హతోస్మి - పి.వి.సాయి సోమయాజులు

    ఆదివారం.

    నేను ఊగుతున్న స్టూలు మీద కూర్చున్నాను. ఏ క్షణాన స్టూలు విరిగి కింద పడతానో అని భయంగా ఉంది. నా కొడుకు బైట స్కూటరు మీద దిగులుగా కూర్చున్నాడు.  మా ఆవిడ కూడా దిగులుగా కూర్చుంది. ఇంతకీ మేము ఎక్కడున్నామో తెలుసా? 

    కంప్యూటర్ రిపైరింగ్ సెంటర్.

    'ఎవరైనా  ఆదివారం రోజు నాడు,  వారియొక్క కుటుంబసభ్యులతో సినిమాలకీ, షికారుకి వెళ్తారు గాని...మేమేంటా ఇక్కడి కొచ్చాము’ అని అనుకుంటున్నారా? ప్రస్తుతం అది మా ఖర్మగా భావించాలి, అంతే. 

    ఎవరైనా ఈ సిచువేషన్లో "బాబూ...ఇంకా ఎంత టైం పట్టొచ్చు" అని అడుగుతారు. కాని నేను "బాబూ...అసలు అవుతుందా?అయితే ఎప్పటికల్లా అవుతుంది?" అని అడిగాను.

    "కంప్యూటర్ క్రాష్ చాలా దారుణంగా జరిగింది సార్...! , ఇప్పుడిప్పుడే ఏమి చెప్పలేం" అన్నాడు. 

    "అసలు ఇంత దారుణంగా ఎలా పాడైంది సార్?" అని అతడు అడగటంతో, నేను ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలా. ఎలా చెబుతాను? మా కంప్యూటర్ కరంట్ కట్ వల్ల పాడైందని? వైరస్ తో పాడైందంటే ఒక అర్ధం వుందిలే కాని... కరంటు కట్ తో పాడైందంటే నవ్వుకోరూ? 

    ఏం చెప్పాలో తెలియక "హి..హి...పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు చాలు, మనం తెచ్చిపెట్టినవి పాడుచేయడానికి" అని నవ్వి ఊరుకున్నాను. 

    "ఏదేమైనా మీరు కొత్త కంప్యూటర్ కొనక తప్పదు సార్...!!!" అని నాకొక్క  జలక్ ఇచ్చాడు. 

    "అదేంటి?...కొద్దిగా ఓపికతో చూడండి...అందులో ఉన్న డేటా నాకు చాలా అవసరం. కొత్త కంప్యూటర్ కొనడం పెద్ద పనేం కాదు లే గాని, అందులో ఉన్న డేటా చాలా బాగా అవసరం. కొద్దిగా చూడవా పుణ్యముంటుంది...! " అని అడిగాను. 

    "మీ సాటా హర్డ్రైవ్ పాడవడం వల్ల డాటా కి గ్యారంటి ఇవ్వలేము సార్" అన్నాడు. 

    "ప్రతి సమస్య కి ఓ పరిష్కారం ఉంటుంది" అని అంటే..." మీరు చెప్పింది అక్షరాల సత్యమే సార్. కానీ, దీనిని మేము బాగుచేయలేము." అన్నాడు.  

    స్టూలు విరిగి నేను కింద పడ్డాను.వెంటనే అతడు నన్ను లేపడానికి వచ్చాడు. "అయ్యో సార్...జాగ్రత్త" అన్నాడు. 

    "పర్లేదు...పర్లేదు, నా సంగతి వదిలేయ్. ముందు నా కంప్యూటర్ సంగతి చూడు" అన్నాను. 

    "చూసేది... చేసేది ఏమీ లేదు సార్, వదిలేయండి. ఓ కొత్త కంప్యూటర్ కొని దానిని జాగ్రత్తగా చూసుకోండి. మా దగ్గర కంప్యూటర్లు ఇరవై వేల నుంచే మొదలు..." అని నాకో సలహా ఇచ్చాడు. 

    నేను దిగులుగా నా కంప్యూటర్ ని పట్టుకొని బయటికి తీసుకొచ్చాను. "ఆపరేషన్ సక్సెసా?" అని నా భార్యా-కొడుకూ అడిగినప్పుడు నేను ఏం మాట్లాడకుండా స్కూటర్ కిక్కొట్టి స్టార్ట్ చేశా...వాళ్ళకి అర్ధమైపోయింది. నేను స్కూటర్ ఎక్కి... వాళ్ళూ ఎక్కాక నడపడం మొదలుపెట్టా. 

    "ఛీ... ఏంటి నాన్నా...? ఇక్కడిదాకా వచ్చి వేస్ట్. ఇప్పుడెలా? అసలే అందులో నా  గేమ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా ? కొత్తగా గేమ్ లోడ్ చేశానని సంతోషపడేలోపే... ఇలా అయ్యింది." అని విసుకున్నాడు నా కొడుకు. 

    "కష్టపడి నా బంధువుల దగ్గర నుంచి తీసుకొచ్చిన కుకెరీ బుక్ జిరాక్స్ తీయిస్తానంటే డబ్బుకి కక్కుర్తి పడి బుక్ అంతా స్కాన్ చేసి సిస్టం లో ఫీడ్ చేశారు. ఇప్పుడేమైంది? ఎంత డబ్బు పెట్టినా డాటా తిరిగి వస్తుందో-రాదో తెలీదు" అంది మా ఆవిడ. 

    అప్పుడు నా కొడుకు "మమ్మీ...ఈ ఊరి వంట...!"అని గుర్తుచేశాడు. 

    అప్పుడు వాళ్ళమ్మ- "అమ్మో...అమ్మో...నెల రోజులనుంచి సినిమాలు డౌన్ ‌‌లోడ్  చేయనీయకుండా, ఈ వూరి వంట ఎపిసోడ్లు డౌన్ ‌‌లోడ్  చేసిన వన్నీ పోయినట్టేగా?" అంది. 

    నాకు చికాకు పుట్టి కసురుకున్నాను. "ఎదవ మీ సొల్లు పోయినందుకే ఇంత ఫీలైతే... నా ఆఫీస్ ఫైల్స్ అన్ని అందులోనే ఉన్నాయి. నేనెంత చికాకుగా ఉండాలి? అయినా కంప్యూటర్ని నేనే పాడుచేసినట్టు మాట్లాడతారేమిటి? ఒక్కరోజు దానిని సవ్యంగా చూసుకున్నారా? నీట్‍గా తుడిచారా? కనీసం దుమ్ము పడకుండా గుడ్డైనా కప్పారా? ఇప్పుడిది పాడైపొయి కొత్త కంప్యూటర్ కొన్నా... మీరు మారరు." అన్నాను.

    దానితో వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇంటికి రాంగానే ఫ్యాన్ స్విచ్చ్ వేసాను, కరంట్ లేదు. నాకు తిక్క పుట్టింది. నేను ఎలాగైనా సరే...కరెంట్ ఆఫీస్‍కి వెళ్ళి ఓ చిన్న గొడవ పెట్టుకుందాం అనుకున్నాను . ఇంతలోనే కరెంట్ వచ్చింది. 

    "కరెంట్ కి నూరేళ్ళ ఆయుష్శు"అని చికాకుగా అనుకొని, ఫైల్స్ బ్యాక్‍అప్ కోసం ట్రై చేయడం మొదలుపెట్టాను. ఎంత ట్రై చేసినా...కనెక్ట్ కావట్ల. 

    అప్పుడు గుర్తొచ్చాడు నా స్నేహితుడు. వాడు కంప్యూటర్స్ లో మాస్టర్. వాడిని మేము కంప్యూటర్ డాక్టర్ అని పిలిచేవాళ్ళము. 

    "ఒరెయ్...అర్జెంటుగా ఫోను పట్టుకురా"అని నా కొడుకుకి చెప్పాను. వాడు పరిగెట్టుకుంటూ నా సెల్ తెచ్చాడు. 

    "ఎవరికి నాన్నా ? కంప్యూటర్ డాక్టర్ అంకుల్ కేనా?" అని అడిగాడు. 

    "అవును రా...అసలు వాడిని ముందే అడగాల్సింది. చ్హా..." అని అన్నాను. 

    "ఇప్పటికి మించిపోయినది లేదు...కాల్ చేయండి" అని నా భార్య కూరగాయలు తరుగుతూ వచ్చింది. 

    నేను కాల్ చేశాను- "హల్లో...". వాళ్ళావిడ ఫోన్ ఎత్తి ఆయన బయటికి వెళ్ళారు..రాగానే చెప్పి ఫోన్ చేయిస్తాను అంది. 

    అరగంట తర్వాత వాడే నాకు కాల్ చేసాడు. నేను ఆనందం తట్టుకోలేకపోయాను. 

    "ఒరేయ్... నేను రా... మా కంప్యూ..టర్ పా..డయింది రా" అని నేను తడబడుతూ అన్నాను. 

    "ఎలా రా, వైరస్ ఎక్కిందా ?" అని అడిగాడు. 

    "చెబితే నవ్వుకోవుగా...పవర్ కట్ వల్ల పాడైంది రా." అన్నాను. 

    "వాట్ ? పవర్ కట్ వల్లా? ఫన్నీ" అన్నాడు. 

    "ఈ మధ్య ఎక్కువగా కరెంట్ తీయడం వల్ల క్రాష్ అయింది రా. కంప్యూటర్ రిపైరింగ్ సెంటరుకి  వెళితే వాళ్ళు..పెదవి విరిచేశారు. నిరాశతో ఇంటికొచ్చిన తర్వాత నువ్వు గుర్తొచ్చావు. వెంటనే ఆలస్యం చేయకుండా నీకు ఫోన్ చేశాను." అన్నాను. 

    "ఇట్స్ ఓ.కే... నేను చెప్పిన్నట్టు చెయ్యి... " అని ఏం చేయాలో చెబుతూ వుంటే నేను అది తు.చ. తప్పకుండా చేసాను. నేనే కాదు, నా భార్యా, నా కొడుకు కూడా పక్కనే ఆసక్తిగా గమనిస్తూన్నారు.

    కొంత సమయం తర్వాత...

    "యెస్...ఐ గాట్ ఇట్" అని అరిచాను.

    "గుడ్...ఇప్పుడు అర్జెంట్ గా నీ డాటా అంత ఎక్స్‌టర్నల్ హార్డ్-డ్రైవ్ లోకి కాపి చేయి. నీ లక్ బాగుంది కాబట్టి వచ్చింది. నెక్స్‌ట్ టైం క్రాష్ ఐతే ఇక జన్మలో రాదు." అన్నాడు.

    "థాంక్యూ రా. ఇక నాకొదిలెయి. నేను చూసుకుంటా" అని కాల్ కట్ చేశాను.

    మేమందరం ఇంట్లో మైకల్ జాక్సన్ పూని నట్టు డాన్స్ చేయడం మొదలుపెట్టాం.

    నేను వెళ్ళి కుర్చీలో కూర్చుని, నా ఎడమ చేయి కీబోర్డ్ మీద, నా కుడి చేయి మౌస్ మీద పెట్టాను.

    కరంటు పోయింది...!!!

Comments