గాలిలో దీపం - మధురాంతకం నరేంద్ర

    అలవాటు ప్రకారం ఆలస్యంగా వచ్చింది రైలు. ఇక్కడ నిముషంసేపు మాత్రమే ఆగుతుంది. మా వూరికి బస్సు సౌకర్యాలు లేవు. రాకపోకలన్నింటికి రైలే శరణ్యం. అందుకే ప్లాట్ ఫారంమీద జనసమ్మర్దం ఎక్కువగా వుంది.  

    పట్టణంలో అమ్ముకోవడంకోసం గంపల నిండుగా కూరగాయలనూ, తమలపాకుల్నీ మోసుకొచ్చిన నడివయసు ఆడవాళ్ళు రైలుపెట్టెలో తమకెక్కడా స్థలం దొరకనట్టుగా గేట్లదగ్గరే బైటాయించేశారు. ఎక్కేవాళ్ళను ఎక్కనినివ్వకుండా, దిగేవాళ్ళను దిగనివ్వకుండా వాళ్లు చేస్తున్న అల్లరిని గమనిస్తే, ఎవరికైనా లంకను కాపలా కాసే లంకిణి జ్ఞాపకం రాక తప్పదు.

    రైలొచ్చి ఆగిన సంగతి తమకేమాత్రమూ తెలియనట్టుగా అయిదారుమంది కాలేజీ స్టూడెంట్లు బిగ్గరగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆదివారం కావడంవల్ల ఆరోజు కాలేజీ లేకపోయినా, వాళ్ళు మాట్నీ చూసి రావడం కోసం బయల్దేరారు. రైలు బాగా కదిలిన తరువాత, వెన్నంటి పరుగెట్టి, ద్వారాల దగ్గరున్న కమ్ముల్ని పట్టుకుని వ్రేలాడుతూ, తమ హీరోయిజాన్ని ప్రకటించుకోవడం వారికి ఆదినుంచీ అలవాటు.

    రైలింజను భీకరంగా శబ్దం చేస్తూ పొగల్ని విరజిమ్ముతోంది. 

    ప్లాట్‌ఫారంమీద గంగ జాతర జరుగుతున్నంత సందడి.

    నేనూ ఒక కంపార్టుమెంటు ద్వారం దగ్గరికి వచ్చి నిలుచున్నాను. నేనే కదిలానో, లేక వెనకవాళ్ళు తోయడంవల్ల ముందుకొచ్చి పడ్డానో తెలియదుగానీ, కాస్సేపటిలో లోపలున్నాను. కూచోడానికి స్థలం కోసం వెతుక్కుంటూ వుండగానే గార్డు వేసిన విజిల్ శబ్దం వినిపించింది. ఇంతవరకూ తాను చేసిన సంరంభానికంతా పరాకాష్టలా గొంతు చించుకొని, రైలింజను ముందుకు కదిలింది. 

    ఆర్.ఎమ్.ఎస్. డిపార్టుమెంటు వాళ్ళు కంపార్టుమెంటులో చాలాభాగం ఆక్రమించుకున్నట్టున్నారు. మిగిలిన ఆ కాస్త స్థలంలో నాలుగు వరసల సీట్లు మాత్రమే వున్నాయి. రెండేసి వరసల కొక గదిలా ఏర్పాటు చేయబడివుంది. 

    ద్వారం దగ్గర లావెట్రీ పోను మిగిలిన స్థలంలో నాలుగైదు రకాల కూరగాయల తట్టలు కొలువుతీరి వున్నాయి. ఆ గంపల మధ్య తానూ ఓ గంపలా యిరుక్కు పోయిన వితంతువు 'ఇంతకు మించిన స్వర్గం' మరెక్కడుందన్నంత ధీమాతో వక్కాకు నములుతోంది. గొళ్ళెం విరిగిపోయిన లావెట్రీ తలుపు బార్లా తెరుచుకుని దుర్వాసనను విరజిమ్ముతోంది. పోలీసుల బారినుండి తప్పించుకోవడం కోసం గోడ వెనక నక్కి నక్కి నిలుచునే దొంగల్లా అందులో రెండు కట్టెల మోపులు గుసగుసలాడుకుంటున్నాయి. వాటిని మోసుకొచ్చిన వాళ్ళల్లో ఒకడు, అవతలివైపు డోర్ దగ్గర నిలబడి టీసీ వస్తున్నాడేమోనని బిక్కుబిక్కుమని చూస్తున్నాడు.

    వెనకనున్నవాళ్ళెవరో మళ్ళీ ఓసారి తోయడంతో ముందుకొచ్చి పడ్డాను.

    ఒక్కసారిగా నేనేదో, వింత ప్రపంచంలోకి వచ్చిపడ్డట్టయింది. కాకులు దూరని కారడవుల్లోనూ, చీమలు దూరని చిట్టడవుల్లోనూ, జంతువుల్లా జీవితాన్ని గడిపేసే ఆటవికులు; ఎడారుల్లో బిడారు వర్తకుల్ని అటకాయించి దోచుకునే అనాగరిక తండాలూ నాకు గుర్తుకొచ్చాయి. కాలం ఒక్కసారిగా వేయి సంవత్సరాలు వెనక్కి పరిగెత్తినట్టయింది.

    ఏయేరంగుల్ని, ఏయేపాళ్ళలో కలిపితే, వాళ్ళు తొడుక్కున్న బట్టలరంగు వుద్భవిస్తుందో చెప్పగలిగే చిత్రకారుడు ఈ భూ ప్రపంచంలో వుండడు. వాళ్ళ తలల్ని చూడగానే అట్టలు గట్టుకపోయిన బూరగపత్తీ, చీకిపారేసిన తాటి ముట్టెలూ గుర్తుకొస్తున్నాయి. తల వెంట్రుకలూ, గడ్డమూ గుట్టుగా కాపురం చేసుకొంటున్న వాళ్ళ ముఖాల్లో నోరెక్కడుందో, కన్నెక్కడుందో ఎవరూ చెప్పలేరు. రకానికొకటి చొప్పున ఎగ్జిబిషన్లలో ప్రదర్శించే సాంపుల్స్ లా, పాలుతాగే పిల్లాడినుంచీ, నడుం విరిగిన ముసలాడి వరకూ అన్ని వయస్సుల వ్యక్తులూ వున్నారు. ఆడ్వాళ్ళలో నాజూకుతనాన్నీ, మగవాళ్ళల్లో గాంభీర్యాన్నీ వెతకాల్ని ప్రయత్నించే ప్రబంధ కవుల వారసుడు  వారిముందు తన్నుకు చావలసిందే! దారినబోయే ఏ వస్తువునూ వాళ్లు వదిలిపెట్టినట్టు లేరు. వేరుశెనగ పొట్టు, బఠాణీలపొట్టు, మురుకుల ముక్కలు...క్రిందంతా ఒక కళ్ళం తయారయింది. దేశపు జనాభా సమస్యను భూతద్దంలోంచీ చూపించినట్టుంది. ఎనిమిది మందికై కేటాయించిన స్థలంలో దాదాపు యిరవైమంది కూర్చుని వున్నారు. వాళ్ల పైన బెర్త్ లో చీమ దూరడానికైనా స్థలం లేదు. వివిధరకాలయిన అరుపులతో వాళ్ళక్కడొక తుఫాను సృష్టిస్తున్నారు.

    "మీరిలా ఆగిపోతే ఎలాగండీ? ముందుకు కదలాలి. వెనకాల మేమిక్కడ ఫుట్‌పాత్ దగ్గర అంతర్మధ్యంలో వ్రేలాడుతున్నాం" అంటూ వెనకనుంచి ఎవరో అరుస్తున్నారు.

    ముందుకు కదిలాను.

    అవతలివైపు రెండు సీట్ల వరసనూ వదిలిపెట్టి, యివతలివైపుకు వచ్చేసరికి పూర్తిగా మరోలోకంలోకి అడుగుపెట్టినంతటి అంభూతి కలిగింది. కిటికీ ప్రక్కన కూర్చున్న యిరవై సంవత్సరాల పడుచుపిల్ల ముఖంలో ఆమె చదువుతున్న రచయిత్రి నవలలోని హీరో హీరోయిన్ల తాలూకు అనవసరపు అపార్థాల క్రీనీడలు తారట్లాడు తున్నాయి. ఆమె ప్రక్కన కూర్చున్న పాతికేళ్ళ యువకుడు బహుశా ఆమె భర్తయి వుంటాడు... పెర్రీ మాసన్‌తో కలిసి ఎర్రంచు డిటెక్టివ్ పుస్తకంలో హంతకుడి కోసం పరిశోధన గావిస్తున్నాడు. అతడి ప్రక్కనున్న ఖద్దరు వస్త్రధారి, తన్మయత్వంతో పొగచుట్ట కాల్చుకుంటున్నాడు. ఆ బెంచీలోని మిగిలిన యిద్దరు వ్యక్తులూ కొత్తగా రిలీజయిన సినిమాల గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు.

    రైలు బాగానే వేగం పుంజుకున్న తర్వాత ఫుట్‌పాత్ ప్రక్కనున్న కమ్మీని పట్టుకొన్ వ్రేలాడి, అదొక హేలగా కంపార్టుమెంటులోకి అడుగు పెట్టిన హిప్పీ క్రాపు యువకుడు నా వెనుక నుంచీ "ఏం భోగంరా నాయినా! ఇవతల యింతమంది నిలబడి చస్తుంటే ఎంచక్కా నిద్రపోతున్నాడో చూడు..." అంటుండడం వినిపించింది. 

    తిరిగి చూశాను.

    తదేకంగా పుస్తక పఠనంలో నిమగ్నులయిన పడుచు దంపతులకు ఎదుటి బెంచీలో నలభైయేళ్ళ కాయవాటు మనిషి గుర్రు పెడుతున్నాడు. జరుగుతున్నదా గ్రీష్మ ఋతువు! సమయ మంటేనా మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట! కిటికీ లోంచీ కనిపిస్తున్న భూభాగమంతా సూర్యుడు నిరవధికంగా చేస్తున్న యజ్ఞం తాలూకు హోమగుండం లాగుంది. అందులోకి విసిరేసిన సమిధల్లా జనం విల విల లాడిపోతున్నారు. ముందుగా రైలింజను ఆర్భాటం. దాన్ని వెన్నంటి రైలు చక్రాల గడబిడ... ఆ శబ్దాల్ని మించిపోయే ప్రయాణికుల కోలాహలం... వడగాలిని వేడిగాలిగా మార్చే సీలింగు ఫాను ఆరాటం... ఈ పరిస్థితిలో నిద్రపోగలగడం మానవ మాత్రుల చేతనయ్యే పనిగాదు. ఓక వైపు సర్వప్రపంచమూ ప్రళయంలో మునిగిపోతూ వుంటే, కించిత్తయినా కంగారు పడకుండా నిద్రపోయే వటపత్రశాయి సైతం యితడి ముందు దిగదుడుపే ననిపిస్తోంది.

    "మీరు కాస్త తప్పుకోండి. నేనేలాగయినా ఈ మహానుభావుణ్ణి లేపి కూచోబెడతాను" అంటూ హిప్పీ క్రాపు విద్యార్థి నన్ను ప్రక్కకు నెట్టి ముందుకు నడిచాడు. 

    అంత వరకూ పొగ చుట్టతోనే పరమాత్మను సందర్శిస్తున్న ఖద్దరు వాలా కంగారు పడుతూ "ఆగునాయనా, ఆగు!" అంటూ అతణ్ణి వారించాడు.

    హిప్పీ క్రాపు స్టూడెంటు అతడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

    "ఆయన పదిన్నర రూపాయలు పెట్టి ఫుల్ టికెట్టు కొనుక్కున్నాడట! అందువల్ల బెంచీపైన హోల్ రైట్సన్నీ ఈ పెద్దమనిషి వేనట! నిద్ర రాకపోయినా వూరికే పడుకుంటాడు గానీ లేచి కూచోడట! ఎందుకొచ్చిన రగడలే బాబూ! అతగాణ్ణి కదిలించకు. తేనెతుట్టెను కదపడం మంచిది కాదు. అనుభవంతో చెబుతున్నాను. ఈ విషయమై లాస్ట్ స్టేషనులో పెద్ద ఫైటింగ్ సీస్ను తయారయింది. ఈ మహానుభావుడితో తగువేసుకున్న వాణ్ణి బలవంతాన విడదీసి ప్రక్క కంపార్టుమెంటులో ఎక్కించే సరికి తల ప్రాణం తోకకొచ్చింది. మళ్ళీ యిక్కడి వాతావరణాన్ని మొదటికి తెచ్చే ప్రయత్నం చేయొద్దు" అన్నాడు ఖద్దరువాలా.

    "మరేం పర్వాలేదులెండి సార్! ఇలాంటి మొండి ఘటాలు మాకేం కొత్త కాదు. రోజూ యిదే ట్రైన్‌లో కాలేజీకి వెళ్ళి రావాలి. ప్రతిరోజు యిలాంటి కేసొకటైనా మాకు తగలడం గ్యారంటీ..." అన్నాడు హిప్పీక్రాపు యువకుడు చిరునవ్వు నవ్వుతూ. తరువాత వెనుదిరిగి "గురూ! మనకిక్కడ పెద్దపన్ ఇబడింది" అంటూ మిత్రులనందరినీ అక్కడికి ఆహ్వానించాడు.

    హిప్పీ క్రాపులు, బొమ్మల చొక్కాలు, బెల్ బాటమ్ పాంట్లు, పెద్దసైజు కళ్ళద్దాలు... దాదాపు ఒకే వయసున్న యువకులు ఆ శేషశాయి చుట్టూ గుమిగూడారు. 

    ఒకడు బాగా కుదిపి చూశాడు. 

    అతగాడికి చీమ కుట్టినట్టయినా లేదు.

    ఇంకొక బొమ్మల చొక్కా స్టూడెంటు అతగాడి రెండు చేతులూ పట్టుకొని బలవంతంగా లేపి కూచో బెట్టాడు.

    ఏ పొజిషన్‌లో లేచి కూచున్నాడో, అదే పొజిషన్‌లో తిరిగి అతడు వాలిపోయాడు.

    మరొక బెల్‌బాటమ్ పాంటు విద్యార్థి యిలా కాదన్నట్టుగా, చొక్కా చేతులు పైకి మడుచుకున్నాడు. స్పెట్స్ తీసి స్నేహితుడి చేతికిచ్చాడు.  

    "నిద్రాసనం బాగా ప్రాక్టీసు చేసినట్టున్నాడు" అంటూ యోగా యిన్సిట్యూట్‌లో తరిఫీదు పొందుతున్న విజ్ఞానంతో జోక్ పేల్చాడు. తరువాత రెండు చేతులతో అతణ్ణి బియ్యం మూటను ఎత్తినట్టుగా పైకెత్తికుచో బెట్టాడు. మరో యువకుడు అతడి కనురెప్పల్ని బలవంతంగా వూడదీశాడు. ఇంకో స్టూడెంటు చక్కిలిగింతలు పెట్టి అతగాడి బలవంతపు నిద్రను ఆమడ దూరం పారదోలేశాడు.

    మొదటి ఆ కాయవాటు మనిషి ముఖం కోపంతో కందగడ్డలా తయారయింది. అదోరకం వింత జంత్ర సమ్మేళనంలా పళ్లు పటపట లాడాయి. అయితే ఎదురుగా అయిదారు మంది యమకింకరుల లాంటి యువకులు కనిపించగానే అతడి కోపం భయంగా మారిపోయింది. ఏమీ చేయలేని అశక్తతతో అతడు నీరుగారి పోయాడు. తైలసంస్కారం లేని జుట్టునూ, దానికి స్వయానా తమ్ముడిలా కనిపిస్తున్న గడ్డాన్నీ వూడ బెరికేయ బోయాడు.

    "గురువుగారు మన్నించాలి! మేము కూడా టికెట్టు కొనుక్కొన్నాం! టికెట్టు కొనుక్కున్నంత మాత్రాన పడుక్ కోవాలని లేదు. అంతగా పడూకోవాలను కుంటే సీటు క్రింద పడుకోండి, మాకేం అభ్యంతరం లేదు" అంటూ ఓ హిప్పీక్రాపు కిసుక్కన నవ్వింది.

    "అవునవును. బెంచీ క్రింద పడుకుంటే శవాసనమే ప్రాక్టీసు చేయొచ్చు. డిస్ట్రబెన్సన్న ప్రశ్నే వుండదు..." యోగా యిన్స్టిట్యూట్ స్టూడెంటు పక పకా నవ్వాడు.

    వీళ్ళు తనను బలవంతంగా లేపి కూచో బెట్టారు. చాలని దానికి పరాచికాలాడుతున్నారు. అతడికి యీ యువకుల్నంతా అమాంతంగా మింగెయ్యాలన్నంత కోపం వచ్చింది. అయినా తన కోపాన్ని ప్రకటించు కోవడానికి ఇది అనువయిన చోటు గాదు. ఆ సంగతి అతడి కెప్పుడో అర్థమయింది. శివమెత్తిన గణాచారిలా పైకిలేచాడు. అంతవరకూ తలగడలా వుపకరించిన చేతి సంచిని విసురుగా చేతిలో తీసుకున్నాడు. ఏ నేపాళ మాంత్రికుడయినా దయ తలచి ఆ సంచిని గొడ్డలిగా మార్చేస్తే బెంచీని ధ్వంసం చేసేవాడే! కొంగమి కాల్చేసిన కౌశికుడి చూపు లాంటి చూపు నొకదాన్ని మావైపుకు సరఫరా చేసి అవతలివైపు బెంచీలకేసి దూసుకపోయాడు. ఇతడు గూడా ఆ తండాకు సంబంధించిన వాడే నన్న సంగతి అప్పటికిగానే అర్థమయింది గాదు.

    ఒక మాటయినా మాట్లాడకుండా కేవలం మూకాభినయంతోనే అతడు నిరసనను ప్రదర్శించిన తీరు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.

    "మీక్కూడా స్థలముంది, రండి సార్, కూచుందురుగాని" అంటూ నాకూ కాస్త చోటును ప్రసాదించి, ఓ జీన్సుపాంటు విద్యార్థి తన ఔదార్యాన్ని ప్రకటించాడు.

    అంతవరకూ పెర్రీ మాసన్‌తో కలసి హంతకుడ్ని వేటాడుతున్న సోడాబుడ్డి కళ్ళద్దాల యువకుడు "కంగ్రాచ్యులేషన్ యంగ్‌మాన్! యూ హేడ్ డన్ గుడ్ వర్క్" అంటూ హిప్పీ క్రాపుల్ని ప్రశంశించాడు. అతడి భార్యామణి గూడా నవల పేజీల సందుల్లోంచి వొక చిరునవ్వును వారివైపు విసిరేసింది. 

    అయాచితంగా లభించిన అభినందనలు విద్యార్థులలో వుత్తేజాన్ని కలిగించినట్టున్నాయి. పూల చొక్కా గుండీలను సగం దాకా విప్పేసి, తన శరీర సౌభాగ్యాన్ని చూపి - యువకుడొకడు తమ సాహసగాథల్ని వినిపించ సాగాడు- "అయ్యో రామచంద్రా! వీళ్ళతో మాకున్న సంబంధం - ఈనాటిదా సార్! ఇక్కడికి పాపన్నపాలెం ఎనిమిది మైళ్ళేగదా! రోజూ కాలేజీకి వుదయమూ, సాయం కాలమూ రైల్లోనే వెళ్ళి వస్తూంటాం. కాలేజీలో జాయినై, పాసుముక్క చేత బట్టుకుని రైలెక్కిన ప్రతివాడూ నెలకొకసారయినా వీళ్ళతో జగడమాడి తీరాల్సిందే! మాదుంప తెంచడంకోసమేనేమో ఈశ్వరగిరిలో యిరవై ఏళ్ళ క్రితం వొక దేవుడవతరించాడు. పాపన్న పాళానికి తూర్పుగా వున్న కొండపేరే గదా ఈశ్వరగిరి. అక్కడి దేవుడి గురించే నేను చెబుతున్నది. ఆయనగారికి మొక్కుబడులు యిచ్చుకోడం కోసం వీళ్ళు వస్తూంటారు. అసలు వీళ్ళందరిదీ మన స్టేట్ బార్డర్‌లో ఎవేవో పల్లెటూళ్ళు. వీళ్ళకు మన భాషా రాదు, ఆ రాష్ట్రంలో భాషా రాదు. రెండూ కలగా పులగంలా కలిపేసి ఏదో కక్కారభాషలో వాగుతూ వుంటారు. అక్కడెక్కడా దగ్గర్లో దేవుడే లేడన్నట్టు యింత దూరాభారం ప్రయాణాలకు సిద్ధపడతారు. వీళ్ళింతకూ దేవుణ్ణి చూడ్డానికి వచ్చేవాళ్ళుగా కనిపించరు. దారి పొడుగునా ప్రయాణికులతో పోట్లాట వేసుకుంటూ వుంటారు. తలుపులు బిడాయించుకుని కంపార్టుమెంటు అంతా తమ సామ్రాజ్యమేనని డబాయిస్తారు. తీరా ఎవడయినా లోపలికి అడుగుపెడితే కూచోడానికి స్థలమివ్వరు. ఎంచక్కా బెంచీలపైన పవళించి మనవాళ్ళు బెదిరిపోయేటట్టు గురక పెడుతుంటారు. వీళ్ళకు మా చేతుల్లో ఎన్నిసార్లు సన్మానాలు జరిగాయో చెప్పలేము. ఎన్నిసార్లు వీళ్ళను ఫ్లాట్‌ఫారం పైకి లాగి ఏ కీలు కాకీలు వూడ బెరికి చేతికిచ్చి పంపామో లెక్కలేదు..." 

    "పాపన్నపాళెంలో జూనియర్ కాలేజీ పెట్టారా కొత్తగా?" ఖద్దరువాలా అడ్డు తగిలాడు.

    యోగా యిన్స్టిటూట్ స్టూడెంటు "స్వామీ! తమరే యుగంలో బ్రతుకుతున్నారు? పాపన్నపాళెంలో జూనియర్ కాలేజీ పెట్టి మూడు సంవత్సరాలయింది. గత సంవత్సరం నుంచీ డిగ్రీ కాలేజీ స్టార్టు చేశారు. దానికి అనుబంధంగా వొక యోగ యిన్స్టిట్యూట్ గూడా వుంది" అంటూ పళ్ళికిలించాడు.

    ఖద్దరువాలా ముఖం ముడుచుకొని "నేనీ ప్రాంతానికి చాలా రోజుల తరువాత వస్తున్నాను. నాలుగేళ్ళనుంచీ హైదరాబాదులోనే వున్నాను" అన్నాడు.

    "కొంపదీసి మీరు పాపన్న పాళెం ఎమ్మెల్యేగారికి స్నేహితుడు గాదుగదా!" బొమ్మల చొక్కా స్టూడెంటు అడిగాడు.

    "అబ్బే! ఆయన నాకు స్నేహితుడుగాదుగానీ చాలా దగ్గరి బంధువు. స్వయానా మా ఆవిడకు పినతల్లి కొడుకు..."

    "చూడగానే ఆయనకూ, మీకూ ఏదో దగ్గరి సంబంధముందని అనుకున్నాడులెండి! ఆయనగారు కూడా యిప్పుడు హైదరాబాదులోనే వుంటున్నాడు. ఇటువైపుకు వచ్చి చాలా రోజులయింది. బహుశా ఆయనగాలే మీకు సోకివుంటుంది..." ఫుల్ షర్టు తొడుక్కున్న హిప్పీక్రాపు యువకుడు చేతిగుడ్డచాటున నవ్వు నాపుకుంటూ అన్నాడు.

    "అంటే...అంటే..." ఖద్దరువాలా మళ్ళీ ముఖం ముడుచుకున్నాడు. 'మీతో మాట్లాడటమే నా బుద్ధి పొరబాటు' అన్నట్టుగా మరో పొగచుట్టను వెలిగించుకున్నాడు.

    ఇంతలో వొక బొమ్మల చొక్కా విద్యార్థి టెలిపతీ ద్వారా తనకేదో సందేశమందినట్టుగా "చైనెవరో లాగారు" అంటూ డోర్ దగ్గరికి పరిగెత్తాడు.

    కిటికీ దగ్గర కూర్చున్న కుర్రాడు బయటికి తొంగిచూసి "అవునవును... స్పీడ్ తగ్గిపోయింది" అంటూ తానూ అతణ్ణి అనుసరించాడు.

    ఒకరివెంట ఒకరుగా వాళ్ళ బృందమంతా డోర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ బెంచీ పైన మిగిలిన వాణ్ణి నేనొక్కణ్ణే! అదే అదనుగా భావించి కిటికీ ప్రక్కకు జారుకున్నాను. 

    రెండు మూడు నిముషాలసేపు పరిగెత్తడానికే ప్రయత్నించి, విఫలమై, జావగారి పోయి, చివరకు నిస్సహాయురాలై నిలిచి పోయింది రైలు. 

    కిటికీలోంచి బయటికి తొంగి చూశాను. 

    రైలిలా హఠాత్తుగా ఆగిపోవడానికి కారణం తెలుసుకోవడం కోసం ఉత్సాహవంతులయిన ప్రయాణీకులు కొందరు అప్పటికే బయటకి దూకేశారు. కిటికీల ప్రక్కన కూర్చున్నవాళ్ళు మెడల్ని బయటికి వంచి ఆ చివరినుంచీ ఈ చివరవరకూ చూపులతోనే రైలును తనిఖీ చేసేస్తున్నారు. చుట్టుప్రక్కల పొలాలలో పనిచేసుకుంటున్న రైతులంతా చచ్చిన పాము చుట్టూ గుమిగూడే చీమలమల్లే ఆగిపోయిన రైలును చుట్టుముట్టేశారు. 

    "ఏం జరిగిందండీ?" డిటెక్టివ్ నవలా ప్రియుడు తుపాకీ పేల్చినట్టుగా ప్రశ్నించాడు.

    "నాకు మాత్రం ఎలా తెలుస్తుందండీ?" అంటూ జవాబుకు బదులుగా నేనూ వొక ప్రశ్నను సరఫరా చేశాను. 

    "ఛీ...ఛీ... ఈ మనుష్యుల్లో రానురానూ డిసిప్లెన్ చాలా తక్కువయిపోతోంది. వీళ్ళకంటే పశువులెంతో నయం..."ఆవేశంతో పిడికిలి బిగిస్తూ అన్నాడు అతను. 

    "మీకిది క్రొత్తగా కనిపిస్తూందేమో. ఇది రోజూ జరుగుతున్న తతంగమే!" అన్నాను.   

    "మేమిద్దరమూ కొండపాలెం జంక్షన్లో రైలెక్కాము. అప్పటి నుంచీ యిప్పటి వరకూ అరడజనుసార్లు చైను లాగారు."

    "........"

    "అవునూ, ఇలా వాళ్ళు మాటిమాటికీ చైను లాగుతూంటే మీరెంతకూ పట్టించుకో రెందుకు? కనీసం రిపోర్టివ్వడం స్థానికుల బాధ్యత గాదా?"

    "రిపోర్టివ్వడంవల్ల లాభం?"

    "అనవసరంగా చైను లాగిన వాళ్ళకు పనిష్మెంటేమిటో మీకు తెలియదా? చైను క్రింద అంతంతేసి అక్షరాలతో రాసి పెట్టాడు, మీరెప్పుడూ చూడలేదా?"

    అతగాడి కోపం నా వైపుకు మళ్ళినందుకు విస్తుపోక తప్పలేదు.

    "లాగిన వాళ్ళెవరో తెలిస్తేనేగదా పనిష్మెంటు? కంపార్టుమెంటులోని వాళ్ళందరూ ఎవరికివారే తమకు సంబంధించిన విషయం కాదన్నట్టుగా వుండిపోతారు. ఈ సందులో అసలు వ్యక్తి జారుకుంటాడు. మీకు పిల్లి మెడలో గంట గట్టాలనుకున్న ఎలుకల కథ తెలియదూ? అలాగే తయారవుతోంది ఈ రైలు కథ గూడా!" అన్నాను.

    అతని ముఖం ముడుచుక పోయింది. విసుగ్గా సూట్ కేసు తెరిచి డిటెక్టివ్ నవలను దూర్చేశాడు. అందులోంచి సిగరెట్టు పెట్టెను వెలుపలికి తీశాడు. జేబులోంచే అగ్గిపెట్టెను పైకిలాగాడు. నిముషం తరువాత అతడి పెదవుల మధ్య కింగ్ సైజు సిగరొట్టొకటి పొగల్ని విరజిమ్ముతోంది. 

    నాకెందుకో అతణ్ణి యిరకాటంలో పెట్టాలనిపించింది. 

    "మీరు చైను క్రిందున్న నోటీసునయితే చూశారుగానీ దీన్ని చూసినట్టుగా లేరు" అంటూ అతడికి కుడివైపు కిటికీలపై నున్న నోటీసును చూపెట్టాను.

    "తోటి ప్రయాణీకులకు యిబ్బంది కలిగించే పక్షంలో పొగత్రాగడం భావ్యం గాదు" - అని ఎర్రటి అక్షరాలతో హెచ్చరిస్తోంది ఆ ప్రకటన. 

    ఆ మాటను చదువుకున్న వెంటనే అతడి ముఖం ముడుచుకు  పోయింది. మరుక్షణంలో సెంటిమీటరు పొడవయినా కాలని సిగరెట్టును బూటుకాలితో నలిపేశాడు. తరువాత ఓపిగ్గా వంగి సిగరెట్టు పీకను పైకెత్తి కిటికీలోంచి అవతలికి గిరవాటు పెట్టాడు.

    అంతవరకూ నవల చదవడంలోనే నిమగ్నురాలై వుండిపోయిన అతడి భార్య తల పైకెత్తి, ఆశ్చర్యంతో నిండిన కళ్ళతో మా యిద్దరి ముఖాలకేసి మార్చి మార్చి చూడ సాగింది.

    నాకు తెలియకుండానే నా తల వాలిపోయింది. ఏదో పెద్ద పొరబాటు చేశానన్న భావన నాలో కలగసాగింది.    

    అతి కష్టం మీద తలపైకెత్తి "సార్! నా మాటల్ని మీరంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు..." అన్నాను.

    అతగాడు చిరునవ్వు నవ్వాడు. నిముషం సేపు మౌనంగా గడిచిపోయింది.

    ఉన్నట్టుండి అతడు ప్రశ్నించాడు - "దాదాపు అరగంట సేపటి నుంచి నా ప్రక్కన కూర్చున్న ఈ పెద్దమనిషి చుట్ట మీద చుట్ట తగలేస్తున్నాడు. అప్పుడు లేని అభ్యంతరం తీరా నేను సిగరెట్టు వెలిగించుకున్న తరువాతే వచ్చిందా?"

    ఉలిక్కిపడ్డాను. ఏమని సమాధానం చెప్పాలో తోచలేదు. 

    మళ్ళీ అతనే కొనసాగించాడు - "మీ అందరి సంగతి నాకు తెలుసులెండి! చెప్పిన మాట వినేవాడు దొరికితే వాణ్ని కోతిలా తయారు చేసి గంతు లేయించాలనుకుంటారు. అదే ఎవడయినా మొండివాడు కనబడితే అంత దూరంలోనే తప్పుకుంటారు..."

    "ఇదేంయ్యో! నన్ను మొండి వాడంటున్నావేమిటి?" ఖద్దరువాలా విరుచుక పడ్డాడు.

    ఈ అనుకోని పరిణామానికి తడబడి పోతూ అతను "అది కాదండి... నేను మిమ్మల్ని అనలేదు... మరి... మరి" అంటూ తడబడి పోయాడు.

    ఇక తాను మౌనంగా వుండడం సాధ్యం కాకపవడంతో "దారిన బోయే తగవులన్నీ మీ కెందుకండి బాబూ! కాసేపు గప్‌చిప్ గా కూచోలేరా? మీతో నాకు పెద్ద తల నొప్పయి పోతోంది" అంటూ అతడి భార్య కసురు కుంది. 

    ఖద్దరువాలా ముఖం ముడుచుకుని మరో చుట్ట వెలిగించాడు.

    ఇంతలో రైలు బిగ్గరగా ఆవులించింది. 

    నిముషంసేపు వెనక్కు నడచి, ముందుకూ వెనక్కూ వొకసారి వూగి ఆ తరువాత గమ్యంవైపుకు పరుగెత్తసాగింది. ఆ కుదుపుకు తట్టుకోలేక బెర్త్ పై నుంచీ బ్రీఫ్‌కేసొకటి నా కాళ్ళను ఆశ్రయించింది.

    దాన్ని చేతిలోకి తీసుకుంటూ "సారీ! ఈ బ్రీఫ్ కేసు మాదే!" అన్నాడు కళ్ళజోడు యువకుడు.

    "మనకు 'సారీలు' చెప్పుకోవడం బాగా అలవాటయిపోతోంది" అన్నాను.

    చిరునవ్వు నవ్వాడతను.

    బ్రీఫ్‌కేసుపైని అక్షరాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ "రామకృష్ణ... అదేగదూ మీ పేరు?" అని అడిగాను.

    అవునన్నట్టుగా తల వూపుతూ అతడు దాన్ని బెర్త్ పైన జాగ్రత్తగా సర్దేశాడు. 

    చైను లాగినపుడూ అవతలి కెళ్ళిన స్టూడెంట్లలో యిద్దరు మాత్రం బుడ్డీ దీపపు వెలుతురులో తారట్లాడే నీడల్లా శబ్దం చేయకుండా వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు. ఒకటో తరగతి గదిలో నోట బీగాలు వేసుకుని మాటాడకుండా కూచునే పిల్లలమల్లే సంజ్ఞల తోనే మాట్లాడుకోసాగారు.  

    వాళ్ళ ప్రవర్తన నాకెందుకో అనుమానాన్ని కలిగించింది.  

    "మిగిలిన వాళ్ళంతా ఎక్కడండీ?" అంటూ ప్రశ్నించాను.

    నా ప్రశ్నేమిటో అర్థం గానట్టుగా వాళ్ళు "టీసీ...టీసీ" అంటూ అదేదో కోడ్ భాషలో పలవరించారు.

    ఆ భాషకు అర్థమేమిటో తెలుసుకుందా మనుకుంటూ వుండగానే డోర్ దగ్గర ఏదో అలజడి ప్రారంభమయింది.

    "మళ్ళీ అక్కడేదో ముసలం పుట్టింది" అంటూ రామకృష్ణ పైకి లేచి అటు వైపుకు నడవబోయాడు.

    "మరేం పర్వాలేదులే, మీరు కూర్చోండి. అక్కడెవరూ పోట్లాడుకోవడం లేదు. మన కంపార్టుమెంటులోకి టీసీ ఎక్కాడు, కట్టెలమోపతడితో గొడవ పెట్టుకున్నట్టున్నాడు... అంతే!" అన్నాడూ నా ప్రక్కన కూర్చున్న స్టూడెంటు. 

    రామకృష్ణ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సూట్‌కేసు తెరిచి టికెట్లు తీసి జేబులో వుంచుకుని కిటికీలోంచి అవతలికి చూడసాగాడు.

    టీసీ కూరగాయల గంపల దగ్గరి కొచ్చినట్టున్నాడు. అక్కడ మళ్ళీ వొక గొడవ మొదలయింది.

    అయిదు నిముషాలు గడచీ గడవక ముందే అతడు తనకంటే పొడుగ్గావున్న ఓ వ్యక్తిని మెడబట్టి నెట్టుకుంటూ మా ముందుకొచ్చేశాడు.

    "రాస్కేల్! నా చేతిలోంచే తప్పించుకుందా మనుకున్నావా? అది నీ యబ్బ తరంగాదు... టికెట్టడిగితే మొరాయించి చూస్తావేమిటి? నన్నమాంతంగా మింగేస్తావా, ఏమయినానా? దొంగ నాయాలా! రోజుకు నీలాంటి వాళ్ళను సవాలక్ష మందిని చూస్తూ వుంటాను. నాపైనే తిరగ బడతావా? దొంగ గాడిదా! మిమ్మల్నంతా పదారు కమ్ముల్లోకి తోసేయాల్రా! లేకుంటే చచ్చినా బుద్ధి రాదు. టీసీలంటే అంత తేలికైపోయామా. ఇక్కడే వుండు. నీ కథేమిటో నిదానంగా తేల్చేస్తాను..." మధ్య మధ్య బూతుల్ని మిళాయించి గుక్కతిప్పుకోకుండా రెండు మూడు నిముషాలసేపు తిట్టి, "మళ్ళీ పారిపోయేటందుకు చూసావంటే తాట వొలిచేస్తాను. నా సంగతి బాగా తెలుసు గదా!" అంటూ అవతలి వైపు బెంచీలపై కూర్చున్న ఆదిమ మానవుల దగ్గర టికెట్లు తనిఖీ చేయడం కోసం వెళ్ళిపోయాడు టీసీ.

    బోనులో చిక్కుకున్న ఎలుక పిల్లలా బిక్కు బిక్కుమంటూ నిలబడిపోయాడు ఆవ్యక్తి.

    చూడగానే పల్లెటూరివాడని తెలిసిపోతోంది. ఆరడుగుల పొడవున్న ఆకారం వయసింకా యిరవై దాటి వుండదు. నల్లాగా చేవ బారిన శరీరం... మొరటయిన అవయవాలు... పట్నానికి వెళ్ళడం కోసం వీలయినంతగా మేకప్ చేసుకొచ్చాడు. ఆముదం పెట్టి చక్కగా పాపటి తీసి కుదురుగా అణగదువ్వుకున్న జుట్టు ఏదో మాడరన్ పెయింటింగ్‌ను తలపింప జేస్తోంది. ముఖమంతా చెమట బిందువులు... భయంతో బితుకు బితుకుమని చూస్తున్న కళ్ళు... మూతిపైన నూనూగు మీసాలు... తొడుక్కున్నది పొడుగు చేతుల గాడా బనీను... కట్టుకున్నది నాలుగు మూర్ల పంచ... మెడలో కాశీదారం... చేతిలో చిన్నదిగా మడుచుకున్న కాకీ గుడ్డ సంచి...

    "చూడండి, మనిషెంత బాగున్నాడో! వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌లా లేడూ! టికెట్ కొనడానికి రూపాయి లేకపోయిందా? దొంగలండీ - దొంగలు, ఛీ... ఛీ... రానురానూ ఎక్కడ చూసినా దొంగలే కనబడుతున్నారు. నీతి నియమం లేని మనుషులు గూడా మనుషులేనా?" రామకృష్ణ ఆవేశపడిపోసాగాడు.

    "మళ్ళీ మొదలు పెట్టారా మీరు? అబ్బబ్బా! మౌనంగా క్షణం సేపయినా కూచోలేరా మీరు? దారిన బోయే తగవులన్నిట్లోనూ, నేనున్ననంటూ చేయి పెడ్తారెందుకు? నాకు తెలుసు, మీకీ బుద్ధి వూరికే రాలేదు. మనకేదో యింటికీ, వంటికీ తేవడానికే వచ్చింది. మీరిలా నోటికొచ్చి నట్టల్లా మాట్లాడుతున్నందుకు అతను తిరగబడితే ఏం చేస్తారు?" అతడి భార్య నిలదీసింది.  

    "ఏమిటి? తిరగ బడడమా? నాకంటే లావుగా ఉన్నాడనా నువ్వనేది? నీకు తెలియదులే సరోజా! న్యాయం ముందు ఎంత బలమయిన అన్యాయమయినా తలవొంచి తీరాల్సిందే! నేనేమీ అన్యాయం మాట్లాడ్డం లేదు..."

    "మిమ్మల్ని వుపన్యాసం దంచ మన లేదు. మౌనంగా కూచో మన్నాను..." సరోజ మూతి ముడుచుకుని పుస్తకంలో తలదాచుకుంది.

    రామకృష్ణ కూడా ఆమెకు డిటోగా వుండి పోయాడు. 

    అవతలి వైపు బెంచీల దగ్గర అసలే గందర గోళంగా వున్న వాతావరణం టీసీరాకతో మరింత భీభత్సంగా తయారయింది. చెడిపోయిన ట్రాన్సిస్టర్లో ఎవేవో నలుగయిదు విదేశీస్టేషన్లు వొక చోట ప్రసార మయినట్టుగా రకరకాల గొంతుకలు వినిపించ సాగాయి. కీచుగొంతుకలు, బొంగురు గొంతుకలు, జలుబు చేసినట్టున్న గొంతుకలు... మధ్య మధ్య టీసీగారి కంచు కంఠం - ఈ తతంగం పదిహేను నిమిషాల సేపు నిరాటంకంగా సాగిపోయింది.

    తరువాత చిట్టడవిలో దారి తప్పిపోయిన వేటగాడు అతి ప్రయాసపైన సక్రమమయిన మార్గంలో కొచ్చి పడ్డట్లుగా యివతలివైపు కొచ్చేశాడు టీసీ. స్టూడెంట్ల ప్రక్కనున్న ఖాళీస్థలంలో కూలబడి పోయాడు. అంత పొడుగూ లేకుండా, పొట్టీగాకుండా, లావుగా మైల బట్టను తలపించే శరీరం అతడిది. లాబొరేటరీలోని గంట జాడీలాంటి తల, పెద్ద కళ్లు, అదో రకం రబ్బరుతో తయారు చేసినట్టున్న పెదవులు - మొత్తం మీద అతడి ఆకారం రకరకాల మానవ శరీరాలను ప్రదర్శించే సంస్థ యేదయినా వుంటే, వాళ్ళకు చక్కగా పనికొచ్చే వొక విధమయిన నమూనాలా కనిపిస్తోంది. 

    రెండు మూడు నిముషాల వరకూ అతడీ ప్రపంచంలోకి రాలేదు. తరువాత "ఛీ...ఛీ... పాడు మనుషులు... ఒట్టి అడివి జంతువులు..." అంటూ గొణుక్కోసాగాడు.

    "ఏం జరిగింది సార్?" అంటూ ప్రశ్నించాడు రామకృష్ణ.

    సరోజ అతడివైపు వురిమి చూసింది.

    అతడు నోటికి బీగం వేసేశాడు.

    టీసీ గొణుక్కున్నట్టుగానే చెప్పసాగాడు - "మొత్తం వున్నదేమో పదహారు మంది మనుషులు కొన్నదేమో పన్నెండు టికెట్లు... ఫైన్ కట్టమంటే కట్టరు. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళూ పట్టుకునే రకం. చెప్పినమాట విని చస్తేనా? గడ్డమూ, మీసాలూ వచ్చేడ్సిన వాణ్ణి పట్టుకుని చంటాడంటారు. వాడికి అరటికెట్టే చాలు పొమ్మంటారు. నేనేం చెబుతున్నానో వాళ్ళకవసరం లేదు. వాళ్ళేం చెబుతున్నారో నా కర్థం గాదు."   

    టీసీకి ఇంతలో తన కర్తవ్యం గుర్తుకొచ్చినట్టుంది. పెద్దగా శబ్దం చేస్తూ వొక నిట్టూర్పు విడిచి "టికెట్... మీటికెట్ ఎక్కడ?" అంటూ పైకిలేచి నా ముందుకొచ్చేశాడు. టికెట్టును జేబులోంచి పైకి తీసి అతడి చేతికిచ్చాను.

    తరువాత రామకృష్ణ దంపతుల టికెట్లు తనిఖీ చేశాడు.

    ఖద్దరు జుబ్బా వ్యక్తి ముందుకు చేయి చాపి "టికెట్ ప్లీజ్" అంటూ ముందుకు కదిలాడు టీసీ.

    అతడు వులకలేదు... పలకలేదు.

    చిత్రమేమిటో గానీ, మెల్లగా గురక గూడా వినిపించ సాగింది.

    "ఇంతసేపూ మేలుకునే వున్నాడండీ!" అన్నాడు రామకృష్ణ. 

    "అలాగా! ఎంత దూరం నుంచీ యీ ప్యాసెంజరులో వస్తున్నారో పాపం, కూచునే ఆదమరచి నిద్రపోయారు. నెనెలాగూ నెక్స్ట్ స్టేషన్ వచ్చేదాకా యిక్కడే వుండాలిగదా! అంతలోపల ఈయనెలాగూ లేవక పోరు. అప్పుడు చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్.. మీ టికెట్టెక్కడ?" కంపార్టుమెంటులోని వ్యక్తులందరినీ తన సౌమ్య స్వభావంతో విస్మయుల్ని చేస్తూ అతడు ముందుకు కదిలాడు.

    సినిమా ప్రియులిద్దరూ టికెట్లు చూపెట్టారు. 

    బొమ్మల చొక్కాల హిప్పీ స్టూడెంట్లు తమను పలకరించనందుకు బాధపడిపోతూ "పాస్..." అంటూ జవాబు చెప్పేసి, తిరిగి తమ మౌనవ్రతాన్ని కొనసాగించారు. 

    టీసీ దృష్టి కంపార్టుమెంటులో మిగిలిన చివరి వ్యక్తిపైన నిలచిపోయింది.

    "ఇక చెప్పు నీ సంగతేమిటో... ఏ స్టేషన్లో రైలెక్కావు?"

    ఆతడి ఖంఠం ఖంగుమంది.

    "పోయిన స్టేషన్లోనే సార్..." పల్లెటూరి కుర్రాడు తడబడుతున్న గొంతుకతో సమాధానం చెప్పాడు.

    "అంటే?.."

    "రంగంపేటలో..."

    టీసీ తన కేష్ బాగులోంచి రెండు పుస్తకాలు యీవలికి లాగాడు. 'నల్ల రంగుతో పుట్టినంత మాత్రాన చాకలి సందర్శన భాగ్యం కరువైపోవాలా?' అంటూ ఆక్రోశిస్తున్న కోటు జేబులోంచి లెడ్ పేనాను పైకి తీశాడు.

    బిల్లు పుస్తకం పేజీలు తిప్పుతూ "మొత్తం యిరవై మూడు రూపాయలా ఎనభై పైసలు... డబ్బుల్తీయ్ బయటికి... నీతో మాట్లాడే తీరిక లేదౌ... ఊ చెప్పు... నీ పేరేమిటి?" అని అడిగాడు.

    "సార్సార్! ఇంకెప్పుడూ టికెట్లేకుండా బండెక్కను. ఈ తడవ కొదిలేయండి..."

    "నిన్నా కథలు చెప్పమనలేదు నేను... నీ పేరు చెప్పుముందు..."

    టీసీ కళ్ళు ఎర్రగా మండిపడుతూ కోపాన్ని వెలిగ్రక్కుతున్నాయి.

    "గోవిందు సార్..."

    టీసీ పుస్తకంలో పేరు వ్రాసేశాడు. 

    "సార్సార్! నాకాడ దుడ్డులేదు..." గోవిందు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. గొంతు జీర వోయింది.

    "లేకుంటే జైలుకుపోతావు. చెప్పు జైలుకు పోతావా? ఫైన్ కడతావా?"

    గోవిందుకు సమాధానమేం చేప్పలో తెలియకపోవడంతో గ్రుక్కిళ్ళు మింగసాగాడు.

    "చెప్పరా అంటే దున్నపోతు మాదిరిగా నిలబడతావేమిటి? చెప్పు - ఫైన్ కడతావా లేదా?"

    "ఈ తడవకు యిడిసి పెట్టండి సార్... ఇంకెప్పుడూ యిట్ల చేయను..."

    "నీతో మాట్లాడుతూ కూర్చునే తీరిక నాకు లేదు. ఇలారా... రమ్మంటే... రాయిలా! నిన్నేరా... రా దగ్గరికి..."

    గోవిందు టీసీ దగ్గరికి నడిచాడు.

    టీసీ అతడి బనీను జేబులోకి చేయి పెట్టాడు. అరకట్ట తమలపాకులు పైకొచ్చాయి. మరో జేబులోంచి నాలు అయిదు రూపాయల నోట్లు వెలుపలికొచ్చాయి. 

    "సార్సార్ ఈ దుడ్డు నాది గాదు..." గోవిందు టీసీ చేతిలోని డబ్బుల్ని లాక్కోబోయాడు.

    "మాదర్చేద్! నా చేతిలోంచి పెరుక్కోవాలను కుంటున్నావా? ఎంత ధైర్యమ్రా నీకు..." టీసీ చేయి గోవిందు చెంపను పరామర్శించింది. 

    అతడి కళ్ళళ్ళోంచి నీళ్ళు బుగ్గలపైకి ప్రాకాయి.

    "ఆడపిల్లలా ఏడిస్తే వదిలేస్తా ననుకున్నావా? అదేం కుదరదు..."టీసీ గబగబా వ్రాసుక పోసాగాడు. 

    "సార్సార్! కాస్త ఆగండి!" ఈ సారి క్రొత్త గొంతుక వినిపించడంతో వులిక్కిపడి తలపై కెత్తాడు.

    అంతవరకూ సినిమా కబుర్లతో కాలం గడుపుతూ వుండిన యువకుల్లో ఒకతను "పాపం! ఈ సారి    కొదిలేయండి సార్! వీడిది మా వూరే! పూటకు గతిలేని సంసారం. చెరువు కింద నేల పేరుకయితే వుందిగానీ, చెరువు నిండదు, పంట పండదు. ఆపూట కాపూట వెతుక్కోవలసిందే! ఏదో పనిమీద తెచ్చుకో నుంటాడు దుడ్డు... మీలాంటి మంచోళ్ళేయిలా చేస్తే ఎట్ల చెప్పండి" అంటూ సిఫార్సు చేశాడు. 

    "బీదోళ్ళయితే నన్నేం చేయమంటావయ్యా! ఆ మాటకొస్తే టికెట్లేనోళ్ళంతా బీదోళ్ళే! అందర్ని చూసీ చూడనట్టుగా వదిలి పెట్టేయ మంటావా చెప్పు..."

    "అది గాదు సార్! ఏదో చూసి రాసుకోండి..." అతడు పళ్ళికిలించాడు. 

    టీసీ కాస్సేపు ఆలోచించి, తల వూపుకుంటూ బిల్లు వ్రాయడం పూర్తి చేశాడు.

    "ఏదో ఆయన చెప్పాడు కాబట్టి పది రూపాయలకు వ్రాసుకున్నాను. లేకుంటేనా? ఇంద... మిగిలిన డబ్బు తీసుకో..." అంటూ బిల్లు కాగితంతో బాటు చిల్లర డబ్బులు బలవంతంగా గోవిందు చేతిలో పెట్టేశాడు. తమలపాకుల్ని తన కేష్ బాగులోకి తోసేశాడు. 

    అంత వరకూ జరిగిన తతంగాన్నంతా గమనిస్తున్న రామకృష్ణ ముఖంలో రకరకాల రంగులు చోటు చేసుకో సాగాయి. 

    "మీరిలా దయా దాక్షిణ్యాల పేరుతో సగం డబ్బుల్నే వసూలు చేస్తే ఎలాగండి?" అంటూ విసురుగా ప్రశ్నించాడు.

    ఇలాంటి ప్రశ్నొకటి తననెదుర్కొంటుందని టీసీ వూహించినట్లు లేడు. అతడి ముఖం ముడుచుక పోసాగింది. కళ్ళు కుంచించుక పోసాగాయి. "నిజమే నండి. రూల్ రూలే! ఒప్పుకుంటాను. ఈ ఉద్యోగంలో ఎన్ని సాధక బాధకాలున్నాయో మీకెలా తెలుస్తుంది? రోజుకు ఓ డజను మందినయినా మేం ఏడిపించాలి. వాళ్ళు మమ్మల్ని యిష్టమొచ్చినట్టల్లా తిట్టుకుంటారు. వాళ్ళ వుసురు మాకు తగలక పోదు. ఎంతయినా భార్యా బిడ్డలు వున్న వాళ్ళం గదండి - ఎంత నిక్కచ్చిగా వున్నా యిలా వొకక్కప్పుడు మార్జిన్ యివ్వక తప్పసు. మా కష్టాలు మాకూ వుంటాయి."

    అతడి వేదాంతం రామకృష్ణకే మాత్రమూ రుచించినట్లు లేదు. "ఇలా టికెట్టు లేకుండా ట్రావెల్ చేసేవాళ్ళవల్లే గదండీ రైల్వేస్‌కు బోలెడంత నష్టం వస్తోంది. వీళ్ళను వూరికే వొదిలి పెట్టగూడదు. ఒకటి రెండు సార్లు జైల్లోకి తోసేయండి. అప్పుడుగానీ తిక్క కుదరదు" ఈసారి అతడి మాటల ప్రవాహానికి భార్యామణి ముఖం డేంజర్ సిగ్నల్ చూపెట్టింది. 

    టీసీ మౌనంగా వుండిపోయాడు.

    రెండు మూడు నిముషాల తరువాత యింకో ప్రశ్నతో టీసీని ఢీ కొన్నాడు రామకృష్ణ - "అరగంట క్రితం చైను లాగారు గదా! ఎందుకండీ?"

    "అదా! రంగంపేట దగ్గర కదండీ లాగారు? అక్కడి వాళ్ళకు యిది బాగా అలవాటే... ఎవరో వొకావిడ ఆలస్యంగా స్టేషనుకొచ్చింది. ఆవిడ వచ్చీ రాకముందే రైలు కదిలింది. ఆమె మొగుడెవడో ఈ బండ్లోనే వున్నాడట! ఆయనగారు చేసిన నిర్వాకమే యిది...

    "బాగానే వుంది... ఇలా వాళ్ళు రోజూ చైను లాగుతూ వుంటే మీరు మౌనంగా చూస్తూ వూరుకున్నారా? మాలాంటి కో పాసెంజర్ల కెంత యిబ్బందో మీకు అర్థం గావడం లేదా? దీని కేదయినా ఏక్షన్ తీసుకోవడం మీ చేత గాలేదా?..." రామకృష్ణ మళ్ళీ ఆవేశపడి పోసాగాడు. 

    "ఏం చెయ్యమంటారండీ! చైను లాగిన వాళ్ళెవరో తెలిస్తే ఫైనెయ్యొచ్చు. కంపార్టుమెంటులోని వాళ్ళంతా మౌనంగా వుంటారు గానీ రిపోర్టు చేయరు. ఇలా మాటి మాటికీ చైను లాగుతూంటే, వొకసారి డ్రైవరు వ్యాక్యూమ్ కట్ చేశాడు. అదేం కర్మమోగానీ, ఆ రోజే ఒక వ్యక్తి సూట్‌కేసు క్రింద పడిపోయింది. చైను లాగితే రైలాగలేదు. నెక్స్ట్ స్టేషనులో ఆయన నెత్తీనోరూ కొట్టుకొంటూ ఆగడం చేయసాగాడు. చూశారా, యిదీ పరిస్థితి... మమ్మల్నేం చెయ్యమంటారో చెప్పండి?"

    రామకృష్ణ మౌనంగా వుండిపోయాడు.

    టీసీ విజయ గర్వంతో నవ్వసాగాడు. 

    రామకృష్ణ మళ్ళీ డిటెక్టివ్ నవలను పైకి తీశాడు. 

    ఇంతలో ప్రక్క స్టేషనొచ్చేసింది.

    టీసీ గబగబా క్రిందికి దిగి ప్రక్క కంపార్టుమెంటులోకి వెళ్ళిపోయాడు. 

    సరోజ వైరు బాగులోంచి వాటర్ బాటల్ పైకి తీసి "మంచినీళ్ళు తెచ్చిపెట్టండి" అంటూ భర్త చేతికిచ్చింది. 

    నీళ్ళ పంపు దగ్గర బాగా రష్‌గా వున్నట్టుంది. రైలు కదిలాక గానీ రామకృష్ణ కంపార్టుమెంటులోకి అడుగు పెట్టలేదు. అతనొచ్చేసరికి కంపార్టుమెంటులోని వాతావరణం పూర్తిగా మారిపోయింది.

    స్టేషన్లో కొనుక్కున్న తినుబండారాలల్తో అవతలి వైపు రెండు బెంచీల దగ్గర యీటింగు రేసు ప్రారంభమైంది. 

    చైను లాగినప్పుడు ప్రక్క కంపార్టుమెంటులోకి వెళ్ళిపోయిన స్టూడెంట్లు తిరిగి మా పెట్టెలోకి వచ్చేశారు. 

    అంతవరకూ గురక పెడుతూ నిద్రపోయిన ఖద్దరు వాలా పెదవుల మధ్య పొడవయిన సిగార్ పొగల్ని విరజిమ్ముతోంది. 

    గోవిందుని తరఫున టీసీతో వాదించిన యువకుడు తన స్నేహితుడితో నెల క్రితం తాను చూసిన సినిమాలో టీసీ వేషం వేసిన హీరో ఎలా దొంగల ముఠాను ఎదిరించాడో డైలాగ్సుతో సహా వర్ణించి చెబుతున్నాడు.

    టీసీ వెళ్ళి పోవడంతో భయవిముక్తుడై పోయిన కట్టెల మోపువాడు మా బెంచీల మధ్య ఖాళీస్థలంలో కూర్చుని బీడీ కాల్చుకుంటున్నాడు. అతడి ప్రక్కనే నేలపైకి ప్రాకుతున్న చూపులతో గోవిందు కూలబడిపోయి వున్నాడు. 

    సరోజ సైతం నవలను వదిలిపెట్టి, ఆ వారం పత్రికలోని సినిమా విశేషాలన్లు చదువు కుంటోంది.

    వాటర్ బాటిల్ తీసుకొచ్చి భార్య చేతికిచ్చేశాక రామకృష్ణ మళ్ళీ డిటెక్టివ్ నవలను పైకి తీశాడు. కానీ అతడి కందులో ఏకాగ్రత కుదిరినట్టు లేదు. పుస్తకం మూసిపెట్టి కిటికీలోంచి అవతలికి చూడసాగాడు. కట్టెల మోపతను బీడీ ముక్కను ఆర్పేసి గోవిందుతో కబుర్లకు పెట్టుకున్నాడు - "టికెట్టు తీసుకోకుండా బండెక్కినోడివి,టీసీని చూస్తానే పక్క పెట్టెకు మారిపోగూడదా? చూసేదానికి ఏడ్నో ఎర్రి మాలోకంగా వుండావే!..."

    "నేనెప్పుడూ టికెట్టు తీసుకో కుండా బండెక్కింది లేదు. ఈ పొద్దు బ్రిడ్జిగాడ వస్తా వుండం గానే స్టేషన్లోనికి బండొచ్చేసింది. పరిగెత్తుకొని రాంగానే బండి కదిలేసింది. ఇంగ టికెట్టు తీసుకునే టైమేడుండాది."

    "ఓరి పిచ్చోడా! నిన్ను టికెట్టెందుకు తీసుకో లేదనా నేనడిగింది. టికెట్లేకుండా బండెక్కి నోడంతా ఆమాటే చెప్పేది..."

    "ప్రమాణ పూర్తిగా నేను చెప్పేది నిజం..."

    "సరే, నిజమేనబ్బా! నేనూ ఒప్పుకుంటాన్లే! ఆ సంగతొదిలి పెట్టు. టీసీని చూడంగానే పక్క పెట్టెకు మారిపోయే లగువు తెలియనోడివి ఈ భూప్రపంచంలో ఎట్లా బతుకుతావు - అని నేనడిగేది..."

    "........."

    ఈసారి సినిమా కబుర్లు చెప్పుకుంటున్న వ్యక్తి వాళ్ళ మాటల్లో కలగ జేసుకున్నాడు - "వీడా! వీడెట్లా బతక తాడనా అడగతా వుండావు? వీడి మొగం! వీడేం బతక తాడయ్యా! ఒట్టి మూగెద్దు! అవతల టీసీ బిల్లు రాస్తావుంటే వూరికే చూస్తా ఈఏడస్తావుంటే సరిపోయిందా, కాళ్ళో చేతులో పట్టుకోకుండా! ఆకాడికీ నేను చెప్పబట్టి సరిపోయింది గానీ, లేక పోతే వాడు మొత్తం వూడ్చుకొనే పోయున్ను"

    "ఏమిటీ? టీసీ వీడిదగ్గర ఫైను కట్టించుకున్నాడా?" ఒక బొమ్మల చొక్కా స్టూడెంటు అడిగాడు.

    "అవున్రా పాపం! పది రూపాయలు కట్టుకున్నాడు" అంటూ స్మాధానం చెప్పాడు అతడి స్నేహితుడు.

    "ఓరి వాడి దుంపతెగా! వీడెలా దొర్కాడు వాడి చేతికి..."

    "ఎలా అంటే ఏముంది! చూడగానే పరిగెత్తి పారిపోబోయాడు. ఇంకే ముంది, అనుమానం కలగనే కలిగింది. గబుక్కున బాడీ పట్టుకున్నాడు - అంతే!"

    "బలే అమాయకుడిలాగున్నాడే! టీసీని చూడగానే పరిగెత్తడం పొరబాటు. కావలి కాసే కుక్కను చూచి దొంగెప్పుడూ పరిగెత్తడు. బిస్కట్లో, మాంసం ముక్కలో ఎరజూపిస్తాడు. యజమానికి స్నేహితుడేమో ననిపించేటట్టుగా నటిస్తాడు. అదీ పద్ధతి..."

    "మాదగ్గర మాత్రం పాసులున్నాయనా నీ వుద్దేశం... మొత్తం మూడు సంవత్సరాల నుంచీ యిలాగే తిరుగుతున్నాం. స్పెషల్ స్క్వాడు సాధారణంగా డిసెంబరు నెలలో వస్తూంటారు. ఇయర్ ఎండింగ్ గదా! అప్పుడే వాళ్ళకు బిజీగా పని! అప్పుడు మాత్రమే పాసులు కొనుక్కుంటాం. మిగిలినప్పుడంతా వోసీనే. అయితే మాత్రం ఎప్పుడయినా నీలా ఫైన్ కట్టామా? నో...నో... దానికి వో స్కిల్ వుండాలి..." యోగా యిన్స్టిట్యూట్ స్టూడెంటు పకపకా నవ్వసాగాడు.

    "తప్పించుకోవాలంటే సవాలక్ష మార్గాలుంటాయి. ముందవి నేర్చుకొని బండెక్కు" మరో కుర్రాడు గీతోపదేశం చేస్తూ మిత్రుడితో శ్రుతి కలిపాడు.

    సినిమా కబుర్లతో కాలం గడుపుతూ వుండిన పల్లెటూరి యువకుడు..."అవున్సార్... బాగా చెప్పినారు. తప్పించుకోవాలంటే వెయ్యి దోవలుంటాయి. తెలివిగా తప్పించుకోవాలంతే! కావాలంటే చూడండి... నా దగ్గిరుండే టికెట్టు ఈ దినం తీసుకొనింది గాదు. ఎప్పుడో వారం దినాలకు ముందు తీసుకొనిందే యిది! పాపన్న పాళెం స్టేషన్లో ఆపొద్దెవురూ నన్ను టికట్టడగలా. అది జోబీలో వుండిపోయింది. ఈ దినం పనికొచ్చింది..." అంటూ తానూ నవ్వసాగాడు.

    "అయ్యో రామచంద్రా! టికెట్టెవురు కొంటారు సామీ - ఎప్పుడో పదేండ్లకు ముందు, మా అయ్య పాము కరిచి చనిపోయినప్పుడు అప్పుడు నాకు పదైదో పదారో జరగతావుంది. అప్పుడు మొదులు పెట్టినా యీ పని. ముందు మా అయ్య యీ పనే జేస్తావుండె, తాత మూకుడు తరతరాలు. అదే మాదిరి అబ్బ పైకి పోయిన మరసటి దినం నుంచీ యీపనే చేస్తా వుండాను. దగ్గిర దగ్గిర పదేండ్ల సర్వీసుండాది నాకీ పనిలో. టికెట్టెట్టుంటాదో నాకు తెలవదు. అందరూ ధర్మాత్ములే వుంటారా? ఇది కలియుగంగద సామీ! ధర్మానికి వొక పాదమే! ఒక్కోసారి మిడిమాళం టీసీలు, గార్డులు వస్తారు. వాళ్ళపోరు పడలేం. దించెయ్యమంటే దించెయ్య మంటారు. ఇంకొందరుంటారు వారానికో మోపు వాళ్ళింటికాడ దించేస్తే నోరు తెరవరు. కొందరయితే సామీ, మీరు నిజమనుకోండి, అబద్ధమనుకోండి, ఎన్ని మోపులయినా ఎత్తుకొనిపో... నోరు తెలిస్తే వొట్టు. ఈ దినమొచ్చినోడుండాడే - వొట్టి బడాయి మనిషి. రూపాయి చేతిలో పెట్టినాక గానీ మాటిన్లా!.." తన వుపన్యాసం ముగిశాక కట్టెల మోపతను బీడీ వెలిగించుకోసాగాడు.

    అంత వరకూ తనది మరో ప్రపంచంలా కాలం గడిపిన ఖద్దరువాలా సిగార్‌ను పెదవుల మధ్య లోంచి, చేతి వ్రేళ్ళ సందులోకి ట్రాన్స్ఫర్ చేసి, చిరునవ్వు నవ్వుతూ "కాకీ బతకతాది... కోయిలా బతకతాది. కాకిని చూస్తే కసిరేస్తాం. కోయిలయితే దాని పాటవిని సెభాషంటాం! బతికినన్నాళ్ళూ కోయిల మాదిరిగా బతకాల, అది బతుకంటే! మనిషి గూడా - తెలివిగా బతికినన్నాళ్ళే మనిషి! తెలివనేదే లేకపోతే జంతువుకూ, మనిషికీ తేడా ఏముంది? అపాయమొచ్చి నప్పుడే వుపాయంగా జారుకోవాల్... నేను చూడు... తెల్లారెప్పుడో రైలెక్కినాను. ఏ పొద్దూ లేంది యిద్దరు టీసీలొచ్చినారు పెట్లోకి - కొంచెం కళ్ళు మూసుకుని పడుకున్నట్టుగా వున్నానేమో - నన్ను నిద్రలేపే దమ్మెవడికుంది?.." అన్నాడు.

    క్లాక్ వైజుగా తిరుగుతున్న చక్రం వున్నట్టుండి యాంటీక్లాక్ వైజుగా తిరుగుతున్నట్టు తోచింది నాకు, రామకృష్ణ పరిస్థితెలా వుందో గమనించాను. అతడి ముఖంలోని భావమేమిటో నాకు అర్థం గాలేదు...

    "ఇంతకూ కచ్చితంగా పదిరూపాయలే కట్టించుకున్నాడా? పైన యింకా చిల్లర గూడా వుందా?" - ఒక స్టూడెంటు అడిగాడు.   

    "పది రూపాయలే లెండి..." పల్లెటూరి యువకుడు సమాధానం చెప్పాడు.

    ఈసారి తెల పైకెత్తి బిక్క మొహం పెట్టి "పది గాదు పదైదు... నా చేతికిచ్చింది అయిదే..." అన్నాడు.

    "అంటే మిగిలిన అయిదూ ఆయనగారి జేబులోకి వెళ్ళిపోయి వుంటాయి..." హిప్పీక్రాపు ఫక్కుమంది.

    మొత్తం కంపార్టుమెంటులోని వ్యక్తులందరూ ఏకమైపోయి గోవిందు తెలివి తక్కువ తనానికి సంతాపాన్ని ప్రకటించసాగారు. ఎటొచ్చీ ఆ గ్రూపులో కలవలేక పోయినవారు ముగ్గురే! ఒకరేమో నేను. మొదటి నుంచి నాది ప్రేక్షకుడి పాత్రే! ఇక మిగిలింది రామకృష్ణ దమపతులు. సరోజ కయితే పుస్తకం తప్ప యిహలోకం సంగతి పట్టడం లేదు. కంపార్టుమెంటులోని వ్యక్తులందరూ యిన్‌డైరెక్టుగా రామకృష్ణను శత్రువుగా పరిగణిస్తున్న వైనం క్రమంగా నాకు తెలిసిరాసాగింది. 

    హిప్పీక్రాపు కుర్రాళ్ళు అతడి వైపు చుస్తూ వెక్కిరిస్తున్నట్టుగా యికిలిస్తున్నారు. ఖద్దరువాలా కొస కళ్ళతో నవ్వుకుంటున్నాడు. కట్టెలమోపువాడు క్షుద్రప్రాణిని చూసినట్టుగా చూస్తున్నాడు. 

    "సరేలే! అయితే టికెట్టు లేకుండా బండెప్పుడూ ఎక్కలేదనా నువ్వు చెప్పేది. అయితే, నా మాటిను. బండేమో టీసీ అబ్బ సొత్తుగాదు, మనందరిదీ. టికెట్టు లేకుండానే బండెక్కు. ఎవుడికీ భయపడనక్కరలేదు. అయితే కొన్ని లగువులు నేర్చుకోవాల. ఈ రోజు పోయిన దుడ్డు నీది కాదంటివే! ఇంకెవురిది?" అని అడిగాడు కట్టెలవాడు.

    "అదా? మా అన్నయిచ్చంపినాడు..."

    "అయ్యో పాపం! అలాగా! అనవసరంగా డబ్బుల్ని పోగొట్టుకున్నావు. టీసీ నిన్నిక్కడ వదిలిపెట్టి వెళ్ళినప్పుడు డబ్బు మా దగ్గర యిచ్చేసి వుండగూడదా? డబ్బుల్లేవని తెలుసుకుంటే టీసీ ఏం చేస్తాడు చెప్పు? తోక ముడుచుకుని నేరుగా పోవాల్సిందే..." అన్నాడు బొమ్మల చొక్కా విద్యార్థి.

    "అవునవును... అలా చేసివుంటే బావుండేది."

    ఉలిక్కి పడ్డాను. నా చెవుల్ని నేనే నమ్మలేక పోయాను. నా చుట్టూ వున్న ప్రపంచం గిర్రున తిరుగుతోన్నట్టుగా తోస్తోంది. ఎదో పరధ్యానంలో వుండి పొరబాటున విన్నానని సమర్థించుకో జూసుకున్నా ఆ మాటలన్నది రామకృష్ణే నన్న సంగతి మాత్రం రూపాయకు నూరు పైసలన్నంత నిజం. 

    చుట్టూ కొండంత చీకటి ముసురుకొని వుందని నాకు తెలుసు. అయిఏ ఎక్కడో గోరంత దీపం వొకటి తిమిరంతో నిరంతరం సమరం చేస్తోందన్న ఆశ నాకుండేది. ఈ గడ్డ తీవ్రమయిన తుఫానుకు గురై తల్లడిల్లు తోందని తెలుసు. అయితే దానికీ ఎదురొడ్డి స్థిరచిత్తంతో నిలుచున్న వటవృక్షం వోక్టుందని నన్ను నేను వూరడించుకునే వాణ్ణి! ప్రవాహానికి ఎదురీదే వొక దృఢ సంకల్పంపై, నా అశక్య్ మోసులెత్తుతూ వుండేవి.

    ఈ జంఝామారుతాల తాకిడికి ఎంత పెద్ద వటవృక్షమయినా కూలిపోవలసిందేనా? ఈ ప్రవాహం ధాటికి ఎంత స్థిర సంకల్పమయినా తల వంచ వలసిందేనా? దుందుడుకు గాలి బారినుంచి తొలి ప్రొద్దు కోసం వేచి చూస్తున్న ఆశల గోరంత దీపానికి రక్షణేలేదా?

    ఈ పరిస్థితిలో యిలా ఈ రైలెంత కాలం ప్రయాణం చేయగలదు? ఇంతకూ యిది తన గమ్యాన్ని చేరుకోగలదా?

(జ్యోతి మాసపత్రిక జనవరి 1982 సంచికలో ప్రచురితం) 
Comments