కాక్‌టెయిల్ - సతీష్ చందర్

    
వచ్చింది చావుకి. ఈ పెళ్లికళేమిటి?

    శర్మకి అర్థం కాలేదు.

    ఇల్లు వెలిగిపోతోంది రంగు రంగుల విద్యుద్దీపాలతో. ఆ వెలుతురు చూశాక గాని పొద్దు కుంగిందని తెలియలేదు. ముందు జాకబ్ రాజూ, వెనుక తనూ. వీపు మీద తగుమోస్తరు బరువున్న బ్యాగులతో నడుచుకుంటూ వచ్చారు. రైలు అప్పుడే దిగారు. దిగినప్పుడు చీకటి పడలేదు. ఇక్కడికొచ్చాకా చీకటి లేదు. వెలుతురులోంచి వెలుతురులోకి వచ్చేశారు.

    “అవున్రా? మీ అమ్మమ్మ నిజంగా చనిపోయిందా?” శర్మ అడక్కుండా వుండలేక పోయాడు.

    జాకబ్ రాజు నడకను హఠాత్తుగా ఆపి, భుజానికున్న బ్యాగ్‌ను అరచేతుల్లోకి తీసుకుని శర్మ వైపు తీక్షణంగా చూసి -
“అది పోయేరకం కాదు. అందుకే దాన్ని ఇప్పటికి అయిదు సార్లు చంపాను” అన్నాడు.

    శర్మ బుర్ర పాదరసమే. ఆ మాటల వెనుక భావం వెంటనే గ్రహించేవాడే … కానీ సందేహభారంతో వున్నాడేమో కాస్త లేటయ్యింది.

    “నువ్వు చంపటం … ఆఁ … ఆఁ … అర్థమయ్యింది. నువ్వు అండమాన్ హాలిడేట్రిప్‌కు వెళ్లినప్పుడు ఒకసారి, అదేదో పనికిమాలిన పోటీపరీక్షకు చదవాలని ఒక సారి, పెళ్లిచూపులకని మూడు సార్లూ మీ అమ్మమ్మను చంపేశావు. అంతేనా …?”

    “అలా చెబితేనే కాని మన తింగర బాస్‌గాడు సెలవివ్వడు కదా! సచ్చినోడు … చావును నమ్ముతాడు కానీ, పెళ్లిని నమ్మడు” అంటూ శర్మ వీపు మీద బ్యాగ్‌ను కూడా దించేశాడు. కానీ బుర్రలోని బరువును దించలేకపోయాడు.

    ఇంటి గుమ్మం ముందు కొచ్చేసినా, చావు జరిగిన దాఖలాలేవీ కనపడలేదు.

    “ఒరేయ్ రాజూ! ముసలావిడ పోయినట్టు లేదురా?” అన్నాడు శర్మ … ఎక్కడా ఏడుపులూ, పెడబొబ్బలూ వినపడకపోయే సరికి. 

    “బతికినట్టు కూడా లేదు” ఇంటి ముందు గేటు తీసుకుని లోపలికి వెళుతూ అన్నాడు.

    ఆ చప్పుడికి చెంగు చెంగున ఎగురుకుంటూ వచ్చారు ముగ్గురు వయసులో వున్న అమ్మాయిలు.

    “మొత్తానికి ముసిల్దాన్ని పంపేస్తే కానీ, ఇంటికి రాలేదు. నీకు వుందిలే … రా లోపలికి” అంటూ ఇద్దరి చేతుల్లోని లగేజిని తీసుకుంది అందులోని ఒక అమ్మాయి.

    ‘ఓహో ! ముసలావిడ నిజంగానే పోయిందన్న మాట’ ఆమె మాటల్ని బట్టి నిర్ధారణ చేసుకున్నాడు శర్మ. అంతే కాదు గుడ్లప్పగించి ఆ ముగ్గురి అమ్మాయిల ముఖాల్నీ మార్చి మార్చి చూస్తున్నాడు.

    “కంగారు పడకు. ఇక్కడ అందరూ అందంగానే వుంటారు. ఇది జాస్మిన్ ది. నా చెల్లెలు” అని పరిచయం చెయ్యబోయాడు.

    చేతులు ఖాళీగా లేకపోవటం వల్ల ఆ అమ్మాయి వినయపూర్వకమైన నవ్వును నవ్వుతూ పలకరింపుగా తలాడించింది. శర్మ మాత్రం “నమస్కారమండీ” అని చేతులు జోడించేశాడు. అయినా శర్మ మళ్లీ అలాగే మార్చి, మార్చి ముగ్గురివైపూ ఆత్రంగా చూస్తుంటే … “శర్మా! ఇక చూసింది చాలు …” అని వాడి చెవిలో మెల్లగా చిన్న హెచ్చరిక చేశాడు జాకబ్ రాజు.

    “ఛీ … ఛీ … అది కాదురా … ఎవరి కళ్లూ ఏడ్చినట్టుగా లేవేమిటని చూస్తున్నాను” అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు శర్మ. 

    “ఏడిసినట్టుందిలే తెలివి” అని, “ఏయ్ జాస్మిన్ దానా, ఇటు రావే” అని తన చెల్లెల్ని పిలిచాడు జాకబ్. ఆమె వెళ్లినంత స్పీడుగానే వెనక్కి వచ్చింది.

    “ముసల్ది పోయింది కదా! ఏడవ్వేంటి …?” అన్నాడు.

    “వద్దురా! ముసల్ది ఫీలవుద్ది” అని చెప్పింది. ఆమె పక్కన వున్న ఇద్దరు అమ్మాయిలూ పకాలున నవ్వేశారు.

    “వీళ్లెవరో చెప్పలేదు కదా! ఇది మేరి ది. నా మరదలు. ఇదేమో రాణి ది నా మేనకోడలు” అని శర్మ వైపు తిరిగి “వీడే శర్మగాడంటే. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అస్సలు తినడు, ఒక్క ఎగ్ వైట్ తప్ప” అని పరిచయం చేశాడు. వాళ్లూ నిండుగా నవ్వుతూ, శర్మను పలకరించి తుర్రుమని లోపలికి వెళ్లిపోయారు.

    “రాజూ, ఇదేమిట్రా, మేరి – ది, రాణి – ది … ఇలా అంటున్నావేమిటి?”

    “అదా! నీకెలా చెప్పాలీ … అదో గౌరవ వాచకం. పేరు చివర ‘ది’ని గౌరవంగా వాడుతున్నాను. ఇంగ్లీషులో డెఫినిట్ ఆర్టికిల్ ‘ది’ లేదూ … అలా అనుకో.”

    “అబ్బా! నీకు స్త్రీలంటే అంత గౌరవమా…?” అన్నాడు విడిచిన చెప్పుల్ని ఒకపక్కగా పెట్టుకుంటూ శర్మ.

    “గౌరవమే అనుకో … గారాబమే అనుకో … వీళ్లని నేనలాగే పిలుస్తాను” వెళ్ళిన ఆ ముగ్గురి వైపూ వాత్సల్యంతో చూశాడు.

* * *

    అది వాడ కావచ్చు. కానీ ఆ ఇల్లు గుడిసె కాదు. మేడ. ముసలావిడ ముగ్గురు కొడుకులూ కట్టుకున్న గూడు. ఎవరూ ఎప్పుడూ ఇంటిపట్టున లేరు. గల్ఫ్‌లో ఇద్దరూ, సైన్యంలో ఒక్కరూ. దేశం సైనికుణ్ణి ప్రాణాలతో తిరిగివ్వలేకపోయింది. గల్ఫ్‌లో వున్న వారు రెండేళ్ళకు ఒకసారి కానీ రాలేరు. వాళ్ల భార్యలూ పిల్లలూ అందరూ ఆ మేడలోనే. ముసలావిడకు ఒకే ఒక కూతురు. ఆమె పిల్లలే జాకబ్ రాజూ, జాస్మిన్‌లు. ముసలావిడ నిటారుగా నిలబడటాన్ని జాకబ్ రాజు ఎప్పుడూ చూడలేదు. తాతయ్య పక్కన నిలబడ్డ ఫోటోలో తప్ప. సగం వంగే వుంటుంది. జాకబ్ రాజు, శర్మతో లోపలికి వెళ్లేసరికి హాలు మధ్యలో, గాజు పెట్టెలో, లోపల వున్న ట్యూబ్ లైట్ల కాంతిలో నడుము సాపు చేయించుకుని పడుకుని వుంది ముసలమ్మ.

    అప్పుడయినా జాకబ్ రాజునీ, తననీ చూసి అతడి బంధువులు భోరుమని విలపిస్తారని ఆశించాడు శర్మ.

    “ముసల్ది పొడుగేనే!” అన్నాడు జాకబ్ రాజు ఎదురుగా వున్న చెల్లెల్ని చూస్తూ.

    “అవున్రా. వంగే వుండిపోయింది కదా. గిన్నె కోడిలాగా … మనకి తెలియలేదు. మన ముసలోడు దీని హైట్ చూసుకునే చేసుకునుంటాడు” కళ్లు చురుగ్గా తిప్పుకుంటూ చెప్పింది జాస్మిన్.

    “అందుకే ఆణ్ణి ముందు పంపేసింది” అంటూ గాజు పెట్టె పక్కనే వున్న ప్లాస్టిక్ కుర్చీల్లో రెండు తన వైపుకు లాక్కొని, ఒకదాంట్లో తాను కూర్చుంటూ, పక్కనే ఇంకో కుర్చీలో శర్మను కూర్చోమని సైగ చేశాడు.

    “ఒరేయ్ శర్మా! మా ఇంట్లో ముసిల్దంటే ఏమనుకున్నావ్ … ఎలిజబెత్ రాణి” అని చెల్లెలు వైపు తిరిగి “జాస్మిన్ దానా! దీని కర్ర ఏదే …?” అనగానే పక్కనే గోడకు చేర్చివున్న కర్రను అందుకుని జాస్మిన్ అన్నయ్య, శర్మలు కూర్చున్న కుర్చీల వెనక్కి వచ్చింది. “ఇదీ దీని రాజదండం. దీంతో కోళ్లనీ, కుక్కల్నే కాదు … కోపం వస్తే మనుషుల్నీ పరిపాలిస్తుంది” అని చెల్లెలి వైపు చూస్తూ “నిన్నెన్ని సార్లు పరిపాలించిందే …!?” అనడిగాడు.

    “ఎన్ని సార్లా? ప్రతీ ఆదివారమూనూ … దీనికి నా మీదకన్నా నా జుట్టు మీద మోజు. దానికి షాంపూ పెడితే చాలు. కర్రపుచ్చుకుని తరుముతుంది. కుంకుళ్ళే పెట్టుకోవాలంట …” అని కొద్దిగా ఆగింది.

    జాస్మిన్ కురుల్ని తేరిపార చూడాలని శర్మ ఉబలాటపడ్డాడు. అలా చెయ్యాలంటే వెనక్కి తిరిగి, తల పైకెత్తి చూడాలి. అంతటి బహిరంగ ప్రయత్నం మానుకుని కొన్ని క్షణాల క్రితం ఆమెను చూసినప్పుడు తన మనసులో ముద్రితమైన చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆమెది రింగు రింగుల జుత్తు. ఈ లోగా తన కుడి ముంజేతి మీద నీటి బొట్టు. కన్నీటి బొట్టు కావచ్చు. శర్మకు ప్రాణం లేచివచ్చింది. ఎవరో ఏడ్చినట్టున్నారు. ఎవరో ఏమిటి? తన వెనుక జాస్మినే నిలబడింది. ఆమే ఏడ్చి వుండాలి. ముసలావిడ ‘వెంట్రుక వాసి’ ప్రేమ గుర్తుకొచ్చి ఆమెకు తెలియకుండానే ఆమె కళ్లు చెమ్మగిల్లి వుంటాయి. ఇప్పుడయినా ధైర్యం చేసి వెనక్కి తిరిగి ఆమె కళ్లను చూడాలనుకున్నాడు.

    “మంచినీళ్ళు తీసుకోండి” తన భుజం మీద నుండి వచ్చిన రెండు చేతుల్లోనూ రెండు నీళ్ల గ్లాసులు. వాటినుంచి జారి పడ్డాయి అలాంటి చినుకులే రెండు.

    గ్లాసు అందుకుంటూ, జాస్మిన్ కళ్ళను చూశాడు. అవి నవ్వుతున్నాయి. చెమ్మగిల్లిన జాడలే లేవు.

    “అవునే. ఎందుకు పోయిందే … ఇదీ …?” అన్నాడు జాకబ్ రాజు గాజు పెట్టెలో వున్న ముసలమ్మని చూస్తూ.

    “ముసలోణ్ణి చూడాలనిపించీ…!” ఈ స్వరం జాస్మిన్‌ది కాదు. అతడి మేనకోడలు రాణిది.

    జాకబ్ రాజు వెనక్కి తిరిగి రాణి ముఖంలో ముఖం పెట్టి “నిజమేనే. అది నీలాంటిదే. మొగుడి కోసం గోడల్దూకే రకం.”

    “ఆహా! జాగ్రత్త మరి. గోడల పక్కన నడవకు” అని జాకబ్ రాజు నెత్తిన మొత్తి మరీ పారిపోయింది రాణి. అది జోకు కాకపోవచ్చు. కానీ, శర్మ తప్ప అందరూ నవ్వారు.

    “శవం దగ్గర ఏడుపు రాకపోతే, ఏడుపు తెచ్చుకుని ఏడుస్తారు. ఇదేమి ఖర్మరా బాబూ. ఇక్కడ నవ్వు తెచ్చుకుని మరీ నవ్వుతున్నారు” అని తన మనుసులోనే కుమిలి పోతున్నాడో ఏమో, నవ్వే ముఖాల్ని బిక్క ముఖంతో చూశాడు శర్మ.

* * *

    ఆ రాత్రి మేడపైనే శర్మకు బస. పైన మడత మంచం వేశారు. వెల్లికిలా పడుకుని పైకి చూశాడు. ఏడిసినట్టుంది ఆకాశం. అందుకు దాఖలాగా మెరిసే చుక్కలు. కానీ ఆ ఇంట్లో వాళ్ళ ముఖాలమీదే ఒక్క నీటిచుక్కా జారిన జాడ చూడలేకపోయాడు.

    నవ్వని వాళ్ళని చూస్తే కోపం వచ్చేది. మొదటిసారి ఏడ్వని వాళ్ళని చూస్తే కోపం వస్తోంది. కోపం దేనికి? తాను ఏడవ్వొచ్చు కదా! ఏ చావు దగ్గరరికెళ్లినా తాను నిజంగానే ఏడ్చి వచ్చేవాడు. శవాన్ని చూసి కాదు. ఏడ్చేవాళ్ళను చూసి. ఇప్పుడు ఉత్త శవాన్ని చూస్తే ఎలా ఏడుపొస్తుంది? తనని అలాగే మేడమీద వదిలేసి, జాకబ్ రాజు కిందకు వెళ్లాడు. శవజాగారం నడుస్తోంది. అందరూ జాకబ్ రాజు లోకల్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఒకటే నవ్వులు. మద్యం, సిగరెట్ల వాసన పైకి కూడా వస్తోంది. జాకబ్ రాజు తనని కూడా రెండు పెగ్గులు వేసి పడుకోమన్నాడు కానీ, ఆ ఏడుపురాని రాత్రిలో ఆ పని చేయబుద్ధి కాలేదు శర్మకు.

* * *

    “అన్నయ్యా! లేరా! అమ్మొచ్చింది”

    జాస్మిన్ వాళ్ళన్నయ్యను నిద్రలేపుతుంటే శర్మకు మెలకువ వచ్చింది. అప్పటికే తెల్లవారి చాలా సేపయినట్టుంది. ఎండ ముదిరిపోయింది. జాకబ్ రాజుగాడు రాత్రి ఎప్పుడొచ్చి పడుకున్నాడో, శర్మ పక్కలో వున్నాడు.

    “ముసిల్దాన్ని చూసేసిందా?” ఉలిక్కిపడి లేచాడు జాకబ్ రాజు.

    “ఇంకా లేదు. మిలట్రీ మామయ్య వచ్చి, వాళ్లింటికి తీసుకువెళ్ళాడు. ముసిల్దాన్ని ఆసుపత్రిలో పెట్టారనుకుంటోంది. నువ్వురా ముందు” అని చరచరా దిగి వెళ్ళిపోయింది.

    మండుటెండలో చల్లని గాలి వచ్చి తాకి పోయినట్లనిపించింది శర్మకి – జాస్మిన్ వచ్చి వెళ్లటం.

    ముసలావిడకి ఒకే ఒక కూతురు. జాకబ్ వాళ్లమ్మే కదా. ఇంతవరకూ ముసలావిడ చావు వార్తను ఆవిడకు చెప్పకుండా వుంచినట్టున్నారు. ఆవిడకు హార్ట్ ప్రాబ్లెమ్ వుందని … జాకబ్ రాజు చాలా సార్లు చెప్పాడు. తల్లి శవాన్ని చూశాక, ఆవిడయినా ఏడుస్తుందో, లేదో …?”

    మళ్ళీ మొదలయింది శర్మ మనసులో ఏడుపు దిగులు.

    ఏడవక పోవటమేమిటి? కన్న కూతురన్నాక ఏడ్చి తీరాలి. ఏడవకపోతే ఏడిపించాలి. అంత దుఃఖాన్ని దాచుకోవటం ఆవిడ గుండెకు మంచిది కాదు. అనుమానం లేదు. ఆవిడ ఏడుస్తుంది. పొగలిపొగిలి ఏడవాలి.

    ఆ సన్నివేశం చూడటానికి శర్మ మంచం మీదనుంచి చివాల్న లేచి బాత్ రూంలోకి పరుగెత్తాడు.

* * *

    కిందనుంచి పెద్ద పెద్ద కేకలు. తిట్లు, బండబూతులు, శాపనార్థాలు.

    దుస్తులు మార్చుకుంటున్న శర్మ ఉత్కంఠతో చెవులు రిక్కించాడు. అవును. పెద్ద పెద్ద అరుపులు. ఒకే ఒక ఆడగొంతు నుంచి వస్తున్నాయి. ఆ కేకల్లో ఎక్కడన్నా ఏడుపు కలుస్తుందేమోనని ఎదురుచూశాడు. లేదు. ఉత్త తిట్లు. కోపంతో ఊగిపోయేవారినుంచి మాత్రమే వచ్చే చీవాట్లు. తన తల్లి మరణవార్త దాచివుంచారని, జాకబ్ రాజు, జాస్మిన్లను తిడుతుందేమోనని భావించాడు శర్మ.

    ఆ తిట్లు పూర్తయ్యాక, ఏముంటుంది? ఏడ్వక తప్పదు కదా! శర్మ తనను తాను సముదాయించుకుంటూ మెట్లు దిగాడు. 

    “ఏం పుట్టకే నీది! నీ ముఖం మండ! ఓ కూతురుంది. ఏ ఏడుపయినా దానికి చెప్పేడిస్తే నలుగురూ మెచ్చుతారన్న ఇంగితం వుందంటే …!”

    ఈ మాటలు శర్మ చెవిన పడ్డాయి.‘అదుగో ఏడుపంటుంది! ఇక మొదలు పెడుతుంది కాబోలు’ అనుకున్నాడు.“ముండకానా…! ఏదయినా ఒక్క పని నాకు చెప్పి చేశావంటే …! కొడుకులు… కొడుకులు… వాళ్లు నందంటే నంది. పందంటే పంది. పనికిమాలిన దానా! వాళ్లనే కనేసి ఊరుకోకపోయావా? నన్నెందుకు కన్నావే? కూతురింటి దగ్గర కాదు… కొడుకులింటి దగ్గరే చావాలని ఒట్టేసుకున్నావనుకో…! నీ అమ్మ కడుపు కాలా…! నాకో ముక్క చెప్పి చావొచ్చు కదంటే…!”

    ఇవి కూడా జాకబ్ రాజు తల్లి తిట్లే. శవం ముఖం చూస్తూ తిడుతోంది.

    శర్మ హతాశుడయ్యాడు. తిడుతున్న జాకబ్ రాజు తల్లి ముఖకవళికల్ని చాలా దగ్గర్నుంచి చూశాడు. రౌద్రం తప్ప ఎక్కడా దుఃఖం కనపడటం లేదు. ముందు నవ్వారు. ఇప్పుడు తిట్టారు.

    ఇక ముసలిదాని గురించి కన్నీటుబొట్టు రాల్చేవారంటూ ఎవరూ లేరని శర్మ దాదాపు నిర్ధారణ కొచ్చేశాడు.

* * *

    అతడు ఊహించినట్టే, అన్ని పనులూ సందడి సందడిగానే జరిగిపోయాయి. ఎవరూ ఏడ్వకుండానే ముసలావిణ్ణి ఖరీదయిన చెక్కతో చేసిన శవపేటికలో పెట్టేశారు. అప్పుడు కూడా ఎవరూ గొల్లు మనలేదు. పాస్టర్ వచ్చి ప్రార్థన చేయగానే, పెట్టె పైకి లేచింది. 

    మొయ్యటానికి జాకబ్ రాజు కూడా భుజాన్నిచ్చాడు.

    “పరదేశులమూ ప్రియులారా … మన పురమిది కాదెపుడూ …” ఎవరో అందుకున్న కీర్తనకు అందరూ గొంతు కలిపారు. వెంట దాదాపు పేట పేటంతా వచ్చింది. ఎవరి మాటలు వారివి. వారి మధ్యన కలిసి నడిచాడు శర్మ. వారి ముఖాల్నీ చూశాడు. అయినా అతడి పిచ్చి కానీ, ఇంట్లో వాళ్లకి రాని ఏడుపు వీధిలో వాళ్ళకి ఎందుకు వస్తుంది?

    చివరికి సమాధుల స్థలం వచ్చింది. అదొక ఉద్యానవనంలాగా వుంది. బాగా చదును చేసి వున్న సిమెంటు సమాధుల మీద పసుపు పచ్చని, ఎర్రని పూలు రాలి వున్నాయి. ఎటు చూసినా శిలువలే. ప్రతీ సమాధికీ ఒక విలాసం. చలువరాతి మీద చెక్కిన ‘తుది పలుకు’ (ఎపిటాఫ్)లు. కొన్ని బైబిలు వాక్యాలూ, అక్కడక్కడా షేక్స్పియర్, మిల్టన్ వంటి ఆంగ్ల కవుల పంక్తులూ వాటి మీద చెక్కివున్నాయి.

    ఇంగ్లీషువాడు ఈ వాడల్లో తన ముద్రల్ని ప్రసూతి కేంద్రాలనుంచి, శ్మశాన వాటికల వరకూ మిగిల్చివెళ్ళినట్లున్నాడు.

    పొందిగ్గా తవ్వి, వారల చుట్టూ ఇటుకలూ, సిమెంటుతో కట్టిన గోతిలోకి ముసలావిడ శవపేటికను జారవిడిచారు. ఆమె ముఖాన్ని కడసారిగా జాకబ్ రాజును చూడనిచ్చారు. వాడొట్టి మూర్ఖశిఖామణి. వాడు మాత్రం ఇప్పుడయినా ఎందుకేడుస్తాడు?

    ఇక పూడ్చటమే తరువాయి.

    “మట్టికి మట్టినీ …” అని పాస్టర్ అనబోతున్నాడో లేదో …

    “ఆపండ్రోయ్ … ఆపండ్రా..!” అన్న కేకలు దూరం నుంచి వినవచ్చి, అందరూ ఆగిపోయారు.

    జాస్మిన్ పరుగు పరుగున వస్తోంది … శర్మతో పాటు అందరూ అటు వైపే చూశారు.

    దగ్గరకొచ్చేసింది. ఆమె చేతిలో ఆ కర్ర!

    చెమట్లు పట్టిన ముఖం మీదకు తొంగి చూస్తున్న రింగు రింగుల ముంగురులు!

    అందరూ అది ముసలమ్మ కర్రే అని గుర్తు పట్టారు.

    “ఆ కర్రెందుకే జాస్మిన్ దానా?” అనడిగాడు జాకబ్ రాజు.

    “ఈ ముసల్దెల్లేది ఎక్కడికీ? మొగుడిదగ్గరకే కదా! ఆణ్ణి కొట్టకుండా ఇది ఒక్కనాడన్నా కాపురం చేసిందా …?” అని రొప్పుతూ రొప్పుతూ చెప్పి, కర్రను పాస్టర్ చేతికి ఇచ్చింది.

    శ్మశాన వాటికలో నవ్వులు విరిసాయి.

    చిత్రం. ఆ నవ్వుల్లో ఈ సారి శర్మ నవ్వు కూడా కలిసిపోయింది.

    అక్కడున్న చెట్లూ నవ్వినట్టున్నాయి.

    పసుపు పచ్చ పూలూ, ఎర్ర పూలూ శవ పేటిక మీద రాలాయి.

    పేటిక పక్కనే కర్రను పెట్టి పూడ్చేశారు.

    శర్మకు ఇప్పుడు దిగులు అనిపించలేదు. జాస్మిన్ వైపే చూస్తున్నాడు. అతనికి తెలియకుండా ఆమె వైపే నడుస్తున్నాడు.

    ఏదో సత్యాన్ని తెలుసుకున్నట్లుంది.

    ఏదో సౌందర్యాన్ని కనుగొన్నట్లుంది.

    చెట్టుకు చేరబడి విలాసంగా ఆమె.

    ఆమె ముందు వినమ్రంగా అతడు.

    “జాస్మిన్! మీరు నాతో వచ్చేస్తారా?” అన్నాడతను.

    ఈ మాటకు ఆమె కొత్తగా నవ్వలేదు. నవ్వు ఆ ముఖంలో స్థిరనివాసమున్నట్టుగా వుంది.

    “పోనీ, మీతో నేను వుండిపోనా?”

    ఈ మాట కూడా ఆమె విన్నట్లు లేదు. దూరంగా ఎటో చూస్తోంది.

    “అమ్మా! నేనూ వుండిపోతానే…!” ఈ మాట జాస్మిన్ తల్లిది.

    శర్మ వెనక్కి తిరిగాడు.

    అప్పుడే పూడ్చిన సమాధి మొత్తాన్ని గుండెల్లోకి తీసుకుని వుంది జాస్మిన్ తల్లి. ఇంతకుముందు వరకూ ముసలావిణ్ణి బండబూతులు తిట్టిన ఆడకూతురు.

    “మరి నేనెక్కడికెళ్ళనే …! ” అది జాస్మిన్ గొంతు … వణుకుతూ … వణుకుతూ.

    తల్లి దగ్గరకు వెళ్ళింది.

    “అమ్మా!” అది కేక కాదు, వేదన. బహుశా తనకు జన్మనిచ్చేటప్పుడు ముసలావిడ అదే కేక పెట్టి వుంటుంది.

    “ఏడవకమ్మా! నేనున్నాను కదా!” అంటూ తన తల్లిని తన చేతుల్లోకి తీసుకుంది జాస్మిన్.

    జాస్మిన్ తల్లి జాస్మిన్ ముఖాన్ని తడుముకుంది.

    “అవునమ్మా … నువ్వు పుట్టేశావ్ కదా!… నా తల్లివిరా నువ్వు … నా అమ్మవురా నువ్వు … నా ముసిల్దానివి రా నువ్వు …”

    ఆ సన్నివేశం చూసిన జాకబ్ రాజు ఏడ్చాడు. పాస్టర్ ఏడ్చాడు. పేట పేటంతా ఏడ్చింది. శర్మ కూడా ఏడ్చేశాడు.

    ఏడ్చి ఏడ్చి తేరుకున్నాడు కానీ, మిగిలిన వాళ్లు నిశ్శబ్దంగా కళ్లు తుడుచుకుంటూనే వున్నారు.

    నవ్వితే బాగుణ్ణు. ఎవరయినా నవ్విస్తే బాగుణ్ణు. ఎవరూ నవ్వరేమిటి?

    మళ్లీ మొదలయింది శర్మకు సమస్య.

    “చావు దగ్గర పెళ్లిచూపులా? తప్పు కదూ!” ఎలా వచ్చిందో శర్మ దగ్గరగా వచ్చి, చెవిలో చెప్పి తుర్రుమన్నది.

    శర్మకొక్కడికే నవ్వొచ్చింది. తలచుకొని తలచుకొని నవ్వాడు.

    అమృతం పుచ్చుకున్న వాడు చావును జయిస్తాడు.

    విషం తాగినవాడు బతుకును గెలుస్తాడు.

    వీళ్లు రెండూ కలిపి తాగేసినట్టున్నారు.

    ఆమెను అందుకోవటానికి దిగి వచ్చాననుకున్నాడు నిన్నటి దాకా. ఎదిగి రావాలనుకున్నాడు ఈ క్షణం నుంచీ.
Comments