గోరీమా - అఫ్సర్

ఇంకో అరగంటలో మా ఊళ్లో ఉండబోతున్నానంటే ఒంటినిండా ఏవేవో ప్రకంపనలు.     
 
    నెమ్మదిగా వెళుతున్న పాసింజరు కిటికిలోంచి బయటికి చూపు సారిస్తే అప్పుడప్పుడే చురుకెక్కుతున్న ఎండ సూటిగా పైకి చూడనివ్వడంలేదు.     
 
    దూరంగా చెట్టునిండా ఎర్రెర్రని పూలతో దిరిసెన చెట్టు ఆకుపచ్చని నది మధ్యలో ఎగరేసిన ఎర్రజెండాలా వుంది. చూపులు ఇంకాస్తా క్రిందికి వెళ్తే కంకరరాళ్ళ ఆవల పసుపుపచ్చని తంగేడుపూల గుంపులు.     
 
    నేను నా కృత్రిమమైన నగర జీవనం తళుకుబెళుకులన్నీ వదిలించుకుని కాసేపు ఆ దృశ్యంలో కరిగిపోయాను.    
 
     చిన్నచిన్న ఫ్లాట్‌ఫారాలు దాటుకుంటూ వాటికంటే వేగంగా చెట్లనీ, పొలాన్నీ, చెరువుల్నీ దాటేస్తూ నా చిన్నతనంలోకి నన్ను పరిగెత్తిస్తోంది రైలు. 

    నాన్న చిటికెనవేలు పట్టుకుని ఈ ప్లాట్‌ఫారమ్మీద నడిచిన సాయంత్రాలు. ఒక రకంగా మధ్యతరగతి సంచార బతుకులు మావి. ఏ ఊళ్ళోనూ మూడేళ్ళకు మించి గడపలేదు. కాని ఇప్పుడు ఈ ఊరునైనా మా ఊరు ఎందుకంటున్నానంటే ఇక్కడ మేం కాస్త ఎక్కువ కాలమే గడిపాం. ముప్ఫయ్యారేళ్ళ బతుకులో ఆ కొద్దికాలం బతుకు పెద్దదేమీ కాకపోవచ్చు. కానీ ఆ 'కొద్దికాలం' అంటే నాకు చాలా ప్రేమ. ఇంట్లో మాత్రమే చదువుకున్న ఖాయ్‌దాతో ఈ ఊళ్ళోకి అడుగుపెట్టాను. ముందు నన్ను ఒకటో తరగతిలో చేరనివ్వలేదు. వీధిబడిలో వేశారు. పంతులుగారు నన్ను "ఒరే, అలీఫ్‌బే..." అని పిలిచేవారు. తర్వాత అదే నా పేరుగా స్థిరపడిపోయింది. అందరూ అద పేరుతో పిలిచి 'అలీఫ్ బే... ఏం బే!' అన్నప్పుడల్లా నేను పరుగుపరుగున అమ్మ దగ్గరకు వెళ్ళి ఏడ్చేవాణ్ణి. గోల చేసేవాణ్ణి. 'ఈ బే నాకు వద్దు... నాకు అఆలు చెప్పు' అనే వాణ్ణి. నిజానికి అమ్మకు అఆలు రావని నాకు తెలియదు. అప్పుడు నాన్నగారు పలక తీసుకుని నా చేత ముందు అఆలు దిద్దించారు. కానీ అమ్మకు నేను ఉర్దూ చదువుకోవాలని కోరిక. పనికట్టుకుని నా చేత ఖాయ్‌దా చదివించేది. నాకు అయిదేళ్ళ వయసు వచ్చేదాకా నాది ఏ భషో నాకే తెలియదు. అందరూ ఒకటో తరగతి తెలుగు వాచకం చదువుతుంటే నాకు నామోషిగా ఉండేది. నాకు యాభై ఆరు అక్షరాలే సరిగా రావాయె. నా దినచర్య ఫజర్ నమాజ్‌తో మొదలయ్యేది. పొద్దున్నే నిద్రలేవడం ఎవరూ చెప్పకుండానే అలవాటైంది నాకు. వజూ చేసి టోపీ పెట్టుకుని అమ్మతో పాటు ఫజర్ నమాజ్‌కి తయారయ్యేవాణ్ణి. చెప్పొద్దూ, నామజ్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. అది దైవకార్యం అనో ఇంకోటనో నాకు తెలియదు. అమ్మ అంటే నాకు ఇష్టం కాబట్టి అంతే! అమ్మ చేసే పనులన్నీ చాలా ఇష్టంగా చేస్తాను. అమ్మతో కలిసి కసువూడుస్తాను. అమ్మతో కలిసి వంటిల్లు శుభ్రం చేస్తాను. అమ్మతో కలిసి బట్టలుతుకుతాను. ఉతికిన బట్టల్ని సాపు చేసి చెక్క బీరువాలో పెడతాను. బడికి వెళ్ళడం అనే పని అమ్మకు లేదు కాబట్టే ఆమె పనులన్నీ నాకు మహా ఇష్టం. ఆ పనుల్లో మునిగిపోయి బడిని మరిచిపోతాను. పంతులుగారు రోజూ నాకోసం పిల్లల్ని పంపేంత వరకూ అలా మరిచిపోయినట్లు నటించేస్తాను.

    "ఏరా అలీఫ్ బే, నువ్వేమన్నా నవాబువా? నీకోసం రోజూ భటులు రావాలా?" అని పంతులుగారు చింతబరికెతో ఒకటిచ్చుకునేవాడు. అలా చింతబరికె నా వీపుమీద మోగుతున్న సమయాన ఓరోజున "ఏమయ్యా పంతులూ చిన్న పిల్లాడని చూడకుండా ఏమిటదీ?" అన్న గొంతు వినిపించింది.
    
    ఎవరా అని చూస్తే నిఝంగా దేవతే దిగివచ్చిందా అన్నట్టుగా ఒకావిడ పంతులుగారి వైపు తీక్షణంగా చూస్తూ మాట్లాడుతోంది. పంతులుగారు ఏమీ తొణక్కుండా
   
     "వీడు చిన్నపిల్లాడా?" అని మరోసారి బెత్తం దెబ్బ ఇచ్చుకున్నాడు. అంతే, ఆమె మెరుపులా దూసుకొచ్చి పంతులుగారి చేతిలో బెత్తం లాక్కొని విరిచేసింది. అలా విరిచేసరికి పంతులుగారు స్థాణువైపోయాడు. పిల్లలంతా ఒక్క పెట్టున గోల చేసేశారు. కొత్తబెత్తం ఇప్పట్లో రాదుకదా మరి! పంతులుగారు భద్రంగాణ్ణి పిలవాలి. వాడెళ్ళి చెట్టెక్కాలి. అప్పటిదాకా బెత్తం దెబ్బలు తప్పినట్టే! ఈ పంతులు అనే ఫరిస్తా నుంచి నాకు విముక్తి ప్రసాదించిన ఆవిడవైపు చూసి పరుగుపరుగున వెళ్ళి ఆమె తెల్లచీర మడతల్లో దాక్కుండిపోయాను.
    
    ఆరోజు సాయంత్రం గోరీమా మా ఇంటికి వచ్చి అమ్మానాన్నల్ని తిట్టినతిట్టు తిట్టకుండా చెరిగి పడేసింది. "మోతీజైసా బచ్చా. లేజాకేవో షైతాన్‌కె పాలేమే డాల్నే హాత్‌కైసా ఆయె" (ముత్యం లాంటి పిల్లాడు. తీసుకువెళ్ళి ఆ షైతాన్ పాలు చేయడానికి చేతులెలా వచ్చాయ్?) అని ఖరాఖండిగా అడిగేసరికి "ఇన్ చిలాచింతర్. ఇస్కు ఘర్‌మే రఖ్‌లియేతో ఘర్ గిరాకో మండ్వా డాల్తా. తుమారేకు నైమాలుమ్ గోరీమా" (వీడు పెద్ద కోతి. ఇంట్లో ఉంచితే ఇల్లు పీకి పందిరేస్తాడు) అని అమ్మ నవ్వుతూ అనేసింది.     
 
    అప్పుడు తెలిసింది ఆమె పేరు గోరీమా అని!     
 
    అమ్మ అన్నమాటకు నాకు కాస్త కోపం వచ్చినా గోరీమా అన్న మాటతో అది కాస్తా ఎగిరిపోయి నేను గోరీమా తెల్లకొంగు పట్టుకుని ఆడుకుంటూ ఉండిపోయాను. నన్ను కష్టాల్లోంచి కాపాడే శక్తిలాగా, నా మాటన్నా ఆటన్నా కళ్ళకి అద్దుకునే గొప్ప దోస్తులాగా గోరీమా నాకు కనిపించింది. నా వ్యక్తిత్వాన్ని బలంగా నిర్మించిన ఆమె చేతుల్ని ఇప్పటికీ ఎప్పటికీ నేను గుర్తుంచుకుంటాను.     
 
    వెళ్తూ వెళ్తూ గోరీమా    
 
    "అరే బచ్చే. తు రోజ్‌మేరే పాస్ ఆ...మై ఉర్దూ అరబ్బీ పడాతిం" అనేసి వెళ్ళిపోయింది.
    
    నా దిక్కుమాలిన వీధి బడి నుంచి నాకు విముక్తి ప్రసాదించి, నా ఆకాశంలోకి నన్ను ఎగరేసే స్వేచ్ఛాగీతం ఏదో ఆ పలుకుల్లో వినిపించింది నాకు. అంతే, గోరీమా ప్రవేశంతో నా జీవితం మారిపోయింది. కానీ తెల్లగా మల్లెపూవులా ఎప్పుడూ చెరగని నవ్వులా ఉండే గోరీమా అనే సెలయేరు ఎన్ని బండరాళ్ళ మీంచి ప్రవహిస్తుందో తెలియడానికి నాకింకా అప్పటికి ఊహలేదు.

    ఏదో ఫ్లాట్‌ఫారం వచ్చినట్లుంది. అందరూ దిగుతున్నారు. నేను ఆలోచనల్లోంచి దిగలేక పోయాను. బయటకి చూస్తే... ఇదే నేను దిగాల్సిన మా ఊరు. గబగబా బ్యాగ్ తీసుకుని కిందకి దిగాను.     
 
    "సార్, కా జాతె"     
 
    దిగబోతుంటే ఎవరో ఎదురొచ్చారు.     
 
    తలెత్తి చూస్తే ఓ మనిషి... మా ఊళ్ళో రిక్షాలు కూడానా?     
 
    "రిక్షా? వద్దులే."     
 
    "రిక్షా కాదు. బండి. ఊళ్ళోకి దూరం నడవాల" అన్నాడు.     
 
    ఏదో ఆలోచనలోకి వెళ్ళబోతున్నట్టు "వద్దులే" అంటూ ముందుకు నడుచుకుంటూ వచ్చాను.     
 
    నా పాత ఆనవాళ్ళు ఇక్కడేమైనా దొరుకుతాయేమోనని వెతుక్కుంటున్నాను. స్టేషన్ పెద్దగా ఏమీ మారలేదు. జనం పెద్దగా లేరు. ఎంత పరీక్షగా చూసినా ఒక్క మొహమూ నాకు తెలియడంలేదు. పోనీ నా వేపు ఎవరైనా పరీక్షగా చూస్తున్నారా అంటే అదీ లేదు. ఈ ఊరు నన్ను ఎప్పుడో మరిచిపోయి ఉంటుంది అనుకుంటూ స్టేషన్ బయటికి వెళ్ళేదారి దాకా వచ్చాను. అక్కణ్నించి మళ్ళీ ముందూ వెనకా చూశాను. వెనుక నిశ్శబ్దం. కనీసం రైలు వచ్చివెళ్ళిపోయిన సందడైనా లేదు. ముందు రెండడుగ్లు వేస్తే స్టేషన్ బయటికి దారి.
    
    బయటికి అడుగుపెట్టగానే అడుక్కు తినేవాళ్ళు ఇద్దరో ముగ్గురో! పోనీ వీళ్ళెవరైనా నన్ను గుర్తు పడతారా అని పరీక్షగా చూశాను. నాలుగూ నాలుగు పిచ్చిమొహాల్లా ఉన్నాయి. ఒకావిడ ఒంటినిండా కప్పుకుని శరీరాన్ని కుప్పలా దగ్గరకు లాక్కుని కూర్చుని వుంది. అడుక్కుతినడానికి సిగ్గు కాబోలు. అడుక్కుతినేటప్పుడూ నా జాతికి బురఖా ఉండాలి. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు కుంటివాళ్లు. ఒకడు గుడ్డివాడు. ఏదో పాడుతున్నట్టుగా పాడి చివర్న 'బాబూ ధర్మం' అని వాడి సొంతబాణీ కలిపి కొట్టేస్తున్నాడు. చాలా యాంత్రికంగా నేను ముసుగు కప్పుకున్న స్త్రీముందు ఓ రూపాయి పడేసి ముందుకు అడుగేశాను.     
    
    రెండడుగులు ముందుకు వేశానో లేదో వెనుక ఓ యుద్ధకాండ చూడాల్సి వచ్చింది. మిగిలిన ముగ్గురూ ఆ ముసిల్దాని మీద ఎగబడి కొట్టీ ఆ రూపాయి లాక్కుంటున్నారు. ఒంటి మీదున్న ముసుగుని ఇంకా దగ్గరకు లాక్కొంటూ రూపాయిని కాపాడుకునే ప్రయత్నంలో ముసిలమ్మ ఓడిపోతోంది. నాకు చిరాకేసింది. వెనక్కి వెళ్ళి ఆ ముగ్గుర్నీ కేకలేసి వాళ్ళ మొహాల మీద తలా అర్ధరూపాయి వేసి ముందుకు నడిచాను.     
 
    ముసిలావిడ వేపు పరీక్షగా చూడాలనిపించింది కానీ చూడలేకపోయాను. ఆమె ముసిలావిడే అయినా ఒక స్త్రీ వేపు అంత పరీక్షగా చూడడానికి నా సంస్కారం ఒప్పుకోలేదు.
      
    స్టేషన్నుంచి ఊళ్ళోకి వెళ్ళాలంటే కొంత దూరం నడవాలి. ఈ దూరం నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాన్నగారితో కలిసి ఈ దూరం నడిచేవాణ్ని. ఆయన మాటలు వింటూ, ఆయనేమీ మాట్లాడకపోతే నేనే ప్రశ్నలు వేసి మాట్లాడిస్తూ నడవడం ఎంత బాగుండేదో! ఆయనతో పాటూ ఒక్కోసారి ఉస్మాన్ వచ్చేవాడు.

    స్టేషన్‌కీ, మా ఊరికీ మధ్య ఉండే నిశ్శబ్దాన్ని అతను భరించలేకపోయేవాడు. రోడ్డుకి ఇరుపక్కలా చెట్లు, దుమ్మూధూళితో వీచే గాలీ, అస్సలు జనసంచారం లేకపోవడం, ఎక్కడో కాని ఓ ఇల్లు కనిపించకపోవడం... భరించలేక పాటెత్తుకునేవాడు. ఎంత అందంగా పాడేవాడో చెప్పలేను. పాడుతున్నంతసేపూ నేను అతని గొంతువైపూ, ఊగే పిల్లి గడ్డం వైపూ చూస్తూ ఉండేవాణ్ని. పాటలో భావం ఏమిటా అని ఎప్పుడూ అడిగిందీ లేదు, అతను చెప్పిందీ లేదు.    
 
     "ఎవరు నేర్పారీ పాట?" అని అడిగానోసారి.     
 
    "గోరీమా..."     
 
    అప్పటికి నాకు గోరీమాలో ఉన్న గాయిని సంగతి తెలియదు. తర్వాత ఓ సారి మొహర్రం నెలలో తెలిసింది గోరీమా చాలా బాగా పాడుతుందని! ఆమె పాట సంగతి ఊరంతా తెలుసని! మొహర్రం నెలలో ఓరోజు సాయంత్రం అమ్మ చాలా హడావుడి చేసేస్తోంది ఇంట్లో. వంటపని చాలా వేగంగా ముగించేసింది.     
 
    "మీరూ త్వరగా భోంచేసేయండి" అని నాన్ననీ, నన్నూ తొందరపెట్టి భోజనానికి కూర్చోబెట్టింది.     
 
    "ఏమిటా తొందర?" అని నాన్న అడిగారు.     
 
    "ఇవాళ మాతంలో గోరీమా పాడుతుంది..."

    త్వరగా భోజనాలు ముగించుకుని మేం మాతం దగ్గిరకు వెళ్ళాం. నాకు అప్పటిదాకా పీర్లచావిడిలో హడావుడి ఒక్కటే తెలుసు. అక్కడికి వెళ్ళాక ఆడవాళ్ళు మొహర్రం ఇంకా సందడిగా ఇంకా ఉద్వేగంగా జరుపుకుంటారని తెలిసింది. మధ్యలో నిలబడి గోరీమా ఊగిపోతూ పాడుతూంటే చుట్టూ ఆడవాళ్ళు తిరుగుతూ ఎంత ఉద్వేగంగా ఆడుతున్నారో! వాళ్ళ స్వరాలు అంత పూరాగా విచ్చుకుని పాడడం అదే మొదటి సారి విన్నాను నేను. ఇంక గోరీమ పాట సంగతి చెప్పనే అక్కరలేదు. ఆ చీకట్లో నా కుతూహలం నిండీన కళ్ళని చూస్తే గోరీమా ఎంత సంబరపడిపోయేదో! ఆమె పల్లవి ఎత్తుకుంటున్న ప్రతీసారి నేను గంతులేస్తున్నాను. నా గంతుల్ని చూసి గోరీమా ఆడవాళ్ళ వ్యూహాన్ని చీల్చుకుని పాట పాడుతుఆనే బయటికి వచ్చి నన్ను తనతో పాటు తీసుకువెళ్ళి పక్కన నిలబెట్టుకుంది. ఇక గోరీమా పాడడం, మిగిలిన ఆడవాళ్ళతో కలిసి నేనూ ఆడడం! ఇండ్లలో ఏనాడూ కనీసం గొంతు విప్పని వాళ్లు, స్వేచ్ఛగా కాళ్ళు కదపని వాళ్ళు అక్కడ బాగా అలవాటైనట్లుగా గొంతు విప్పి పాడడం, కాళ్ళూ చేతులూ ఎగరేస్తూ ఆడడం నాకు భలే సంబరాన్నిచ్చింది.     
 
    కాని ఈ సంబరం నాకు ఎంతో కాలం నిలబడలేదు.     
 
    ఆ మరుసటి ఏడాది మళ్ళీ మొహర్రం వచ్చింది. కాని ఈసారి గోరీమా పాట లేదు...     
 
    కచ్చితంగా ఇంకో రెండుమూడు రోజులకు చావిడిలో పీర్లు పెడతారనంగా ఓ సాయంత్రం గోరీమా ఆవేశంగా అమ్మ దగ్గరకు వచ్చింది. అప్పటికే ఆమె జుట్టు బాగా రేగిపోయి ఉంది. మల్లెపూవు లాంటి ఆమె తెల్లచీర మాసిపోయి ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా వెలుగుతుండే ఎర్రగా చింతనిప్పులు కురుస్తున్నాయి. గోరీమా చాలా ఆవేశంగా, కోపంగా మాట్లాడుతోంది.

    ఆమె మాటల్లోంచి నేనేమీ గ్రహించలేకపోయాను. ఆమె చాలా కష్టంలో ఉందన్నదొక్కటే నాకు అర్థమైంది. చాలాసేపు గోరీమా మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళాక అమ్మనడిగాను.     
 
    "నీకు అర్థం కాదులేరా!" అని ఎంతకీ ఏమీ చెప్పలేదు అమ్మ.     
 
    నాన్నగారు భోజనానికి వచ్చినప్పుడు మాత్రం తనే చెప్పడం మొదలుపెట్టింది. కాని నాకేమీ అర్థం కాలేదు. అది గోరీమా ఇంటి గొడవ అని మాత్రం తెలిసింది.     
 
    ఆ రాత్రి నాకు చాలాసేపు నిద్రపట్టలేదు. తెల్లారే లేచి గోరీమా ఇంటికి వెళ్ళాను.     
 
    అక్కడ చాలా సందడిగా ఉంది. చుట్టూ జనం. కేకలు. పళ్ళాల నిండా కొబ్బరికాయలూ, పూలూ పెట్టుకుని తండోపతండాలుగా వస్తున్నారు. ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు. నేను ఆ జనాన్నంతా తోసుకుని గోరీమా ఇంట్లోకి అడుగుపెట్టాను.     
 
    గోరీమా అంటే ఎంత ఇష్టమో ఆ ఇల్లన్నా అంతే ఇష్టం నాకు. ఓ పెద్ద మిద్దె. మిద్దె చివర పెద్ద వేపచెట్టు. చెట్టుపైన ఆకుపచ్చ, ఎర్రజెండాలు. లోపలికి అడుగుపెట్టగానే పూలచెట్ల పలకరింతలూ, చుట్టుముట్టే పరిమళాలు. అన్నిటికీ మించి తెల్లలాల్చీ, పైజామాలో ఎప్పుడూ కడిగిన ముత్యంలా కనిపించే అన్వర్‌భాయ్ ఆరోజు కనిపించలేదు. మూడునాలుగు గదుల ఆ ఇంట్లో చివరిగది భాయిది. నేను ముందూ వెనుకా చూడకుండా లోపలికి వెళ్ళిపోయాను. గదిలో నేల మీద పడుకుని కప్పుకేసి చూస్తూ దీక్షగా ఆలోచిస్తున్నాడు అన్వర్‌భాయి.     
 
    నేను చాలా మెల్లిగా "భాయి..." అని పిలిచాను.     
 
    'రా' అన్నట్టుగా తల ఊపి మళ్ళీ ఆలోచనల్లో కూరుకుపోయాడు.     
 
    ఏమి మాట్లాడాలో తెలియడంలేదు. ఆ వాతావరణం నాకు కొత్తగా ఉంది. అంత నిశ్శబ్దాన్ని ఆ ఇంట్లో నేను చూడలేదు. నిజానికి ఆ సమయానికి అరబ్బీ పాఠం కోసం వచ్చే పిల్లల కేకలతో సందడిగా ఉండాలి. బెత్తం పట్టుకొని గోరీమా పాఠం చెబుతూ ఉండాలి. బయట మిద్దె మీద కూర్చుని అన్వర్ భాయి ఏదైనా చదువుకుంటూ ఉండాలి లేదా పూల మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉండాలి. అవేమీ లేని ఆ ఉదయం నాకు భయమేసింది. బయటేమో ఆ సందడి... ఇంట్లో ఇంత నిశ్శబ్దం! అన్వర్‌భాయ్ ఏమీ మాట్లాడక పోయేసరికి నేను మళ్ళీ వరండాలోకి వచ్చాను. అప్పుడే గోరీమా అక్కడికి వచ్చినట్టుంది. తస్బీ లెక్కిస్తూ కూర్చొని ఉంది. నేను ఎదురుంగా వెళ్ళి కూర్చొనేసరికి    
 
    "కబ్ ఆయెబా?" అనింది.     
 
    నేనేమీ మాట్లాడకుండా "క్యాహువా గోరీమా?" అని అడిగాను. అలా అడిగేసరి ఒక్కసారిగా గోరీమా ఏడిచేసింది. నన్ను ఒళ్ళోకి లాకుంది.     
 
    "మేరా ఘర్ షైతాన్‌కా పాలె హువా బా" అంటూ ఏడుస్తోంది.     
 
    "బాహర్ క్యావో..."(బయట ఏమిటి?) అని అడిగాను. 

    "షైతానా, కాఫిరా జమే. కోన్కీ అమ్మ ఆయికతే..."     
 
    అంటూ ఏడుస్తుంది తప్ప నాకేమీ అర్థం కావడంలేదు. చెప్పినా నాకు అర్థమయ్యే పరిస్థితి కాదు అది. బయట హడావుడి కొద్దికొద్దిగా తగ్గుతున్నట్టుగా ఉంది. జనం కేకలు తగ్గిపోయాయి. కాసేపు ఉండి గోరీమా మళ్ళీ నమాజ్‌లోకి వెళ్ళిపోయింది. నేను బయటికి వచ్చాను.    
 
    బయట గోరీమా ఇంటిగోడకి ఆనుకును ఓ పెద్ద బండరాయి. దానికి ఎర్రెర్రని బొట్లూ, కుంకుమలు పూశారు. పూలు తొడిగారు. తోరణాలు కట్టారు. అలాంటి దృశ్యం నేను ఓసారు చెరువు దగ్గర చూశాను. ఇప్పుడు ఇక్కడ... పరీక్షగా చూస్తే ఆ రాతిమీద ఓ స్త్రీ ఆకారం ఉంది. అది చాలా వికృతంగా అనిపించింది నాకు. ఎక్కువసేపు చూడలేక అయిష్టాన్ని వ్యక్తం చేయడానికి ఓ చిన్న రాయిని విసిరి కోపోం గా వచ్చేశాను. అప్పట్నించీ ఆ రాతిరూపం నన్ను వెంటాడుతూనే ఉంది. అమ్మని అడగాలి. అమ్మకీ తెలీయకపోతే నాన్నని అడగాలి.
* * *
 
    నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మానాన్న ముందు వన్రండాలో కూర్చుని వున్నారు. నాన్నగారు పేపర్లు దిద్దుకుంటున్నారు. అమ్మ బియ్యంలో రాళ్ళు ఏరుతోంది."గోరీమా పరేషాన్‌లో పడిపోయింది పాపం" అంటోంది అమ్మ.
 
    "ఏం చేస్తుంది ఆడది? మనవాళ్ళా, ఒకళ్ళకొకళ్ళు తోడు రారు" అంటున్నారు నాన్న.
 
    "నిజంగా అక్కడ ఆ దేవత వెలిసిందా?"
 
    "దేవతలు వెలవడం ఏమిటి? ఇల్లు బాగుంది కదా! ఎవడో కన్నేశాడు. ఓ రాయి విసిరి వెళ్ళిపోయాడు. అంతే. మనకు రాళ్ళంటే పిచ్చికదా, దానికి కాస్త కుంకుమా, బొట్టూ ఉన్నాయంటే ఇంక పూనకాలొచ్చేస్తాయి."
 
    నేను వాళ్ళ మాటలు వింటూ ఓ పక్కన కూర్చోబోయాను.
 
    నాన్నగారు "బాబూ ఎక్కడికి వెళ్ళావురా?" అంటూ దగ్గరకు పిలిచారు. నేను దగ్గరకు వెళ్ళి ఆయన పక్కనే కూర్చొన్నాను.
    
    అమ్మ మళ్ళీ అడిగింది.
    
    "ప్రెసిడెంటు మీరు చెప్పినట్టు వింటాడు కదా, ఓ మాట చెప్పొచ్చుగా"
 
    "వాళ్ళకు కావలసిన మాటలు వింటారు. ఈ విషయం అడిగితే ఎందుకులేవయ్యా, ఇందులో కులం గొడవుంది. నీకు తెలుసుగా ఆ కులపోళ్ళు ఊళ్ళో ఎక్కువున్నారు అనేశాడు"
 
    అమ్మ ఇంకేమీ మాట్లాడలేదు.
 
    "నిజమే మనోళ్ళు తక్కువ ఉండడమే మనకు అన్యాయం. ఆ తక్కువలో కూడా మళ్ళీ ఒకొళ్ళకొకళ్ళకి తేడాలు... మనం బాగుపడంలెండి" అంటూ చాట తీసుకుని నిలబడింది.
 
    "నా బాధల్లా గోరీమా గురించి. దిగులుతో మంచం పట్టింది. ఆ పెద్దకొడుకు పట్నం వెళ్ళి కూర్చున్నాడు. తల్లి గురించి పట్టించుకోడు. ఇంక మగదిక్కు ఏది? బతుకంతా పెద్దకొడుకు మీద ఆశలు పెట్టుకుని ఈడ్చుకుంది. భర్త పోయాక రెండో పెళ్ళి చేసుకోమని అందరూ అన్నారు. ఎంతసేపూ  పిల్లలు పిల్లలు అంటూ ఇవాళ ఒంటరిదైపోయింది. ఆ అన్వర్‌కి ఇంకా చిన్న వయసు"
 
    అని స్వగతంగా అనుకుంటున్నట్టుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది.
 
    నాన్నగారు మౌనంగా పేపర్లు దిద్దుకుంటూ ఉండిపోయారు. నాకేమో అయోమయంగా ఉంది. గోరీమాని కాపాడుకోవాలి... ఎలా? ఎలా?
 
* * *   
 
    గోరీమాని నేను కాపాడుకోలేకపోయాను.
 
    కాని ఆ తర్వాత ఊరు తీరే మారిపోయింది. అమ్మానాన్న కూడా ఊరి విషయాలు పెద్దగా చర్చించుకోవడం లేదిప్పుడు. నాన్నగారి దినచర్య మామూలుగా సాగిపోతూనే ఉంది. అమ్మ ఎప్పుడైనా మధ్యాహ్నం గోరీమా దగ్గరకు వెళ్ళివచ్చేది. కాని ఇంట్లో ఏమీ చెప్పేది కాదు. నాకు ఏమీ అర్థం కావడంలేదు. గోరీమా చిక్కి శల్యమైపోవడం కళ్ళారా చూస్తున్నాను. అన్వర్ గది నాలుగ్గోడల మధ్య ఖైదీలా ఉండడమూ చూస్తున్నాను. అన్నట్టు ఇప్పుడు గోరీమా పెద్ద గదుల ఇల్లు వదిలేసి చిన్న పాక లాంటి ఇంట్లోకి మారింది. ఆ మార్పు కూడా అప్పటి నాకు తెలియదు. బయట దేవత ప్రతిష్ట రోజురోజుకీ పెరుగుతోంది. ఇదివరకు ఏ శనివారంనాడో జనాలు వచ్చేవారు. ఇప్పుడు రోజూ వస్తున్నారు. అక్కడ ఎంత హింస జరుగుతుందో చెప్పలేను. మేం ఆడుకునే జెండాచెట్టు కింద సాయంత్రమయ్యేసరికి కోళ్ళబొచ్చు గుట్టలుగా పడి ఉంటుంది. క్రమంగా ఆ ప్రదేశమ్మీద నా ఆకర్షణ తరిగిపోయింది. గోరీమా కళ్ళల్లో ఇదివరకటి ప్రేమకు బదులు ద్వేషం పుట్టుకురావడం నా లేత కళ్ళకు తెలుస్తోంది. కాని ఇప్పుడెవరూ ఏమీ చేయలేని స్థితి... సాహెబ్ మామయ్య వస్తాడని, అంతా కుదురుకుంటుందనీ గోరీమా మొదట్లో చెప్పేది. కాని సాహెబ్ మామయ్యని నేను మళ్ళీ చూడలేదు, పట్నంలో తప్ప!
 
    నాన్నగారు నాకు చొక్కా కొనిపెట్టాక చెప్పులు కావాలని గొడవ చేశాను.
 
    "ఇంట్లో ఓ జత ఉన్నాయి కదరా..."
    
    "కాదు. ఇంకోటి కావాలి"
 
    కాసేపు మారాం చేస్తే నాన్నగారు చెప్పుల షాపులోకి తీసుకువెళ్ళారు. అక్కడ ఓ వ్యక్తి నాన్నగారికి చిరునవ్వుతో సలాం కొట్టాడు.
 
    "క్యా సాహెబ్, ఖైరీయత్?" అని అడిగారు నాన్న. 'ఓహో, సాహెబ్ మామయ్య ఇతనేనా?' అనుకుని పరీక్షగా చూశాను. పొడుగ్గా, అందంగా ఉన్నాడు సాహెబ్. గోరీమా కొడుకే ఇతను అంటే ఎవరైనా వెంటనే అవునవును కదా అనేట్టున్నాడు.
 
    "క్యా ఖైరియత్ సాబ్..." అంటూనే ఒక బాధతో కూడిన నవ్వుతో మాట్లాడుతున్నాడు. అతనేదో మాట్లాడుతున్నాడు. గోరీమా ప్రసక్తి వస్తుందేమోనని నేను ఆసక్తిగా వింటున్నాను. కాని అతను ఒక్కమాట కూడా పొరపాట్న గోరీమా గురించి ఎత్తలేదు.
 
    చివరికి నాన్నగారే అడిగారు.
 
    "ఏక్‌బార్ ఆవో... అమ్మ ఒంటరిదైపోయింది. గొడవలుగా ఉంది"
 
    "అమ్మీ పిచ్చిది. ఇక్కడికి రమ్మంటే రాదు. వాళ్ళా, అమ్మని వెళ్ళగొట్టేంతవరకూ ఊరుకోరు. ఆ కులపోళ్ళు చాలా గట్టివారు. మొండి ముండాకొడుకులు. మనం నిలబడగలమా? అమ్మేమో ఏవో బీరాలు పలుకుతోంది. ఎట్లయినా ఇల్లు దక్కించుకోవాలంటుంది. మనకు ముందూ వెనుకా ఎవరూ లేరు. ఆ స్థలానికా కాగితాలు లేవు. మనం ఏమీ మాట్లాడలేం."
 
    "నువ్వు వచ్చి ఇంకోసారి కోషిష్ చెయ్యి"
 
    "నాకు నమ్మకం లేదు సాబ్. వాళ్ళు ఎంత క్రూరులో మీకు తెలుసు. ఎలాగైనా ఆ ఇల్లు ఆక్రమించి అక్కడో పెద్ద గుడి కట్టేద్దామనుకుంటున్నారు. వేరే ఊళ్ళ జనాలు కూడా ఇప్పుడు తోడయ్యారు. మొన్నటికి మొన్న కూడా వచ్చి బెదిరించి వెళ్ళారు. ఇల్లు ఖాళీ చేయకపోతే వేసేస్తామని. నా పిల్లలు పెరుగుతున్నారు. నేను ప్రాణాన్ని పణంగా పెట్టలేను..." నిస్సహాయం ప్రకటిస్తున్నాడు సాహెబ్.
 
    నాన్నగారు కూడా ఇంకేమీ అనలేకపోతున్నారు.
 
    "ఇస్కా సైజ్ ఏక్ జోడా నికాలో"(వీడి సైజుకి ఓ చెప్పుల జత తీయండి) అన్నారు. సాహెబ్ నా కాళ్ళు దగ్గరకు తీసుకుని సైజు చూశాడు.
 
    "యా క్యా దేతె"
 
    "ప్రస్తుతానికి గడుస్తుంది. పిల్లలు పెరిగితే గడవడం కష్టం" అన్నాడు.
 
    "ఎంత పెద్ద కుటుంబం ఎలా అయిపోయింది? ఆ రోజుల్లో గోరే భాయ్ అంటే ఊళ్ళో ఎంత ఇజ్జత్!"
 
    "అదంతా ఆయనతోనే పోయింది. ఇప్పుడు కులం తప్ప మనుషులు కనిపించడం లేదు" సాహెబ్ కళ్ళలో తడి మెరిసింది.
 
    "ఇంటికి రండి. ఈ పూట ఉండి వెల్దురుగాని" అన్నాడు ప్రేమగా సాహెబ్. అలా అన్నప్పుడు అతను అచ్చంగా గోరీమా లానే ఉన్నాడు.
 
    "ఏ బార్ జరూర్ ఆతె..."
 
    "బాభీకు లేకె ఆవొ"(వదినమ్మని తీసుకురండి) అంటూ షాపు బయటిదాకా వచ్చి మమ్మల్ని సాగనంపాడు సాహెబ్.
 
    తిరుగు ప్రయాణంలో నేను నాన్నగార్ని ఎంత విసిగించానో చెప్పలేను గోరేభాయ్ ఎవరు? సాహెబ్ మామయ్య తల్లికి దూరంగా ఈ టౌన్లో ఎందుకున్నాడు? అంటూ. 
 
    "గోరేభాయ్ మలేరియాతో చనిపోయాడు. ఆ రోజుల్లో మలేరియా అంతే! ఊళ్ళో కుటుంబం గడవక, భార్యా పిల్లలతో పట్నం వచ్చేశాడు సాహెబ్. గోరీమా సొంత వూరూ, సొంత ఇల్లూ అంటూ అన్వర్‌తో సహా అక్కడే ఉండిపోయింది" అన్నారు ఒక్కమాటలో.
 
    అయినా నేను వినలేదు. 
 
    "ఇప్పుడు గోరీమాని ఎవరు చూస్తారు?"
 
    "అన్వర్ పెద్దయ్యేదాకా అంతే!" అని ఆయన తన ఆలోచనల్లో తను మునిగిపోయారు. 
 
    ఇది జరిగిన కొన్నాళ్ళకు మా ఇంటికి మోతీ పిన్ని వచ్చింది. మోతీ గోరీమాకు మంచి స్నేహితురాలు. 
 
    "నువ్వేం చెప్పు ఆపా! గోరీమా పెద్ద యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో గెలిస్తే ఇల్లు దక్కుతుంది. ఇల్లు కంటే ముందు పరువు ప్రతిష్టా నిలుస్తుంది."
 
    "ఏం లాభం. మనిషి శవమైపోతోంది. ఆ కులపోళ్ళతో గొడవెందుకు, పోతేపోనీ పాడు ఇల్లు అనిపిస్తోంది నాకయితే" అంది అమ్మ.
 
    "ఎలా వదిలిపెడుతుంది చెప్పు. గోరెభాయి గోరీమా ఎలా ఉండేవాళ్ళో నీకు తెలుసుగా. ఆ రోజుల్లో ఊళ్ళో అందరికీ తలలో నాలుకలాగా... ఆయన జ్ఞాపకం ఈ ఇల్లొక్కటే. అదొక్కటీ తనకు ఒదిలిపెట్టమంటోంది. ఉన్న పొలం సాహెబ్ అమ్ముకుని పట్నం వెళ్ళి కూర్చున్నాడు" అంటోంది మోతి.
 
    "నిజమే, కాని ఇల్లుతోపాటు గోరీమా కూడా మనకు దక్కేట్టు లేదు" అంది నిరాశగా అమ్మ.
 
    "అల్లా క్యా లిఖేతో వో హోతా, ఆపా. కోన్ క్యా కర్తే" (అల్లా ఏది రాసిపెట్టాడో అదే జరుగుతుంది. ఎవరేం చెయ్యగలరు?) అని వెళ్ళి పోయింది మోతి.

* * *
 
    ఆ తర్వాత కాలమెలా గడిచిపోయిందో గడిచిపోయింది. గోరీమా మాత్రం ఊరుకోలేదు. తన పద్ధతిలో తను పోరాడుతూనే ఉంది. మెల్లమెల్లగా ఆమె ఇల్లు గుడికింద మారిపోతోంది. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేకుండా పోయింది. అందరి నిశ్శబ్దాన్నీ ప్రశ్నిస్తూ గోరీమా తిరగబడుతూనే ఉంది. అలా చెప్పీ చెప్పీ, పోట్లాడీ పోట్లాడీ గోరీమా ఏమైపోతోందా అని కొన్నిరోజులు దిగులు పెట్టుకున్నాను. అమ్మకి చెప్పాను. నాన్నకి చెప్పాను. కానీ ఎవరూ గోరీమా గురించి పట్టించుకోలేదు. అన్వర్ బయటికి రావడమే మానేశాడు. క్రమంగా మామధ్య దూరం పెరిగింది.
 
    ఈలోగా చాలా మార్పులు జరిగిపోయాయి. మా కుటుంబం టౌనుకి మారింది. ఊళ్ళో కాసింత చెక్కా బాబాయ్‌కి అప్పజెప్పారు. బాబాయ్ టౌనుకి వచ్చ్చినప్పుడల్లా ఊరు సంగతులు చెప్పేవాడు. గోరీమా గురించి బాబాయ్ చెప్పగా వినడమే...!
 
 * * *
 
    జ్ఞాపకాల్లోనే ఊళ్ళోకి వచ్చేశాను. ఊళ్ళోకి ప్రవేశించగానే రోడ్డుకి కుడిపక్కన పోలీస్ స్టేషన్.  ఎప్పటిలానే ఉంది. కాని అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు. నా చిన్నప్పుడు అక్కడ ఎప్పుడూ ఒకరిద్దరు తప్ప కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడు జనం రద్దీ చూస్తుంటే ఊళ్ళో హింస బాగానే పెరిగిందనిపిస్తుంది. కొద్దిగా డౌన్‌లోకి వస్తే ఎడంవైపున గిర్నీ ఉంది. అది ధనధనా చప్పుళ్ళు చేస్తూనే ఉంది. పెద్ద మార్పేమీ లేదు. ఒక్కో అడుగే అలా గతంలోకీ, వర్తమానంలోకీ వేస్తూ ఊళ్ళోకి వచ్చాను. అటూఇటూ జనం తిరుగుతూనే ఉన్నారు. ఎవరూ నావైపు చూసి నన్ను గుర్తుపట్టడంలేదు.  చిన్నప్పుడు నేను ఈ ఊళ్ళో ఎటువెళ్ళినా 'హిందీ సార్ కొడుకురా' అని నాకు తెలియనివాళ్ళు కూడా గుర్తుపట్టేవాళ్ళు. లేదా ఊళ్ళోకి ఓ కొత్త మనిషి వస్తే ఎగాదిగా చుసేవాళ్ళు. ఇప్పుడు అలాంటిదేదీ లేదు. ఆ ఊళ్ళో నేనొక అనామకుణ్ణి అనిపించింది. కొత్తకొత్త ముఖాల్లో పాత పోలికలేమైనా కనిపిస్తాయా అని వెతుక్కుంటూ చావిడిదాకా వచ్చాను. చావిడికి నాలుగైదు అడుగుల దూరంలో బాబాయ్ ఇల్లు. ఎత్తయిన అరుగులు, పాతకాలపు నిర్మాణంలా ఉండే చావిడీ. చావిడి తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. ఒక్క మొహర్రం నెలలో తప్ప మామూలప్పుడు దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఆ నెలలో మాత్రం కాసింత సున్నాలు కొట్టి, అక్కడక్కడా ఎర్రరంగుతో నక్షత్రాలు గీస్తారు. మొహర్రం నెలలో ఈ చావిడీ ఎంత హడావుడిగా ఉంటుందో! పెద్ద ఆలం పట్టుకుని సాహెబ్ మామయ్య ఊగిపోతుండడం, అలావా తొక్కడం, పూనకం వచ్చినట్టు ఏదేదో మాట్లాడడం... ఒక భయంతో కూడిన ఆనందం నాకు! చావిడీకి ఎదురుగా పెద్ద్ ఖాళీస్థలం. ఆ ఖాళీస్థలంలో శ్రీరామనవమి పందిరి వేసేవాళ్ళు. కోలాటాల సందడి.
 
"గణగణ మూర్తివి గణనాథా
నువ్వు శివుడీ కుమారుడివి గణనాథా"
 
    అని కోలాటం ఆడుతుంటే మా పసికాళ్ళూ చేతులూ ఆగేవి కావు. పీరు ఊగినట్టు ఊగి పోయేవాళ్ళం. సాయంత్రం కాగానే ఎవరో ఒకరు పెద్ద పాత్రలో పులిహోర తెచ్చేవాళ్ళు. పీర్లచావిడి అరుగు ఎక్కి అందరికీ పంచేవాళ్ళు. ఆ దృశ్యాలన్నీ నా జ్ఞాపకాల్లోంచి కళ్ళ ముందు సజీవంగా తిరుగుతున్నట్టే అనిపించింది. పీర్లచావిడిలో మాతం పాడుతున్నప్పుడు సాహెబ్ మామయ్యా, అన్వర్ అన్నయ్యా నిజంగా ఏడిచేవాళ్ళు. వాళ్ళతో కలిసి పాడే అందరూ పెద్దగా ఏడిచేవాళ్లు. ఆ ఏడిచేవాళ్ళలో ఎవరికీ కులమతాల పట్టింపులుండేవి కావు.
 
    "ఓ...మేరే హుసేన్..." అనగానే ఆలమ్‌పైన కప్పిన ఎర్రగుడ్డల్ని కళ్ళకి అదుముకుని నిల్చున్నవాళ్ళు నిల్చున్నట్టే ఒక్కసారిగా తట్టుకోలేక కింద పడిపోతారా అన్న ఉద్వేగంతో పాడేవాళ్ళు. ఆ సన్నివేశంలో ఎంత బండరాయికైనా భళ్ళున ఏడుపు పొంగుకొచ్చేది.
 
    నేను జ్ఞాపకాల్లో ఉండగానే

 

    "బాబూ..." అన్న కేక వినిపించింది.

    చూస్తే... ఉస్మాన్.

     ఉస్మాన్ని చూడగానే నాకు ఏడుపొచ్చేసింది. గట్టిగా కావలించేసుకున్నాను. 'ఉస్మాన్ మామా' అన్న మాట నాకు తెలియకుండానే గొంతులోంచి వచ్చేసింది.

    ఆయనా అంతే ప్రేమగా నన్ను కావలించుకున్నాడు.

     "ఎన్ని రోజుల్ తర్వాత వచ్చావు..." అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు.

     ఈ ఉస్మాన్‌కు ఓ ఇల్లూవాకిలీ లేదు. ఈ చావిడి పట్టుకుని లేదంటే ఆ ఫ్లాట్‌ఫారం పట్టుకుని బతికేసేవాడు. "యే ఉస్మాన్ ఏక్ దీవానా. నా ఘర్‌కా నా ఘాట్‌కా" అని గోరీమా ఎంత కోప్పడేదో! ఎప్పుడూ ఓ బీడీతుంట వేళ్ళమధ్య సరిచేసుకుంటూ తిరిగేవాడు. "అరే బచ్చో..." అంటూ పిల్లకాయల్ని వెంటేసుకుని... వాళ్ళని ఆడించేవాడు. నిజానికి పిల్లకాయలే వాడితో ఆడుకునేవాళ్ళు.

    "బాబూ... మేరే ఘర్ జాయేంగే"

    "నీకో ఇల్లా?"

    "ఏం? నాకు ఇల్లుండకూడదా?"

    నిజమే. నా ప్రశ్న నాకే అర్థరహితంగా అనిపించింది.

    "కాదు ముందు బాబాయ్‌నీ, పిన్నినీ పలకరించి వస్తా"

    "బడా నిక్‌లాలే... చాలాకాలం తర్వాత బేటా వస్తున్నాడు కదా, స్టేషన్‌కి వెళ్దాం అన్న ధ్యాస అయినా లేదు బేవకూఫ్‌కి!"

    ఉస్మాన్ అల్లాగే నిర్మొహమాటంగా మాట్లాడతాడు.

    "లేదు బాబాయ్‌కి తెలియదు నేను వస్తానని"

    "సరే, ముందు ఈ గరీబ్ గుడిసె చూసి అప్పుడు వెళ్దువుగాని..."

    అయినా నేను ఒప్పుకోలేదు. ముందు బాబాయ్‌కి సలాం చెయ్యాలి. పిన్నితో మాట్లాడాలి. ముకరం ఎలా ఉందో చూడాలి. దానికి ఆరోగ్యం బాగాలేదని విన్నాను. జాఫర్ ఎలా ఉన్నాడో? నా ఆలోచనలన్నీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి.

    ఉస్మాన్‌కి నా పరిస్థితి అర్థమైనట్లుంది.

    "సరే, అసర్ తర్వాత వస్తాలే" అన్నాడు.

    బాబాయ్ ఇంటిదాకా దిగబెట్టాడు. "నువ్వెళ్ళు..." అనేసి వెళ్ళిపోయాడు. ఎందువల్లనో అతను లోపలికి రాలేదు. చిన్నప్పుడయితే ఉస్మాన్ అసర్ నమాజ్ తర్వాత ఎప్పుడూ బాబాయ్ ఇంటి చూరే పట్టుకుని ఉండేవాడు. ఏదో తేడాగా అనిపించింది.

    నేను వెళ్ళేసరికి బాబాయ్ ఇంట్లో లేడు. బయట చిన్న వరండా... దూరంగా పశువుల కొట్టం... నా అలికిడి విని లోపల్నుంచి ఎవరో వచ్చారు. ముకరమ్...! ముకరమ్‌ని చూడగానే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ముకరమ్ శవంలా ఉంది. ఎప్పుడూ నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ కెరటంలా ఎగిసిపడే ఆ ఉత్సాహమూ, ఆనందమూ... అసలు అలాంటివి ఆ అమ్మాయికి జీవితంలో ఎప్పుడన్నా తెలుసా? అన్నట్టుంది.

    "అమ్మీ బాబు భాయి..." అంటూ పరుగుపరుగున లోపలికి వెళ్ళింది. లోపల్నుంచి పిన్ని వచ్చింది.

    "ఎన్ని రోజుల తర్వాత వచ్చావు బాబూ, ఇక్కడ ఊళ్ళో మేం బతికి ఉన్నామో? ఎన్ని బాధలు పడుతున్నామో మీ అమ్మకీ గుర్తుండదు, మీకూ గుర్తుండదు" పిన్ని కొంచెం వెటకారంగానే అన్నట్టుంది. దగ్గిరకు వెళ్తున్న వాడినల్లా నేను ఆ మాటలకు ఎక్కడి వాణ్ని అక్కడే ఉండిపోయాను. ఈమె ఏమీ మారలేదు అనిపించింది. ఈలోపున ముకరమ్ లోపలికి వెళ్ళి నాకు ఓ గ్లాసు మంచినీళ్ళు తెచ్చింది. తాగబోతుండగానే పిన్ని -

    "మా కష్టాలు మీరెప్పుడైనా తలుచుకుంటారా బాబు" అని మొదలెట్టింది. తాగబోతున్న గ్లాస్ పక్కనపెట్టి ముకరమ్ వైపు చూశాను నేను. ఆమె అంతేలే... అన్నట్టుగా నావైపు కాస్త ప్రేమగా చూసింది ముకరమ్.

    "వచ్చీ రాంగానే ఎందుకు? బాబుభాయ్...స్నానానింకి నీళ్ళు పెడతాను. మంచి ఎండలో వచ్చావు. అలిసిపోయుంటావు" అంది ముకరమ్. ఆ మాటలు చాలా ఊర్తటనిచ్చాయి. ఆ తర్వాత పిన్ని ఏదో గొణుక్కుంటూనే ఉంది.

    "జాఫర్ ఏడీ?" అని ముకరమ్‌ని అడిగాను. 

    "కామ్‌నై...ధామ్‌నై కా జాతా" అంటూ మళ్ళీ కల్పించుకుంది పిన్ని. ఆమె మాట తీరులొనే తేడాని నేను అర్థం చేసుకోగలను. మా సంబంధాలు ఇదివరకటంత స్వచ్చంగా లేవని నాకు తెలుసు. అమ్మ ఎప్పుడూ పిన్నిని తిడుతూనే ఉంటుంది. "షాదీమే జ్వానే మే భీ నైసకా కరీ దుష్మన్"(పెళ్ళీ పేరంటాల్లో కూడా మమ్మల్ని రాకుండా చేసింది... పగబట్టిన ముండ) అని తిట్టేది అమ్మ. పిన్ని గుర్తొస్తే అమ్మకి ఎక్కడలేని ఆవేశం. నాన్న కోప్పడ్డంతో "ఆ... భాయికే ఊపర్ మఖ్కీ భీనై ఘిర్నా"(తమ్ముడి మీద ఈగ కూడా వాలకూడదు) అనేసి తన పనిలో తను వెళ్ళిపోయేది. నాన్నకి మొదట్నుంచీ బాబాయ్ అంటే సానుభూతి. "వాడా చదువుకోలేదు. మనకు చిన్నదో చితకదో గవర్నమెంటు ఉద్యోగం ఉంది" అనేవారు. ఊళ్ళో ఉన్న భూమి గురించి ఆయన ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. బాబాయ్ ఎప్పుడైనా వచ్చేవాడు. వచ్చేటప్పుడు ఏవో గింజలూ, కూరగాయలూ తెచ్చేవాడు. ఒకటి రెండురోజులు ఉండి వెళ్ళిపోయేవాడు. క్రమంగా ఆ రాకపోకలు కూడా తగ్గిపోయాయి. ఈలోగా నాన్నగారి ఆరోగ్యం దెబ్బతింది. ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయి. ఎంత డబ్బూ ఆస్పత్రికే ధారపోయాల్సి వచ్చేది. ఊరెళ్ళి ఆ భూమి వ్యవహారమన్నా తేల్చుకురమ్మని అమ్మ పోరేది. కాని నాన్నగారు ఎన్నడూ పట్టించుకున్నది లేదు. అలా ఆయన అనారోగ్యంతో తీసుకుంటూ తీసుకుంటూ కన్నుమూశారు. కుటుంబం అప్పులపాలయింది.

    "పెద్దకొడుకువి. కనీసం నువ్వయినా ఆ భూమి గురించి పట్టించుకో" అని అమ్మ ఎన్నిసార్లు తిట్టిపోసిందో తెలియదు. కాని ఊరెళ్ళినా నేను బాబాయ్‌ని ఆ భూమి గురించి అడగ్గలనా? ఏమో... నాకు నమ్మకం లేదు. ఆయన ముందు మాట్లాడే ధైర్యం లేదు. నిజానికి ఆయన కుటుంబ పరిస్థితీ నాకు బాగానే తెలుసు. అయినా అమ్మ మాట తీసిపారేయలేక వచ్చాను. ఇక్కడ పిన్ని సూటిపోటి మాటలు నేనూహించినవే. కాని... ముకరమ్‌కీ, జాఫర్‌కీ నేనంటే చిన్నప్పణ్ణించీ ప్రేమ. బాబాయ్‌కి నేనంటే పెద్ద ప్రేమా లేదు, అంత కోపమూ లేదు. "ఆయన దృష్టిలో నేనెప్పుడూ 'బచ్చా'ని. "భాయ్, పానీ నికాలిం"(అన్నా నీళ్ళు తోడాను) అన్న ముకరం మాటలతో నేను ఆలోచనల్లోంచి బయటపడ్డాను. 

    నేను స్నానం చేసి వచ్చేలోగా బాబాయ్ వచ్చాడు.

    "కబ్ ఆయారే?" అని పలకరించాడు ఆయన మొహంలో ఎలాంటి భావమూ లేకుండా. ఆయన ఎప్పుడూ అంతే!

    "ఇప్పుడే..."

    అంతే, ఆయనతో సంభాషణ. ఆ తర్వాత నేను బట్టలు మార్చుకుని వచ్చా. ముకరమ్ అన్నం వడ్డించింది.

    "ఏక్ వక్త్ ఖానేకో కిత్తే తక్‌లీఫా పడ్తే హైకీ అల్లా జానే"(ఒక్కపూట అన్నం మెతుకుల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నామో దేవుడికెరుక) అంటూ పిన్ని మళ్ళీ మొదలుపెట్టింది. అన్నం వడ్డిస్తున్న ముకరమ్ తల్లి వైపు కాస్త కోపంగా మిటుకూ మిటుకూ చూసింది. అదీ తల్లికి తెలియకుండా. 

    మంచి ఆకలి మీదున్నా నేను సరిగ్గా భోంచేయకుండానే ముగించాను. మంచి ఎండలో వచ్చానేమో, మంచం మీద వాలేసరికి నిద్ర కమ్ముకొచ్చింది. అప్పటికీ జాఫర్ రాలేదు. అసర్ దాకా ఓ కునుకు తీశాను. నేను మంచం మీద పడుకుని ఉండగానే బయట వరండాలో పిన్ని మాటలు వినిపిస్తున్నాయి.

    "బాబు ఊరికే ఎనుకొస్తాడు? పొలం సంగతి కనుక్కుందామని వచ్చి ఉంటాడు. నీళ్ళు నమలకుండా చెప్పండి. వాళ్ళ నాన్న వైద్యం ఖర్చుల కింద తీసుకున్న డబ్బుకీ పొలానికీ చెల్లయిపోయిందని. అప్పుడే చెప్పాను మీకు, అన్నిటికీ కాయితాలూ పత్రాలూ ఉండాలని..." అంటోంది. ఆ మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. నాన్న డబ్బు తీసుకున్నారా? ఈ పొలం మీది డబ్బు ఆయన మాకు తెలియకుండా వాడుకున్నారా? మరి టౌన్‌లో చేసిన అప్పులు...? అదలా ఉంచితే పిన్ని ఇంత కర్కశంగా మాట్లాడడం ఏమిటి? నేను మంచంలో కాస్త ఇబ్బందిగా కదులుతున్నాను. ఈలోగా ముకరమ్ వచ్చింది.

    "బాబుభాయ్, నువ్వేమీ అనుకోకు. నువ్వు రావడం మాకు ఎంత ఆనందం కలిగించిందో..." అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంది. అంతకంటే ఇంకేమీ అనలేక అవతలికి వెళ్ళిపోయింది. ఎందుకో నా ఆలోచనల్లోకి మళ్ళీ గోరీమా వచ్చింది. 

    "దేఖో, ఓ ఘర్‌కే వాస్తే గోరీమా కిత్తె జంగ్ కరీకి..." (చూసి నేర్చుకోండి. ఆ ఇంటికోసం గోరీమా ఎంత యుద్ధం చేసిందో?) అంటుంది అమ్మ ఎప్పుడూ. కానీ ఆయుద్ధంలో గోరీమా ఏమైందో మాకు తెలీదు. ఇప్పుడైనా తెలుసుకోవాలి. కాని నా యుద్ధం మాటేమిటి? గోరీమా ఒక కులపోళ్ళతో పోరాడింది, కనీసం నేను 'ఇంట' గెలవగలనా? పోనీ, బాబాయ్‌ని నిలదీసి అడగ్గలనా? ఏమో... నాకు నమ్మకం లేదు!

 
* * *
 
    కచ్చితంగా అసర్ వేళకి ఉస్మాన్ వచ్చాడు.
 
    "నమాజ్‌కు ఆవో..." అంటూ బలవంతం చేశాడు. కాస్త రిలీఫ్‌గా ఉంటుందని నేనూ వజూ చేసి అతని వెంట వెళ్ళాను. దారి పొడువునా నేను ఉస్మాన్‌తో ఒక్క మాట కూడ్ మాట్లాడలేక పోయాను. లోలోపల గుడిసుళ్ళు పడుతున్నాను. ఈ ఊరితో నాకు ఉన్న అనుబంధం నాన్నగారి ఆ భూమి...! అది కాస్తా తెగిపోతుందా? ఇంక ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడూ మాట్లాడే అవకాశం రాదు, కనీసం ఈ ఊరు వచ్చే వీలు కూడా ఉండదేమో! పిన్ని ఎంత వీలైతే అంత అడ్డుపడుతుంది. బాబాయ్‌ని పడనివ్వదు. ముకరమ్ విషాద వదనం... తాడూ బొంగరం లేని జాఫర్! నా అసమర్థతని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్న అమ్మ... నేను ఎంతో కొంత తెచ్చి ఈ అప్పుల విషవలయంలోంచి బయట పడేస్తానని ఎదురుచూస్తున్న తమ్ముళ్ళు... జోడే కా రకం కోసం ఇంకా వేధిస్తున్న బావ...! యాహ్, అల్లాహ్!

    "పర్వర్ దిగారే ఆలమ్' అందుకున్నాడు ఉస్మాన్. నా విషాదయోగం తెలిసిందా ఉస్మాన్‌కి?
 
* * *
 
    అవన్నీ నెమరేసుకుంటుండగానే మస్జీద్ మెట్లు ఎక్కి లోపలికి అడుగుపెట్టాను. ఆ వాతావరణంలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. హజ్రత్ సాబ్ నావేపు చూశారు, నేను సలాం చేసి ఒంగి ఆయన కడుపులో తలదాచుకున్నాను. ఆయన ప్రేమగా నన్ను దగ్గిరకు తీసుకున్నారు. ముసలి కళ్ళు చికిలిస్తూ "కోన్ బేటా?" అని అడిగారు.
    "హమారే మున్వర్ ఆపాకే బేటా, భూల్‌గయే" అన్నాడు ఉస్మాన్. ఊళ్ళో మా వాళ్ళందరికీ నేను మున్వర్ ఆపాకే బేటాగానే తెలుసు. ఆయన గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో పడ్డాడు. నమాజ్ అయింతర్వాత నేను దువా చేసుకున్నాను. బాబాయ్ కుటుంబంతో మా సంబంధాలు గట్టిపడాలనీ, ముకరమ్ కాపురం ఓ కొలిక్కి రావాలనీ అల్లాకి దువా చేశాను. కాసేపు మసీదులో మౌనంగా కూర్చున్నాను. భూమి విషయంలో బాబాయ్‌తో తగువు అనవసరం అనుకున్నాను. అమ్మ ఏమనుకున్నా సరే, ఏదో ఓ రకంగా అక్కడే అప్పోసొప్పో చేసి ఇంటి ఆర్థిక వ్యవహారాలు ఓ కొలిక్కి తేవాలని అనుకున్నాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది.
    బయటికి రాగానే ఉస్మాన్ తన ఇంటికి వెళ్దామని పట్టుబట్టాడు. సరే అని బయలు దేరాను. నడుస్తున్నాం. ఉన్నట్టుండి ఉస్మాన్ అన్నాడు -
    "జమీన్ చోడో నక్కో... అబ్బాకి యాద్ ఓ యేకీచ్‌నా?" (భూమిని వదులుకోవద్దు, నాన్నగారి జ్ఞాపకం అదొక్కటేగా).
    ఉస్మాన్ మాట నా లోపలై ప్రశాంత వలయాల్ని మళ్ళీ కుదిపింది. అవును, నాన్నగారి జ్ఞాపకం...? ఉస్మాన్‌కే అంత పట్టింపుగా ఉంటే అమ్మకెలా ఉండాలి? నేను మళ్ళీ తీవ్రమైన ఆలోచనల్లో పడిపోయాను. ఆ పొలంలోని పచ్చని పైరు మీద వీచే చల్లనిగాలిలా నాన్నగారి చిరునవ్వు కనిపించింది. ఎన్ని దుఃఖాల్ని కప్పేసిందో ఆ చిరునవ్వు...? నేను లోపల్లోపల గుక్కపెట్టి ఏడుస్తున్నానేమో... బయటికి ఒక్కమాటా అనలేక పోతున్నాను. ఆ జమీన్ నాన్నగారి జ్ఞాపకం... నిజమే! దాన్ని వదులుకోకూడదు. ఒళ్ళంతా పిడికిలిలా బిగుసుకుంది.
    "మీ చాచా ముఖం చూసి అంతా వదిలేద్దమనుకోకు. నన్నడిగితే వాడంత కాఫిర్...షైతాన్ లేడు"
    "గోరీమా కనబడలేదే నాకు?" అన్నాను నేను.
    అప్పుడు ఉస్మాన్ చెప్పిన విషయాలు విని నేను కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాను. ఆలోచనల్లో మునిగిపోయాను. ఉస్మాన్ మళ్ళీ రైలు వేళకి వస్తానని వెళ్ళిపోయాడు.
* * *

    ఉస్మాన్ వచ్చేసరికి నేను బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉన్నాను. అందరికీ 'ఖుదా హఫీజ్' చెప్పి బయలుదేరాను.

    ఉస్మాన్ తనే ప్రస్తావించాడు.

    "జమీన్ విషయం ఏం తేల్చారు?" అని.

    నేనేమీ మాట్లాడలేదు. ఉస్మాన్ మళ్ళీ అడగనూ లేదు.

    ఇంతలోనే స్టేషన్ చేరుకున్నాం. అక్కడి దృశ్యం మామూలే. ఆ ముసలావిడ బురఖాతో మళ్ళీ ఎదురైంది.

    ఉస్మాన్‌ని చూడగానే పలకరించింది.

    అప్పుడే ఆమెని కాస్త పరీక్షగా చూశాను. గోరీమా...

    ఆమాటే పైకి అనేశాను. గోరీమా నా కళ్ళల్లోకి చూసింది.

    "అక్బర్..."

    ఆమెకు లేచి నిలబడే ఓపిక లేదు. నేలమీద కూర్చునే నన్ను ఆపాదమస్తకం ప్రేమగా నిమిరింది. నా చేతులు అందించాను. ఆమె నా చేస్తుల్ని దగ్గిరకు తీసుకుంది.

    ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

    "చివరికి ఇలా మిగిలిపోయాను. ఇప్పుడింక ఏమీలేదు బాబూ... అంతా మునిగిపోయాను."

    "ఏమైంది? ఎందుకిలా?"

    ఆమె ఏమీ మాట్లాడలేకపోతోంది. ఉస్మాన్ తనే కల్పించుకుని చెప్పడం మొదలెట్టాడు. అంతా విన్న తర్వాత నాకు గోరీమా నా ముందు ఆకాశమంత ఎత్తులో కనిపించింది. ఆమె పాదాలకు నమస్కరించాలనిపించింది. నా కళ్ళల్లో నీళ్ళు నింపుకున్నాను. ఆమె తెగింపు, సొంత నేలకోసం ఆమె పోరాటం... ఆమె ముందు నేను మరీ మరుగుజ్జులా కనిపించాను నాకు నేనే!

    ఈలోగా ఫ్లాట్‌ఫారమ్మీద రైలు కేక... నా ఆలోచనల్ని తెంపేసింది. ఉస్మాన్ ముందు పరిగెత్తి సీటు ఆపాడు. నేను గోరిమా వైపే చూస్తూ నా సీటులో కూలబడ్డాను.

    "గోరీమా, ఈ దేశం రాయలేని చరిత్రలో నువ్వొక చరిత్రవి. నువ్వొక తిరుగుబాటువి. నా తరానికి అంతుపట్టని భూపోరాటానివి. సొంత నేలకోసం సంఘాన్నంతా ఎదురొడ్డి నిలిచావు. ఓడినా సరే, నువ్వే గెలిచావు. నీ నేల మీద నువ్వున్నావు. నేను ఈ నేలకి దూరంగా... పిరికిగా పారిపోతున్నాను..."

    కిటికీలోంచి బయటకి చూస్తే మబ్బుల గుంపులు పరుగులు తీస్తున్నాయి గోరీమా హృదయంలో పరుగెత్తున్న యుద్ధాశ్వాల్లా.

(ఆదివారం వార్త, 29 డిసెంబరు 2002 సంచికలో ప్రచురితం)

Comments