గారడీ - తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

  
     
పశువులాస్పత్రి అరుగు మీద సగం మెలకువతో పక్కకి ఒత్తిగిల్లేడు ఖాదరు సాయిబు. దుప్పట్లో పొట్లం కట్టినట్టు అయిదేళ్ల కూతురు వెచ్చటి నిద్రలో ఉంది. ఎదురుగోడ వేపు చూశాడు. శీను లేడు. ఉలిక్కిపడ్డాడు ఖాదరు. తువాలు తలకి చుట్టుకుని మెట్లు దిగి ముందు ముత్యాలమ్మ గుడివేపు నడిచేడు. ఊరి చివర పశువులాస్పత్రి పక్కన చింతచెట్టు. ఆస్పత్రికి వెనకా పక్కనా గూడా రకరకాల చెట్లు. చింతచెట్టు కవతల ముత్యాలమ్మ గుడి. గుడికి ఎదురుగా కొంచెం ఆవలగా బోరుపంపు. గుడి చుట్టూరా దాతలు వెడల్పాటి అరుగు వేయించారు. గుడి ముందు భాగంలో సిమెంటు స్తంభాల మండపం.


    ఖాదరు శబ్దం చెయ్యకుండా ఇంకా తెల్లవారని చీకట్లోంచి గుడివెనక భాగం వేపు వెళ్లేడు. గోడవారగా నుంచుని వెనక అరుగు వేపు తొంగి చూశాడు. ఖాళీగా ఉంది అరుగు. బాడఖోవ్లు తోటల్లోకి చెంబు తీసుకుపోయుంటారనుకున్నాడు ఖాదరు. ఓ క్షణం ఆగి బీడీ వెలిగించి, గుప్పిట్లో పెట్టుకుని తోటవేపు నడిచేడు. కసితో కళ్లు వేడెక్కేయి. విసవిస నడిచేడతను. గుప్పిట్లో బీడీ వేడిగా ఉంది. అతనికి ఖచ్చితంగా తెలుసు. జీడిమామిడి తోటకి ఒకపక్క ఎవరో కల్లు పందిరి వేశారు. తోట దారిలో రోడ్డు వదిలి కాలిబాట చీలికలో నడుస్తున్నాడు ఖాదరు. వంపులో వేగం తగ్గించి బీడి అవతల పారేసి ఆగిపోయాడతను. సన్నటి వేపచెట్టు చాటు చూసుకుని పందిరిలోకి తీక్షణంగా చూశాడు ఖాదరు. అప్పుడే ఇద్దరూ లేచేరు. బీ లేచి చీర సర్దుకుంది. శీను లేచి ప్లాస్టిక్ బాల్చీ తీసుకుని ఎదురు చెట్లవేపు వెళ్లేడు. ఖాదరు దరిదాపు పరిగెడుతూ తిరిగొచ్చేడు. 

    తోటల్లోంచి, చెట్లలోంచి ఊళ్లోకి తెలవారుతోంది. ఆస్పత్రి మెట్ల మీద కూచుని కసిగా వేపపుల్ల నముల్తూండగా పెద్ద ఖాళీ ప్లాస్టిక్ చెంబుతో వచ్చింది బీ. అతన్ని చూసి గతుక్కుమన్నా మామూలుగా బోరుపంపు వైపు వెళ్లింది బీ. అడ్డంగా నరికిపారెయ్యాలనిపించింది. తుపుక్కున ఉమ్మేశాడు.
తప్పుడు ముండకి కుర్రోడు గావల్సొచ్చేడు. తను అనుకున్నదే నిజమైంది. తీరిగ్గా మొహం కడిగి తడి మొహం తుడుచుకుంటూ వచ్చింది బీ. మెట్లెక్కుతూ 'లేసిందా' అంటూ చిన్నదాని పక్కవేపు చూసింది బీ. అడ్డంగా నిలువుగా కూడా నరికేద్దామనుకున్నవాడు ఏవీ అనలేదు. మండిపోతూ ఓ చూపు చూసి ఉమ్మితోపాటు ఓ బూతు తుపుక్కున ఉమ్మి బోరుపంపు వేపు నడిచేడు ఖాదరు. 

    బీ కడుపులో చిన్న అలజడి పుట్టింది. ఖాదర్ని చూడగానే అనుకుంది. చెప్తున్నా వినలేదు శీను. ఇద్దరూ లేకపోతే తెలవదా ఆ మాత్రం. గిన్నెలు తీసుకుని టీ కోసం పొయ్యి రాజెయ్యడానికి కిందికొచ్చింది . తీరిగ్గా ఓ చేత్తో ప్లాస్టిక్ బాల్చీ ఊపుకుంటూ నోట్లో వేపపుల్ల తిప్పుకుంటూ పంపువేపు వెళ్తూ కనిపించాడు శీను. అతన్ని చూడగానే అదోలా అనిపించిందామెకి. గడ్డపారలాంటి కుర్రోడనుకుందామె. వయసుకు మించిన ఎత్తు, ఒళ్లు, టక్కరి కళ్లూ. బలమైన చేతులూపుకుంటూ ఇరవై ఏళ్లకే మరో పదేళ్ల నిర్లక్ష్యంలా ఉంటాడు శీను. నోటినిండా పదోసారి నీళ్లు నింపి ఉమ్మేస్తూ శీనువేపు చూశాడు ఖాదరు. అతన్నోసారి సూటిగా చూసి పంపు దగ్గిరకి వెళ్లేడు శీను. పాదాల్లోంచి కసి, కోపం లేచి మధ్యలో ఎక్కడో ఆగిపోయింది. శీను వేపు చూశాడు ఖాదరు. చుట్టూరా చెట్లు, పెద్ద చింత ఒదిలిన లేత ఉదయంలో కూడా ఖాదరు కళ్లు తిడుతోన్న బూతులు కనిపించేయి శీనుకి. ఈడికి తెలిసిపోయింది. గేరంటీ. పంపు దగ్గిర ఒంగి మళ్లీ ఖాదరువేపు చూశాడు శీను. కళ్లు తిప్పుకుని తిట్ల బూతులు నవుల్తూ వెళ్లిపోయాడు ఖాదరు. అరగంటసేపు మొహం కడిగేడు శీను. అనుమానం లేదు. అక్కడే నిలబడి ఆలోచించాడతను. ఏవవుతుంది? ఖాదరుగాడికి తనని కొట్టే దమ్ములేదిప్పుడు. పెళ్లాన్ని ఎలాగూ నాలుగు తంతాడు. దాన్నీ పొమ్మండు, తన్నీ పొమ్మండు. గేరంటీ. పొమ్మన్నా పోయేదేవుంది? నెల దాటిపోయింది. ధైర్యంగా గుంటూరు బోవచ్చు. మళ్లీ రైల్వేస్టేషను. మళ్లీ మామూలే. ఊడేదేంది పో అనుకున్నాడు శీను. ఏవీ ఊడదని తెలుసతనికి. ప్రస్తుతానికి సాయిబుకి తను లేకపోతే గడవదు. ఓకే బిడ్డా నీ యిష్టం.

    ఎండ బాగా తెల్లబారేసరికి ముగ్గురూ రాత్రి పప్పుచారుతో చద్దెన్నం తినేశారు. అరుగు చిమ్మి, గిన్నెలు, బాల్చీలు ఆస్పత్రి గోడపక్కన జాగర్త చేసింది బీ. ప్లాస్టిక్ గుడ్డ కప్పి రాయి పెట్టి గోడవార నుంచుని చీర మార్చుకుని పచ్చ చుడీదారు తొడిగిందామె. నుంచున్నా కూచున్నా ఖాదరు చిటపట్లాడుతున్నాడు. ఆమెకీ తెలీకపోలేదు. దొరికినప్పుడల్లా శీనుతో కళ్లతో మాట్లాడుతోంది.

* * * 

    నరసరావుపేటలో బీ తల్లి దగ్గర పెద్దపిల్లలిద్దర్నీ ఒదిలి ఊళ్లు తిరుగుతారిద్దరూ. బుట్టలోనే ఎప్పుడూ పడుకుని ఉండడాని కిష్టపడే గోధుమతాచు పాము, పెద్దగా ఓపికలేని ముంగిస, బుల్‌బుల్, డోలకీ, రాగి తావీజుల డబ్బాతో చిన్న ఊళ్లలో బస్టాండు దగ్గిరా, స్కూళ్ల దగ్గిరా గారడీ చేస్తూంటాడు ఖాదరు.
ఒకరోజు ఆకివీడు స్టేషను దగ్గిర ఆటచేసి సామాన్లు సర్దుతున్నాడు ఖాదరు. బీ చిల్లర లెక్కబెడుతోంది. సంచి బొడ్లో దోపుకుంటూ 'తక్కువే' అందామె. ఖాదరేవీ అనలేదు. తక్కవగాకేవుంది? ఇచ్చేవాడూ లేడు, చూసేవోడూ లేడు. బతికేది కష్టవే. వీళ్లిద్దర్నీ చూస్తూ సిగరెట్టు కాలుస్తూ దూరంగా నుంచున్నాడు శీను. ఖాదరు చూశాడు.

    బీడీ వెలిగించి దగ్గిరికొచ్చి అన్నాడు.

    "ఏం చూస్తా ఉండావు?''

    "ఏవిలే. డబ్బులు చిక్కినయ్యా?'' 

    "బొచ్చు. తింటానిక్కూడా రావట్లా. ఈ ఊరేనా?'' 

    "గుంటూర్లే.'' 

    "గుంటూరా? పనిబడి వచ్చేవా ఏంది?''

    "ఆ స్టోరీ ఎందుగ్గానీ ఏ ఊరుబోతున్నావు?'' 

    "నిడదవోలు. నువ్వో?'' 

    "ఆడికే.'' 

    నలుగురూ స్టేషన్లోకి వెళ్లేరు. పాసెంజరు ఖాళీగా ఉంది. టీ, మిర్చి ఇప్పించేడు శీను. చిన్నదానికి రెండు చాక్లెట్లు కొనిచ్చాడు. గుంటూర్నించి ఎందుకు ఒచ్చేడో నిడదవోలు ఎందుకెళ్తున్నాడో తెలీలేదుగానీ గంటలో ఇద్దరికీ ఒప్పందం కుదిరింది. స్టేషన్లోనూ బయటా పోలీసు కనిపిస్తే తల తిప్పుకోడం, పక్కకి జరగడం గమనించాడు ఖాదరు. ఉదయం స్కూలు దగ్గిర ఆట మొదలుపెట్టాడు సాయిబు. వలయంలో తిరుగుతూ నాగినీ పాట వాయిస్తూ ఊరికీ మనుషులకీ నిమిత్తం లేని అలవాటైన మాటల్ని పేనుతూ తెలుగు హిందీ పాటలు వాయిస్తూ పాము ముంగిస యుద్ధాన్ని మధ్యలో వర్ణిస్తూ బుట్టలోంచి పాముని బయటికి తీశాడు ఖాదరు. దాన్ని కాసేపు పిల్లల దగ్గరికీ, ఆడవాళ్ల దగ్గరకీ తిప్పుతున్నాడు. ముగ్గురు పాలమ్ముకునే ఆడాళ్లు తప్ప ఎవరూ ఆశ్చర్యపోలేదు. ముందు నుంచున్న స్కూలు కుర్రాడు పామునే చూస్తున్నాడు. ఖాదరు దగ్గిరికి రాగానే అడిగేడు.

    "ఏం పాము ఇది?'' 

    "నాగుబాము. కొండల్లో పట్టినాం. పడగమీద మణి ఉంటది.''

    "అనకొండ గాదూ'' కుర్రాడు నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

    మనిషంతా నోరై అరగంట మాట్లాడి, పాడి చివరికి బ్లేడుతో జబ్బ మీద గీసుకుని తావీజుకి రక్తం అంటించి "అచ్ఛింతల దోసం పోద్దమ్మా. పీడకలలకి తావీజు ఏసుకోండి తల్లీ'' అంటూ పదేపదే చెప్పి మొత్తానికి నాలుగు తావీజులు అమ్మేశాడు. తోకమీద లేచి పామూ ముంగిస ఎప్పుడు పోట్లాడుకుంటాయని అదృష్టవశాత్తూ ఎవరూ అడగలేదు. 

    ఖాదరు అదృష్టం కోతిపిల్లతో పోయింది. కోతి ఉన్నంతకాలం నెత్తిమీద డబ్బాపెట్టుకుని తిరిగుతూ, అత్తవారింటికి వెళ్లనని మొరాయిస్తూ నాలుగు డబ్బులు సంపాయించి పెట్టేది. చినగంజాం స్టేషను దగ్గిర గూడ్సుకింద పడి చచ్చిపోయింది కోతి. ఇద్దరూ నెత్తీ నోరూ కొట్టుకున్నారు. సరిగ్గా మూడు రోజులు చూసి గారడీ విన్యాసం మార్చేశాడు శీను. చామన చాయలో ఆరోగ్యంగా నొక్కుల జుత్తుతో ఉన్న కాటుక కళ్ల బీ ని చూస్తూ పనిలో పడ్డాడు శీను. చుట్టుపక్కల ఊళ్లు తిరిగి రాజమండ్రి చేరేరు. గవర్నమెంటు ఆస్పత్రి దగ్గిర ఆట ముగించి మర్రిచెట్టు కింద కూచున్నాడు ఖాదరు.

    దూరంగా బీకి పొయ్యి వెలిగించడంలో సహకరిస్తున్నాడు శీను. ("ఏంది నీకు ముగ్గురు పిల్లలా? ఎవరూ నమ్మరు'' అంటూ) బీ డోలు దరువు ఖాదరు బుల్‌బుల్ సహకారంతో శీను మొగ ఆడ గొంతులతో పాటలు పాడ్డం, అనుగుణంగా డేన్సు చేయడం ప్రత్యేక ఆకర్షణ. జనం చప్పట్లతో పాటు చిల్లర రాలుస్తున్నారు. ఖాదరు సంతోషించాడు.

    తరచుగా బీని ముట్టుకోడం, నడుం మీద చెయ్యి వెయ్యడం నృత్యంలో భాగంగా అంగీకరించాడు ఖాదరు. అదేం కాదని బీకి త్వరగానే తెలిసిపోయింది. అన్ని ఒంపులు ఎలా తిరుగుతాడో ఆమెకు అర్థం కాలేదు. ఆటపాటలకి మరో అదనపు ఆకర్షణ చేర్చేడు శీను. చొక్కావిప్పి ముందుకీ వెనక్కీ ఎముకలు లేనట్లుగా మొగ్గలు వెయ్యడం. అన్ని రకాలుగా శరీరం ఒంగుతుందనుకోలేదు బీ. ఓ రోజు సన్నటి ఇనుప ఊచల్తో చక్రం తయారు చేశాడు శీను. ఓ రోజంతా దివాన్‌చెరువు తోట దగ్గర ఇద్దరి మధ్యా దూరం కొలుచుకుని కళ్లు మూసుకుని వేసినా తలమీంచి కిందపడేట్టు నేర్పేడు ఖాదర్‌కి. ఆట మధ్యలో ఇనప చక్రం చుట్టూ కిరసనాయలు గుడ్డలు జాగ్రత్తగా చుట్టి వెలిగించి ఖాదరు విసురుతాడు, బీ డోలకు నేపథ్యంలో. ఎదురుగా నుంచున్న శీను తల మీంచి అది కాళ్ల దగ్గిర పడుతుంది.

    "ఏరా సాయిబూ?'' 

    "ఆ...'' 

    "నీలో సత్తెముందా?'' 

    "ఉంది.'' 

    "నాలో సత్తెముందా?'' 

    "లేదు.'' 

    "ఉందిరా సాయిబూ. అమ్మోరు చెప్పింది.'' 

    "అయితే చూపించు బిడ్డా. ఈ అగ్గి నీ మీద ఏస్తా. నీ కంటుకుంటే సత్తెం లేదు. తయార్!''

    "తయార్!'' 

    "తయార్.'' 

    ఖాదరు ఆకాశం వేపోసారి చూసి విసురుతాడు. మొదట బీ కళ్లు భయపడ్డాయి. తరువాత నవ్వేయి. డోలు హోరులో రింగు విసురుతాడు ఖాదరు. ఎక్కువ రూపాయి బిళ్లలు పడేవి. చుట్టు పక్కల పల్లెలు తిరిగేరు. 

* * * 


    ఇవాళ మధ్యాహ్నం ఇంకో ఊరు చూసి తుని వెళ్లాలి. నెల రోజులు పైగా శీను కేంద్రంగా సాయిబు సంచార జీవితం బాగానే గడిచింది. ఖాదరు సామాన్లు సర్దుకున్నాడు. రింగు విడిగా పెట్టాడు. మెట్ల మీద కూచుని చూస్తున్నాడు శీను. ఖాదర్ని చూస్తే నవ్వొస్తోంది. మధ్యలో శీనువేపు చూస్తూనే ఉన్నాడు. కడుపు ఉడికి పోతోంది. సర్దుడు అయ్యాక వెళ్లి గుడి దగ్గిర నుంచుని బీడీ వెలిగించేడు ఖాదరు. ఈ ఎదవ అందుకన్న మాట వచ్చింది. ఆలోచించేడతను. ఊళ్లోకి మెల్లగా వెళ్లి పోలీసులకి చెప్తే? లాక్కెళ్లి కుళ్లబొడుస్తారు. ఆళ్లిష్టం. తీట తీరిపోద్ది. అసలు గొడవేందో తెలీదు. వీడు చెప్పలేదు. తను అడగలేదు. ఏదో చేసే ఉంటాడు. శనిబట్టినట్టు పట్టేడు. కాసేపటికి నీ దారి నువ్వు చూసుకోపోరా అందామనుకున్నాడు. వెళ్లకేం చేస్తాడు సైతాను. ఏం తిమ్మిరి. మూడు పూటలూ తింటంలా? తుని వెళ్లాలనిపించడం లేదు ఖాదరుకి. నర్సరావుపేట పోయినా వెంబడే వీడూ వస్తాడు. ఆలోచించేకొద్దీ అతనికి ఒళ్లు చల్లబడిపోతోంది. 

    పాము ముంగిసల్లాగే ఉంది అతని పని. కాలుమీద కాలేసుకుని దర్జాగా కూచున్నాడు శీను. చాలాసేపు గుడి అరుగుమీదే కూచుండిపోయాడు ఖాదరు. దూరం నుంచే బీని చూస్తున్నాడతను. దూరంగానే ఉన్నారు వాళ్లిద్దరూ. శీను దగ్గిరికి వెళ్లింది చిన్నది. బీ తనవేపే చూస్తోంది. బరి తెగించింది. వెళ్లి పెళ్లాన్ని నాలుగు బాదాలనిపించింది. తన ఆడదాన్ని కొట్టుకుంటాడు, తిట్టుకుంటాడు. ఏం? ఖాదరు కసంతా కడుపులో దడదడలాడింది. చిన్న పిల్లతో ఆడుతున్నాడు శీను. తెగ నవ్వుతోందది. ఇదివరకయితే చూసి సంతోషపడేవాడు. గాచారం బాగలే. మళ్లీ బీడీ వెలిగించాడు ఖాదరు. సగం బీడీ పీల్చేసరికి నీరసపడి పోయేడు. 

    ఏడాదిలో పనులు దొరికినప్పుడల్లా తాపీ పనికి వెళ్తాడు సాయిబు. ఇప్పుడల్లా పనుల్లేవని చెప్పేడు మేస్త్రీ. గడవక ఊళ్లమీద పడ్డాడు ఖాదరు. బీ తనవేపే వస్తోంది. ఆటకి చుడీదారు వేసుకుని కుర్ర పిల్లలాగే ఉంది దూరాన్నించి.

    "కూర్చున్నావేంది?'' ఖాదరు కడుపులో పెద్ద బండ బద్దలై నోట్లో తిట్లు ఊరేయి. బయటకి మాత్రం ఒక్క తిట్టూ రాలేదు.

    "అయితే యేంది? యెళ్దాంలే పో.''

    "పోయేదేంది? యండెక్కతా ఉంది.''

    ఒక్క అరుపు అరిచి "నీయక్క పోయే ఆడికాడికి'' అందా వనుకున్నాడు ఖాదరు. కానీ ఆమె నడుంమీద రెండు చేతులూ పెట్టుకుని సూటిగా చిరాగ్గా అతనివేపు చూస్తోంది.

    "చూస్తావేంది? తుని బోవాన్లా ఒద్దా?'' అంది మళ్లీ అగ్గిలా ఆమెను చూడ్డానికి ప్రయత్నించాడు ఖాదరు. ఆమె అలాగే నిలబడింది. వెళ్లమని చెయ్యి ఊపేడతను. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లిపోయింది బీ. తేలిక పడిందామె. అతను బుట్టలో పాములా అయిపోయాడు. పిల్లతో ఆడుతూనే వీళ్లిద్దర్నీ గమనిస్తున్నాడు శీను. అనుమానం పిసరు ఏదేనా ఉంటే అది కాస్తా తీరిపోయింది. ఎలా ఎప్పుడు తెలిసిందో గానీ సాయిబుకీ తెలిసిపోయింది. శీను పక్కనుంచి వెళ్తూ చిన్నగా అంది బీ "ఒస్తాడంట.''

    శీనుకి నవ్వొచ్చింది. ఖాదరేవీ అనే స్థితిలో లేడని అర్థమైంది. తేలిగ్గా ఒళ్లు విరుచుకున్నాడు. కూతురి మెడ ఓ పక్కకి ఒంచి దాని చెవిలోకి చూస్తోంది బీ. 

* * * 

    దివాన్ చెరువు వచ్చిన కొత్తలో ఓ సంధ్యవేళ - చెట్లలో చిక్కుకుని ఊరవతల బాగా చీకటి పడిపోయింది.
"ఊళ్లోకి బోయొస్తా''నంటూ ఖాదరు సారాబస్తా (పొట్లం) కోసం వెళ్లిపోయాడు.

    విసుక్కుంటూ ఆమె రెండు ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టి, చిన్న గిన్నెలో వేడినీళ్లు పెట్టుకుంది. చిన్నదానికి నీళ్లుపోసి అన్నం పెట్టింది. గుడ్లు ఉడకబెట్టింది. చిన్నది వరండాలో చాపమీద పడుకుంది. నీళ్లు కాగేలోగా జడదువ్వుకుంది బీ. శీను లేడు. ప్లాస్టిక్ బాల్చీలో నీళ్లు ఒంపుకుని బోరుపంపు దగ్గిరికి వెళ్లిందామె. నీళ్లు కొట్టుకుని చీకటి మరుగులో స్నానం చేసి గుడ్డ చుట్టపెట్టుకుంటూ యధాలాపంగా గుడిపక్కకి చూసిందామె. చీకట్లో ఎవరో నుంచున్నారు. ఒళ్లు తుడుచుకోడం మర్చిపోయి అలాగే నుంచుండిపోయిందామె. పెద్ద అంగలేసుకుంటూ క్షణంలో వచ్చేశాడు శీను. బిత్తరపోయింది బీ.

    "నువ్వా!''

    "నేనే'' అమాంతం బీని రెండు చేతుల్లోకి ఎత్తుకుని గుడి వెనక అరుగు మీదికి తీసుకుపోయాడు శీను.
గంట తరవాత వచ్చేడు ఖాదరు. శీను లేడు. కొన్నాళ్ల తర్వాతగానీ తేడా తెలీలేదు ఖాదర్‌కి. బీ అన్నం పెడుతున్నప్పుడు తేడా గమనించాడతను. 

    ముగ్గురూ కూచుని తింటున్నప్పుడు కొత్తగా వాడికి కొసరి అన్నం వెయ్యడం చూశాడు. చిన్నచిన్న తేడాలు గమనించిన కొద్దీ కనిపించేయి. శీనుకీ వచ్చింది అనుమానం. అందుకని ముత్యాలమ్మ వీపు వెనక కలుసుకోడం మానేశారు. కుదరడం లేదు.

* * *

    ఖాదరుకి ఓ మాదిరి చీకట్లో ఉన్నట్టనిపించింది. కాని ఉదయంతో అందరికీ సందేహం తీరిపోయింది. వాళ్లిద్దరికీ ఇవాల్టి గురించీ, ఖాదరుకి రేపటి గురించీ.

    ఎండ మరీ ఎక్కువైతే ఇబ్బందే. లేద్దావనుకుంటూ శీను వైపు చూశాడు ఖాదరు. వాడూ లేచి నుంచున్నాడు. ఒళ్లు విరుచుకుని ఆవులిస్తున్నాడు. నిస్సహాయంగా చూస్తుండిపోయాడు ఖాదరు. తనవేపే ఒస్తున్నాడు శీను. భయమే లేదు ఈడికి. పేగులు తీసి తినేటోడు. వాడి వేపు చూడకుండా ఉండటానికి ప్రయత్నించాడు ఖాదరు.

    "అన్నా, ఎల్దామా లేటుందా! కూచున్నావేంది వైనంగా?'' 

    "... ఏమిలే ... పద.''

    "సాయంత్రానికి అన్నవరం బోదాం.''

* * * 

    రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని తీరిగ్గా రోడ్డువేపు నడుస్తూ మధ్యలో వెనక్కి చూసి రమ్మన్నట్టు చెయ్యి ఊపేడు శీను. కడుపులో లేని ఉత్సాహం తెచ్చుకుంటూ పామునోసారి చుట్టూరా తిప్పి, పడగమీది మణి గురించి వివరించి చివరికి మెళ్లో వేసుకుని బుల్‌బుల్ వాయిస్తూ అలవాటుగా అనర్గళంగా మాట్లాడుతూ గారడీ మొదలుపెట్టాడు సాయిబు.

    అతని ఇంద్రజాల మహిమ గాల్లో కలిసిపోయింది. ఎవర్నీ చుట్టుకోలేదు. కుర్రాళ్లు కూడా లేస్తుండగా శీను అందుకున్నాడు. వలయంగా పోగైన జనం ఆశ్చర్యంలోకి పిల్లిమొగ్గలు వేశాడతను. జనం చప్పట్లు కొట్టేరు. చిన్నపేగులు బయటికి లాగి ఖాదరు నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. బీ వేపు చూడ్డం లేదతను. మామూలుగా ఇనపరింగు అంటించాడు ఖాదరు. చాలా ఏళ్లక్రితం ఒళ్లు కాలి చచ్చిపోయిన చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. శీను ఎదురుగా నుంచుని భక్తిభావంతో ఆడగొంతుతో ఓసారి ఆకాశం వేపు చూసి పాటందుకున్నాడు.

    "ఎయ్‌రా సాయిబూ, తయార్.''

    ఖాదరు శీనువేపోసారి చూసి రింగు అందుకుని, బీ వేపు చూశాడు. డోలకు వాయించడం మొదలైంది. శీను సూటిగా ఖాదరు వేపే చూస్తున్నాడు. మండుతున్న రింగుని శీనుమీదికి వేశాడతను. అలవాటు ప్రకారం అది శీను తలమీంచి కిందికి జారిపోయింది. జలజల చప్పట్లు రాలేయి. శీను వెనక్కి మొగ్గవేసి బీ దగ్గిరికి వెళ్లి నాటకీయంగా చెయ్యి అందించాడు. ఆమె చెయ్యి పట్టుకుని డేన్సు మొదలు పెట్టేడు. కళ్లు మూసుకుని బుల్‌బుల్ వాయిస్తున్నాడు ఖాదరు. చివరికి డోలు తిరగతిప్పి చుట్టూరా తిరిగింది బీ. జనం డబ్బులేశారు. రక్తం అద్దిన తావీజులు మాత్రం ఎవరూ కొనలేదు. గంటన్నర తరవాత వెనక్కి వచ్చి ముత్యాలమ్మ గుడి అరుగుమీద కూచుని డబ్బులు లెక్కపెట్టింది బీ. శీను ఆస్పత్రి మెట్ల దగ్గర నుంచున్నాడు.
డబ్బులు బాగానే వచ్చేయి. ఖాదరు చూసి చెట్టు కిందికి వెళ్లి బీడీ వెలిగించాడు.

    ఆస్పత్రి పక్కన ఎద్దుని తీసుకొచ్చి కాళ్లు కట్టేశారు. ముందు మొరాయించింది ఎద్దు. లోపల్నించి డాక్టరుగారొచ్చి పది నిమిషాల్లో ఎద్దు విత్తులు నొక్కేరు. మందురాసిన తరవాత ఎద్దుతో సహా అందరూ వెళ్లిపోయారు. బుట్టలో పాములా అయిపోయాడు ఖాదరు. ఆస్పత్రి ఖాళీ అయింతరవాత వెళ్లి సామాన్లు సర్దింది బీ.

    అరుగు మీద కూచుని ఎటో చూస్తున్నాడు ఖాదరు. ఆఖరి సంచీ ముడిపెట్టి ఖాదరు దగ్గిరికి వచ్చింది బీ.
లేచి, "పోదాం పాండి'' అన్నాడతను.

    ఖాదరూ చిన్నదీ ముందు నడుస్తున్నారు. రోడ్డెక్కబోతూండగా ఒకడుగు వెనక్కి వేసి శీను వేపు చూస్తూ మెల్లిగా అంది బీ.

    "గుంటూరు పోతావా యేంది?''

    కసిక్కున నవ్వేడు శీను. 

    ఖాదరు విన్నాడు గానీ వెనక్కి తిరిగి చూడలేదు.

(ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం 13 జూన్ 2010 సంచికలో ప్రచురితం)
Comments