కైకేయి అంతర్మథనం - వి.భారతీదేవి

    
సూర్యోదయాత్పూర్వమే అభ్యంగన స్నానమొనర్చి తలనీలాల నారబెట్టుకోడానికై మేడపైకి వెళ్ళిన మంధరకు, అప్పటికే అక్కడ చేరి కురుల నారబెట్టుకుంటున్న మహారాణి కౌసల్యాదేవి ఆంతరంగికురాలు కనిపించడంతో మూతిని మూడువంకరలు త్రిప్పుతూ దూరంగా వెళ్లి జుత్తును దువ్వుకుంటూ అప్రయత్నంగా మేడపైనుండి నగరాన్ని చూసింది.
         
    అప్పటికే నగరం నిద్ర లేచింది.ముత్యాలనారబోసినట్లు తెల్లని ముగ్గులనలంకరించిన వాకిళ్ళతో దేదీప్య మానమైన కాంతులీనే దీపాల వరుసలతో ప్రకాశించే అరుగులతో పచ్చని తోరణాలు కట్టిన గుమ్మాలతో ప్రతి గృహము శోభిల్లుతూ పండగ వాతావరణాన్ని ప్రతిబింబించ సాగింది.
        
    అది చూసిన మంధరకాశ్చర్యం కలిగి  "ఎమిటీ రోజు విశేషం, నగరంలో యేవో వేడుకలు జరుపు తున్నట్టున్నారు? అని ప్రక్కావిడనడిగింది.
     
    "ఔను, శ్రీరామచంద్రుని పట్టాభిషేకమట. అందుకే నగరమంతా పండగ చేసుకుంటున్నారు" అని చెప్పింది. అక్కడితో ఆపినా బావుండేది. అలా అయితే రామాయణం ముందుకెలా సాగుతుంది. లోకకంటక రావణుడెలా చస్తాడు. తన మాటలను పొడిగిస్తూ ఆమె "రాముడు రాజయ్యాడంటే మా కౌసల్యాదేవి రాజమాత ఔతుంది. ఇప్పటివరకూ పేరుకు పట్టపురాణే అయినా పెత్తనమంతా ఆవిడగారిదే నాయె, రాజుగారికి ప్రియమైన భార్యనన్న గర్వం, చివరకు రామున్ని సైతం తనవైపే త్రిప్పుకుంది ఆ మహాతల్లి" అని కైకేయినుద్దేశించి అన్నది.
     
    అంతే కాకుండా "మా రాముడు రాజైతే మా రాణిని అమాయకురాలిని చేసి పెత్తనాలు చెలాయించే వారి ఆటలు సాగవు యెవరిని ఎక్కడ ఉంచాలో మాకు బాగా తెలుసు" తన సహజ ధోరిణిలో వున్నవి లేనివి కలిపి  అన్నది.
   
    మంధరకు విషయం అర్థమైంది. "రాముని పట్టాభిషేకం తర్వాత రాజమాతగా ప్రాతినిధ్యమంతా కౌసల్యాదేవికే దక్కుతుంది. అప్పుడు కైకేయి సాధారణ రాణిగానే మిగిలిపోతుంది, ముసలిరాజు భార్యగా ఆమెకే ప్రాతినిధ్యం కరువైతే తనగతేమిటి? ఇప్పటి వరకు కైకేయి ఆంతరంగీకురాలిగా పెత్తనం సాగించిన నేను రాబోయే రోజుల్లో మామూలు దాసిగా బ్రతకాల్సొస్తుంది" అని ఆలోచించిన మంధర వేగంగా మేడ దిగి కైకేయి మందిరానికి పరుగు తీసింది. 
         
    ఇంకా నిద్ర మేల్కొనలేదు కైకేయి.
        
    సూర్యోదయమయ్యాక వైతాళికులు  భూపాలం పాడి మేలుకొలిపితేగాని రాజకాంతలు నిద్రనుండి మెలుకొనరు. కాని ఆరోజు మంధరకు  భూపాలాలు పూర్తయ్యేవరకు వేచివుందే ఓపిక లేక కైకేయి పుట్టింటి నుండి అరుణముగా వచ్చిన ఆంతరంగికురాలిగా ఆ మందిరములో పూర్తి స్వేచ్చ వుంది కనుక నేరుగా రాణిగారి శయన మందిరంలోకే వెళ్ళింది. 
         
    "రాణిగారు... ఓ మహారాణిగారూ..." కేకలు వేస్తూ పిలిచింది. కైకేయి మేల్కొనక పోవడంతో తిరిగి "బయటేమో కొంపలు కూల్చే కుట్ర జరుగుతుంటే మీరింత సుఖనిధ్రనెలా ఆస్వాదించ గలుగుతున్నారు? లేవండి నిద్ర మేల్కొనండి" అంటూ కేకలు వేయడంతో నిధ్రాభంగమైన కైకేయి కనులు చంద్ర ప్రసాదిత వెన్నల సోకిన కలువల్లా విచ్చుకున్నాయి. ఎదురుగా వున్న మంధరని చూసి కోపంగా 
       
    "ఏం ఉదయాన్నే నీ ముఖం చూడాల్సొచ్చింది, సౌభాగ్యవతులు సర్వాభరణ భూషితులు మందస్మిత వదనార విందములతో భూపాల రాగాలాపనలోనరించే వైతాళిక విదుషీమణులు వచ్చేవరకు ఆగలేవా?.." అన్నది.
     
    రాణి గారి కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా "శ్రీరామచంద్రునికి పట్టాభిషేకమంట నగరమంతా వేడుకలే వేడుకలు" ఆతురతగా మంధర చెబుతుంటే విన్న కైకేయి నిద్రమత్తు పటాపంచలైంది. 
      
    "ఏమిటే మళ్ళీ చెప్పు" అన్నది కైకేయి సంతోషంగా.
        
    మళ్ళీ మళ్ళీ చెప్పింది మంధర.
       
    "నిద్ర లేపితే లేపావ్ కాని ఎంతటి శుభావర్తమానం అందించావు, ఇంత మంచి వార్త చెప్పినందుకు ఇదిగో బహుమతి" అంటూ మెడలోగల మణి మాణిక్య రత్న రాసులతో అలంకరించిన ఏడువారాల నగలలో నుండి ఒక హారాన్ని తీసి మంధరకిచ్చింది. 
      
    బహుమతిని వద్దనలేదు కుయుక్తుల గూని మంధర. ఆ నగని తీసుకుంటూనే "రామునికి పట్టాభిషేకమంటే మీకెందుకు రాణిగారూ అంతలా సంతోషం" అడిగింది.
         
    "నా అందాల రామునకు పట్టభిషేకమంటే నాకే కాదు ఈ నగర వాసులకు పశువులకు పక్షులకు చివరకా చేట్టుచేమకు కూడా సంతోషమేనే. నేడు కాకున్నా రేపైనా నా రాముడు అయోధ్యకు రాజయ్యేవాడేగా! ఈ లోకానికే ఆహ్లాదకరుడు ఆనంద కారకుడు నా శ్రీరాముడే కదా" పరవశంతో చెబుతూ తనని తాను మరచిపోయింది కైకేయి.
         
    "పిచ్చి రాణి భరతుడు నీ కన్నకొడుకు అతనికి పట్టాభిషేకమంటే ఆనందించాలి. నీ కొడుక్కి అన్యాయం జరుగుతున్నందుకు ఆక్రోశించాల్సింది పోయి ఆనందమా! కన్నతల్లి తన కడుపున పుట్టిన సంతానం అభ్యున్నతిని ఆకాంక్షించాలి. అలా కానినాడు ఆమె తల్లెలా అవుతుంది? అలాంటి తల్లులను అప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా కొడుకులు అసహ్యించుకుంటారే తల్లి"అని ఏవేవో మాటలు చెప్పబోతున్న మంధరను కోపంగా చూస్తూ ఇక చాలించమన్నట్టుగా చేతితో వారించింది. కోపంతో ఆమె కనులు మంకెన పూలలా రక్తవర్ణాన్ని దాల్చాయి.
    
    దెబ్బ తిన్న కాలసర్పం పడగ విప్పినట్టు చివ్వున తలెత్తి మంధరకేసి చూసింది.
     
    కోపంతో ముక్కుపుటాలదురుతున్నాయి, ఉచ్వాసనిశ్వాసాలు విపరీతంగా పెరిగాయి.
      
    అగ్నిగోళాలుగా మారిన ఆమె కళ్ళను చూసిన మంధరకు భయంతో ముచ్చెమటలు పోసాయి .
      
    "మంధరా! హద్దులు మీరుతున్నావ్, నా కొడుకని పరాయి వాడని ఇక్కడెవరూ లేరు. మా ముగ్గురకూ నలుగురు పుత్రులే. అందరికీ పెద్దవాడు నా రామయ్యనే! ఈ అయోధ్యకు రాజయ్యే యోగ్యత నా రామునకే మినహా భారతునకెక్కడిది?   ఆడదానివని, చిన్ననాటినుండి నన్ను పెంచినదానవని పుట్టింటినుండి వచ్చిన అరుణపు దాసివని ఈసారికి వదులుతున్నాను. మరోమారు ఇలాంటి వాక్కులు ప్రేలావో నేనే నీ తల తీయిస్తా  జాగ్రత్త" అని హెచ్చరించింది. 
       
    కైకేయిలో అంత కోపాన్ని మంధర అంతకుమునదేప్పుడు చూడలేదు. తన ప్రయత్నం సర్వం బూడిదలో పోసిన పన్నీరయిందని అర్థమైనప్పటికీ అక్కడితో ఆగకూడదనే నిర్ణయించుకుని ఎలాంటి పాచిక వేయాలా అని ఆలోచిస్తూ మౌనంగా నిలబడిపోయింది.  
           
    కొద్ది క్షణాల తర్వాత రాణిగారి కోపం తగ్గడం గమనించిన మంధర తానలా మాట్లాడడానికి కారణాన్ని సంజాయిషీగా నెమ్మదిగా ఇలా చెప్ప సాగింది.
     
    "రాముడంటే మీకెంత ప్రేమో నాకు తెలుసును రాణీ! నాకు కూడా ఆ శ్రీరామచంద్రుడంటే వల్లమాలిన ప్రేమ. కాని... కాని... మీరు నా మాటను పూర్తిగా ఆలకించను కూడా ఆలకించక ఆగ్రహించడంతో నాకు కాళ్ళు చేతులాడ్డం లేదు. నేను మీ రాజవంశ క్షేమాన్ని కీర్తిప్రతిష్టలనే కోరుకుంటాను. నాకు రాముడు రాజైనను భరతుడు రాజైననూ ఒకటే కదా! దశరథ మహారాజు కీర్తి చంద్రికలో మచ్చ రాకూడదనే బాధతో నీ పసితనం నుండి నిన్ను లాలించి పాలిచ్చి పెంచిన మమకారంతో స్వతంత్రించి ఏదో చెప్పబోయాను. పెద్ద దాన్ని నా చాదస్తం నాది. మీకు కోపం బాధ కలిగే పని చేయమంటానా?  ఔషధానికి చేదు మంచిమాటలకు కరకుదనము ఉండేవే కదా! సరేనమ్మ నాకు సెలవిప్పించండి" అంటూ వెళ్ళడానికి అనుమతి కొరకు ఆగింది.
    
    ఆమె మాటలు కైకేయి ఆలోచనలను కదిలించాయి. "ఆమె చెప్పేది పూర్తిగా వినకుండగానే కోపగించానేమో! ఆమె చెప్పేదేమిటో వింటే సరిపోతుంది. ఈ ముసలిదానికి నాయందు ఈ రాజవంశమందు యెనలేని గౌరవాభిమానాలు కదా" అని ఆలోచించి "మంధరా"... అని పిలిచింది. 
    
    అలా నెమ్మదించి పిలుస్తుందని తెలుసు. ఆ పిలుపు కొరకే అక్కడ నిలబడి వున్నా మంధర ఏమిటన్నట్లు తలయెత్తి చూసింది.                                       
     
    "చెప్పు మంధరా! శ్రీరాముని పట్టాభిషేకమంటే ఎందుకలా నిరుత్సాహంగా వున్నావ్?" అడిగింది.
     
    "మహారాణీ! మీ అంతఃపుర విషయాలలో నేను జోక్యం తీసుకుని మీ కోపానికి గురి కావడమెందుకు? దాసిదానను దాసిదానిలా వుండాలి. నాకెందుకు తల్లీ మీ పెద్దల విషయాలు" అన్నది మంధర. ఆమెకు తెలుసు లోహాన్ని వేడిచేసి సమ్మెట పోట్లు వేస్తే తప్ప మనమనుకున్న ఆకృతిని పొందలేమని.
       
    "రామయ్యకు పట్టాభిషేకం రాజవంశ కీర్తిప్రతిష్టలకు  కళంకమన్నావ్. ఎందుకలా అన్నావ్? కారణం లేనిది అనియుండవనే భావిస్తున్నాను. చెప్పు. వివరంగా వివరించు" అని  కైకేయి అడిగింది.
      
    "వద్దు రాణిగారు నన్నడగకండి. ఆపై కోపానికొస్తే తట్టుకోలేను, నాదసలే ముసలి ప్రాణం"
     
    ముసలిది భయపడుతున్నదని గ్రహించిన కైకేయి 
    
    "ఏమననులేగాని విషయం చెప్పు విసిగించకు" అని అభయమిచ్చింది 
   
    కైకేయలా అభయమివ్వగానె మంధర ఇలా చెప్పసాగింది.   
     
    "అమ్మా! దశరథునకు ఇద్దరు భార్యలున్నా సంతానం కలగకపోవడంతో వ్యాకులచిత్తుడై వున్న సమయంలో వారు మిమ్ము చూసి మోహించారు. మీ వలన సంతానం కలగొచ్చనే ఆశతో మిమ్మల్ని పెళ్ళాడాలని నిర్ణయం గైకొని మీ తండ్రి గారైన కేకయ మహారాజుకు వర్తమానం పంపాడు. 
      
    భారీగా రథములున్నవాడు, హెచ్చుగా సంపదున్నవాడు, పరాక్రమమున దేవేంద్రునికి సాటైనవాడు, కీర్తి ప్రతిష్టలలో ఇతనికి సాటివచ్చువాడు ఈ మూడు లోకాలలోనే లేనివాడు, ఉత్తమ సద్గుణ సంపన్నుడు, రాజర్షి అనధగినవాడు, సూర్యవంశమనే గొప్ప రాజవంశానికి చెందినవాడు, చతుస్సాగర పర్యంతపు భూభాగాన్ని ఏలుతున్నవాడు, మహా దాతగా కీర్తించబడుతున్న దశరథుని అల్లునిగా చేసుకోవడం ఎవరికి ఇష్టముండదు? 
   
    అందగాడైన అతడంటే మీరూ ఇష్టపడ్డారు. కాని మీ తండ్రిగారు వారికొక షరతు విధించారు.
   
    అది కైకేయికి కలిగిన సంతానానికి రాజ్య వారసత్వపు హక్కును కల్పిస్తేనే  దశరథునకు తన కూతురు నిస్తానని నిర్ద్వంద్వంగా చెప్పాడు. దానికంగీకరించాడు దశరథుడు.
     
    ఆ రోజు మీతండ్రిగారికి రాజుగారిచ్చిన మాట ప్రకారం అయోధ్యకు రాజుకావలసింది భరతుడే కాని  రాముడు కాదు.
    
    ఇప్పుడు రామపట్టాభిషేకం ద్వారా ధశరథమహరాజు మాటతప్పినవాడవుతాడు.
   
    ఇక్ష్వాకు వంశ ప్రభువులలో ఆడినమాట తప్పిన మొట్టమొదటి ప్రభువు ధశరథుడే  అవుతాడు. ఇనవంశరాజులు ఆడినమాట తప్పని వారిగా జగత్ప్రసిద్ధులు. ఆ కీర్తి దశరథుని వలన మసక బారకూడదనే నా తాపత్రయం." అని మంధర ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ చెప్పింది.
   
    మంధర మాటలను విని ఓ చిన్న చిరునవ్వు నవ్వి కైకేయి 
       
    "మా తండ్రిగారికి దశరథునకు జరిగిన ఒప్పందాలు గతజలసేతుబంధనాలు. అయినా అది ధశరథ మహరాజుకు మా తండ్రిగారికి జరిగిన ఏకాంత ఒప్పందము. దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరము లేదు.
      
    ఈ వాగ్దానానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని నేను ఎన్నోకారణాలు చెబుతాను వింటావా?
      
    నా అందాన్ని చూసి మోహపరవశుడైన దశరథుడు నన్ను వివాహమాడాలన్న ఆతురతతో ఆ నియమానికి అంగీకరించి ఉండవచ్చు.
   
    మధ్యము సేవించి పలుకువాడి మాటలకు, కాంతల మొహమున మునిగి మాటాడువాడి మాటలకు విలువేముంటుంది?
     
    వనితలపై మొహం పెచ్చుపెరిగినచొ అది మానవుణ్ణి మూర్ఖుణ్ణి చేస్తుంది. మూఢుడైన వాడు ఉచితానుచితాల నెరుంగలేడు. అప్పటికే ఇరువురు భార్యలను కలిగివున్న ధశరథమహరజు నా అందానికి మోహపరవశుడై మూడవ భార్యగా పరిణయమాడాలనుకున్నాడు. బహుభార్యత్వము రాజవంశాలలో అనుసరణీయమే అయినా కన్యారత్నముల తండ్రులకది నచ్చదు కదా! ఆ విషయమెరిగిన ఈ రాజు నన్ను వివాహమాడడమే తుది లక్ష్యంగా ఈ ఒప్పందానికి సరేనని యనియుండవచ్చు.
       
    కౌసల్యాదేవికిగాని సుమిత్రాదేవికిగాని సంతానము లేకపోవడంతో వారికి ఇక సంతానము కలగదనే భావనతో ఈ మాట ఇచ్చియుండవచ్చు.
   
    ఏది ఏమైనను ఆపద్ధర్మముగాను అవసరార్థము తోను చేసుకొనే ఒప్పందాలు లెక్కించాల్సిన పనిలేదు. ఇది ప్రజా క్షేమం కోసమో లోకకల్యాణం కోసమో ఇచ్చిన వాగ్దానం కానప్పుడు మా పుట్టింటివారికి అభ్యంతరమే లేనపుడు ఈ విషయాన్ని ఇంత పెద్దదిగా చూడాల్సిన పనిలేదు. నా రామునికి పట్టాభిషేకము జరగాల్సిందే. అయోధ్యానగర సింహాసనంపై పరివేష్టితుడైన రాముణ్ణి  కనులార కాంచాల్సిందే" అనుచు మంధర అభ్యంతరాలను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చింది కైకేయి.
      
    రాణి మాటలతో మంధర నిరాశ పడినా తన ప్రయత్నాన్ని మానకుండా 
       
    "ఔను రాణిగారు! మీ మాటలు యదార్థమే. కాని అవి లౌకికమైనవి. ఎప్పుడైననూ ధర్మోల్లంఘనము జరిగినప్పుడు ఆ ఉల్లంఘించిన వాడు తనకు తానుగా సమర్థించుకోడాని కుపయోగించే తార్కికమైన మాటలే తప్ప ఇవి లోక హర్షితాలు కావు.
     
    సత్యవాక్పాలనతో ఆతారచంద్రార్కము కీర్తిప్రతిష్టలతో విలసిల్లే మీ వంశ పూర్వుడైన హరిశ్చంద్రుడు మీలా ఆలోచించలేదు మహారాణీ!
      
    ఏకాంతమందు కుదుర్చుకొన్న ఒప్పందాలకు విలువ లేదనుకుంటే కన్నకొడుకు విగత జీవుడై స్మశానానికి తెచ్చినపుడు కాటిశుల్కాన్ని చెల్లించనిదే అంత్యక్రియల కొప్పుకోని ఆ హరిశ్చంద్రుని సత్యసంధతా మరువబోకు మహారాణి.
       
    హరిశ్చంద్రుడు పుట్టిన గొప్పవంశం మీది. అందుకే ఆ వంశకీర్తిని దశరథ మహారాజు కాపాడాలి. దానికి మీ సహకారం ఉండాలి. భర్త కీర్తిని పెంపొందింప చేయడం పతివ్రతల లక్షణం కూడా! మున్ను యాగరక్షణార్థం రాముడను కొనిపోవ వచ్చిన విశ్వమిత్రులవారు మహారాజుతో ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోండి మహారాణి" దీర్ఘోపన్యాసాన్నిచ్చి ఇక చెప్పాల్సిందేమీ లేదన్నట్టు ముగించింది మంధర.
    
    ఆమె గుర్తు చేయడంతో ఆరోజు విశ్వామిత్రుడు రామున్ని అతనితో పంపడానికి దశరథుడు  సంశయించగా   కోపంతో పలికిని మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి.
 
       "రాజా! ఆడిన మాట కోసం అరణ్యాలపాలై సతీసుతులనెడబాసి ఎంత కష్టమైనా మాటతప్పని హరిశ్చంద్రుని వంశంలో పుట్టిన నీవు నాకు కావలసినది ఇస్తానని రాముని నావెంట పంపమంటే సంశయిస్తున్నావ్.
    
    పుత్ర వాత్సల్యంతో వాగ్దాన భంగమొనర్చు చున్నావ్. ఇది నీవంటి వాడకి తగదు. 
 
    పుత్రవాత్సల్యాలు అనురాగబంధాలు సామాన్యుడికైతే ఉండవచ్చు కాని మహాత్ములకుండ తగదు. శ్రీరాముడు ఈ అయోధ్య నగరంలో మీ రాగబంధాల నడుమ బంధీయై తుచ్చమైన ఈ భోగభాగ్యాల ననుభ వించడానికో ఈ అయోధ్యను పాలించడానికో  కాదు. లోకకల్యాణార్థం జన్మించిన కారణజన్ముడు. త్రిజగముల నేలువాడు.
    మీ ధర్మాచరణమును వాక్పరిపాలనమును పుత్రప్రేమ ఓడించినచో మిమ్ములను జాతి క్షమించదు. ఇంతకాలం సాధించుకున్న మీ వంశ కీర్తి నశిస్తుంది. దుష్టశిక్షణార్థం రాముడను కానల కంపుము"  
 
    ఆ బ్రహ్మర్షి మాటలు ఆమె చెవులలో మారుమ్రోగాయి.       
    
    విశ్వామిత్రుడు తపస్సంపన్నుడు. ఆరోజు కేవలం తనతో పంపమని ఆ మాటలన్నాడా లేక దుష్ట సంహారం చేయాల్సిన బృహత్కార్యమేధైనా శ్రీ రాముడి భుజస్కంధాలపై ఉందని అన్యాపదేశంగా హెచ్చరించినాడా!
      
    తను రామునకు బల అతిబల మంత్రముల నుపదేశించిన విషయం  సీతా స్వయంవరానంతరం రామలక్ష్మణులను అయోధ్యకు తీసుకు వచ్చినపుడు  చెబుతూ దానికి పునశ్చరణ అవసరమని బ్రహ్మచర్యమును పాటిస్తూ తపోదీక్షగా పునశ్చరణ గావించాలని చెప్పియున్నాడు.          
            
    విశ్వామిత్రుడు త్రికాలజ్ఞానికదా రాబోవు పరిణామాలను ఆనాడే హేచ్చరించినాడా? ఆ మహనీయుని మాటల ఆంతర్యమేమిటి?
   
    ఈ వంశ ప్రతిష్టకు గాని దశరథుని కీర్తి ప్రతిష్టతోద్దతికి గాని శ్రీరామ కర్తవ్యనిర్వహణకు గాని నేను చేయాల్సింది ఏమిటి? 
    
    దశరథ మహారాజు మున్నొనరించిన వాగ్ధానము నెరవేర్చుటకు రామపట్టాభిషేకమును నిలువరించాలా? మంత్ర పునశ్చరణ నిమిత్తము విశ్వామిత్రుని వచనం ప్రకారం లోకకల్యాణార్థం దుష్ట సంహరణకై నా రాముని అడవికి పంపాలా?
   
    ధీరుడు వీరుడు పరాక్రమవంతుడు ఇనవంశాంబుధి సోముడు అయిన రాముని పట్టాభిషేకమును ఎలా వద్దని చెప్పగలను .
     
    భరతునికంటే రామునియందే నాకనురాగ అలాగనిమెక్కువ. అలాగని మిన్నకుందునేని దశరథ మహారాజు పలికి బొంకిన వాడుగా చరిత్రలో మిగిలిపోతాడు. 
     
    ఒక తల్లిలా రాముని పట్టాభిషేకమును కనులారా వీక్షించాలని యున్నది. ఒక భార్యగా మహారాజు యశోకీర్తుల పెంపొందింప జేయాల్సి యున్నది. ఈ రెండు కార్యములు రెండు నేత్రములైనప్పుడు ఏ నేత్రమును కాపాడుకోవాలి? ఏ కన్నును పొడుచుకోవాలి?
      
    భగవంతుడా! ఎంతటి విషమ పరీక్షకు నను గురిచేసావయ్యా? దశరథ మహారాజు కీర్తి చంద్రిక మసకబారకుండా ఉండాలంటే రాముని పట్టాభిషేకము నడ్డుకోవాలి. విశ్వామిత్రుని వచనముల కంతరార్థమిదియేనేమో? త్రికాల జ్ఞానులు కనుక సూచన ప్రాయంగా ఆనాడే బ్రహ్మచర్యము తపోదీక్ష అంటూ ఎరిగించిరేమో? మూఢులమై పరమార్థమెరగలేక పోయితిమేమో?
     
    రాముడు అమిత బలసంపన్నుడు.  కారణజన్ముడు. ఎందరో రాక్షసుల సంహరించి మునుల యజ్ఞాలను కాచినవాడు. కాలి ధూళితోనే అహల్యకు శాపవిమోచనం కలిగించిన పుణ్య పురుషుడు. ఎవరికీ సాధ్యం కాని శివధనువునవలీలగా చేధించిన వాడు. గర్వితుడు పరమకోపిష్టి యైన భార్గవుని గర్వాన్ని కనుచూపుతోనే అంతం చేసినవాడు. విశ్వామిత్రుని చేత కారణ జన్ముడని కీర్తించబడినవాడు. వినయమనే భూషణముతో సదా శోభిల్లువాడు మహా పరాక్రమశాలి యైన రామునకు అరణ్యమైనా అయోధ్యతో సమానమే.
    
    నా రాముడు లోకకల్యాణకారకుడు.  అతని వలన ఇంకనూ మిగిలిన దుష్ట శిక్షణ జరగవలసినది యున్నదనియే కదా ముని పలికినది. నా రాముని వలన లోకకల్యాణం జరగాలనే కదా నేను కోరుకునేది? రాముని పట్టాభిషేకమును ఆపక తప్పని పరిస్థితి . వృద్ధుడైన దశరథ మహారాజు కీర్తి చంద్రికను మసక బారనీయకూడదు"
    
    ఈ నిర్ణయమైతే తీసుకుంది కాని ఆమె నేత్రాలు సజలాలయ్యాయ్ 
    
    హృదయం బరువెక్కింది. సూర్యుణ్ణి అరచేతుల్లో బంధించలేము అలాగే విధి కృతము ను శాశించాలేము కదా.
    
    రాముని పట్టాభిషేకమునాపడం వలన నిందితనౌతానని ఆమె చింతించలేదు, రామునెడబాసి జీవించగలనా అని హృదయవిదాయకంగా ఏడ్చింది.
    
    "రామునకు పట్టాభిషేకము కూడదు అనగానే నా రాముడు సంతోషంగా సరియే అంటాడే తప్ప అన్య భాషణమొనరించడు.
    
    ఆ సౌశీల్యం అతని కీర్తినినుమడింప జేయాలి. 
    
    నేను తీసుకున్న ఈ నిర్ణయం నన్ను స్వార్థ పరురాలిగా  దురాత్మురాలిగా చరిత్ర హీనురాలిగా ఈ లోకం భావించినా నా మహారాజును ఆడితప్పని వాడిగా, నా రాముడను పితృవాక్య పరిరక్షకుడుగా త్యాగమూర్తిగా అవతార పురుషోత్తమునిగా  ఈ లోకం కొనియాడాలి        
        
    రాముని ప్రేమ వాత్సల్యానికి బంధీని కనుక అతడిని విడిచి ఉండగలనా . 
         
    ఓ మరణమా ! నా నిర్ణయాన్ని రాజుకు చెప్పగానే నన్ననుగ్రహింపుమా!"అంటూ ఏడ్చింది.
   
    తట్టుకోలేని దుఃఖంతో నిలువెత్తు శోక దేవతే అయింది కైకేయి. కైకేయి అంతరంగంలో చెలరేగే బడబాగ్నితో ఆమె దహించుకు పోతుంటే అనుకున్నది సాధించానని మంధర పొంగిపోసాగింది.
      
    మంధర కుయుక్తి తెలుసుకోలేని కైకేయి ఆ దాసితో "ఒసే మంధరా... హాయిగా నిద్రిస్తున్న నన్ను నిద్ర లేపి నాచే ఎంతటి కఠోర నిర్ణయానికి పురిగోల్పితివే" గద్గద స్వరంతో అంటున్న కైకేయి మాటలు పూర్తి కాకముందే ఒక నమస్కారం చేసి అనుమతి తీసుకొనకనే నిష్క్రమించింది మంధర.
       
    పౌర్ణిమ పర్వ కాలములందు ఉప్పొంగు సముద్ర తరంగముల వలె ఆమె హృదయం నుండి ఉబికి వచ్చిన దుఖం కట్టలు తెగిన ప్రవాహమే అయింది.
       
    "హే రామా! అరవింద దళాల వంటి నీ నేత్రాలను చూడకుండా వీనులలరించేలా నీవు పిలిచే అమ్మా ! అనే పిలుపు వినకుండా మేమెలా జీవించగలము తండ్రీ!  నేను దురాత్మురాలనై తీసుకుంటున్న నా ఈ నిర్ణయానికి నన్ను క్షమించు రామా! 
  
    ఈ లోకం నన్ను అర్థం చేసుకోకున్నా నువ్వర్థం చేసుకుంటావనే భావిస్తున్ననురా రామా!" అంటూ తట్టుకోలేని శోకంతో శోకగృహానికేగింది.
Comments