కాలం కలిసిరాందే - ఆవంత్స సోమసుందర్

  
    చిత్రాంగిలో యంబ్రహ్మ... గారి వెకిలి కథ చదువుతూ నాలో నేనే నవ్వుకుంటున్నా. ఆ నవ్వుకు కారణం నా ముందూ వెనకా కూర్చున్న హిందీవాళ్లూహించుకోలేక పోతున్నారు.

    కూర్చున్న మూడోక్లాసు బండి కాండ్రకోట తీర్థంలా వుంది. 

    కథగూడా పూర్తిగావస్తోంది. "అనాది వాణ్ణమ్మా! అంధుణ్ణి తల్లీ!" అంటూ మధ్య మధ్య ఆర్తనాదాల్ని మా మొహన్ని విసరేస్తూ, "కల్ల నిజమౌతాది - నిజము కల్లౌతాది - బ్రహ్మమూ!" అంటూ పాడేసుకుంటున్నాడు, మా పెట్టెలోకెక్కిన గుడ్డాడు.

    దాంతో నా నరాల్లో, నిబిడీభూతమైన ఫిలాసఫీ దొంతర్లు నా ఆజ్ఞలేకుండానే పైకి ఉబికి వచ్చేస్తున్నై. 

    కథ పూర్తయింది. కళ్లెత్తేను. జనం గేట్లను కుమ్ముకొని నుంచున్నారు. పురాణాలు - హరికథలూ- సంసారాలూ - కరువులు - యుద్ధం - ఒకటేమిటి మా పెట్టి అంతా ఒక సంసారమై పోయింది. సియురా అన్నట్టు "ఈ ప్రయాణం ఒక సంస్థ". ఇద్దరు తెలుగువాళ్లు గుప్తాగారి మరణానికి వాపోతున్నారు. 

    నా వూహలు తాళ్లు తెంచుకు పరుగెత్తుత్తున్నై గిత్తదూడల్లా.

    నా చూపుల్లో యేదో అన్వేషణ వుందని అనుమానించాడు గాబోలు రెప్పవాల్చక చూస్తున్నాడు వంకీమీసాల హిందీసోదరుడు.

    సాధారణంగా రైలులో అవలంబించే మౌనం నా స్వాధీనంలోనేవుంది.

    నా పత్రికా పఠనానికంతరాయం కోరుతున్న నా తెలుగుసోదరుడు నేను బుఱ్ఱ యెత్తడం తోటే చిత్రాంగి పుచ్చుకున్నాడు. 

    స్త్రీలుగూడా యెంతోమంది వుంటంచేత కోమలకంఠాల కోలాహలంగూడా రేగింది. స్వస్థిక్‌లోలకులు చెమక్‌గా కదులుతున్నై. వాటి మెరుపులు పలుచని, తెల్లని స్నిగ్ధకపోలాలమీద వెలుగుతున్నాయి. ఆ సుందరాంగి ముంగురులు వినిపించని సందేశాలు గాలిలోకి వదులుతున్నై. 

    కలం చేతిలోవున్న యీ కంటి అద్దాల కథా నాయకుణ్ణెంత సేపటి నుంచి చూస్తుందో ఆమె పలుచని బుగ్గలకేసి జాలిగా చూచిందాకా నాకు తెలీనేలేదు. 

    చేతిలోవున్న పిల్లాడు పడమటి యెండకేసి చూస్తో యేదో చెపుతున్నాడు. ఆమెగూడా అబ్బాయి సౌందర్యోపాసన కానందిస్తూ నేను చూస్తాననిగాబోలు గట్టిగా ముద్దెట్టుకుంటూ నాకేసి ఒక వి టు(V2) చూపు విసిరింది.

    కాస్తోకూస్తో శృంగారశాస్త్రం తెలుసున్నవాణ్ణి గనుక ఆమె హావభావాన్ని వెంటనే గ్రహించేను.

    వంకర తిరిగిన ఆమె పాయింటెడ్ ముక్కూ, పలుచని బంగారు రేకులాంటి ఆమె వపుఃసౌందర్యం నాదో యేదో స్ఫూర్తిని లేవగొడుతున్నై.

    బొండపల్లి అనే చిన్న స్టేషనులో రైలు రెస్టు కోరింది. ఆమె కుంకంలో అణగివున్న చంకీ పడమటికాంతికి మెరిసింది.

    సన్నని ఆమె అధరం - నవ్వితే తెల్లని పళ్ళమీద సగందాకానే తెర తొలిగించినట్టు పైనా తెర - తల్చుకుంటే యెప్పుడో పరిచయం వుందె అన్నట్టు తోస్తోంది.

    "మహత్కార్యాలకి - అవాంతరాలెక్కువ" అన్న బాపూజీ వాక్యాన్ని రైలుకంటే వేగంగా నడచే నా కలం గభీలున ఆగిపోయి 'సిరా లేందే?' అంటూ పళ్ళికిలించి రూఢి పఱచింది. 

    నాలోని యేదో శక్తి నన్ను చూచి నవ్వింది - నిస్సహాయంగా తలొంచి. 

    "అయినా ధీరులు ముందుకే పోతారు" అనే ఫులుస్టాపులు పూర్తిచెయ్యకుండానే నా కలం, మధ్యలో పోర్షను మఱచిన డ్రామా యేక్టరుకు మల్లె దిక్కులు చూస్తూ నిలబడి పోయింది. 

    "16 గురు కూర్చుండుటకు" అనే రైలు పెట్టెమీది వాక్యం కిటకిటలాడుతున్న మా జనభాని, కట్టు కఱ్ఱనున్న గేదె దూరంగా వున్న గడ్డిని చూసే మొఖంపెట్టి చూస్తోంది. 

    కథ పూర్తికావడానికి కలం కలిసిరాందే?  

(చిత్రాంగి జూలై 1945 సంచికలో ప్రచురితం)   
Comments