హామీ...!! - ఏ.వి.ఎం.

    
తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం గ్రామంలో అది ఒక రైతు గృహం!     "ఇదుగో...ఏవయ్యోయ్!ఇటురా" టీ.వి.చూస్తున్న రామలక్ష్మి, బయట గేదెను కట్టేసే మోకును అల్లుతున్న గోపాల రెడ్డిని పిల్చింది. అది పిలుపు కాదు గావుకేక.     "ఏం నసపెడతావే! ఇంట్లో వున్నంతసేపూ ప్రశాంతంగా ఏ పనీ చేసుకోనివ్వవూ!" అంటూ లోలోపల గొణుక్కొంటూ "ఆ...ఏంటీ" అని పైకి నవ్వుతూ లోపలికొచ్చాడు భర్త గోపాల రెడ్డి.     "ఆ గొణుగుడే వద్దన్నానా!?"     "నేను లోపల అనుకున్నది నీకెట్లా తెలిసిందీ!?"     "ఆ... నీకు అంతకన్నా ఏం తెలుసుగనకా!"     "సర్లే...సర్లే... ఏంటో చెప్పు!"

    "ప్రాధాన్యతా రంగాలకు బ్యాంకులు అప్పులు ఇస్తాయట! దేశంలో వ్యవసాయం ప్రాధాన్యతా రంగంలోకే వస్తుందట! దేశ ఆర్థిక పురోగతి సాధించాలంటే వ్యవసాయం వృద్ధి చెందాలనీ, దేశ జనాభాలో 80 శాతం వ్యవసాయం ఆధారంగానే జీవిస్తున్నారనీ, వ్యవసాయానికి బ్యాంకులు ఎక్కువ శాతం రుణసదుపాయం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారనీ, రైతులందరూ కొద్ది పాటి హామీలు చూపిస్తే చాలు రుణం మంజూరు చేస్తారనీ మన ముఖ్యమంత్రిగారు టీ.వి.లో చెబుతున్నారు. మీరూ ప్రయత్నం చెయ్యండి" అన్నది రామలక్ష్మి భర్తతో. 

    "మనకున్న ఐదెకరాల పొలానికీ విత్తనాలు, ఎరువులకూ లక్ష రూపాయలు కావాలి! అయినా నాకు లక్ష రూపాయలు కలిసొస్తుందని నా చిన్నప్పుడు ఓ కోయ దొర చెప్పాడు"

    "ఆ...సింగినాథం, మీ జాతకం పక్కన పెట్టండి. మన దగ్గర పది వేలు వున్నాయి అవి చాలవు అని దిగులు పడుతున్నారు గదా!"     "వాళ్ళు టి.వి.లో చెప్పినంత తేలిగ్గా రుణాలు అందవూ!"
    "మీరు, కాస్త బుర్ర వుపయోగించండీ! ఎక్కువ ఎవరికి చేతులు ఎలా తడపాలంటే అలా తడిపి రుణం తెచ్చుకోండీ, కాకపోతే మన దగ్గర వున్న ఆ పాతిక వేలు ఖర్చు అవుతాయంతే!" అని తెలివిగా తేల్చేసింది రామలక్ష్మి.

    గోపాల రెడ్డి ఆలోచనలో పడ్డాడు.
    "నీకు ఇంట్లో పనికి బుర్ర పని చేయదులే. ఆ ఎదురింటి కృష్ణారెడ్డి ఒక్క ముక్క చెబితే చాలు, హనుమంతుణ్ణి చూసిరమ్మంటే కాల్చి వచ్చినట్లు పనంతా చక్క బెడతావు" అని సాధిస్తూ "పొలం దస్తావేజులివిగో బ్యాంకుకు వెళ్ళి విషయం కనుక్కురా" అంటూ గోపాల రెడ్డిని బయటకు తోసి ఢామ్మని తలుపులు వేసుకుంది రామలక్ష్మి కోపంగా!     "నీది అర్థం లేని కోపం" అని విసుక్కుంటూ దస్తావేజులు పట్టుకుని బ్యాంకుకు వెళ్ళాడు గోపాల రెడ్డి. గోపాల రెడ్డి బ్యాంకు మేనేజరుని కలిసి వచ్చిన పని తెలిపాడు.     "నిజమే ఎకరాకు ఇరవై వేలు ఇస్తాం. నీకున్న ఐదెకరాలకు కలిపి లక్ష రూపాయలు ఇస్తాం!"

    "అబ్బో... ఇంత తొందరగా లక్ష రూపాయలు రుణం ఇస్తారా!?" మనస్సులో అనుకుంటున్నాడు గోపాల రెడ్డి.     "రెండు మూడు సర్టిఫికేట్లు తేవలసి వుంటుంది! అవి తెచ్చిచ్చిన మరుక్షణం నీ చేతుల్లోనే" అన్నాడు మేనేజరు.     "అవి ఏమిటో కాగితం మీద రాసివ్వండి" అన్నాడు ఆత్రంగా!     "వి.ఆర్.ఒ. సర్టిఫికేట్, నో అబ్జక్షన్ సర్టిఫికేట్, నో డ్యూ సర్టిఫికేట్, మీ మండల ప్రెసిడెంట్ హామీ పత్రం కావాలి" మేనేజరు వివరించాడు.     "ఆ సర్టిఫికేట్లన్నీ తీసుకుని మీకు కనబడతా అని బింకంగా అన్నాడే గాని, అవన్నీ ఎలా తేవాలి, ఎవర్ని కలవాలో తెలియక తికమక పడుతూ బ్యాంకు మెట్లు దిగుతూవుంటే, "గోపాల రెడ్డి గారూ ఇటు రండి" అన్న పిలుపుతో వెనుదిరిగి చూశాడు తనను 'రెడ్డి గారూ' అని కూడా సంబోధించింది ఎవరా అని అనుకుంటూ! 

    "నా పేరు అరుణాచలం, నేనీ బ్యాంకు ఉద్యోగినే! వాళ్ళు కోరిన సర్టిఫికేట్లన్నీ తేవడం మీవల్ల కాదు. కష్టపడి తెచ్చినా ఇంకేదో తెమ్మంటారు!"     "అవును... నిజమే!"     "అందుకే ఆ పని నేను చేసి పెడతా! ఓ పాతిక వేలు ఖర్చవుతుంది!"     "నా దగ్గర పదివేలే వున్నాయి!"     "మిగతా పదిహేను లోన్ తీసుకున్నాక ఇవ్వూ! రేపు రా అన్నీ రెడీ చేస్తా" అన్నాడు అరుణాచలం పదివేలు లెక్కపెడుతూ.     "సరే...సరే...!" అన్నాడు గోపాల రెడ్డి అంత త్వరగా పని అవబోతున్నందుకు సంతోష పడుతూ.

* * * * * 

    మధ్యాహ్నం రెండు గంటలు...

    "గోపాల రెడ్డీ పేపర్లన్నీ రెడీ అయినాయి. సర్టిఫికేట్స్ అన్నీ రెడీ సరిగ్గానే ఉన్నాయి ఒక్క హామీ పత్రం మీద మండల ప్రెసిడెంట్ గారి సంతకం తప్ప" అన్నాడు బ్యాంకు మేనేజరు.     "మళ్ళీ ఇదేం తిరకాసండీ!"     "హామీ పత్రం మీద సంతకం మీరే చేయించుకోవాలి" అన్నాడు అరుణాచలం.     "అదెవరు చేస్తారు నాకూ!" (చేతి దాకా వచ్చిన అప్పు ఎక్కడ జారిపోతుందో అని మనస్సులో అనుకుంటూ) పైకే అన్నాడు జీరబోయిన గొంతుతో.

    "నేను చేస్తాను గోపాల రెడ్డీ" అంటూ తన అనచరగణంతో అప్పుడే లోపలికి వచ్చాడు మండల ప్రెసిడెంట్.
    "రండి...రండి... సమయానికి వచ్చి నన్ను ఆదుకుంటున్నారు" అని ప్రెసిడెంట్‌ని ఆహ్వానించి తను నుంచొని కుర్చీ చూపించాడు గోపాల రెడ్డి.
    "ఈ గోపాల రెడ్డి చాలా మంచివాడు. సత్య సంధుడు. దాత. ఇలాంటి వారికి హామీ సంతకం చేస్తే నాకూ పేరొస్తుంది. మేనేజరు గారూ! చెప్పండి ఎక్కడ సంతకం చెయ్యాలో, నేనూ మా అనుచరులూ అందరం చేస్తాం" అన్నాడు ప్రెసిడెంట్.
    "మీరు హామీ సంతకం చేస్తే మాకింకేం కావాలీ, ఈ గోపాల రెడ్డికి క్షణాల్లో లోను మంజూరు చేసి, లక్ష రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇస్తా" అన్నాడు బ్యాంకు మేనేజరు చిన్నగా నవ్వుతూ.

    పనిలో పనిగా తన అనుచర గణం పేరుమీద పాతిక లక్షల లోను తీసుకున్నాడు ప్రెసిడెంట్. దానికి హామీ సంతకం బ్యాంకు మేనేజరే చేశాడు గర్వంగా!

    అన్నీ అయిన తర్వాత ప్రెసిడెంటు గారూ, వారి అనుచరగణం వెళ్ళిపోయారు. తన కమీషను మినహాయించుకుని మిగిలిన డబ్బు గోపాల రెడ్డికి ఇచ్చాడు అరుణాచలం. అప్పుడు సమయం ఐదు గంటలయ్యింది. బ్యాంకుకు తాళం వేసి తాళాలు తీసుకుని ఇంటికి బయలు దేరాడు బ్యాంకు మేనేజరు. తన జేబుకి ఈ రోజు పండగ. గోపాల రెడ్డి నుండే కాక ప్రెసిడెంట్ అనుచర గణం నుండి కూడా కమీషన్ కొట్టేశాడు మేనేజర్. తన భార్యకు ఏ నగలు చేయించాలా అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు. జ్యూయలరీ ఎడ్వర్టైజ్‌మెంట్లన్నీ కళ్ళముందు గిర్రున తిరుగుతున్నాయి. కలిసే కాలం వస్తే నడిచే కొడుకులు పుడతారంటే ఇదే మరి అని అనుకుంటూ, వచ్చే దారిలో ప్రెసిడెంటు గారి ఇంటి ముందు జనం మూగి వున్నారేమిటా అని తొంగి చూశాడు కుతూహలంగా!
    మధ్యాహ్నం ఒంటిగంటకు పొలం దగ్గరున్న మండల ప్రెసిడెంటునీ, ఆయన అనుచర గణాన్నీ నక్సలైట్లు కాల్చి చంపారంట! విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ శవాలనన్నింటినీ తీసుకొచ్చి అయిదు నిమిషాలయ్యింది అన్న సంగతి విన్న బ్యాంకు మేనేజరు నోట మాట రాక అక్కడే కుప్ప కూలి పోయాడు.
    రైతు గోపాల రెడ్డికి లక్ష ఆస్తి కలిసి వచ్చింది ఈ రూపంలో!!!
Comments