలనుంచి మూడు గంటల వరకూ ప్రత్యక్షంగా అనుభవించాను. చిన్న ఫ్లాట్‌నే పరిశుభ్రంగా ఉంచుకోలేకపోతున్న నాకు బయటి పొల్యూషన్ గురించి మాట్లాడే హక్కుకందంటారా? బట్ హియర్ ఆఫ్టర్... దిస్ విల్ నెవర్ రిపీట్. ధరణికి కూడా చెప్తాను. కాదు... ఫాలో అవుతాం..." అన్నాడు పృథ్వి ఎగ్జయిటింగ్‌గా. 

(కథాకేళి మాసపత్రిక మే,2011 సంచికలో ప్రచురితం)  
Comments