గురి - మల్లిపురం జగదీశ్

 

   ఎండిపోయిన మాని మొజ్జు మీద లక్ష్యం రెక్కలల్లాడిస్తోంది. విలుకాడు విల్లుని సంధించాడు. నారిని మరింత బలంగా తనవైపుకి లాగి లక్ష్య దూరాన్ని అంచనా వేసేడు. దగ్గర్లోనే ఉంది.

 

    మబ్బు పట్టిన ఆకాశం... స్తంభించిన గాలి... ఊపిరాడనట్టు ఉక్కపోత. శిలావిగ్రహాల్లా చెట్లు,గుబురులో ఒకే ఒక ఆకు మాత్రం అదే పనిగా రెపరెపలాడుతోంది పిచ్చిపట్టినట్టు.

 

    విలుకాడి నుదుటి మీది చెమట బొట్టు ఎడమ కన్ను ప్రక్కగా చెంపమీదికి జారింది. అతన వెనుక చెట్టుకొమ్మ ఉయ్యాల్లోని పాప తల బయటికి పెట్టి విలుకాడి చేతులమీంచి లక్ష్యం వైపు చూస్తోంది.

 

    నిశ్శబ్దాన్ని నిండుకుండలో మోస్తున్నట్టు... అడవి.

 

    విలుకాడి చేతిలోంచి శిలకోల  దూసుకుపోయింది. లక్ష్యం ఎగిరిపోయింది. శిలకోల 'జువ్వ్'మని శబ్దం చేస్తూ మాని మొజ్జు మొదలుకి గుచ్చుకొంది. పిచ్చి పట్టిన ఆకు ఆగిపోయింది... వెక్కిరిస్తున్నట్టు.

 

    విలుకాడు నిర్ఘాంతపోయేడు. ఎగిరిపోతున్న లక్ష్యం వైపు బేలగా చూస్తూ...

 

    తప్పకూడని గురి... తప్పింది.

 

    విల్లు సంధించడానికీ, లక్ష్యం ఎగిరిపోవడానికీ నడుమ ఏదో జరిగింది. ఏమిటదీ?

 

    సమాధానంగా... విలుకాడి మొలలోలోంచి

 

    'పంచదార కొమ్మా కొమ్మా... పట్టుకోవద్దనకమ్మా...' సెల్‌ఫోన్ మోగుతోంది.

 

    విలుకాడి కంటే ముందే ప్రమాదాన్ని పసిగట్టిందేమో... లక్ష్యం తప్పించుకుంది.

 

    "డాడీ... ఫోన్" అనడంతో ఈలోకంలోకి వచ్చేడు సత్యం. జేబులో ఫోన్ రింగవుతోంది. 'అంటే ఇంతదాకా మోగింది తన జేబులోంచా? మరి...

 

    ఓహ్... కలా..?

 

    నిజమే... గురి తప్పిన విలుకాడు.

 

    "ఎక్కడున్నారు? పాపేమైనా అల్లరి చేస్తోందా?" శ్రీమతి అడుగుతోంది.

 

    "లేదు, లేదు... ఇంకా అరగంట దూరంలో ఉన్నాం" సత్యం ఫోన్ పెట్టేసేడు.

 

    బస్ వేగంగా కదులుతోంది. ఒక్కసారిగా గాలి తీవ్రత పెరిగింది. తేడా గమనించేడు సత్యం. కురుపాం దాటాక గాలి చల్లబడిపోతుంది. అంటే ఏజెన్సీలోకి ప్రవేశించామన్నమాటే. అంతదాకా కనపడని చెట్లూ... కొమ్మలు... తుప్పా... డొంకా... కోనా... అన్నీ ఎదురై పలకరిస్తాయి. రోడ్డు సన్నబడిపోతుంది. కిటికీలోంచి కొమ్మలు, రెమ్మలు ముఖానికి తగులుతూ... 'నీకోసమే... ఎదురుచూస్తున్నా'మన్నట్టుంటాయి.

 

    ఆ గాలి... పాతదే...

 

    ఆ చలి... పరిచయమైందే.

 

    కొత్తగా స్పృశిస్తూ... చెట్లూ... కొండలూ... వెనక్కి కదులుతున్నాయి... వేగంగా... వెనక్కి... వెనక్కి... వెనక్కి... కళ్ళముందే కన్నతండ్రి మంగులు కన్నుమూసినప్పటికి...

 

* * *

 

    "ఒరే మంగులూ... రేపు తెల్లార గట్ట లెగాల... బండి పుయ్యాల" ఇంటి మెట్లెక్కుతూ చెప్పేడు షావుకారి.

 

    'అల్లగేన్లే' అన్నట్టు తలవూపి వెనుతిరిగేడు మంగులు.

 

    మంగులు షావుకారికి కంబారి ఐదేళ్ళ దాకా. అదీ ఎందుకంటే... ఓరోజు... షావుకారి పొలంలో వరి ఎన్నులు దొంగతనం చేస్తూ దొరికిపోయేడు.

 

    పంచాయితీ పెట్టించేరు.

 

    ఊరి పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. అందరి మధ్యలో తలవంచుకుని నిలబడ్డాడు మంగులు. వరి ఎన్నుల పేరుతో దోషిగా నిలబెట్టి తన ఇంట్లో మరికొన్ని బంగారు వస్తువులు కూడా పోయాయని నింద మోపేడు షావుకారి. నిజానికి మంగులు ఎన్నులు తెంచిన పొలం మంగులుదే. కానీ అప్పుడెప్పుడో మంగులు  తండ్రికి యాభై రూపాయలు అప్పు ఇచ్చి తీర్చలేకపోయేడని ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నాడు షావుకారి. 

 

    తీర్పు చెప్పండి చెప్పండంటూనే తీర్పు చెప్పేడు షావుకారి... ఐదు సంవత్సరాల కంబారితనం తన ఇంట్లో చెయ్యాలని. ఆ తీర్పుకి మంగులు ఒప్పుకోలేదు. కళ్ళెర్రగించి చూసేడు.'మేకలపై పులుల తీర్పు చెల్లదన్నట్టున్నా'యతని చూపులు. షావుకారికి ఆ చూపులు నచ్చలేదు. ఐతే పోలీసు కేసు పెడతానన్నాడు. ఆ మాటకి వూరు గజగజలాడింది. మంగులు తండ్రైతే షావుకారి కాళ్ళు పట్టుకుని వదల్లేదు.

 

    వూరంతా బ్రతిమాలింది. మంగులినీ బ్రతిమాలింది కంబారితనానికి ఒప్పుకోమని. మంగులు తలదించేడు... ఊరుకోసం.

 

* * *

 

    వూరికి దూరంగా... గెడ్డ ప్రక్కన... ముంత మామిడిచెట్టు క్రింద... పాక. పాక ప్రక్కనే అరెకరా గుడ్డి. గుడ్డి నానుకుని నాయుడి పొలాలు. ఆ పొలాలు కాపలా కాస్తూ కిత్తన్న.

 

    "ఏట్రా బేగి పారొచ్చినావు?" చీకట్లో నడిచొచ్చిన కొడుకుని అడిగేడు కిత్తన్న.

 

    "తెల్లారగట్ట బండికి పుయ్యాల... అందుకే బేగొదిల్నాడు" ముంజూరు కింద అరుగుమీద రాటకు చేరబడ్డాడు మంగులు.

 

    ఆ రాట ఎప్పటిలా లేదు. అరుగులో ఏదో మార్పు. ఎప్పుడు అక్కడ కూర్చున్నా, మేక పిండ్రికిలి అంటుకునేవి. వాటిని దులుపుకుంటూ ఆ రాటకే కట్టిన మేకని ప్రేమగా తిట్టుకుంటూ... ఒక్క చరుపు చరిచి అదల్చడం అలవాటు మంగులుకి.

 

    ఇప్పుడా అరుగు శుభ్రంగా... ఎవరో తుడిచినట్టు... రెండు మూడు రోజులుగా ఆ రాట చుట్టూ మేక తిరిగిన ఆనవాళ్ళేవీ లేవు. అప్పుడు గమనించేడు... ఏక్కడో... దూరంగా మేక అదే పనిగా అరుస్తోంది. ఆ అరుపులో ఏదో తేడా ఉంది.

 

    "ఏటైందే?" అడిగేడు మంగులు.

 

    పెణక కింద పొయ్యి వూడడంలో నిమగ్నమై ఉన్నాడు కిత్తన్న. మళ్ళీ అడిగేడు. సమాధానం రాలేదు.


    కాసేపు నిశ్శబ్దం తర్వాత... రహస్యం చెప్తున్మట్టు అన్నాడు... "పారిపోయిందిరా" అని.

 

    గొంతులో విషాదాన్ని పసిగట్టేడు మంగులు "మేక పిల్లా?" అడిగేడు.

 

    "కాదు. మీయమ్మరా!"

 

    "ఏటీ?!" ఆశ్చర్యపోయేడు. అప్పుడు గమనించేడు మంగులు. ఇంట్లో అమ్మలేదు.

 

    "మేకపిల్ల బయింకే మీయమ్మ పారిపోయింది" గొంతులో భయమూ, విషాదమూ పోలేదు.

 

    "మేకపిల్ల బయమా?" గొణిగేడు మంగులు.

 

    అది నాయిడోల మేక. దాని మేపుకి సంవత్సరానికి ఐదు కుంచాల ధాన్యంకి నాయిడోలతో ఒప్పానం అమ్మకి. అది ఈ మద్దినే రెండు పిల్లల్ని యీనింది.

 

    "ఐతేటయింది?" మంగులు.

 

    "ఒక మేక పిల్లని సిందవెత్తికెలిపోయింది"

 

    "సిందవా... ఎప్పుడు?"

 

    "నిన్న"

 

    "మరి అమ్మో?"

 

    "పొద్దు ఏలమీద బయలెల్లి పోయింది" గుసగుసలాడినట్టుంది గొంతు.

 

    "ఇంతకేటైంది?"

 

    "మేకపిల్లని సిందవ తినీసిందని నాయుడికి తెలిసి పోయింది"

 

    "అయితే?"

 

    "ఇంటికి పిలిపించినాడు"

 

    "..........."

 

    "పంచాయితీ పెట్టించినాడు"

 

    "ఆ?"

 

    "అక్కడేటవుతాదో నీకు తెలీదేటి?"

 

    "ఏటన్నారు?"

 

    "మేకపిల్లని సిందవ తనకపోయుంతే... అది పెద్దదైయుంతే... మూడొందలు సేసునట"

 

    "మూడొందలా?" కళ్ళు పెద్దవి చేస్తూ...

 

    "మరేటి! మూడొందలు. ఒప్పానం పెకారం మేక పిల్ల సూబెట్టాల. నేకపోతే మూడొందలేనా కట్టాల"

 

    "కట్టకపోతే?"

 

    "పోలీసు కేసు. అదీ కాకపోత ఐదు సముచ్చరాలు కంబారికం"

 

    మేకపిల్ల అదేపనిగా అరుస్తోంది... హృదయవిదారకంగా.

 

    సిందవ బారిన పడ్డ పిల్ల మేక కోసమో!

 

    ప్రేమగా గడ్డి పరకలందించే అమ్మ కోసమో!!

 

    దాని రోదన అక్కడ చీకటిని కరిగించలేకపోయింది. ఆ పాకకి వెలుగివ్వలేకపోయింది.

 

    ఆ చీకటిలోంచే... రహస్యంగా ఓ కబురొచ్చింది. సంగమ్మీటింగుంది రమ్మని. ఆ కబురు వెంటే అడుగులేసాడు మంగులు. ఆ అడుగుల వెంట వెలుగు పయనిస్తుందని ఆశ. ఆ వెలుతుర్లో కొండా కొండా వరసలు కట్టి థింసా నృత్యమవుతుందని నమ్మకం.

 

    ఈలోగానే... కోడి కూసేసింది. గతుక్కుమన్నాడు మంగులు. పరుగూ నడక... పరుగూ నడకన షావుకారింటికి చేరేడు మంగులు. అప్పటికే లెగిసిపోయిన షావుకారి గుడ్డి దీపంలో డబ్బులు లెక్కెడుతూ కనిపించేడు.

 

    "ఏట్రా... ఇప్పుడు తెల్లారిందేటి?" కోపమైపోతాడనుకున్న షావుకారి ప్రశాంతంగా వున్నాడు చిత్రంగా.

 

    "రేతర నిద్దర్లేదు షాకారీ" సంజాయిషీ ఇచ్చేడు మంగులు.

 

    "ఏమీ?" ఏమీ ఎరగనట్టు అడిగేడు. మంగులుకి తెలుసు షావుకారి లేకుండా వూరి పంచాయితీ జరగదని. అయినా చెప్పేడు "నాయిడోల మేకపిల్లకి సిందవ తీనీసింది షాకారీ" 

 

    "అయితే? సిందవకి నెదకడానికెల్లేవేట్రా?" నవ్వేడు వెటకారంగా.

 

    మంగులు ముఖం ఎర్రబడింది. ఆ ఎరుపు చీకట్లోకనపడకుండా పోయింది.

 

    "అంతేనా, రాత్రిపూట సంగమ్మీటింగులకెల్లేవా?" షావుకారి మరింత దగ్గరికొచ్చి అడిగేసరికి... గతుక్కుమని వెనక్కి జరిగేడు మంగులు.

 

    "ఎల్లు... కారొల్సకెల్ల కయ్యన్న గడపలున్న సరుకెక్కించుకొచ్చీ. రేపు పెద షావుకారికి పంపాల. నీను టౌనెల్లాల"

 

    మంగులు నవ్వుకున్నాడు. ఆ బండి తిరిగి రాదని. ఆ సరుకులు జనాలకి పంచేస్తారని... చీకటింకా విచ్చుకొనే లేదు. తూరుపు కొండమీద ఆకాశం తెల్లబడుతోంది. ఈలోగా బండి గెడ్డ చేరింది. ఒడ్డున, ఉన్న చింత మాను క్రింద బండి ఆపేడు. కడుపులో బరువు గుడగుడలాడింది. బండి దిగి తుప్పలవైపు పరుగు తీసేడు. కడుపు భారం ఇలాగ దిగిందో లేదో... "అమ్మో సచ్చిపోయేన్రో దేవుడో!" అనంటూ గావుకేక వినపడింది. గతుక్కుమన్నాడు మంగులు. తుప్పలనుంచి బయటకొస్తూ ఎదురుగానున్న చెట్టిక్రింది దృశ్యం వణుకు పుట్టించింది.

 

    షావుకారి చిన్నకొడుకు హర్నాదు... చెట్టుకి కట్ట్శిసున్నాడు. అతని చుట్టూ సాయుధులైన మనుషులు అర్ధచంద్రాకారంలో నిలబడి వున్నారు. ఆయుధాలు ఆకలితో వున్నట్టున్నాయి. ముందు కొట్టేరు. ఏవో నినాదాలిచ్చేరు. ఒకరి చేతిలోని గొడ్డలి పైకి లేచింది. ముందు కుడిచేయి... ఆ తర్వాత కాళ్ళు.

 

    ఆ చెట్టు మొదలు... ఎర్రబడుతోంది.

 

    పరిస్థితి అర్థమైపోయింది మంగులుకి... పరుగందుకున్నాడు.

 

    పరుగు... పరుగు... పరుగు... ముళ్ళూ, మళ్ళూ... అడవి...గెడ్డా... అన్నీదాటి... గొడ్డలమ్మ కురికి... ప్రతియేడూ తుడుము డప్పులతో... కందికొత్తల పండగ జరిపించుకొని... ఊరి పూజలందుకొన్న గొడ్డలమ్మని తనలో దాచుకున్నట్టే తననీ దాచిపెట్టింది.

 

    ఒకరాత్రి, ఒక పగలు తిండీతిప్పలు లేక కళ్ళముందు తెగిపడిన కాళ్ళూ చేతుల దృశ్యాలతో ఊరికి దూరంగ దూరపు చుట్టాలింటి వైపు అడుగులేసాడు. అనుకున్నదొకటి, జరిగిందికొకటి. తనకు తెలిసిన మేరకి సరుకులు అప్పజెప్పడమే. మరి ఈ సంఘటనేమిటి?

 

    అనూహ్యంగా... భయంకరంగా... అంటే కొన్ని నిర్ణయాలు తనకు తెలియవన్నమాట.

 

    కొన్ని నెలల తర్వాత ఊరు చేరితే ఊరు మామూలుగానే వుంది. మంచం పట్టిన ముసిలోల్లు ఇద్దరు చనిపోవడం తప్ప ఊర్లో ఏ మార్పూ లేదు. కాని ఏదో సందేహం... ఏదో మార్పు. షావుకారి పిలవనూ లేదు. తను వెళ్ళలేదు కంబారితనానికి. వూర్లో వాళ్ళూ తనవైపుకి అనుమానంగానే చూస్తున్నారు, వీటికి సమాధానం కొన్ని రోజుల్లోనే తెలిసిపోయింది మంగులుకి.

 

    ఓ రోజు సాయంత్రం చివరిది కుంబిర్కి ముసిలోడు మంచమెక్కేడు. ఊష్ణం. మంచం కింద ఎన్ని కుంపట్లు పెట్టినా గజగజా వొణికిపోతున్నాడు. ఎజ్జోడి చేత ఎంత మందు రాయించినా లాభం లేకపోయింది. అప్పుడొచ్చేడు షావుకారి "ఏటైందిరా" అని. అందరూ అతని వైపు చూసేరు. "జొర్రం షాకారీ వొగ్గుండదూ... తగ్గుండదూ" అని చెప్పేరు. "ఎలగ తగ్గుతాదిరా ఇది మామూలు జొరమైతే తగ్గును" అని అనుమాస్పదంగా మూల్గేడు. అందరూ ఆలోచనలో పడ్డారు. "మొన్నామద్దిన మంగులు గాడు గెడ్డొడ్డు వొలకాలం కాంచి తచ్చాడ్డం నీను సూసేన్రా!" అని అక్కడినుండి వెళ్ళిపోయేడు.

 

    మరో రోజు గెడ్డలో స్నానం చేస్తున్నాడు ఒంటరిగా. నీటిలో నడిచొచ్చి తననెవరో వెనకనుండి కొట్టినట్లైంది. స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి వీధి మధ్యలో పడి వున్నాడు. కాళ్ళూ చేతులూ నులకతాళ్ళతో బంధించబడి వున్నాయి. ఒళ్ళంతా గాయాలతో... భరించలేని నొప్పితో... షావుకారి మాటలు ఒక్కొక్కటిగా వినపడుతున్నాయి.

 

    "ఈడుంటే... వూరు వొల్లకాడై పోద్ది. ఎవరు చేరదీసి గెంజి పోస్తారో ఆల్నే తినేస్తాడు. ఊరిల ఈడున్నన్నాళ్ళూ చావులు తప్పవు. ఆ తర్వాత మీ ఇష్టం"

 

    స్పృహ కోల్పోతూనే క్రమక్రమంగా... అర్థమై పోయింది మంగులుకి. గెడ్డ ప్రక్కనే కాగు పుల్ల విరిచి నోట్లో వేసుకుని నములుతున్నప్పుడే అనుమానం. అది స్మశానమని... తన వెనుక వచ్చింది షావుకారి కొత్త కంబారి మాసడని.

 

    "మనూర్ల చావులకి కారణమెవులనుకుంతున్నారు? ఈడే... ఊరినుంచి బయటపడ్డాడు ఇద్దరు ముసిలోలు సఫా. ఈడున్నాన్నాళ్ళూ వూరికి పట్టిన పీడ వదలదు. ఆ తర్వాత మీ ఇష్టం" షావుకారి మాటలు స్పష్టాస్పహ్టంగా వినబడుతూనే వున్నాయి మంగులుకి. అతని కళ్ళు మూతలు పడుతుండగా... వీధి చివర గడపలో బిడ్డని గుండెలకు హత్తుకుని కన్నీళ్ళు కారుస్తున్న భార్య కనపడింది.

 

    తల్లి ఒడిలోని పదకొండేళ్ళ సత్యం ఏదో అడుగుతున్నాడు ఏడుస్తూ.

 

    "అమ్మా! నాన కేటైందే!!"

 

    "నాన్ననెందుకు కొడుతున్నారే?"

 

    "సంపేస్తారా?"

 

    అన్ని ప్రశ్నలకీ ఏడుపే సమాధానమయింది.

 

    "ఎందుకే? ఎందుకే??" సత్యం పట్టు వీడలేదు. అమ్మ జుత్తులాగి అడుగుతున్నాడు ఏడుస్తూ.

 

    "మీ నాన్న సి...ల్లిం...గో...డ...ట...రా" బోరున ఏడుస్తూ నెత్తి బాదుకుంటూ.

 

    ఆ కేక కొండల్లో ప్రతిధ్వనించింది. మంగులు కనురెప్పలు మూతపడ్డాయి. ఊపిరాగిపోయింది. మంగులు భర్య మంచం పట్టింది. కొన్నాళ్ళకి ఆమె కూడా కన్ను మూసింది.

 

* * *

 

    "సార్... ఎక్కడ దిగుతారు?" కండక్టర్ పిలుపుతో కళ్ళు తెరిచేడు సత్యం. బస్ దిగేడు. శిథిలమైపోయిన బస్టాపు. అప్పటిదే. దాని ఎదురుగా కొత్తది... మిలమిల మెరిసే నీలి అక్షరాలను మోస్తూ. 

 

    "డాడీ! ఇంకెంత దూరం?" గీత అడుగుతోంది.

 

    "దగ్గరేనమ్మా... ఇదిగో ఇలా నడిస్తే అలా చేరి పోతాం" అంటూ నడక మొదలెట్టేరు.

 

    గీత ఎన్నో సందేహాలు అడుగుతోంది. అన్నిటికీ ఓపికతో సమాధానాలు చెప్తున్నాడు సత్యం. గీతకు ఈ వూరు కొత్త. ఈ నేల కొత్త. ఆమె ఇక్కడ పుట్టలేదు. నగరంలోనే పుట్టి పెరిగింది. 'ఇది తాత నడిచిన దారమ్మా... నేను పెరిగిన నేలమ్మా... మనని పెంచిన కొండమ్మా' అని చెప్పాలని... అన్నీ కూతురుకి తెలియాలని సొంత వూరికి ప్రయాణమయ్యేడు సత్యం. చిన్ననాటి గురుతులన్నీ ఒక్కొక్కటిగా... కథలు కథలుగా చెప్తూ వచ్చేడు.

 

    "ఇది ఒకప్పుడు చిన్న బండి గోర్జిరా. కొన్నాళ్ళకి మట్టి రోడ్డైంది. ఆ తర్వాత్తర్వాత ఇది ఇలగ తార్రోడ్డైంది. మా చిన్నప్పుడు ఈ దారంట ఒంటరిగా నడవడమంటే భయం"

 

    ఆ మాట పూర్తవకుండానే పెద్ద శబ్దం చేసుకుంటూ ఆటో వచ్చి ఆగింది ప్రక్కనే.

 

    "వస్తారేటి?" డ్రైవర్ తల బయటకు పెట్టి అడగ్గానే ఇద్దరూ ఎక్కేసారు.

 

    కొండ చుట్టూ తార్రోడ్డు. వేగంగా వెనక్కి పరిగెడుతోంది కొండ. కొండ అప్పటిలా లేదు. కొండ చుట్టూ ఎన్ని మార్పులో!!

 

    వూరువూరంతా మారిపోయింది. వీధులు విశాలమయ్యాయి. ఇళ్ళు ఎత్తు పెరిగేయి... సిమెంట్ పైకప్పులతో. ప్రతి ఇంటిమీదా డిష్ యాంటెన్నాలు. గడపలు గజాలదొడ్లుతోనూ... తమని తాము ఖైదీలుగా మార్చుకుంటున్నట్టు మనుషులూ మారిపోయేరు. కొత్త తరం... జీన్ ఫేంటు, టీ షర్టుల్లోనూ, పంజాబీ డ్రెస్సుల్లోనూ అడుగడుగునా సెల్‌ఫోన్ మ్రోతలతోనూ.

 

    మొదట పోల్చలేకపోయినా... గుర్తు పట్టేక ఆశ్చర్యపోయేరు ఊరంతా. కుశల ప్రశ్నలడిగి చేరదీసేరు. మామా, బావా, అన్నా, చిన్నాన్నా అని పలకరించి మాట్లాడేరు.

 

    "ఇన్నాళ్ళూ ఎక్కడున్నావైతే?" అడిగేడు చిన్ననాటి మిత్రుడు పకీరు.

 

    "ఇక్కడినుంచి పారిపోయాక పార్వతీపురంలో రైలెక్కీసేను. విజయవాడ రైల్వే స్టేషన్లోనే చాలా సంవత్సరాలు గడిపేను. ఆ తర్వాత అనాథ శరణాలయం... ఓ కంపెనీలో ఉద్యోగం... అలా గడిచిపోయిందిలే"

 

    "మరి పెళ్ళి?"

 

    "కంపెనీలోనే పరిచయమైంది. దానికీ ఎవరూ లేరు. అదిగో ఒక్కతే కూతురు. పేరు గీత. ఇక్కడే ఇల్లు కడితే బాగుంటాది గదా అని..."

 

    "ఇక్కడా?" ఆశ్చర్యపోయేడు పకీరు.

 

    "ఏమిటి కట్టకూడదా?"

 

    "ఇక్కడోళ్లందరూ సైట్‌లు కొనీసి టౌనెల్లిపోతుంటే నువ్వేటీ, అట్నునిడిటు?"

 

    "ఇన్నాళ్ళూ టౌనులున్నాను కదా" అని "సరేగానీ ఊర్లో సంగతులేంటి?"

 

    "ఊరుకేమీ? పైన పటారం... లోన లొటారం"

 

    "ఏమీ?"

 

    "సూడ్డానికి డాబాలు... సిమెంట్ రోడ్లు... ఇంటిల మాత్రం తిండిగింజలుండవు"

 

    "అంటే వూరు బాగాలేదా?”

 

    "బాగులేకేమి? సూపరు. గుంటలందరూ టిప్పుటాపు మీదున్నారు సూసుండవా? ఏ గుంటా, గుంటడైనా ఒక్క తీరుగున్నారా సెప్మి? ఒకడి మాట ఇంకొంకడినడు. సిన్నా పెద్దా మంచీ మర్యాదా... వున్నాయా ఎవులికైనా? ఖైనీ, గుట్కా,గుడుంబా,సిగరెట్టు, మందూ ఏ అలవాటు లేనోడెవడూ లేడు" చెప్పుకుపోతూనే ఉన్నాడు. 

 

    "మామా ఏది ఏమైనా జీడితోటలు, ఉపాది పనులొచ్చి జనాల్ని సెడగొట్టేయి" అంటూ ట్రాక్ సూట్‌లో ఉన్న వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.

 

    "మీరూ?" అనుమానంగా అన్నాడు సత్యం.

 

    "కృష్ణని బావా! మీ జోగులు మామ కొడుకుని" అని పరిచయం చేసుకుంటూ ప్రక్కనే కూర్చున్నాడు.

 

    "సారీ బావా, గుర్తు పట్టలేకపోయేను. ఇప్పుడేం చేస్తున్నావు?"

 

    "మనూర్లోనే... డ్రిల్లు మేస్ట్రు" అని చెప్పేడు పకీరు.

 

    "మరేమైతే, మీ మేనగోడలిని నీ దగ్గరే చేర్పించేస్తాను"

 

    "ఇలాంటి బడిలో మీ పిల్ల చదువుతాదా?" అన్నాడు నిష్ఠూరంగా.

 

    "ఎందుకు చదవదు గానీ... జీడి తోటలు జనాల్ని ఎలాగ సెడగొట్టేయి?" మునుపటి చర్చని కొనసాగించేడు. 

 

    "సెడగొట్టవేటి? పని చెయ్యక్కర్లేదు, డబ్బు మన్నాన డబ్బు. డబ్బు సేతికందిందంతే... మనోల్ని ఆపగలమేటి? నీకొకటి తెలుసునా... యవసాయం సేసినోడికంటే కొండ మీద రెండు జీడీమొక్కలేసుకున్నోడు బాగున్నాడు"

 

    "అంటే...?" అడిగాడు సత్యం. "ఎవసాయం బాగులేదని" ఖచ్చితమైన ముగింపు ఇచ్చినట్టు చెప్పేడు పకీరు. "నిజమే, వ్యవసాయానికి రోజులెప్పుడో చెల్లిపోయాయి..." గొణుక్కున్నాడు సత్యం.

 

    "బాగున్నారండీ!" ఎర్రగా ఎత్తుగా వున్న అందమైన యువకుడు అడిగితే "మీరూ" అన్నాడు సత్యం.

 

    "నేను శ్రీనునండీ. కృష్ణమూర్తి గారి మనవడిని" అంటూ మంచం వేసేడు కూర్చోమన్నట్టు.

 

    నిజమే. షావుకారి కూతురు కొడుకు. పోలికలు గుర్తొచ్చేయి. ఇల్లు కాస్త మారింది. సిమెంటు బెంచీల మీద సామాన్లు అడ్డదిడ్డంగా పడివున్నాయి. గడపకెదురుగా చిన్న బడ్డీ. ప్రక్కనే కాయిన్ బాక్సు. చిల్లర సామాన్ల నుంచి చీప్ లిక్కర్ దాకా వున్నాయక్కడ. "వ్యాపారమెలా వుంది?" అడిగేడు సత్యం.

 

    "ఏమి వ్యాపారమండీ... ఆ రోజుల్లో అయితే తిరుగుండేది కాదండీ. ఈ రోజు అలగ లేదండీ"

 

    "ఏమీ?"

 

    "మొన్నే... గూడ నుండి ఒక ముసిలోడు పది చీపుర్లు తెచ్చేడండీ. నాకిచ్చీరా అన్నాను... 'ఎంతా' అన్నాడు. రేటుంది గదా అని 'ముప్పై అయిదు' అన్నాను. కాదు ఏభై అన్నాడు. అయితే ఒద్దులేరా అనీస్తే... అలాగే మోసుకెలిపోతున్నోడు. కరువులు మేష్టు కెదురయ్యేడు. ఆలమ్మాయ్ టౌనులుంది గదా... అవుసరం అని ఏబై ఇచ్చీసి తీసుకున్నాడు"

 

    "ముసిలోడికి మంచి రేటొచ్చినట్టే కదా" అన్నాడు సత్యం.

 

    "ఇలగైతే మా వ్యాపారమేటైపోవాలండీ?" అని "ముసిలోడికి మంచి జరిగిందన్నారు గదా... అదే ముసిలోడు మరొక రోజు పాతిక చీపుర్లు మోసుకొచ్చేడు. నీనే మల్లా అడిగేను. 'ఏబైకి తగ్గనూ' అన్నాడు. ఆరోజు కరువులు మేష్టూతే ఉజ్జోగస్తుడూ... అవుసరమున్నోడూ... ఎనకైనా కొంటాడూ... నీను కొనాలంతే మార్కెట్‌ల రేటుండాల గదరా' అన్నాను. ఆ మాటకి ముసిలోడు ఏటి సేసేడు తెలుసండీ... మొల్లోంచి సెల్ తీసి పెదషావుకారికి ఫోన్ చేసేడండీ... నా మీద నమ్మకం లేక"

 

    "ఔనా?!" ఆశ్చర్యపోయేడు సత్యం.

 

    "ఔనండీ... ఇప్పుడంతా ఆన్‌లైనే"

 

    "అయితే ఏమైందీ?"

 

    "ఏటవడమేటండీ... 'నలబై ఇస్తానూఅ తెచ్చీ' అన్నాడు పెద షావుకారి. తీరా కష్టపడి మోసుకెల్తే... పాతిక లెక్కన యిచ్చీసి పంపించీసేడు"

 

    "అదేంటీ?" మరింత ఆశ్చర్యపోయేడు సత్యం.

 

    "ఇంద ఇప్పుడే ఫోనొచ్చిందీ... రేటు తగ్గిపోయిందీ' అని పెదషావుకారి జేబులోని ఫోను తీసి సూపెట్టేడు... అలాగని ఆ ఫోను నిజమని అనుకుంటున్నారా? ఫోను మాట్లాడినంత మాత్రాన రేటు పసిగట్టీగల్డా? ఆ సీపుర్లు తిరిగి తేగల్డా? యీదీదికి తిప్పి అమ్మగల్డా? సచ్చినట్టు ఆ రేటికిచ్చీసి తిరిగొచ్చేసేడ్ ముసిలోడు" అని ముగించేడు శ్రీను ఏది చేసినా మేమే చెయ్యాలన్నట్టు.

 

    ఇన్నేళ్ళలో... ఆధునిక సౌకర్యాల అందుబాటు ఎవరికి లాభం చేకూర్చింది? మధ్యవర్తులు ఏమౌతూ వచ్చేరు? లాభాలు ఎక్కడికి చేరుతున్నాయి?

 

    "ఏది ఏమైనా... జనం తెలివి మీరిపోయేరండీ?" అన్నాడు శ్రీను.

 

    "కాదు... కాదు... తెలివి జనానిది కాదు" గొణిగినట్టే అనుకున్నాడు సత్యం.

 

    "జనానికి కట్టల కట్టలు చేతికందీయాల" పకీరు యథాలాపంగా అన్నాడు.

 

    "అందెస్తుంది కదేటీమద్దిన..." అని నసిగేడు కృష్ణ.

 

    "కట్టలేటీ? అందీడమేటీ?" అనుమానంగా అడిగేడు సత్యం.

 

    ఏట్లేదూ అనన్నాడు గానీ "దీనంతటికీ అసలు కారణం మరొకటుంది" అని అర్థాంతరంగా ఆపేడు కృష్ణ.

 

    "ఏటి బావా... అది?" కుతూహలంగా సత్యం కళ్ళు చిన్నవి చేసేడు.

 

    "ప్రోజెక్టుల పవరండీ" అన్నాడు పకీరు.

 

    "పవరా? పవర్ ప్రోజెక్టా?"

 

    "రెండూ" అని నర్మగర్భంగా తలవూపేడు కృష్ణ.

 

    "ఎలాగ?"

 

    "అవన్నీ ఇప్పుడెందుకులెండి" అంటూ లేచేడు.

 

    "కూర్చో మామా, ఇప్పుడెక్కడికి ఎలామూ?" అని సత్యం అంటుంటే

 

    "పద బాబా అలా అండుచుకుంటూ మాట్ట్లాడుకుందా"మని లేచేడు కృష్ణ.

 

    నడుస్తున్నారు ముగ్గురూ.

 

    "ఈ కొండవతల పవర్ ప్రోజెక్టొకటి కడతారట కదా మామా!! బూములన్నీ కూడబెడుతున్నారు. మీరొగ్గీసిన బూమికి ఆల్రడీ మన పాత పెసిరెంటు డబ్బుల్దొబ్బేడని ఊర్లందరూ అనుకుంతున్నారు తెలుసునా?" వివరించబోయేడు కృష్ణ.

 

    "అదొక పేద్ద కతరా దద్దా!" అని పకీరు.

 

    "చెప్పు... చెప్పు" అని సత్యం.

 

    "గవర్మెంటు కట్టాలంతాది... మనోలు వొద్దంతారు" రెండు ముక్కల్లో తెంపీసేడు పకీరు.

 

    "గవర్మెంట్‌ని ఎదిరించాలంతే ఎవుడి తరమూ? అధికార్లు... పోలీసులు... బలమూ, బలగమూ... అంతా అటే"

 

    "ఎదిరించాలి... తప్పదు" మళ్ళీ గొణిగినట్టే అన్నాడు సత్యం.

 

    "ఎదిరించాలి... నిజిమేగాని మనిసాక్కాసి లాగుతుంతే... ఎదిరించగలమా?" సందేహం వెలిబుచ్చేడు మరొకడు.

 

    "అదే... అందుకే ఒక నాయకుడు కావాలి" గొణిగేడు సత్యం.

 

    "ఈ మద్దిన ఊరంతా గందరగోళంగా ఉందిరా మామా"

 

    "ఏమి?"

 

    "ఎవుడెటుకాసి మాట్లాడుతాడో అర్థమవకంటంది"

 

    "ఏమైందీ?" అడిగేడు సత్యం.

 

    "ఒకార్నెల్లు క్రితం, కలెక్టరుగారు మీటింగు పెడతారని, అందరు రావాలని దండోరా ఏయించేరు, ప్రెజాబిప్రాయామని. మాంచి పనులు టైములోన ఎపుడెల్తాడు? అయినా కమీనిష్టు పార్టీ వోలు పున్యమా అని ఒకలిద్దరైనా వొచ్చేరు. ఆలేటంతారో... ఈలేటతారో ఎవుడికీ అర్థం గాలేదు. ఎవుడో ఒక మాటన్నాడు... మరొకడెవుఆడో ఒక రాయిసిరేడు... అదే అదుననుకొని పోలీసులు రెచ్చిపోయేరు... సబ వాయిదా పడింది. మల్లా ఈ మద్దిన ఎడతారని బోగట్టా" పకీరు ముగించేడు.

 

    "అయితే ఈ మద్దిన ఒక పుకారొచ్చింది" పకీరు వంగి చెప్పేడు.

 

    "ఏమని?" సత్యం.

 

    "పేక్టరీ వోలు ఒకడికి తెలీకుండా మరొకడిని రాత్రి పూట ఒంటరిగా పిలిపిస్తున్నారని"

 

    "పిలిపించీ?"

 

    "నోట్ల కట్టలు పంచుతున్నారని. అదంతా సీనుగాడి ద్వారా జరుగుతుందని మా అనుమానం..." అని అర్థాంతరంగా ఆపేడు కృష్ణ.

 

    "ఎలాగ?"

 

    "ఈడు సిన్నింటింటోడనుకుంతున్నావా? సూడ్డానికి సిన్ని గుంటడిలాగ, సిన్న బడ్డీ ఎట్టుకొని బతుకుతున్నోడిలాగ కనపడుతున్నాడు గానీ ఈడు సేసిన యేపారం సిన్నది కాదు"

 

    "ఏమిటది?"

 

    "మార్గదర్శిలు సిట్‌ఫండ్లు, రియలెస్టేట్లు, ఆర్డీలు, ఇన్సూరెన్సులు... ఒకటేమిటి? అలపొంటోడు... ఈ మద్దిన పవర్ ప్రోజెక్టోలతో చేతులు కలిపినాడని పుకార్లు సికార్లు చేస్తన్నాయి"

 

    "కలిసేం చేస్తాడు?"

 

    "చెయ్యాల్సిందంతా చేస్తున్నాడు" అందుకున్నాడు కృష్ణ.

 

    "ఏమిటది?"

 

    "జనాన్ని కూడబెట్టడం, ఫేక్టరీ వోలకి జనం కావాలి... జైకొట్టే జనం కావాలి... ప్రజాభిప్రాయ సేకరణలో 'వూ' కొట్టే జనం కావాలి. అందుకు ఎవుడొప్పుకుంటాదు? ఒప్పుకున్నా ఒట్టిగొప్పుకోడుగదా! డబ్బు ఎర జూపాల! అందుకు ఒక మనిసి కావాల... నమ్మకమైనోడు... సల్లగా పని చెయ్యగలిగినోడూ కావాలి. అప్పుడు దొరికేడీ సీనుగాడు"

 

    "గానీ... అది నిజమో అబద్దమో తెలీకుంటుంది మామా, ఎవుడినడిగినా 'ఔనటా' అని మొకము తిప్పీసి ఎలిపోతున్నారు గానీ, ఎవుడూ వులకడూ, పలకడూ..."

 

    "లేదు, లేదు... అందులో నిజం లేకపోలేదు"

 

    "అంతే? ఇదంతా ఆడే సేస్తున్నాడంతావా?"

 

    "అవ్వొచ్చు. అలాంటి అవసరం మనూర్లో ఇంకొకడికి లేదు"

 

    పకీరు ముఖంలో పొద్దు ములిగిపోతున్న దృస్యం... కృష్ణ కళ్ళలో ఊరుని కమ్ముకుంటున్న చీకటి దృశ్యం...

 

* * *

 

    సత్యం ఇంటికి పునాది రాళ్ళేసాడు. ఊర్లో అతని స్థానం గట్టిపడింది. అందరికీ దగ్గరివాడయ్యేడు. ప్రతీరోజూ ప్రతీ ఇంటికీ వెళ్లేడు. అందరితోనూ కలగలసి పోయేడు. పండుగలోనూ, పబ్బంలోనూ... కష్టంలోనూ, సుఖంలోనూ... అంతా తానైనట్టు. 

 

    ఓ వెన్నెల రాత్రి...

 

    ఊరందరినీ ఇంటికి రమ్మని ఆహ్వానించేడు.

 

    "ఏట్రోయ్ బావా! మా కోడలు గానీ అలికిడి సేసిందేటి?" అంటూ వచ్చి కూర్చున్నారు... కృష్ణ తదితర బృందం.

 

    నవ్వుతూ అందరినీ పలకరించేడు.

 

    "ఇది నవ్వుకోవాల్సిన సమయం కాదు బావా!"

 

    ఆ స్వరంలోని గంభీరతకి అందరూ నిశ్శబ్దమై పోయేరు.

 

    "ఏటైంది బావా!" అని దగ్గరకొచ్చేరు మిత్రులు.

 

    "ఊరు బావా, ఊరుకి పీడ పట్టింద్ బావా... తేరుకోక పోతే నాశినమైపోద్ది బావా"

 

    "ఏటి దద్దా! సరిగ్గా సెప్పురా నాయినా" అంటూ అసహనాన్ని ప్రదర్శించేరు కొందరు.

 

    "మనూరు ఎప్పుడు కట్టేరో తెలుసునా?" కలలో అడిగినట్లు అడిగాడు సత్యం.

 

    "కట్టడమా? అదెవులికి తెలుస్తాదిరా మనవడా... మా తాత ముత్తాతల కాసి ఈ వూరిక్కడే వున్నదా మరేటి? అయినా ఆ వూసెందుకురా ఇప్పుడు?" నోట్లో చుట్ట తీసి బయటికి వుమ్ముతూ అన్నాడు జన్ని తాత.

 

    "ఎందుకా? మరొక ఐదేళ్ళు పోతే ఈ వూరు ఇక్కడ, ఇలాగ వుండదు" అన్నాడు సత్యం.

 

    నిశ్శబ్దం.

 

    "ఊరుండకపోవడమేట్రా నాయనా!" జీను ఫేంట్ యువకుడు లేచేడు అసహనంగా.

 

    "ఉండకపోవడమంటే... ఉంటాది గానిలగుండదు"

 

    "అంటే?"

 

    "తినడానికి తిండుండదు, తాగడానికి నీళ్లుండవు"

 

    "ఇంకా నయిం... బతకడానికి మనముండమన్నావుగాదు" అంటూ ఒక యువకుడు సెటైరేసేడు.

 

    "ఔను, అదే నిజం" అన్నాడు సత్యం స్థిరంగా. 

 

    "ఏట్రా బావు! సెప్పేదేదో తిన్నగ సెప్పొచ్చు గదా?" ఓ మధ్య వయస్కుడడిగాడు.

 

    "అదీ చెప్తాను. ముందివి చూడండి" అని కొన్ని ఫోటోలని అందించేడు.

 

    ఎడారి ప్రాంతంలో బ్రతికున్న శవాలలాంటి మనుషుల చిత్రాలవి. ఎండిపోయి, బక్కచిక్కిన ఆలమందలు, బొగ్గు పూసినట్లుండే ఇంటి పైకప్పులు...

 

    "ఏటీ ఫోటోలు? ఇవన్నీ మాకేలా?" అనుమానం వ్యక్తం చేసేడు మరో నడి వయస్కుడు.

 

    "కొన్నాళ్ళు పోతే మనూరు కూడా ఇలగే తయారవుద్ది" అన్నాడు సత్యం సాలోచనగా.

 

    "ఎందుకూ?" అందరి అనుమానాన్నీ ఒకడడిగాడు.

 

    "పవర్ ఫేక్టరీ పెడితే అంతే మరి..."

 

    "నిజిమా?" అందరి కళ్ళలో భవిష్యత్ చిత్రం!!

 

    "ఈ ఫోటోలు అబద్ధం చెప్పవు... ఇవి ఇప్పటికే పెట్టిన ఫేక్టరీ చుట్టూ వున్న గ్రామాలవి. చుట్టూ పది పదిహేను కిలోమీటర్ల మేర బొగ్గు కమ్మేస్తుంది. పీల్చుకోడానికి గాలి... తాగడానికి నీరు... తినడానికి తిండి అంతా బొగ్గు... బొగ్గు. మనుషులు, పశువులు, మొక్కా మోడూ అంతా బొగ్గుబొగ్గై బతుకులన్నీ బుగ్గైపోతాయిరా... నాకు తెలుసు. నీనిన్నాళూ పని చేసింది ఇలాంటి ఫేక్టరీలో నేన్రా. నీను పడ్డాన్రా ఆ బాదలన్నీ. మీకు తెలీదురా... నాకు తెలుసునురా... నాకు తెలుసును" కలవరిస్తున్నట్టు అన్నాడు.

 

    "మరి మా బూముల సంగతేట్రా? రేటు బాగా వొచ్చిందని అప్పుడిచ్చీసినాము. అవి ఫేక్టరీ కోసమని ఇప్పుడు తెలిసింది. మనమొద్దంటే మాత్రం ఆ భూములు తిరిగొస్తాయా... ఫేక్టరీ కట్టడమాపేస్తారా?" అప్పటికే ఎకరా భూమిచ్చీసిన బిడ్డికోడు దీనంగా అన్నాడు.

 

    "అదీ నిజమే కానీ సమయం ఇంకా దాటిపోలేదు" సాలోచనగా అన్నాడు సత్యం.

 

    "ఎలాగ?" అందరి తరఫున అన్నట్టు ఒకడడిగేడు.

 

    "మళ్ళీ మీటింగు పెడతారు. ప్రజాభిప్రాయ సేకరణ" అని ముగించేడు సత్యం.

 

* * *

 

    శ్రీను బడ్డీ ముందు ఒక మోటారు బైక్ ఆగింది. ఇద్దరు వ్యక్తులు దిగి ఇంటిలోకి నడిచి వెళ్ళేరు. వెనుక శ్రీను కూడా వెళ్ళేడు."ఏమిటి విషయం?" మంచమ్మీద కూర్చుటూ అడిగేడు కొత్త వ్యక్తి.

 

    "నిన్న మొన్నటివరకూ బాగనే వుంది. కానీ 'సత్యం' వచ్చిన తర్వాత వూర్లో ఏదో మార్పొచ్చినట్టు అనుమానం..." అర్థాంతరంగా ఆపేడు శ్రీను.

 

    "ఎవరతను?" అడిగేడు మరో వ్యక్తి.

 

    "అతను..." అని ఆగేడు శ్రీను.

 

* * *

 

    'టక్...టక్...టక్...'మని ఎవరీ తలుపు కొట్టిన చప్పుడైతే బయటికొచ్చేడు సత్యం. ఎదురుగా ఓ అపరిచిత వ్యక్తి... అనుమానాస్పదంగా.

 

    "ఎవరూ?" అని అడిగేంతలోనే... "సత్యం అంటే మీరేనా?" అన్నాడు.

 

    "ఔను. ఏమి?"

 

    "మీరొకసారి స్టేషనుకు రావాలి. ఎస్సై కబురు"

 

* * *

 

    ఒళ్ళంతా గాయాలతో సత్యం. చుట్టూ వూరి జనం. ప్రక్కనే అమ్మ చుట్టూ పెనవేసుకొని ఎన్నో ప్రశ్నలతో గీత.

 

    "అమ్మా! డాడీకేమైందీ?"

 

    "డాడీనెక్కడికి తీసికెళ్ళేరు?"

 

    "ఎందుకు లేవలేకపోతున్నారు?"

 

    "అందరూ ఎందుకు ఏడుస్తున్నారు?" గీత అడుగుతోంది గుక్క తిప్పుకోకుండా. కళ్ళలో విషాదాన్ని కక్కుతున్న సత్యం భార్య అరిచింది "మీ నాన్న ...ఇ...న్...ఫా...ర్మ...ర...టే... తల్లీ..."

 

* * *

 

    "డాడీ నాకూ నేర్పించూ" ఒకటే అల్లరి చేస్తోంది గీత.

 

    "తప్పకుండానమ్మా!" అని గీతని కృష్ణుడి ముందు నిలబెట్టేడు సత్యం. ఆమె చేతికి 'బౌ'ని 'యారోస్'ని అందించేడు కృష్ణ.

 

    గీత విల్లు ఎక్కు పెట్టింది. నారిని తనవైపుకి లాగింది బలంగా. బాణం మొన చివరనుండి చూపు సారించింది.

 

    "డాడీ! దేన్ని కొట్టాలి?" అడుగుతోంది గీత.

 

    సత్యం ఆమె కళ్ళలోకి చూసేడు. లక్ష్యం ఆమె ఎంచుకోగలదు. అతనికి తెలుసు... గీత గురి తప్పదు.

 

(నవ్య వీక్లీ 1 మే,2013 సంచికలో ప్రచురితం)

Comments