గృహం - ఋణం - మణినాథ్ కోపల్లె

    
రంగారావు ఉద్యోగం చేసినన్నాళ్లు పొదుపుగా సంసారాన్ని నెట్టుకొచ్చాడు. భార్య లక్ష్మి కూడా తనకి తోడూనీడగా నిలిచి సాయం చేసింది. ఒక్కగానొక్క కొడుకు శేఖర్‌కి మంచి చదువు చెప్పించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని చేసాడు.  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఆరెంకెల జీతం సంపాదిస్తున్నాడు. కాంపస్ సెలెక్షన్స్‌లో ఉద్యోగం వచ్చింది. మంచి ఉద్యోగం. తను సాధించలేనిది తన కొడుకు సాధించాడని సంతోష పడ్డాడు. 
         
     ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన శేఖర్ కొన్ని కాగితాలు తండ్రికి చూపించాడు.
          
    "నాన్న! ఇవ్వాళ ఆఫీసుకి "కంఫోర్ట్ లివింగ్" అనే బిల్డర్స్ ఏజెంట్స్ వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి వివరిస్తూ ఈ కాగితాలు ఇచ్చారు. వాళ్ళ మోడల్ హౌస్‌లు, ఫ్లాట్స్ , అక్కడి సదుపాయాలు అన్ని వివరంగా చెప్పారు. నువ్వు కూడా చూడు" అంటూ రంగారావుకి చెప్పాడు.
          
    రంగారావు ఆ కాగితాలు చూసాడు. చాలా అందంగా ఉన్నాయి ఆ ఫ్లాట్స్.  డుప్లెక్స్ ఇళ్ళు రకరకాలు ఉన్నాయి. ఎన్ని ఇళ్ళు ఇంకా ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు  కట్టారు వగైరా వివరాలున్నాయి అందులో. 
          
    "శంషాబాద్  ఎయిర్ పోర్ట్ రోడ్‌లో,  హైటెక్ సిటీకి దగ్గరలో అన్ని హంగులతో సుమారు 500 ఫ్లాట్స్ నిర్మిస్తారుట నాన్నా! ఫ్లాట్ కొనటానికి కావలసిన ఋణం కూడా బిల్డర్స్ ఇప్పిస్తారుట.  రేపు ఆదివారం సైట్ దగ్గరికి వచ్చి చూసుకోమన్నారు. మా ఆఫీసు వాళ్ళు కూడా ఫామిలీస్‌తో వెడుతున్నారు."
          
    "వాళ్ళ సంగతి సరే , మరి నువ్వు ఏమి ఆలోచించావు?" అడిగాడు రంగారావు.
           
    "మనం తీసుకున్నా తీసుకోక పోయినా వెళ్లి చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఎలాగు వాళ్ళే తీసుకెడతారు. మీరు, అమ్మ రండి" అన్నాడు  శేఖర్.
            
    కొడుకు ఉత్సాహం చూసి సరే అన్నాడు రంగారావు.
            
    ఆదివారం అందరితో పాటు రంగారావు, శేఖర్ వెళ్లారు. లక్ష్మి రానంది.  
            
    నిజంగానే ఆ మోడల్ ఫ్లాట్ చుస్తే. ఉంటే ఇలాటి ఇంట్లో ఉండాలి అనుకున్నారు ఇద్దరూ. 
            
    ఆ ఫ్లాట్ రేట్ ఎక్కువే అయిన అన్ని సదుపాయాలు ఉన్నాయి.  బయటికి వెళ్ళకుండా షాపింగ్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్ ఫూల్,  ఓపెన్ ఎయిర్ థియేటర్ అన్ని ఉన్నాయి.
            
    స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా తగ్గిస్తారుట.
             
    స్టాఫ్ అంతా లోచించి ఫ్లాట్  బుక్ చేస్తేనే బాగుంటుంది అని అనుకున్నారు.  ఇప్పుడు ఉంటున్న ఇల్లు బాగానే ఉన్నా ఒక ఎస్సెట్ లాగా ఉంటుందని శేఖర్ కూడా ఆలోచించాడు. తన జీతంలో కొంత సేవ్ చేసినట్లు ఉంటుందని అందరితో పాటు తను కూడా అడ్వాన్సు ఇచ్చి ఫ్లాట్ బుక్ చేసాడు. పైగా తన కోలేగ్స్ అంతా ఒకే చోట ఉంటే బాగుంటుంది  అనుకున్నాడు శేఖర్. 
             
    ఇక ఇంట్లో అందరూ చర్చ మొదలు పెట్టారు. ఫ్లాట్ అంటే రెండు మూడు లక్షలు కాదుః ఏకంగా డెబ్బై లక్షలు నుంచి 
కోటి రూపాయల దాక వెడుతున్నాయి.  డబ్బు ఎలా సర్దాలా అని ఆలోచించాడు.
            
    శేఖర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తన జీతం లక్ష పైగానే.  కొంచం బ్యాంకు బాలన్సు వుంది.  రిటైర్ అయ్యేలోగా ఇల్లు ఏర్పడుతుంది. పెళ్ళయితే కొత్తింటి కాపురం అనుకుంటూ ఉహల్లో తేలిపోసాగాడు.
              
    బిల్దర్ చెప్పిన  బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్లారు. కొంచం కష్టం యినా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసారు. తొందర్లోనే లోన్ సాంక్షన్ అయింది. నెలకి అరవై వేలు జీతం లోంచి కట్.  యినా చింత లేదు శేఖర్ కి. తొందర్లోనే ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళే ఛాన్స్ కూడా వుంది. 
            
    కొడుకు కట్టాల్సిన అరవై లక్షల అప్పు కళ్ళ ముందు కదలాడుతుంటే ఆనందంగా ఉండలేక పోయాడు రంగారావు.

                                                              * * *  

    రెండేళ్ళు గడిచాయి. శేఖర్ చంద్రని పెళ్లి చేసుకున్నాడు. చంద్ర కూడా చదువు కున్నదే.  ఇంట్లోనే వుంటూ అత్తగారికి సాయం చేస్తూ వుండేది. రోజులు ఆనందంగా గడిచి పోతున్నాయి. ఈలోగా బుక్ చేసిన ఫ్లాట్ తయారు కావటంతో అక్కడికి మారిపోయారు. పాత ఇల్లు అద్దెకి ఇచ్చారు. శేఖర్‌కి ఒక కొడుకు. పాకుతూ... 
డుస్తూ .... బుల్లి బుల్లి మాటలు చెబుతూ ... మూడేళ్ళ వాడు అయ్యాడు.
          
    ఈ లోగా శేఖర్ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది.  ఉన్నట్లుండి తను తీసుకున్న లోన్ గురించి ఆలోచించేవాడు. ప్రతినెల జీతం లోంచి లోన్ అమౌంట్ కట్ అవుతుండటం చూస్తున్నాడు.
           
    ఈ మధ్య కాలంలో పెరిగిన వడ్డీ రెట్లు  సంగతి  తెలీలేదు.  ఎంతో కొంత అప్పు తీరుతోందని సంతోషిస్తున్నాడు.
           
    ఒక రోజు ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది.
           
    యం.డి. పిలిచి ఆ విషయం చెప్పాడు. "చూడు శేఖర్! నీ వర్క్ చూసి అమెరికాలో మన ప్రాజెక్ట్స్ చేసే అవకాశం నీకిస్తున్నాను. మూడు నెలలలో పూర్తి చేయాలి సుమా లేకపోతె మనకి మళ్ళి అక్కడి ప్రాజెక్ట్స్ రావు.  మాట మీద ఉండాలి అంతా!" అంటూ  జాగ్రత్తలు చెప్పాడు. 
           
    ఇంటికి వచ్చి శేఖర్ ఆనందంగా తన అమెరికా ప్రయాణం గురించి అందరికి చెప్పాడు.
           
    రంగారావు చాలా  సంతోషించాడు. కొడుకు అమెరికా వెళ్తున్నందుకు. 
            
    చంద్రకి ఆనందంగా వుంది.  "మమ్మల్ని కూడా తీసికెళ్ళ కూడదూ అక్కడికి.  నేను బాబు కూడా వస్తాము" అంది 
            
    శేఖర్ నవ్వుతు "నేను ఆఫీసు పని మీద వెడుతున్నా సీరియస్‌గా పని చేయాలి కానీ, షికార్లు కాదు. " అన్నాడు.
             
    "మిమ్మల్ని వదిలి అన్ని రోజులు వుండాలి కదా అందుకే మేము కూడా వస్తామని అంటున్నాను. బాబుకి మీరు కనిపించక పొతే ఏడుస్తాడు" అంది చంద్ర.
            
    నిజమే కానీ, వెళ్ళేది ప్రాజెక్ట్ వర్క్ కదా  వీలైనంత ఆదా చేసి మనం ఉంటున్న ఈ ఫ్లాట్ లోన్ తీర్చాలి. మూడు నెలలు మాత్రమే సమయం" అంటూ వివరించి చెప్పాడు శేఖర్.
              
    చంద్ర ముందు ఆలిగినా పరిస్తితి అర్థం చేసుకుని సరేనని అన్నది. 
              
    "రేపు ఒకసారి బాంక్‌కి వెళ్లి లోన్ ఎంత తీరిందో కనుక్కుని అటునుంచి ఆఫీసుకి వెడతాను" అన్నాడు.
               
    "అన్ని వివరాలు కనుక్కోండి" అన్నది చంద్ర.
               
    మరునాడు ఉదయమే రంగారావుతో "నాన్నా! ఇవ్వాళ బ్యాంకుకి వెళ్లి లోన్ విషయం కనుక్కుంటాను. నేను వెళ్ళే లోపల ఇంకా ఎంత వుందో తెలిస్తే ఒక ఐడియా వస్తుంది" అన్నాడు శేఖర్.
              
    "మంచిది. అన్ని తెలుసుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు" అన్నాడు రంగారావు.
               
    "నాన్నా ఈ ఐదు సంవత్సరాలలో  దాదాపు ముఫై యారు లక్షలు కట్టాను.  లోన్ చాలా మటుకు తగ్గిపోయి వుంటుంది. ఇదిగో ఇప్పుడు వెళ్లి వివరాలు కనుక్కుంటా" అన్నాడు శేఖర్.
                
    తను లోన్ తీసుకున్న బ్యాంకుకి వెళ్లి వివరాలు అడిగాడు.  
                 
    "ఇప్పటికి ఇదు సంవత్సరాలుగా ప్రతి నెల అరవై వేలు లోను కడుతున్నాను.  ఇంకా ఎంత కట్టాలి" అని మేనేజర్ ని అడిగాడు.
                 
    ఆయన కంపూటర్ లో చూసి "ఇంకా అరవై లక్షలు కట్టాలి" అన్నాడు. 
                 
    తను విన్నది ఏమిటో అర్థం కాలేదు. దాదాపు ముఫై ఆరు లక్షలు కడితే మళ్ళి అరవై లక్షలు అప్పు ఎలా ఉందో అర్థం కాలేదు.
                
    వివరాలు అడిగితె మేనేజెర్ పెరిగిన వడ్డీ రేట్లను అనుసరించే మేము తీసుకుంటున్నాము. మీరు కట్టేది వడ్డీకి పోను అసలు అలానే ఉంది అని అన్నాడు. 
             
    శేఖర్ స్టేట్‌మెంట్  అడిగి తీసుకున్నాడు.
              
    అది చూసిన శేఖర్ మతిపోయింది.
              
    తన లెక్క ప్రకారం కట్టిన డబ్బు వడ్డీకి చెల్లు అవుతూ వచ్చింది.  చక్రవడ్డీ మాయాజాలం.  చదువుకున్న తనే  దీని అర్ధం చేసుకోవటానికి సమయం పడుతోంది. సామాన్యునికి అర్ధం కావటం కష్టం.
             
    ఆ రోజంతా ఆఫీసులో పని చేయలేక పోయాడు. 
             
    తొందరగా ఇంటికి వచ్చాడు. 
              
    కొడుకు పరిస్థితి  చూసిన రంగారావు "ఏమైంది శేఖర్. ఆలా డల్ గా వున్నావు. బ్యాంకు వాళ్ళు ఏమన్నారు?" అడిగాడు.
             
    జరిగింది చెప్పలా వద్దా అని ఆలోచించాడు శేఖర్. 
             
    రంగారావు తరచి తరచి అడుగుతు ఉండటంతో చెప్పక తప్పలేదు.
             
    అంతా విన్న రంగారావు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు.
             
    కాసేపటికి తేరుకున్నాడు. కొడుక్కి ధైర్యం చెప్పాడు.
            
    తొందరలోనే ఆ ఋణం తీరే సంగతి ఆలోచిద్దాం అని అన్నాడు. 
            
    తను ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించింది నీటి పాలయినట్లయింది. ఎప్పటికి తీరుతుంది ఆ అప్పు. ఇరవై సంవత్సరాలలో            తీరవలసింది ఇంకా మరో ఇరవై సంవత్సరాలు పెరగడమేమిటి? ఆలోచిస్తుంటే మతి పోతోంది శేఖర్‌కి.
             
    అమెరికా వెళ్తున్నానన్న  ఆనందం లేదు.  ఫ్లాట్  వదులుకోలేడు  
            
    కొడుకు బాధ చూస్తుంటే రంగారావుకి ఇంకా  బాధ ఎక్కువవసాగింది. 
           
    కొడుకు సంపాదన ఇలా వడ్డిలకే పోతుందన్నది నిజం  కలచి వేస్తోంది. 
          
    తండ్రిగా తన బాధ్యతేమిటొ ఆలోచించాడు.
           
    "శేఖర్! నువ్వు ఊరికే బెంగ పెట్టుకోకు. పరిష్కారం అలోచిద్దాము"అన్నాడు. 
           
    "సంపాదిస్తున్న మనమే ఇలా వుంటే, పాపం మైక్రో ఫైనాన్సుల వారి ద్వారా రుణాలు పొందేవారు ఎంత బాధ పడుతున్నారో కదా నాన్నా!"
           
    "ఇదంతా చక్రవడ్డీల మాయ జాలం. దీనికి ఉన్నవారు లేనివారు అని తేడా లేదు. ఈ ఉబిలోకి దిగిన తరువాత పైకి రావటం కష్టం" అన్నాడు రంగారావు. 
           
    "అక్కడ చెప్పారు నాన్న! మేము ముందే మీకు చెప్పాము.  వడ్డీ రేటు పెరిగితే,  కట్టవలసిన వాయిదాలు పెరిగే అవకాశముంటుందని అని చెప్పారు. అప్పు తీసుకునే ముందు మనం పేపర్స్ చదివి సంతకాలు పెట్టాలి. ఇదిగో మనం హడావిడిలో న్నపుడు చదివే తీరిక లేక, బాంక్ వాళ్ళ మీద నమ్మకం వుంచి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టాను. మధ్యలో నేను కూడా చూడలేదు క్రమం తప్పకుండ లోన్ కడుతున్న కదా కొంతైన అప్పు తీరుతుంది అనుకుంటూ ఉన్నానే కానీ వివరాలు తెలుసుకోలేదు. నాలాగ ఎంత మంది ఉన్నారో అనిపిస్తుంది. " 
           
    "సరేలే ఇప్పుడు ఆ మాటలు వద్దు. నువ్వు వేరే అలోచించకుండ ఆఫీసుకి వెళ్ళు ముందు" అని కొడుక్కి ధైర్యం చెప్పాడు.

    ఆలోచించగా రెండు పరిష్కారాలు తోచాయి. ఒకటి తను కట్టిన ఇల్లు అమ్మేసి కొడుకు రుణభారం తగ్గించటం. 
లేదా ఎక్కడైనా తక్కువ వడ్డీకి మళ్ళి అప్పు దొరికితే మార్చుకొని మొదటి లోన్ తీర్చేయటం.

    శేఖర్ ని అడిగారు. "నేను వీలైనంత తొందరలో అప్పు తీర్చడానికి ప్రయత్నిస్తాను నాన్నా! పొదుపుగా వుంటూ ఎక్కువ అమౌంట్ కడతాను. అమెరికా ప్రయాణం ఎలాగు వుందిగా...  అక్కడ పొదుపు చేసి ఇక్కడ లోన్ తీరుద్దాము. మీరు మాత్రం ఇల్లు అమ్మకండి. మీరు ఎంతో మనసు పడి ఆ ఇల్లు కట్టారు .  ఎంతో కొంత అద్దె కూడా వస్తోంది" అని అన్నాడు శేఖర్.
            
    "సరే నీ ఇష్టం " అని అన్నాడు.
           
    ఆ రాత్రి రంగారావు పడుకుని ఆలోచించాడు.  తన వయసు అయిపాయింది.  ముందు ముందు జీవితం శేఖర్‌ది. తను కట్టిన ఇల్లు పాతదై పోయింది. రేటు ఉన్నపుడే అమ్మితే కొంతైనా డబ్బు వస్తుంది. ప్పు పూర్తిగా తీరలేక పోయినా తీర్చాల్సిన అమౌంట్ తగ్గుతుంది.   
             
    అప్పు తీరితే తప్ప కొడుకు జీవితంలో సంతోషం వుండదు అనుకున్నాడు. అందుకే శేఖర్‌కి తెలీకుండా తన ఇల్లు అమ్మటానికి నిశ్చయించుకున్నాడు రంగారావు.
       
    అప్పుడు కానీ యన తృప్తిగా నిద్రపోలేదు.
        
    ఇంటి మీద మోజు ఇంతటి సమస్యలని తెచ్చిపెడుతుందని అనుకోలేదు.
Comments