ఈ పిల్లకు పెళ్లవుతుందా? - శారదా అశోకవర్ధన్

    
కొబ్బరాకులతో అందంగా తయారుచేసిన మంటపానికి పూలతో అలంకరణ దగ్గరుండి చేయిస్తున్న హేమసుందర్ శ్రీనివాస్ చెప్పిన మాటలు విని కుప్పగా కూలిపోయారు. మగపెళ్లివారికి దింపుళ్లకోసం ప్రత్యేకంగా పెద్ద సైజులో తయారు చేసిన లడ్డూలూ, సున్నుండలూ, బూందీ గంపలను లోపల గదిలో పెట్టడానికి వెళుతూ, భర్తతో ఏదో చెప్పాలని మంటపానికి వచ్చిన ప్రసూనాంబ, భర్త చెమటలు కక్కుతూ అలా కుర్చీలో కూలబడడం చూసి ఖంగారుగా వచ్చి, శ్రీనివాస్ చెప్పిన మాట విని, కళ్లు తిరిగినట్టయి, అక్కడే కూర్చుండి పోయింది. విద్యుద్దీపాల తోరణాలను ఇంటిచుట్టూ కట్టిస్తున్న దినేష్ దూరంనుంచి ఈ దృశ్యాన్ని చూసి పరిస్థితి ఏమిటో అర్థం కాక పరిగెత్తుకుంటూ వచ్చి, శ్రీనివాస్ ద్వారా విషయాన్ని తెలుసుకుని నిశ్చేష్టుడైపోయాడు. నిముషాల్లో వార్త పందిరంతా పాకిపోయింది. పన్లలో మునిగి సతమతమౌతున్న వారంతా, మతిపోయినవాళ్లతా చలనం లేకుండా వుండిపోయారు. గౌరీపూజ చేస్తున్న అవంతి ఒక్క క్షణం పూజ ఆపేసి, కొయ్యబారిపోయినట్టు కూర్చుంది.

    నవ్వుల పువ్వులు రువ్వుతున్న ఆ ఇల్లు క్షణంలో నిశ్శబ్దంతో నిండిపోయింది. తృటిలో ఆ ఇల్లూ ఆ పందిరీ అంతా, విషాదంతో అలుముకు పోయింది.

    గుసగుసలు! కొందరిలో!

    రుసరుసలు! కొందరిలో!

    ఆశ్చర్యంతో తెరుచుకున్న నోళ్లు!

    బుగ్గ నొక్కుళ్లు!

    కనుబొమల ఎగరేతలు!

    అక్కడి వాతావరణమంతా మబ్బుకమ్మిన ఆకాశంలా మారిపోయింది.

    "పెళ్లికొడుకు కనబడడం లేదుట" అన్నారెవరో...

    నిముషంలో ప్రతీనోటా ఇదే మాట. సినిమాలలో నయితే, పెళ్లికూతురు కనబడడంలేదని కంగారూ, చెవులు కొరుక్కోవడాలూ, పెళ్లికొడుకు తాలూకు వాళ్లు తీవ్రంగా పెళ్లికూతురివాళ్లనందరినీ ఏడు తరాలు అటూ ఇటూ కడిగేసి వెళ్లిపోవడాలూ చూశాం. కానీ, పెళ్లికొడుకు కనబడడం లేదని వొచ్చిన వార్తకి ఎలా రియాక్ట్ అవాలో, ఏం చెయ్యాలో తెలీక తికమకపడిపోయి షాక్ తిన్నారు పెళ్లికూతురు తల్లీ తండ్రీ అన్నదమ్ములూ అయినవారందరూ.

    "అయ్యగారూ మంటపానికి పూలు చుట్టడం పూర్తయింది. మా డబ్బులిప్పించండి" అని పనివారు అడిగేదాకా ఈలోకంలోకి రాలేదు హేమసుందర్. ఈ వార్త వినగానే ఎలక్ట్రీషియన్లూ, కుర్చీలు మోసుకొచ్చేవారు అందరూ ఒక్కరొక్కరే ఎవరి డబ్బుల కోసం వాళ్లు లైన్లో నుంచున్నారు.

    "ఉండండి ఇస్తాం. ఏమిటా తొందర? ఎక్కడికీ వెళ్లిపోవడం లేదుకదా మేము" గదమాయించాడు పెళ్లికూతురు అన్నయ్య శ్రీనివాస్. 

    "ఏమండీ అందరూ ఒచ్చేస్తున్నారు. వంటలు కూడా పూర్తవుతున్నాయి. ఇప్పుడు టైము మూడుగంటలయింది. ముహూర్తానికి ఇంక ఒక్క గంటా ఇవరై ఒక్కనిమిషాలు మాత్రమే ఉంది. వచ్చిన వాళ్లకి ఏం చెప్తాం? డబ్బూ పోయింది, పరువూ పోయింది. ఇలా జరిగిందమిటి? ఇంక మన అవంతికి పెళ్లవుతుందా? ఎవరు చేసుకుంటారండీ దాన్ని?" ఏడుస్తూ నెత్తీనోరూ కొట్టుకుంటూ పిచ్చిదానిలా అయిపోయింది ప్రసూనాంబ. ఈవార్త మోసుకొచ్చిన పెళ్లికొడుకు మేనమామా, పినతండ్రీ ఆదృశ్యాన్ని చూసి కళ్లొత్తుకున్నారు. పెళ్లికొడుకు తమ్ముడు దేవేందర్ ఏడుపు మొహం పెట్టాడు. కాస్సేపటికి తేరుకుని గడియారం చూసుకుని హేమసుందర్ వంక చూశాడు. "అంకుల్! ముహూర్తానికి ఇంక ఒక్కగంటే వుంది. మిమ్మల్ని చూస్తూవుంటే నాకు చాలా బాధేస్తోంది. అన్నయ్య ఎందుకిలా చేశాడో అర్థం కావడంలేదు. ఒక వేళ తనింకెవరినైనా ప్రేమించి వుంటే నిర్భయంగా అమ్మానాన్నలతో చెప్పేస్తే పోయేది. అదే అమ్మా నాన్నా బాధపడుతున్నారు. అతడి తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఐ...యాం...వెరీ...వెరీ...వెరీ...సారీ..." అన్నాడు.

    "అంతా మా ఖర్మబాబూ" అంది ప్రసూనాంబ.

    "మీకు అభ్యంతరం లేకపోతే ఇదే ముహూర్తానికి మీ అమ్మాయిని నేను చెసుకుంటాను. మా అమ్మానాన్నలూ ఎవరు ఏమంటారన్న భయం నాకులేదు" అన్నాడు దేవేందర్.

    అతని మాటలకు అందరూ అతనికేసి చూశారు. ఎవరికీ నోట మాట రాలేదు. మామూలుగా అయితే మరో గంటలో అవంతి అతనికి వదినగారై వుండేది. వదిన తల్లితో సమానం అంటారుకదా! ఇప్పుడేమో... ఆలోచించలేక మతిపోయినట్టయి కుర్చీలో చతికిలబడ్డాడు హేమసుందర్.

    ప్రసూనాంబ అయోమయంగా అవుననాలో కాదనాలో తెలీక మౌనంగా వుండిపోయింది. ఒక గంటయితే అన్నీ మామూలుగా జరిగుంటే మరిదిగా ఆమె కాళ్లకి దండంపెట్టి వుండేవాడు. వయసులో అవంతికన్నా ఒక ఏడాది పెద్ద. ఇప్పుడు భర్తగా భావించడం అవంతికి సాధ్యమా? ఆమె అవంతికేసి చూసింది. అవంతి అందరికేసి చూసింది. ఒక్క క్షణం కూర్చున్నదల్లా లేచి నుంచుంది. 

    "చూడండీ...బర్త్ ఈజ్ యాక్సిడెంటల్ అన్నారు పెద్దలు. ఒక పిల్లో పిల్లాడో ఈ దేశంలో పుడితే ఇండియన్. మరో దేశంలో పుడితే ఆ దేశస్థులు. అలాగే ఏప్రాంతంలో పుడితే ఆభాష మాట్లాడుతాడు. మనింట్లోపుడితే మన కులం. ఇంకో ఇంట్లో పుడితే ఆ కులం ఆ గోత్రం. అలాగే పెళ్లిళ్లు కూడా స్వర్గంలోనే నిర్ణయాలు జరుగుతాయంటారు. మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఈ పెళ్లి జరిగుంటే అతడు నాకు మరిదై వుండేవాడు. లేదు కనుక ఇప్పుడతడు అందరిలాగే ఏమీ కాడు. ఈ పరిస్థితులనెదిరించి తనవాళ్లకి తానే సమాధానం చెప్పుకుంటానని అతడు చెప్తే నేను రెడీయే. నాన్నగారూ! ఈ సమస్య మీ జీవితాలపై ప్రభావాన్ని చూపించకూడదు. నేను మీకు భారం కాకూడదు. కాబట్టి ఈ ముహూర్తానికే నా పెళ్లి ఇతనితో జరిపించెయ్యండి" అంది. అతని బాబాయ్ కూడా ఆ నిర్ణయమేదో ఆ అబ్బాయికే వదిలేసి వూరుకున్నాడు. 

    అవంతి నిర్ణయంతో అందరి హృదయాలూ తేలిక పడ్డాయొ. 

    "మరి మీ అమ్మగారీనీ, నాన్నగారినీ, మీవాళ్లందరినీ పిలిపించు" అన్నారు హేమసుందర్‌గారు. అతని పినతండ్రీ "అలాగే" అంటూ వెళ్లిపోయాడు. 

    "అమ్మా...నువ్వు మాకేమీ భారం కాదు. చెట్టుకి కాయ భారమౌతుందా? బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నావా? నాకంతా అయోమయంగా వుంది" అన్నారు కూతురి తలమీద చెయ్యిపెట్టి లాలనగా నిమురుతూ హేమసుందర్.

    "అన్నీ ఆలోచించాను నాన్నగారూ...మీరేమీ దిగులు పడకండి" అంది అవంతి.

    హేమసుందర్ అవంతి అభిప్రాయాన్ని దేవేందర్‌కి చెప్పారు. 

    "థాంక్స్..." అన్నాడు దేవేందర్.

    హేమసుందర్ లేచి అందరికీ ఏవో పన్లు పురమాయించేలోగానే

    "అంకుల్...ఒక చిన్న రిక్వెస్ట్. అన్నయ్యకి మీరేం ఇస్తానన్నారో అవి నాకు చాలు. కాకపోతే..." నసిగాడు.

    "చెప్పు బాబూ" అన్నారు హేమసుందర్. 

    "నేను హోండాసిటీ మోటార్ సైకిల్‌కి అప్ప్లై చేశాను. అల్లాట్‌మెంట్ వచ్చింది. కాబట్టి వారంరోజుల్లోగా డబ్బు కట్టి తీసుకోవాలి. అది మీరు కట్టాలి" అన్నాడు నెమ్మదిగా.

    హేమసుందర్‌కి నోట మాట రాలేదు. ఇప్పటికే ఇరవైతులాల బంగారం, బట్టలూ, అలమార, మంచాలూ, డైనింగ్ టేబిలూ,కుర్చీలూ, కలర్ టీవీ ఎవేవో కొన్నారు అల్లుడికి. ఇతడు మోటర్ సైకిల్ కూడా అడుగుతున్నాడు. అన్నిరకాల లోన్లూ అయిపోయాయి. ఏమనాలో తెలీయ గుడ్లుమిటకరిస్తున్న తండ్రికేసి జాలిగా చూసింది అవంతి. ఈ సమస్యలని ఎదుర్కోలేకనే ఆడపిల్లలు వద్దు అనుకోవడమో, భ్రూణ హత్యలకి పాల్పడడమో చేస్తున్నారు అనుకుంటున్న అవంతిలో ఆగ్రహం కట్టలు తెంచుకొచ్చింది. 

    "యూ...ఫెలో...గెటవుట్...నేనీ పెళ్లి చేసుకోను. నీ అన్న గుణం లేని నీచుడు. నువ్వు డబ్బుకోసం ఈ ప్లాన్ వేసిన మోసగాడివి. మిమ్మల్ని కన్న తల్లి తండ్రులను నేను నిందించను. నాకు వాళ్ల గురించి తెలీదు. ఛీ...మీలాంటివాళ్లకి భార్యనవడం కన్న అసలు పెళ్లి లేకుండా వున్నా ఫరవాలేదు. గో...అవే" ఉరుములా అరిచింది.

    పందిట్లో వున్నవాళ్లందరూ ప్రతిమల్లా నుంచున్నారు.

    "బాబూ...బాబూ...నామాట విను. ఏమిటమ్మా ఇది..." కంగారుగా హేమసుందర్ అతడిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు.

    "నాన్నా...ఆనీచుణ్ని బ్రతిమలాడడం, వాళ్లతో వియ్యమందడం మీకు అప్రతిష్ఠ. నాకు అగౌరవం. వాళ్లని పొమ్మనండి. ఈ పెళ్లి ఈ రోజు జరగడంలేదని అనౌన్స్ చేయించండి" అంటూ తండ్రి చెయ్యిపట్టుకుని లోపలికి నడిచింది.

    "నాన్నా...నా పెళ్లి నాకు నచ్చిన వాడితో, నా ఇష్టమొచ్చినప్పుడు చేసుకుంటాను. కానీ కట్నం ఇవ్వకుండా. వీళ్లు తక్షణం వెళ్లకపోతే డౌరీ యాక్ట్ కింద పోలిస్ కంప్లైంట్ ఇస్తాను" అంది ధైర్యంగా గట్టిగా.

    వాళ్లు తలలు వంచుకుని వెళ్లిపోయారు. 

    కొందరు పెద్దలు నోరు తెరిచి ఇంక ఈ పిల్లకి పెళ్లవుతుందా అని అనుకున్నారు. యువత మాత్రం అవంతి స్నేహితులూ, శ్రీనివాస్ స్నేహితులూ అందరూ చప్పట్లతో ముంచెత్తారు. 

    "ఈ కుళ్లువ్యవస్థ, ఆర్థిక లాభాలతో బేరీజు వేసి పెళ్లిళ్లలో పేచీలు పెట్టే సోకాల్డ్ పెద్దమనుషులకి అవంతి ఒక ప్రేరణ. యువతకి ఆమె ఒక ఆదర్శం. ఆడపిల్ల అమ్ముడుపోయే అంగడిబొమ్మ కాదు. తల్లిదండ్రులకు గుండెలమీద కుంపటీ కాదు. అమ్మానాన్నా, అత్తామామా, పిల్లలూ భర్తా అందర్నీ చూసుకునే శక్తిమయి. అనురాగబిందువు. కుటుంబంలో ఆమె ఒక కీలక పాత్ర వహించే సమర్థురాలు" అన్నారందరూ... 

    "ఈ పిల్లకు పెళ్లవుతుందా? పిచ్చి ప్రశ్న. తనకి తగిన వరుణ్ణి తనీ చూసుకొంటుంది. అంతవరకూ ఉద్యోగం చేసుకుంటుంది. పెళ్లి అవసరాలు, ఆడవాళ్లకీ, మగవాళ్లకీ ఒకటే" అన్నార్రు పెళ్లికొచ్చిన పెద్దమనుషుల్లో ఒకరు.  
Comments