ఈ పాపం ఎవ్వరిది? - నాయుడు గారి జయన్న

    
పండుగ వెళ్ళి అప్పుడే మూడు రోజులన్న కాలేదు.  సందడంతా సద్దుమణిగి, వీధి వీధంతా… వీధంతా ఏమి, ఊరు ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. నిశ్శబ్ధం రాజ్యమేలుతుంది. పండుగ రోజులు అయినా పనుల కాలం కాబట్టి జనాలందరూ చేన్ల దారి పట్టారు, ఎవరో ముసలి, ముతకా తప్పా. అలాంటి ఓ ఊరిలో, ఊరి పడమటి వీధిలో, వీధి మలుపు చివరి ఇంటిలో ఓ నలుగురు మిత్రులం సమావేశమయ్యాం.  ఇదేదో సాదాసీదా సమావేశం కాదు.  ఏడాదికో సారి ఏర్పాటయ్యే సమావేశం. చిన్న నాటి మిత్రుల సమావేశం. అందరం కలిసి పెరిగాం. కలిసి చదువుకున్నాం. కాని విసిరేసిన గింజల్లా బతుకుదారిలో తలో దిక్కు వెళ్ళిపోయాం. ఎవరు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా ఏడాదికో సారి దసరా పండుగ రోజు ఇలా ఊర్లో కలుసుకోవాలని షరతు పెట్టుకున్నాం. కష్టసుఖాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాం.  అనుకున్న విధంగానే ఈ ఏడాది కూడా కలుసుకున్నాం. పండుగ ఆనందంగా జరుపుకున్నాం. మళ్ళీ రేపటి నుండి ఎవరి యాంత్రిక జీవితంలోకి వారు వెళ్ళిపోవాల్సిందే.  అందుకని ఈ ఏడాదికిది చివరి సమావేశమని , ఇందులో ఏడాది పాటు నెమరువేసుకొనే  జ్ఞాపకాలు పోగేసుకోవాలని మిత్రులం సమావేశం అయ్యాం. కాని మా సమావేశానికి హాజరు కావలసిన ఒక మిత్రుడు రాలేదు. అతని కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాం., కాసేపటి తరువాత ఆందోళనతో వచ్చాడు.  వస్తూ వస్తూ ఓ వార్త పట్టుకొచ్చాడు....."గోపమ్మవ్వ మందు తాగింది" అని చెప్పాడు. దిగ్భ్రాంతికి గురయ్యాం. వెంటనే తేరుకొని అందరం గోపమ్మవ్వ ఇంటి వైపు పరుగులు పెట్టాం.
    
    అప్పటికే చాలా మంది జనాలు గోపమ్మవ్వ ఇంటి ముందు గుమిగూడి ఉన్నారు. జనాలను తోచుకుంటూ లోపలికెళ్ళాం. అవ్వ నులక మంచం పక్కల కింద ఒక వైపు పడి ఉంది.  చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.  ఊర్లో అరకొర తెలిసిన ఆర్.ఎం.పి. డాక్టర్ ఉన్నాడు. బాగా తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుక వెళ్ళాలంటే ఓ ముప్పై కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించాల్సిందే. ప్రయాణానికి ఊర్లో సరైన వాహనాలు కూడా అందుబాటులో లేవు. సరే ఎలాగో ఒలాగా చేద్దామని అనుకొంటుండగానే,   "అవ్వకు గాలి ఆడటం లేదు.బయటికి తీసుక రండి." అన్నారెవరో సమూహంలో నుండి. అవును నిజమే అనిపించి, నేను, నా మిత్రులతో కలిసి అవ్వను చేతుల మీదుగా బయటకి తీసుక వచ్చి, వరండాలో మరో మంచం మీద పడుకోబెట్టాం. విసన కర్రతో విసరం మొదలుపెట్టారు అవ్వ సంబంధికులు. మరెవరో అవ్వ తాగిన మందు కక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాని అవ్వ శరీరంలో మార్పులు స్పష్టంగా కాకపోయినా, తెలుస్తునే ఉన్నాయి. మరికొన్ని క్షణాలు భారంగా గడిచిపోయాయి. అనంతరం అవ్వ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. నా కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి.

    గోపమ్మవ్వ జీవితం లేచిపడిన కెరటం. తన భర్త ఉండిన రోజుల్లో తనకే లోటు లేదు. తన భర్త ఆ ఊరి దొరల దగ్గర పెద్ద పాలేరుగా పనిచేసేవాడు.  పేరుకు పాలేరే అయినా దొరలకు తీసిపోని రాజసం ఉండేది ముసలాడిలో. వేషం, మీసం, రోషం అంతా అచ్చు దొరలలాగే ఉండేది. అందుకే ఊర్లో తమషాకే అయినా , ముసలాడిని “చిన్న దొరా” అని పిలిచేవారు. అవ్వ కూడా దొరసానిలానే బతికింది. అలాగని కాలు మీద కాలు వేసుకొని ఇంటిలో ఏనాడు కూచోలేదు. తనకు తోచినది, చేతనైనది ఏదో పని చేస్తూనే వచ్చింది.  వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడులా తాత సంపాదనకు తన కష్టార్జితాన్ని జోడించేది. ఏదో కొంత వెనుకేశారు. అవ్వకు ఇద్దరు సంతానం. ఇద్దరూ కొడుకులే. తమ పిల్లలకు ఏలోటు రాకూడదని తాపత్రయపడ్డారు. అలాగే పెంచారు.  ఇద్దరిని ఓ ఇంటివారిని చేశారు. సంపాదించిన ఆస్తిని ఇద్దరు కొడుకులకు సమంగా పంచి ఇచ్చారు.  తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని పంచి ఇస్తే, పిల్లలు తల్లిదండ్రులను పంచుకున్నారు. ఎవరి వంతుకు వచ్చిన వారిని వారే బతికినంతకాలం చూసుకోవాలని షరతు విదించికున్నారు కొడుకులు.  ఆ లెక్కన తాత పెద్ద కొడుకు పంచన చేరితే, గోపమ్మవ్వ చిన్న కొడుకు పంచన చేరింది. చిన్న కొడుకంటే అవ్వకు ప్రాణం. అలాగని పెద్ద కొడుకంటే ఇష్టం లేదని కాదు. పెద్దోడు తెలివిగల్లోడు. భార్య కూడా గడుసురాలే. వాళ్ళ సంసార నావ ఎలాగోలా తీరం చేరుతుంది. కాని చిన్నోడు అవివేకి. ఆవేశం ఎక్కువ. దుడుకు స్వభావం. అయినదానికి, కాని దానికి దుమదుమలాడుతాడు. నిత్యం ఏదో గొడవలో పడి, తంటాలు పడుతాడు. ఇక కోడలంటవా! సహనం లేనిది. మొగుడిని ఏ మాత్రం లెక్కచేయదు. అవ్వంటే అసలుకే పడదు. తనకక్కడ శాంతి ఉండదని తెలిసినా, అవ్వ ఏరికోరి చిన్నోడి పంచననే చేరింది. కారణం ఒడిదుడుకులకు లోనయ్యే చిన్నోడి సంసారాన్ని ఎలాగోలా చక్కదిద్ది కాపాడుకరావాలనే. 
  
    పెద్ద కొడుకు పంచన చేరిన తాత పుణ్యాత్ముడే.  తాను మంచంలో పడి పెద్దోడితో వెట్టి చేయించుకుని వారిని తిప్పలు పెట్టటం పాపమని భావించాడో! ఏమో! పెద్దోడి పంచన చేరి పది నెలలన్న గడవక ముందే తాత లోకం విడిచి వెళ్ళిపోయాడు.
 
    తాత మరణం అవ్వను కుంగదీసింది. ముసలోడు నన్నొంటరి పక్షిని చేసెళ్ళినాడని వాపోయింది. బతుకు మీద ఆశ లేకపోయినా, చిన్నోడి మీద ఆశతో బతుకు వెళ్ళదీసింది.

    చిన్నోడి పరిస్థితి మరోలా ఉంది. చిన్నోడికి ఆవేశమే తప్పా, ఆలోచన లేదు. దానికి తోడు సహనం లేని ఇల్లాలు. ఇవే చిన్నోడిని పక్కదారి పట్టించాయి. సరదాలు పెరిగిపోయాయి. సర్వ వ్యసనాలు అలవడ్డాయి. తప్ప తాగి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చేవాడు. అప్పటి దాకా కాచుకకూచున్న ఇల్లాలు గయ్య్‌న లేచేది. ఆమే అరవడం. చిన్నోడు కొట్టటం ఆ ఇంటిలో నిత్యకృత్యాలయ్యాయి. ఇలా రోజూ రణరంగమే ఆ ఇల్లు. చివరికి చిన్నోడి పద్దతి నచ్చక భార్య విడిచిపెట్టి, పుట్టినిల్లుకు వెళ్ళిపోయింది. దాంతో చిన్నోడు మరీ చెడిపోయాడు. నిత్యం మందు మత్తులో మునిగితేలేవాడు. మత్తు నుండి తేరుకున్నప్పుడో,తల్లి కష్టం గుర్తుకొచ్చినప్పుడో, అయినా వారో, కానివారో పద్దతి మార్చుకోమని చెప్పినప్పుడో, బుద్దిగా బతకమని హిత బోధ చేసినప్పుడో బుద్దిమంతుడిలా ఉండేవాడు. అప్పుడే ఏదో పని చేయడానికి పథకాలు పన్నేవాడు. పన్నిన  పథకాల సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించేవాడు కాదు. వెంటనే ప్రారంభించేవాడు. అలా రెండు మూడు పనులు ప్రారంభించాడు. అవన్నీ అనాలోచితంగా చేసిన పనులే కాబట్టి, అన్నీ బెడిసికొట్టాయి. తలబొప్పి కట్టింది. అప్పులు పెరిగిపోయాయి. అప్పుల వాళ్ళూ మీద పడ్డారు.
   
    ఆస్తి అంతా అప్పులు తీర్చటానికి హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఇల్లొకటి మిగిలింది. అదీ పోయేదే. అప్పుల వాళ్ళు ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వస్తే, గోపమ్మవ్వ ఎదురుతిరిగింది. "ఈ ఇల్లు నేనూ, నా మొగుడు రక్తం వడగట్టి, చెమటోడ్చి కట్టిన ఇల్లు. వాడు మీకు అప్పు ఉంటే ఉండవచ్చు గాకా. వాడు సంపాదించినదేదైనా ఉంటే మీ అప్పుకిందికి ముడేసుకొండి. అంతే గానీ, ఈ ఇంటి మీదికొస్తే, మీ మర్యాద ఉండదు మరి. నా శవాన్ని కళ్ళజూస్తారు" అని ఘాటుగానే జవాబిచ్చింది.  అవ్వ అన్నంత పని చేస్తదనో!, అవ్వంటే అభిమానముండో! అప్పుల వాళ్ళు ఇక ఆ ఇంటి జోలికి  ఏనాడు వెళ్ళలేదు.

    చిన్నోడు బాగుపడితే చూడాలనుకుంది అవ్వ. కాని చిన్నోడికి దెబ్బ మీద దెబ్బ తగలడం బాగా బాధించింది. చిన్నోడి సంసారం చిన్నాభిన్నం కావడం అవ్వకు తీవ్ర మానసిక వేదనగా మిగిలింది.
"వాడు పగలంతా ఎక్కడ తిరిగినా, ఏమి జేసినా, ఓ గూడంటూ ఉంటే రాత్రి కొచ్చి తలదాచుకుంటాడు. అదీ లేకపోతే? వాడి బతుకు ఏమైపోను?"  అని ఆలోచించే, తానేనాడు ధర్మం తప్పకపోయినా, ఈనాడు కొడుకు కొరకు ధర్మం తప్పి, అప్పులవాళ్ళకు హెచ్చరిక చేయవలసి వచ్చింది.  చిన్నోడికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో ఏమైనా మిగిలిందా! అంటే అది ఈ ఇల్లు మాత్రమే. చిన్నోడు ఇక ఇంటికే పరిమతమైపోయాడు. బయటికి వస్తే అప్పులవాళ్ళూ పీక్కతినేవారు. ఇంట్లోనే ఉండిపోతే ఆకలి పీక్కతినేది. ఈ రెండిటి బాధ నుండి తప్పించుకోవడానికి చిన్నోడు ఓ అర్ధ రాత్రి ఊరి నుండి పరారయ్యాడు.  తన వాటాకొచ్చిన తల్లి పోషణ కన్నా తన ప్రాణమే ముఖ్యమనుకున్నాడు కాబోలు.  ఆ తర్వాత చాలా రోజుల వరకు చిన్నోడి జాడ లేదు.
 
    "పోతే పోనీలే,నన్ను విడిచి. వాడెక్కడున్నా, చల్లంగుంటే అంతే చాలు" అని తల్లి మనుసు సర్దుకపోయింది.
 
    పల్లె నుండి పరారయిన చిన్నోడు పట్నం చేరాడని,బాగా మారిపోయాడాని, ఏదో దొరికిన పని చేసుకుంటూ కాలం గడుపుతున్నాడని, అప్పుడప్పుడు అవ్వకు అంతోఇంతో డబ్బు కూడా పంపుతున్నాడని వార్తలు బాగానే షికారు కొట్టాయి ఊర్లో.  అవ్వ కూడా తనకు సత్తువ ఉన్న నాడు ఏదో ఇంత పనిజేసి, నాలుగు రాళ్ళు కూడేసి, కాసిన్ని గంజినీళ్ళు కాసుక తాగుతూ, కాలం గపేది. కాని ఎవ్వరిని దేహి అని అడుగలేదు. పక్కింట్లోనే ఉన్న అవ్వ పెద్ద కొడుకు కూడా అవ్వ పడే కష్టం జూసి అప్పుడప్పుడు భార్యకు కానకుండా అవ్వకు తోడందించేవాడు.

    ఎలాగోలా జీవితాన్ని నెట్టుకొస్తున్న వేళ అవ్వకు ఒక అవాంతరం వచ్చి పడింది. కాలం ఎప్పుడు ఒకేలా నడువడం గానీ, పేదలు ఏ కష్టం లేకుండా జీవించటం గానీ చూస్తే భగవంతుడు భరించలేడు. అందుకే తరుచూ ఇలా పేదలను బాధిస్తూ, ఆనందిస్తుంటాడు అనంతుడు.

    పడుతూ, లేస్తూ కాలం వెళ్ళదీస్తున్న అవ్వకు పంటి నొప్పి రూపేణా ఓ రోగం వచ్చింది. పెద్దోడు ఊర్లోని డాక్టర్‌కి చూపించాడు. అప్పటికి తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగబెట్టింది. పట్నం వెళ్ళి చూపించమన్నాడు ఊళ్ళోని డాక్టర్. 
 
    అవ్వ ముఖానికి ఒక వైపు దవడంతా వాచిపోయింది. పెద్దోడు తల్లి మీద ప్రేమతోనో!, తల్లి ఉన్న తమ్ముడి ఇంటి మీద ప్రేమతోనో! ఏమైతేనేమి పట్నం తీసుకవెళ్ళాడు. డాక్టర్‌కి చూపించాడు. చేయవలసిన పరీక్షలన్నీ చేశాకా, డాక్టర్ అది పంటి నొప్పి కాదని, క్యాన్సర్ అని తేల్చిచెప్పాడు. తక్షణం వైద్యం చేయాలన్నాడు. ముదిరితే మరి లాభం లేదన్నాడు. ఖర్చు మాత్రం బాగా అవుతుందన్నాడు. కుడితిలో పడ్డ ఎలుకలాగైంది పెద్దోడి పరిస్థితి. ఎరక్కపోయి ఇరుక్కపోలేదు కదా అనుకున్నాడు. లెక్కలు కట్టటం మొదలుపెట్టాడు. తల్లి మీద ఉన్న సొమ్ములు, తమ్ముడి ఇల్లు ఎన్ని కలిపిన డాక్టర్ చెప్పిన సంఖ్యకు సరిపోలటం లేదు. ఇక చేసేదేమి లేక తల్లిని తిరిగి ఊరికి తీసుక వచ్చాడు.

    "అయినా, అమ్మను సాకాల్సింది నేనా? నా వంతుకొచ్చిన నాన్నను సాకాను, సాగనంపాను. నాతో పాటు వాడూ సగం ఆస్తి పంచుకోలేదా? అమ్మను సాకాల్సిన బాధ్యత వాడిది కాదా? కళ్ళు తలకెక్కి, ఇష్టమొచ్చినట్లు చేసి, ఆస్తిని హారతి కర్పూరంలా చేసి, తల్లిని గాలికొదిలేసిపోయాడు.  దేశాలు పట్టుకతిరుగుతున్నాడు గాడిద. ఏదో తల్లి కదాని జాలేసి వైద్యం చేయిద్దామనుకున్నాను. ఇంత డబ్బంటే నేను మాత్రం ఎక్కడి నుండి తేను? నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు.  వారి గురించి ఆలోచించవద్దా!" అని తమ్ముడిని నిందిస్తూ, తనను తాను సమర్థించుకుంటూ మనుసు కుదుటపరుచుకున్నాడు.

    గోపమ్మవ్వకు ఆ రోగం నానాటికి పెరిగి పోయింది. ముఖమంతా పారుకపోయి,  భూచక్రం గడ్డలా ఊరిపోయింది. దాని బాధకు అవ్వకు తిండి సహించేది కాదు. తిండి లేకపోవటంచే అవ్వ చిక్కి శల్యమైంది. పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ విషయం తెలిసే, పండుగకని ఊరొచ్చిన మొదటి రోజు నేను, నా మిత్రబృందం అవ్వను పలకరిద్దామని వారింటికి వెళ్ళాం.  (ఆశ్చర్యమేమంటే ఎప్పుడొచ్చాడో తెలియదు గాని, చిన్నోడు కూడా కనిపించాడు.) అవ్వ మూలన నులక మంచం మీద కూర్చొని ముఖంపై గాయమైన చోట రొసికపై వాలుతున్న ఈగలను చేత అయ్యికాక, జోపుకుంటుంది. బాధతో మూలుగుతుంది. అవ్వను అలా చూసేసరికి చాలా బాధేసింది. పలకరించి వచ్చాం.
 
    అవ్వ ఆరోగ్యానికి సంబంధించి మనమేమైనా చేయగలమేమో ఆలోచించాలని అప్పటికి నిర్ణయం తీసుకొని ఎవరి ఇండ్లకు వాళ్ళం వెళ్ళిపోయాం. పండుగెల్లిపోయింది. రెండు రోజులు గడిచిపోయింది. ఈ ఏడాదికిది చివరి సమావేశమని ఇలా కూర్చున్నామో! లేదో! ఇదిగో ఈ వార్త...
అవ్వ మరణించింది. నా తలలో ఆలోచనలు కదిలిన తుట్టేలోంచి వచ్చిన కందిరీగల్లా చుట్టుముట్టాయి. అవ్వది హత్యా? ఆత్మహత్యా?

    గోపమ్మవ్వ కొడుకులిద్దరి ఇండ్లు పక్కపక్కనే ఉన్నాయి. అవ్వ చిన్నోడికొచ్చిన వాటా ఇంట్లో ఉండేది.  ఆ ఇంటిలో రెండు గదులు ఉన్నాయి. బయటి గదిలో ఉన్న కుక్కి మంచంలో అవ్వ ఒక మూలకు ఉండేది.  అవ్వ మంచంలో పడిన తరువాత అలనాపాలనా అంతా పెందింటొళ్ళే చూసుకొనేవారు.
 
    ఈ రోజు అవ్వ మందు తాగిందంటున్నారు. లోపలి గదిలో సుంచుపై ఉన్న మందు డబ్బను అందుకోవటం కోసం మూలకున్న చెక్క పెట్టెను బయటికి లాగిందట. ఆ పెట్టెపైకి ఎక్కి, మందు డబ్బ తీసుకొని, ఓ టిఫిన్ బాక్స్ మూతలోకి వొంపుకొని, తాగి వచ్చి, బయటి గదిలో పడిపోయిందట. ఈలోగా పెద్దోడి పిల్లలు ఆడుకుంటూ అటువైపు రాగా పడిపోయిన అవ్వను చూసి గగ్గోలు పెట్టారట. అది విన్న పెద్దోడి పెళ్ళాం పరుగెత్తికొచ్చి చూడగా అవ్వ తనుకులాడుతున్న దృశ్యం కనపడిందట. పెడబొబ్బలు పెడుతూ ఏడ్వగా చుట్టుపక్కల వాళ్ళంతా పోగయ్యారట. ఇదీ అక్కడ మూగిన అమ్మలక్కలు చెప్పుకుంటున్న అవ్వ చివరి అంకానికి సంబంధించిన నేపథ్యం.
 
    ఎందుకో గానీ, ఇందులో ఏ మాత్రం నిజం లేదని నా మనసు కరాఖండిగా చెబుతుంది. పండుగని ఊరొచ్చిన మొదటి రోజే అవ్వను పలకరిద్దామని మిత్ర బృందంతో కలిసి వారికి వెళ్ళాను. ఆ రోజు మమ్మల్నెవరిని అవ్వ గుర్తుపట్టలేదు. చిన్నోడు పరిచయం చేస్తే తల పంకించింది. అలాంటిది మందునెలా గుర్తించింది. వాసన ద్వారా అని సరిపుచ్చుకుందామా! అయితే ఆ మందు చిన్నోడి ఇంట్లోకి ఎందుకొచ్చింది? ఎట్ల వచ్చింది? ఎలాగోలా వచ్చిందనుకుందాం. మేము వెళ్ళినప్పుడు మంచంపై పడుకొని ఉన్న అవ్వ కూర్చోవడానికి కూడా కాలు కదపడానికి ఇబ్బంది పడుతుంటే, చిన్నోడే సహాయం చేశాడు. అట్లాంటిది బయటి గది నుండి లోపలి గది వరకు నడిచిపోయిందంటే ఆశ్చర్యమే! సరే, ఎలాగోలా శక్తినంతా కూడదీసుకుని వెళ్ళిందే అనుకుందాం. మూలకున్న బరువైన చెక్క పెట్టెను సుంచు కిందికి లాగడానికి అవ్వకి శక్తెలా వచ్చిందో మరో ఆశ్చర్యకరమైన అంశం. భరించరాని బాధతో, ఇక నన్నెవరు పట్టించుకోరనే నిస్పృహతో, ఎవరికి పట్టని నేను ఇంకెందుకు బతకాలన్న నిరాశతో, ఎలాగైనా తనను తాను అంతం చేసుకోవాలనే బలమైన కోరికతో పెట్టెను లాగిందనుకున్నా, తృప్తి కలిగించని మరో పశ్న మిగిలేపోయింది. అవ్వ చాలా పొట్టిది. అందుకే అవ్వను బుడ్డ గోపమ్మ అని పిలిచేవారు ఊర్లో.  చెక్కపెట్టె పైకి ఎక్కినా సుంచు అందనంత పొట్టిది అవ్వ. మరి ఆ సుంచుపై ఆ మందు డబ్బ ఎలా అందింది? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలతో నా మెదడు మొద్దుబారిపోయింది. ప్రపంచం గిర్రున తిరిగి కళ్ళముందు కడలాడింది. ఆర్థిక సంబంధాలు మనిషినే స్థితికి నెట్టివేస్తాయో!కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఏది ఏమైనా ఆ అవ్వ మరణించింది. ఈ పాపం ఎవ్వరిదని నా మూగ మనసు మూలిగింది.

Comments