గలగలాగోదారి - ఆదూరి వెంకట సీతారామమూర్తి

    

     హాల్లోకి అడుగుపెట్టిన జానకిరాంని ఎదురుగా టీపాయ్ మీదనున్న శుభలేఖ ఆకర్షించింది. దగ్గరగా వెళ్లి తొంగి చూశాడు. రాజమండ్రి ఎడ్రసుతో క్రిష్ణాజీనించి వచ్చిందది. మొత్తానికి క్రిష్ణాజీ కూతురు పెళ్లి చేస్తున్నాడన్నమాట!

    ఆనందమే అన్పించి కవరు విప్పి కార్డు బయటకు తీశాడు.

    "....పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగిన మా అమ్మాయి చి.సౌ.భార్గవిని అందాల సముద్రతీరమైన విశాఖలో పుట్టి పెరిగిన చి.శైలకుమార్‌కు యిచ్చి... పెళ్ళి!..." శుభలేఖ బాపుగారి అందాల చిత్రం మీనాక్షీ సుందరేశ్వరుని ముఖపత్రంగా అలంకరింపబడి వుంది.

    "పెళ్లెప్పుడటా?" అంటూ కాఫీ కప్పుతో లోపలికి వచ్చింది సుమలత.

    "ఇంకా పదిరోజులుంది" అంటూ తేదీ చెప్పేడు. ఆ క్రిష్ణాజీ ఎవరో కూడా చెప్పేడు.
 
    "మా రాణీ కూడా రాజమండ్రిలోనే వుంటోంది తెల్సుగా. ఎన్నాళ్లనించో రమ్మంటోందది. మీరు మీ ఫ్రెండు కూతురి పెళ్లికి వెళ్లినట్టూ వుంటుంది... నేను రాణిని చూసినట్టూ వుంటుంది. ఆఫ్‌కోర్స్! పెళ్లికి వస్తాననుకోండి!" అంది సుమలత, జానకిరాంకి మరో మాట అనే అవకాశమివ్వకుండా.
 
    "చూద్దాం... గోదావరి అందాల్ని పాపికొండల నడుమ చూడాలని నాకెప్పట్నుంచో కోరిక. అటు ఉత్తరాదిన గంగానదినీ; త్రివేణీ సంగమాన్ని చూశాను. ఇటు కన్యాకుమారి వరకూ వెళ్లి మూడు సముద్రాల సంగమాన్ని చూశాను. కాని దగ్గరున్న గోదావరి నది మీదుగా భద్రాచలం వళ్లి ఆ శ్రీరాముడి దర్శనాన్ని మాత్రం చూడలేక పోయాను, ఆయనగారి పేరుపెట్టుకున్నా కూడ! ఇప్పుడు లాంచీలో భద్రాచలం ప్రయాణం వీలవుతుందో లేదో గాని గోదావరి అందాల్ని మాత్రం చూడొచ్చు. అదేదో ప్రాజెక్టు వస్తే ఆ అవకాశం కూడా వుండదేమోనని అంటున్నారు" అన్నాడు జానకిరాం.
 
    "మీ నోటంట ఆ మాట వచ్చింది కాబట్టి నేనూ ధైర్యం చేసి చెబుతున్నాను. ఎంచక్కా శని ఆదివారాలు కలిసొచ్చేట్టు సెలవు పెట్టేయండి. పన్లో పని రాజమండ్రిలోని ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు గారి ఆర్ట్ గేలరీ కూడా చూసొద్దాం. నాకూ ఎన్నాళ్ళగానో వున్న కోరికది.
 
    రవివర్మ బొమ్మలు చూసినప్పుడల్లా నాకెందుకో దామెర్లే గుర్తుకొస్తారు. నిజంగా ఆయన తెలుగువారు గర్వించదగ్గ చిత్రకారుడు" అంది.
 
    "నీకు ఒక్క దామెర్లవారే గుర్తుకొస్తారేమోగాని రాజమండ్రిని తలుచుక్న్నప్పుడల్లా నాకు ఎందరెందరో... ఎన్నెన్నో గుర్తుకొస్తాయి. వీరేశలింగంగారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గుర్తుకొస్తారు. ఆయన రాసిన వడ్లగింజలు కథ గుర్తుకొస్తుంది. సరస్వతీ ప్రెస్ గుర్తుకొస్తుంది. ప్రకాశం పంతులుగారి మీద తీసిన ఆంధ్రకేసరి సినిమా గుర్తుకొస్తుంది. అందులో ఆరుద్ర రాసిన వేదంలా గోదావరి పాట గుర్తుకొస్తుంది. ఒకప్పుడు ఎంతగానో వెలిగి చరిత్రపుటల్లో నిలిచిపోయిన ఊరది. ఇలాగైనా వెళ్దాంలే" అన్నాడు జానకీరాం.
 
    సుమలతకి చెప్పలేని ఆనందం కలిగి చిన్నతనంలో తను రాణితో గడిపిన రోజులు గుర్తు తెచ్చుకుని వంట చేస్తున్నంత సేపూ ఆ జ్ఞాపకాలలోనే మునిగిపోయింది.
 
* * *
 
    అవినీతిలో బకాసురుడని పేరుపడ్డ బాసు... పేరు దాసు... కేంపులో ఉండటం వల్ల జానకిరాం సెలవు సులువుగానే గ్రాంటయిపోయింది. తామిద్దరూ పెళ్లికి వస్తున్నట్టు జానకిరాం తెలియజేయడంతో స్టేషన్‌కి రిసీవ్ చేసుకుందికి స్వయంగా వచ్చాడు క్రిష్ణాజీ. స్నేహితులిద్దరూ ఆనందంగా మాట్లాడుకున్నారు. ఉత్తరం రాయకపోతే పోయె. కనీసం ఫోనైనా చేస్తూండవచ్చుగా అని ఒకర్నొకరు అనుకున్నారు. మొత్తానికి జానకీరాంకీ, సుమలతకీ ఆ పెళ్లివారింట విఐపి ట్రీట్‌మెంట్ లభించింది.
 
    అర్ధరాత్రి పెళ్లి. చుక్కలు ఆకాశం కింద వెలుతురు పిట్టల్లాంటి దీపతోరణాల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది పెళ్లి.
 
    ఆ మర్నాడే రాణి ఇంటికి ప్రయాణమయ్యేరు సుమలత, జానకిరాం. రాణి ఆనందానికి అవధులు లేవు. బంధుత్వం కంటే స్నేహానికే విలువనిచ్చే ఆ స్నేహితురాళ్లిద్దరూ ఆ రాత్రి ఎన్నో మాటలు కలబోసుకున్నారు.
అందరూ కల్సి ఊళ్లో చూడవలసిన ప్రదేశాల్లో కొన్ని చూశారు. ఒక రోజు దామెర్ల ఆర్ట్‌గేలరీ; కడియం పూల అందాల్ని చూశారు. తిరుగు ప్రయాణానికి ముందు రోజు గోదావరిలో లాంచి విహార యాత్రకు టిక్కెట్లు రిజర్వు చేసుకున్నారు. 
 
* * *
 
    ఉదయం తొమ్మిది గంటలు... పట్టిసీమ రేవు వద్ద సందడి మొదలైంది. ఊళ్లోంచి బస్సులలోనూ యితర వాహనాల్లోనూ వచ్చే జనమంతా అక్కడ దిగి లాంచీల కోసం రేవులోకి దిగుతున్నారు. మెట్ల సదుపాయం ఉన్నా గట్టుమీంచి మట్టి దారి గుండా పిల్లా పాపలతో సందడి సందడిగా జనం పరుగులాంటి నడకతో కదుల్తున్నారు. గట్టు మీద ఎన్నో అడుగుల ఎత్తున వున్న పెద్ద ఆంజనేయస్వామి వారి విగ్రహం అక్కడి ప్రజలకు అభయమిస్తున్నట్లుగా వుంది. సరంగులు తమతమ లాంచీల్లోకి రావలసిన జనానికి ఆహ్వానం పలుకుతున్నారు.

    జానకిరాంకి, సుమలతకి అక్కడి ఆ ఉషోదయ వాతావరణం, ఆ సందడీ ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అన్పించింది. వారితో పాటు వచ్చిన రాణి, ఆమె భర్త రాజారావు కూడా అంతకు ముందెప్పుడో లాంచిపై ప్రయాణం చేసినా వారికీ ఉత్సాహంగానే వుంది.

    జనమంతా లాంచీల్లోకి సర్దుకుంటున్నారు. తమ లాంచీ కింది భాగంలోని సీట్లన్నీ నిండిపోవడంతో జానకిరాం, సుమలత లాంచీ టాప్ మీదికి ఎక్కేరు. వారితో పాటు రాణీ, రాజారావూ... టాప్ మీదకూడా కొన్ని కుర్చీలు పేర్చబడి వున్నాయి. నీడ వుండి, గాలి వచ్చేట్లు వుందక్కడ. నలుగురూ ఒక దగ్గర కూర్చున్నారు.

    మొదటి లాంచీ కూతవేసి కదిలింది. దాని వెనుకే మిగిలినవి మొత్తం ఐదు లాంచీలు నిండు గర్భిణుల్లా భారంగా కదిలాయి. మరి కాస్సేపటికే లాంచిలోని ప్రయాణికులకు బ్రేక్‌ఫాస్ట్ యివ్వడం మొదలైంది. పదహారేళ్ల ఒక అబ్బాయి, పన్నెండేళ్ల ఒక అమ్మాయీ అట్ట ప్లేట్లతో టిఫిన్ అందిస్తున్నారు. అంతే... అంత వరకూ మరో ధ్యాసలో వున్న ప్రయాణీకులలో అలజడి మొదలైంది. 

    "ఒరేయ్ సత్యం! టిఫిన్లు యిస్తున్నార్రా. మన ఆరు ప్లేట్లూ తెచ్చేరాదూ. మళ్లీ అయిత్పోతాయే" అంటుందొకావిడ.

    "అబ్బా... వుంటాయి లేమ్మా... వాళ్లే యిస్తారు..." అంటున్నాడా అబ్బాయి.

    "ఇదిగో అబ్బాయ్! ఈ పిల్లకీ ఓ ప్లేటియ్యి..." నాలుగేళ్ల అమ్మాయిని చూపిస్తూ అడుగుతుందో యిల్లాలు. టిక్కెట్టు ధరలోనే టిఫినూ, భోజనం పెట్టే ఏర్పాటుంది మరి!

    "అందరికీ యిస్తామమ్మా" అంటున్నాడా అబ్బాయి. 

    "సార్ తీసుకోండి" అందా అమ్మాయి జానకిరాం దగ్గరకొచ్చి.

    దృష్టి మరల్చి ఆమె వంక చూశాడతడు. పన్నెండేళ్లు దాటవు. చామనఛాయగా వుంది. లంగా జాకెట్టూ వేసుకుని వుంది.

    బాలకార్మిక సమస్య అన్నది మన దేశంలో ఎప్పటికీ రూపు మాసి పోయిన్ సమస్య అనుకున్నాడు ఆమెను చూసి, ఆ అమ్మాయి అందించిన ప్లేటును అందుకుంటూ.

    లాంచీలో గొడవ గొడవగా వుంది. టిఫిన్ యింకా తమ వద్దకు రాని వాళ్లు కేకలేసి పిలుస్తున్నారు. రెండిడ్లీ, వడ అందరికీ సర్వ్ చేయడం జరిగింది.

    "ఇంతమందికీ వేడివేడిగానే టిఫిన్ అందిస్తున్నారు. రుచిగానే వున్నాయి" అంది సుమలత.

    "మా రాజమండ్రి టిఫిన్లకీ, భోజనానికీ పెట్టింది పేరమ్మా ఏమనుకున్నావో" అంది రాణి కళ్లెగరేస్తూ గర్వంగా.

    టిఫిన్లు తిన్న తర్వాత అట్ట ప్లేట్లు వేసేందుకు మూలగా ఓ ప్లాస్టిక్ డ్రమ్ము  పెట్టడంతో అందరూ తమతమ ప్లేట్లను అందులోనే వేసేరు. అప్పటికే ఒకరిద్దరు ఆ ఎంగిలి ప్లేట్లను గోదావరిలోకి విసిరేశారు.

    "మనం మన నదులను ఎంతో పవిత్రంగా భావించి పుష్కరాలు జరిపి మరీ పూజలు చేస్తామా... మనలోనే కొంతమంది వాటిని మనం విడిచిన కల్మషాన్ని మోసుకూపోయే వాహకాలుగా తలుస్తారు. పరిశుభ్రమైన నీటికీ, తాగు నీటికీ ప్రజలు ఎంత కటకటలాడుతున్నా నదీ ప్రవాహాల్ని కలుషితం చేయడంలో కూడా మనకు మనమే సాటి" అన్నాడు జానకిరాం రాజారావుతో.
 
    "మరి మన నదీ స్నానాలన్నీ మనిషి శుభ్రపడటానికేగా" అంది సుమలత.
 
    "అదే మరి! దేన్ని ఎంత వరకూ వాడుకోవాలో తెలియకపోవడమే విచారకరం. ఎగువ నించి వస్తున్న నదీ ప్రవాహంలో సగం కాలిన మనిషి అవశేషాలు కలుపుతూంటే దిగువనున్న రేవులో అదే నీటిని తలపై జల్లుకొని తరిస్తున్నామనుకుంటాం."
 
    ఒక్క క్షణం వరకూ ఎవరూ మాట్లాడలేదు. 'ఎంత కలుషితం చేసినా నేను నా పవిత్రతను కాపాడుకుంటూనే వుంటాను' అన్నట్టు నిబ్బరంగా నిండుగా గోదావరి ప్రవహిస్తోంది.
 
    లాంచీ ఒక కూత వేసింది. సరంగు కాస్త వేగం పెంచినట్టున్నాడు. లాంచీ నడక మారింది. ముందు వెనుకలుగా మిగిలిన లాంచీలు తమ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నాయి. 
 
    ఉదయకాలపు లేత ఎండ... నీటి మీద నించి వీచే చల్లని గాలీ ప్రయాణికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ప్రయాణీకుల్లో ఎవరో ఒకరిద్దరు గోదావరీ అందాన్ని, లాంచీన్నీ, ప్రయాణీకుల ఆనందాన్నీ తమ వీడియో కెమెరాలలో బంధించే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా తమ వైపుకు తిరిగినప్పుడల్లా ఎవరికివారు సర్దుకుని కూర్చుంటున్నారు. మెడలో పసుపు తాడున్న కొత్త పెళ్లి కూతురు మాత్రం తన జతగాడికి దగ్గరగా జరిగి తలొంచుకుంది. ఇంతలో డిస్పోజబుల్ గ్లాసులతో ఆ అమ్మాయి టీలూ, కాఫీలూ తెచ్చి ఎవరికేది కావలిస్తే అది అందిస్తోంది. కాఫీ, టిఫిన్లూ అయ్యాక లాంచీలోని ప్రయాణీకులు ఎవరిమట్టుకు వారు లోకాభిరామాయణంలో పడిపోయారు.
 
    జానకిరాం లేచి లాంచి ముందువైపుకు వెళ్లేడు. ప్రవాహాల్ని చీలుస్తూ ఎదురీదుతోంది లాంచి. ప్రవాహానికి కుడివైపున దూరంగా నీలిరంగు చీరకు జరీ అంచులా పల్చని ఇసుకతిన్నెలు... వాటికి ఆవల ఏ దేముడివో గుడిగోపురాలు... చూస్తుండగానే గట్టుకు లాంచీ ఎంతో దూరంగా వచ్చేసింది. తూర్పుదిక్కుకు చూస్తే... సూర్యుడు తన అందాల్ని నీటిలో చూసుకుంటూ మురిసిపోతున్నాడా అన్నట్లు ఆ నీటిపాయల మీద, నురగల మీదా బంగారు చెమ్కీ ఒలకబోసినట్లున్నాడు.
 
    అందాలన్నీ ప్రకృతిలోనివే. నాగరికత పేరుతో మానవుడు ప్రకృతిని ద్వంసం చేస్తూ తనకు తానే ముప్పు తెచ్చుకుంటున్నాడేమో అన్పించింది జానకిరాంకి. ప్రాణకోటి మనుగడకు దేముడు సమకూర్చి వడ్డించిన విస్తరే యీ ప్రకృతి.
 
    సరిగ్గా అప్పుడే పెద్ద శబ్దంతో మొదలయ్యిందో సినిమా పాట. లాంచికి ముందు వెనుకలుగా ఉన్న స్పీకర్లలోంచి ఆ పాట చెవులు అదిరేలా  విన్పిస్తోంది. అత్యద్భుతమైన రాగం... అతి ఛండాలమైన సాహిత్యం! ఆ పాటకి ద్వంద్వార్థాలున్నాయంటారు గాని, పదేళ్లు దాటిన ప్రతి మానవజీవికీ విన్పించేది ఒక అర్థంలోనే. అదే... సృష్టి రహస్యాల్ని విప్పి చెప్పే అర్థం...! 
 
    ఆ పాట గల సినిమా ఇటీవలే విడుదలై 'దుమ్మురేపేసింది' అని పేరు పడిపోయింది.
 
    అనుకోని సంఘటనలా ఆ పాట ఒక్కసారి వినపడ్డంతో మొదట బాంబు పడ్డట్టు అందరూ తుళ్లిపడ్డారు. క్రమంగా మరో ఆలోచన, మరో మాట లేకుండా చెవిరంధ్రాల్లోంచి మెదళ్లలోకి ఎగబాకే ఆ భావానికి ముఖంలో రంగులు మార్చడం మొదలు పెట్టారు. సినిమా హాళ్లలో అయితే అటువంటి పాట వచ్చినపుడు ఆ చీకట్లో అందరి దృష్టీ తెరపైనే వుంటుంది కాబట్టి ఎదుటివారి ముఖాలూ, వారి ఫీలింగ్స్ తెలియవు. ఇక్కడ ఈ వాతావరణంలో తండ్రులకెదురుగా పెళ్లి కెదిగిన కూతుళ్లూ వుండొచ్చు. కొత్త కోడళ్లూ వుండొచ్చు. ఏమైతేనేం అంతవరకూ ఎదురెదురుగా కూర్చున్న కొంతమంది సిగ్గుతో తలలు దించేసుకున్నారు. ఆ పాట రాసిన రచయిత కొత్తగా కాలేజీ నుండి వచ్చిన కుర్రాడట. అప్పుడే పది సినిమాల్లో పాటల రచయితగా బుక్కయిపోయి బుల్లితెరమీద కూడా ఏదో ప్రోగ్రాంలో యిరుక్కున్నాడట. ఈ ఏడాది అతగాడి పాటకే జాతీయ అవార్డు రావొచ్చన్న వూహాగానాలు చిత్రపరిశ్రమలో వూరేగుతున్నాయట.
 
    'మనిషి సంగీతం ద్వారా కూడా ధ్వని కాలుష్యం చేయగలడు' అన్పించింది.  
 
    జానకిరాం ఒక్క ఉదుటన లేచి వెళ్లేడు. దిగువన ఒక కార్నర్‌లో బల్ల మీద టేప్ రికార్డర్ పెట్టుకుని కూర్చున్నాడా అబ్బాయి. మెడల వరకూ పెరిగిన జుట్టూ, నల్లటి టైట్‌పేంటూ, ఎర్రచారల బనీనూ...
 
    "ఏంబాబూ... ఏంటి నీ పేరు" అడిగాడు జానకిరాం.
 
    "కొండ బాబండీ" అన్నాడా అబ్బాయి.
 
    "చూడు బాబూ... ఇంత మంచి వాతావరణంలో నీకు వెయ్యడానికి మరో పాటే దొరకలేదా" అడిగాడు. దానికి అతగాడు ఆశ్చర్యంగా చూసి,
 
    "దీనికేమండీ... ఇది మంచి పాటకాదా? ఈ ఏడాదిలో యిది సూపర్‌హిట్ సాంగండి" అన్నాడు.
 
    "అయితే కావచ్చుగానీ యిప్పుడు మాత్రం ఒద్దు."
 
    "ఇందాకెవరో వొచ్చి ఉషారైన పాటేయ్యమన్నారండి. మీరొక్కరు ఒద్దంటున్నారు గాని పెతి ట్రిప్పులోనూ యీ పాట నాలుగైదు సార్లయినా తప్పదండి. అడిగి మరీ వేయించుకుంటున్నారు జనం" అన్నాడు.
 
    "ఈ ట్రిప్పులో మాత్రం వదిలేయ్... ఏవైనా మంచి పాటలు మనసుకి ఆనందాన్నిచేవి వుంటే వెయ్యి... మన భాష కాకపోయినా ఫర్వాలేదు" అన్నాడు జానకిరాం.
 
    "మంచివంటే అన్నమయ్య పాటవెయ్యమంటారేంటి సార్. అవి పడతాయా లేకపోతే రాందాసులోనివెయ్యనా" అన్నాడు వాడు నవ్వుతూ.
 
    "ఆ రెండూ ఫర్వాలేదు... కాకపోతే కాస్త సౌండు తగ్గించి వెయ్యి. గోదావరి గలగలలు కూడా మమ్మల్ని విననియ్యి" అని చెప్పి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
 
    ఐదు నిమిషాల తర్వాత "అంతా రామమయం... జగమంతా రామమయం...' పాట పెద్ద సౌండుతో విన్పించింది. జానకిరాం అసహనంగా కదలడం చూసి, 'పోన్లేద్దురూ... వాడి ఆనందం వాడిది. కొందరికి అంత పెద్దగా వింటేనేగాని పాట విన్నట్టు వుండదు. సినిమా హాల్లో వేసే స్టీరియోఫోనిక్ సౌండుకి అలవాటు పడిపోతున్నారు మరి..." అంది సుమలత.
 
    జానకిరాం, రాజారావు యిద్దరూ లేచి లాంచి వెనుకవైపుకు నడిచి అక్కడ రైలింగ్ పట్టుకుని నిల్చున్నారు.
లాంచీ చేసిన కూతకు గోదావరి ఎగిసెగిసి చిమ్ముతోంది. సూర్యరశ్మికి మెరిసే నీటి బిందువుల అందం, అవి చేసే ధ్వని చూసి, విని ఆనందించాల్సిందే.
 
    పాట ఆగింది... నీటి మీది లాంచీ నిండు గర్భిణిలా మందగమనంతో సాగిపోతోంది. దూరంగా లేత నీలి రంగులో కొండలు... ఆవలి ఒడ్డున ముదురాకు పచ్చగా వృక్షాలు...గోదారికీ... వాటికీ మధ్య బంగారు రంగులో యిసుక తిన్నెలు! నదీ ప్రవాహపు అందాలు చూస్తూ తనువులే మరిచిపోతున్నారంతా.
 
    పట్టిసీమ దాటి ఎంత దూరమొచ్చిందో లాంచి... దూరంగా చిన్నగా గుడిగోపురాలు... ఇంతలో మైకులో ఎనౌన్స్‌మెంటు... లాంచీ సరంగు కాబోలు చెబుతున్నాడు.
 
    "అయ్యలారా...అమ్మలారా... ఒక్క క్షణం ఎడం వైపు కన్పించే ఆ చిన్న కొండను చూడండి. అక్కడే భక్త రామదాసు సినిమా షూటింగు జరిగింది. అదిగో... ఆ తెల్లటి బండరాయి పక్కనున్న చదునైన ప్రదేశంలోనే రామదాసు రాములోరి గుడి కట్టే సీను తీశేరు. అతగాడు చెప్పింది ఎంతవరకూ నిజమోగాని ప్రయాణికులంతా అటువైపే దృష్టి సారించి సినిమాలోని ఆయా సన్నివేశాల్నీ, దృశ్యాల్నీ జ్ఞప్తికి తెచ్చుకోనారంభించారు.
 
    యధావిధిగా మళ్లీ పాట మొదలయ్యింది.
 
    లాంచీ మరో అరగంట ముందుకు వెళ్లిందో లేదో... మరో ఎనౌన్స్‌మెంటు... 
 
    "అదిగో కుడివైపునున్న ఆ ఎత్తైన కొండను చూడండి. దాని మీద ఒక సిమ్మెంటు స్థంబం తెల్ల రంగు స్థూపంలో కన్పిస్తోంది చూడండి. ఇదిగో ఇటు పక్క యివతలి ఒడ్డున కొండవాలున ప్రాజెక్టు రాబోతోంది. ఆ ప్రాజెక్టు వస్తే ఎన్నో వేల ఎకరాల పంట భూములకు నీరందుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల యిక్కడ వున్న సుమారు 270 గిరిజన గ్రామాలు నీట్లో మునిగిపోతాయనీ, అందులో 70 గ్రామాలు పశ్చీమ గోదావరి జిల్లాకూ, 200 గ్రామాలు తూర్పుగోదావరి జిల్లాకూ చెందినవనీ పరిశీలకులు అంటున్నారు. అదే నిజమైతే ఈ గిరిజన కుటుంబాలని వేరే ప్రాంతాలకు తరలించాలి."
 
    జానకిరాం అటు వంక చూశాడు. పత్రికల్లో ఆ ప్రాజెక్టు తాలూకు వివరాలు, చర్చలూ చదివేడు. ఆ ప్రాజెక్టు వల్ల కొన్ని వేల ఎకరాల పంట భూమికి నీరందడం సంతోషమే అయినా, మరొక పక్క నిర్వాసితులైన గిరిజనుల్ని అక్కడ్నించి వేరొక చోటుకి తరలించడం వల్ల నాకగరికతలో యిమడలేని ఆ తెగ ఏమైపోతుంది?
 
    లాంచి వేగం తెలియకుండా నిబ్బరంగా పోతూనే ఉంది. ఎక్కడో నాసికాత్రయంబకంలో పుట్టి సుమారు వేయి మైళ్లు ప్రయాణించి ఎన్నో ప్రాంతాలనూ, అడువులనూ కలుపుకుంటూ ఉరకలతో పరుగులతో గోదావరి హాయిగా ప్రవహిస్తోంది. ప్రవాహానికిరువైపుల అందమైన ఆకుపచ్చని చెట్లు, కొండలు...
 
    "ఉప్పొంగి పోయింది గోదావరి... తాను చప్పున్న ఎగిసింది గోదావరి..." పాట లీలగా గాలితో తేలి వస్తున్నట్లుంది. బారులు బారులుగా ఆకాశంలో ఎగిరే పేరు తెలిల్యని పిట్టలు... ఒక్క మారు నీటిపైకి వాలి, ప్రవాహాన్ని ముద్దిడుకుని మళ్లీ ఆకాశంలోకి ఎగిసి గిరికీలు కొట్టడం... వాటి కేరింతల కూతల మధ్య వాటి కోసం ఎగిరిపడే అలలు... ఆ అలల సవ్వడులు... కనుల పండువగా వుంది. ప్రవాహానికి ఆవలి ఒడ్డు పొడువుగా సన్నని బాటేదో వున్నట్టు, అక్కడా అక్కడా మనిషి సంచారం కనబడుతోంది. రెండు మూడు చోట్ల ఎడ్లబండ్లూ; ఒక చోట ఆగిన ఆటో కూడ కనిపించడం విశేషంగా వుంది. 
 
    మళ్లీ మైకులో అనౌన్స్‌మెంట్ విన్పించింది.
 
    "కుడి వైపున వున్న ఆ చిన్న కొండను చూశారా. కొండ దిగువన ఇసుక మేట వేసి కన్పిస్తొంది గదా... అది మన సినిమా వాళ్లంతా యిష్టపడే లోకేషను... గతంలో అక్కడ చాలా సినిమాలే తీశారు. తప్పక చూడదగ్గర ప్రదేశం. టైముంటే వచ్చేటప్పుడు లాంచి కాసేపు ఆపుతాం... పోతే మీరంతా ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాపికొండలు మరి కొద్ది సేపట్లోనే మన కళ్లకు కన్పించబోతున్నాయి. ఈ సంతోష సమయంలో అందరికీ ఒక ప్రశ్న. ఎవరు ముందుగా కరెక్టుగా జవాబు చెబుతారో చూద్దాం. మన లాంచీ వెళ్తున్న దిక్కుకే చూడండి. తల్లి గోదావరి ఎంత వేగంతో వస్తోందో చూడండి. ఈ ప్రవాహం వెనుక అడ్డంగా నీలిరంగులో కొండలు కనిపిస్తున్నాయి. అవే పాపికొండలు! తల్లి గోదావరి ఆ పాపికొండలకు ఏ వైపు నుండి వస్తుందో చెప్పాలి."
 
    లాంచిలోని అందరి దృష్టీ అటువేపే మళ్లింది... కుడివైపు నుండి అని కొందరు, ఎడమ వైపు నుండి అని కొందరూ ఎవరికి తోచింది వారు చెప్పేరు. 
 
    "సరైన సమాధానమేదో నేను చెప్పక్కరలేదు... కాస్సేపాగితే లాంచి ఎటువైపు మళ్లుతుందో దాన్ని బట్టి మీకే తెలుస్తుంది" అన్నాడు సరంగు.
 
    మరి కాస్సేపటికి లాంచి నెమ్మదిగా కుడివైపుకు మళ్లింది... అందరూ కనులు విప్పార్చి ఆనందాశ్చర్యాలతో ఆ దృశ్యాలను చూస్తున్నారు. కనుచూపు మేర అంతా సౌందర్యమే! ప్రకృతిలోని రంగులన్నీ అక్కడే వున్నాయా? అన్నట్లుందా దృశ్యం.
 
    లాంచి ముందుకు దూసుకుపోతోంది. అక్కడ గోదావరి ఎంతలోతో సరంగు చెబుతున్నాడు.
 
    "పడవెక్కి భద్రాద్రి పోదామా... భద్రగిరి రాముని చూద్దామా" అనే పాట విన్పిస్తొంది.
 
    "ఈ పాట నాగేశ్వర్రావు వేసిన 'అందాల రాముడు' సిన్మాలోది కదూ. "
 
    "అదీ యిక్కడే తీసారట" అంటున్నాడో అరవై అయిదేళ్లాయన కోడలితో...
 
    "అప్పటికి నేను చిన్న పిల్లని, నాకు తెలియదు... కానీ 'గోదావరి' సినిమా మాత్రం ఇక్కడే తీశారట" అంది కోడలు. 
 
    భోజనాల కార్యక్రమం మొదలవడంతో అంతా సర్దుకున్నారు. కొందరు అట్ట పళ్లాలు తీసుకుని క్యూలో నిల్చున్నారు.
 
    "ఇదిగో సుమలతా... ఎందుకైనా మంచిదని దబ్బకాయ పచ్చడి కొంత సీసాలో తెచ్చాను." అంటూ బుట్టలోని సీసాని బయటకు తీసింది రాణి.
 
    "ఇకనేం ముందు వైట్ రైస్ తెచ్చుకుని పికిల్‌తో లాగించేసి ఆ తర్వాత కర్డ్ రైస్ తెచ్చుకుంటే సరి" అన్నాడు రాజారావు. 
 
    "అబ్బా... ఆ రెండు ముక్కలూ తెలుగులోనే అంటే బావుంటుంది కదా! పరభాష మీద అంత వ్యామోహం పనికిరాదు. అన్నాన్నీ, పెరుగునీ తెలుగులో అనలేంగానీ మన భాషకి ప్రాచీన భాష హోదా కావాలి అంతేనా?" అంది రాణి నవ్వుతూ.
 
    అక్కడంతా పిక్నిక్ వాతావరణం నెలకొంది. కొండబాబు అందరికీ కావల్సినవన్నీ అందిస్తున్నాడు. పరికిణీ, జాకెట్టు వేసుకున్న ఆ పిల్ల మాత్రం దూరంగా కూర్చుని అందరివంకా చూస్తోంది.
 
    భోజనాలు చేసిన కొందరు అట్ట ప్లేట్లను గోదావర్లోకి విసిరేస్తున్నారు. వాటిని వేయడానికి ప్రత్యేకంగా ఒక డ్రమ్ము వుంచారు.
 
    "చూస్తున్నారా..." అన్నట్టు జానకిరాం రాజారావు వంక చూసేడు.
 
    "పుష్కర స్నానాలు చేస్తూ మన కల్మషాన్నంతా నదిలో కలిపేయడం లేదుటండీ. ఇదీ అంతే అనుకోవాలి. లేదా మనం వదిలేసిన ఆహార పదార్థాలు జలచరాలకు ఆహారమౌతుందనుకోవాలి. ఏమైనా అంతా ఆ సముద్రంలో చేరేదే గదా" అన్నాడు రాజారావు అందరివంకా చూస్తూ. 
 
    ఆ మాటలు కొందరి చెవులకు సోకాయి. అయినా ఎవరి పనుల్లో వారు పడిపోయారు. భోజనాలయ్యాక కాస్త కునుకు తీసేవారు కొందరైతే, పేకాట ఇతర ఆటలకు సిద్ధమైనవారు మరికొందరు. 
 
    "వచ్చేదే పేరంటాల పల్లి. లాంచీ అరగంట సేపు ఆపుతాం. దిగవలసిన వాళ్లు తొందరగా వచ్చేయాలి" అనౌన్స్‌మెంటు చేసిన పావుగంటలో లాంచి ఎడమవిపు ఒడ్డుకు తీసి లంగరేసి, జనాలు దిగడానికి వీలుగా బల్లలు కట్టేరు. అప్పటికే అక్కడకు చేరిన లాంచీల్లోని జనం వాలుగా ఉన్న ఆ కొండవైపుకి నెమ్మదిగా చేరుకుంటున్నారు.
 
    "మెట్లు కూడా సరిగా వున్నట్లు లేవు. మేం రాము బాబూ. మీరు కావలిస్తే వెళ్లండి" అంది సుమలత.
 
    జానకిరాం, రాజారావు కిందకి దిగి కొండవైపు నడిచేరు.
 
    అది ఒక గిరిజన పల్లె. గిరిజనులు తాము పల్చని వెదురు బద్దలతో తయారు చేసిన పువ్వులనూ, ఇళ్ల, మేడల నమూనాలను నాగరికులకు అమ్ముతున్నారు. అందంగా కళాత్మకంగా వుండే ఆ పువ్వులనూ, యితర వస్తువులనూ 20రూపాయల నుండి 200 రూపాయల వరకూ ధరలు కట్టి అమ్ముతున్నారు. అక్కడి గిరిజనులందరిదీ ఒకే మాట. ఒకే ధర... ఎవరు అమ్మినా అదే ధర. వారిలోని కళాతృష్ణని ప్రోత్సహించే వుద్దేశంతో కొందరూ, ఇంటి అలంకరణకు పనికొస్తాయని కొందరూ, బహుమతులుగా యిచ్చే వుద్దేశంతో మరికొందరు వాటిని కొంటున్నారు. 
 
    అరగంటలో లాంచీల సైరన్లు కూసేయి. జనమంతా రేవు చేరుకుని లాంచీలు ఎక్కేరు. అక్కన్నించి లాంచీ తిరుగు ప్రాయణం. వెళ్లేటప్పుడు ఉన్న ఉత్సాహం తిరుగు ప్రయాణమప్పుడు ఉండదని కాబోలు నిర్వాహకులు కాలక్షేపం కోసం హౌసీ గేం మొదలు పెట్టేరు. పిల్లలూ, పెద్దలూ అంతా టిక్కెట్లు కొన్నారు. ఇరవై నిమిషాలు సాగిన ఆ ఆటలో సుమలతకు ఇరవై రూపాయలు వచ్చాయి.
 
    నాలుగు గంటల ప్రాంతంలో అందరికీ టీలు సప్లై చేయబడ్డాయి. జానకిరాం, రాజారావు లాంచి టాప్ ఎక్కి ఒక పక్కగా కూర్చున్నారు. "ఇప్పుడైతే ఇలా ఎగబడి టికెట్లు కొనుక్కు వస్తున్నారు... గానీ ఒకప్పుడు లాంచీల్లో భద్రాచలం వెళ్లేవాళ్ళు తప్ప యిలా విహార యాత్రలకి ఎవరూ వెళ్ళేవారు కాదంట. ఇందంబడి సినిమాలు తీయడం కూడా ఎక్కువయిందిలే..."
 
    తమ ఎదురుగా కూర్చున్న ఖద్దరు చొక్కా ఆసామి పక్కాయనతో అంటున్నాడు.
 
    "ఇంతకీ ఆ ప్రజెక్టేదో వస్తాదంటావా?"
 
    "వస్తాదో రాదోగాని ప్రెచారం బాగానే అయిపోయింది" అని కాస్సేపాగి, "అదిగో అటు చూడు... ఆ రెండో లాంచి ఇప్పుడు నడుస్తున్న ప్రాంతంలోనే ఆ మద్దె సినిమా కుర్రోడొకడు గోదాట్లో పడి మునిగిపోయాడు. అన్నెంపున్నెం తెలీని కుర్రోడు. పెద్ద హీరోకి డూపంట. ఈతొచ్చునో రాదో అడక్కుండానే దింపేసుంటారు... పాపం ఆ హీరోగారి ప్రేణానికి తన ప్రేణం అడ్డెట్టి అన్నేయమైపోయాడు. అప్పట్లో రెండ్రోజులు టీవీల్లో  గొడవ జరిగింది... చూపించేరు. అంతే ఆ సంగతి మర్లేదు."
 
    "ఏటుంటాదిలే, జనానికి జీవనోపాదుల్లేవు. ఏ పనికైనా సిద్ధపడిపోతున్నారు. పేణాలొడ్డి మరీ పన్జేస్తన్నారు"
 
    "ఏదైతేగానీ సెట్టంత కుర్రోడు, తల్లీదండ్రికీ  కాకుండా పోనాడుగదా"   
 
    వాళ్ల మాటలు జానకిరాంలో ఆసక్తినీ, ఆలోచననీ రేపాయి.
 
    ప్రవాహ వేగంలో లాంచీ సాగిపోతోంది. పడమటి కొండవైపు సూర్యుడూ తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. గోదావరిలో వింతవింత రంగులు! ఆకాశంలో బారులు బారులుగా ఎగిరే పిట్టలు నీటిని తాగి చెట్ల మీదికి చేరుకుంటున్నాయి.
 
    "పట్టెసీమ చేరడానికి మరొక రెండు గంటలు పడుతుంది... ఈలోగా అందర్నీ ఉత్సాహ పరచేందుకు ఓ ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి అందరూ లాంచీ టాప్ మీదికి రావాలి..." అనౌన్స్‌మెంట్ వినిపించింది.
అప్పటికప్పుడే టాప్ మీద ఒక పక్క స్టేజీలా చేసి వెనుక తెర కట్టేరు.
 
    కొండబాబూ క్రాఫింగ్ మార్చేడు... నీలంరంగు ఫేంటు మీద ఎర్ర బనీను వేసుకుని, నల్ల కళ్లద్దాలు పెట్టేడు. ఆ పిల్ల ముఖానికి మందంగా పౌడరు పులిమి మెరిసే బొట్టు పెట్టుకుంది. ఎర్రలంగా మీద కొత్తగా తెల్లవోణీ పైట వేసింది.
 
    గుండెలు దడదడలాడేట్టు సినిమా పాట మొదలైంది. ఉదయం బలవంతంగా ఆపించిన పాటే. ఆ పాటకు తగ్గట్ట్లూ వాళ్లిద్దరే డేన్సు చేయడం మొదలెట్టారు. ఆ పాటరాసిన రచయితదీ; ట్యూనును కూర్చిన సంగీతదర్శకుడిదీ... ఇద్దరి జన్మలూ ధన్యమయ్యేలా... 'అచ్చం సిన్మాలో ఆళ్ల్లిద్దర్లాగే చేశార్రా' అన్నట్లు నర్తించారిద్దరూ.
 
    పాట ఆగింది. చప్పట్ల మోత మోగింది.
 
    రెండో పాట... మొదటి పాటను తలదన్నే పాట మొదలైంది. భావానికి తగ్గట్టూ ఒళ్లు విరుపులూ, కౌగిలింతలూ అంది పుచ్చుకోడాలూ స్టెప్పులూ... ఒకటేమిటి ఆ పాట గల సిన్మాని ఎన్ని మార్లు చూశారోగాని తు.చ.తప్పకుండా అన్ని భంగిమల్నీ చూపిస్తున్నారిద్దరూ. ఇంకా మైనారిటీయైనా తీరిందో లేదో అన్నట్లున్న కుర్రాడు... ఓణీ కూడా సరిగా వేసుకోలేని అమ్మాయీ... వెగటు పుట్టించే హావభావాలతో ఆ రెండర్థాల పాటను అభినయిస్తుంటే ఆనందించే జనం ఆనందిస్తున్నారు. జానకిరాం లేచి చివరినున్న కుర్చీని వెనక్కు తిప్పి కళ్లు మూసుకుని కూర్చున్నాడు. చూట్టూ చీకట్లు అలుముకుంటున్నాయి. గాలిలో చిరు చలి జొరబడింది.
 
    ఎప్పుడు పుట్టిందో చిన్న కునుకు... ఉలికి పడి లేచే సరికి ఎదురుగా వెండి పళ్లెంలా చంద్రుడు - గోదావరిలోకి పాలొలక పోస్తున్నట్లున్నాడు.
 
    పాటల కోలాహలం ఆగినట్టుంది... పట్టెసీమకు మరో పది నిమిషాల్లో చేరనున్నట్లు ఎనౌన్స్‌మెంట్ విన్పించింది. జనంలో కదలిక మొదలయ్యింది.
 
    "మీరిక్కడున్నారా...?" అంటూ వచ్చిన సుమలత "పాపం చిన్నపిల్లలయినా బాగానే చేశారండీ... అందరూ ఎంతోకొంత డబ్బులిస్తున్నారు. నాకు అనుకోకుండా హౌసీ ఆటలో వచ్చిన డబ్బుల్ని వాళ్లకిచ్చేయాలని పించింది...  ఇవ్వనా?" అంటూ జానకిరాం ముఖంలోకి చూసింది.
 
    "వాళ్ల పట్ల జాలా? ప్రోత్సహించడమా? లేక ఆనందమా?" అన్నాడు కాస్త విసుగ్గానే.
 
    "ఏదో ఒకటి లెండి! ఇవ్వలనిపించి మిమ్మల్ని అడిగాను" అంది.
 
    "సరే... నీ యిష్టం" అన్నాడు ముక్తసరిగా.
 
* * *
 
    రేవు లంగరు వేశారు. ఉదయం ఎక్కేటప్పుడు ఎంత ఆత్రంగా తోసుకుంటూ ఎక్కేరో... జనం అంతే తొందరగా కిందికి దిగడానికి ఆతృతపడుతున్నారు.
 
    "జాగ్రత్తమ్మా... తొందర్లేదు... లాంచీ ఎక్కడికీ పోదు. నెమ్మదిగా దిగండి" అంటున్నాడు సరంగు. లాంచి దిగిన జనం తాము అనుభవించిన ఆనందాన్ని గోదావరి ఒడ్డునే వదిలేసినట్టు నీరసంగా మెట్లెక్కుతున్నారు.
రాణీ,సుమలత, రాజారావు ముందు వరుసలో వుండి లాంచి దిగి మెట్ల మీద నిల్చున్నారు. లాంచి కాస్త ఖాళీ అయ్యేక జానకిరాం లేచేడు.
 
    గట్టుమీద దీపాల వరుసలు వరుసలుగా మిరమిట్లు గొల్పుతున్నాయి.
 
    బ్రిడ్జి మీద ఏదో రైలు వెళ్లి పోతోంది. నెమ్మదిగా నడుస్తున్న వాళ్లు ఇంజను ముందు భాగంలో కింద చీకట్లో కూర్చుని వున్న ఆ యిద్దర్నీ చూసి ఒక్క క్షణం ఆగేడు.
 
    "అన్నా... దీంతో రేపా ముసిలోడికి అద్దె డబ్బులిచ్చేయాలిరా. తిడతన్నాడు..." అంటుందో పిల్ల.
 
    "ఇవ్వొచ్చులే... ఆడేం డబ్బెట్టి ఆ స్థలం కొన్నాడా ఏటి? ఆక్రమించేసి నాలుగు గుడిసెలేసి అద్దెకిచ్చేడు. ఆడికి పూరాగా అద్దెకిస్తూ మనమేటి తినాల? ఈటితో ముందు సరుకులు కొనాల" అంటున్నాడా కుర్రాడు.
 
    ఆ యిద్దరూ ఎవరో అర్థమైంది జానకిరాంకి. వాళ్లు డాన్సులు చేస్తున్నంత సేపూ వాళ్లనీ, వాళ్ళనారీతిలో పెంచిన తల్లిదండ్రుల్నీ అసహ్యించుకున్నాడు. అసహ్యించుకోవాల్సింది వాళ్లని కాదేమోననిపించిందిప్పుడు.
 
    కడుపులో ఒక్కసారి తిప్పిందతనికి...
 
    వెన్నెల్లో గోదావరి గలగలా పార్తూనే ఉంది.
 
* * * 
 
    "మొత్తానికి మన రాజమండ్రి ప్రయాణం బాగానే జరిగింది కదండీ... మనం అనుకున్న దాని కంటె ఎక్కువగానే ఎంజాయ్ చేశాం. అవునా?" అంది సుమలత ఆ రాత్రి పక్క మీదికి భర్త పక్కకి జేరుతూ...
 
    "ఆఁ..." అని మాత్రమే అని వూరుకున్నాడు జానకిరాం. అది ఆయనగారి నిద్రావస్థ మధ్య నుంచి వచ్చిన శబ్దమో... ఆలోచనా తరంగంలోంచి అన్యమనస్కంగా వచ్చిన అంగీకార ధ్వనో ఆమెకర్థం కాలేదు.
 
    జానకిరాం యిప్పుడు రాజమండ్రిని తల్చుకుంటే గతంలో గుర్తుకొచ్చిన వ్యక్తులు, స్థలాలూ, చారిత్రక సంఘటనలతో పాటు ఒక తెరవేల్పు కోసం ప్రాణాన్ని అడ్డుపెట్టిన ఒక పేరులేని డూపూ, లాంచీలో విహార యాత్రలకొచ్చే జనానికి టీ కప్పులందిస్తూ, వారిని రంజింప చేయడానికి కొన్ని గంటలు అసభ్య శారీరక శ్రమ చేసిన అనాథ బీద పిల్లలు కూడా గుర్తుకొస్తున్నారు.
 
(నవ్య వీక్లీ అక్టోబర్ 22, 2008 సంచికలో ప్రచురితం)
 
  
   
    
    
    
Comments