గొడ్డు - జయంపు కృష్ణ

    
ఈ విశాల సృష్టిలో సమస్త జీవరాశుల్లో మానవజన్మ మహోన్నతదశను అందుకుందని మేధావులు ప్రవచించారు.     మరి - ?

* * * * *
    మనుషులంతా నన్ను 'గొడ్డు' అని పిలుస్తారు.     మా అమ్మకి నేనొకణ్ణే కొడుకుని. మా చెల్లెలు మరో పెయ్య కూడా ఉంది.     ఈరోజు పసుపు కుంకుమ సింగారింపుతో, దండల అలంకరణతో 'బలి'కి సిద్ధం చేస్తున్న నన్ను చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఉన్న ఒక్క కొడుకునీ కాటికి పంపుతున్నారని విలవిలలాడుతోంది.     అమ్మ అమాయకురాలు. మాకు పాలు చాలకుండా లాగేసి, ఆమె పొదుగుని పిండుకుంటారు. అయినా అమ్మ బాధపడదు. గడ్డి చాలక, శక్తి లేక పాలివ్వనప్పుడు... కనికరం కూడా చూపకుండా...తాడిబద్దతో చర్మం చిట్లి, రక్తం వచ్చేటట్లు చావగొడతారు. అయినా బాధపడలేదు అమ్మ. మరి ఈనాడు కన్నబిడ్డను కడతేరుస్తుంటే ఆ కన్నీరెందుకు?     అసలు నేను ఊహ తెలిసినప్పట్నించీ ఆలోచిస్తున్నాను. 'మేం జీవులం కాదా?? గొడ్డుచాకిరీ చేయించుకునే కదా మాకు గొడ్లు అని పేరు పెట్టింది? మేం చస్తే కూడా వదలకుండా మా చర్మం వలిచి చెప్పులు కుట్టుకుంటారే?? మాకు హృదయం లేదా? అనుభూతులూ, అనుబంధాలూ లేవా? మరెందుకు మమ్మల్నింతగా హింసిస్తారు?? హీనంగా చూస్తారు? హేయంగా మాట్లాడతారు?'     మానవుడు మేధావి కాబట్టి, జీవులన్నిటిలోనూ ఉత్తమమైన జాతిగా అనుకున్నాడు. ఉత్కృష్టమైన జన్మగా ఊహించుకున్నాడు. మరి అటువంటి ఉత్తముడు, ఉన్నతజన్ముడు - సాటి జీవుల్ని ఇలాగేనా చూడవలసింది? దయలేదా వాళ్ల హృదయాల్లో? మాలాగే రక్తం ప్రవహించడంలేదా వాళ్ల శరీరాల్లో?...     ప్చ్...మా ఆలోచనల్ని చెప్పుకునేందుకు మాకు గొంతు లేదు. కానీ గుండె ఉంది. అన్నింటినీ నిశ్శబ్దంగా భరించాల్సిందేనా??     మరి - మా జన్మకి అర్థం?          మనిషికి మేము చెసే సేవకు పరమార్థం?

* * * * *

    ఈ ఊళ్లో అందరి కన్నా పెద్ద కామందు మా యజమాని. బంగళా, కారూ, బలగం అన్నీ బాగా ఉన్నాయి. గొడ్లు కూడా చాలా ఉన్నాయి ఆయన అజమాయిషీలో. అన్ని గొడ్లుంటే మరి నన్నే బలికి ఎన్నుకున్నదెందుకు? దానికో ప్రత్యేక కారణం ఉంది.
    మా యింట్లో ఈ మధ్యనే ఒక పనిమనిషి చేరింది. చాలా అందంగా ఉంటుంది. అయితే మా యజమాని భార్యకంటే అందంగా ఉండదు. వయస్సొస్తే అన్నీ అందంగానే ఉంటాయిగా మరి! ఆ పనిమినిషీ అంతే! కాకపోతే నాలాగా కాస్త శరీరం బలంగా ఉంది.     మా యజమానికి చీకటిపడితే నాటుసారా తాగే అలవాటుంది. ఆ మత్తులో మాంసం, మగువా అవసరం. ఆ అవసరంలో ఆయనొక నియంత.     ఒక వెన్నెల రాత్రి -     మా అమ్మదగ్గర గొంతుకూర్చొని, రెండు తొడల మధ్యా చెంబు పెట్టుకొని, పాలు పితుకుతోంది పనిమనిషి. పీకలవరకూ తాగొచ్చిన మా యజమాని, నేరుగా ఇంట్లోకెళ్లకుండా - మేమున్న చోటికొచ్చాడు. పాలు పిండుతున్న పనిమనిషి ఆయనకెలా కనిపించిందో - ఆ వెన్నెల్లో - నాకు తెలియదు. ఆంబోతులా ఆమె మీద పడ్డాడు. పాలన్నీ నేలపాలయ్యాయి.     మా అమ్మ భయంగా పక్కకు జరిగి నిలుచుంది.     "అయ్యగోరూ? అయ్యగోరూ? నన్నొదలండి. నేనలాంటిదాన్ని కాదు. పైగా పచ్చి బాలింతని. నా పెనిమిటి..." మాట్లాడనివ్వలెదామెని.     చేతులెత్తి దణ్ణం పెట్టింది. కాళ్లు పట్టుకుని బ్రతిమలాడింది. ప్రాధేయ పడింది. ప్రార్థించింది.     కనికరం కలగలేదు మా యజమానికి. కామంతో నెట్టుకుంటూ వచ్చి పశువుల కొట్టంలో కట్టేసి ఉన్న నా ముందు నిలువునా తోసేశాడామెని - ఆ రొచ్చులోనే! ఆమె నోట్లో గుడ్డ కుక్కాడు. విలవిలలాడుతూనే ఉంది. ఆమె రవికె పట్టుకున్నాడు.     నాకాయన ప్రవర్తన నచ్చలేదు. ఆ రాక్షసత్వానికి నా గుండెలు జలదరించాయి. ఆమె అసహాయతకు నా మనసు ద్రవించింది.     అంతే! నా శక్తినంతా కూడదీసుకుని ఒక్కసారి కట్లు తెంచుకున్నాను. ఆ దానవుణ్ణి కుమ్మేశాను బలంగా!     ఆ దెబ్బకి దూరంగా పడ్డాడు మా యజమాని. పక్కనే ఉన్న గుంజకు ఆయన తల కొట్టుకుని రక్తం చిమ్మింది. పులిలా చూశాడు నన్ను. నేను బెదరలేదు.     బుసకొడుతూ కాలు దువ్వాను. పనిమనిషికి అడ్డంగా నిల్చున్నాను. మత్తు దిగిపోయింది మానవుడికి.     నాకేసి ఉక్రోషంగా చూసి 'థూ! నీ యమ్మ!...' అని ఉమ్మేసి బట్టలు సర్దుకుంటూ లోపలికెళ్లిపోయాడు.     పనిమనిషి గుడ్డలు సర్దుకుని నాకు దణ్ణం పెట్టి పారిపోయిందక్కణ్ణించి. నేను మళ్లీ బుద్ధిగా నా కట్టుగూటం దగ్గర నిలుచుండిపోయాను.     మా అమ్మ నా వేపు మెచ్చుకోలుగా చూసింది.

* * * * *

    నాలుగు రోజులు ఇంట్లోంచి బైటకి రాలేదు మా యజమాని.
    పనిమనిషి కూడా మళ్లీ పన్లోకొచ్చినట్లు లేదు. ఒకరోజు -     ఉదయాన్నే పాలేరుతో కలిసొచ్చాడు మా యజమాని మా కొట్టంలోకి. తలకి కట్టిన బాండేజి ఇంకా విప్పినట్టు లేదు. నన్ను మిఱ్ఱిమిఱ్ఱి చూశాడు.     "దీనికి పగరు పట్టిందిరా! ఎట్టా బలిసిందో చూడు! దీనమ్మ..." అన్నాడు. ఆవేశంగా వాడిదగ్గరున్న ముల్లుగఱ్ఱని అందుకుని పలగాడి వెయ్యమన్నాడు.     పాలేరు వేశాడు - నేను పారిపోకుండా ఉండేందుకు.     'పొగరు పట్టింది నాకా?...' యజమాని వంక అసహ్యంగా చూశా.     పిచ్చిపట్టినట్లు నన్ను కొట్టసాగాడు.     ముల్లుతో పొడుసూ, కఱ్ఱ విరిగిపోయేవరకూ - ఎక్కడ పడితే అక్కడ బాదేశాడు నన్ను. నా వీపు, చర్మం చిట్లి రక్తం కారసాగింది. అతని కసి తీరిందనుకున్నా.     దూరాన మా అమ్మ కళ్లల్లో నీళ్లు - 'ఎందుకు నాయనా! ఆ వెధవ జోలికి పోయావ్?' ఏడుస్తోంది అమ్మ.     కొట్టి కొట్టి విరిగి పోయిన కఱ్ఱని విసిరిపారేస్తూ "థూ! నీ యమ్మ ..." అంటూ నా ముఖాన కేకరించి ఉమ్మేశాడు అక్కసుగా.     'అంటే? - అవసరమైతే మా అమ్మని కూడా... చీ!! నీచుడు!'     "కాలు పట్టేద్దాం" అన్నాడు పాలేరు.     "అక్కర్లేదు" అన్నాడు యజమాని రొప్పుతూ.     "కసాయివాడికమ్మేద్దాం" అన్నాడు పాలేరు.     "వద్దు."     "మరి? యిట్టంటి గొడ్డుని...?"     "ఉండరా - దీని సంగతి నేను తేలుస్తా..."     "ఎట్టాగండీ?"     "రాబోతోందిగా అమ్మోరి జాతర. అందులో బలిద్దాం. అందులో అయితే అడుగడుగునా, అణువణువునా హింసపెట్టి - నరికిపారేస్తారు నాయాల్దాన్ని. ఇవాళే చాటింపేయండి!" అంటూ విసురుగా వెళ్లిపోయాడు యజమాని.     అలా నేను బలిపశువునయ్యాను.
* * * * *

    తప్పెట్ల శబ్దం పెరుగుతోంది. ఊరంతా కోలాహలంగా ఉంది. జనం ఆనందోత్సాహాలతో తిరుగుతున్నారు కొత్తబట్టలేసుకుని.     ఇక్కడ...ఈ దొడ్లో...నేను...     పాపం మా చిన్న చెల్లెలు ఏడుస్తోంది. ఇవాళ ఉదయం నుంచీ నాకు మేత లేదు. నీళ్లు లేవు. పస్తు పెట్టారు. ఆచారమట! అంటే చచ్చిపోయేముందు ఆకలితో మాడాలన్నమాట!     మా అమ్మని, మిగతా గొడ్లనీ పొద్దున్నే పశువుల్లోకి తోలేశారు. ఆఖరు క్షణాల్లో అమ్మ దగ్గరుంటే ఎంత బావుణ్ణు? చివరి చూపుల కన్నా నోచుకున్నానో లేదో?     అమ్మకి ఏదో చెప్పాలి - మనసు విప్పాలి - ఎలా?     ఏడుస్తున్న చిట్టిచెల్లెలి కన్నీళ్లు తుడవాలి - ఎలా?     యజమాని నిజ స్వరూపం బయట పెట్టాలి - ఎలా?     బాకా శబ్దాలు, తప్పెట్ల ధనధనలూ దగ్గరవుతున్నాయి. అమ్మ ఇంకా రాలేదు. వాళ్లంతా వచ్చారు.     ముఖాలకి పెద్ద బొట్లు...చేతుల్లోఅ గుజ్జుకట్టెలు...జడలు విరబోసుకున్నారు. తూగుతున్నారు... భయంకరంగా యమకింకరుల్లా...వికృతంగా అరుస్తున్నారు.     వాళ్ల వెనక విలువైన బట్టల్తో మా యజమాని!     'అసలు వీళ్లంతా మనుషులేనా?'     ఆ వచ్చినవాళ్లకి నన్నప్పజెప్పాడు మా యజమాని. ఏదో పవిత్ర కార్యం చేస్తున్నట్లు కళ్లు మూసుకుని ప్రార్థిస్తున్నాడు. లోపల ఏం అనుకుంటున్నాడో నాకు తెలుసు.     అమ్మ ఇంకా రాలేదు.     నా చూపు గుమ్మంవేపుంది.     అమ్మని చూడాలని ఉంది. నా ఆశ ఫలించేలా లేదు.     వాళ్లు నన్ను లాక్కుపోతున్నారు బలవంతంగా... కాదు ఈడ్చుకుపోతున్నారు.     చిట్టిచెల్లెలు పాపం బిత్తరపోయింది. తత్తరపాటుతో నా వంక చూసింది. భయంకరంగా వెఱ్ఱికేక వేసింది. ఇక అక్కణ్ణించి ఎంత త్వరగా వాళ్లతో వెడితే అంత మంచిదని - మొరాయింపు మానేసి - వడివడిగా అడుగులేశాను.     అయినా వాళ్లు నన్ను కనికరించలేదు. ఇంకా తరుముతున్నారు. తన్నుతున్నారు. గుజ్జుకఱ్ఱల్తో బాదుతున్నారు. డొక్కల్లో పొడుస్తున్నారు. నా లేత వెన్నెముక విరిగినట్టయింది...ఎముకలు చిట్లినట్లుగా బాధ...అయినా...ఆ తంతు సాగుతూనే ఉంది.     అలా హింసిస్తే దేవుడు సంతోషిస్తాడా?     దార్లోనైనా అమ్మ ఎదురౌతే బావుణ్ణు.     ఈ బాధంతా మర్చిపోగల్ను అమ్మని చూస్తే!     మరి మా అమ్మ ఈ అమానుషాన్ని చూసి తట్టుకోగలదా?     కనుచూపు మేర దృష్టి సారించాను.     అమ్మ కనిపించలేదు...ప్చ్...     ఎత్తిన నా తలని అలాగే కొమ్ములు పట్టుకుని వంచారు. కొమ్ములు విరిగాయనుకున్నా. పూనకం వచ్చినట్టు కిలారిస్తూ నన్ను గుడివైపు లాక్కెడుతున్నారు.     దారిలో ఈ దృశ్యాన్ని చూసిన మా పూర్వం పనిమనిషి ఆవేశంగా అడ్డురాబోయింది నన్ను గుర్తించి.

    ఆమెను ఒక్క తోపు తోసేశారు. అల్లంత దూరంగా పడిపోయిందామె.     నన్ను గుడి దగ్గరికి నెట్టుకుపోయారు కొట్టుకుంటూ.     ఎదురుగా గుడి - గుళ్లో అమ్మవారు -     చుట్టూ జనం కేరింతలు...క్రమంగా తప్పెట్ల జోరు హెచ్చింది. ఆవేశం అదుపుతప్పింది.     నా నాలుగు కాళ్లకీ బలమైన తాళ్లు బిగించారు. ఒక్కొక్కతాటిని బలమైన దృఢకాయులు పట్టుకున్నారు.     నా మీద బిందెల్తో నీళ్లు పోశారు. ఇంకేవో చల్లారు.     జనంలో కేకలు...సారాకంపు...'హింసలో' ఇంత ఆనందం ఉందా? సాటిజీవిని నిర్దాక్షిణ్యంగా, చిత్రహింసలు పెట్టి చంపడం ఆచారమా? అది అమ్మవారికి నైవేద్యమా?...     ఆ అమ్మవారు మా'గొడ్ల'కీ అమ్మవారే కదా?...ఏంటో...     దూరంగా ఎవరో ఆడగొంతు ఏడుస్తూ వినపడింది. అటు చూశాను. ఆ పనిమనిషి ఏడుస్తోంది బిగ్గరగా. ఆమె ముందుకు రావాలని విఫలప్రయత్నం చేస్తోంది. ఏవేవో కేకలు పెడుతూ గుండెలు బాదుకుంటూ గోడుగోడుమంటూ గగ్గోలు పెట్టేస్తఒంది. ఇద్దరు మనుషులామెని బలవంతంగా పట్టుకుని చేతులు వెనక్కి విరిచి అదేపనిగా కొట్టసాగారు దెయ్యం పట్టిందని.     ఇది నాగరిక లోకమా? నరకమా??     ఈ పరిస్థితుల్లో కూడా అమ్మని చూడలేకపోయానన్న అసంతృప్తి నాలో అలానే ఉండిపోయింది.

    వాళ్లు నన్ను ముందుకీ, వెనక్కీ నడిపించారు.     మళ్లీ పెద్దపెట్టున కేకలు...బాకాలు...త్రొక్కిసలాట...     నాకాళ్లకి కట్టిన తాళ్లు ఒక్కసారిగా బిగుసుకున్నాయి. ఒక్కసారిగా నాలుగు తాళ్లనీ బలంగా నాలుగువైపులకీ లాగారు. మరోక్షణంలో నా బోరయెముక చీలిపోయిందనిపించింది.     బలిష్టంగా, నల్లగా ఉన్న ఒకడు ముందుకొచ్చాడు. పెద్ద పదునైన కత్తితో నా ముందు కుడికాలిని మోకాలువరకూ చటుక్కున తెగ్గొట్టాడు. రక్తం ధార...     'అమ్మా!' అని అరవాలని నోరు తెరిచాను. తెగ్గొట్టిన నా కాలుముక్కని బలవంతంగా నా నోట్లో అడ్డంగా పెట్టాడు. చచ్చేటప్పుడు అరుస్తాననుకున్నాడో...ఏమో!!     నా కొమ్ములకిప్పుడు మరో ఉరి బిగించారు. నాలుగు పక్కలనుండీ నన్ను లాగి, నా మెడమీదుగా తళతళలాడే కత్తి పై కెత్తాడు.     "పాపం!" అనిపించింది. ఇంతటి ఘోరానికి పాలపడుతున్న ఆ మూఢుల్ని చూసి నాకు జాలేసింది.     ఈ పన్లు చేస్తున్నవాళ్లంతా మాలాగే చాకిరీ చేసేవాళ్లే. యజమానుల సంపదలు పెంచడానికీ, వాళ్లని సంతోష పెట్టడానికీ చెమటోడ్చే ఈ అజ్ఞానులు - నోరుండీ ఈ దారుణాన్ని అరికట్టలేకపోతున్నారు. వీళ్లకి నిజమైన విముక్తి ఎప్పుడో?     "కానీయండి! నరకండా గొడ్డుని!" యజమాని ఆజ్ఞ.     ఎత్తిన కత్తి నా పీకని నరుక్కుంటూ దిగిపోయింది.

* * * * *
    ఇప్పుడు చెప్పండి - ఎవరు గొడ్డు???
(ఆస్ట్రేలియా నుండి వెలువడిన తెలుగు పలుకు పత్రిక నవంబరు 1999 సంచికలో ప్రచురితం)
Comments