గూడు చాలని సుఖం - పి.శ్రీనివాస శాస్త్రి

    పూరిపాకల్నీ పేద జనాన్నీ అట్టే పట్టించుకోకుండా చలిగాలులు విజృంభిస్తున్నాయి.

 

    ఆ చలికి సత్తెమ్మ గజగజలాడింది.

 

    అరగంట క్రితం –

    కొడుక్కీ కోడలికీ మధ్య తానెందుకు అడ్డు అనిచెప్పి సత్తెమ్మ పాకబైట గోనెబరకం పరుచుకు పడుకుంది. అసలు, అత్తకోడలు లోపల పడుకుంటే కాసులు పాకబైట పడుకోవడం ఆనవాయితీ.


    ఓ రాత్రివేళ నరాలు జివ్వుమన్నప్పుడు పిల్లిలా లోపలికెళ్ళి రత్తాల్ని జబ్బమీద గిల్లేవాడు కాసులు. 


    అది కాస్సేపు గారాలుపోయి, మరి కాసేపు వయ్యారాలు పోయి మనసుతీరా బ్రతిమాలించు కొనేది.


    కాసులు దాన్ని మెల్లిగా పాకబయటకు నడిపించి నులక మంచంమీదకు చేర్చేవాడు. చాలని నులక మంచం,   చాలని దుప్పటీ, చాలని గూడు ఇచ్చే చాలీచాలని సుఖాలకి వాళ్లు అలా అలవాటు పడిపోయారు.


    పగలల్లా రిక్షా తొక్కి తొక్కి చాలని గంజి మెతుకులు కతకడం వల్ల పెరిగిన ఒంటివేడి రాత్రి ఆ రకంగా తీరిపోగానే కాసులుకి ఆపుకోలేని అలుపు వచ్చి అలాగే నులక మంచంమీద ఒళ్ళెరక్కుండా నిద్రపోయేవాడు.


    రత్తాలు వాడికి ఒంటినిండా దుప్పటికప్పి దుప్పటి చిరుగుల్ని ముడుతల్తో సరిచేసి లోపలికొచ్చి తడిక బిగించి అత్తపక్కలో పదిలంగా పడుకునేది పాతచీర కప్పుకుని. 


    కాసులు మొన్న వేసవిలో రత్తాల్ని కాపురానికి తెచ్చుకున్నప్పటినుంచీ ఆ తల్లీ, కొడుకూ కోడలూ పాకని ఆ విధంగా పంచుకున్నారు రాత్రిళ్లు.  


    సత్తెమ్మ మాత్రం ఆ రోజు తాను కొడుక్కీ కోడలికీ అడ్డుగా వున్నట్లు తలపోసింది. అందుకు కారణం లేకపోలేదు.


    అంతక్రితం రాత్రి ముసలమ్మకు మెలకువ వచ్చింది. పక్కలో రత్తాలు లేదు. ఎన్నిసార్లో అలా మేల్కువ వస్తే పక్కలో రత్తాలు లేకపోవడం గమనించి నవ్వుకుని నిద్రలోకి జారుకునేది సత్తెమ్మ. కానీ ఆ రోజు నవ్వురాలేదు. నిద్రరాలేదు. లఘుశంకకి పోవాల్సి వచ్చింది. బయటకు వెళ్ళాలంటే లేదు. ఆ సమయంలో బయటనించి సన్నగా వినిపిస్తున్న తన అలికిడి వినగానే ఆగిపోతాయని భయం.


    రత్తాలు తెలతెలవారుతున్న వేళ పాకలోపలికొచ్చి తడిక బిగించి పదిలంగా తన పక్కలో పాతచీర కప్పుకొని పడుకోడానికి ముందే సత్తెమ్మ ఓ నిర్ణయాని కొచ్చేసింది -


    రేపటి నుంచి పాకబయట తాను పడుకొని పాకని రాత్రిపూట కొడుకూ కొడళ్ళ స్వేచ్ఛకి వదిలెయ్యాలని.


    పడక పడక పడిన కాపురం కాసులుది. కాసులు రిక్షాలాగి తెచ్చే డబ్బులు కాస్తా కోడలికి "కరుసై పోడం" అతని తండ్రి వీరయ్యకిష్టం లేదు. కీళ్ళవాతం వచ్చి ఎటూ కదలలేని వీరయ్యకు, కోడలొస్తే తనకి సారాడబ్బులు అన్నప్పుడూ దక్కావేమోననే భయం పట్టుకుంది.


    "కాపురం పడనివ్వ నోడివి - పెళ్లెందుకు చేశావ్ కొడుక్కి?" అని ఇరుగూ పొరుగూ నిలవేశారు వీరయ్యని. 


    "అడగవచ్చారు కాబట్టి సెబుతున్నా. ఇది గిలారండి. ఈ పాక లోపల అడుగుపెట్టండి. మరో మైనిషికి సాల్తదా ఈ పాక? పోనీ ఆ ఒచ్చే మనిషి ఒచ్చినట్టే సరుదుకోవచ్చు. రేపు పిలగాడు పుట్టుకొస్తే మాటేంటి? అందుకే ఓ వంద రూపాయలు కరుసుపెట్టి నాలుగు తడికెలూ, మూడు తాటిదూలాలూ, ఓ రాట, కమ్మలూ కొని ఏరే ఓగది ఈ పక్కన లేపింతరవత పెళ్ళాన్ని తెచ్చుకోరా అన్నా. అలా అండం తప్పయితే ఇప్పుడే తెచ్చుకోమనండి పెళ్ళాం బెల్లం ముక్కని! నేనూ నా పెళ్ళాం - ఆడసులు మా కొడుకు కాదనిసెప్పి రాములోరి గుడిముందు సెట్టుకింద బతుకుతాం" అన్నాడు వీరయ్య అడగవచ్చిన ఇరుగూ పొరుగూతో.      


    వీరయ్య వాదంలో బాధ ఇరుగూపొరుగూ గ్రహించారు. కాసులూ గ్రహించాడు. కానీ ఏం చేయగలడు? పాక బాగుచేతకి వందరూపాయలు లేకనే పోయాయి.


    అందుకే వీరయ్య పొయ్యేంతకాలం కాసులు కాపురం పడలేదు.


    సరిగ్గా వేసవి వెళ్ళిపోడానికి ముందు "గుహ లచ్చిమి"ని ఇంటికి తెచ్చుకున్నాడు కాసులు."మాంగారు" జామారూ, కండువా, చౌకరకం గళ్ళ టెర్లిన్ చొక్కా, రత్తాలుకి చీరా రవికా పెట్టారు. కలగక కలగక కలిగిన కొత్తకాపురం మోజులో కొన్నాళ్ళు రిక్షా లాగుడు వ్యాపారం మూలకి నెట్టేసాడు కాసులు. కుండలు, డింకీలు కొట్ట నక్కరలేకుండా మామ ఇచ్చిన 50 రూపాయలూ సహాయపడ్డాయి.


    అంతలో వేసవి వెళ్ళిపోయి వర్షాలు ప్రారంభమయ్యాయి. కాసులికి రాత్రిళ్ళూ గూడు సమస్యా ప్రారంభమయ్యింది.


    ఆరు బైలుని "వానదేవుడు" ఆక్రమిస్తే పాకని "ముసలమ్మ" ఆక్రమించింది!


        ఆ ఇరుకులో కాసులూ, రత్తాలూ పడ్డ 'సుఖం' ఏదైనా వుంటే అది ఎన్నో బాధలనీ, అభ్యంతరాలనీ కాదని సాధించి తెచ్చుకున్నదే!


    ఆ చీకట్లో ఇరుకులో వాళ్ళిద్దరి సంభాషణా ముసలమ్మ చెవిన పడుతూనే వుండేది.


    "రత్తాలూ... నిద్రపోకే..."


    "......."


    "రత్తాలూ - నిన్నేనే"


    "ష్! గట్టిగా ఇనబడతంది."


    "మా అమ్మ నిద్దరోయింది లేయే."


    "అందుకే! మాటాడకు! లెగుత్తాది!"


    "లెగదు లేయే... నా మాటిను... అలా పాక ఎనక మట్టి అరుగు మీదికి పోదామా?"


    "సీ... సీ... వొరసం... తడిసిపోతాం"


    కొత్తలో ఆ ఇరుకుతనం అటు సత్తెమ్మకీ ఇటు కాసులూ రత్తాలుకీ కొత్తగా వున్నా వర్షాకాలం అంతా ఆ ఇబ్బందికి అలవాటు పడిపోయారు. బైట వాన ఉధృతంగా పడుతుంటే ఆ "హోరు"ని వృథా కానిచ్చేవాడు కాదు కాసులు.


    వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలం మొదలు కాగానే కాసులు ఆరుబైటా, సత్తెమ్మా రత్తాలూ లోపలా పడుకోటంతో సమస్య కొంత విడినట్టే విడింది.


    కానీ సత్తెమ్మకీ కొత్త సమస్య తల ఎత్తి పడకల మార్పిడి అత్యవసరం అయింది మళ్ళీ!


    తల్లి కొత్త నిర్ణయం విన్న తరవాత కాసులుకి ఒక పక్క సంతోషం మరోపక్క విచారం కలిగాయి.


    "ఆరు బైట నువు పడుకోరాదని డాకటర్లు సెప్పారు కదే" అన్నాడు మొహమాటంగా.  


    "ఆరు బైటయితే ఏటి? పాకైతే ఏట్రా ముసల్దానికి? ఐనా మీ అయ్య కంబళీ వుంది కదా?" అంది సత్తెమ్మ.


    సత్తెమ్మకిగానీ, కాసులుకిగానీ వీరయ్య వదిలి వెళ్ళినది ఆ పాక, కంబళీ ఆ రెండే. వీరయ్య పోగానే సత్తెమ్మ తన ముక్కెరని రత్తాలుకి తగిలించింది. ఆ ముక్కెరని చెరిపించి బంగారం అమ్మి పాక బాగు చేయించాలని కాసులుకి మనసులో వుండేది. కానీ వీలులేకుండా ముక్కెర తాకట్టులోకి వెళ్ళి - ఆ తరవాత అత్యంత సహజంగా వకట్టులోకి వెళ్ళిపోయింది.


    కాసులు మనసుపడినట్టుగా ఆ పాకని బాగుచేయించి, తడికెల బదులు పచ్చి ఇటుకలతో గోడలు లేపి పైన రేకులు వేయించి, దాన్ని రెండు గదులు చేసి, ఇల్లు ఆకారం రప్పించాలంటే వాడికి లాటరీ తగలాలే తప్ప దారిలేదు. లాటరీ టికెట్టుకన్నా రూపాయి డబ్బులుండాలి కాబట్టి - ఆ పాక ఇక బాగుపడదనే చెప్పాలి.


     ఆ రోజు పాకని మొత్తానికి కొడుకూ కోడలి స్వేచ్ఛకి వదిలి పాక బైట గోనెబరకం పరచుకొని కంబళీ కప్పుకొని పడుకుంది సత్తెమ్మ.


    బైట చలి ఆమెని కుదిపేస్తోంది.


* * *


    చాలా రోజుల తరవాత రిక్షాకి ఎక్కువ బేరాలు తగిలిన హుషారులో కాసులు ఆ రోజు 'నన్నెవరాప లేరీవేళ' అన్నట్లున్నాడు.


    పాకలోపల సుఖం క్రొత్తగా వుంది.


    రత్తాలు కాసులు ఒడి వెచ్చదనానికి కరిపోతూ కూడ చలిచలి అనడం మానలేదు.


    "నే వెచ్చగా లేనా?" అని అడిగాడు కాసులు.


    "ఛీ పో..." అంటూ చేత్తో కాసులు బుగ్గమీద పొడిచింది రత్తాలు. గాజులు గల్లున గోల చేశాయి.


    కాసులు బాధ నటించాడు. రత్తాలు కళ్ళల్లో చురుకుదనం తళుక్కుమంది.


    కాసులు పట్టు తప్పిపోయాడు.


    ఇద్దరికీ చాలటం లేదు దుప్పటి.


    కప్పుకున్నంత మేరా కొద్దిగా వెచ్చగా అనిపించినా, దుప్పటి బైటకి వచ్చిన పాదాలూ, వీపూ చలికి బిర్రబిగుసుకు పోతున్నాయి.


    హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది కాసులుకి. 


    "రత్తాలూ! ఓ పనిసై" అన్నాడు.


    "ఏటది?" అంది రత్తాలు.


    "మా అమ్మ కప్పుకున్నాది కంబళీ... ఈ దుప్పటి దానిక్కప్పి, ఆ కంబళీ అట్టుకురా... పెద్దగుంటది. ఎచ్చగా కూడా వుంటది. మళ్ళా కోడి కూసే ఏళ కంబళీ కప్పేసి, దుప్పటి తెచ్చీసుకుందాం."


    "ఇయ్యాళ నీకు కంబళీమీద మనసు పోనాదేటి?"


    "సలనికాదే. ఒక్క రేతిరి ఇద్దరం ఓకే పక్కమీన ఒకే దుప్పటికింద పడుకుందామని మనసౌతంది"


    "నీ మనసు పాడుగాను. దుప్పటుంది కదరా?"  


    "అది సాల్దే."


    "నే తేనుపో"


    "సంపుతాను."


    "సంపితే వూరుకుంటానా? మెడ కొరికేస్తా అమ్మతల్లిలా."


    "నేను సంపేసిం తరువాత నువు నా మెడెలా కొరగ్గలవే?"


    "సూపియ్‌నా? ఇదిగిలా."


    రత్తాలు కొరికినందుకు ప్రేమ పెల్లుబికి కితకితలు పెట్టనట్లు నవ్వాడు కాసులు. కదలికకి దుప్పటి సాంతం జారి కిందపడింది.


    "సీ. ఇదోటి" అని విసుక్కున్నాడు.


    "కంబళీ తెస్తానుండు" అని లేచి తడిక తోసుకుని పాక బైటకొచ్చాడు.


    కంబళీతో తల్లి ముడిచిపెట్టుకుని ఉండలా పడుకుంది. కంబళీమీద చేయి వేస్తుంటే గుండెలెందుకో వేగంగా కొట్టుకున్నాయి కాసులుకి.


    ఒక్కరేతిరే కదా అని మనసుకి సరిపెట్టుకున్నాడు.


    "ముసలమ్మకి ఒకవేళ మెళుకువొస్తే...?" అని సందేహం కలిగింది.


    మెళకువ రావడానికి అవకాశం ఇవ్వకుండా పదిలంగా కంబళీ తొలగించి దుప్పటి కప్పి తడిక బిగించి పాకలోపలికొచ్చాడు దొంగలా.


    కంబళీ నిండా కప్పుకున్న మొగుణ్ని చూసి రత్తాలు విరగబడి నవ్వింది "బూచాళ్ళా వున్నావ్" అంటూ.


    బూచాళ్ళా వున్నావ్ అన్నాందుకు కాసులుకి హుషారు పుట్టి నిజంగానే బూచాళ్ళా నాలికబైట పెట్టి రత్తాల్ని భయపెట్టాడు.


    "ముందది ఇలగియ్యి" అంటూ శరీరాన్ని కంబళీలో దాచుకుని వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుని "ఎచ్చగుంది" అంది రత్తాలు.


    "ఇంకా ఎచ్చగుంటది సూడు" అంటూ కాసులు కూడా కంబళీలో దూరిపోయాడు.


    ఇద్దరికీ ఉన్నంతలో సుఖం పంచి ఇచ్చింది కంబళీ.


    కాస్సేపు వాళ్ళిద్దరి మధ్యనా మాటలు లేవు చేతలే తప్ప. చలిలేదు - వెచ్చటి హాయే తప్ప.


    సుఖంతో అలిసిపోయి ఎప్పుడు నిద్రపోయారో తెలియదు. లేచేసరికి కోడి కూసేసింది. కాసులు బద్దకంగా ఆవులించి కంబళీ తీసుకుని బైట తల్లిదగ్గర కొచ్చాడు.


    కంబళీ కప్పబోతుంటే సత్తెమ్మ ఆయాసంతో రొప్పుతూ, చలికి వణుకుతూ దుప్పటిలో వుండచుట్టుకుపోయి కనిపించింది.


    కాసులుకి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. 


    పైకి అనడానికి తనకి నోరు తిరగని జబ్బు ఏదో తల్లికి వుందని మరిచిపోయాడు ఆ రాత్రి.


    గబగబా తల్లిని చేతులమీది కెత్తుకుని లోపలికి చేర్చి నులకమంచం మీద పడుకోబెట్టి పాతారోతా బట్టలు కప్పి శరీరాన్ని నీరసంగా గోడకాన్చుకుని కూర్చున్నాడు. పేదతల్లికి పేద కొడుకు చెయ్యగలిగినదంతా చేసి ఆపైన భారం "బగుమంతుడి" మీద వేడాడు.


    అప్పటికే రత్తాలు గాభరాగా శోకన్నాలు ప్రారంభించడంతో ఇరుగూ పొరుగూ చేరు తున్నారు. 


    జేబులు తడుముకున్నాడు కాసులు.


    చేతికి రెండు రూపాయి నోట్లు, ఏవో చిల్లర డబ్బులూ తగిలాయి.


    "డాక్టరు దగ్గరికి పోదునా" అని ఆలోచించాడొక్క నిముషం.


    "పోతేనే మంచిది. పోకపోతే ఈ ఆయాసం, వణుకు, దగ్గుకి ముసలమ్మ సచ్చీసినా అంతకన్నా ఎక్కువే కరుసవుద్ది" అనిపించి గబగబా రిక్షా తీసుకుని "సవక డాట్రుగారి" ఆసుపత్రి వైపు జోరుగా రిక్షా నడిపిస్తూ వెళ్ళిపోయాడు.


    సవక డాట్రుగారి అసలు పేరు సుందర్రావుగారు. ఆసుపత్రి బోర్డుమీద ఆయన పేరు చివర ఎల్.ఎం.పి. అని వుంటుంది.


    ఎల్.ఎం.పి. అవగానే ఆయన ఎకాయెకి ఆ పేద హరిజనవాడలో ప్రాక్టీసు ప్రారంభించి గుమ్మందాకా వచ్చిన ఏ కేసునీ వదలకుండా ఏదో ఒక మందిచ్చి డాక్టరు దగ్గరికి వెళ్ళామన్న్న సంతృప్తిని పేదలకి మిగిల్చి 'సవక డాట్రు గారని' పేదల్లో పేరుబడ్డారు. 


    ఆదరాబాదరా రిక్షామీద వచ్చి రొప్పుతూ కాసులు 'ఇసయం' చెప్పగానే ఆయన అంతకన్నా ఆదరా బాదరాగా రిక్షాయెక్కి మరి పది నిమిషాలకి కాసులు పాకముందు నిలబడ్డారు.


    పాకలోపలినుంచి జనం అంతా బిలబిలలాడుతూ బయటికి వచ్చి "సవక డాట్రు"గారికి దండాలుచెప్పి అక్కడొకరూ అక్కడొకరూ చెదురుమదురుగా నిలబడ్డారు ఆయనకేసి భక్తితో చూస్తూ.


    సవకడాట్రుగారికి నిజానికి ఆ వూళ్లో విలువయిన సొంతబంగళా వుంది. 20వేలు కట్నం పట్టుకొచ్చిన విలువయిన భార్యవుంది. మామగారి ఆస్తికి వారసుడైన "పెంపుడు కొడిక్కి" ఏ మాయరోగం రావటంలేదే అనే బాధ వుంది. పేద వెధవలు ఎటూ పెద్ద ఆసుపత్రి గుమ్మం కూడా తొక్కలేక తనదగ్గరకే చేరతారనే ధీమా వుంది. రోజులో సగభాగం పేదల పాకదగ్గరే గడిపే అలవాటువల్ల ప్రస్తుతం కాసులు పాక చుట్టు పరిసరాలుగాని, ఒంటికి సగమే కప్పగల బట్టలు, అమాయకత్వం నిండిన చూపులతో అక్కడ నిలబడ్డ జనంగాని ఆయన్లో ఏ సంచలనం కలిగించలేదు.


    సవకడాట్రుగారు పాకనోమారు పరికించి చూసి లోపల రోగిని చేర్కోడానికి తను యెంతవరకు వంగాలో అంచనావేసుకుని, అంతవరకూ వంగి లోపలకు అడుగు పెట్టారు.


    మంచంమీద చలితో, ఆయాసంతో, దగ్గుతో లుంగలు చుట్టుకుపోతున్న సత్తెమ్మని చూడగానే ఆయన కనుబొమ్మలు ముడివడ్డాయి.


    "లాభంలేదు... ఆస్మా...అశ్రద్ధచేశారు" అన్నారు. మందని కాసులు అనుకున్న రంగునీళ్ళను సిరంజిలో నింపి ఇంజక్షను యిచ్చారు. ఓ మందులచీటి రాసిచ్చారు. ఖరీదయినవిగా కాసులుకు తోచిన సలహాలు నాలుగిచ్చారు. చివర్న కాసులు రిక్షా యెక్కి వచ్చిన దారినే వెళ్ళేరు.


    కాసులు జేబులుతడిమి మూడురూపాయల చిల్లర ఆయన చేతిలో పొయ్యగానే కళ్ళజోడు సందులోంచి పరీక్షగా చూసి "రానుపోను రిక్షాకి డబ్బులు ఖర్చవలేదు కాబట్టి లాభమే" అనుకొని వ్యాపార ప్రకటనలాంటి మేలురకపు నవ్వునవ్వారు.


    "ఇండీసను పొడిచేరు కాబట్టి సవకే..." అని కాసులు అనుకుని "దండాలు బాబు" అంటూ వంగి వంగి సలాము చేసి అజ్ఞానపు, అమాయకత్వపు నవ్వు నవ్వాడు.


    ఆ తరవాత సత్తెమ్మ ఆయాసం, కాసులు దిగులూ, రత్తాలి శోకన్నాలు, ఆ వెనుక ఇరుగూ పొరుగూ సానుభూతి వాక్యాలు మామూలుగానే మిగిలిపోయాయి.


    డాక్టరుగారిచ్చిన సలహాలలో ఖరీదయినవి ఎప్పుడో మర్చిపోయాడు కాసులు. జ్ఞాపకానికి ఇక మిగిలిందల్లా చవకబారు సలహా ఒక్కటే-


    "ఆరుబయట పడుకో బెట్టకండి" అన్నది.


    తన సుఖం కొంత ఖరీదుగా ముట్టచెబితే ఈ సలహా పాటించడం చాలా సుళువు.


    వెంటనే ఆ రాత్రి ఆ సలహా పాటించేశాడు.


    మళ్ళీ యథాప్రకారం సత్తెమ్మ పడక పాకలోకీ, కాసులు పడక ఆరు బయటకీ మారిపోయాయి.


    అదే నులకమంచం.


    అదే చిరుగుల దుప్పటీ...


    అదే ఇరుకు సుఖం.


    అన్నింటికీ అలవాటు పడిపోయి ఆ శీతాకాలం నాలుగునెలలూ గడిపేశాడు.


    వేసవి వెళ్ళి, ఆ వెనుకనే వర్షాకాలం కూడా వెళ్ళిపోతుండగా సత్తెమ్మ కన్నుమూసింది తిరగబెట్టిన ఆస్మా తగ్గక.


    ఆ పాక యిక శాశ్వతంగా కాసులుదీ రత్తాలుదీనూ!


    అలా అని గట్టిగా అనుకోడానికి లేదు.


    అప్పటికే కొడుక్కి మూణ్ణెల్లు నిండగా రత్తాలు మళ్లా కడుపుతోవుంది.


    "ఈ ఇరుకు బతుకులో ఎప్పుడూ మూడో వాడికి  చోటుండటం లేదు. నువ్వెందుకొచ్చావురా ఈ పాకలోకి? ఏరే ఏదన్న కలిగిన లోగిలి చూసుకోలేక పోయావా?" అనికి కొడుకు పుట్టిన రోజున కాసులు బాధపడితే రత్తాలు కళ్ళనీరెట్టుకుంది.


    "ఈసారి మగబొట్టె నియ్యకురా దేవుడా! ఆడబిడ్డనియ్యి-" అని రత్తాలు దేముణ్ని ప్రార్థిస్తూ వుంటుంది కాసులుకి తెలీకుండా.


    మరో కొడుకు పుడితే ఆ ఇరుకుపాకలో మరో వాటాకి పోటీ వస్తుందని రత్తాలు భయం!


    ఒకసారి ఆమాట కాసులుతో అనగానే వాడు పగలబడి నవ్వాడు. ఎందుకు నవ్వాడో ఆలోచిస్తే వాడికే అంతుచిక్కలేదు.


    వాడి ఇరుకు బతుకులో సుఖం ఎంతుందో వాడి నవ్వులో అర్థమూ అంతే వుంది!


(జ్యోతి మాసపత్రిక జూన్ 1978 సంచికలో ప్రచురితం)  

Comments