జగన్నాటకం - ఇందూరమణ

    పదిమంది మధ్యా పంచాయతీ జరుగుతోంది. 

    తీర్పు చెప్పేది పదిమందైనా - ఆ తీర్పు వినడానికి ఆ వూరు వూరంతా అక్కడ చెవులు రిక్కించుక్కూర్చున్నారు.

    అక్కడ - 

    అప్పుడు చర్చిస్తున్న తగువు గొప్ప విచిత్రమైనది కాదు. వింతగా అనిపిస్తోంది అందరికీ. ఇరుపక్షాల వాదనా సబబుగానే తోస్తోంది. కానీ, ఎవరిది న్యాయమో?.. ఎవరిది అన్యాయమో? ఎవరికీ అర్థం కావటంలేదు. 

    పంచాయితీకి రాకముందే వూరంతటికీ ఆ గొడవ తెలుసు. ఆ పదిమంది పెద్ద మనుషులకూ తెలుసు. వాళ్ళ భార్యలకు - పిల్లలకు కూడా తెలుసు.

    కానీ, ఎవరూ... ఏ ఒక్కరూ వ్యక్తిగతంగా నిర్ణయం చెప్పలేక పంచాయితీ ఏర్పాటు చేసారు.

    ఆ వూరు -

    అయిదొందల గడపలకి - అయిదుగురు జమిందార్లకు - ఏభైమంది చిల్లర వ్యాపారస్థులకు - వందమంది ఉద్యోగులకు - కొన్ని వందలమంది కూలీలకి పుట్టినిల్లు.

    వూరు పుట్టకముందు జంతువులు తిరుగాడిన ఆ కొండ 'సింహగిరి' ప్రాంతం గానూ -

    ఆ సింహగిరి శిఖరంమీద 'సింహాద్రి అప్పన్న' వెలయడంతో ఆ స్వామి సింహశైలుడై - ఆ సింహగిరి శిఖరం సింహాచలంగా గ్రామమై మనుషులకు నిలయమైంది. 

    ఇప్పుడావూర్లో - ఆ సింహగిరి శిఖరం మీద మనుషులు - జంతువులు - ముగ్గురు దేఁవుళ్ళు  ఉంటున్నారు.

    ఆ వూరు -

    రోజూ వచ్చీపోయే యాత్రీకులతో కళకళలాడుతుంటుంది. ఆ యాత్రికులకు కావలసిన అత్యవసర సరుకులు అమ్ముకుంటూ జీవిస్తున్నవాళ్లు కొందరైతే - 

    ఆ యాత్రికుల అవసరాలని ఆసరా చేసుకుని 'ఆస్తులు' ఆర్జించేవాళ్లు మరి కొందరు ఉన్నారావూర్లో.

    ఆ దేఁవుడికి సపర్యలు చేయడానికి పూజారులు -

    ఆ దేఁవుడి రాబడికి జమాఖర్చులు సరిపుచ్చడానికి - ఆ జమాఖర్చులు సరిపుచ్చే అధికారులకు సేవలు చేయడానికి కొందరు ఉద్యోగులూ ఉన్నారావూర్లో.

    యాత్రీకుల్ని మోసం చేసి బ్రతికే వ్యాపారస్థులు - 

    ఆ వ్యాపారస్థుల్ని 'లంచం' పేరుతో కాల్చుకు తినే ఆఫీసర్లూ -

    ఆ ఆఫీసర్లందరకూ అధికారై సొంతూర్లో దేఁవుడి ధర్మమా అని లంకంత ఇల్లు ఈ మధ్యే కట్టగలిగిన కార్యనిర్వహణాధికారి - 

    - ఎందరో ఉన్నారావూర్లో.

    ఆ వూరు పేరుకు పల్లెటూరు. కానీ ఆ వూర్లో 'ధరలు' పట్నంలోని ధరలకంటే ఖరీదయినవి. 

    ఉదయం లేస్తే ఆ వూరు డబ్బులో మునిగి తేలుతుంది.

    యాత్రీకులు డబ్బు జల్లిపోతే ఆ డబ్బు ఏరుకు బ్రతుకుతున్నారా వూరి ప్రజలు.

    అందుకే ఆ వూరివాళ్ళ కెవరికీ డబ్బు విలువ తెలియదు.

    అలాంటి ఆ వూర్లో...

    ఆ వారం రోజులుగా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిన విషయం - ఆ తగవు తన్నుకున్నవరకూ వచ్చింది.

    ఆఖరిదశలో ఆ 'గొడవ' పంచాయితీ ముందు నిలబడింది. 

    "మీ ఇద్దర్లో ఒకరు నిలబడి ముందు విషయం వివరించండి" గ్రామ పెద్దల్లో ఒకతను అన్నాడు.

    ఒక నడివయస్కురాలు లేచి నిలబడింది.

    ఆమె ఎర్రగా - ఏపుగా ఉంది. శరీరం కుదురుగా ఉంది. లావుగా ఉన్నా - ఆ లావుకు తగ్గ పొడవుగానూ ఉందామె. 

    అందంగా కనిపించినా 'అణకువ' అందరినీ ఆకర్షిస్తోంది.

    ఆమె పేరు సత్యవతి.

    ఆమె అందరిలాంటి వ్యక్తి కాదు.

    పరువూ - మర్యాదగల కుటుంబం నుండి వచ్చింది. భర్త కనుసన్నలలో మెదులుతూ వ్యాపార నిర్వహణలో భర్తకు అండగా ఉంటోంది.

    ఆమె మహా మేధావిని. ఆ వూర్లో ఆడవాళ్ళందరకూ తల్లో నాలుకలా మసల్తోంది సత్యవతి. చదువుకున్న సంస్కారవంతురాలు ఆమె.

    పరాయి సొమ్ముకు - కిరాయి దమ్ముకు తలవొగ్గని ఆడపులి సత్యవతి.

    మాటపట్టింపులకొస్తే ఆ రెంటిని మించీన పంతం - పట్టుదల గల వ్యక్తి సత్యవతి.

    ఎవరిదన్నా పైసా తనదగ్గరుంటే ప్రత్యేకంగా ఆ పైసాగలవాళ్ళను పిలిచి ఇచ్చేస్తుంది. ఎవరిదగ్గరన్నా తనకు పైసా రావలసి ఉన్నా వాళ్ళు ఇచ్చేవరకూ అడిగే తత్వం ఆమెది. పైగా వాళ్లే ఇంకా అవసరం ఉందని వందా - ఏభై అడిగితే లేదనకుండా ఇస్తుంది.

    ఎంత మంచిదో - అంత చెడ్డది. 

    పెద్దలందరికీ రెండు చేతులూ జోడించి నమస్కరించింది సత్యవతి.

    "నేను 'చీటీలు' నిర్వహిస్తున్న విషయం మీ అందరకూ తెలుసు. ఆ చీటీలు వెయ్యిరూపాయల నుండి ఏభై వేల రూపాయల వరకూ నేను నిర్వహిస్తున్నాను.

    వెయ్యి రూపాయల చీటీలో వంద మంది సభ్యులు ఉన్నారు. వందమందిమీ వారానికి తలో పదిరూపాయలు వేసుకుని - ఆ వారం ఎత్తుబడి అయిన వెయ్యిరూపాయలు మా వందమందిలో ఒక ఆసామికి డ్రా తీసి ఇచ్చేస్తాము. ఆ బాధ్యత నేను పడుతున్నాను. 

    ఈ చీటీ నిర్వహించే బాధ్యత వలన నాకు లాభమేమిటని మీరు అడగొచ్చు. డ్రా పద్ధతి లేకుండా ముందుగా - మొట్ట మొదటి చీటీ ఎత్తుబడి వెయ్యి రూపాయలూ నేను తీసుకున్నాను. ఆ వెయ్యీ నా అవసరానికి పనికొస్తుంది కదా!

    ఆ వెయ్యి రూపాయల చీటీలో ఈ ఆసామి తనూ ఓ సభ్యురాలై పది రూపాయలు వారం - వారం క్రమం తప్పకుండా కడుతోంది.

    ఏభైతొమ్మిది మంది ఇప్పటికి తెగారు. 

    ఇంకా నలభై ఒక్క సభ్యులున్నారు. 

    నలభై తొమ్మిదో చీటీ వసూలు వెయ్యిరూపాయలు డ్రా తీసిన వెంటనే ఈవిడకి  ఇచ్చేసాను. కాని, ఈవిడ నేను సొమ్ము ఇవ్వలేదంటోంది" సత్యవతి చెప్పింది. 

    "మీరు ఆమెకి వెయ్యిరూపాయలు ఇస్తుండగా ఎవరైనా చూసారా?" గ్రామాధికారుల్లో ఒకడు.

    "లేదు."

    "ఎప్పుడిచ్చారు?"

    "చీటీ డ్రా తీసిన వెంటనే ఆమె పేరు రావడంతో అక్కడే వెయ్యి రూపాయలు ఇచ్చేసాను"

    "నలభై తొమ్మిదవ చీటీ వసూలయి ఎంతకాల మయింది?"

    "మళ్లా పది వారాలు కూడా తెగిపోయాయి."

    "మీరు ఇంతకాలంగా ఇలా గొడవ పడుతూనే ఉన్నారా!?"

    "లేదు. వారం నుండి ఆమె తనకి నేను వెయ్యి రూపాయలు ఇవ్వలేదని అడుగుతోంది."

    "మీరు నిజంగా ఇచ్చేసారా?"

    "నా పిల్లలమీదొట్టు. ఇవ్వకుండా నేను ఇచ్చానని ఎలా ఈ పాపిష్టి నోటితో అబద్ధమాడతాను."

    "మీరు కూర్చోండి"

    సత్యవతి వెళ్ళి తన జాగాలో కూర్చుంది.

    "నువ్వు కూడా జరిగింది చెప్పమ్మా?" గ్రామాధికారి అన్నాడు.

    నలభై ఏళ్ళకు పైబడి తలనెరసిన ఓ ఆడమనిషి లేచి నిలబడింది.

    నల్లగా - బలంగా ఉందామె. పండుతల ముగ్గుబుట్టలా ఉంది. కానీ, ఆమె మొహం రక్తపుష్టితో నిగ... నిగలాడుతోంది.

    ఉక్కు ముక్కలా ఉందామె.

    ఆమె నల్లని నుదురుమీద రూపాయికాసంత కుంకుమబొట్టు నీలాకాశంలో చంద్రుడిలా ఉంది. 

    ఆమె నుదుటి కుంకుమబొట్టు క్రింద నాసికం పైభాగాన విభూదిరేఖ అద్దుకుంది.

    ఆమె భక్తురాలు.

    ఆడితప్పని సత్యహరిశ్చంద్రుడి వంశానికి వారసురాలు.

    ఆమె కన్నవాళ్లు ధనవంతులు. కట్టుకున్నవాడు కిరాణా దుకాణం నడుపుతున్నాడు.

    ఆమె పరులకి ఉపకారం తప్ప అపకారం చెయ్యదు.

    ఆ భార్యాభర్తల మంచితనం వలనే అంత వూరికి అయిదారు కిరాణాదుకాణాలు లేకుండా ఒకే ఒక దుకాణం నిలబడగలిగింది.

    ఆమె పేరు సౌభాగ్యలక్ష్మి. అతని పేరు సన్యాసయ్యశెట్టి.

    సౌభాగ్యలక్ష్మి లేచి నిలబడి తన బొంగురుగొంతు సవరించుకుంది.

    "మా ఆయనకు కిరాణా దుకాణం ఉందని మీ అందరకూ తెలుసు. ఆయన రోజువారీ అమ్మకం తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఏరోజుకారోజు పైకం సరిచూచుకొని సరుకులు తెప్పిస్తుంటాము. మాకు మిగులు కనిపించే సొమ్ముని 'చీటీ'ల క్రింద కడుతుంటాను నేనే. ఆయన అనుమతి తీసుకొని కడుతుంటాను.

    దాదాపు వారానికి, నెలకి, పదిహేను రోజులకీ కలిసి ఇరవై చిన్నా - పెద్దా చీటీలలో ఉన్నాను.

    ఏ ఒక్క చీటీలోనూ ఎవరికీ ఇప్పటికి ఎవరిదగ్గరా ఢోకా రాలేదు. సత్యవతి కూడా ఇంతకుముందు నేను కట్టిన చీటో పైకం సకాలంలో సక్రమంగా ఇచ్చేసేది. 

    ఈ వెయ్యిరూపాయల చీటీ పిల్లల బట్టలకోసం మా ఆయనకు తెలియకుండా వారానికి పది రూపాయలే కదా అని కట్టడానికి కలిసాను.

    నా చీటీ డ్రా తీసినరోజే అనుకోకుండా అర్జెంటుగా వూరెళ్లాల్సి వచ్చి వెళ్ళాను. ఈ వారమే తిరిగొచ్చాను. 

    వూర్నుండొచ్చి నా చీటీ పైకం ఇమ్మంటే సత్యవతి ఇచ్చేసానంటోంది. ఇదేఁవన్నా ధర్మంగా ఉందాండీ" సౌభాగ్య లక్ష్మి అంది. 

    "నభై తొమ్మిదవ వారం చీటీ ఎత్తుబడి అయినప్పుడున్నారా?"
  
    "ఉన్నాను."

    "ఆ వెంటనే పైకం అడిగి పుచ్చుకోలేదా?"

    "డ్రాలో నా పేరే పలికింది. ఆ రాత్రే మా నాన్నకు బాగాలేదని టెలిగ్రాం వస్తే వెళ్ళిపోయాను."

    "డ్రా అయిన వెంటనే మీకు పైకం ఇచ్చేసానంటోంది సత్యవతి." 

    "లేదండీ... లేదు. నా పిల్లల మీద - నా భర్తమీద ప్రమాణంచేసి చెప్తున్నాను. నన్ను నమ్మండి."

    "ఆమె కూడా అలాగే అంటోంది."

    "అయితే నన్నేం చేయమంటారు" బేలగా అంది సౌభాగ్యలక్ష్మి.

    "మీరు వెళ్ళి కూర్చొండి."

    గ్రామాధికారి మాట విని తన జాగాలోకి వెళ్ళి కూర్చుంది ఆమె. 

    గ్రామాధికారి, మిగతా పంచాయితీ దారులు కలిసి చాలాసేపు తర్జనభర్జనలు జరిపారు. వాళ్ళెవరికీ ఏ విషయం పాలుపోవటం లేదు.

    ఆ వెయ్యి రూపాయల చీటీలో సభ్యులు నలుగుర్ని పిలిచి అడిగారు. 

    'చీటీ డ్రా మా సభ్యులందరి సమక్షంలోనూ జరుగుతుందని, సౌభాగ్యలక్ష్మి గారు కూడా ఆ రోజు వచ్చారని చెప్పా'రా నలుగురు.

    సాధారణంగా డ్రా అయిన అరగంట లోపల చీటీ పైకం పేరు పలికినవారికి  ఇచ్చేయడం పరిపాటని, ఆ రోజు కూడా అలాగే ఇచ్చేసుండాలని మళ్ళా అన్నారా నలుగురు.

    కానీ, ఆ పైకం సత్యవతిగారు సౌభాగ్యలక్ష్మిగారికి ఇవ్వగా మాత్రం మేమెవరం చూడలేదన్నారు. 

    పంచాయతీ పెద్దమనుషులెవరికీ ఎవరి వాదనలోనూ అన్యాయం గోచరించలేదు. ఇరుపక్షాల వేదనా ఒకటే.

    పంచాయితీ తీర్పు వినడానికి వచ్చిన ప్రజలు మాత్రం రకరకాలుగా గుసగుసలాడుకున్నారు.

    ఆ తగవు తెగని సమస్య అయి కూర్చుందక్కడ.

    "మీ ఇద్దరు చెప్తున్నది బాగానే ఉంది. కానీ, మాకు మీ ఇద్దరిలో ఎవరివైపూ న్యాయం గోచరించటం లేదు. ఈ తగవు తీర్చటం మా వలన అయేది కాదు.

    "మీరే ఎలాగో గొడవలు లేకుండా సామరస్యంగా సమస్యను తేల్చుకోండి. మేమింతకంటే ఏం చెప్పలేం."

    గ్రామాధికారి లేచి నిస్సహాయంగా అనేశాడు. 

    గ్రామాధికారి చెప్పినదాంట్లోనిజం అర్థం అయింది అందరికీ.

    "అదికాదండీ! ఎలాగూ సత్యవతి నాకు వెయ్యి రూపాయలూ ఇచ్చేస్తాననటోంది కదా. గర్భగుడిలో చందనం మధ్య ఉన్న సింహాద్రి అప్పన్న దీపం దగ్గర నాకు సొమ్ము ఇచ్చేసానని ప్రమాణం చేసి దీపం ఆర్పెయ్యమనండి" కోపంగా అంది సౌభాగ్యలక్ష్మి.

 

    "ఆర్పుతాను. నేనెందుకు ఆర్పను. నాకేమన్నా భయమా? చీటీ పైకం ఇవ్వకపోత కదా నాకు బెరుకు. పదండి. అందరిముందూ ప్రమాణం చేసి ఆర్పుతాను" నవ్వుతూ అంది సత్యవతి.

 

    సౌభాగ్యలక్ష్మి నిర్ణయానికి అందరూ ఆమోదించారు.

 

    ఆ వెనువెంటనే ఉన్న ఫలంగా అందరూ దేవాలయంలోకి దారితీసారు.

 

    'తెగని ఆ తగవుని ఆ దేఁవుడే తేల్చాలి' మనసులోనే అనుకొని అందరూ ఆలయానికి బయలుదేరారు.

 

    గర్భగుడిలో పూజారి సత్యవతి చేత ప్రమాణం చేయించాడు. అరచేత్తో  ఆ దీపాన్ని ఆర్పేసింది సత్యవతి.

 

    సత్యవతి ప్రమాణం చేసి ధైర్యంగా దీపం ఆర్పెయ్యడాంతో ప్రజలందరికీ సత్యవతి చెప్పేది నిజమని నమ్మకం ఏర్పడింది.

 

    'చీటీ పైకం అందుకొని తగుదునమ్మ అని మళ్ళా ఇవ్వలేదని ఎలా అబద్ధాలాడుతోంది సౌభాగ్యలక్ష్మి. ఎంత నంగనాచిలా కబుర్లాడింది.'

 

    అందరూ అదే ఉద్దేశ్యంతో సౌభాగ్యలక్ష్మిని మనసులో తిట్టుకొని ఆమె మొహంలోకి ఏవగింపుగా చూసారు.

 

    అలా అందరూ తన్నే దోషిగా నిర్ణయించి చూసేసరికి అవాక్కయిపోయింది సౌభాగ్యలక్ష్మి. 

    ఇక లాభం లేదు. తననీ ప్రజలు బ్రతకనివ్వరు. చీటీ పైకం పోయి - వీళ్ళందరి చీదరింపులకు తల వంచనా? తనకి సత్యవతి వెయ్యిరూపాయలు ఇవ్వలేదు... ఇవ్వలేదు. అలా అని తనూ ప్రమాణం చేస్తే సరి. సౌభాగ్యలక్ష్మి మనసులో ఆ ఆలోచన మెదిలే సరికి గంభీరంగా అంది.

    "పూజారిగారూ! ఆ దీపం ఇలా నా ముందు పెట్టంది. నేనూ ప్రమాణం చేస్తాను."

    ఆరిపోయిన దీపాన్ని తిరిగి వెలిగిస్తున్న పూజారి ఆశ్చర్యపోయాడు. మారుమాట్లాడకుండా వెలిగించిన దీపాన్ని ఆమె ముందుంచాడు. 

    "నా భర్త సన్యాసయ్యశెట్టి సాక్షిగా - ఈ సింహాద్రి అప్పన్న పాదాల సాక్షిగా నాకు సత్యవతి చీటీ పైకం వెయ్యి రూపాయలు ఇవ్వలేదు. నాకా వెయ్యి రూపాయల్లో ఒక్క పైసా ముట్టలేదు."

    సౌభాగ్యలక్ష్మి కూడా మనస్పూర్తిగా ప్రమాణం చేసేసరికి ప్రజలు మళ్ళా అయోమయంలో పడ్డారు.

    ఆ తగవు ఆ రోజుతో ఆగిపోయింది.

    సత్యవతి వెయ్యిరూపాయలు ఇవ్వలేదు.

    సౌభాగ్యలక్ష్మి ఆ వెయ్యిరూపాయలు ఇమ్మని అడగాలేదు.

    కానీ,

    ప్రజలు మాత్రం నోళ్ళు నొక్కుకున్నారు.

    "ఎంతకు తెగించారమ్మా ఇద్దరూ. దేఁవుడి ముందు దీపం ఎంత ధైర్యంగా ఆర్పేసారు. ఏ పాపం తెలియనిదానికేం పర్లేదుగాని అబద్ధం ఆడుతున్నదానికి మాత్రం పుట్టగతులుండవు.

    సర్వనాశనం అయిపోతుంది వెధవ ముండ ఎవర్తో!"

    అందరూ నానారకాలుగా ఊసులాడుకోవటంతో సహజసిద్ధంగా దైవభక్తురాలైన సౌభాగ్యలక్ష్మి మాత్రం మానసికంగా కృంగిపోసాగింది. 

    "నిజంగానే సత్యవతి తనకి వెయ్యి రూపాయలూ ఇచ్చేసిందా? ఇవ్వకపోతే అంత గట్టిగా బల్లగుద్దినట్టు ఎలా చెప్పగలుగుతుంది? కోవెల్లో దీపం ఎలా ఆర్పేస్తుంది? అయినా, సత్యవతి గురించి తనకి బాగా తెలుసు కదా! ఎవరిదీ పైసా తన దగ్గర ఉంచుకోదు. అలాంటిది తన వెధవ వెయ్యిరూపాయలు కాజెయ్యడానికి ప్రయత్నిస్తుందా?"

    సౌభాగ్యలక్ష్మి మనసు మూలగడం ప్రారంభించింది.

    ఆమె ఆలోచన్లలాగే - ఆమె మానసిక వేదనలాగే - విధి కూడా వక్రించింది. 

    ఆ వారం తిరక్కుండానే హఠాత్తుగా సన్యాసయ్యశెట్టి షాపులో కూర్చున్న  వాడల్లా కూర్చున్నట్టే వెనక్కి తిరగవడి చచ్చిపోయాడు.

    పుట్టి బుద్ధెరిగి ఏ జబ్బూ - జ్వరానికి మంచమెక్కి ఎరుగని దుక్కలాంటి మనిషి సన్యాసయ్యశెట్టి చనిపోయాడు.   

    సౌభాగ్యలక్ష్మి మనసు పూర్తిగా పాడైపోయింది.

    తన భర్తను తనే చంపుకుంది. తను దుర్మార్గురాలు. హంతకురాలు. తన పాపానికి నిష్కృతి లేదు.

    రానురాను సౌభాగ్యలక్ష్మి మానసికంగా దిగజారిపోసాగింది. సరిగ్గా తినక రాత్రులు నిద్రలేక... క్షణం... క్షణం ఆలోచనల్తో... ఆరాటంతో గడపడం వలన శరీరం క్షీణించటం ఆరంభించింది. 

    సౌభాగ్యలక్ష్మి మంచంపట్టింది.

    మంచంమీద లేవలేని స్థితిలో... భర్తపోయిన దుఃఖంతో ఆరోగ్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతుంటే ఆమెని మరింత చిత్రవధ చేయసాగారు లోకులు. 

    "తగుదునమ్మా అని ముష్టి ముదనష్టపు రూపాయలకి బంగారంలాంటి బ్రతుకుని - దేఁవుడిలాంటి భర్తని పోగొట్టుకుంది. ముచ్చటైన జీవితాన్ని మూన్నాళ్ళ ముచ్చట చేసుకుంది దౌర్భ్గ్యురాలు" నానా రకాలుగా తిడుతూ సూటిపోటి మాటల్తో ఆడిపోసుకోసాగారు ప్రజలు.

    అదే సమయంలో ... ఓ రాత్రి - 

    సత్యవతి దంపతులు దుకాణం కట్టేసి చీటీల పద్దులు వ్రాసుకుంటూ కూర్చున్నారు.

    భోషాణం పెట్టి తెరుచుక్కూర్చుంది సత్యవతి.

    చీటీల సొమ్ము వేటికవి లెక్కకట్టి వేరే చేస్తోంది.

    ఎవరికి ఇవ్వాల్సిన సొమ్ము వాళ్ల పేర కాగితం వ్రాసి - ఆ కాగితం మధ్య ఆ రూపాయనోట్లు పెట్టి చుట్టి కట్టలు కడుతున్నాడు ఆమెభర్త.

    రోజువారీ అమ్మకం తాలూకా సొమ్ము తీసి తనముందు కుప్పగా పోసుకుంది సత్యవతి.

    రెండు నెలల అమ్మకం అది. సరిగ్గా అమ్మకాలు లేక రెండు మాసాల నుండీ సరుకులకు వెళ్ళలేదు. రేపు భర్తని సరుకులు తేవటానికి ఏటికొప్పాక ప్రయాణం చేయించింది సత్యవతి. 

    చిందరవందరగా ఉన్న నోట్లలో దారంవుండలా పొడుగుగా... గుండ్రంగా తెల్లకాగితం చుట్టూ దారంకట్టిన ఓ పొట్లాం సత్యవతి దృష్టిని ఆకర్షించింది. 

    ఆశ్చర్యంగా ఆ పొట్లాన్ని విప్పింది సత్యవతి. 

    ఆ తెల్ల కాగితం మీద -

    "శ్రీమతి తేడా సౌభాగ్యలక్ష్మి వైఫాఫ్ సన్యాసయ్య శెట్టి గారికి నలభైతొమ్మిదవ చీటీ వసూలు పైకం వెయ్యిరూపాయలు ఇవ్వవలసినది" అని వ్రాసి ఉంది.

    సత్యవతి ఆశ్చర్యంతో అవాక్కయి పోయి భర్తకు చూపించింది.

    భార్యా భర్తలిద్దరికీ ఏం చేయాలో తోచలేదు. 

    ఆ విషయం బైటపడితే తమ పరువు పోతుంది. పోనీ, ఆ వెయ్యీ ఉంచేసుకుంటే ఆ దేఁవుడి గుడిలో దీపం ఆర్పిన పాపం చుట్టుకుంటుంది. 

    ఏం చేయాలో అర్థంకాలేదు భార్యాభర్తలిద్దరికీ.

    ఆ మరునాడు -

    భార్యాభర్తలిద్దరూ తలారా స్నానం చేసి దేఁవుడి ధర్మ హుండీలో వేసేసింది సత్యవతి.

    వెయ్యి రూపాయలు హుండీలో వేస్తూ - 

    "స్వామీ! నా వలన పొరపాటు జరిగిపోయింది. నా పొరపాటువలన పరువు - మర్యాద పోయి - భర్తను పోగొట్టుకున్న సౌభాగ్యలక్ష్మిని కాపాడు. ఆమెకు ఆయురారోగ్యాలూ ప్రసాదించు. ఆమెను కాపాడి ధర్మాన్ని నిలబెట్టు స్వామీ."

    మనస్ఫూర్తిగా భార్యాభర్తలిద్దరు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసారు.

(సెప్టెంబరు 1985 యువ మాసపత్రికలో ప్రచురితం)    
Comments