గది - గుడిపాటి వెంకటేశ్వర్లు

ఊరు ఊరంతా తిరుగుతున్నా.
కాదు నగరం నగరమంతా గాలిస్తున్నా - నా గది కోసం.
సంవత్సరాలుగా తిరుగుతున్నా.
అనుకోకుండా ఆకస్మికంగా నా గది మాయమైంది.
చెప్పాపెట్టకుండా అదృశ్యమైంది.
లేదు లేదు... గదిలోంచి నేనే మాయమయ్యానేమో!
ఏదైనా ఒకటే కదా!
కాదు...కాదు...ఒకటి కాదు..!
నేను నాతోనే ఉన్నాను.
గది గురించి కలవరిస్తూనే వున్నా.
ఏ రాత్రో స్వప్నాలు ఎగదన్నుకొస్తాయి.
కలలు పునరావృత్తమవుతాయి.
సడలిన ఆశలు, ఆశయాలు కలవరపెడతాయి.
పొలిటికల్ సైన్స్‌లో ఇష్టంగా చదువుకున్న చైనా రాజకీయాలు గుర్తుకొస్తాయి.
దానితోపాటే నా గది గుర్తుకొస్తూనే వుంటుంది. 
తప్పిపోయిన నా గది కోసం వెదుకులాడుతూనే వున్నా.
వీక్లీ ఆఫ్ రోజుల్లో ఒకపూట అలా బస్తీల వెంట తిరగడం ఆ మధ్యన అలవాటయింది. 
నేను ఉన్న గది కనిపించడం లేదు.
ఎక్కడో తప్పిపోయింది.
రియల్టర్ల పడగనీడలోకి జారిపోయిందా?
రియల్ ఎస్టేట్ దయ్యాల పీడ నా గదిని ఆవహించిందా?
నా చిన్నగదికి...
నాదయిన చిన్నరూంకి
బడాబడా రియల్టర్ల బెడద వుంటుందా?
ప్రశ్నలు...ప్రశ్నలు...ప్రశ్నలు...
నా గది నా కోసం ఎదురు చూడదా
నా కోసం తపించదా
నా అడుగుల సవ్వడి కోసం అల్లాడకుండా ఉంటుందా..!
ఎక్కడని వెదకను...
క్యాంపస్‌లోంచి బయటపడ్డాక... చెరువులోంచి బయటపడిన చేప పిల్లలా అయ్యింది నా పరిస్థితి.
బయటపడ్డ చేపపిల్ల కొన్నాళ్ళకే చచ్చిపోతుందేమో!
కానీ చుట్టూ మనుషులుంటే మనిషి చావడు కదా!
అందుకే బతికానేమో!
నిజానికి మనుషుల మధ్య బతుకుతున్నా...నాకు రహస్యంగా, ఏకాంతంగా ఉండడమే ఇష్టం.
అందుకని మనుషుల మీద నాకేమీ ఫిర్యాదుల్లేవు.
ఈ సమాజం మీదనే ఫిర్యాదులు... సమాజం నుంచి తప్పించుకోడాణికి నిరంతరం ప్రయత్నిస్తూ, ఓడిపోతూ, ఆ సమాజపు చట్రంలోనే తప్పనిసరయి తిరుగుతున్నా.
మనుషుల మధ్య ఉంటూనే నాకంటూ లోలోపల ఒక లోకాన్ని నిర్మించుకుంటాను. 
ఆ లోకం ఎలా ఉండాలో నా గదికి చెబుతుంటాను.
నా స్వప్నాలకి సాక్షి నా గది.
నా ఊహలకి ఆలంబన నా గది.
ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏమైంది?
ఆ గదిలో నా కలలున్నాయి. కలవరింతలున్నాయి.
నా పుస్తకాలున్నాయి.
పరిశోధన పత్రాలున్నాయి.
చిన్నప్పట్నించి రాసుకున్న డైరీలున్నాయి.
కౌమారంలో, తొలియవ్వనంలో రాసుకున్న కవితలున్నాయి.
యవ్వనం ప్రభవించేవేళ ఉదయిని రాసిన ఉత్తరాలున్నాయి.
ప్రేమగా 'కిరణ్...కిరణ్...నా కిరణమా' అని సంబోధిస్తూ ఉదయిని రాసిన ఉత్తరాలు గదిని పరిమళభరితం చేసేవి.
ఉత్తరాలా? ప్రేమలేఖలా?
ప్రేమా...ఆ మాట ఎన్నడూ చెప్పుకున్న గుర్తులేదు.
'నువ్వు అతణ్ణి ప్రేమిస్తున్నావా?'
'నువ్వు ఆమెని ప్రేమిస్తున్నావా?'
ఇలా ఎవరెవరో అడిగేంతవరకూ మా సాన్నిహిత్యం అర్థం, పరమార్థం గురించి ఆలోచించలేదు.
అది స్నేహమా, ప్రేమా అని తలపోయలేదు.
అనేకసార్లు ఏకాంతంలో గడిపాము.
గంటల తరబడి కబుర్లలో కాలాన్ని దొర్లించాం.
ఒకరికోసం ఒకరం తెలియకనే ఎదురుచూశాం.
సకలం మాట్లాడుకున్నం.
కలలు ఎన్నో కన్నాం.
చదివిన పుస్తకాల గురించి చర్చించుకున్నాం.
చదువులో రాణించాలనుకున్నాం.
భవిష్యత్తు గురించి సుందర స్వప్నాలెన్నో కన్నాం.
క్యాంపస్‌లో ఉండే రోజుల్లో ఊరి నుంచి వచ్చిన ఉదయినితో ఆర్ట్స్ కాలేజీలో, ల్యాండ్ స్కేప్ గార్డెన్‌లో...క్యాంపస్ క్యాంటీన్‌లో... ఎన్నెన్ని మాటలో... కబుర్లో..! మధ్యమధ్యలో పాటలూ... మాలో మాకే వినిపించేట్టుగా.
ఉదయిని బాగా పాడుతుంది.
పాటకి అందాన్ని ఇస్తుంది ఆమె కంఠస్వరం.
ఆ పాటలో విషాదమూ ఉంటుంది.
విషాద మాధుర్యమూ ఉంటుంది.
వరంగల్‌లో 'లా' చదువుతున్న ఉదయిని ఒకసారి వచ్చింది.
అప్పుడు వారాసిగూడలో వున్నా ఒంటిగదిలో.
మేడమీద ఒక్కటంటే ఒక్కటే ఒంటిగా వున్న గదిలో నా నివాసం.
ఏదో దిగులు...దిగులు దిగులుగా..!
కలలపై కమ్ముకుంటున్న నిరాశా మేఘాలు.
గదిలో ఒక్కడినే సుక్కుతున్న రోజులు.
సోషలిష్టు స్వర్గధామాల పతనం...
గర్జించు రష్యా... గాండ్ర్నిచు రష్యా...
పతనమవుతున్న సన్నివేశం...
విప్లవనినాదాలు వెలిసిపోతున్న కాలం...
తియనాన్మెన్ స్క్వేర్‌లో 
విద్యార్థులపై నడిచిన యుద్ధ ట్యాంకులు.
నక్సలైట్ల ఎన్‌కౌంటర్లు...
ఏదో చేయాలని... ఇంకేదో చేయాలని... కలలు గనున్న వేళ...
యాక్సిడెంట్‌లో మంచమెక్కిన నాయన.
ఉద్యోగం చేయాలి... నాలుగు రాళ్ళు సంపాదించాలి... ఇంటికి పంపించాలి...
చెల్లెళ్ళు, తమ్ముళ్ళు...ఎన్నెన్నో బాధ్యతలు.
కలలపై కమ్ముకుంటున్న కన్నీటి చారికలు.
మసకబారుతున్న స్వప్నసీమలు.
ఆ సమయంలో వచ్చింది ఉదయిని.
తన పాటలతో నన్నూ, నా గదినీ ఆత్మీయంగా స్పర్శించింది.
కలలపై కన్నీటి చారికల్ని తన పాటల కొంగుతో తుడిచింది.
కలలకు ఎగరడం నేర్పింది.
ఊహలకు రెక్కలు వచ్చాయి.
మరల కలలు...కలలు...కలలు...
రిజల్ట్స్ రాగానే ఎం.ఫిల్ ఎంట్రెన్స్ రాయాలి.
సీటు సంపాదించాలి.
మొదట ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల పోరాటంపై ఎం.ఫిల్ చేయాలి.
ఆ తర్వాత చైనా సాంస్కృతిక విప్లవ ప్రభావం మీద పి.హెచ్.డి.చేయాలి.
చైనా వెళ్ళాలి.
మావోజెడాంగ్ సంచరించిన ప్రదేశాల్ని చూడాలి.
లాంగ్‌మార్చ్ సాగిన గ్రామాలు, పట్టణాలు తిరగాలి.
కలలు...కలలు...కలలు...
ఈలోగా వరంగల్‌లో 'లా' పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టాలన్నది ఉదయిని కల.
కలలు...ఊహలు... ఊహల విన్యాసాలు...
ఒక ఊపునీ, విశ్వాసాన్నీ, ఉత్సాహతరంగాల్ని నా గదిలో, నాలో నింపేసి మరల వెళ్ళిపోయింది ఉదయిని.
ఆ తర్వాత వారానికి అమ్మ మరణం.
ఊరికి పయనం.
అమ్మకి గోర్కీ 'అమ్మ'ని చదివి వినిపించాలని ఎన్నెన్ని కలలు కన్నాను. 
ఇద్దరమూ కలిసి వింపిద్దామని భరోసా ఇచ్చిన ఉదయిని కోసం వెదుక్కున్నా.
అమ్మలేనితనం...
అమ్మ లేని లోకం ఊహించడానికే భయమేసింది.
అమ్మ తోనే అనుబంధం...
'నేను పెద్దయ్యాక...' అంటూ అమ్మకోసం చెప్పిన ముచ్చట్లు ఎన్నో చిన్నప్పుడు.
ఇప్పుడు అమ్మలేదు.
ఈ వాస్తవం భరించడం కనాకష్టం.
గుండెల్లో దుః...ఖం సుడులు తిరుగుతూనే వుంది.
ఉదయిని వుంటే బావుండనుకున్నా.
ఉదయిని వస్తే బావుండనుకున్నా.
వారం దాటింది. రెండు వారాలు దాటింది.
మూడు వారాలు దాటింది.
ఉదయిని జాడలేదు. 
ఉదయిని కోసం వెదుక్కున్నా.
ఊరి నుంచి నగరానికి తిరిగి వచ్చిన.
గదిలో ఒక్కడినే.
అమ్మ లేదు.
ఉదయిని కనిపించలేదు.
తెల్లారి ఉదయిని కోసం వరంగల్ వెళదామనుకున్నా.
తెల్లారక ముందే ఉదయిని ఎన్‌కౌంటరయ్యిందన్న వార్త.
పాటలు పాడటం ఆమె నేరమయ్యింది. 
మూడు రోజుల కిందట వరంగల్ ఆర్.ఇ.సి.లో పాటలు పాడిన ఉదయిని తిరిగి హాస్టల్‌కు చేరలేదు.
మూడు రోజుల తర్వాత అడవుల్లో ఎన్‌కౌంటరయిన ఉదయిని.
అమ్మలేనితనం
నెచ్చెలిలేనితనం
స్నేహరాహిత్యం
మరల నా గుహలోకి...
కకావికలయిన కలలు...
కలలని తాకిన మృత్యుశీతల స్పర్శ.
మా వెచ్చటి కలలకు సాక్షిగా నిలిచిన గది భోరుమంది.
మేడమీద మరో రెండు అంతస్తులేయాడనుకున్నాడు ఒంటి గది ఇంటి ఓనరయిన ఏ.సి.టి.ఓ.
గదిని ఖాళీ చేశానా... గెంటి వేయబడ్డానా...
ఏమో... ఏమో... అక్కణ్నించి ఎక్కడెక్కడికో..!
మాణికేశ్వర్ నగర్... జవహర్ నగర్... రాం నగర్, జెమినీ కాలనీ, లోతుకుంట, ఎన్టీఆర్ నగర్, జగ్ద్గిరి గుట్ట, పార్శిగుట్ట... నేరెడ్‌మెట్...మౌలాలి...చాంద్రాయణగుట్ట... సంతోష్ నగర్...సనత్ నగర్...ఎక్కడెక్కడ తిరిగానో... ఎక్కడయినా ఒంటరిగదులు... ఆ ఒంటి గదులకు తోడుగా నేను.
ఒంటిస్తంభం మేడ గురించి చిన్నప్పుడు జానపద పుస్తకాల్లో చదువుకున్నా...యవ్వన కాలమంతా దూరంగా విసిరివేయబడ్డట్టు... ఎవరికీ చెందనట్టుగా వుండే గదుల్లో తలదాచుకుంటూ వస్తున్నా... కానీ అంతలోనే గది తప్పిపోయింది.
కమురువాసనతో కలలు దూరంగా చెదిరిపోయినట్టే... నా ఆశనిరాశల, నిస్పృహల,దిగులు చారికలు గట్టిన గది ఎక్కడో మాయమైంది.
తిరిగితిరిగి అనాథ ప్రేతాలకు ఆలవాలమైన పత్రికాఫీసులో చేరా.
కోరికోరి స్మశానం ఎదురుగా పెట్టిన ఆఫీసులోనే చేరా.
బతకనివ్వని, చావనివ్వని జీతాలతో కాలం నెట్టబడింది.
వన్ బై టు చాయ్ మాదిరిగా గదుల్ని షేర్ చేసుకున్న రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు...
రాత్రులు ఆఫీస్ టేబుళ్ళ మీదనే కరిగిపోయాయి.
నాలో నేనే ఒక్కడినై సుక్కిన సంవత్సరాలు...
సోషలిస్టు స్వర్గధామాలు కూలిపోయాయి.
కౌమారస్వప్నాలు కనలిపోయాయి.
ఊగించి శాసించిన ఆశయాల జాడలేదు.
గోండు జీవితాల్లో మార్పులేదు.
ఫ్యాషన్ షోలో సోషలిస్టు చైనా క్యాట్ వాక్ చేస్తోంది.
బస్తీలు బస్తీలుగా లేవు.
కాలనీలు కాలనీలుగా లేవు.
ఒంటిగదుల జాడలేదు.
ఎక్కడికక్కడ అపార్ట్‌మెంట్లు
కూల్చివేతకు లోనయిన ఇళ్ళు.
జవహర్‌నగర్ రూపు మారిపోయింది.
వారాసిగూడ గుర్తుపట్టకుండా అయింది.
తెలంగాణా రణగొణధ్వనిలో, పోలిసుల తుపాకుల పహారాలో మాణికేశ్వర నగర్ తుఫాను తాకిడికి కొట్టుకుపోయిన పల్లెలా అల్లాడుతోంది.
వంద గజాల స్థలంలో నాలుగు అంతస్థుల అపార్ట్‌మెంట్లు.
రియల్ రక్కసి పదఘట్టనల్లో బస్తీల్లో రోడ్లు కుదించుకుపోయాయి. చిన్నపాటి గుడిసె, చిన్నపాటి గది కనుచూపుమేరలో కానరావడం లేదు. 
పేదోళ్ళ గుడిసెల్ని, ఒంటి గదుల్ని లేకుండా చేస్తే పేదరికం పోతుందన్న ఏ బ్యూరోక్రట్ ఆలోచనకో బలిచేయబడినట్టుగా ఉన్నాయి బస్తీలన్నీ.
హుస్సేన్ సాగర్‌ని తెగనరికి కట్టబడిన ఐమాక్స్‌లో జనసందోహం.
గ్రామాలన్నిటినీ చిదిమేసి శిల్పారామంలో విలేజీ మ్యూజియంగా మార్చిన వైనం.
సెంట్రల్‌మాల్‌లో డబ్బుగబ్బుతో ఉబ్బిన శరీరాల షాపింగ్ హేల.
కారంచేడు దుర్మార్గాన్ని వెలికితీసిన పింగళి దశరథరామ్‌ని తలవని జర్నలిజం, పాలెగాండ్ల దొడ్డివాకిలిగా మారిందన్న నిజం ఎందరికి తెలుసు. 
ఆ దొడ్డివాకిలిలో పాలేర్ల కన్నా హీనమైన చాకిరీలో ఆత్మని అమ్ముకున్నవాడిలో నేనూ ఒకడిని కానా?
అయినా పాలేరుతో పోలికనా?
పాలేరు రెక్కల కష్టాన్ని మాత్రమే అమ్ముకున్నాడు... కాదు ధారవోశాడు. ఆత్మను  పోగొట్టుకోలేదు.  హృదయాన్ని జార్చుకోలేదు. హృదయపు చెలిమెలో ఉండే తడిని అమ్ముకోలేదు.
మరొకరి నెత్తిగొట్టే ఆలోచనలకు ఎరువు అందించలేదు.
తనదికాని బతుకును గ్లోరిఫై చేయడం ఎంత హేయం.
పాలేరుకు తనదయిన బతుకు ఉంది.
తనదయిన రాత్రి వుంది.
తనదయిన ప్రపంచం వుంది.
నీకేం ఉందిరా జర్నలిస్టూ.
ఏం ఘనత నీది... ఎవరి ఇంట్లో శవం లేచిందో... ఎవరి ఇంట్లో పిడకలెత్తారో... ఇంకెవరి ఇంట్లో ఎవరు ఎవరితో లేచిపోయారో...ఎవరు ఎవరితో కులుకుతున్నారో కానాలు వేసి చూసినట్టుగా రాయడం ఒక పనేనే? జర్నలిజమా...జారత్వమా?
అదే గొప్పనుకునే నీ ఏబ్రాసి బతుకులో కలలున్నాయా?
సాంస్కృతిక విప్లవాలున్నాయా?
నీకోసం ఒక గది వుంటుందా?
నీ గదికోసం నువ్వు తచ్చాడుతున్నావా?
తిట్టాల్సిందే...
ఇంతకన్నా ఘోరంగా నన్ను ఉతికి ఆరేయాల్సిందేనేమో!
తెలిసో తెలియకో కలలని తాకట్టు పెట్టాను.
అక్షరాల్ని కలిగినోళ్ళ కార్ఖానాల్లో కుదువపెట్టాను.
అయినా నా అసలు అక్షరాలు... నా లోపలి ప్రపంచపు అసలుసిసలు సృజన నా గదిలోనే ఉన్నాయి.
లోలోపలి కల్లోలాల సుడిగుండాల చప్పుడు ఎవరికీ వినిపించలేదు.
ప్రాయశ్చిత్తానికి ఇది సమయం కాదు.
ఈ కన్ఫెషన్ ఎవరికీ చెప్పుకోలేదు.
నా గదిమాత్రమే నాకు కన్ఫెషన్ బాక్స్.
నా ఆత్మనివేదనకు అదే సరైన స్థలం.
అక్కడే నన్ను నేను విప్పుకోగలను.
అక్కడే నన్ను నేను సంపూర్ణంగా తరచి చూసుకోగలను.
అక్కడే శకలాలు శకలాలుగా చెదిరిన పాటని దండగా మార్చి మళ్ళీ జనంలోకి తీసుకెళ్ళగలను.
కలలు...కలలు...కలలు...బతుకు కోసం అక్షరాల్ని అమ్ముకుని, గోల్డ్ మెడల్‌ను పెద్దోరి పాదాల వద్ద తాకట్టు పెట్టి... కూడా కలలు...కలలు..కలలు..!
ఓరోరి వెర్రి వాజమ్మా!
వెర్రివాడినే.
కానీ నా గది మీద నాకు ప్రేమ వుంది. 
నా కోసం నేను మిగలడాణికి ఎప్పుడూ నేను ఒక గదికోసం అల్లాడుతూనే వున్నా. 
నాదయిన గదికోసం వెదుకుతూనే వున్నా.
ప్రపంచం కుగ్రామంగా మారిపోతుందన్నారు.
కానీ నగరం కునారిల్లిపోతోంది.
బస్తీలు కుదించుకుపోతున్నాయి.
ఒంటిగదులు కూల్చబడుతున్నాయి.
అయినా ఎక్కడో నా గది భద్రంగా వుంటుందని ఆశ.
ఏ రియల్ డేగ కన్ను పడని మూలనైన గది క్షేమంగా వుంటుందనే ఆశ.
అందుకోసమే వెదుకుతున్నా.
నగరమంతా గాలిస్తున్నా.
ఏరింగురోడ్డు ఆవలో ఈవలో ఒంటి గది ఉండకపోదు.
ఆ గది దొరికే వరకు ఈ నడక ఆగదు. 
ఈ కలల పేటిక మోయకా తప్పదు.

(ముంబయి వన్ పక్ష పత్రిక 16-31 మార్చి 2011 సంచికలో ప్రచురితం)      
Comments