కలకానిది-విలువైనది - కె.వరలక్ష్మి

    
తూర్పున ఎక్కడో సూర్యోదయం కాబోతున్న సూచనగా చీకట్లు మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి.

    కార్తీక పూర్ణిమ. గుడిగంటలు అదేపనిగా మోగుతున్నాయి. 

    అప్పటి వరకూ బంగారు వన్నెవన్నెలకాంతిని విరజిమ్మిన చందమామ మొహం తెల్లబోతోంది. ఆ ఉదయ సంధ్యలో పొగమంచు దట్టంగా అలముకుని ఉంది.

    తెల్లవారుఝామున మూడు గంటల నుంచీ జనం నాటు పడవల్లో పట్టిసీమ రేవు నుంచి వీరభద్రేశ్వరాలయం ఉన్న పట్టిసం లంకలోకి పోటెత్తినట్టు వస్తున్నారు. ఇసుక మేటలు వెయ్యడం వలన లాంచీలు రాలేవు. అందుకే పడవల వాళ్లు మంచి హుషారుగా ఉన్నారు. అద్దరి నుంచి ఇద్దరికి నిముషాల్లో తెడ్డు వేస్తున్నారు. ఏడాదికోసారి అరుదుగా వచ్చే అవకాశం. పడవల నిండా జనాన్ని కుక్కేసి తీసుకొస్తున్నారు. జనం వచ్చిన వాళ్లు వచ్చినట్టే గోదావరిలో మూడు మునకలేసి తడిబట్టల్తో తపతపలాడుతూ ఆలయం వైపు దారి తీస్తున్నారు. పూజలు, దర్శనాలు ముగించుకున్న వాళ్లని తిరిగి ఇద్దరి నుంచి అద్దరికి చేరవేస్తున్నారు పడవల వాళ్లు.

    అలా జనంతో కలిసి మొదటి పడవలో వచ్చిన లంకలో దిగేడు భద్రుడు. అందరితో బాటే అసంకల్పితంగా గోదాట్లో మునకలేసాడు. కాళ్లకింద ఇసుక తగుల్తోంది. ముందుకు పోనీకుండా రక్షణ వలయం ఉంది. గుడివైపు వెళ్లబుద్ధి కాక ఎడమవైపు నిర్జన ప్రదేశంలోకి నడిచాడు. పాదాలు నీళ్లలోకి వేళ్లాడేసి ఇసుకలో కూర్చున్నాడు. కార్తీక దీపాల వెలుగులో మెరుస్తున్న గోదారి అతని పాదాల్ని తాకుతోంది. ఓపలేక చటుక్కున పైకిలాక్కున్నాడు. వెన్నులోని మజ్జ మొత్తాన్ని ఎవరో పీల్చేసుకున్నంత బలహీనత. ఆగలేక వెల్లకిలా వెనక్కి వాలేడు. చల్లని ఇసుక తడికి ఒక్కసారి వజవజా వణికేడు. అతని లోపలి వ్యాకులత త్వరలోనే చలిని  జయించింది. రెండు రోజులుగా తిండి, నిద్రలేని అతని శరీరం అలసి సొమ్మసిల్లి పోయింది. నిద్రాదేవి కరుణించి అతని కళ్లమీదికి పాకి వచ్చింది. 

    దుఃఖంతో నిండిన ఏదో చీకటిలోకంలో విహరిస్తోంది భద్రుడి ఆత్మ. దుఃఖాన్ని భరించలేక మౌనంగా రోదిస్తోంది. 

    "బతికున్నాడంటావా?"

    "ఏమో మరి!"

    సర్రున నీటిని కోస్తున్న చప్పుడు.

    "ఎగువనించి కొట్టుకొచ్చినట్టుంది శవం. మొన్నీమద్దెనిలాగే కాదా పాపికొండల కాడ అడిపోయిన మనిసి ఈ లంకొడ్డున తేల్త"

    "ఛా, ఊరుకో. పేణం ఉన్నట్టన్పిత్తంది".

    "మరి పూటుగా తాగేసడిపోయేడంటావా ఇంత పొద్దున్నే? దగ్గరకెల్లకయ్యోయ్, పోలీసోళ్లు మనమీదెట్టేయగల్రు".

    టక్కున కళ్లు విప్పేడు భద్రుడు. తల తిప్పి చూడగానే ఎడమవైపు పదడుగుల కవతల నిక్కరు మాత్రమే వేసుకున్న బక్క పల్చని మనిషి, అతని వెనకనుంచి తొంగి తొంగి చూస్తున్న ఆడమనిషి కన్పించేరు. వాళ్ల వెనక చిన్న నాటుపడవ వొడ్డు మీదికి సగం చేర్చి ఉంది. 

    చటుక్కున లేచి కూర్చున్నాడు భద్రుడు. 

    వాళ్లలా అనుకోవడంలో పొరపాటు లేదు. నిద్రలో ఎప్పుడు కిందికి జారిపోయేడో తను, సన్నని నీటి అలలు వచ్చి తనని నడుము వరకూ్ తడిపి వెళ్తున్నాయి. 

    తెల్లవారుఝామున మసకకట్టిన దృశ్యాలన్నీ ఇప్పుడు స్పష్టంగా కన్పిస్తున్నాయి. టైం తొమ్మిదికీ పదికీ మధ్య అయి ఉంటుంది. ఎండ తీక్ష్ణతని సంతరించుకొంటోంది. అవతలి వొడ్డున పాపికొండల సందర్శనకోసం జనాల్ని నింపుకొన్న ఏడెనిమిది లాంచీల రణగొణధ్వని గాలి వాలుకి లంకలోకొస్తోంది. వెనక, ఆలయంలో రద్దీ కొంత తగ్గినట్టుంది, గుడిగంటలు ఆగి ఆగి మోగుతున్నాయి. 

    గోదావరి నీళ్లమీద ఎండ పడి కళ్లలోకి బాణాలు గుచ్చుతోంది. భరించలేక తలవాల్చుకున్నాడు భద్రుడు. ఇసుక పొరమీదుగా వచ్చి తనని తాకి వెళ్తున్న పారదర్శకమైన గోదారి నీటిని చూస్తున్నాడు. 

    నిద్రతో కొంత తేలికైన మనసులోకి గతం తాలూకు బరువులు, దుఃఖం ప్రవేశించబోతూండగా అతనొచ్చి పక్కన బొత్తన కాళ్లమీద కూర్చున్నాడు. "ఆ వొడ్డుకి దిగబెట్టమంటారేటి నా పడవలో?" అన్నాడు చొరవగా.

    ప్రశ్న అర్థం కానివాడిలా బ్లేంక్‌గా చూసేడు భద్రుడు.

    "నా పేరు సిన్నోడండి, మా యాడది లచ్మి" అన్నాడు.

    ఆమె కొంచెం ముందుకొచ్చి సిన్నోడి పక్కన ఇసుకలో చతికిల పడింది.

    "లచ్మీ పడవలోంచి గళాసట్టుకెల్లి గుడికాడ సింవాసెలం కొట్లో టీ యట్రా" అన్నాడు సిన్నోడు.

    లచ్మి వెంటనే లేచెళ్లింది.

    సిన్నోడు అనునయంగా భద్రుడి చేతిమీద చెయ్యివేసి "అలాగ పాపికొండల్దాకా వొత్తారేటి బావూ నా పడవలో? సీకటడేయేలకి వొచ్చేద్దారి" అన్నాడు.

    'పాపికొండలు! ఎక్కడ చూసినా అందరినోటా ఇదే మాట. అక్కడ గోదావరి సుడులుతిరుగుతూ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుందట. చివరగా ఆ కొండల అందాల్ని చూసేసి అక్కడే గోదార్లో దూకేస్తే... కానీ, ఈ పడవ వాడికేమివ్వాలి?...' 

    "నాదగ్గర డబ్బుల్లేవ్" అన్నాడు భద్రుడు చికాకు నిండిన గొంతుతో.
 
    భారతదేశంలోని పేదలు డబ్బు పీల్చే జలగలని సంపన్నులెందరి లాగానో అతనికీ ఒక చులకన భావం. 

    "అన్నన్నా..." అని ముక్కు మీద వేలేసుకున్నాడు సిన్నోడు. "డబ్బులడిగానా మిమ్మల్ని?" అన్నాడు. "తవరిదేవూరేటండి. సూత్తుంటే ఇటేపోరిలాగ అంపట్టం లేదు."

    భద్రుడు అతనివేపు ఆశ్చర్యంగా చూసేడు. గంటలకి విలువ కడుతూ ఇంతకాలం జీవించిన జీవితం, తను బలంగా నమ్మిన సిద్ధాంతం తనకి నేర్పినదేదో ఈ సిన్నోడి ముందు వీగిపోతోందా? కాదు కాదు, లోక్‌లో స్వార్థం తప్ప మరోటి లేదు. తన నుంచి ఏదో ఆశించే వీడు తనతో మాట్లాడుతున్నాడు - లచ్మి టీ గ్లాసు మీద అడ్డాకు ముక్కొక్కటి కప్పి పట్టుకొచ్చింది.

    "పుచ్చుకోండి బాబయ్యా.ఏడేడి టీ సుక్కలు గొంతులోకెల్తె కుంత ఓపికొత్తాది" అన్నాడు సిన్నోడు.

    ఒక్క నిమిషం తటపటాయించి గ్లాసు అందుకున్నాడు భద్రుడు. ఈలోగా సిన్నోడు, లచ్మికలిసి పడవని వొడ్డు నుంచి నీళ్లలోకి నెట్టి పట్టుకుని నిల్చున్నారు.

    "రండి బాబూ, వొచ్చి పడవెక్కండి" అన్నాడు సిన్నోడు.

    భద్రుడు మంత్రముగ్ధుడిలాగా లేచెళ్లి పడవ ఎక్కేడు. పడవ మధ్యలో ఉన్న బల్లచెక్క మీద కూర్చున్నాడు. కాళ్లకింద పరిచినట్టున్న చేప పొలుసులు చూసి పాదాలు పైకి తేల్చుకోబోయి మానేసాడు. చెప్పులెటు కొట్టుకు పోయేయో, నీటిలో నాని నాని పాదాలు వొరిసిపోయి తిమ్మిరిగా ఉన్నాయి. 

    సిన్నోడు పడవలోంచి పొడవైన గెడకర్ర తీసుకుని పడవని లోతు నీటిలోకి మళ్లించేడు. తర్వాత గెడని పడవలో పెట్టి చెరో తెడ్డూ తీసుకుని నడపడం మొదలు పెట్టేరు. నది కుడి వైపు నుంచి పడవ నెమ్మదిగా ఎగువకి ప్రయాణం సాగించింది. భద్రుడు మెడ వెనక్కి తిప్పి పట్టిసీమ ఆలయ సముదాయాల వైపు చూసేడు. వివిధ పరిమాణాల ముత్యాలు గుండ్రంగా పేర్చినట్టు ఎండలో తెల్లగా మెరుస్తున్నాయి. 

    'ఇదే చివరి చూపు' అనుకున్నాడు.

    ఎక్కడి చికాగో నగరం! ఎక్కడి పట్టిసీం! భద్రుడు.వి.మేచినేని. మేచినేని వీరభద్రుడు. ఐ.ఐ.టి.గోల్డ్ మెడలిస్ట్, ప్రముఖ అమెరికన్ కంపెనీలో కొద్ది కాలంలోనే మేధావిగా పేరొందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, హాఫ్ మిలియన్ డాలర్స్ పర్ యానమ్ సేలరీ, అందమైన అమెరికన్ భార్య, ముద్దులు మూటకట్టే కొడుకు, రాజభవనం లాంటి ఇల్లు, ఒక బి.ఎం.డబ్ల్యు, మరొక బెంజి కార్లు. జీవితమనే పరమపద సోపానపటంలో చాలా తొందరగా నిచ్చెనలెక్కి, ఒక్కసారిగా పెద్ద పాము నోట్లోకెళ్లిపోయి బయలుదేరిన చోటికి తిరిగొచ్చాడు. ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా కంపెనీల్లాగే తమ కంపెనీ మూతపడింది.

    ఉద్యోగం ఊడిపోయిన నెల తర్వాత తెలిసింది తను ఎంత లగ్జోరియస్ లైఫ్‌కి అలవాటు పడిపోయిందీ!

    'జీవితమే ఒక మహానుభూతి. దాన్ని ఒక అద్భుతమైన అనుభవంగా మలుచుకుందాం' అంటూ బ్రౌనీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దేశాన్నీ, మతాన్నీ, తనవనే అన్నిట్నీ వదిలేశాడు. ఇక్కడైతే అన్నీ పోయినా భార్యైనా మిగిలుండేది. ఆర్జన ఉంటేనే భార్య, కొడుకు; లేకుంటే ఏదీ నీదికాదు అని నిరూపించింది బ్రౌనీ. అప్పుడే తనకి జీవితం  మిథ్య అనిపించింది. చచ్చిపోవాలన్పించింది. ఆ చావేదో దేశం కాని దేశంలో ఎందుకు అనామకంగా..? నాది అనే పుట్టిన గడ్డపై కొచ్చి, తనవాళ్లు నలుగుర్నీ చూసి... ఒక్క రోజులో ఆ నిర్ణయం బలపడి, తన దగ్గర మిగిలినవేవో అమ్ముకుని ఫ్లైటెక్కి ఇక్కడికి వచ్చిపడ్డాడు.

    తీరా తన వూరికెళ్తే తను ఇన్నాళ్లుగా పట్టించుకోని తల్లి ఎప్పుడో పైలోకం చేరుకుందని తెలిసింది. అంత పెద్ద ఆస్తీ, దివాణం లోగిలీ అన్నీ అమ్మేసి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి నష్టపోయి తనలాగే దీనస్థితిలో ఉన్న అన్నగారు, లక్ష్మీదేవిలా ఉండే వదినా, చిలకల్లాంటి పిల్లలూ అంతా రెండు గదుల అద్దె ఇంట్లో పెద్దమ్మవారు ఆవహించిన దీనస్థితిలో... చూడలేక వెంటనే బస్సెక్కి రాజమండ్రిలో దిగేడు, చచ్చిపోవాలనే లోపలి కాంక్ష చావక.

    "అన్నయ్య తర్వాత పన్నెండేడ్ళ్లకి పట్టిసం వీరభద్రేశ్వరుణ్ణి దర్శించుకున్నాక నువ్వు పుట్టేవు. అందుకే నీకా పేరు పెట్టుకున్నాం" అనేది తల్లి. చివరిసారిగా గోదావరి బ్రిడ్జి మీది నుంచి ఆ ఆలయ శిఖరాన్ని చూసి గోదావరి ప్రవాహంలో దూకెయ్యాలని ఒక నిర్ణయానికొచ్చాడు. రాత్రి మనసంతా నిండిన నిర్వేదంతో బ్రిడ్జి మధ్య వరకూ నడిచి, గొప్ప ఆవేశమేదో కమ్ముకొచ్చి దూకెయ్యబోతుండగా, వెనుక రెయిలింగ్ మీద లాఠీ చప్పుడు, గార్డు కేకలు విన్పించాయి. పూర్తిగా వెనక్కి తిరిగి చూడకుండానే పరుగులాంటి నడకతో బ్రిడ్జికీవైపున కొవ్వూర్లో వచ్చిపడ్డాడు.

    అప్పుడర్థమైంది తనెంత పిరికివాడో! అక్కడినుంచి పట్టిసీమకీ, పట్టిసం లంక మీదికీ తన ప్రమేయం లేకుండానే వచ్చిపడ్డాడు. 

    "బాబూ, తవరికి పెళ్లైందా, పిల్లలా?"

    "..."

    "అయ్యే ఉంటాదిలే. ఇద్దరు పిల్లలై ఉంటారు. అవునా బాబూ"

    మొహం తిప్పుకున్న భద్రుడికి ఎడమవైపు ఇసుక తిన్నెల కవతల లోతైన నీటిలో నెమ్మదిగా ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్న లాంచీలు...

    "ఆ బాబేటో ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు. నువ్వేమో లొడలొడా ఒకటే వాగుడు" అని విసుక్కుంది లచ్మి.

    "ఓలూరుకోయే. మెల్లిగా మాటల్లో దింపి ఆ బాబుని మనుసుల్లోకి మల్లించాలని కదా నా పాట్లు. మొకం సూత్తే తెల్టం లేదా, ఏదో గొప్ప బాధలో ఉన్నాడని" అని లచ్మి చెవిలో గుసగుసలాడేడు సిన్నోడు.

    "అవునా..." అని కళ్లు రెపరెపలాడించింది లచ్మి. 

    "మాకిద్దరికీ ఈ మద్దినే పెళ్లయిందండి. సేసుకుంటే గాని వొల్లకాదని కూకున్నాడండి మా మాయ్య. సేపలు పట్టుకుని బతకమని ఈ పడవిచ్చేడనుకోండి. నేను సేసుకోపోతే ఈ నల్ల పిల్లకి మొగుడెక్కడ దొరుకుతాళ్లే అని జాలితో సేసుకున్నానండి. ఇంకా పిల్ల జెల్లా కలగలేదండి." 

    "ఓయ్ బాబో, ఏటి మరీ! నువ్వు సేలా తెల్లగా మెరిసిపోతన్నావ్, అందగాడివి. రోజూ ఏదో వొకొంకని మా ఇంటిసుట్టూ తిరుగు తున్నావని కాదేటి మాయయ్య నిన్నల్లుణ్ణి సేసుకున్నాడు."

    "మాటన నివ్వదు దొంగనా పొలస. మా గోలకేం గాని బాబూ! ఎడం పక్క కొండమీద ఆ పెద్ద కరంటు తంబం పక్కని ఉన్నదే పాండురంగడి గుడి. అక్కణ్నుంచి గోదారికీయేపు తంబంమీదికి లాగేరండి కరెంటు. గొప్ప సిత్రం కదా బాబూ!" సిన్నోడి గొంతులో సంభ్రమం. 

    ముభావంగా కూర్చున్న భద్రుడి మొహంలోకి నవ్వు రాబోయి ఆగింది. అజ్ఞానంలోనూ ఆనందమున్నట్టుంది.

    ప్రకృతి భద్రుడి చూపుల్ని పట్టి తన వేపు లాక్కోసాగింది. గోదావరి కిరివైపులా ఉన్న కొండల హరిత వర్ణం అతన్ని చూపు తిప్పుకోనివ్వడం లేదు. 

    ఏటికెదురీదుతున్న గూటి పడవ. మేటలు వేసి మెరుస్తున్న బంగారు ఇసుక. గంభీరంగా ప్రవహించి వస్తున్న గోదావరి. కొండకోనల్లోంచి వచ్చి కలుస్తున్న పిల్ల కాలువలు. 

    ఆ లౌకిక ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకున్న అనుభూతి.

    గొప్ప తాదాత్మ్యంలో మునిగిపోయాడు భద్రుడు. మనసు తేలికై మౌనంగా నర్తిస్తోంది. 

    నెమ్మదిగా నీటిని చీల్చుకుని వెళ్తున్న పడవలాగే బాధల జ్ఞాపకాల బరువుల్ని చీల్చుకుని వెళ్తోంది మనసు.

    "ఆ కుడేపు కనపడేదే పోశమ్మ గండి" అన్నాడు సిన్నోడు.

    లాంచీలన్నీ కుడివైపు మళ్లి వొడ్డుకెళ్లి ఆగుతున్నాయి. జనం బిలబిలమంటూ దిగి ఎత్తైన గట్టు పైకెక్కి పోచమ్మ గుడివైపు వెళ్తున్నారు. 

    పడవ వొడ్డుకు చేరింది. "అమ్మోరి దరిశనం సేసుకుందారి వొత్తారా బాబూ" అన్నాడు సిన్నోడు. దుకా ణాల పాకల వెనకనుంచి ఆలయ శిఖరం మీది కలశం, కొమ్ములు మెరుస్తున్నాయి.

    భద్రుడు కదలకపోవడం చూసి తెడ్లు పడవలో పడేసి, గెడ నీటి అడుగుకు గుచ్చి లచ్మికి అందించి, వొడ్డుకి దూకి గుడివేపు పరుగెత్తేడు సిన్నోడు. లచ్మి గెడను చంకలో ఇరికించుకుని, చెంపలేసుకుని, చేతులు జోడించి కళ్లు మూసుకుంది. 

    భద్రుడు మొదటిసారి ఆమె వైపు పరిశీలనగా చూసేడు. ఏమాత్రం ఆకర్షణ లేని సాదాసీదా ఆడమనిషి. వొత్తైన జుట్టుని నెత్తిపైన శిగలా చుట్టి ప్లాస్టిక్ క్లిప్పేదో పెట్టింది. శిగలో ఓ పక్కన నిర్లక్ష్యంగా తురిమిన పేరు తెలియని పసుపురంగు పువ్వు. సిగకు అందని ముంగుర్లు చెవులమీదా, ముఖం మీదా పారాడుతున్నాయి. సాదా చీర, తెడ్డు వేయడం వలన చెమటకు తడిసిన ఎర్రని జాకెట్టు. ఆమె ముఖం నవ్వుతో వికసించడం చూసి అటు చూసేడు. గట్టు మీంచి పరుగెత్తుకొస్తున్నాడు సిన్నోడు.

    పడవెక్కినప్పట్నుంచి చూస్తున్నాడు - వాళ్లిద్దరి మధ్యా నవ్వులు, గుసగుసలు, కువకువలు, దొంగచూపులు, దోర స్పర్శలు. వైవాహిక జీవితంలోని ఇలాంటి ఆనందం ఎప్పుడైనా తనకి అనుభవంలోకొచ్చిందా? ఏం బతుకు అది? రోజులో ఏ రెండు గంటలో నిద్రకు కేటాయించుకుని కంప్యూటర్‌కి, సంపాదన పెంచుకునే వ్యాపకాలకీ అతుక్కు పోయిన జీవితాలకి ఈ ఆనందం, ఈ ప్రేమ ఎలా అనుభూతికొస్తుంది?

    సిన్నోడు కొబ్బరిచెక్కని పడవ అంచుమీద చితక్కొట్టి ఒక ముక్కని భద్రుడికి అందించేడు. మరో ముక్కని లచ్మి నోటి కందించి, పొట్లంలో తెచ్చిన కుంకుమ బొట్టుపెట్టేడు. చెంపలేసుకుని గుడివేపు చూస్తూ "గండిపోశమ్మ తల్లే, అందర్నీ సల్లగా సూడు తల్లే" అని ఒక కేక పెట్టేడు.

    తెడ్డు చేతిలోకి తీసుకుంటున్న లచ్మి సిన్నోడి వీపుమీద ఒక్కటి చరిచి కొంటెగా నవ్వింది. 

    సిన్నోడు వీపు తడుముకుంటూ "ఏటే, పెద్ద మణిసి పడవలో ఉండగా మోటుసరసాలు!" అని కోప్పడుతూ నవ్వేడు. "బావా" అని కేక వినబడి వొడ్డుకేసి చూసేడు.

    సింతాలు చంకల్లో కర్రల్తో కుంటుకుంటూ వచ్చేడు. చెయ్యి చాపి నిల్చున్నాడు. నిక్కరు జేబులోంచి రూపాయి బిళ్ల తీసి వాడి చేతిలో వేసేడు సిన్నోడు.

    "బావా! అట్నుంచొచ్చీటప్పుడు సిన్నసేపలేవన్న దొరికితే ఒక గుప్పుడు ఇక్కడేసిపోవా, పులుసు తినాలనుంది" అన్నాడు సింతాలు.

    "సర్లే, ఎవరి సేతైనా నేనంపిత్తాన్లే.సలిలో నువ్విక్కడే కూకునుండకు, పొద్దోతాది మేవొచ్చేతలికి"

    కృతజ్ఞతగా చూస్తూ నవ్వేడు సింతాలు. 

    "ఈడి కతేటో తెలుసా బాబూ" అంటూ మొదలు పెట్టేడు సిన్నోడు -

    "పోలారం ఆనకట్ట గురించి అనుకుంటన్న తొలిరోజుల్లోనే కొన్ని గూడేలోళ్లకి ఇళ్లకీ, బూవులకీ ఇంతా అని లెక్కకట్టి డబ్బులిచ్చేసేరు గవుర్మెంటోళ్లు. ఈ సింతాలు గాడికి లచ్చా పాతికేలు వొచ్చేయి. ఈడు పుట్టేక అన్ని డబ్బులెప్పుడైనా కళ్లసూసున్నాడా?! అందుకే డబ్బులేం సేసుకోవాలో ఈడికర్దం అవలేదు. ముందు ఒక మోట్రుసైకిలు పెద్దది కొనేసేడు. ఈ ఎదవకి నడపడం వొచ్చంటలెండి. సేలా స్పీడు నడిపీవోడు. ఇంక వో... సూసుకోండి జెల్సా... ఈడికీ, పెళ్లానికీ, పిల్లలకీ రంగురంగుల గుడ్డలు, ఈడికి వసీ, ఉంగరం. రోజూ బండేసుకుని రాజిమంద్రం పోటం, వోటేల్లో పులావులూ గట్టా తింటం, కరీదైన బ్రేందీ కాయలు కడుపు నిండా పుల్లుగా పట్టించటం, సినిమాలు సూట్టం. ఒకరోజలాగొత్తావొతా లారీని గుద్దేసేడు. పెళ్లాం పిల్లలక్కడే ప్రేణాలొదిలేసేరు. ఈ నాకొడుకు సావుతప్పి కన్నులొట్టోయి ప్రేణాల్తో మిగిలేడు, అదిగో అలాగ రెండు కాళ్లూ సకం సకం పోగొట్టుకుని. అప్పుడికే డబ్బులు కడకొచ్చేసేయి. మిగిలిండబ్బులు ఆస్పటలు కర్సుల కిందెల్లిపోయేయి. అప్పుణ్నించి ఇదిగో ఇలాగ గండిపోశమ్మ గుడి కాడ అడుక్కుతింటా బతుకు బండిని లాక్కొత్తన్నాడు"

    సింతాలు అతి కష్టం మీద ముందుకి కదులుతున్నాడు. అతనితో పోలిస్తే తన కష్టం ఏపాటిది? ఒక జీవన సత్యమేదో మెరుపులా లోపలికి ప్రవేశించి భద్రుడి విషాదాన్ని కోస్తోంది.

    ఎండ నడినెత్తికొచ్చింది. చెమటలు కక్కుతూ త్వరత్వరగా తెడ్లేస్తున్నారు సిన్నోడు, లచ్మి.

    "బాబూ, మీరా గూట్లోకెల్లి కూకోండి, ఎండ బరించలేరు"

    వాళ్లిద్దరూ అంత కష్టపడుతూంటే తను హాయిగా కూర్చున్నాడనే స్పృహకలిగి భద్రుడికి సిగ్గనిపించింది. మొదటిసారి మనసువిప్పి "లక్ష్మిని వెళ్లి కూచోమను, నేను తెడ్డు వేస్తా" అన్నాడు.

    ఏం విన్నారో మొదట అర్థం కాక, అర్థమయ్యేక ఫక్కున నవ్వేరిద్దరూ. 

    "ఈ పని మీవల్లవుద్దేటండి, అవ్వదండి" అన్నాడు సిన్నోడు. 

    పడవ  దేవీపట్నం  చేరుకుంది. గట్టుపైన దూరంగా కన్పిస్తున్న పాత చిన్న పెంకుల లోగిలిని చూపించి "ఆ కాలంలో అల్లూళ్రి సీతారామరాజుగారు పితూరీ సేసిన దేవీపట్నం పోలీస్టేసను అదేనండి" అన్నాడు సిన్నోడు. అతని మొహంలో ఒక అద్వితీయమైన పులకింత.

    'అప్పటికీ సిన్నోడి తండ్రి కూడా పుట్టివుండడు. కాని, విదేశీయులకి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజు శౌర్యాన్ని తల్చుకుని ఇప్పటి సిన్నోడు పులకించిపోతున్నాడు. ఇదేనా దేశం మీది ప్రేమ అంటే' అనుకున్నాడు భద్రుడు.

    నదికి ఎడమవైపు ఇసుక తిన్నెల వొడ్డున లాంచీలు ఒకటొకటిగా వెళ్లి ఆగుతున్నాయి. ఇటు దేవీపట్నం వైపు పది పన్నెండు పడవలు ఉన్నాయి. ఉన్నట్టుండి వూళ్లోంచి పెద్దపెద్ద డ్రమ్ముల్తో, కేనుల్తో అన్నం, కూరలు లాంటి వంటకాలు మోసుకొచ్చి పడవల్లోకి ఎక్కిస్తున్నారు కొందరు. పడవలు నదికి అడ్డంగా అవతలి వొడ్డుకెళ్లి లాంచీలకు ఈ ఆహార పదార్థాలని అందించి వస్తున్నాయి.

    భద్రుడిని వొడ్డున దింపేసి సిన్నోడు ఒకసారి అందించి వచ్చేడు. రెండోసారి అతన్ని పడవలో ఎక్కించుకుని తీసుకెళ్తూ కొంత దూరంలో వొడ్డుకి దగ్గరగా అక్కడక్కడ నీటిపై తేలుతున్న ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ చూపించాడు. "ఆ కనిపించీ సీసాల అడుగుని మా వలలున్నాయండి. ఆ పక్కనించి ఈ లాంచీలన్నీ ఎల్లిపోయేక పడవలోళ్లందరం వలలెత్తి, సేపల్ని పడవలో ఏసుకుని, మల్లీ వలలు పన్నేసి, రాజమంద్ర కేసి ఎల్లిపోతావండి. సందేళ బజారుకి సేపలందించాల్. తవరి గురించి లాంచీవోళ్లతో మాటాడేనండి. తవరికి బోయనం ఆళ్లే ఎడతారు. ఈ లాంచీలన్నీ ఆ దూరంగా కనపడతన్నాయి పాపికొండలు - దూరపు కొండలు నునుపులెండి - ఆట్ని దాటుకుని ముందుకి పేరంటాలపల్లి దాకా ఎల్లి రేత్రికి ఎనక్కొచ్చేత్తాయండి" అన్నాడు. కొంత ఆగి "బాబూ, ఈ పడవని సూత్తన్నారా, ఉప్పుడుదాక కస్టంగా ఏటికెదురీదుకొచ్చిందండి. ఉప్పుడు ఏటినికోసుకుని అడ్డంగా ఎల్తందండి. ఎల్లీటప్పుడు ఏటివాలుకి జయ్యిమని నల్లేరు మీద నడకలాగెలిపోద్దండి. పడవకైనా మనిసికైనా ఎప్పుణ్ణడక అప్పుడిదేనండి. ఎత్తైన పాపికొండల్నీ, అక్కడ లోతైన గోదారమ్మనీ సూసేక మనవెంత సిన్నోళ్లవో మనకర్దవౌతాదండి. తవరు తప్పకుండా అక్కడిదాకా ఎల్లి ఎనక్కిరావాలండి. మీగురించి నాకు తెల్దుగానండి, ఒక్క ముక్క సెప్తానండి. మీకు సెప్పేటంతోణ్ణి కాననుకోండి, మీరేదో కస్టంలో ఉన్నారని మాత్రం నా కర్దవైందండి. కస్టాలు మనుసులికి కాక మానులకొత్తాయా అనీవోడండి మాయయ్య. ఆడు అంతరవేది కాడ సేపలు పట్టీవోడండి. 'వోరి సిన్నోడా! ఇంత పెద్ద సంద్రంలో మనిసి ఒక్క నీటిబొట్టుకన్నా తక్కువేరా. ఒకేల పడవ ములిగిపోతే మనవూ ములిగిపోకూడదు. మనకి సేతనైనంత వరకూ ఈదాల.పేణం కాపాడుకోవాల. ఉంకో పడవ సంపాదించుకోవాల' అనీవోడు"

    సిన్నోడి కళ్లల్లోని మెరుపుని చూస్తున్నాడు భద్రుడు.

    తన హృదయంలోని బరువుని సిన్నోడు చేతితో తీసేసినట్టన్పించింది. ఆవేశంలోనైనా చావడం, చంపడం పరిష్కారం కాదని అర్థమైంది. 

    లాంచీ ఎక్కడానికి బల్లకట్టుమీద ఒక అడుగువేసినవాడు హఠాత్తుగా వెనక్కి తిరిగి సిన్నోణ్ని కౌగిలించుకున్నాడు భద్రుడు. సిన్నోడు ఆనందంగా కలిపి వదిలిన చేతిని చూసుకుంటే కొన్ని నలిగిన నోట్లూ, చిల్లరా ఉన్నయి. కంగారుగా పట్టుకోబోతే అప్పటికే సిన్నోడు పడవదగ్గరికి ఈదుతున్నాడు. 

    నాలుగు బారలు అవతలికి పడవను పోనిచ్చిన లచ్మి వాణ్ణి చూస్తూ ముత్యాలొలకపోసినట్టు నవ్వుతోంది.


                                  (నవ్య వీక్లీ జనవరి 06, 2010 సంచికలో ప్రచురితం)         
       
Comments