ఈ కథ అసహజం కాదు - వసంత ప్రకాష్

    మంచు బిందువులో మృదుత్వాన్ని, మధువులోని మాధుర్యాన్ని, త్రాచుపాములోని సౌందర్యాన్ని, రాయిలోని కఠినత్వాన్ని, నెమలి పింఛంలోని చాంచల్యాన్ని కలిపి రెండక్షరాల 'ప్రేమ'ను సృష్టించాడు సృష్టికర్త. అందుకోగలిగితే జీవితం స్వర్గం. అందుకోలేకపోతే క్షణక్షణం నరకం. ప్రేమకు ఎంతటి శక్తి! కాని నేడు ప్రేమ నాగరిక యువతలో విజృంభిస్తుంది. ఫలితం అఘాయిత్యం లేదా ప్రేమిచకుంటే కక్షతో హింస. చివరికి హత్యలు. మనం వార్తల రూపేణా వినని క్షణముందా? ఆ కోవకు చెందిన కథకాదు జీవితం.

    కాలేజి లైబ్రరీలో ప్రవేశించాడు తెలుగు మాష్టారు రమణ. అతన్ని చూసి ఉలిక్కి పడ్డారు కుమార్, నితిన్. గౌరవంగా లేచి నిలబడ్డారు. చేతిలో కాలేజ్ మ్యాగజైన్ ఉంది. అందులో "రసజ్ఞ" కథను గురించి విశ్లేషించుకుంటున్నారు. మాష్టారు కుతూహలంగా ఆ చర్చ విషయం కనుక్కున్నాడు. "చూడండి మాష్టారు ఓ స్వీట్ సిక్స్‌టీన్ అమ్మాయి నలభై దాటిన మాష్టారును ప్రేమించడమేమిటి? ఇంత చెత్త కథ కాలేజీ మ్యాగజైన్‌లో చోటు చేసుకోవడం ఏమిటి?. కలం పేరు 'చర్చిత' బాగుంది. కథ మాత్రం అసహజంగా ఉంది. వాస్తవానికి దూరంగా ఉంది." "ఆ కథ నేను రాసిందే!" అన్న రమణ మాష్టారు మాటకు అవాక్కయ్యారు స్నేహితులు కుమార్, నితిన్.

    మాష్టారి మనస్సు గతంలో తలుపులు తెరుచుకున్నాయి. సంఘటన జరిగి చాలా సంవత్సరాలైంది. తెలుగు మాష్టారు అనగానే పంచకట్టు గిరిజాల జుట్టు, నుదుట కుంకుమ బొట్టు, కాని రమణ మాష్టారు వయస్సు నలభై ఐదు. కాని వస్త్రధారణ కాలేజి కుర్రాళ్ళ లానే వుంటుంది. జీన్స్ ప్యాంటు, టీ షర్టులతో ఆకర్షణీయంగా ఉంటాడు. ఆయన చెప్పే పాఠం అలాగే మనస్సుకు హత్తుకుంటుంది.

    ఆ దినము "శాకుంతలము" దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహము గురించి చెబుతున్నాడు. "రసజ్ఞ" పాఠం వింటూ మైమరిచి మాష్టారు వైపు చూస్తూంది. చూస్తూనే వుంది. ఇక చూడటానికి వీలులేదన్నట్టు బెల్ మ్రోగింది. మాష్టారు వెళ్ళిపోతున్నాడు. వసరాలోకి రసజ్ఞ లేచి మాష్టారూ అని గట్టిగానే అన్నట్టు వుంది. గొంతు పెగల్లేదు. ప్రేమగా "రమణా" అంది. వెనక్కి చూశాడు రమణ. రసజ్ఞ మాష్టారూ అంటూ సమీపంగా వచ్చింది. "ఏమ్మా! పాఠం బోదపడలేదా? ఎందుకు ఉత్సాహంగా లేవు? ఆరోగ్యం బాగాలేదా? డాక్టర్‌కి చూపించలేక పోయావా?"

    ఆరోగ్యం బాగుంది. మనస్సుకు పట్టిన జాడ్యం. అదే ఈ కాలపు పిల్లలకు వచ్చే ప్రేమజాడ్యం అనుకోండి అని మనసులో అనుకుంది రసజ్ఞ.

    మాష్టారు రసజ్ఞతో "నీవు చాలా తెలివిగల పిల్లవు. నా కూతురులాంటి దానివి!" అని రసజ్ఞతో ఓదార్పుగా అన్నాడు. "ఏం లేదు" అంటూ వెళ్ళిపోయింది రసజ్ఞ.

    కాలం ఇట్టే పదిహేను రోజులు జరిగిపోయింది. రసజ్ఞ కాలేజీకి రావడము లేదు. ఓ రోజు మాష్టారు పేర ఓ కవరు వచ్చింది. ఆ దస్తూరి పరిచితమే! తన శిష్యురాలిదే. కవరు తెరిచి చూశాడు రమణ.

    "మాష్టారూ... కాదు రమణా! ఈ విషయం మీకెలా చెప్పను? కూతురిలా చూసుకుంటున్న మీరు - మీ కూతురు స్థానం కాక మరో స్థానం  అంటే 'మీ ప్రేమమయి'గా ఊహిచుకొని కలలు కనడం తప్పు. తప్పు అని తెలుసు. ఆ స్థానంలో మరొకరిని వూహించలేను. మరుజన్మ అంటూ వుంటే మీ ప్రేమకు నోచుకొని శాశ్వతంగా 'మీదాని'గా మిగలాలని కాంక్షతో శెలవు మాష్టారు మీ 'కాలేని' రసజ్ఞ!" వుత్తరం చదివి నిట్టూర్చాడు.

    విచారిస్తే 'రసజ్ఞ' ఊరులో లేదు. ప్రపంచంలోనే లేదు అని తెలిసి గుండె చప్పుడు ఆగిపోతుందా అనిపించింది. గుండె చప్పుడు ఆగలేదు. కాలం ఆగలేదు. చాలా సంవత్సరాలు కావస్తుంది. 'కాలేజ్ మ్యాగజైన్'కు పేరు మార్చి కథానిక రాశాడు. అచ్చయింది. విమర్శలు వచ్చాయి.

    'ఇది కథకాదు.జీవితం. జీవితమే ఓ కథ అనిపించింది. ప్రేమ పవిత్రం అనుకునే రోజులు పోయాయి. ఎంతమంది స్నేహితురాళ్ళు ప్రేమ పిపాసులు స్థోమత, అందానికి ఆకర్షితులై ప్రేమ అనే భ్రమలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమించలేదని కక్షతో హింసించి దారుణంగా హత్యలు చేసే మానసిక జాడ్యం యువతని పీడిస్తోంది. 

    నిజంగా కథగా అయితే చదవచ్చు కానీ తీపిలేని జిలేబి, ఉప్పు లేని పప్పు, ఓ శిష్యుడు విసిరిన వమర్శ! సహేతుకమా? నిజం. నిజమే!' అనిపించింది రమణకు. మారిపోతున్న కాలం, మారిపోతున్న మనస్సులు ప్రేమకు విలువలు పోయాయి. సుదీర్ఘంగా నిట్టూర్చాడు రమణ మాష్టారు. ఈ కథ అసహజం కాదు. వాస్తవం. వాస్తవమే!   
Comments