గాలిదోషం - వేమూరి వేంకటేశ్వరరావు

  
“గాలిలో ఎగురుతూన్నట్లు ఎప్పుడైనా కలగన్నావా?” మిడతంభొట్లు మేష్టారు భార్యని అడిగేరు.

    “ఉహుఁ” అని పరాగ్గా సమాధానం. కారం పెట్టి కూర వండడానికి గుత్తి వంకాయలు తరుగుతూన్న రాధకి, భర్త వేసిన చొప్పదంటు ప్రశ్నకి, అంతకంటె విపులంగా సమాధానం చెప్పవలసిన అవసరం కనిపించలేదు.

    “అది కాదు, రాధా! ప్రతి వాడు గాలిలో ఎగరాలని కలలు కంటాడు. విమానంలో కూర్చుని ఎగరడం మాట కాదు నేను చెప్పేది. నిజంగా లఘుయానం. అనగా అమాంతం గాలిలోకి తేలిపోగలగడం గురించి నేను చెబుతూంట. లియనార్డో డ వించీ రోజులనుండి ఈ రకం ఆలోచనలు మానవుడి మస్తిష్కంలో మెరుస్తూనే ఉన్నాయి,” అని విశదీకరించేరు ప్రొఫెసర్ మిడతంభొట్లు.

    మిడతంభొట్లు అసలు పేరు చాలమందికి తెలియదు. ‘చెంబు గారు’, ‘గొట్టం గాడు’ లా ఆంధ్రదేశంలో చెలామణీ అవుతున్న గౌరవనామాలలో ఇదొకటి. 

    “ఇంటికొచ్చింది మొదలు ఒకటే గొడవ. పోయి పత్రిక చదువుకుందురూ,” తరిగిన వంకాయలు నీళ్లల్లో పడేస్తూ విసుక్కుంది రాధ.

    అంత సులభంగా వదలిపెట్టే రకం అయితే మిడతంభొట్లు అంత చిన్న వయస్సులో ప్రొఫెసరు అయేవాడా? ఆంధ్రదేశంలో ఎక్కడో లెక్చరరు గానో, రీడరు గానో రాటవుతూ ఉండేవాడు. మిడతంభొట్లు ఇంట గెలిచిన తర్వాతే రచ్చ గెలిచేడు. 

    “గాలిలో తేలిపోవడం అంటే ఏమిటనుకున్నావు? రెక్కలు లేకుండా, యంత్ర సహాయం లేకుండా, ఇంద్రజాలం చెయ్యకుండా ఎప్పుడైనా గాలిలో తేలిపోయావా? అలా “చల్లగాలిలో…మెల్లమెల్లగా…తేలిపోదాం, పదరా” అని పాడుకుంటూ గాలిలోకి తేలిపోవాలన్న కోరికైనా పుట్టలేదా నీకు?”

    “లేకేమి. పెళ్లి కాకపూర్వం సముద్రపుటొడ్డుకి షికారుకెళ్లి, భవిష్యత్తుని తలుచుకుంటూ, అలా…, అలా…ఊహాలోకంలో తేలిపోతూ చీకూ చింతా లేకుండా గాలి మేడలు కట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటే, గుదిబండలా మిమ్మల్ని నా మెడకేసి కట్టేసి నా ప్రయాణాలని భూస్థాపితం చేసేసేరు మా పెద్దవాళ్లు” అంటూ రాధ కత్తిపీట దగ్గరనుండి లేచింది. 

    రాధ మాటలలోని వెటకారం మేష్టారు గమనించకపోలేదు. ఏ పెళ్లాం ఏ మగవాడిని ఇంతకంటె గౌరవంగా చూసిందని, రాధ తన మాటలు లెక్క చెయ్యలేదని బాధ పడడానికి? చేతిలో ఉన్న పత్రికని నేలకేసి కొట్టేరు మిడతంభొట్లు మేష్టారు. 

    “అది కాదండీ. ఎగురుతూన్నట్లు నేనూ కలలు కన్నాను. కల కల్ల అవుతుంది కాని నిజం ఎలా అవుతుంది? ఒక సారి మంతా వారి మేడ మీదున్న బట్టల దండెం మీదకి వెళ్లి వాలినట్లు కల వచ్చింది. ఎవ్వరేనా చూస్తున్నారేమోనని నేను సిగ్గుతో చచ్చిపోయాననుకొండి. అదేమిటో శరీరం అంతా దూది పింజలా అయిపోయి గాలిలో అలా అలా తేలుతూ వెళ్లిపోయాను.

    “చూశావా! చూశావా! ఇలాంటి కల రావడానికి కారణం ఏమై ఉంటుందా అని ఎప్పుడైనా ఆలోచించేవా?” దొరికిన సదవకాశాన్ని దుర్వినియోగం చెయ్యదలుచుకోలేదు మిడతంభొట్లు. “రాధా, కల అంటే ఏమిటో తెలుసా? మనం నిద్ర పోతూన్నప్పుడు మన మెదడులోని నాడీమండలానికి ఒక అవ్యక్తమైన ప్రేరేపణ జరిగిందనుకుందాం. ఈ ప్రేరేపణ లిప్త మాత్రపు కాలంలో, సుషుప్తావస్తలో ఉన్న మన మనోవీధిలో సందర్భోచితమైన ఒక దృశ్యాన్ని సృష్టిస్తుందిట. అది కల రూపంలో మనకి సాక్షాత్కరిస్తుందిట.”

    తన ఎడమ చెయ్యి మేష్టారి నుదిటి మీద ఉంచి, “ఏమిటో మీ వరస నాకు బొత్తిగా అర్థం అవడం లేదు. మీ మేష్టర్లు అంతా ఆ చింత చెట్టు కింద కూర్చుని చదరంగం ఆడతారాయిను. ఒళ్లు వెచ్చగా లేదే. గాలి దోషమో ఏమిటో. సిద్ధాంతి గారిని పిలిపిస్తాను. ఆయన ఒక సారి వచ్చి చూసి పోతే నాకూ కొంచెం స్థిమితంగా ఉంటుంది.” పీటలు వాల్చి, కంచాలు పెడుతూన్న రాధ నిజంగానే ఆరాట పడుతోందో, వెటకారం చేస్తోందో మేష్టారికి అర్ధం కాలేదు. 

    “గోమూత్రం, నిమ్మకాయ రసం, రుద్రజడాకు పసరు కలిపి దానిని తేనెతో రంగరించి పుచ్చుకోమన్నావు కాదు. ఇంకా నయం. మా నాన్నగారు దగ్గరుంటే, నీ మాటలు నమ్మి లేఖసిస్ 200 మూడు మాత్రలు వేసేసి తన హొమోపతీ మందు తడాఖా చూపించేసేవారు. ఒకసారి ఏమి జరిగిందో చెబితే నువ్వు నమ్మవు.”

    “నమ్మకపోయినా నమ్మకపోవచ్చు. నేను ఒద్దంటే మాత్రం మీరు చెప్పడం మానుతారా ఏమైనానా.”

    “మెడ్రాసులో ఒకసారి భౌతిక శాస్త్ర పండితుల సదస్సు అయితే వేళ్లేను. దాశప్రకాష్ హొటేల్లో బస….”

    “నాతో పొలం పని మీద పెంటకోట వెళుతున్నానని చెప్పి, నాకు తెలియకుండా మెడ్రాసు వెళ్లేరా? బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. గాలిదోషం పట్టిందంటే పట్టదూ?”

    “ఆగు, రాధా, ఆగు! పెంటకోటలో సముద్రం ఉంది తప్ప పొలాలు లేవు. మన పొలాలు పొలమూరులో ఉన్నాయి. కనుక ఆ విషయం అటుంచి నేను చెప్పే విషయం కడితేరా విను. ఆఁ, ఎక్కడున్నాం? ఆఁ  దాశప్రకాష్ హొటేలు. అకస్మాత్తుగా హొటేలుకి నిప్పంటుకుంది. పెద్ద గందరగోళం. అంతా పరుగులు, పెడ బొబ్బలు పెడుతున్నారు. అందరూ తప్పించుకుని పారిపోయినట్లున్నారు. నేనొక్కడినే గదిలో బందీనయిపోయాను. గదిలో పొగ కమ్ముకు పోతున్నాది. ఏ తలుపు తీద్దామన్నా తెరుచుకోదు. వేడికి అనుకుంటాను, అన్ని తలుపులూ బిగుసుకుపోయాయి. నాకు చెమటలు పోసేస్తున్నాయి.”

    “అదేమిటండీ. ఇన్నాళ్లూ నాకు ఎందుకు చెప్పలేదు?”

    “చెప్పనీ, రాధా. చెమటలు పోసెస్తున్నాయని కదూ చెప్పేను? నా ఆర్తనాదం ఎవ్వరూ వినిపించుకున్నట్లు లేదు. ఈ లోగా అగ్నిమాపక దళాలు గణ గణ గంట వాయించుకుంటూ వస్తూన్న శబ్దం వినిపించింది. 

    అమ్మయ్య, ఎవ్వరో ఒక్కరు రక్షించకపోరు అని ధైర్యం వచ్చింది. రాను రాను గంటల శబ్దానికి చెవులు గింగుర్లెత్తిపోతున్నాయి. మంచం పక్కన ఉన్న అలారం గడియారం ధ్వనిలో ఆ గంటల ధ్వని కలిసిపోయింది. మెలుకువ వచ్చేసింది.” చేతులు కంచంలో కడుక్కుంటూ కథనం పూర్తి చేసేరు. 

    “నమ్మబుల్ గానే ఉందని నేనంటే మీరు నమ్ముతారా?”

    “వెటకారం చెయ్యకు, రాధా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటో నీకు తెలుసా? కనీసం పది నిమిషాల పాటైనా ఈ కల కని ఉంటానని నా అనుమానం. పది నిమిషాలు కాకపోయినా, ఆ  మంటలు, ఆ ఆత్రుత, ఆ కంగారులో పది నిమిషాలు దొర్లినట్లు అనిపించింది. ఆ  కల ఆఖరు క్షణాలలో కదా అగ్నిమాపక దళాల వారు గంట మోగించుకుంటూ రావడం జరిగింది? అదే సమయంలో అలారం గడియారం కూడ గంట కొట్టడం మొదలెట్టిందంటే ఆశ్చర్యంగా లేదూ?”

    “అవునుస్మండీ!”

    “అసలు అలారం ఎప్పుడు కొడుతుందో కలకి తెలియదు కదా. నిజానికి గడియారం చప్పుడు చేసే వరకు మనం గాఢ నిద్రలోనే ఉంటాం. నిజమైన గాఢనిద్రలో కలలు రావు. అలారం గంట కొట్టిన ఉత్తర క్షణంలో ముందస్తుగా గాఢ నిద్ర మామూలు నిద్రగా మారుతుంది. ఈ మామూలు నిద్రలోనే మనం కలలు కంటాం. ఇంకా గడియారం గోల పెడుతున్నాది కనుక మరొక లిప్త మాత్రపు కాలంలో మనకి మెలుకువ వచ్చెస్తుంది. కనుక మన గడియారం గంట కొట్టడం మొదలు పెట్టిన తరువాత, మెలుకువ రాడానికి ముందు ఉన్న లిప్త మాత్రపు కాలంలో నేను మెడ్రాసు వెళ్లినట్లు, హొటేలుకి నిప్పంటుకున్నట్లు ఒక కథ అల్లి అకస్మాత్తుగా వచ్చిన అలారం చప్పుడుకి ఒక అర్థం కల్పించిందన్నమాట, మన మెదడు.” పక్క మీద నడ్డివాల్చి, చదువుకుందుకని ఒక పుస్తకం పట్టుకుని కథ ముగించేరు మిడతంభొట్లు.

* * *

    దంతధావనం పూర్తి చేసుకుని, కాఫీ కుంఫటి దగ్గర పీట మీద కూర్చుని కాఫీ తాగుతూ, “అద్గది! అర్థం అయింది. వాతప్లవనం! దీనినే ఇంగ్లీషులో లెవిటేషన్ అంటారు. స్వతహాగా నీళ్లల్లో మునిగిపోయే మానవుడు శవాసనం వేసి తేలడం లేదూ? అలాగే ఈ భూమి చుట్టూ ఉండే వాతావరణం అనే ‘గాలి సముద్రం’ అడుగున ఉన్న మానవుడు గాలిలోకి ఎందుకు తేలకూడదు? ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మనిషి నీటిలో తేలినట్లే గాలిలో తేలడం అనేది జరగొచ్చు కదా. ఇది సాధ్యమేనా? పద్మపాదాచార్యులవారు నీటిలో తేలిపోతూ నడిచేరని చరిత్ర చెబుతోందే. ఆయన పాదాలకి అడుగున పద్మాలు మొలిచేయనిన్నీ, అందుచేతనే ఆయన నీటిలో మునిగిపోకుండా తేలేరనిన్నీ…”

    మేష్టారి వాలకం చూసి రాధ కంగారు పడుతూ ఉంటే ఆయన అదేమీ పట్టించుకోకుండా…

    “…రాధా, రాత్రి నిద్ర నుండి లేచేసరికి మిద్ది మీద నుండి కిందనున్న మంచం మీదకి పడుతూన్నట్లు అనిపించింది. అసలు రాత్రల్లా వాయుయానం చేస్తూన్నట్లే అనిపించింది. కలో? నిజమో? వైష్ణవ మాయో? లేక కలే నిజమయిందో? అంతా అయోమయంగా ఉందనుకో. ప్రతి క్షణం క్షుణ్ణంగా వర్ణించి చెప్పగలను. చల్లటి గాలి వీస్తోంది. ఆకాశం నిండా శ్రావణ మేఘాలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. నేనేమో గాలి కెరటాలలో తేలుతూ, నారదులవారిలా ప్రయాణం చేస్తూ, చుట్టూ చూద్దును కదా! అది కల కాదు. పచ్చి నిజం. ఇంటి కప్పుకున్న వాసాలు చేతికి తగిలేయి. మంచం కోళ్లు ఎదిగిపోయేయో ఏమో అని కంగారు పడుతూ పరుపుని చేతులతో తడిమి చూసేను. వీపు కింద పరుపు లేదు. అసలు నేను మంచం మీద లేనేలేను. నా వీపుకీ, మంచం మీదున్న పరుపుకీ మధ్య కనీసం పదడుగుల జాగా ఉంది. పక్కకి ఒత్తిగిల్లి చూసేను. ఒక్క కండరం శ్రమించకుండా, ఇచ్ఛామాత్రంగా ఒత్తిగిల్ల గలిగేను. ఒక్కసారి నా గుండె గుభేలు మంది. వెంటనే పదడుగుల ఎత్తు నుండి కిందనున్న పరుపు మీదకి దుబ్బుమని పడ్డాను.”

    “బావుంది, మీ వరస. మీ ఆటలు ఇక నా దగ్గర సాగవు. ఇంతసేపూ నేనొక వెర్రిమాలోకంలా మీరు చెప్పిన మాటలన్నీ కళ్లప్పగించి, చెవులింతింత చేసుకుని వింటున్నాను. ఇహ వేళాకోళాలు కట్టిపెట్టండి. మీరు కథల పోటీకి కథ రాస్తున్నారు. మీకు తట్టిన ఊహలని నా మీద ప్రయోగించి చూస్తున్నారు. అవునా?”

    “రాధా, ఇదేమీ కాకమ్మ కథ కాదు. కథల పోటీ కథ అంతకంటె కాదు.”

    “కాకపోతే ఏమిటండీ! నేనూ కలలు కన్నాను. ఒక సారి కలలో ఉప కల. ఎంత గాభరా పడ్డానో మీకేం తెలుసు. అలాగని ఊళ్లో వాళ్లందరిని కంగారు పెట్టేసేనా?”

    “జరిగింది మాత్రం నిజం. నమ్ము. నమ్మకపో.”

    “ఫిజిక్సు మేష్టారూ, మనం ఈ భూమి మీద ఉన్నాం. ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని మీకు నేను చెప్పక్కరలేదు. కనుక గాలిలో అమాంతం అలా తేలిపోవడం అసంభవం. ఇప్పటికేనా మీ సోది ఆపండి. ఎవ్వరైనా వింటే వెర్రో, పిచ్చో అనుకుంటారు.”

    “ఆహాహా! ఇప్పుడొచ్చిన చిక్కల్లా అక్కడే. నాకూ నమ్మాలని లేదు. మరొక సందర్భంలో అయితే నేనూ నమ్మేవాడిని కాను. కాని నమ్మవలసిన అవసరం వచ్చింది. నా యీ అనుభవానికి శాస్త్రసమ్మతమైన విపులీకరణ ఏదైనా పుస్తకాలలో ఉంటుందేమోనని యూనివర్శిటీ లోని గ్రంథాలయానికి వెళ్లి వెతికేను. కింద అరలలో ఉన్న పుస్తకాలన్నీ వెతికి, పై అరలలో ఉన్న పుస్తకాలు కూడ చూద్దామని ఒక్క సారి లేచి నిలబడ్డాను. అంతే ఒక్క సారి కళ్లు చీకట్లు కమ్మేయి. కూర్చున్న మనిషి గభీమని లేచి నిలబడితే కళ్లు చీకట్లు కమ్మడంలో వింతేమీ లేదు. కాని కళ్లు విప్పి చూద్దును కదా. మాయాబజారులో ఘటోత్కచుడిలా పైకి తేలిపోయేను. కావలసిన పుస్తకం కళ్ళకి ఎదురుగా ఉంది కాని, కాళ్లు నేలకి ఆనుకుని లేవు. ఏదో పైత్యం చేసిందని….”

    “అమ్మా! ఈ రోజు సప్తమీ బుధవారం. మృగశిర ఘడియలు సాయంకాలం నాలుగు గంటల వరకు. అమ్మా! రాధమ్మా! ఏమిటి? బాబుగారికి అస్వస్థతగా ఉందని కబురు పెట్టేవు.” అంటూ అవధాని గారు లోపలికి రానే వచ్చారు. వస్తూనే దేవుడి గదిలోకి వెళ్లి, నేల మీద యంత్రం వేసి, “ఓం, హ్రీం, హ్రూం” అంటూ మంత్రాలు చదవడం మొదలుపెట్టేరు. 

    “మీ అందరికీ మతులు పోయి ఉండాలి. ఇంత బతుకూ బతికి ఇంటెనక్కాల చచ్చినట్లు, భౌతిక శాస్త్రం అవుపోశన పట్టేసిన నేను భూతాలన్నా, దయ్యాలన్నా, చెడుపూ, చిల్లంగీ అన్నా నమ్ముతానా?”

    మిడతంభొట్లు మేష్టారి గొడవ పట్టించుకునే ధ్యాసలో లేరు అవధాని గారు.

    “…గోవిందా, విష్ణవే, మధుసూదనా, …అమ్మాయీ! మన చిరంజీవి జాతకం ఇలా పట్రా అమ్మా…వామనాయనమః, శ్రీధరా, హృషీకేశా…జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం, మహాద్యుతిం,..హ్రూం, హ్రీం, డుర్…” అంటూ అవధాని మంత్రాలు చదువుతూ, పూజాసామగ్రి కావాలని ఆదేశాలు అదే గుక్కలో ఇస్తూ, మధ్యలో ఒక గాఠి పొడుం పట్టు లాగించేరు. 

    “దీనినే మనవాళ్లు అష్టావధానం అంటారు కాబోలు” అని అవధాని గారిని ఎగతాళి చెయ్యబోతే రాధ రుసరుసలాడుతూ ఆయనని వారించింది.

    “పంచమాధిపతి అయిన రవి తృతీయ షష్టాధిపతి అయిన బుద్ధుణ్ణి వక్ర దృష్టితో చూడడం వల్లనూ, శతృ స్థానమందు చంద్రుడుండి గురునిచే చూడబడుట చేతనున్నూ, జాతకుడి మనో చలనానికి…”

    ఢామ్మని తలుపు చేసిన చప్పుడు చందాన్ని బట్టి మిడతంభొట్లు కోపంతో బయటకు నిష్క్రమించేరని సూక్ష్మగ్రాహి అయిన ఆయన సహధర్మచారిణి అర్థం చేసుకుంది. 

* * *

    ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సమ్మేళనం జరగబోతూందన్న వార్త చెవిని పడేసరికికల్లా మిడతంభొట్లు మనస్సు ఎగిరి గంతేసింది. ఈ మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని ఎంతో ఆరాటంతో సమావేశం కార్యదర్శి సుదర్శనం గారి దర్శనం చేసుకున్నాడు మిడతంభొట్లు. ఊపిరి తిరగని పనులతో సతమతమవుతూ, ఒక చెవితో సుదర్శనం మిడతంభొట్లు కథనాన్ని విన్నారు. విని, 

    “మేష్టారూ! సమావేశపు ఆఖరు రోజున అతిథులందరి గౌరవార్ధం వినోద కార్యక్రమం ఉంటుంది. ఆ వ్యవహారం అంతా చిదంబరం గారు చూస్తున్నారు. కదంబ కార్యక్రమంలో తప్పకుండ మీకు అవకాశం ఇస్తారు. వెళ్లి నేను చెప్పేనని చెప్పండి,” అని చెప్పి ఆయనని యుక్తియుక్తంగా అక్కడనుండి పంపించేసేరు.

    మిడతంభొట్లు అహం దెబ్బ తింది. తను బొడ్డూడని వాడా? సుదర్శనం గారి మాటలలోని వ్యంగ్యాన్ని, శ్లేషని అర్థం చేసుకో లేడా? కాని, “ఈ దూషణ, భూషణ తిరస్కారాలు ఈ శరీరమునకే కాని ఆత్మకి చెందనేరవు అని సమర్ధించుకుని, కార్యసూరుడు కావడం వల్ల తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తూ సుదర్శనం సమక్షం నుండి తప్పుకున్నాడు.

* * *

    సాయం సమయం. నేపధ్యంలో నీలిరంగు యవనికలా కనిపిస్తూన్న సముద్రం మీద నుండి చల్లని గాలి వీచుతోంది. రోజంతా భౌతిక శాస్త్రపు లోతుపాతులని శల్య పరీక్ష చేసి అతలాకుతలం అయిపోయిన అంతర్జాతీయ నిష్ణాతులందరూ సేద తీర్చుకునే నిమిత్తం బయట ఉన్న పచ్చిక బీడులో సమావేశం అయేరు. విజ్ఞాన పిపాస పూర్తిగా తీరని వాళ్లు పానీయాలని చప్పరిస్తూనే తీవ్రంగా చర్చలు కొనసాగిస్తున్నారు. విదేశాలనుండి వచ్చిన అతిధుల సత్కారానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మూడు రోజుల పాటు విశ్వవిద్యాలయపు సరిహద్దులలో మాత్రం చలామణీ అయే విధంగా మద్యనిషేధపు చట్టాన్ని కొద్దిగా సడలించేరేమో పిపాస తీరని పుర ప్రముఖులు కొందరు ఆహూతుల మధ్యలో కలిసిపోయి అప్పనంగా దొరికిన అమృతాన్ని అవుపోశన పట్టెస్తున్నారు. గంట సేపే కాక్‌టెయిల్ పార్టీ. అటు తరువాత విందు భోజనం. ఆపైన కదంబ కార్యక్రమం. 

    అల్లంత దూరంలో రష్యా నుండి వచ్చిన పిసరెంకో గారు, జెర్మనీ నుండి తరలి వెళ్లి అమెరికాలో స్థిరపడిపోయిన ఎబర్‌హార్ట్ గారు అయిస్టయిన్ ప్రతిపాదించిన సాధారణ గురుత్వాకర్షణ సిద్ధాంతం మీద లొబఛెవ్‌స్కీ క్షేత్రగణిత ప్రభావం ఏమిటా అని తీవ్రంగా చర్చిస్తున్నారు.
 
    “హల్లో ప్రొఫెసర్ ఎబర్‌హార్ట్! జ్ద్రాస్త్‌వీతి ఎకడమీషియన్ పిసరెంకో! అని పొల్లు పోని ఇంగ్లీషు, రష్యన్ భాషలలో ఇద్దరిని  పలకరించి, వారిరువురి సంభాషణలలో ఉత్సాహం చూపిస్తూ మాట కలిపేరు మిడతంభొట్లు.

    తెల్లవాడు మెచ్చుకుంటే కాని సాటి నల్లవాడి మెప్పు పొందడం దరిదాపుగా అసంభవం అని మిడతంభొట్లు పచ్చి అనుభవం మీద తెలుసుకున్న నగ్న సత్యం. భోజన కార్యక్రమాలు మొదలయేలోగానే తన గోడు పెద్దవాళ్ల చెవిన పడేయాలన్న ఉత్కంఠతో తహతహలాడుతున్న మిడతంభొట్లుకి ఈ సదవకాశాన్ని విడుచుకోవడంలో ఏమంత విజ్ఞత కనిపించలేదు. అందుకని గురుత్వాకర్షణ సిద్ధాంతం మీద జరుగుతూన్న చర్చని, నాస్తి గురుత్వం, బరువు, భారం మొదలైన విషయాల మీదకి నేర్పుగా మళ్లించేడు మిడతంభొట్లు. మళ్లించి తన అనుభవాలని వాళ్ల చెవిలో ఊదేశాడు. 

    మిడతంభొట్లు గుక్క తిప్పుకోకుండా చెప్పిన కథనాన్ని ఊపిరి బిగపట్టుకుని విన్నారు అతిధులిద్దరూ. రెండు నిమిషాల పాటు ఒక రకం బరువైన నిశ్శబ్దం వాతావరణంలోకి దిగింది.

    “మీ మాటలు వింటూ ఉంటే ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు అయింది” అన్నారు రష్యన్ భాషలో సామెతలు చెప్పడంలో దిట్ట అయిన పిసరెంకో.

    “మీ అనుభవాలు మేము కూడ పంచుకోడానికి వీలవుతుందా? లేక యోగంలోలా ఎవరి అనుభవాలు వారివేనా?” అని ఎబర్‌హార్ట్ వంత పలికేరు.

    మిడతంభొట్లు గుప్తంగా పంట్లాము జేబులో దాచి పెట్టిన వీశ రాళ్లని తీసి బయట పడేశారు. మేష్టారి వాలకం అర్థం కాక పిసరెంకో, ఎబర్‌హార్ట్ కళ్లప్పగించి చూస్తున్నారు. మిడతంభొట్లు రెండడుగులు వెనక్కి వేసి, ఆ పక్కన ఉన్న ఒక చెట్టు కొమ్మ దగ్గరకి వెళ్లి, కొమ్మ కొసన ఉన్న ఒక కాయని అందుకుంటున్నట్లు కాళ్లని సాగదీశారు. అమాతం గాలిలోకి తేలిపోతూన్న మిడతంభొట్లుని చూసి అతిధులిద్దరూ నిశ్చేష్టులై, నిర్విణ్ణులై, మాటా మంతీ లేకుండా ఒక నిమిషం పాటు అలా ఉండిపోయేరు. మిడతంభొట్లు మేష్టారు నేలకి పదడుగులు పైకి లేచిపోయి, చిటారు కొమ్మ చివర అలా ఒక నిమిషం పాటు శ్రమించకుండా నిలబడి ఉండగలిగేరు. తరువాత నెమ్మదిగా నేలమట్టం మీదకి వచ్చేరు.

    ఎబర్‌హార్ట్ గతంలో భారతదేశం వచ్చినప్పుడు మోళీ కట్టడం చూసేరు. రాబోయే కదంబ కార్యక్రమంలో ఇదొక నాందీ అంశం ఏమో అని ఆయనకి చిన్న అనుమానం వచ్చింది. కాని వ్యక్తిగతంగా కాకపోయినా ప్రచురించిన పరిశోధనా పత్రాల ద్వారా మిడతంభొట్లు ఆయనకి చిరపరిచితులు కనుక ఆయన ఇటువంటి కొంటె చేష్టలు చెయ్యడానికి అవకాశం తక్కువ. అయినా వేళాకోళానికో, పరిహాసానికో, వినోదానికో శాస్త్రవేత్తలు ఇటువంటి ప్రయోగాత్మక పరిహాస చేష్టలు చెయ్యడంలో దిట్టలే. కనుక ఎబర్‌హార్ట్ గారికి ఇందులో ఉన్న భేతాళ రహశ్యం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది. అందుకని తన ముఖ కళవళికలలో తన మనోభావం ప్రస్పుటమవకుండా జాగ్రత్త పడుతూ సంభాషణ కొనసాగించేరు.

    ఇటువంటి విలక్షణమైన విశేషానికి తార్కికమైన కారణం ఏమై ఉంటుందా అని చాల పెద్ద ఎత్తున ఆ చెట్టు కింద చర్చలు జరిగేయి.

    “భూమికి ఆకర్షణ శక్తి నశించి ఉండాలి,” అన్నారు త్రిమూర్తులలో ఒకరు. 

    “అలా అయితే మిడతంభొట్లుతో పాటు అందరూ గాలిలో తేలిపోయి ఉండాలే,” అంటూ మరొకరు ధర్మసందేహం వెలిబుచ్చేరు.

    “భూమికి ఆకర్షణ శక్తి నశించిపోతే భూమి సూర్యుడి చుట్టూ తన కక్ష్యలో తిరగగలదా?” అంటూ మరొకరికి అనుమానం వచ్చింది.

    ఇలా ఎన్నో పిల్ల సిద్ధాంతాలు, పిచిక సిద్ధాంతాలు తిరగేసి, తోసిపుచ్చారు. ఒక్క మిడతంభొట్లు మేష్టారికే ఈ అనుభవం కలుగుతున్నాది కనుక ఇదేదో ఆయన శరీరంలో మార్పు వల్ల కాని బాహ్య ప్రపంచంలో మార్పుల వల్ల కాదని తీర్మానించేరు. 

    “లేదా, మిడతంభొట్లు శరీరం చుట్టూ ఉన్న ప్రదేశంలో ఏదైనా మార్పు జరుగుతూ ఉండి ఉండాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి చుట్టూ ఉన్న గాలి చిక్కబడిందనుకుందాం. అప్పుడు ఆ అధిక సాంద్రత పొందిన గాలిలో వస్తువులు తేలిపోవడానికి సావకాశం ఉంది కదా!” అంటూ పిసరెంకో ఒక సిద్ధాంతాన్ని లేవదీసి, తన సిద్ధాంతాన్ని చులకన చేసి అమెరికా ప్రొఫెసర్ నవ్వుతాడేమోనని భయపడి కాబోలు, “అసలు, అమెరికాలో సాల్ట్ లేక్ సిటీ దగ్గర ఉన్న సరస్సులో నీటి సాంద్రత ఎక్కువ కావడం వల్ల ఆ సరస్సులో ఈత రాని వాళ్లు కూడ పాదరసం మీద గుండుసూదిలా తేలిపోతారుట,” అని చిన్న సమర్ధింపు వాక్యాన్ని జోడించేడు, ఎబర్‌హార్ట్ వైపు చూస్తూ.

    “అటువంటప్పుడు కనీసం మిడతంభొట్లు తక్షణ పరిసరాల్లో ఉన్న వస్తువులు కూడ గాలిలో తేలిపోవాలి కదా?” ఎబర్‌హార్ట్ అన్నారు.

    “నేను తాపగతి శాస్త్రం యొక్క రెండవ సూత్రం మీద నా ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాను.” స్వగతంగా అనుకుంటున్నట్లు మిడతంభొట్లు గొణిగేడు. 

    కాక్‌టెయిల్ పార్టీలలో కబుర్లు సగానికి పైగా గాలి కబుర్లే కనుక  అతిధులు మిడతంభొట్లని ప్రోత్సహించేరు. 

    “ఒక గాజు తొట్టెని నీటితో నింపి, నిశ్చలంగా ఉంచి, దానిలో ఒక సిరా చుక్క వేస్తే ఏమవుతుంది?” మిడతంభొట్లు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన సిద్ధాంతాన్ని లేవదియ్యడం మొదలు పెట్టేరు. “కాలం గడుస్తూన్న కొద్దీ సిరా నెమ్మదిగా నీటిలో కలిసిపోతుంది. కదా? ఆ సిరా చారలు, చారలుగా నెమ్మదిగా నీటిలో కలిసిపోవడం మనం కళ్లారా చూడవచ్చు. అవునా? అంటే సిరా వేసిన చోట కుదురుగా కూర్చోకుండా, క్రమం తప్పి చెదిరిపోతుంది. శక్తిని వెచ్చించకుండా ఆ సిరా చుక్కని నీళ్లల్లోంచి మళ్లా వెనక్కి తియ్యలేము. ఈ రకం ప్రవర్తన నీళ్లతొట్టెలో సిరాకే పరిమితం కాదు. ప్రపంచంలో దేనినయినా సరే నియమ నిబంధనలు లేకుండా – కట్టడి, ఒత్తిడి లేకుండా – ఒదిలేస్తే దానిలో క్రమత్వం నశించి, అక్రమత్వం ప్రబలుతుంది. ఉపాధ్యాయుడనే బాహ్యమైన ఒత్తిడిని తీసెస్తే, విద్యార్ధులు క్రమశిక్షణ లేకుండా అల్లరి చెయ్యరూ? యుగాలు గడుస్తూన్నకొద్దీ ఈ ప్రపంచంలో ధర్మం నశించి అధర్మం పెరుగుతుందని గీతలో చెప్పనే చెప్పేడు. ఇది ప్రకృతి ధర్మం. దూరాన్ని కొలవడానికి గజాలు, మీటర్లు వాడినట్లు, కాలాన్ని కొలవడానికి క్షణాలు, నిమిషాలు, గంటలు వాడినట్లు, ఈ అక్రమత్వాన్ని కొలవడానికి ఇంగ్లీషులో ఎంట్రోపీ అనే మాట వాడతాం కదా?”

    అప్పటికే వీళ్ల సంభాషణ మీద ఆసక్తి ఉన్న ఆహూతులు కొందరు అక్కడ మూగడం మొదలు పెట్టేరు. వారిలో ఒకడు – సైన్సుని తెలుగులో రాయడానికి తాపత్రయ పడే ఒక పాత్రికేయుడు – కలుగజేసుకుని, “ఈ ఎంట్రోపీ అనే మాటని అబంత్రం అనిన్నీ, యంతరపి అనిన్నీ, సంకరత అనిన్నీ మన వాళ్లు తెలుగులో వాడుతున్నారండి.”

    అవకాశం ఇస్తే ఆషాఢభూతిలా పంచని చేరి వాసాలు లెక్కపెట్టే సమర్ధులు ఈ విలేకరులు అని మిడతంభొట్లుకి తెలుసు. అందుకని తన వాక్ప్రవాహానికి ఎవరివల్లా అంతరాయం కలుగకూడదన్న దృఢనిశ్చయంతో, “కాలం గడుస్తూన్న కొద్దీ ఈ ఎంట్రోపీ పెరుగుతుందే కాని తరగదు,” అని తిరిగి అందుకున్నాడు.

    పరిగెడుతూన్న ప్రవాహానికి మన పాత్రికేయుడు ఎలాగూ అంతరాయం కలిగించేడు కదా అన్న ధైర్యంతో ఒక స్నాతకోత్తర విద్యార్ధి మిడతంభొట్లు గారిని తొందర పెట్టడం మొదలు పెట్టేడు.

    “నిర్జీవమైన భౌతిక ప్రపంచంలో ఎంట్రోపీ ఎల్లప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎంట్రోపీ తగ్గాలంటే మనం బయటనుండి శక్తిని సరఫరా చెయ్యనైనా చెయ్యాలి లేదా కాలచక్రాన్ని వెనక్కి తిప్పనైనా తిప్పాలి. కాలాన్ని వెనక్కి నడిపించడం అసంభవం అయినట్లే ఎంట్రోపీని తగ్గించడం కూడ అసంభవమే. ఇది ప్రకృతి ధర్మం. అయినప్పటికీ, జీవం ఉన్న పదార్థాలలో ఇది సాధ్యం. జీవన ప్రక్రియలో గజిబిజిగా ఉన్న అక్రమత్వం నుండి పరిపూర్ణ సౌష్టవం, క్రమత్వం ఉన్న జీవి పుట్టడం లేదూ? తల్లి గర్భంలో పిండం నుండి పెరిగే శిశువే దీనికి ఉదాహరణ. తల్లి రక్త ప్రవాహంలో ఉండే నిరాకారమైన పోషక పదార్థాలని తీసుకుని వాటికి రూపం కలిగించే ప్రక్రియలో ఎంట్రోపీ తగ్గినట్లే కదా! ఇక్కడ కాలాన్ని వెనక్కి మళ్లించకుండా ఎంట్రోపీని తగ్గించడం జరిగింది. ఇది తాపగతి శాస్త్రపు రెండవ సూత్రానికి విరుద్ధంగా ఉందని అనిపించవచ్చు. కాని శిశువు ఆ ఆకారం దాల్చడానికి శరీరం ఎంత శక్తి వెచ్చిస్తున్నాదో మనం లెక్కగట్టలేదు కదా!”

    మిడతంభొట్లు ధోరణి ఎబర్‌హార్ట్‌కి అర్ధం కాలేదు. “మీరు చెబుతూన్న సిద్ధాంతానికీ, మీరు గాలిలో తేలిపోయిన అనుభవానికి మధ్య ఉన్న లంకె ఏమిటో బోధపడడం లేదు.”

    “వస్తున్నా. తాపగతి శాస్త్రపు రెండవ సూత్రం స్థానికంగా వమ్ము అయినట్లు కనిపించడం అప్పుడప్పుడు జరిగినప్పటికీ, విశాలదృక్పథంతో చూసినప్పుడు రెండవ సూత్రం అక్షరాలా వర్తిస్తుంది. సజీవకాయంలో క్రమత్వం ఎక్కువ కనుకనున్నూ, బాహ్యప్రపంచంలో కాలంతో పాటు క్రమత్వం తగ్గాలి కనుకనున్నూ, సజీవ కాయానికీ, నిర్జీవ భౌతిక ప్రపంచానికీ మధ్య ఉన్న ప్రహర వద్ద విచిత్రమైన సంఘటనలు జరగడానికి సావకాశాలు ఉన్నాయి. 

    “ఉదాహరణకి నా శరీరంలో పదార్థం కొంత అకస్మాత్తుగా ఏష్యం అయిపోయిందని అనుకుందాం. పదార్ధం నిహిత నియమాలకి లోబడి ఉంటుంది కనుక, ఏష్యం అయిపోయిన పదార్థం శరీరంలో లేదు కనుక బాహ్య వాతావరణం లోనికి పోయి ఉండాలి; లేదా, అయిన్‌స్టయిన్ సమీకరణం ప్రకారం శక్తిగా మారిపోయి ఉండాలి. బాహ్య వాతావరణంలోనికే పోయిన పక్షంలో శరీరం చుట్టూ ఉన్న గాలిలోకి అధికంగా పదార్ధం చేరిందన్నమాటే కదా? అప్పుడు శరీరం చుట్టూ ఉన్న గాలి సాంద్రత పెరుగుతుంది. జీలుగుబెండు నీటిలో తేలినట్లు, సాంద్రత పెరిగిన గాలిలో నా శరీరం తేలిపోయి ఉంటుంది.”

    “అదా మీ సిద్ధాంతం?”

    “అవును. ఇప్పటికి అదీ నా సిద్ధాంతం.”

    “మీరు చెప్పిన సిద్ధాంతమే నిజమయితే తేలిపోయిన మనిషి కిందికి తిరిగి ఎలా రాగలిగేడు? ఇది, ఇది –“ ఆయనకి ఇంగ్లీషుమాట గభీమని తట్టలేదు – “ఓబ్రతీమియా రియాక్‌సియ్” అని చిటికలు వెయ్యడం మొదలుపెట్టి, “ఇది రివర్సిబుల్ రియాక్షన్ అని మీ నమ్మకమా?” పిసరెంకో గారు చిన్న ధర్మ సందేహం వెలిబుచ్చేరు.

    “ఇది నమ్మకంగా ఉత్‌క్రమణీయ ప్రతిక్రియే!” - పిసరెంకో రష్యన్‌లో మాట్లాడేసరికి మిడతంభొట్లు తెలుగులో లంకించుకుని, మరీ వేషాలు వేస్తే మర్యాదగా ఉండదనో ఏమో – “లేదా రివర్సిబుల్ రియాక్షనే. దీనిని ఎంట్రోపీతో సమన్వయం చెయ్యాలి. అలా చేసిన తరువాత…”

    మంచి రసకందాయంలో ఉన్న మిడతంభొట్లు ఆలోచనా సరళికి అంతరాయం కలిగిస్తూ అపస్వరంలా ఆయన కర్ణకుహరాలలోకి తెలుగు సంగీతం వినిపించసాగింది.

    “ఎంట్రోపీ, యంతరపి, యంత…”

    “ఏమండీ! ఏమండీ! ఏమిటా కలవరింతలు? లేవండి. పొద్దెక్కిపోతోంది. మీ యూనివర్శిటీలో ఏదో కాన్‌ఫరెన్సు ఉందని అన్నారు. అమెరికా నుండి, రష్యా నుండి పేరున్న ప్రొఫెసర్లు వస్తున్నారనిన్నీ, వాళ్లని కలుసుకోవాలనీ కూడ అన్నారు. త్వరగా తెమలండి.” రాధ కంగారు పడుతూ భర్తని లేపింది.

    సిలోన్ రేడియోలో తెలుగు సంగీత కార్యక్రమం సన్నగా వినబడుతోంది.

    “ఏమీ కంగారు పడకమ్మా, రాధమ్మా. నిన్న రాత్రి ఆంజనేయస్వామి కోవెలలో యంత్రం వేసి, జపం చేసేను. ఈ తావీజు అబ్బాయి మేళ్లో వేసుకున్నాడంటే అన్నీ సర్దుకుంటాయి. వాయుపుత్రుడు గట్టివాడమ్మాయ్. నా యంత్ర మహిమ వల్ల వాయుపుత్రుడు అబ్బాయిలో ప్రవేశించి ‘యంత్రం, యంత్రం’ అనిపిస్తూన్నట్లున్నాడు. ఇక చిరంజీవికి గండం గడచినట్లే.

    అవధాని ఏదో ఊకదంపుడు ఉపన్యాసం లాగించేస్తున్నాడు. 

    “చెప్పేవాడికి వినేవాడు లోకువ. చెప్పేవాడు గడ్డి తింటే తిన్నాడు. వినేవాడి బుద్ధి ఏమయింది? అయినా ఎవరి పిచ్చి వారికి ఆనందం. కానివ్వండి. కానివ్వండి…” అనుకుంటూ మిడతంభొట్లు ఆంధ్రా యూనివర్శిటీ వైపు అడుగులు వేసేరు.

(ఆంధ్ర సచిత్ర వార పత్రిక 17 జూలై 1970 సంచికలో ప్రచురితం)

Comments