కడలి కెరటం - యస్వీ కృష్ణ

        'ఓపెన్ ఎయిర్ జైలు...చర్లపల్లి'
    సమయం... మధ్యాహ్నం రెండు గంటలా ఇరవై నిమిషాలు!

* * *

    "పేరు...?"

    చెప్పాను.

    "ఏంటీ...?" వినబడలేదనుకుంటాను - "గట్టిగా చెప్పు?" అన్నాడు.

    "అమర్..." మాట పెగలక పోయేసరికి ఓసారి గొంతు సవరించుకొని చెప్పాను మళ్లీ -

    "అమర్!" ఎందుకో నా గొంతు నాకే వింతగా వినిపించింది.

    "తండ్రి పేరు?"

    చెప్పాను.

    అది రిజిస్టర్‌లో నోట్ చేసుకుని తలెత్తి విసుగ్గా అన్నాడు " ఊ... షర్టు విప్పు!"

    నాకు వెంటనే అర్థం కాలేదు.

    "సారు జెప్పేడ్ది యినబడ్తలేదా? అంగీ యిప్పు!" ప్రక్కనున్న సెంట్రీ గొంతు కరుకుగా ధ్వనించడంతో గబగబా చొక్కా విప్పి చేతిలో పట్టుకున్నాను.   అతను నా దగ్గరగా వచ్చి నా మెడ మీద, ఛాతీ మీద, వీపు మీద పరీక్షగా చూస్తూ - "ఎనకాల యీపు మీద ఒకటి సారు!" అన్నాడు.

    "ఊ...ఇంకా?" అన్నాడు అతను చెప్పింది రిజిస్టర్‌లో నోట్ చేసుకుంటూ.

    "పాయింటు యిప్పు!" ఈసారి గద్దించినట్లుగా అన్నాడు సెంట్రీ.

    "ఎందుకూ...?" భయమో, అర్థంకాని అయోమయమో... నా గొంతుని వణికించింది.

    "ఎందుకేంది? పుట్టుమచ్చలు నోట్ జెయ్యాలె..." అంటూ నా వెనక నిల్చున్నవాళ్ళ వైపు  తిరిగి, "యేందట్ల జూస్తున్నర్? మీరు కూడా అంగీ పాయింట్లు యిప్పి చేతుల్ల పట్టుకోండ్రి!" అన్నాడు.

    క్యూలో నా వెనుక నిలుచున్న వాళ్ళు అతని ఆర్డర్‌ని వెంటనే అమలులో పెట్టసాగారు. అప్రయత్నంగా నా చేతులు నడుం దగ్గరికి వెళ్లాయి.

    జీవితంలో మొట్టమొదటిసారు సిగ్గేసింది - అంతమంది ఎదుట కంటే 'అలాంటి' స్థితిలో నగ్నంగా నిలబడాల్సి వచ్చినందుకు! అసలు నేను ఎప్పుడైనా అనుకున్నానా, ఊహించానా - ఇలాంటి చోటుకొస్తాననీ, ఇలాంటి స్థితి అనుభవంలోకి వస్తుందనీ!

    సెంట్రీ మా దగ్గరికి వచ్చి బ్లేడుతో అందరి మొలతాళ్లనీ పుటుక్కున తెంపి ప్రక్కనున్న డస్టుబిన్‌లో పడేశాడు. లోపలికెళ్లాక మొలతాడు గొంతుకి బిగించుకుని 'ఆత్మహత్య' చేసుకుంటామనో, లేక పక్కవాడి గొంతుకి బిగించి 'హత్య'కు పూనుకుంటామేమోనన్న అనుమానం కావచ్చు - ముందుగానే అలా మొలతాళ్లు కత్తిరించేయడం!

    పుట్టుమచ్చల నమోదు పూర్తయినట్లుంది - "ఇగ బట్టలేస్కొని ఆడికి బోయి నిలబడు!" అన్నాడతను.

    నేను కదలబోతుండగా "ఉండండి సార్...నేనూ వస్తున్నాను..." అంటూ ఓ చేత్తో ప్యాంటూ, మరో చేత్తో షర్టూ ఉండలా చుట్టిపట్టుకుని నా వెనకే వచ్చాడు - మొదటినుంచీ వరుసలో నా  తరువాత ఉన్న వ్యక్తి.

    నేను ఆ కర్టెన్ వెనుకనుంచి బయటకు వచ్చి బట్టలు వేసుకుని కారిడార్‌లో సెంట్రీ చూపించిన ఇంకో గది ముందు లైనులో నిల్చున్నవాళ్ళదగ్గరికి వెళ్లి నిల్చున్నాను.

    నా తరువాతి వ్యక్తి కూడా గబగబా వచ్చి నా వెనుక నిలబడ్డాడు - "ఏంటో...ఏమీ అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది..." అంటూ చిరాగ్గా.  చిరాకులోనూ అతడి కళ్ళలో అయోమయం, భయం చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి.

    నేను అతడి ముఖంలోకి చూసి నిర్లిప్తంగా ఓ చిరునవ్వు విసిరి పెదవి విరిచాను - అతడి భావప్రకటనకి బదులుగా. ఎందుకో...నా నవ్వు నాకే అసహజంగా అన్పించింది.

    క్యూ ముందుకి సాగుతున్నకొద్దీ మేమూ ముందుకి కదుల్తున్నాం.

    ఒకసారికి ఇద్దర్ని చొప్పున గదిలోకి వదుల్తున్నాడు - తలుపు దగ్గరున్న ఇంకో సెంట్రీ. లోపల్నుంచి ఇద్దరు బయటకు రాగానే మరో ఇద్దరు గదిలోకి వెళ్తున్నారు.  

    "నా పేరు సదానంద్... మీ పేరేంటి సార్?"

    నేను తలతిప్పి నా వెనకున్న వ్యక్తి ముఖంలోకి చూశాను. 

    పరస్పర పరిచయానికి కాబోలు అడుగుతున్నాడు. ఇక్కడ - ఇప్పుడు ఈ స్థితిలో పరిచయం చేసుకోవడం...ఎందుకో గమ్మత్తనిపించింది. బదులుగా ఎప్పటిలాగానే నిర్లిప్తంగా నవ్వి ఊరుకున్నాను.

    "ఇక్కడ కూడా సీరియస్సేనా సార్? ఫ్రీగా ఉండండి... మాట్లాడండి!" అన్నాడు సదానంద్. 

    నిజమే...ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా సీరియస్‌గా ఉండడమేమిటి? జరగాల్సిన అన్ని అనర్థాలూ జరిగిన తర్వాతే 'ఇక్కడికి' చేరుకున్నాను. ఇంకా ఆలోచించి ఏం ప్రయోజనం? ఈ జైలు గేటు లోపలికి అడుగు పెట్టినప్పుడే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి నాతో పాటు ఈ క్యూలో ఉన్నవాళ్ళందరికీ! మా భావాలు బయటి ప్రపంచానికి ప్రసరించే అవకాశమే లేదు. మరెందుకీ అనవసరమైన ఆలోచనలు?

    "నా పేరు అమర్..." అతడి ప్రశ్నకి బదులిస్తున్నట్లుగా చెప్పాను.

    నేను ఈ గేటు లోపలికి అడుగుపెట్టినప్పటి నుండీ జైలు రికార్డుల్లో మా వివరాలు రాసుకునే ప్రతిచోటా నా తరువాతి నంబర్ అతనిదే! ఒకవేళ ఇక్కడ  మాకు గదికి ఇద్దర్ని చొప్పున కేటాయిస్తే గనుక మేమిద్దరమూ ఒకే గదిలో ఉండాల్సిరావచ్చు.

    "ఏం చేస్తుంటారు?" అడిగాడతను ఆసక్తిగా.

    ఏం చెప్పను? చెప్పినా అతనికి అర్థమవుతుందా? అసలిలాంటి 'పని' ఒకటుంటుందని అతడి ఊహకైనా అందుతుందా?

    "చెప్పినా నీ కర్థం కాదులే!"

    నిజంగా అర్థం కాదనుకున్నాడో, లేక నేనన్నమాటలే అర్థం కాలేదో తెలీదు కాని - కాసేపు మౌనంగా ఉండిపోయి, అడిగాడు మళ్లీ - "ఏం చేశార్సార్? అంటే...ఏం చేసి ఇక్కడికొచ్చారు?

    నాకు మరోసారి నవ్వొచ్చింది, నేనేం చేస్తుంటానో చెప్తేనే అర్థం చేసుకోలేని వాడికి నేనెందుకు ఇక్కడికొచ్చానో చెప్తే మాత్రం అర్థమవుతుందా? అతడి ప్రశ్నకి నిర్లిప్తమైన నా చిరునవ్వే మళ్లీ బదులయ్యింది.

    "చెప్పండి సార్... ఏం కేసు మీది? డౌరీనా...చీటింగా... మర్డరా?"

    "ఫ్లీజ్... కాసేపు కామ్‌గా ఉంటావా?" మాటిమాటికీ నా మౌనం భగ్నమౌతుంటే చిరాకేసింది నాకు.

    "ఎందుకు సార్... అంత కోపం? ఇప్పుడు నేనేమన్నాననీ...!"

    నా మాటలకి నొచ్చుకున్నట్లున్నాడు. నిజమే... నేనలా మాట్లాడకుండా ఉండాల్సిందనిపించింది-

    "సారీ..." అన్నాను అతని వైపు చూసి.

    "అబ్బే... పర్లేదు సార్!"

    ఇంతలో... "మీఇద్దరూ లోపలికెళ్లండి!" అన్నాడు గుమ్మం దగ్గరున్న సెంట్రీ. ఆలోచనల్లో మునిగిపోయి మా ముందున్న క్యూ తరిగిపోయిన విషయం అప్పటిదాకా గుర్తించలేదు నేను.

    నా వెనుకే సదానంద్ కూడా గదిలోకి అడుగుపెట్టాడు.

    ఇక్కడ కూడా ఒక టేబుల్, దానిముందొక కుర్చీ, అందులో కూర్చొని వెడల్పాటి రిజిస్టర్‌లో వివరాలు నోట్ చేసుకుంటున్న ఓ క్లర్క్ ఆ ప్రక్కనే నిల్చున్న ఓ సెంట్రీ ఉన్నారు.

    "ఆ... వివరాలు చెప్పండి!" అన్నాడు క్లర్క్ తలెత్తి.

    మళ్లీ పేర్లు, తండ్రి పేర్లు, మిగతా వివరాలన్నీ నోట్ చేసుకున్న తర్వాత - "మీదగ్గరున్న డబ్బంతా టేబుల్ మీద పెట్టండి!" అన్నాడు నిల్చున్న సెంట్రీ.

    "అదేంటి...ఇక్కడ ఇలా దోచుకుంటారన్న మాట!" నాకు మాత్రమే వినబడేట్లుగా గుసగుసలాడాడు నా వెనకున్న సదానంద్.

    అది వినిపించక పోయినా విషయం అర్థం చేసుకున్న వాడిలా "మీ దగ్గర డబ్బెంతుందో రిజిష్టర్‌లో నోట్ చేసుకుని మీరిక్కడ్నుంచి వెళ్లేటప్పుడు మీ డబ్బు మీకు మళ్లీ ఇచ్చి పంపుతాం!" అన్నాడు క్లర్క్.

    అదెంతవరకు నిజమో కానీ, ప్రస్తుతం మాత్రం తప్పనిసరి కాబట్టి నాతో పాటు సదానంద్ కూడా జేబుల్లోంచి నోట్లూ, చిల్లరా అంతా తీసి టేబుల్ మీద ఉంచాడు.

    ఆ క్లర్క్ ప్రక్కనేవున్న స్కేలు అందుకుని మొదటగా అతడు కుప్పలా పోసిన నోట్లను పక్కకు జరిపి, "ఎంతో చెప్పు?" అన్నాడు సెంట్రీతో లెక్కబెట్టమన్నట్లుగా. అతడు లెక్కపెట్టి ఎంతుందో చెప్తూంటే రిజిష్టర్‌లో నోట్ చేసుకుంటున్నాడు క్లర్క్.

    "అదేంటీ... ఆ చిల్లర కూడా దాదాపు యాభై రూపాయలుంటుంది!" అన్నాడు సదానంద్.

    ప్రక్కనే ఉన్న సెంట్రీ నిర్లక్ష్యంగా "ఇక్కడ కాయిన్స్ లెక్కలోకి తీసుకోం!" అంటూ ఆ చిల్లరంతా ఏరి టేబుల్ మీదే ఓ ప్రక్కగా ఉన్న పొడవాటి రేకుడబ్బాలో పడేశాడు. మరి, ఆ చిల్లరంతా ఎక్కడికి, ఎవరికి చేరుతుందో?!

    "హు...జైలు బయట పావలా బిళ్ళలకీ, అర్థరూపాయి బిళ్ళలకీ విలువే లేదని బాధపడ్తున్నాం కానీ...ఇక్కడ ఒక రూపాయి, రెండ్రూపాయల బిళ్ళలకే కాదు ఐదు రూపాయల బిళ్ళలకి కూడా విలువ లేకుండా పోయిందన్న మాట!" నాకు మాత్రమే విన్పించేటట్లుగా గుసగుసలాడాడు సదానంద్.

    ఈ సారి కూడా నా నిర్లిప్తమైన చిరునవ్వే బదులయ్యింది. 

    ఎవరెవరి దగ్గర ఎంతెంతెంత డబ్బుందో రిజిష్టర్‌లో నోట్ చేసుకున్న తర్వాత మా అందర్నీ సెంట్రీతో వెళ్లమన్నాడు క్లర్క్.

    మేమంతా అనుసరిస్తుండగా...సెంట్రీ మా ముందు నడుస్తూ కారిడార్‌లో కొంతదూరం నడిచి జైలు బిల్డింగు మెయిన్‌గేటు లోపల యాభై అడుగుల దూరంలో ఇనుప చువ్వల్తో పకడ్బందీగా తయారు చేసిన చాలా ఎత్తయిన, దృఢమైన మరో గేటు దగ్గరికి తీసుకెళ్లి అందర్నీ మూడు వరుసల్లో నిలబడమన్నాడు.

    ఆ తర్వాత సీనియర్ క్లర్క్ కాబోలు - చేతిలో పెన్నూ ప్యాడ్‌తో వచ్చాడు - "అందరూ మోకాళ్ల మీద కూర్చోండి!" అని ఆర్డరేశాడు.

    అతడు చెప్పినట్లే చేశామందరం. ఆ తర్వాత మా అందర్నీ ఉద్దేశించి అన్నాడు -

    "నేనెవరెవరి పేర్లు చదువుతానో వాళ్లు చేతులెత్తి లేచి నిలబడండి!"

    నాకు సిగ్గుగా వుంది - ఇంతమందిలో ఎవేరెవరు ఏయే నేరాలు చేసివుంటారో?! ఎన్నెన్ని ఘాతుకాలకి ఒడిగట్టి ఇక్కడికి చేరుకున్నారో?! ఈ రోజూ వాళ్ళతో పాటు నేనూ ఒకడిని కావడం, సెంట్రీల ముందు, జైలు అధికారుల ముందు నగ్నంగా నిల్చునే పరిస్థితి కలగడం, ఇలా మోకాళ్లపై కూర్చొని, చేతులెత్తి నిల్చొని - ఛీ...ఏమిటీ దురవస్థ? అసలు నేను చేసిన నేరమేమిటి? 'యాన్ అన్ఎక్నాలెడ్జిడ్ లెజిస్లేటర్ ఆఫ్ ది వరల్డ్'గా కీర్తింపబడి...సాహిత్యానికే కాక, సమాజానికి కూడా దిశానిర్దేశం చేసే శక్తి గల ఒక 'రచయిత'ను కావడమేనా?

    ఎంత వద్దనుకున్నా బయటి ప్రపంచంలోని నా జీవనం ఇక్కడి ప్రతి కదలికలోను పోలికను తెస్తూ నన్ను బాధిస్తోంది.

    ఆరోజు జైల్లోకి కొత్త ఎంట్రీలుగా వచ్చిన మా అందర్నీ పేరుపేరునా పిలిచి మరోసారి వెరిఫై చేసుకుని శిక్ష ఖరారై వచ్చిన వాళ్ళనీ, రిమాండ్‌పై వచ్చిన వాళ్ళనీ వేరువేరు గ్రూపులుగా విడదీశాడు ఆ సీనియర్ క్లర్క్.

    ఆ తర్వాత - ముందుగా శిక్ష పడిన వాళ్ళని లోపలికి తీసుకెళ్లాల్సిందిగా సెంట్రీకి అప్పజెప్పి, మావైపు తిరిగి అన్నాడు -

    "బెయిల్‌కి అరేంజ్‌మెంట్ చేసుకున్నవాళ్ళు చేతులెత్తండి!"

    నాతో పాటు మరికొందరు చేతులెత్తారు.

    అందరికీ తలా వొక విజిటింగ్‌కార్డ్ సైజులో ఉన్న ఐడెంటిటి కార్డు ఇచ్చాడు. అందులో పేరు, నంబర్, బ్లాక్ నంబర్ లాంటివి రాసివున్నాయి.

    మాలో కొందర్ని సౌత్ బ్లాక్‌లోకి, మరికొందర్ని వెస్ట్ బ్లాక్‌లోకి తీసుకెళ్లమని సెంట్రీలకు చెప్పి, అన్ని ఫార్మాలిటీస్ సక్రమంగా జరిగాయో, లేదో మరోసారి సరిచూసుకుని లోపలికి వెళ్లిపోయాడు సీనియర్ క్లర్క్.

    జైలు గేటు లోపలికి అడుగు పెట్టినప్పట్నుంచీ వరుసలో నా వెనుకే వున్న సదానంద్ - ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు.

* * *

    "ఇక్కడ్న సార్...మీరుండాల్సింది!"

    మొదట్నుంచీ నేనూహించినట్లుగా, ఇంతకు ముందు సినిమాల్లో కన్పించే జైలు సీన్లు చూసి నేను అనుకుంటున్నట్లుగా అపరిశుభ్రంగా, చీకటిగా, ఇరుకుగా ఉండే చిన్నగది లాంటిదేమీ కాదది...

    చాలా పెద్ద హాలు!

    దాదాపు ముప్ఫై అడుగుల వెడల్పూ, నలభై అడుగుల పొడవులో, తెల్లటి టైల్స్ వేసిన గచ్చు, చక్కటి సీలింగ్‌తో గాలీ వెలుతురూ ధారాళంగా ప్రసరిస్తూ చాలా శుభ్రంగా ఉన్న పెద్ద్ హాలది! హాలుకి వెనుకవైపుగా తలుపు దానికి అవతల రెండుప్రక్కలా టయ్‌లెట్స్. ఆ హాలు కెదురుగా అంతే సైజులో, అలాంటిదే మరో హాలు - మధ్యలో కారిడార్. అలా వరుసకి ఆరు హాల్సు చొప్పున నాలుగు దిక్కులా ఉన్నాయి.

    అసలు మమ్మల్ని ఈ బ్లాక్‌వైపు తీసుకొస్తున్నప్పుడే - జైలు లోపలి వెడల్పాటి రోడ్లూ, చుట్టూ చెట్లు, పార్కులూ చూసి నివ్వెరపోయాను. ఏదో యూనివర్శిటీ క్యాంపస్‌లోకి వచ్చినట్లనిపించింది, కాని జైల్లోకి అడుగుపెట్టినట్లు లేదు.

    ఇప్పుడు ఈ బ్లాక్‌లోకి అడుగుపెట్టాక ఖైదీలకు కల్పించిన వసతిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. బహుశా...ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి కాబోలు - ఇంత బావుంది!

    "అట్ల జూస్తరేంది సార్! ఇటుదిక్కుగాని, అటు దిక్కుగాని మీకిష్టమైన జాగ జూస్కుని ఉండుండ్రి. రాత్రి తినే టైమైనప్డు తల్లె (ప్లేటు),గిలాస, బిస్తర్(దుప్పటి) ఇస్త. సమజైనదా?" అన్నాడు - మమ్మల్ని ఆ హాలు దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి. అతని పేరెంటో, ఇక్కడ అతడి డిసిగ్నేషనేంటో తెలీదు మాకు - బహుశా నాలుగో తరగతి ఉద్యోగి కాబోలు.

    "అదేంటీ...మమ్మల్ని మా డ్రస్ లోనే ఉండనిచ్చారు? సినిమాల్లో చూపించినట్లు మాకు తెల్ల డ్రస్ ఇవ్వరా?" అన్నాడు నా ప్రక్కనే ఉన్న సదానంద్.

    "ఇస్తం గాని... ఇప్పుడు గాదు రేపు!" అన్నాడతను.

    "అవునూ...ఇక్కడ ఎవరూ లేరేమిటి? ఈ హాలంతా ఖాళీయేనా?" అంటూ చుట్టూ కలియజూస్తూ లోపలికి నడిచాను.

    నా వెనకే సదానంద్, అతనూ లోపలికి వచ్చారు.

    "ఖాళీ యాడుంటుంద్సార్! అంతా ఔస్ ఫుల్లే! కొందరు బైట జైలు గార్డెన్ పన్ల ఉన్నరు, ఇంకొందరు బట్టలుతుకుడు  కాడున్నరు, ఇంకొందరు బైట వాలీబాల్, క్రికెట్టాడ్తున్నరు!" 

    నాకాశ్చర్యమేసింది. ఏదో అనబోయేంతలో..."మీర్గూడ అట్ల బైటలిపోయి చుట్టుముట్టు సూసిరండి. ఇక్కడ శానా బాగుంటది. ఇది హైటెక్ జైలు సారూ!" అన్నాడతను మళ్లీ.

    "అలాగే...మొదట ఈ హాల్లో మేమెక్కడ సర్దుకోవాలో చూసుకొని వెళ్తాంలె!" అన్నాను.

    నాకు తెలియకుండానే నా మనసు కొంత కుదుటపడ్డట్లుంది. గత కొద్ది రోజులుగా ఎదురౌతున్న పరిస్థితులను జీర్ణించుకోలేని నేను - నా చుట్టూ ఎలాంటి 'వల' బిగుసుకుంటోందో తెలిసేకొద్దీ... నేనెంతటి ఊబిలోకి కూరుకుపోతున్నానో అర్థమవుతూ తర్వాతేం జరుగబోతోందోనన్న ఆందోళన లోంచి పుట్టుకొచ్చే చిత్రవిచిత్రమైన ఆలోచనలతో అలిసిపోయిన నా మనసూ, మెదడూ - చివరి మజిలీ అయిన ఈ జైలుకి చేరుకోవడం వల్ల 'ఇక జరగబోయేదేం లేదు' అన్న ఆలోచనతో కాస్త కుదుటపడ్డట్టున్నాయ్.

    "సార్...ఇక్కడ బాగున్నట్లుంది. మనమిక్కడుందాం సార్! ఇక్కడైతే వాస్తు కూడా బాగుంటుంది!" హాల్లో కుడివైపుకు నడిచి ఓ మూల నిలబడి అన్నాడు సదానంద్.

    'ఇక్కడ కూడా వాస్తు ఏమిటి?' నాకు నవ్వొచ్చింది. ఇంతకుముందులాగా నిర్లిప్తతతో కూడిన నవ్వు కాదది. నిశ్చింతతో కూడిన దిగులు లోంచి వచ్చిన నవ్వది.

    నేను తలూపి, అతడు నిల్చున్న చోటుకి నడుస్తూ హాలు మొత్తం కలియజూశాను...

    అంతకుముందు హాలు గోడలకి అక్కడక్కడా ఏవో పోస్టర్లు అంటించి ఉండటం గమనించాను కానీ, వాటిలో ఏముందో అప్పటివరకూ పరీక్షగా చూళ్లేదు. ఇప్పుడు కాస్త నిశితంగా చూసి, వాటిలోని అక్షరాల్ని చదువుతుంటే ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది నాకు.

    'స్వజాతి సంపర్కం ప్రకృతి విరుద్ధమ'నీ 'క్షేమకరం కాద'నీ తెలుపుతూ... ఈ సందేశాన్ని జంటలు జంట్లుగా వివిధ భంగిమలలో నగ్నంగా ఉన్న మగవాళ్ళ బొమ్మలతో వివరిస్తున్న పోస్టర్లవి. ఇంతకంటే ఎక్కువ భయాన్ని కలిగించిన విషయమేమంటే...ఆ పోస్టర్లలో కొన్ని -

    'స్వజాతి సంపర్కంలో సురక్షిత పద్ధతులు పాటించండి' అంటూ అవేంటో, ఎలా పాటించాలో మగవాళ్ళ నగ్నచిత్రాలతో తెలుపుతున్నాయి. 

* * *

    "నేనిక్కడికి రావడానికి నా భార్యే కారణం సార్!"

    ఆశ్చర్యంగా చూశానతడి వంక.

    నేను అడగకపోయినా తన గురించి చెప్పసాగాడు...

    "నేనామెని చాలా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాన్సార్! మా అమ్మానాన్న నాకు గొప్పగొప్ప సంబంధాలు తీసుకొచ్చినా అన్నిటినీ కాలదన్ని ఆమెను చేసుకున్నాను. తనని ఎంతో ప్రేమించాను. కట్నం కింద నయాపైసా తీసుకోలేదు సరికదా...కట్టుబట్టల్తో పుట్టింటి నుంచి వచ్చిన తనని పెళ్ళి ఖర్చు కూడా నేనే భరించి చేసుకున్నాను. ప్రేమగా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను. మొదట్లో మా అమ్మా నాన్న ఆమెని కోడలిగా ఒప్పుకోకపోయినా - వాళ్ళకి నేను ఒక్కగానొక్క కొడుకును కాబట్టి కొన్నాళ్ళకి వాళ్ళు తమ మనసు మార్చుకుని ఆమెని అభిమానంగా చూసుకోసాగారు. కానీ...కానీ... అదేం చేసిందో తెలుసా సార్?"

    అతడి కంఠంలో, ముఖంలో ఆవేశం పొంగుకొస్తుంటే అతడి వంకే చూస్తూ ఉండిపోయాను.

    "అదీ...అది...మా పక్కింటోడితో సంబంధం పెట్టుకుంది సార్! మా అమ్మానాన్న తిరుపతికి, నేను ఆఫీసు పనిమీద విజయవాడకి వెళ్లినప్పుడు వాణ్ణి మా ఇంటికే రప్పించుకుని కులకసాగింది. నా ప్రయాణం మధ్యలోనే క్యాన్సిలై నేను ఇంటికొచ్చేసరికి బెడ్రూంలో ఇద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు నాకు. వాడైతే వెనుక తలుపులోంచి పారిపోయాడు. కానీ దాన్ని మాత్రం చితకబాదాను..." 

    ఊపిరి పీల్చుకునేందుకో, ఆవేశాన్ని అదుపుచేసేందుకో కొన్ని క్షణాలు ఆగి, మళ్లీ చెప్పసాగాడు -

    "నాకైతే మనసు విరిగిపోయింది సార్! ఇక తనతో సంసారం చేయలేననిపించింది. పెట్టేబేడా సర్దుకొని పుట్టింటికి వెళ్లిపొమ్మన్నాను. అలాగే వెళ్లిపోయింది. కానీ వాళ్ళ అమ్మానాన్నతో మళ్లీ తిరిగొచ్చి పోలీస్‌స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చింది - నేను కట్నం కోసం వేధిస్తున్నాననీ, తనని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నాననీ! అది నిజం కాదని నేనెంత చెప్పినా ఎవరూ విన్పించుకోలేదు. ఆఖరికి ఇదిగో - ఇక్కడికి చేరుకున్నాను!" అని ఓ క్షణమాగి -

    "చట్టాలన్నీ ఆడవాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి సార్...వాటిని నా భార్యలాంటి వాళ్ళు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు" అన్నాడు.

    అతడి చివరి మాటలు నిజమేననిపించాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీకి రక్షణ నిచ్చేందుకు ఏర్పరిచిన చట్టాలు, కల్పించిన అవకాశాలు - నిజంగా వాటి అవసరమున్నవాళ్ళకి ఎంతగా ఉపయోగ పడ్తున్నాయో కాని, ఇలాంటి ఆడవాళ్ళు మాత్రం తమకు అనుకూలంగా చక్కగా వాడుకుంటున్నారు.

    "ఏందన్నా...న్యూ ఎంట్రీనా?" అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కొత్త ముఖాల్లా కన్పించిన మా దగ్గరికి వచ్చి పలకరించాడు.

    అవునన్నట్లుగా తలూపాను నేను. 

    "నా పేరు రాములు...డౌరీ కేసు!"

    - తనని తాను పరిచయం చేసుకుంటూ చేయి ముందుకు చాపాడు షేక్‌హ్యాండ్ కోసం. చాలా సంస్కారవంతంగా అనిపించింది అతడు పరిచయం చేసుకునే విధానం. 

    అతని చేతిలో చేయి వేసి "నా పేరు అమర్..." అన్నాను క్లుప్తంగా.

    "ఏం కేసు?" అడిగాడు వెంటనే. ఇక్కడ ప్రతి ఒక్కరూ పేరు తర్వాత వెంటనే అడిగే ప్రశ్న... ఏ కేసుపై ఇక్కడికి వచ్చావని!

    "కాపీ రైట్ కేసు!" చెప్పక తప్పలేదు - అతనికి అర్థం కాదని తెలిసినా.

    "అంటే...?"

    "అంటే... ఏం చెప్పను? అంతే!" అన్నాను తేలిగ్గా నవ్వేస్తూ.

    "ఏందో...డౌరీ కేసులు, రేప్ కేసులూ, మర్డర్, ఛీటింగ్ కేసుల్లాంటివి విన్నాను గానీ - ఇలాంటి కేసు నేనెప్పుడూ విన్లేదు. సరే...మనం రాత్రికి భోజనాల దగ్గర కలుస్తాం కదా, అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం. సరేనా!" అని - చూపులూ, చేతిసైగలతోనే 'వెళ్లొస్తా'నని చెప్తూ అక్కడ్నుంచి కదిలాడు.

    జైలు అధికార్లు మాకు కేటాయించిన హాల్లో మేమెక్కడ సెటిలవ్వాలో నిర్ణయించుకున్న తర్వాత మా బిల్డింగ్ ఆవరణ అంతా ఒకసారి చూసిరావాలని బయల్దేరాం నేనూ, సదానంద్. అసలు జైల్లోకి వచ్చినవాళ్ళకి ఇంతటి స్వేచ్ఛ ఉండుందని నేనెప్పుడూ ఊహించలేదు.

    ఒక్కో వరుసలో ఆరు చొప్పున నాలుగు దిక్కులా పెద్దపెద్ద హాల్స్ ఉన్న ఆ బిల్డింగ్ చుట్టూ వాలీబాల్ కోర్టూ, క్రికెట్ పిచ్, చక్కటి గార్డెన్, ఓ పద్ధతి ప్రకారం పెంచిన చెట్లూ, విశాలమైన ఆవరణతో ఉన్న ఆ ప్రాంతం జైలులోని ఓ భాగం అనేకంటే...'ఓ ప్రకృతి చికిత్సాలయంలా ఉంది' అనటం భావ్యమేమో?!

    నేనూ, సదానంద్ ఆవరణలో నడుస్తూవుంటే...వాకింగ్ చేస్తూ కొందరు, జాగింగ్ చేస్తూ మరికొందరు కనిపించారు. కొందరు చూపులతోనే నవ్వుతూ పలకరిస్తూంటే...కొందరు ఆగి తమను తాము పరిచయం చేసుకుంటూ మా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 

    ఆ కాంపౌండంతా ఒకసారి తిరిగొచ్చి ఓ చెట్టుకింద వున్న సిమెంట్ బెంచీ మీద కూర్చున్నామిద్దరమూ.

    మాకు కొంచెం దూరంలో కొందరు వాలీబాల్ ఆడుతున్నారు. ఆ ఆటను చుట్టూరా మూగి చూస్తున్నారు ఇంకొందరు. మరికాస్త దూరంలో నీళ్ల పంపు దగ్గర పొడవుగా ఉన్న సిమెంట్ చప్టా మీద బట్టలు ఉతుక్కుంటున్నారు మరికొందరు. మేమిద్దరం తప్ప ఇక్కడున్నవాళ్ళంత తెలుపు రంగులో మోకాళ్ల దాకా ఉన్న నిక్కరు, దానిపై పొట్టిచేతుల చొక్కా వేసుకుని ఉన్నారు. బహుశా నేను కూడా రేపట్నుంచి అదే డ్రస్‌లో ఉంటానేమో...ఒక వేళ నాకు బెయిల్ రాకపోతే!

    అవునూ...మా వాళ్ళు నా బెయిల్ కోసం చేస్తున్న ఏర్పాట్లు ఎంతవరకొచ్చాయో?!

    నాకు నా భార్య కవిత గుర్తొచ్చింది! ఒక్క రోజు కూడా నన్ను చూడకునడా ఉండలేని నా మూడేళ్ల కూతురు రమ్య గుర్తొచ్చింది! మనసులో సుడులు తిరిగిన బాధ ఒక్కసారిగా పైకి తన్నుకొచ్చినందుకేమో... నా కళ్ళు చెమర్చాయి. మోచేతుల్ని మోకాళ్లపై ఆంచి ముందుకి వంగి రెండు అరచేతుల్లో ముఖాన్ని దాచుకున్నాను.  

    అలా ఎంతసేపున్నానో తెలీదు - "సార్..." అన్న పిలుపుతో తలెత్తాను.

    "కాపీరైట్ కేసంటే ఏంటి సార్?"

    నేను వెంటనే బదులివ్వలేదు. సదానంద్ ముఖంలోకి చూస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని అన్నాను -

    "చెప్తాను కానీ అర్థం చేసుకునే ఓపిక నీకుందా?"

    "ఉంది... చెప్పండి సార్!" అన్నాడు వెంటనే.

* * *

    "నేనొక రచయితను. ఈ మాట ఇక్కడ నేను చెప్పుకున్నంత ధైర్యంగా, బాహాటంగా ఈ జైలు బయట చెప్పుకోలేని పరిస్థితి నాది.

    చిన్నప్పట్నుంచీ నాకు సాహిత్యమంటే చాలా ఇష్టం. పురాణాలూ, ప్రబంధాల నుంచి ఈ కాలపు సాహిత్యం వరకూ ఎన్నో పుస్తకాలు చదివాను. నా మనసులోని భావాల్ని చిన్నచిన్న కవితలు, కథలుగా కాగితం మీద పెట్టడం కాలేజీ రోజుల్నుంచే అలవాటయ్యింది నాకు. నోట్‌బుక్స్‌లో రాసుకుని నాకు నేనే చదువుకునే వాటిని చూసిన నా స్నేహితులు కొందరు నేను రాసినవి బాగున్నాయనీ, అవి అలా మరుగున పడకుండా వెలుగులోకి రావాలంటే...పత్రికలకు పంపిస్తూండమనీ సలహాలిచ్చారు. 

    అప్పట్నుంచీ మార్కెట్‌లో వున్న అన్ని పత్రికలకీ నేను రాసినవి పంపించసాగాను. కానీ, ప్రతి పత్రికనుంచీ నా రచనలు తిరిగొచ్చేవి.

    అయినా పట్టువదలని విక్రమార్కుడిలా నేను రాసిన వాటిని పత్రికలకు పంపిస్తూనే ఉన్నాను. నేను పంపించేవన్నీ తిరుగుటపాలో అంతే భద్రంగా నాకు వెనక్కి తిరిగొచ్చేవి.

    అదలా ఉండగా... నా పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఇక్కడే ఓ యూనివర్సిటీలో నెలకి ఐదువేల రూపాయల జీతంతో 'కాంట్రాక్ట్ లెక్చరర్'గా ఉద్యోగమొచ్చింది నాకు. ఆ తర్వాత పెళ్ళి చేసుకుని, ఉన్నంతలో సర్దుకుని గుట్టుగా జీవితాన్ని నెట్టుకురాసాగాను.

    నేను చేస్తున్న లెక్చరర్ ఉద్యోగానికీ, నా కిష్టమైన వ్యాపకానికీ ఏమాత్రం పొంతన లేకపోయినా నేను మాత్రం రాయటం ఆపలేదు. నేను రాసిన కథల్నీ, నవలల్నీ పత్రికలకు పంపటమూ మానలేదు. పత్రికల వాళ్లు కూడా నా రచనల్ని అంతే స్పీడుగా వెనక్కి తిప్ప పంపడమూ ఆగిపోలేదు. నేను రాసింది తిరిగొచ్చిన ప్రతిసారీ - నవమాసాలూ మోసి పురిట్లోనే కన్నుమూసిన బిడ్డని చూసుకొని కన్నతల్లి బాధపడినంతగా బాధపడేవాణ్ణి. అంతలోనే నన్ను నేనే ఓదార్చుకుని, నాకు నేనే ధైర్యం చెప్పుకొని మరొకటేదైనా రాసి పంపించేవాణ్ణి.

    అయినా...నేను రాసిందేదీ అచ్చుకి నోచుకోలేదు కానీ, ఓ రోజు మాత్రం...ఆఫీస్ అవర్స్ అయిపోయాక స్వయంగా వచ్చి తనను కలవమంటూ ఒక పత్రికలో పనిచేసే సబ్ - ఎడిటర్ నుంచి ఫోనొచ్చింది. నేనెంతో సంతోషంతో వెళ్లి అతడ్ని కలిశాను.

    అతను నన్నొక యువరచయిత్రి ఇంటికి తీసుకెళ్లాడు.

    ఆమె రచనలు అప్పుడప్పుడు ఏవేవో చిన్నా చితకా పత్రికలలో చూసినట్టు జ్ఞాపకం నాకుక్. తన కలంలో బలం తప్ప డబ్బూ, హోదా, అధికారం, పరపతులతో పాటు ప్రముఖ రచయితల అండదండలూ, సీనియర్ సాహితీవేత్తల ఆశీస్సులూ దండిగా ఉన్న వ్యక్తి ఆమె.

    నా గురించీ, నా రచనల గురించీ ఆ సబ్ - ఎడిటర్ ఆమెకు అంతకుముందే చెప్పినట్లున్నాడు - నేను ఒప్పుకుంటే ఇకమీదట నేను రాసిన కథలు కానీ, నవలలు గానీ ఆమెకి ఇస్తే... వాటికి తగ్గ ప్రతిఫలాన్ని డబ్బురూపంలో లెక్కగట్టి నాకిస్తాననీ, తర్వాత వాటిని ఆమె తన పేరుతో ముందుగా పత్రికలలో ప్రచురించుకుని, ఆ తర్వాత పుస్తకాలుగా అచ్చేసుకుంటాననీ, నా నిర్ణయమేమిటో ఆలోచించుకుని చెప్పమనీ అంది.

    అంటే... నేను రాసిన వాటిని తనకు అమ్మమనీ, తాను కొనుక్కుంటాననీ అర్థం!

    విచిత్రమైన విషయం ఏంటంటే...మార్కెట్‌లో అమ్మకానికి వున్న ప్రతివస్తువూ దాన్ని కొన్నవాడికి సొంతమౌతుందేతప్ప దాని తయారీదారుడి పేరు మాత్రం దానినుండి విడివడదు. అది అందరికీ తెలుస్తూనే వుంటుంది. కానీ, ఇక్కడ మాత్రం అది ఉండదు. కర్ణుడు తన కొడుకేనని లోకానికి చెప్పుకోలేని కుంతీదేవి లాంటి పరిస్థితి!

    నాకు మొదట మనసొప్పలేదు. 

    అయితే...పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల్నయినా పెంచిపోషించే స్తోమత లేనప్పుడు - ఆ బాధ్యత వహించి, వారికి మంచి జీవితాన్నిచ్చి వెలుగులోకి తీసుకురాగల శక్తి సామర్థ్యాలున్నవాళ్ళకి 'దత్తత' ఇచ్చేయడంలో ఎలా తప్పులేదో - ప్రతి పత్రిక నుంచీ తిరిగొస్తూ మరుగున పడిపోయే నా రచనలు నా పేరుతో కాకపోయినా మరో వ్యక్తి పేరుతోనైనా పాఠకుల ముందుకి వచ్చి వెలుగు చూస్తాయన్న ఆశతో పాటు - నేను రాసిన కథలూ, నవలలూ నా ఆర్థిక ఇబ్బందుల్ని కూడా గట్టెక్కిస్తాయన్న విషయం అర్థమయ్యాక - ఆమె చెప్పిందానికి ఒప్పుకున్నాను.

    ఆ విధంగా అంతవరకూ ఎంత ప్రయత్నించినా 'రైటర్'ని కాలేకపోయిన నేను ఆరోజు నుంచీ 'ఘోస్ట్ రైటర్' నయ్యాను."

    ఉన్నట్లుండి పెద్దగా కేకలు విన్పించేసరికి తలలు తిప్పి చూశామిద్దరమూ.

    వాలీబాల్ గేమ్ పూర్తయినట్లుంది!

    గెలిచిన టీంవాళ్ళు పెద్దగా అరుస్తూ తమ నాయకుడ్ని గాల్లోకి ఎత్తి తమ విజయోత్సాహాన్ని వ్యక్తం చేస్తుంటే...ఓడిపోయిన టీంవాళ్ళు కూడా ఎలాంటి భేషజమూ లేకుండా గెలిచినవాళ్ళకు షేక్‌హ్యాండిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూంటే గెలిచినవాళ్ళ కంటే ఓడిపోయినవాళ్ళే ఉన్నతంగా కన్పిస్తున్నారు.

    ఆటలో అలసిపోయి చెమటలు కక్కుతున్న వాళ్ళందరూ స్నానాలు చేయడానికేమో... అక్కడ్నుంచి కదలి నీళ్లట్యాంకు వైపు బయలుదేరారు.

    "హలో...న్యూ ఎంట్రీనా? నా పేరు వెంకటేష్...రేప్ కేసు!"

    "నమస్తే అన్నా...కొత్తగొచ్చిన్రా? నా ప్రేరు సత్నారాయణ...అందర్ 'సత్తి' అంటర్...డౌరీ కేసు!"

    "నయా ఎంట్రీ హై క్యా భాయ్‌సాబ్? మేరా నాం ఇక్బాల్...మర్డర్ కేస్!"

    అందరూ మాతో చేతులు కలుపుతూ తమను తాము పరిచయం చేసుకుంటూ వెళ్తుంటే...'రాగింగ్ లేని మెడికల్ కాలేజ్' లోకి అడుగు పెడ్తున్న మొదటి సంవత్సరం స్టూడెంట్సులా మనసులోని బెరకు తొలిగిపోయి నిశ్చింతగా అనిపించింది మా ఇద్దరికీ.

    "ఊ...చెప్పండి సార్!" అన్నాడు సదానంద్.

    "ఎంతవరకు చెప్పాను?" దూరంగా వెళ్తున్న మా 'సీనియర్స్' వంకే చూస్తూ అన్నాను.

    "మీరు 'ఘోస్ట్ రైటర్' అయ్యేంతవరకూ!" 

   చివ్వున చూశానతడి ముఖంలోకి - "ఘోస్ట్ రైటర్ అంటే ఏంటో నీకింతకుముందే తెలుసా?" ఆశ్చర్యంగా అడిగానతడ్ని.

    "తెలియదు సార్! ఇందాక మీరు చెప్పినప్పుడే చాలా క్లియర్‌గా అర్థమైంది. చెప్పండి...తర్వాతేమైంది?" ఆత్రుతగా అడిగాడు సదానంద్.

    "ఏముందీ...ఆ రోజు నుంచీ నేను ఆమె కోసమే రాయసాగాను. అంతకుమునుపు ఒక్కటీ అచ్చుకి నోచుకోని నా కథలూ, నవలలూ అప్పటినుండి ఆమె పేరుతో పత్రికలకు వెళ్లటం, అవి అందులో వెంటవెంటనే పబ్లిష్ కావడం, రచయిత్రిగా ఆమె పేరు మారుమ్రోగిపోవడం చకచకా జరిగిపోయాయి. అప్పటిదాకా అర్థం కాని ఓ కొత్త విషయం నాకు అప్పుడే అర్థమైంది...పత్రికలలో కనిపించే చాలా రచనలు రచనలను బట్టికాక ఆయా 'రచయితలను'బట్టి పబ్లిష్ అవుతాయని!

    ఏమైతేనేం...అంతకు ముందెప్పుడూ అచ్చుకు నోచుకోని నా రచనల్ని మరొకరి పేరుతోనైనా పత్రికల్లో చూసుకొని తృప్తిపడేవాణ్ణి. 'నా పేరు లేదే...!' అన్న భావం తప్ప నా కష్టానికి బదులుగా ఆమె నుంచి నాకు దక్కే ప్రతిఫలం కూడా ఆర్థికంగా నాకు తృప్తినిచ్చేది.

    పత్రికలు పెట్టే పోటీల్లో నా కథలు, నవలల్తో ఆమెకి బహుమతులు కూడా వచ్చాయి. ఆ తర్వాత వాటిని పుస్తకాలుగా పబ్లిష్ చేసి, ఆవిష్కరణ సభలు కూడా జరుపుకొంది. ఆ సభలకు పేరున్న సీనియర్ కవులూ, రచయితలంతా అతిథులుగా వచ్చి ఆమెని 'మహా రచయిత్రి'గా పొగిడేస్తూ 'విశిష్ట రచయిత్రి' అని తీర్మానించేశారు..."

    "తర్వాత...?"

    "ఇలా రెండేళ్లు గడిచాయి..." అంటూ దీర్ఘంగా నిట్టూర్చాను.

    "ఆ తర్వాత...?"

    నా ముఖంలోకి ఆత్రుతగా చూస్తూ అడుగుతున్న సదానంద్‌ని చూస్తుంటే ముచ్చటేసింది నాకు. నేను చెప్తుంటే వినే ఒక వ్యక్తి దొరికినందుకు ఏదో తెలీని తృప్తి, ఊరట కూడా కలిగాయ్.

    నిజానికి...నేను చెప్పేది వినాల్సిన బాధ్యత ఉండికూడా విన్పించుకోకుండా - కనీసం మాట్లాడే అవకాశం కూడా నాకివ్వకుండా - తాము చెప్పిందే ఒప్పుకోవాలంటూ రెండ్రోజులుగా పోలిస్‌స్టేషన్‌లో నాపై ఒత్తిడి తెచ్చి - నేనెంతకీ ఒప్పుకోక పోయేసరికి ఎఫ్.ఐ.ఆర్. రాసి, రిమాండ్ మీద నేనిక్కడీకి చేరుకోవడానికి కారణమైన ఆ 'ఎస్.ఐ.'గుర్తొచ్చాడు.

    "తర్వాతేమైందో చెప్పండి సార్!"

    సదానంద్ ముఖంలో కనబడ్తున్న ఆసక్తిని గమనిస్తూ అన్నాను..."నేను చెప్పేది నిజంగా నీకర్థమౌతోందా?" 

    "చాలా బాగా అర్థమౌతోంది. అంతే కాద్సార్...అందరికీ నీతులు చెప్పేలాగ కథలు రాసేవాళ్ళలో కూడా ఆమెలాంటి డూప్లికేట్లు ఉంటారని ఇప్పుడే తెల్సింది. ఇంతకీ...ఎవర్సార్ ఆమె? ఆమె పేరేంటి?"

    అతడి ప్రశ్నకి బదులిచ్చి, "ఆమె గురించి విన్నావా నువ్వు? ఆమె పుస్తకాలు చదవటం కాని, పత్రికల్లో ఆమె రచనలు కానీ చూశావా?" అన్నాను. 

    "లేద్సార్...పత్రికలు చూడడమే అలవాటు లేదు నాకు. ఇక పుస్తకాలు చదవడమా?" అని నవ్వేస్తూ... తర్వాతేమైందో చెప్పండి సార్..." అన్నాడు.

    "సరే విను..." అని చెప్పసాగాను నేను -

    "నేను రాసింది రాసినట్టుగా తీసుకెళ్లి ఆమెకి ఇచ్చిన వెంటనే అప్పటికప్పుడే దానికి వెలకట్టి నా చేతిలో డబ్బు పెట్టడం, కొద్ది రోజులకి ఆ రచనలు ఆమె పేరుతో పత్రికలలో కనిపించడం, ఆ తర్వాత అవి పుస్తకాలుగా పబ్లిష్ కావడం జరుగుతూ ఉండేది.

    నేను రాసిన వాటితో సాహితీలోకంలో ఆమె రచయిత్రిగా అంచెలంచెలుగా ఎదిగేకొద్దీ...'కనీసం ఒక్క కథైనా, ఒక్క నవలైనా నా పేరుతో అచ్చులో చూసుకోవాలి' అన్న కోరిక కూడా నాలో రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేసీ చేసీ అలసిపోయిన నాలోని 'రచయిత'ని పత్రికలో చూసుకోవాలన్న అతిచిన్న కోరిక అది.

    అందుకే...అమ్ముకోవడానికి కాకుండా - నాకోసం, కేవలం నా కోసమే...నన్ను నేను 'రచయిత'గా పాఠకులకు పరిచయం చేసుకోవడం కోసం ఒక నవల రాసుకున్నాను.  

     ఓ ప్రముఖ పత్రిక ప్రకటించిన నవలల పోటీకి నా నవలను పంపాను. రచయితగా సాహితీలోకానికి ఏమాత్రం పరిచయం లేని నేను - రాసిన నవలను పత్రికల వాళ్ళు పోటీలో ఎంపిక చేయరనీ, ఖచ్చితంగా తిప్పిపంపుతారనీ తెలిసినా - కనీసం సాధారణ ప్రచురణకైనా తీసుకుంటారేమోనన్న చిన్న ఆశతో ఆ పోటీ ఫలితాల కోసం ఆత్రంగా ఎదురుచూడసాగాను.

    అయితే...పత్రికలలో అచ్చయ్యేవాటిలో చాలామటుకు రచనలోని 'సత్తా'ని కాక రచయితల స్థాయీ, పేరు ప్రఖ్యాతులను బట్టి అచ్చవుతాయన్న అపోహను 'కేవలం అది నా అపోహ మాత్రమే!'నని నిరూపిస్తూ...నా ఊహల్ని తలక్రిందులు చేస్తూ...ఆ పత్రిక పోటీ ఫలితాల్ని తమ పత్రికలో విడుదల చేస్తూ...నా నవల 'ఉత్తమ నవల'గా ఎంపికైందని ప్రకటించి మొదటి బహుమతి మొత్తం పాతికవేల రూపాయల చెక్ కూడా నాకు పంపించింది.

    నా జీవితంలో నేనూహించని, మరపురాని, మరచిపోలేని సందర్భం అది!

    ఎన్నో ఏళ్లుగా మచ్చుకి ఒక్కటి...ఒక్కటంటే ఒక్క చిన్న కథైనా చూసుకునే అదృష్టం దక్కక - ఎడారిలో నీటి చుక్కకై ఏళ్ల తరబడి పడిగాపులు పడుతూ అల్లల్లాడే వాడిలా మిగిలిపోయిన నాకు - ఒక్క సారిగా కుండపోత వర్షం నన్ను ముంచెత్తినంత ఆనందం కలిగింది. అంబరాన్నంటే ఆ ఆనందాన్ని అందరితో పాటు 'ఆమె'కీ చెప్పుకుని పంచుకున్నాను. 

    అందరిలాగే తను కూడా నాకు అభినందనలు చెప్పింది. నా నవలను ఒకసారి చదివిస్తానంటే ఇచ్చాను కూడా. అయితే...అంతకుముందు లేని 'అసూయ' బీజం ఆమెలో అప్పుడే నాటుకుందని నేను అస్సలు ఊహించలేదు.

    నవలల పోటీ ఫలితాలు ప్రకటించిన ఆరునెలలకి  నా నవలను సీరియర్‌గా ప్రచురింపబోతున్నట్లు ఆ పత్రికలో ప్రకటనలు రాసాగాయి. అదే సమయంలో...నేను సిటీలో లేని సందర్భంలో 'ఆమె'తను ప్రచురించుకున్న ఒక పుస్తకాన్ని సభ ఏర్పాటు చేసి అందులో ఆవిష్కరించింది. పత్రికలలో తన పేరున అచ్చయిన కథల్ని, నవలని పుస్తకాలుగా ప్రింట్ చేసి వాటి 'ఆవిష్కరణ సభలు జపడం అంతకుముందు కూడా ఆమెకి అలవాటే కాబట్టి - అలాంటిదే కాబోలు ఇది కూడా!' అనుకున్నాను.  

    అయితే...ఏ రోజైతే పత్రికలలో నా సీరియల్ మొదలైందో - అదే రోజు ఆ సీరియల్‌ని ఆపాలంటూ, ఆ నవల తను రాసిందనీ, అంతకు ముందే ఆ నవలను పుస్తకంగా ప్రింట్ చేసుకుని ఆవిష్కరణ సభ కూడా జరిపాననీ చెప్తూ...ఆ పుస్త్కాన్నీ, ఆ సభ్కి అతిథులుగా వచ్చి ఆ నవల గురించి వేదికపై మాట్లాడిన పేరున్న సీనియర్ రచయితల ఫోటోలనూ సాక్ష్యాలుగా చూపిస్తూ...తన నవలను నేను కాపీ చేసి ఆ పత్రికలోని పోటీకి పంపించాననీ, వాళ్ళు నాకు బహుమతినిచ్చి నా పేరుతో సీరియల్‌గా వేస్తున్నారనీ, వెంటనే ఆ సీరియల్‌ని ఆపి, తనకు న్యాయం చేయాలని సివిల్ కోర్టులో కేసు వేసిందామె."

    "ఇంత అన్యాయమా? కోర్టులో అసలు ఈ కేసెలా నిలబడింది సార్?"

    మొదటిసారి ఈ విషయం తెలిసి నాకు కలిగిన ఆశ్చర్యం లాంటిదే సదానంద్ ముఖంలోనూ కనిపించింది. 

    "తాను అంతకుముందు ఎన్నెన్ని రాసిందో, ఎన్నెన్ని పుస్తకాలు అచ్చేసిందో అవన్నీ కోర్టులో చూపిస్తూ... ఈ నవల కూడా తను రాసిందేననీ, అంతకు ముందు ఏ పత్రికలోనూ ఒక చిన్న కథ కూడా రాయని నాకు - ఒక్క పుస్తకం కూడా నా రచనగా ప్రచురించుకోని నాకు - ఒకేసారి అంత పెద్ద పత్రికలో, పెద్దపెద్ద రచయితలు పోటీ పడ్డ ఆ నవలల పోటీలో మొదటి బహుమతి ఎలా వస్తుందనీ వాదించింది" అన్నాను.

    "అదేంటీ... అసలు విషయాన్ని కోర్టులో చెప్పలేక పోయారా?"

    "చెప్పలేను. చెప్పినా అది నిజమని నిరూపించే సాక్ష్యాలు నా దగ్గర లేవు. కానీ - పెన్నూ, పేపరూ చేతికిచ్చి తన పేరూ, అడ్రసూ కనీసం తెలుగులో వ్రాసి చూపించమంటే కూడా తప్పుల్లేకుండా రాయడం రాని ఆమెని 'మహా రచయిత్రి' అంటూ ఆమె తరఫున సాక్ష్యం చెప్పగలవాళ్ళు సీనియర్ రచయితల్లో కూడా కొందరున్నారు."

    "మరి మీరేం చేశారు?"

    "లాయర్ని పెట్టుకుని వాదించాను. అసలు ఆ నవల నేనెప్పుడు రాశానో, ఎప్పుడు పోటీకి పంపానో, పత్రికల వాళ్ళు ఆ నవలకు బహుమతి ఎప్పుడు ఇచ్చారో... ఆమెకి తెలీవు. కాబట్టి అవన్నీ కోర్టుకి వివరిస్తూ... ఆమె చెప్పేది నిజం కాదనీ, తను అబద్ధమాడుతోందనీ వాదించాను."

    "ఏమయింది?"

    "కోర్టులో తన కేసు తేలిపోతోందనీ, తను చెప్పేవన్నీ అబద్ధాలని నిరూపించబడ్తాయనీ అర్థంకాగానే - వెంటనే అప్పటికప్పుడు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి నా మీద 'క్రిమినల్ కేసు' బుక్ చేసింది."

    "తర్వాత...?"

    "మనలాంటి వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చి 'నా కంప్లెయింట్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు సార్?' అంటూ ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా ఏమాత్రం పట్టించుకోని పోలీసువాళ్ళు - ఆమె సివిల్ కోర్టునుంచి మధ్యాహ్నం లంచ్‌టైమ్‌లో హుటాహుటిన వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు బుక్ చేయగానే అప్పటికప్పుడే పోలీసులు బయల్దేరి వచ్చి నేను కోర్టు మెట్లు దిగీదిగగానే నన్ను పోలీస్‌స్టేషన్‌కి ఎందుకు తీసుకెళ్లారో అక్కడికి వెళ్లినతర్వాత నాకు అర్థమైంది..."  

    "ఆ ఎస్.ఐ. నేను చెప్పేదేదీ విన్పించుకోలేదు. ఓ ప్రక్క సివిల్ కోర్టులో కేసు నడుతూండగా - తన కేసు వీగిపోతోందని తెలిసి ఇక్కడ నామీద క్రిమినల్ కేసు బనాయిస్తోందనీ, ఆమె అబద్ధమాడ్తోందనీ ఒక్కసారు నేను చెప్పేది విన్పించుకుంటే, ఆమె కోర్టులో వేసిన కేసు వివరాల్ని ఒకసారి చూస్తే ఎవరి వైపు న్యాయం ఉందో మీకే అర్థమౌతుందనీ...నేను ఎంతగా ప్రాధేయపడినా - ఆ ఎస్.ఐ. విన్పించుకోలేదు సరికదా... 'మర్యాదగా ఆమె చెప్పేది విని, అందుకు ఒప్పుకుని కాంప్రమైజ్ చేసుకో! లేదా ఎఫ్.ఐ.ఆర్. రాసి రిమాండ్‌కి పంపిస్తాను... జాగ్రత్త!' అంటూ బెదిరిస్తూ ఒత్తిడి చేశాడు."

    "ఆమె చెప్పేదేమిటి? మీరు దేనికి ఒప్పుకొని కాంప్రమైజ్ కావాలంట?" నాకంటే ఎక్కువ ఆందోళన కన్పిస్తోంది సదానంద్‌లో.

    "ఆ నవల నాది కాదు, ఆమెదేనని ఒప్పుకుంటే ఒక నవలకు అంతకు ముందు ఆమె నాకిచ్చే డబ్బుకి పదింతలు ఇస్తాననీ, నా మీద పెట్టిన అన్ని కేసుల్నీ వెనక్కి తీసేసుకుంటాననీ - లేదంటే... ఈ కేసుల్లో నన్ను ఇరికించేయ్యడమే కాక - పదమూడేళ్లుగా నేను చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ ఉద్యోగాన్ని కూడా తన పరపతితో పీకించేస్తాననీ...,నా భార్యా బిడ్డలు రోడ్డున పడ్తారనీ, ఆలోచించుకోమనీ... హెచ్చరిస్తూ తను చెప్పిందానికి ఒప్పుకోమంది!"

    "మీరేమన్నారు?" టెన్షన్‌గా అడిగాడు సదానంద్.

    "నువ్వైతే ఏమంటావ్?" అంతే సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ ఎదురు ప్రశ్నించాను. 

    మా చేతులకి వాచీలు లేవు కాబట్టి టైమెంతయిందో ఖచ్చితంగా తెలీదు కానీ - మరి కాసేపట్లో అస్తమించడానికి సిద్ధమౌతున్న సూర్యుడు లోకానికి తాత్కాలిక వీడ్కోలు చెప్తున్నట్లుగా కురిపిస్తున్న కెంజాయ వర్ణంలోని వెలుగు సదానంద్ కళ్ళలో ప్రతిఫలిస్తూ క్షణంతో పాటు నిర్జీవంగా మెరిసింది.

    "ఏం చేస్తాన్సార్... పోలీసుల సంగతి తెలిసిందే! ఆమెకూడా డబ్బూ పరపతీ ఉన్నావిడ! వాళ్ళు చెప్పిందానికే ఒప్పుకుంటానేమో! నా సంగతి సరే... మీరేమన్నారు?"

    "ఓసారి మా ఆవిడతో మాట్లాడాలన్నాను..." 

    "ఏమంది మీ ఆవిడ?"

    "మా పాపతో పాటు రోడ్డు మీదకు రావడానికి సిద్ధమేనంది!"

    వెంటనే అర్థం కాలేదతడికి. కొన్ని క్షణాల ఆలోచన తర్వాత - "శభాష్... భార్యంటే అలావుండాలి సార్!" అన్నాడు - మెచ్చుకోలుని తనదైన శైలిలో వ్యక్తం చేస్తూ.

    "ఆ తర్వాతేమయింది?" అడిగాడు ఉత్సాహం నిండిన ఆసక్తితో.   

    "ఏమవుతుందీ... ఇక్కడికి చేరుకున్నాను..."

    ఇప్పుడు కూడా వెంటనే అర్థం కాలేదేమో...కాసేపు మౌనంగా ఉండిపోయాడు. సినిమాల్లో లాగా అప్పటివరకూ చావుదెబ్బలు తిన్న హీరో - ఉన్నట్లుండి ధరియంగా లేచినిలబడే సరికి అతడేదో విలన్లను చితగ్గొట్టి విజయం సాధిస్తాడని ఈలలు వేసి గోల చేసిన నేలక్లాసు ప్రేక్షకుడు - ఒక్కసారిగా హీరో కుప్పకూలిపోయేసరికి ఎలా నీరు గారిపోతాడో...సరిగ్గా అలాగే నిరుత్సాహపడ్డాడు సదానంద్.

    ఆ తర్వాత అతడేదో అనబోయేంతలో... మళ్లీ నేనే అన్నాను -

    "కాపీరైట్ కేసంటే ఏమిటో ఇప్పుడర్థమైందా?"

    అయ్యిందన్నట్లుగా తలూపుతూ మళ్లీ ఏదో అనబోయాడు.

    అంతలో... "ఓ సారూ...అమరూ, సదానందంటే మీరేనా?" అని విన్పిచేసరికి ఇద్దరం ఒకేసారు వెనక్కి తిరిగాం.

    ఆ బ్లాక్‌లోకి రాగానే మేముండాల్సిన హాలు దగ్గరికి తీసుకెళ్ల్లిన వ్యక్తి!

    "అవును..."అంటూ లేచి నిల్చున్నామిద్దరమూ - చీకటి పడుతోంది కాబట్టి ఇక లోపలికి వెళ్లాలేమోనని.

    "మీరు గీడ కూసున్నరేంది? మీకు బెయిల్ ఆర్డరొచ్చింది! మా సారు పిలుస్తున్నడు... రాండి!" అంటూ తన వెనకే రమ్మని చెయ్యూపుతూ ముందుకి నడిచాడు.

    వెలుగు నిండిన చూపుల్తో ఒకర్నొకరం చూసుకొని అతన్ని అనుసరించాం...నేనూ సదానంద్.

* * *

    "నా భార్య కవిత... నా కూతురు రమ్య!"

    బెయిల్ ఆర్డర్ వచ్చాక జైల్లోని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసుకుని బయటికొచ్చాక - గేటు అవతల నిల్చున్న నా భార్యనీ, కూతుర్నీ పరిచయం చేశాను - ఒక్కపూటలో నాకెంతో దగ్గరైన సదానంద్‌కి.

    "నమస్కారమమ్మా! ఈ జైల్లోకి అడుగుపెట్టక ముందువరకూ నాకు ఆడవాళ్ళంటే చిన్నచూపుండేది. నాకు కన్పించకుండానే కళ్ళు తెరిపించావు!" అన్నాడు సదానంద్.

    అతడి మాటలు కవితకు అర్థం కాలేదు కాబోలు - అతడివైపు ఓసారి అయోమయంగా చూసి ప్రతినమస్కారం చేసింది. ఆ తర్వాత నా వైపు తిరిగి తన చేతిలోని కాగితాన్ని అందించింది నాకు.

    'ఏమిటా...' అనుకుంటూ దాన్ని విప్పబోతూండగా...చెప్పింది కవిత -

    "మిమ్మలని ఉద్యోగంలోంచి తీసేస్తున్నామంటూ మీ రిజిస్ట్రార్ నుంచి వచ్చిన లెటరది!"

    కొన్ని క్షణాలపాటు స్తబ్దుగా అయిపోయాయి నా మనసూ, మెదడూ! అయోమయంగా అటూఇటూ చూశాను. మనసులోనే కాదు - వెలుగు పూర్తిగా మాయమై చుట్టూరా చీకట్లు కమ్ముకున్నాయి.

    పదమూడేళ్లుగా చేస్తున్న 'కాంట్రాక్ట్ లెక్చరర్' ఉద్యోగం ఉన్నఫళాన ఊడిపోయిందన్న మాట! సాహితీ వేత్తలే కాదు, ప్రభుత్వ సంస్థలలోని అధికారులు సైతం డబ్బున్నవారి వ్యక్తిగత అభిలాషల్ని తీర్చడం కోసం తమ అధికారాల్ని ఎలా వినియోగిస్తారో... అప్పుడే స్పష్టంగా తెలిసింది నాకు.

    కఠిన వాస్తవం క్రమంగా అర్థమవుతూంటే...ఎలా స్పందించాలో తెలీక నా భార్య ముఖంలోకి చూశాను...

    మసకగా ఉన్న స్ట్రీట్‌లైట్ వెలుగు ఆమె ముఖం మీదికి ప్రసరిస్తూ వింతగా పరావర్తనం చెందుతోంది. విడివడకుండా విచ్చుకున్న ఆమె పెదవులు కురిపిస్తున్న మందహాసం - ఆర్ద్రతతో కూడిన మనోస్థైర్యాన్నిస్తోంది. తన కళ్ళలో మందమైన నీటిపొర వెనుక వేగుచుక్కల్లా మెరుస్తున్న చూపులు - జీవితంపై మళ్లీ కొత్త ఆశను కల్పిస్తున్నాయ్.

    మాటల్లో తెలపలేని ఏదో సందేశాన్ని అందుకున్నవాడిలా అలా ఎంతసేపున్నానో తెలీదు - లోతైన ఆ భావనాస్థితి నుండి నెమ్మదిగా బయటికొస్తుండగా...

    "ఇప్పుడేం చేస్తార్సార్?" అంటున్న సదానంద్ మాటలు నా చెవులకు విన్పించాయ్.

    అప్పటికి పూర్తిగా తేరుకున్నాను. తల తిప్పి అతడి ముఖంలోకి చూశాను నవ్వుతూ - స్వచ్ఛంగా...స్వేచ్ఛగా.

    ఆ తర్వాత - అప్పటివరకూ "నాన్నా...నాన్నా..." అంటూ తనని ఎత్తుకున్న నా భార్య చేతుల్లోంచి విడిపించుకుని నా దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్న నా కూతురు రమ్యని రెండు చేతులూ చాచి అందుకొని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ...

    "ఉద్యోగం పోయిందని నా భార్యాపిల్లల్ని వదులుకుంటానా?" అని, సదానంద్ కళ్ళలోకి చూస్తూ అన్నాను -

    "ఈ కూతురే కాదు... నేను స్వయంగా రాసుకున్న ఆ నవల కూడా నేను కన్న బిడ్డే!"

    ఈసారి మాత్రం నా మాటలు అతడికి వెంటనే అర్థమౌతాయని నాకు బాగా తెలుసు.

(స్వాతి మాసపత్రిక మే 2009 సంచికలో ప్రచురితం)     
Comments